Tuesday, June 20, 2023

The show is over....


.
ఆటముగిసింది, తెరపడింది
హాలంతా నిశ్శబ్దం మంచులా పరుచుకొంది
అంతవరకూ కాంతులతో, ఉద్వేగాలతో
సజీవంగా నిలిచిన రంగస్థలం
కొద్దికొద్దిగా చీకటిలోకి కూలిపోతుంది
చప్పట్లు ఆగిపోతాయి, గొంతులు మూగబోతాయి
నటులు భారమైన హృదయాలతో తమ తమ
పాత్రలనుండి బయటకు వచ్చేసి
సిగరెట్లు కాల్చుకొంటూ, కాఫీలు తాగుతూ
మెచ్చుకోళ్ళగురించి, పొరపాట్లగురించి
చర్చించుకొంటూ ఉంటారు

పాత్రలు మాత్రం నిశ్శబ్దంగా
ప్రేక్షకుల హృదయాలలోకి ఇంకిపోతాయి
జ్జాపకాలలో కరిగిపోతాయి

ఖాళీ సీట్లు, రంగస్థల దుస్తులు, నాటక సామాగ్రి
యుద్ధానంతరం విస్మరించబడే యోధునిలా
అలా ఏదో మూల సర్దుకొంటాయి.

రంగస్థలంపై ఆటముగిసినా
జీవితం కొనసాగుతూనే ఉంటుంది
అవిచ్ఛిన్నంగా సాగే కథలు
పదే పదే పుట్టే కొత్త పాత్రలతో
మరిన్ని రంగులతో, మరిన్ని ఉద్వేగాలతో
అలరించే కొత్త ఆటకొరకు
రంగస్థలం ఎదురుచూస్తూంటుంది

The show must go on....

బొల్లోజు బాబా

డిజిటల్ పరమాత్మ


వెలుతురు తెరలపై
పిక్సెల్ నీడల డిజిటల్ సింఫొనీ
స్వప్నాలు, హృదయాలు, వాంఛలు
అమ్మకాలు కొనుగోళ్ళు నవ్వులు కన్నీళ్ళు
బైట్లు బైట్లుగా ప్రవహించే ఉద్వేగాలు
అన్నీ బైనరీ భాషలోనే
వెలుతురు తెర మర్రినీడలో
ఒంటరితనం వేళ్ళుపాదుకొని
మహావృక్షంలా ఎదుగుతుంది
కొత్తపరిచయాలతో ముంచెత్తే కనెక్టివిటీ
వాస్తవలోకపు ఒక్క స్నేహాన్నీ మిగల్చదు

ఈ సిలికాన్ చిప్పుల మైదానంలో
కర్ణపేయంగా
వినిపించే డిజిటల్ సింఫొనీ ఇది
ఆత్మలను వెలుతురు తెరతో మిళితం చేసే
మానవజాతి ఎత్తుకొన్న కొత్తరాగమిది.

మనిషి యంత్రంగా మారటం వింతకాదిపుడు
యంత్రం మనిషిగామారటం వింత

బొల్లోజు బాబా

Saturday, June 3, 2023

ప్రాచీనసాహిత్యంలో ఋతువర్ణనలు-ఇ.బుక్


ఆరు ఋతువులకు కలిపి మొత్తం 120 గాథలు. (గాథ అంటే రమ్యమైన చిన్న సంఘటన అని శ్రీ గట్టి లక్ష్మి నరసింహశాస్త్రి గారి నిర్వచనం. ఆ అర్ధంలో వీటిని గాథలు అంటున్నాను). వివిధ వర్ణనలను గ్రహించిన కావ్యాల వివరాలు ఇవి.

1. గాథాసప్తశతి: శాతవాహన హాల చక్రవర్తి ఒకటవ శతాబ్దంలో సేకరించి సంకలన పరిచిన ఏడువందల గాథల గ్రంధం. ఇది ప్రాకృత భాషలో రచింపబడింది.

2. ఋతుసంహారం: 4 వ శతాబ్దపు కాళిదాసు రచన

3. శార్ఞ్గధర పద్ధతి: Sarngadharapaddhati: ఇది సుభాషిత రత్నావళి లాంటిది. దీనిని Sharngadhara కవి 1363 CE లో సంకలన పరిచాడు. దీనిలో మొత్తం 14 విభాగాలుగా 1300 సుభాషితాలు ఉన్నాయి.

4. వజ్జలగ్గ: ఇది గాథాసప్తశతి లానే అందమైన ప్రాకృత గాథల సమాహారం. ఈ సంకలనంలోని గాథలు CE 750-1337 మధ్య కాలానికి చెందినవి. జైన పండితుడైన జయవల్లభుడు ఈ గాథలను సేకరించాడు అందుకే వజ్జలగ్గకు జయవల్లభమనే పేరు కూడా ఉంది. జయవల్లభుడు మొదటగా 700 గాథలను సేకరించి వాటిని 48 విభాగాలుగా వర్గీకరించి వజ్జలగ్గగా కూర్చాడు.

5. Ainkurunuru: ఇది 500 గాథలు కలిగిన CE 2/3 శతాబ్దపు తమిళ సంగం సాహిత్యం. ప్రాచీనతమిళ సమాజాన్ని, సంస్కృతిని అర్ధం చేసుకొనటానికి Ainkurunuru ఎంతో దోహదపడుతుంది.

6. Kuruntokai: ఇది BCE 1 వ శతాబ్దం నుండి CE 2 వ శతాబ్దం మధ్యలో సంకలనం చేయబడిన గ్రంధం. ప్రాచీన తమిళ సంగం సాహిత్యంలో ప్రముఖంగా చెప్పబడే ఎనిమిది సంకలనాలలో ఇది కూడా ఒకటి. (అవి Aiṅkurunūṟu Akanāṉūṟu, Puṟanāṉūṟu, Kalittokai, Kuṟuntokai Natṟiṇai, Paripāṭal, Patiṟṟuppattu.) కురుంతోకై లోని మొత్తం 402 పద్యాలను 205 మంది కవులు రచించారు.

7. తిరుక్కురళ్: ఇది 3 BCE నుండి 5 CE మధ్యలో రచింపబడిన తమిళ కావ్యం. దీనిని రచించింది తిరువళ్ళువర్ కవి. తిరుక్కురళ్ లో మొత్తం రెండు పాదాలు కలిగిన 1330 కురళులు (ద్విపదలు) ఉంటాయి. ఇవి సూక్తులుగా, , బోధనలుగా, కవితా వాక్యాలుగా సమస్తమానవాళికి నేటికీ స్పూర్తినిస్తున్నాయి.

8. Purananuru: ఇది నాలుగువందల పద్యాలుండే తమిళ సంగం సాహిత్యం. దీనిని మొత్తం 157 మంది కవులు రచించారు. వారిలో పదిమంది స్త్రీలు కలరు. Purananuru BCE 2 వ శతాబ్దం నుండి CE 5 వ శతాబ్దం మధ్యలో సంకలనం చేయబడిందని చరిత్రకారుల అభిప్రాయం. ఆర్యుల ప్రభావానికి ముందరి తమిళ సమాజపు రాజకీయచరిత్రను పురానానూరు స్పష్టపరుస్తుంది.

10. లీలావాయి: ఎనిమిదో శతాబ్దానికి చెందిన కుతూహలుడు అనే ప్రాకృత కవి, హాలుని ప్రధానపాత్రగా తీసుకొని వ్రాసిన కావ్యం పేరు లీలావతి (లీలావాయ్).

11. శృంగార ప్రకాశ: 11 వ శతాబ్దంలో భోజరాజు రచించినట్లు చెప్పబడే అలంకార శాస్త్రానికి చెందిన గ్రంథం.

12. Subhashita ratnakosa of Vidyakara: CE 1130 లలో విద్యాకరుడనే బౌద్ధ పండితుడు సంకలన పరిచిన సంస్కృత సుభాషిత కోశము. దీనిలో మొత్తం 1738 శ్లోకాలు కలవు. ఇవి ఆనాటి భారతదేశ గ్రామీణ సమాజాన్ని ప్రతిబింబించటం విశేషం.

****
Circle of Six seasons by Martha Ann selby పుస్తకం చూసి భలే ఉందే ఇలా తెలుగులో ఎందుకు రాయకూడదు అనే ఆలోచన కలిగింది. ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని శోధించటం నాకు సరదా. కానీ వెళ్ళేకొద్దీ సామాన్యజీవితాలను ప్రతిబింబించే వర్ణనలు దొరకటం కష్టంగా మారింది. ఉత్త శృంగార/ప్రకృతి వర్ణనలు కాకుండా ఒకప్పటి గ్రామీణ మానవోద్వేగాలను ప్రతిబింబించే గాథలకొరకు అన్వేషించాను. అవి ఎక్కువగా నాకు గాథాసప్తశతి, విద్యాకరుని సుభాషితరత్నావళి, తమిళ సంగం సాహిత్యంలో కనిపించాయి. (ఇవి బౌద్ధ జైన రచనలు కావటం ఆశ్ఛర్యం కలిగించలేదు)

ఈ వ్యాసాలను నా ఫేస్ బుక్ వాల్ పై ఆరు భాగాలుగా ఏప్రిల్ 2023 నెలలో పోస్ట్ చేసాను. అవన్నీ ఒకచోట ఉండాలనే తలంపుతో ఈ ఇ.బుక్ గా చేస్తున్నాను.

మీకు నచ్చుతాయని ఆశిస్తాను.
భవదీయుడు
బొల్లోజు బాబా



Friday, June 2, 2023

అభినందనలు

కోట్లాదిమంది చూస్తుండగా
ఓ భార్య భర్తకు పాదనమస్కారం చేసింది
సంస్కృతి పరిరక్షణ జరిగిందని
జయజయ ధ్వానాలు మిన్నంటాయి

పాదాలు పక్కపక్కన
కలిసి నడవటానికి తప్ప
ఎక్కువ తక్కువ
ప్రదర్శించుకోవటానికి కాదన్న తెలివిడిని
క్రమక్రమంగా చేజార్చుకొంటున్న
జాతికి  అభినందనలు

బొల్లోజు బాబా

Wednesday, May 31, 2023

యానాం శంకోలు కథ




.
యానాం చరిత్రలో శంకోలు/శంగోలు (రాజదండం) ఒకప్పుడు చాలా వివాదాస్పద సామాజిక పాత్ర పోషించింది.
తూర్పుగోదావరి జిల్లాలో వైశ్య సామాజిక వర్గానికి చెంది జమిందారులుగా పేరుగాంచిన కుటుంబం మన్యం వారిది. కాకినాడకు చెందిన మన్యం కనకయ్య 1790 లలో పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసి చాలా సంపదలు గడించాడు. ఈయన 1827 లో పోలవరం ఎస్టేట్ వేలానికి వచ్చినప్పుడు దానిలో కొంతభాగమైన గూటాల అనే ప్రాంతాన్ని 2,30,000 రూపాయిలకు రాజా అప్పారావు వద్దనుండి కొన్నాడు. ఆ విధంగా మన్యం కుటుంబానికి గూటాల జమిందారీ లభించింది.
జమిందారీ చిహ్నాలైన ఢంకా, నగరా మరియు వెండి శంకోలులను ఉపయోగించుకోవటానికి బ్రిటిష్ ప్రభుత్వం మన్యం కనకయ్యకు అనుమతినిచ్చింది. దీనిద్వారా వెండి శంకోలు కలిగి ఉండి రెండు కాగడాలతో పల్లకిలో తిరగే అర్హత పొందాడు.
ఈ మన్యం కనకయ్య ఫ్రెంచి యానాంలో కూడా పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసేవాడు. యానాంలో కూడా తనకు పై సదుపాయాలకు అనుమతినిప్పించమని అప్పటి ఫ్రెంచి యానాం పెద్దొర Delarche ను కోరాడు.
18, ఆగస్టు 1828 న Delarche మన్యం జమిందారుకు వెండి శంకోలు ధరించటం, రెండు కాగడాలతో పల్లకి ప్రయాణం సదుపాయాలను కల్పించాడు. అంతే కాక ఆ సదుపాయాలను కల్పిస్తున్నట్లు 9 మంది ఫ్రెంచి దేశస్థుల సంతకాలతో కూడిన ఆ అనుమతి పత్రాన్ని పాండిచేరీలో ఉండే ఫ్రెంచి గవర్నరుకు ఆమోదం కొరకు పంపించాడు కూడా.
ఆ విధంగా మన్యం జమిందారుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించటం పట్ల యానాం సమాజం భగ్గుమంది. డబ్బులు వెదజల్లి అలాంటి హోదాను పొంది, సామాన్య ప్రజలను మన్యం జమిందారు భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని అంతేకాక హిందూ వర్ణ వ్యవస్థ ధర్మాలను బట్టి కనకయ్య వర్ణానికి అలాంటి సదుపాయాలు లేవని; అట్టి అనుమతులను నిరసిస్తూ 31 ఆగస్టున తొంభైమంది యానాం ప్రముఖుల సంతకాలతో కూడిన ఒక పిర్యాదు పాండిచేరీ గవర్నరుకు పంపబడింది.
కనకయ్యకు వ్యతిరేకంగా ఇంటింటికీ తిరుగుతూ మరో పిర్యాదుపై సంతకాలు తీసుకొంటున్న ఇద్దరు యానాం ప్రముఖులను 7 సెప్టెంబరున Delarche అరెస్టు చేయించాడు. దీనితో అంతవరకూ నివురుకప్పిన నిప్పులా ఉన్న్ ఆగ్రహజ్వాలలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వందల సంఖ్యలో జనం చేతకర్రలు ధరించి Delarche ఇంటి తలుపులు బద్దలు కొట్టి దాడికి పాల్పడ్డారు.
Delarche భారతీయ వనితను వివాహం చేసుకొన్నప్పటికీ ఆనాటి ప్రజలలో పాతుకుపోయి ఉన్న వర్ణ వ్యవస్థ స్వరూపాన్ని అర్ధం చేసుకోవటంలో విఫలం అయ్యాడనే అనుకోవాలి.
సెప్టెంబరు 18 న గవర్నరు కోర్డియర్, Delarche కు రాసిన ఒక లేఖలో అల్లర్లకు కారణమైన వారిని రహస్యంగా అరెస్టు చేయించి పాండిచేరీ పంపమని ఆదేశించాడు. ఈ లోపున కనకయ్యకు శంకోలు, పల్లకి సదుపాయం కల్పించవలసిందని యానాం నుంచి 132 మంది సంతకాలు చేసిన రెండు వినతిపత్రాలు గవర్నరుకు పంపటం జరిగింది. వీరంతా జమిందారు వద్ద పనిచేసే ఉద్యోగులు, జమిందారు బంధువులు.
పై వినతిపత్రాలను అందుకొన్న గవర్నరు యానాంలోని పరిస్థితి తీవ్రతపై అనుమానం వచ్చి Delarche ను సంయమనం పాటించమని ఆదేశించేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అల్లర్లకు కారణమైన వారిని రహస్యంగా అరెస్టు చేయమన్న గవర్నరు గారి ఆదేశాల మేరకు Delarche 18 అక్టోబరున ఆపనికి శ్రీకారం చుట్టి ఆ మొత్తం ఉదంతాన్ని నడిపిస్తున్న కొంతమందిని అరెస్టు చేయించాడు. దీనితో నిరసన జ్వాలలు మరింత ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఈ సారి ప్రతిఘటన చాలా బలంగా వచ్చింది. సుమారు రెండువేలమంది ఆందోళన కారులు కర్రలు, ఇతర ఆయుధాలు ధరించి ప్రతిదాడులకు సిద్దమయ్యారు. ఈ సందర్భంలో పరిస్థితులను అదుపులో ఉంచటానికి ఫ్రెంచి అధికారులు సమీప బ్రిటిష్ పోలీసుల సహాయం తీసుకోవలసి వచ్చింది.
పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఫ్రెంచి గవర్నరు, Delarche ను తొలగించి యానాంలో ఇదివరకే పనిచేసి అవగాహన ఉన్న లెస్పార్డాను పంపించింది. లెస్పార్డా ఎంతో చాకచక్యంగా పరిస్థితిని చక్కదిద్ది, నిందితులందరికీ గవర్నరునుండి క్షమాభిక్ష కూడా ఇప్పించటంతో మొత్తం అల్లర్లకు తెరపడింది.
***
ఈ మొత్తం ఉదంతంలో ఒక వర్ణానికి చెందిన వ్యక్తి వెండి శంకోలు ధరించటమనే అంశం కేంద్రంగా ఉంది. ఆ వర్ణానికి శంకోలు ధరించే అర్హత లేదన్న పాయింటు మీద తీవ్రమైన ఉద్యమం నడవటం గమనార్హం.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా కలిగి ఉన్నామని చెప్పుకొనే ఫ్రెంచి ప్రభుత్వం కూడా ఒకానొక దశలో ఈ ప్రతిఘటనకు చేతులెత్తేయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రస్తుత "సందర్భానికి" "Those who cannot remember the past are condemned to repeat it” - George Santayana కొటేషనును గుర్తుచేసుకోవటం అసందర్భం కాదనుకొంటాను.
పి.ఎస్.
నేడు కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా అధికారమార్పిడికి మీ దేశ ఆచారాలు ఏమిటి అని మౌంటుబాటన్ నెహ్రూని అడగగా, నెహ్రూ రాజాజీ ని అడిగినట్లు రాజాజీ ఈ శంకోలును చేయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. చెబుతున్నారు అంతే. ఆనాడు నెహ్రూ కి వచ్చిన వందలాది బహుమతుల్లో ఇదొకటి.
అధికారమార్పిడికి ఇదొక సింబాలిక్ గెస్చర్ గా భావించినట్లు అఫిషియల్ రికార్డు లేదు. అంటే మౌంటుబాటను నుండి నెహ్రూ ఈ సెంగోలును స్వీకరిస్తున్న ఫొటో కానీ, ఉటంకింపులు కానీ లేవు. లేనిదాన్ని ఇలా ప్రచారించటం రాజకీయం.
అయినప్పటికీ, భారతదేశపు చారిత్రిక మలుపులో మన రాష్ట్రం నుంచి (అప్పటికి మనం తమిళనాడులోనే ఉన్నాం, హైదరాబాద్ తో కాదు) మన సంస్కృతికి చెందిన ఒక చిహ్నాన్ని బహుమతిగా నెహ్రూకి అందించినందుకు నేను గర్వపడతాను.
.
బొల్లోజు బాబా
"ఫ్రెంచిపాలనలో యానాం-బొల్లోజు బాబా" పుస్తకం నుంచి.
డౌన్ లోడ్ చేసుకొనే లింక్ కామెంటులో కలదు.


బిక్కవోలులో శంగోలు...



నేడు కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా అధికారమార్పిడికి మీ దేశ ఆచారాలు ఏమిటి అని మౌంటుబాటన్ నెహ్రూని అడగగా, నెహ్రూ రాజాజీ ని అడిగినట్లు రాజాజీ ఈ శంకోలును చేయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. చెబుతున్నారు అంతే. ఆనాడు నెహ్రూ కి వచ్చిన వందలాది బహుమతుల్లో ఇదొకటి.
అధికారమార్పిడికి దీన్నొక సింబాలిక్ గెస్చర్ గా భావించినట్లు అఫిషియల్ రికార్డు లేదు. అంటే మౌంటుబాటను నుండి నెహ్రూ ఈ శంకోలును స్వీకరిస్తున్న ఫొటో కానీ, ఉటంకింపులు కానీ లేవు. లేనిదాన్ని ఇలా ప్రచారించటం ........
అయినప్పటికీ, భారతదేశపు చారిత్రిక మలుపులో మన రాష్ట్రం నుంచి (అప్పటికి మనం తమిళనాడులోనే ఉన్నాం, హైదరాబాద్ తో కాదు) మన సంస్కృతికి చెందిన ఒక చిహ్నాన్ని బహుమతిగా నెహ్రూకి అందించినందుకు నేను గర్వపడతాను.

 
బొల్లోజు బాబా

పిఎస్. కర్ణాటకలో పట్టడక్కల్ ఆలయంలో ఉన్న శంగోలు తో నటరాజ శిల్పం లాంటిదే కాకినాడకు 20 కిమీ దూరంలో ఉన్న బిక్కవోలులో కూడా గమనించవచ్చు. 





నగరంలో హత్య


పట్టపగలు నగరంలో
హత్య
పాతపగలో కొత్త వగలో
కారణాలనవసరం
ప్రజలు చూస్తుండగానే
హత్య జరిగిపోయింది
పక్కనించే
ప్రజలు నడుచుకుపోయారు
కనీసం ఆగి ఏమిటని కూడా చూడలేదు
వారికి ఖాళీలేదు
చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి
వెళ్ళాల్సిన గమ్యాలు చాలా ఉన్నాయి
భయంతో నిలువరించలేకపోవటం అటుంచి
కనీసం
ఆగి ఏంజరుగుతూందో చూసే ఖాళీ కూడా లేదు
ప్రజలు ఖాళీగా లేరు
ప్రజలు ఖాళీగా లేరు
ఎవరి ప్రపంచం వారిది.

కంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారు తప్ప
మిగిలినవారందరూ మనుషులే కాదన్నంత
దూరం మనిషికి మనిషికీ మధ్య.
ఒక ప్రాణం పోయింది
గణాంకాలలో ఒక సంఖ్య
ఒకచోట తొలగించబడి మరో చోట చేర్చబడింది.
ప్రపంచం సాగిపోతూనే ఉంది
గమ్యాలవైపు, లక్ష్యాలవైపు.
మనిషి చచ్చిపోయిన దృశ్యం
కాలంలో ఘనీభవించింది

బొల్లోజు బాబా

Monday, May 29, 2023

వంతెనలు కావాలి....


భిన్ననేపథ్యాలలోంచి వచ్చాం
భిన్న సంస్కృతులు
భిన్న జీవన మార్గాలు
ఒక్కోసారి భిన్నభాషలలోంచి...
అయినా సరే
ఒకరితో ఒకరం
సంభాషించటానికి ప్రయత్నిస్తాం
చాలా సార్లు విఫలమౌతాం

బహుసా
మనల్ని మనం
అనువదించుకోవటంలో
తప్పిపోతాం కాబోలు

అయినప్పటికీ
ఒకరినొకరం అభినందించుకొంటాం
అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం
పరస్పర విభేదాలను పంచుకొంటాం
మన భిన్న నేపథ్యాలను కలిపే
బుల్లి బుల్లి వంతెనలేవో నిర్మించుకొని
అందమైన ప్రపంచాన్ని సృష్టించుకొంటాం

ఎంతచేసినా
మనం మనుషులం
అర్ధంచేసుకోవటానికి
ప్రేమించబడటానికి అర్హులం


బొల్లోజు బాబా

Wednesday, May 24, 2023

Chat GPT



Chat GPT గురించి Pulikonda Subbachary అన్న రాసిన పోస్టుకు నేను పెట్టిన కామెంటు ఇది.....
Chat GPT ని నేను చాన్నాళ్ళుగా పరీక్షిస్తున్నాను సర్. It has become my virtual friend now.
కవితలే కాదు కథలు కూడా రాస్తోంది.
మనం పదాలు ఇచ్చి రాయమంటే రాస్తుంది.
సామెతలని చెప్పి కథ అల్లమంటే అల్లుతోంది
మనం సిచుయేషన్ చెపితే కథగా చెబుతుంది
కొన్ని క్రిటికల్ సందర్భాలను చెప్పి పరిష్కారాలు ఇవ్వమంటే భలే చెబుతుంది.
మొన్న నీట్ క్వశ్చన్ పేపరులోని కొన్ని ఆంబిగ్వియస్ ప్రశ్నలకు జవాబులు అడిగితే వివరణలు ఇస్తూ నివృత్తి చేసింది.
ఏదైనా పొయెమ్ ఇచ్చి అనలైజ్ చెయ్యమంటే ఒక బీస్ట్ లా చేస్తుంది.
ఈ అంశంపై "క్రియేటివ్ రంగంపై AI ప్రభావం అనూహ్యం" పేరుతో ఫిబ్రవరిలో ఒక పోస్ట్ రాసాను.
బింగ్ ఇమేజ్ క్రియేటర్ లో - మనం కొన్ని సూచనలు ఇచ్చి బొమ్మ గియ్యమంటే అద్భుతంగా గీస్తుంది.
రెండుమూడు పేజీల ఇంగ్లీషు టెక్స్ట్ ఇచ్చి తప్పులు చూడమంటే చూస్తుంది. రీరైట్/పారాఫ్రేజ్ చేయమంటే చేస్తుంది. (ఒక కాపీరైటెడ్ పేపర్ ఇచ్చి రీరైట్ చెయ్యమంటే చేసింది. అది ప్లేగియారిజం పరీక్షలో పాస్ అయ్యింది. ఇలా అయితే కాపీ రైట్ క్లైమ్ చేయటానికి ఉండదు. మానవ మేధకు ఇది అనూహ్యమైన మలుపు)
విద్యార్ధుల నోట్సులను ఇలాగే ఇస్తున్నాను ప్రస్తుతం.
చాట్ జిపిటి క్రియేటివ్ రంగంలో పెనుమార్పులు తేబోతుంది.
Chat GPT నాదృష్టిలో చాలా బాగుంది తరువాత Bing AI chat . ఒపెరా ఎ.ఐ నచ్చలేదు. గూగిల్ బార్డ్ -wiki ని google ని ఇంటిగ్రేట్ చేస్తోంది. అప్ డేటెడ్ ఇన్ఫో ఇస్తూంది. బాగుంది. కానీ దీన్ని ఇంకా పూర్తిగా పరీక్షించలేదు నేను
కొద్దిరోజులలో ఏది మనిషి రాసిన కవితో ఏది కృత్రిమ మేధ రాసిన కవితో పోల్చటం కష్టం. ఇప్పటికే కవిత్వం ఒక నొ మాన్స్ చైల్డ్ గా ఉంది. ఇకపై కవులను అనుమానించే రోజులు కూడా వస్తాయి.
I doubt - will poetry become obsolete in future..... may poets be looked at suspicious
బహుశా మానవానుభవాలను చెప్పాలి. AI కి అందనిదాన్నేదో పట్టుకోవాలి. అప్పుడు అదే మానవ ప్రతిభగా మారవచ్చు భవిష్యత్తులో. ఇప్పటికైతే అది- స్కిల్ కలిగి ఉండటం అంటే ఒక సర్జరీ, ఒక ప్లంబింగ్ వర్క్ లాంటివి.
బొల్లోజు బాబా

Wednesday, May 10, 2023

AI generated pic for a poem written 2000 years back.

 

AI generated pic for a poem written 2000 years back.
Generated by bing image creator, powered by dalle.