Wednesday, December 4, 2019

భూమికి పుట్టినరోజు” జరిపే ఆకెళ్ల రవి ప్రకాష్ కవిత్వం

నా కవిత్వం మీద మంచి రివ్యూ రాసిన బొల్లోజు బాబా (Bolloju Baba) కు దాన్ని ప్రచురించిన కవిసంధ్య ( Kavi Sandhya ) సంపాదకులకు నా వందనాలు - ఆకెళ్ళ రవిప్రకాష్ Ravi Prakash 🙏
భూమికి పుట్టినరోజు” జరిపే ఆకెళ్ల రవి ప్రకాష్ కవిత్వం
(ఈ వ్యాసం కవిసంధ్య పత్రికలో ప్రచురింపబడినది. ఎడిటర్ గారికి ధన్యవాదములు)
.
‘కవిత్వం అనేది ఒక ఉత్పత్తి కాదు అదొక ప్రయాణం’ అనే సత్యాన్ని తెలిసిన కవి శ్రీ ఆకెళ్ల రవిప్రకాష్. మూడు దశాబ్దాలుగా కవిత్వంతో సహచరిస్తున్న రవిప్రకాష్ తాజా కవిత్వ సంపుటి పేరు “భూమి పుట్టినరోజు”. రవిప్రకాష్ కవిత్వం స్వేచ్ఛగా, సౌందర్యవంతంగా, తేటగా ఉంటూనే ప్రతి వాక్యం వెనుకా లోతైన అంతర్వీక్షణ, నిశిత దృష్టి, జీవన తాత్వికత పొటమరిస్తూంటాయి.
కవిత్వానికి కళాత్మకత, నూత్నదృష్టి రెండు నేత్రాల వంటివి. చక్కని నిర్మాణము, భావ పుష్టి, సందర్భోచిత అలంకారప్రయోగం లాంటివి కవితావస్తువును కళాత్మకం చేస్తాయి. అందరకూ పరిచితమైన విషయాన్నే చెపుతున్నప్పటికి దానిని ఒక నూతన దృష్టితో వ్యక్తీకరించటం మంచి కవిత్వ లక్షణం. దాన్ని చదివిన ప్రతిఒక్కరు ఇది నాకొరకే చెపుతున్నాడీ కవి అని ఉద్వేగపడాలి. ఈ రెండు లక్షణాలు రవిప్రకాష్ కవిత్వంలో పుష్కలంగా కనిపిస్తాయి.
రవిప్రకాష్ కవిత్వంలో మామూలు దృశ్యాలు గొప్ప సౌందర్యచిత్రాలుగా రూపుదిద్దుకోవటం అనేక కవితలలో చూడవచ్చు.
రాత్రి పక్షి ఆకాశాన్ని
చిట్టచివరి గుటకలో
ఎలా మింగేస్తుందో చూడు (రైలు ప్రయాణం)
పూర్తిగా చీకటి పడి ఆకాశం కనిపించకుండా పోయింది అనే దృశ్యాన్ని గొప్ప ఇమేజెరీతో సౌందర్యమయం చేస్తాడు.
సగం తీరం మీదా
సగం రాళ్లమీదా
ఆరేసిన తెల్లని ఎండ దుప్పటి (మధ్యాహ్నం)
తెల్లని తీరంపైనా, నల్లని రాళ్లపైనా ఎండ ఒకేలా, తెల్లగా ప్రకాశిస్తుంది. ఎండను దుప్పటిగా పోల్చటం అందమైన ఊహ.
కవితను చివరివాక్యాలలో అనూహ్యమలుపు తిప్పటం రవిప్రకాష్ కవిత్వలక్షణం. ఇది చాలా కవితలలో కనిపిస్తుంది. అంతవరకూ కవిత ఏదోమామూలు వైయక్తిక ఘటనను వర్ణిస్తున్నట్లుంటుండి ఒక్కసారిగా గంభీరతను సంతరించుకొంటుంది. “పాప మనసు” కవితలో ఆసుపత్రిలో ఒక పాప అదేపనిగా ఏడుస్తుండటం కవితా వస్తువు. ఏవరూ ఊరుకోబెట్టలేకపోతున్నారు, ఏవో పూర్వజన్మ జ్ఞాపకాలు కావొచ్చట, పాపమనసు నిద్రాతీరంలోకి కరగటంలేదట, రాగాలన్నీ విషాదమయ్యాయి, రంగులన్నీ దుఃఖవర్ణంలోకి ఇంకిపోయాయి అంటూ అనేక వర్ణనలతో ఆ దృశ్యాన్ని, దాని వెనుకున్న ఉద్వేగాలను అద్భుతంగా పలికిస్తారు. ఇక ఆ కవిత చివరవాక్యాలు ఇలా ముగుస్తాయి
దివారాత్రాల బేధాన్ని మర్చిపోయి
ఆగకుండా రోదిస్తున్న సముద్రంలా
పాప మనసు/ (పాప మనసు)
కవితముగియగానే ఆలోచనలు ఒక్కసారిగా రెక్కలు విప్పుకొంటాయి. ఇంతకీ పాప ఎవరు? సముద్రమా, కాలమా, జీవితమా, కవి దుఃఖమా అంటూ అనేక కిటికీలు తెరచుకొంటాయి. ఇస్మాయిల్ గారు అన్న “తెరుచుకొన్న పద్యం” అంటే ఇదేననిపిస్తుంది.
ఈ సంపుటిలో వివిధ శీర్షికలతో లఘుకవితలను వ్రాసారు ఇది శిల్ప పరమైన విశేషంగానే భావించాలి ఎందుకంటే ఈ ప్రక్రియకో పేరు పెట్టి ఖ్యాతి నొందాలనే ఉద్దేశం కనిపించదు. వానాకాలం పద్యాలు, విమాన పద్యాలు, ప్రశ్నలు, విశాఖనగర పద్యాల శీర్షికలతో ఉన్న కవితలలో ఈ రీతి కనిపిస్తుంది.
ఎవరూ నడవని రోడ్లమీద
నడుస్తూ వర్షం (వానాకాలం పద్యాలు)
భోరున పడే వానను గమనిస్తే, వాన జల్లు రోడ్డుపై ఒక్కోసారి ధారల పాదాలతో ముందుకు కదులుతూన్నట్లు అనిపిస్తుంది. చాలా సున్నితమైన పరిశీలన ఇది.
రవి ప్రకాష్ “విమాన పద్యాలు” పేరుతో వ్రాసిన కవితలలోని వర్ణనలు కూడా అంతే హృద్యంగా ఉంటాయి.
ఆకాశంలో ఒకడే చంద్రుడు
సముద్రం మీద వేల లక్షల చంద్రుళ్ళు - ఈ లోకానికి చంద్రుడొక్కడే కానీ సాగరతరగలపై ప్రతిబింబించే లక్షల చంద్రుళ్ళను చూడాలంటే విమానం కిటికీ పక్క సీటు దక్కించుకోవాల్సిందే.
వీధి దీపాల్ని మెళ్లో వేసుకుని
మాయా ద్వీపంలా వెలుగుతూ నగరం - అనే విమానపద్యంలో “మాయా ద్వీపం” అన్న ఒక్క పదంతో నగరాన్ని- పుర్రెలు మెడలో ధరించిన రాక్షసునిగా ధ్వనింపచేస్తారు.
నగరం అంటే రవిప్రకాష్ కు లౌల్యం. నగరం అంటేనే కొత్త స్వరాలు, కొత్త ఘర్షణలు, కొత్త అనుభూతులు. ఇవే కదా కవిత్వానికి ముడిసరుకు. తన ప్రతి సంపుటిలోను నగరం పై నాలుగైదు కవితలు ఉంటాయి. “ఇసక గుడి” సంపుటిలో పాండిచేరి నగరంపై వ్రాసిన పెద్దకవిత, ఈ సంపుటిలో మద్రాసు నగరంపై వ్రాసిన “మద్రాసులో ఒక రాత్రి” అనే కవిత అన్నింటిలోకి మకుటాయమైనవిగా చెప్పుకోవచ్చు. ప్రతికవితలోను నగరం కొత్తగా దర్శింపచేయటం కవి ప్రతిభ.
కవిత్వం ఉద్వేగాలకు అక్షరరూపం ఇస్తుంది. ఇది మనుషుల్ని దగ్గరచేస్తుంది. ఒకరి పట్ల ఒకరికి దయ ప్రేమ కరుణ లాంటి అనుభూతులు కలిగింపచేస్తుంది. మానవ సంబంధాలను పటిష్టపరుస్తుంది. ఈ సంపుటిలోని అనేక కవితలు మానవ సంబంధాలలోని ఆర్థ్రతను నిండారా ఆవిష్కరిస్తాయి.
“నాన్న ఉంగరం” కవితలో పద్దెమిదేళ్ళక్రితం గతించిన తండ్రిగారి ఉంగరాన్ని తను ప్రస్తుతం ధరించటం పై వ్రాసిన కవితలో…
జాలరి వలల చుట్టూ
గాఢమవుతున్న సాయింత్రపు నీడలా
నాన్న మౌనాన్ని కూడా
తనలోకి ఇముడ్చుకుందీ వుంగరం//
చిత్తం ఇసక తీరం మీద
మెత్తగా జారిపడిన పండుటాకులా
వెచ్చగా స్పర్శిస్తూవుంటుందీ వుంగరం - (నాన్న వుంగరం).
నాన్న ఉంగరాన్ని ధరించటం అంటే ఆ తరాన్ని, ఆ తరపు బాధ్యతల్ని వెచ్చని స్పర్శగా దాల్చటమే. ముందు తరానికి వారసులుగా మనం కొనసాగించాల్సిన పారంపర్యతకు ఉంగరాన్ని ప్రతీకగా చేస్తున్నాడు కవి. తాను కూడా గాఢమవుతున్న సాయింత్రాన్ని చేరుకొంటున్నాను అనే స్పృహ ధ్వనిస్తుందీ కవితలో. ఇదొక పునరావృత క్రీడ.
“జీవనదీ ఆరు ఉపనదులు” కవితలో “ఆడవాళ్లందరినీ వంటింట్లోకి /వెళ్లడాన్ని నిషేధించి /మనందరినీ పాలించమంటే /ఈ భూప్రపంచం /ఎంత మార్ధవంగా /ఎంత సున్నితంగా /ఎంత దయగా /ఎంత నిర్భయంగా /మారిపోతుందో చూడాలని ఉంది” అంటాడు. ఇది స్త్రీల సామర్ధ్యం పట్ల, స్త్రీలకు దక్కాల్సిన సాధికరత పట్ల కవికి ఉన్న సహానుభూతిని పట్టిచూపుతుంది.
ఊరినుంచి వస్తూ బహుమతులు తెచ్చే తండ్రిని గుర్తుచేసుకుంటూ వ్రాసిన “నాన్న జ్ఞాపకం”; ఆవిర్లు గక్కే వంటల్ని వడ్డించే అమ్మను తలచుకొంటూ వ్రాసిన “వంటిల్లు”; తన సహాద్యాయి మరణంపై వ్రాసిన “సూర్యుని మరణం” లాంటి కవితలలో మానవసంబంధాలు కరుణాత్మకంగా వ్యక్తీకరించబడ్డాయి.
ఈ లోకంపైనా, మనుషులపైనా, మనో వేదనలపట్లా, మానవ సంబంధాలపైనా అవ్యాజమైన అనురక్తే రవిప్రకాష్ కవిత్వ తత్వం. మానవాళిపై అచంచలమైన ప్రేమ అనేక కవితల అంతఃసూత్రం.
మానవాళి మొత్తం
ఒకే దేశంగా ఒకే మతంగా ఏకమయ్యి
ఒకర్ని పాలించాలనుకునే వాళ్లనీ
ఒకర్ని నియంత్రించాలనుకునే వాళ్ళనీ
భూగోళం మీంచి ఖాళీ చేసి
పంపాల్సిన రోజు
ఒకరోజు తప్పక వస్తుంది
ఆ రోజు కోసం మళ్ళీ
భూమి పుట్టిన రోజు కోసం
ఎదురుచూస్తూ - (భూమి పుట్టిన రోజు) అనే వాక్యాల ద్వారా- కవి యుద్ధాలు, నియంతలు, అడ్డుగోడలు లేని వసుధైక కుటుంబాన్ని స్వప్నిస్తున్నాడని అర్ధమౌతుంది.
ఈ క్రమంలో శాస్త్రీయత, మేధలను, కవి కలలు, ఊహలు డామినేట్ చేస్తున్నట్లు అనిపించినా ఇది ఒక బృహత్ స్వప్నం. ఎంతవరకూ వాస్తవలోకంలో జరుగుతుందో తెలియదు కానీ ప్రతి మనిషి మనోలోకంలో ఈ స్వప్నం సాకారం అయిన రోజు ఈ భూమికి నిజంగా పుట్టిన రోజే అవుతుంది.
రవిప్రకాష్ భావుకుడు, మానవతావాది, గజిబిజి జీవితంలోని సౌందర్యాన్ని ఒడిసిపట్టుకోగలిన బాహ్యనేత్రం; చిక్కులు పడిన ఆలోచనలల్లో మెరుపులా కనిపించి మాయమయ్యే జీవనతాత్విక వ్యాఖ్యానాన్ని దర్శించగలిగే అంతర్నేత్రం కలిగినవాడు, కవిత్వానికే కట్టుబడిన నైష్టికుడు.
ఈ పుస్తకానికి డా.రవూఫ్ ముందుమాట వ్రాసారు. కవితలకు శ్రీ గిరిధర్ వేసిన చక్కని చిత్రాలు కవితాత్మకు అలంకారంగా ఉన్నాయి. మంచి, సాంద్రమైన కవిత్వాన్ని ఇష్టపడేవారికి భూమిపుట్టిన రోజు తప్పక నచ్చుతుంది.
- బొల్లోజు బాబా




యుద్ధం ముగిసాకా

ఓ కశ్మీరీ! యుద్ధమంటూ ముగిశాక నేను నీ దగ్గరకు వస్తాను. నీకు పెల్లెట్లు బుల్లెట్లు చేసిన గాయాలను తడిమి చూస్తాను. నువ్వు సంతోషంగా ఉండటమే నేను సంతోషంగా ఉండటం అనే విషయం గత నెల రోజులుగా నాకు అర్థమౌతూనే ఉంది. నేనేమీ ఇక్కడ సంతోషంగా లేను. సంతోషంగా లేనందుకు కూడా దేశద్రోహిగా తిట్లు తింటూ ఉన్నాను.
షబీర్ అహమ్మద్ నన్నే పిలుస్తున్నట్లు ఉంది. ఈ నెల మాతృకలో అతని కవిత. అనువాదకులు బొల్లోజు బాబా
యుద్ధం ముగిసాకా
షబీర్ అహ్మద్ మీర్
అనుసృజన: - బొల్లోజు బాబా
యుద్ధం ముగిసాకా
నువ్వు ఇలా వస్తే
బుల్లెట్లు, పెల్లెట్లు చేసిన రంధ్రాలను
నీకు నేను చూపిస్తాను
నీ చేతివేళ్లతో తడిమి చూస్తే
నీకే అర్ధమౌతుంది వాళ్లెంత గాయపరచారో
యుద్ధం ముగిసాకా
శిధిలాల మధ్య భయం భయంగా వికసిస్తోన్న
ప్రిమ్ రోజెస్ పూల వాసన నీకు చూపిస్తాను
ఎంతటి దివ్యసౌందర్యం ఉండేదిక్కడ!
యుద్ధం ముగిసాకా
మా అఖండ పురాతన గిరుల మధ్య ప్రవహించే
సెలయేళ్ల గలగలల్ని నీకు వినిపిస్తాను
వాటి గొంతును కోపోద్రిక్త సరిహద్దుల చప్పుళ్లు
ఇకపై అణచలేవు.
యుద్ధం ముగిసాకా
నేను నిన్ను దగ్గరుండి తీసుకెళ్తాను
వెరినాగ్ నీటి చెలమలో నీ పాదాలను తడుపుకో
సుఖనాగ్ నీటిబుగ్గలోని నీళ్లు దోసెళ్లతో తాగు
ఏ భద్రతా లేకుండానే దాల్ సరస్సులో
పడవ షికారు చేస్తూ చేతిని నీళ్లలో ఆడించు
ఇదెంత ప్రశాంత ప్రదేశమో నీకే తెలుస్తుంది,
యుద్ధం ముగిసాకా
భాష్పవాయువులు, పెప్పర్ స్ప్రేలు
సైరన్ లు, అరుపులు, మూలుగులు లేని
స్వేచ్ఛాగాలుల్ని శ్వాసించే మంచు శిల్పాలు
ఎంత అందంగా ఉంటాయో నీకు తెలిసేలా చేస్తాను.
నువ్వే చూస్తావు! నువ్వే చూస్తావు!
ఈ సువిశాల మంచు లోకపు ప్రశాంతత
అకాల సమాధులు తవ్వటానికై భగ్నం చేయకుండా ఉన్నప్పుడు
ఎంత అందంగా ఉంటుందో!
యుద్ధం ముగిసాకా
మా వాన్ వున్ బృందగానానికి తీసుకెళతాను, గొంతుకలుపు
వెండి వెన్నెల రాత్రివేళ
మా రవూఫ్ బృందనాట్యంలో చేరి ఆడుదుగాని.
మేము సంతోషంగా ఉండటం నీకూ సంతోషమేనని
నీకే తెలుస్తుంది.
యుద్ధం ముగిసాకా
నిన్ను టీకి ఆహ్వానిస్తాను
కలిసి టీ తాగుదాం
ఉప్పని రుచితో, కుంకుమ రంగు కలిగిన టీ
నీకే తెలుస్తుంది
నేనేనాడూ నీకు శత్రువుని కానని.
షబీర్ అహమద్ మీర్ ప్రముఖ కాశ్మీరీ కవి.
*వాన్ వున్- కశ్మీర్ సాంప్రదాయ బృందగానం
*రవూఫ్ -కశ్మీర్ సాంప్రదాయ బృందనృత్యం

Ideologies

మొన్నొక సాహిత్యసభ ముగిసాకా వెళిపోతున్న మిత్రుణ్ణి "ఉండండి సరదాగా కాసేపు మాట్లాడు కుందాం" అన్నాను.
సూర్యకళా మందిరంలో హరికథా వారోత్సవాలు జరుగుతున్నాయి. అక్కడకు వెళ్ళాలి అన్నాడు.
మీరు కమ్యూనిష్టు భావజాలం కలిగినవారు (కొన్నాళు అన్నలతో కలిసి అజ్ఞాతంలో ఉన్నారు) కదా హరికథలకు ఎలా వెళతారు. మధ్యమధ్యలో "శ్రీమధ్రమారమణగోవిందా" అని కూడా అంటారా అని- వారిని వేళాకోలం చేసాను కొంచెంసేపు ఉంటారని.
హరికథలు వినటం నాకు ఇష్టం. అదొక కళారూపం. అలాగని నా భావజాలాన్ని నేను మార్చుకోను. దాని దారి దానిదే, దీనిదారి దీనిదే అన్నాడతను.
నిన్నో మొన్నో "You are what you are by your choices. I believe choices are above any ideologies. Keep living rather than following" అని ఒకచోట నే చేసిన కామెంటు గుర్తుకొచ్చింది.
కొన్ని దృక్ఫధాలు ఈ సమాజానికి మేలు చేస్తాయని నమ్ముడం వాటిని మనసావాచాకర్మణా ఆచరించటం ఉత్తమ విలువ. పాతవాటిని కూలదోస్తే కానీ కొత్తవి నిర్మించలేం అన్నది కూడా వాస్తవమే.
ఒక ఆల్టర్నేటివ్ ని సృష్టించకుండా కానీ పాతవాటిని కూలదోయాలని ఆశించటం/శాసించటం- ఆ దృక్ఫథ సానుభూతిపరులను ట్రోలింగ్ చేయటంగా మిగిలిపోతోంది. ఇది శోచనీయం.
కళలకు సంబంధించినంతవరకూ నేను నమ్మే సిద్ధాంతాలతోపాటూ నా ఇష్టాలు కూడా పక్కపక్కనే ఉంటాయి. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం, నా కుటుంబం, నా సన్నిహితుల అభిప్రాయాలకు అనుగుణంగా నా ఇష్టాలు ఏర్పడ్డాయి. నా బుద్ది విస్తరించాకా జీవితం పట్ల కొన్ని సిద్ధాంతాలను/దృక్ఫధాలను ఏర్పరచుకొన్నాను. ఈ రెంటిసంగమమే నా నడకా, నడతా, జీవితమూను.
అందుకే అన్నమయ్య గీతాలు, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి దుఃఖస్వరం, కూచిపూడి నాట్యాలు, కృష్ణశాస్త్రి గీతాలు, జాషువా పద్యాలు, ఇళయరాజా, గోరటి వెంకన్న, గద్దర్ పాటలు, దైవభక్తి అన్నీ ఉంటాయి.
వాటిలో కొన్ని సోకాల్డ్ బ్రాహ్మణీయభావజాలాన్ని ప్రతిబింబించేవి కావొచ్చు. కానీ బ్రాహ్మణీయభావజాలం అంటే బ్రాహ్మణుల భావజాలం కాదని నేను విశ్వసిస్తాను. అది ప్రతిమనిషిలో ఉండే- నా సంస్కృతి, నా అభిరుచులు గొప్పవనే ఆధిపత్యభావజాలం. ఇది సమాజంలో పైనుంచి క్రిందిస్థాయి వ్యక్తులందరిలోనూ ఉంటుంది. ఎవరికీ మినహాయింపులుండవు. అలాంటి అభిప్రాయాల్ని ఒక్కసారిగా సమూలంగా తొలగించటం అంటే దాదాపు మనుషులందరి రక్తమాంసాల్ని తొలగించటం అంత కష్టం నేడు.
"“మార్పు అనేది ముగ్గగానే రాలిపడే పండు కాదు, మనమే దానిని రాల్చాలి” అన్న
చే గెవారా మాటలు వినటానికి బాగుంటాయి కానీ ఆచరణలో మాత్రం మార్పు అనేది "మనుషుల లోలోపలనుంచి రావాలి" బయటనుంచి కాదు.
బొల్లోజు బాబా

నిశ్శబ్దం పై రూమీ


1
పదాలింక చాలు మిత్రమా
చెవులను చూడనియ్యి,
నీ మిగతా కవితను
ఆ భాషలో మాట్లాడించు
2.
ఈ కవిత నిడివి తగ్గిస్తాను
ఎందుకంటే
అదంతా ఈ ప్రపంచంలో
మన కళ్ళముందు కనిపిస్తూనే ఉంది.
3.
ఈ నిశ్శబ్దాన్ని గుర్తించావా?
అది నువ్వు నీ గదిలో ఒంటరిగా
మాట్లాడటానికి ఎవరూ లేనప్పటి
నిశ్శబ్దం లాంటిది కాదు.
4.
ఇది స్వచ్ఛమైన నిశ్శబ్దం
ఇది
బ్రతికున్న కుక్కలు చచ్చిన కుక్కను
పీక్కు తింటున్నప్పటి నిశ్శబ్దం కాదు.
5.
నిర్మలమైన ఖాళీగా మారు
అందులో ఏముంటుంది? అని నువ్వు అడిగితే
నిశ్శబ్దం మాత్రమే అని చెప్పగలను.
6.
నిశ్శబ్దం
నువ్వు సాధన చేయాల్సిన కళ
మూలం: జలాలుద్దీన్ రూమీ
అనువాదం: బొల్లోజు బాబా

పురావస్తు తవ్వకాల చోటు వద్ద - At an Archaelogical Site by Yahuda Amichai


ఒక పురావస్తు తవ్వకాల చోటు వద్ద
శుభ్రంగా తుడిచి, వరుసలలో పేర్చిన
విలువైన వస్తువుల, పాత్రల శకలాలను చూసాను
ఆ పక్కనే
వ్యర్ధమని పారబోసిన ధూళి గుట్ట ఉంది.
దానిపై ముళ్ళ మొక్కలు కూడా మొలవవు
లోతుల్లోంచి తవ్వి, అణువణువూ గాలించి,
హింసించి, వేరుచేసి కుమ్మరించిన
ఈ ధూళి గుట్ట ఏమై ఉంటుందా అని
నాలో నేను తర్కించుకొన్నాను.
సమాధానం దొరికింది
ఈ ధూళి అంతా మనలాంటి ప్రజలే
వెండి, బంగారం, చలువరాయి
ఇంకా విలువైన వస్తువులనుండి
జీవితకాలమంతా దూరం చేయబడి
చనిపోయి నేటికీ ఇంకా ధూళిగానే
మిగిలిపోయిన మనమే
ఈ ధూళి కుప్పే మనం,
మన శరీరాలు,
మన ఆత్మలు
మన నోటి మాటలు
మన అన్ని ఆశలు.
Source: At an Archaelogical Site by Yahuda Amichai
అనువాదం: బొల్లోజు బాబా

"ఒక… " లో అనేకత్వమే సిద్దార్థ కవిత్వం

ఒక... గురించి నాకిష్టమైన కవుల్లో ఒకరైన బొల్లోజు బాబా మాటలు 
"ఒక… " లో అనేకత్వమే సిద్దార్థ కవిత్వం
(సిద్దార్థ కట్టా కవిత్వ సంపుటి “ఒక…” రొట్టమాకు రేవు అవార్డు అందుకొంటున్న సందర్భంగా అభినందనలు తెలుపుతూ )
సిద్ధార్థ కట్టా కవిత్వం జీవితంలోని మల్టిప్లిసిటీని ప్రతిబింబిస్తుంది. అందుకే ఇతని కవిత్వంలో కాషాయమయమైన రాజకీయాలు; సానిటరీ పాడ్ల మీడ పన్నులు వేసే రాజ్యం పట్ల ధిక్కారం; గాయాలగేయాలతో రాజ్యానికి ఉరితాళ్లు పేనటం; విప్లవాన్ని స్వప్నించే తూనీగలు; నేలను లాక్కెళ్ళి నేలమీద పడేసే పసిపాప పాదాలు; పూలను మొక్కలకే ఉంచవా, నేను అమ్మవద్దే ఉన్నట్టు అని అభ్యర్ధించే పసిహృదయాలు; చీరమడతల్లో వెయ్యో అరవెయ్యో దాచిపెట్టే అమ్మలు; నోటుపై గాంధిబొమ్మ బదులు నాన్న బొమ్మ ఉండాలనేంతగా ప్రేమించబడే నాన్నలు; error 404 page not found లాంటి అత్యాధునిక పరిభాషలో పలికే వీడ్కోలు గీతాలు; మాట్లాడే సీతాకోకలు; ప్రేమలో ప్రతీదీ ప్రాణం పోసుకొంటుందన్న ఎరుకా; ….. లాంటి భిన్న జీవన పార్శ్వాలు అద్భుతంగా పలికాయి.
వస్తు విస్త్రుతి సిద్ధార్థ కవిత్వానికి గొప్ప బలం. చంద్రికల నుంచి ఉరికొయ్యలదాకా ఇతని కవిత్వం విస్తరించి ఉంది. యువకవుల్లో ఇది అరుదుగా కనిపించే లక్షణం. మంచి కవినుండి గొప్పకవిని వేరుచేసేది ఈ లక్షణమే.
ఇతని వ్యక్తీకరణ పరిధి చాలా విశాలమైనది. “రాత్రికి పెరుగన్నంలోకి చందమామను నంజి పెట్టేది” అని అమ్మగురించి ఎంత సౌకుమార్యంగా వర్ణిస్తాడో “పురుషాంగాలకు కత్తులు /మొలిచినపుడే మీ జాతి అంతరించింది” అంటూ పసిపిల్లలను అత్యాచారాలు చేయటం పట్ల తీవ్రంగా ఆక్షేపణ చేయగలడు.
నేడు మనుషులను మనుషులుగా కాక సమూహాలుగా మాత్రమే గుర్తించుకొంటున్న కాలం. సిద్ధార్థ కవిత్వం మనుషులను ప్రేమించటంలోని సౌందర్యాన్ని పట్టిచూపుతుంది. ఇది మానవసంబంధాలను వ్యక్తీకరించే అంశం. మానవసంబంధాలకవిత్వం కాలం ఉన్నంత వరకూ నిలిచిఉంటుంది.
ఎవరైనా జ్ఞాపకం వస్తే
ఒక దీపాన్ని వెలిగించి
చుట్టూతా చేతులను ఉంచండి
స్పర్శతడి సజీవంగా ఉన్న
మీ చర్మాలకు అతుక్కు పోతారు//
మీరో పూలవనాన్ని నిర్మించుకోండి
ఆప్తుల మాటలన్నీ
అత్తరులో మునిగిన తూనీగలై
తచ్చాడుతాయి (జ్ఞాపకమొస్తే) …. లాంటి వాక్యాలలోని ఆర్థ్రత మనుషులు ప్రేమైక జీవులని, ఇచ్చిపుచ్చుకోవటంలోనే జీవితపు అత్తరుపరిమళాలు ఉంటాయని చెపుతాడు సిద్ధార్థ.
కవిత్వంలో సౌందర్యవర్ణణలు ఆక్షేపణకు గురవుతున్న సందర్భమిది. సామాజిక ఘర్షణే కలిగిఉన్నదే ఉత్తమ కవిత్వమని తీర్మానించే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాసిన ఈ వాక్యాలు- జీవితంలోని అన్ని పార్శ్వాలను కవిత్వం స్పృశించినపుడు అది సంపూర్ణమౌతుందన్న సత్యాన్ని ఆవిష్కరిస్తాయి.
ఒక రోజు ఎలా వస్తుందో తెలుసా
నీ అరచేతుల మీద సీతాకోక చిలుకలు వాలినట్లు
నల్లటి చెరువులో చంద్రుడు బంతిపువ్వై ఈదుతున్నట్టూ
ఒకపూట తన హంసపాదాలతో వెతుకుతుంది నిన్ను
పాల మీద మీగడ కట్టుకున్నట్టు భలే నవ్వుతావప్పుడు మెత్తగా
నీ నోరు 32 నక్షత్రాల ఆకాశం మరి// (ఎలా వస్తుందో తెల్సా) వాక్యాలలో - చంద్రుడుని నల్లటి చెరువులో బంతిపువ్వుగా పోల్చటం గొప్ప ఊహ. ముత్యాల లాంటి పళ్ళు అనటం ఒకనాటి కవిసమయం. నోరారా నవ్వటాన్ని 32 నక్షత్రాల ఆకాశం అనటం బహుసా ఏ పూర్వకవీ చేయని ప్రయోగం. మనల్ని, మనజీవితాల్ని ఒక్కోసారి ఉక్కిరిబిక్కిరిచేసి, నిలువనీయని జీవనసౌందర్యపు అనుభూతులు ఇవన్నీ. అందంగా, ప్రతిభావంతంగా చెప్పినప్పుడు ఇవికూడా కవిత్వానికి అర్హమే!
మనిషి ఒక అద్భుతం అనేకవితలో ఒక అద్భుతాన్ని చూపిస్తాడు సిద్ధార్థ. మానవ జన్మ ఉత్తమమైనదని ప్రవచన కారులు చెప్పొచ్చు. వాటి అర్ధాలు వేరు, వాటి ఉద్దేసాలు వేరు. మనిషి ఎందుకు అద్భుతమయ్యాడో ఒక కవిగా ఇలా అంటాడు సిద్ధార్థ.
నువ్వు ఊహించు
బతకటం ఎంత అద్భుతం//
ఎండకి గొంతెండిన పావురం
దాహాన్ని గ్రహించగలవు
కిటికీ చివర
రెండు దోసిళ్ల నీటిని పూయగలవు
అవన్నీ కాదు గానీ
ఓ పొడిగుండెని నువ్వు కనిపెట్టలేవా?
దానిని తడి చేసే మాయ నీలో ఇంక లేదా?
మనిషివి కదా
తడి చేయటం నీ లక్షణం
ఇప్పుడు చెప్పూ మనిషెంత అద్భుతం (మనిషి ఒక అద్భుతం) ఏ వాక్యమూ వాచ్యం కాదు. ప్రతీ వాక్యమూ ధ్వన్యాత్మకమే. మనిషి జన్మ రహస్యం, దాహాన్ని గుర్తించటం, తడిచేయటం….. అంతే ఈ రెండే. ఎంతమంది ప్రవక్తలు చెప్పినా ఇదే అంతిమ సత్యం. దాన్ని గుప్పెడు వాక్యాల్లోకి కుదించిన సిద్ధార్థను కవి అని ఎలా అనగలం? ఒక అద్భుతమని కాక.
పిల్లలంటే సిద్ధార్థకు ప్రేమ. పసిపాపల ప్రస్తావన అనేక కవితల్లో వస్తుంది. వచ్చిన చోటల్లా ఆల్చిప్పలో కృత్రిమ ముత్యాన్ని పెట్టినట్లు కాక సహజంగా అమరిపోవటం కవి ప్రతిభ.
దాచుకున్న బొమ్మకు స్నానం చేయించినట్టు
నేల బుగ్గపై పసిపిల్ల ముగ్గురాసింది
ఆకాశం ఆశపడి నీళ్ల ముద్దు పెట్టింది
ఒక నాన్న చెంపలు తడిచిపోయాయి (ఐదు రెక్కలు) కూతురు వేసిన ముగ్గు వానకు కొట్టుకుపోతే నాన్న ఏడ్చాడట. ఎంత ఉదాత్త ఊహ. ఆ ఊహను కవిత్వీకరించిన విధానం ఎంత దీప్తిమంతంగా ఉందీ! ఇక్కడ వానకు కూడా పాపంటే ఇష్టమేనని ఎంత గడుసుగా అంటున్నాడూ కవి.
//పూలమొక్కను
నన్నుగా పరిగణించి
కొద్దిగా నీళ్ళను ఇవ్వండి
మీ పిల్లల అలంకరణకు
కొన్ని పూలను ఇస్తాను// (Error 404) ఇదొక వీడ్కోలు గీతం. నాకోసం వెతక్కండి అంటున్నాడు కవి. ఇక్కడ “నేను” లో ఉన్నది జీవన పరాజితుడో, రాజ్యం మాయం చేసిన అమరుడో ఎవరైనా కావొచ్చు. ఈ సందర్భానికి పిల్లల అలంకరణ ప్రస్తావనలో కవి ప్రేమే కనిపిస్తుంది.
//పక్కింటి పసిపిల్ల జ్వరం వాసన
పక్కింటి పూలతోటను రాతిరెవరో ఖాళీ చేశారట మరి// (పసి పిల్లకు జ్వరమొచ్చింది) వాక్యంలో కవి ఆడుకొనే పసి పిల్లలను పూలతోటగా వర్ణించటం ఒక రమణీయ ప్రతిపాదన.
Our kid కవిత ఒక భీభత్సరసప్రధాన మోదాంత మహాకావ్యం. విద్యారంగంలో కార్పొరేట్ సంస్కృతి తెచ్చిన విషాదాన్ని అక్షరీకరిస్తుంది. ఈ కవితలో వివిధ ఇంగ్లీషు వాక్యాలవాడటం కూడా చెపుతున్న వస్తువుకు బలం చేకూర్చటానికే. “Every school is a corporate prostitute, //
Do you know how much I do for you,//
Really no one loves me except this bubbly bus driver// సంజయ్ రిమెంబెర్ ఇట్/ ఇఫ్ యు గెట్ ఎ బెటర్ రాంక్, డాడ్ విల్ బై ఎ ప్లే స్టేషన్ ఫర్ యు//
Sanjay kumar roll num: 532/Got caught by squad while copying” లాంటి వాక్యాలు నేటి విద్యా వ్యవస్థలో పిల్లలు గురవుతున్న హింస తాలూకు బీభత్సాన్ని కళ్లకు కడతాయి. మనం ఇంతటి అమానవీయతకు అలవాటుపడిపోయామా అని జలదరింపచేస్తాడు.
కవితను అలా నడిపించి మనం ఏం చేయటంలేదో ఒక్కొక్కటీ గుర్తుచేస్తాడు సిద్ధార్థ కవిత మిగిలిన సగభాగంలో. “ఒంటికి వెన్న పూసుకున్న పాపాయి ఒక మెత్తని రహస్యమట”, "దూది చేతులు చాచి ఇక ఎత్తుకోమని అడుగుతాయట", "ఒక పాప భూజాల గూటిలోకి దప్పిక పిచ్చుకలా చేరుతుందట". ఆ కవిత చివర్లో ఇలా ముగిసి మనల్ని రకరకాల ఆలోచనల్లోకి నెట్టేస్తుంది.
బావి చుట్టూ చేరి
లోపలి చంద్రుణ్ణి చూపిస్తూ
వాళ్ళకోసమే రాలాడని
అబద్దం చెప్పండి//
మీలాంటి వాళ్ళనీ, మీమీ నాన్నల వంటి వాళ్ళనీ
అచ్చూ అలాంటి పోలికే అని
వాళ్ళలోకి ప్రవహించకండి
పిల్లలు మీ వారసత్వం కాదు
వాళ్ళు మీ అనుచరులూ కారు
పిల్లలు వట్టి పిల్లలే…… (our kid). మారిన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఈ కవిత, జిబ్రాన్ పిల్లలపై వ్రాసిన కవితకు ఒక పొడిగింపుగా అనుకొంటాను.
సిద్ధార్థ కవిత్వంలో సౌందర్యం ఎంత తేటగా పలుకుతుందో సమకాలీన రాజకీయాల పట్ల ఆవేదన, కోపం కూడా అంతే నిజాయితీగా పలుకుతాయి.
//రాజ్యమిపుడు
ఆవులా ఉంది, కాషాయంలా ఉందీ
పోలీసు బూటు కాలంత బలంగా ఉంది
రంగురంగుల గూండాల చేతిలాఠీలాను ఉంది
మొన్నటి వరకూ నాకో అనుమానం ఉండేది
ఇప్పుడు నివృత్తి అయింది
తూటాలదిప్పుడు కాషాయపు రంగే// (ప్రశ్న అనుకొని) -- గౌరీలంకేష్ హత్యపై రాసిన ఈ కవిత నేటి మత రాజకీయాలను స్పష్టపరుస్తుంది.
చివరగా అన్నీ దాటుకుని
ఓ చిన్నారి తూనీగ
సూర్యుని నెత్తిమీద వాలుతుంది
అప్పుడు నీకూ అనిపిస్తుంది
విప్లవం ప్రకృతి ధర్మమని. -- (విప్లవ ప్రకృతి ధర్మం). ఎన్ కౌంటర్ల పేరిట ఎంతమందిని చంపినా అంతిమంగా విప్లవమే జయిస్తుందని, ఎందుకంటే విప్లవం అనేది ప్రకృతి ధర్మమని అంటాడు. ఈ తరహా కవిత్వంలో ఇదొక నవ్యమైన ఊహ.
ఆధునిక జీవన సారాంసాన్ని కవిత్వం చేయటం సిద్ధార్థ కవిత్వలక్షణం. మంచి పదచిత్రాలను అలవోకగా సృష్టించగలిగే ప్రతిభకలిగినవాడు సిద్ధార్థ. జీవితంలోని మల్టిప్లిసిటీని అర్ధం చేసుకొన్నవాడు. జీవితం పట్ల తనకున్న నిర్ధిష్టమైన ఆలోచనలను సౌందర్యాత్మకంగాను, శక్తివంతంగానూ కవిత్వంలోకి ఒంపగలిగిన నేర్పు కలిగినవాడు.
“ఒక” ఇతని తొలి కవిత్వసంపుటి. భవిష్యత్తులో ఇతను మరిన్ని సంపుటులుగా విస్తరించి, తెలుగు కవిత్వకిరీటానికి మెరుపుల తురాయిలా వెలగాలని ఆశిస్తున్నాను.
రొట్టమాకు రేవు అవార్డు అందుకొంటున్నందుకు అభినందనలు.
బొల్లోజు బాబా

ప్రేమ...


చాన్నాళ్ళ తరువాత
చిన్ననాటి స్నేహితురాల్ని
కలిసాను
ఒకనాటి విఫల ప్రేమికురాలు
ఆమె.
ప్రేమించిన వాడి
పేరును
చేతిపై పచ్చబొట్టు
వేయించుకోవటాన్ని
వింతగా చెప్పుకొనేవాళ్ళం
అప్పట్లో!
హృదయంపై ఉండే
బార్‌ కోడ్‌ గీతలు ఒక్కొక్కటీ
కులానికి
మతానికి
అంతస్తుకి
ప్రతీకలని ఇప్పటికైనా
గ్రహించిందో లేదో!
బొల్లోజు బాబా

ఎవరు వీళ్లంతా?


ఏసుబాబు
వీరాస్వామి
లక్ష్మణరావు
పెంటయ్య
ఇంకా కొంతమందీ.... ఎవరు వీళ్ళంతా!
ఓ ముప్పై నిముషాల వ్యవధిలో
ధరాధిపతులు, నరహంతకులూ అనాదిగా
చేసిన కృత్యాలన్నీ అకృత్యాలేనని
ఒక్క తులసిదళంతో తేల్చిపారేసారు.
అంత చేసీ
ఒడ్డుకు లాక్కొచ్చిన ఇరవైఏడుమందిలో
ముగ్గురి ప్రాణాలు కాపాడలేకపోయామని
బాధపడుతున్నారు చూడు!
ఓ నా చిట్టి మేధావీ!
ఆ కొద్దిక్షణాలూ
బొట్టు, టోపీ, శిలువా, రోలెక్స్ వాచీ
ఏ తారతమ్యం లేదక్కడ
ఆ కొద్దిక్షణాలూ
మనం నిర్మించుకొన్న
గోడలన్నీ కుప్పకూలిపోయాయి
ఓ నా చిట్టి మేధావీ!
మరోసారి చెపుతున్నాను విను.
మానవత్వం ఒకటే
మునిగిపోతున్న ప్రాణానికి ప్రాణం పోసింది
మనిషితనం ఒకటే
మనిషిని మనిషితో బంధించింది.
మనిషి గమ్యం మనిషితనమే ఏనాటికైనా!
ఐస్ ఏజ్ నుంచి డిజిటల్ ఏజ్ దాకా
మానవజాతి నౌకాయానానికి
ఏ చరిత్రా గుర్తించని
కనిపించని తెడ్లు వీళ్ళు.
మనుషులుగా మనం పూర్తి వైఫల్యం
చెందలేదనటానికి మిగిలున్న
ఒకే ఒక సాక్ష్యం వీళ్ళు.
బొల్లోజు బాబా
(ఇటీవలి గోదావరి బోట్ ప్రమాదంలో అనేక ప్రాణాలు కాపాడిన స్థానికజాలరుల కొరకు)

పాబ్లో నెరుడా- బుక్ ఆఫ్ క్వశ్చన్స్ –The Book of Questions by Pablo Neruda


సెప్టెంబరు 1973 లో పాబ్లో నెరుడా చనిపోవటానికి కొద్దినెలల ముందు The Book of Questions పుస్తకాన్ని పూర్తిచేసాడు. విలియం ఓడెలి అనువాదంచేసిన ఈ పుస్తకం నెరుడా మరణానంతరం వచ్చింది.
దీనిలో చిన్ని చిన్ని కవితలు ప్రశ్నలరూపంలో ఉంటాయి. ఒక అనుభవం, దాని తాలూకు ఉద్వేగం వీటి లక్షణాలు. నెరుడా అప్పటికే గొప్పసాహిత్యాన్ని సృష్టించాడు భిన్న కళాత్మక, రాజకీయ ఆలోచనా సారాలలోతుల్ని తరచిచూసి పండిపోయిన కవి.
The Book of Questions లో ఈ లోకంపట్ల ఒక శిశువు ఆశ్చర్యాన్ని, పెద్దవాళ్ల తర్కాన్ని ఎదురెదురుగా నిలబెడ్తాడు. ఇవి మొత్తం 316 ప్రశ్నలు. 74 పేరులేని ఖండికలుగా ఉంటాయి. కొన్ని ప్రశ్నలకు తార్కిక సమాధానాలు దొరకవు.
నదులన్నీ తీయగా ఉన్నప్పుడు
సముద్రం ఉప్పుని ఎక్కడనుంచి తెచ్చుకొందీ?
పై ప్రశ్నలో నదులు, తీయదనం, సముద్రము, ఉప్పు లాంటి పదాలకు వాటి నైఘంటికార్ధాలు కాక ఏదో తెలియని కొత్త అర్ధాల్ని పొందుతాయి.ఆలోచింపచేస్తాయి. ప్రజలందరూ ప్రేమాస్పదులుగా ఉంటున్నప్పుడు ప్రజాస్వామ్యం క్రూరంగా ఎందుకుంటున్నదీ అని పై ప్రశ్నకు చేసే అన్వయం ఔచిత్యభంగం కాబోదు.
ఈ పుస్తకంలో నెరుడా ఊహలోకపు అంచుల్ని తాకుతాడు. ఇలాకూడా ఊహించవచ్చా అని విస్మయపరుస్తాడు. హృదయాన్ని, బుద్దిని జోడుగుర్రాలుగా నడిపించి గొప్ప విభ్రమాత్మక వాక్యాలను సృష్టిస్తాడు.
ఈ పుస్తకంలో నెరుడాని ఒక రాజకీయ కవిగానో, ప్రేమకవిగానో, ప్రకృతి కవిగానో, పశ్చాత్తాప కవిగానో చూడలేం. “నాలోనే అనేకులు ఉన్నారు” అని ఓ కవితలో అన్నట్లు జీవితంలోని అనేకతను, చీకటి వెలుగుల్ని కవిత్వంలో నింపిన కవి నెరుడా.
నెరుడా తనలోని వైరుధ్యాల పట్ల ఎరుకను కలిగి ఉన్నాడు. వాటిని యధాతధంగా స్వీకరించాడు. మానవజీవితం క్షణక్షణం మనముందు పరిచే అన్ని అనుభవాలకూ స్పందించాడు. ఇరుకు దారులనుంచి, ప్రమాదకరమైన సరళీకరణలనుంచీ, సిద్ధాంతాలనుంచీ, అహంకారంనిండిన ఆత్మస్తుతినుంచీ తన కవిత్వాన్ని విముక్తం చేసాడు. జీవితాన్ని పెనవేసుకొనే మానవానుభూతులకు కలకాలం నిలిచే కళాత్మక రూపాన్ని ఇచ్చాడు.
(పాబ్లోనెరుడా సృష్టించిన మహావిస్త్రుతమైన ఆ కళాత్మకరూపం ఈరోజు మొత్తం మూడువేల పేజీల చిక్కని కవిత్వ రూపంలో మనముందు ఉంది)
The Book of Questions లోని మొత్తం 316 ప్రశ్నలలో నాకు నచ్చిన వాటి అనువాదాలు ఇవి.
1.
స్వర్గంలో ఎన్ని చర్చిలు ఉంటాయి?
2.
రాత్రి టోపీకి
అన్ని చిల్లులెందుకున్నాయి?
3.
ఏ కలతచెంది అగ్నిపర్వతాలు
జ్వాలల్ని, ఉగ్రతను, ఉదాసీనతను చిమ్ముతాయి?
4.
బయటపడని కన్నీటిచుక్కలు
చిన్నచిన్న తటాకాలలో ఎదురుచూస్తుంటాయా?
లేక అవి అదృశ్య నదులుగా విషాదం వైపు ప్రవహిస్తుంటాయా?
5.
ఈ ఉదయించిన సూర్యబింబం నిన్నటిదేనా?
లేక ఈ తేజస్సు ఆ తేజస్సు కన్నా భిన్నమైనదా?
6.
ఇంతకీ నవంబరు వయసు ఎంత?
7.
రాతియుగం మనుషులు
కనిపించని సిరాతో ఎందుకు వ్రాసుకొన్నారు?
8.
దోమలు, సాహిత్యరక్షకభటులు
నన్నెందుకు కుడతాయి?
9.
నారింజ చెట్టులోని సూర్యకాంతిని
నారింజలు ఎలా పంచుకొంటాయి?
10
దానిమ్మ గింజల రసంతో
ఎర్రని కెంపులు ఏం చెప్పాయీ?
11.
శుక్రవారం తరువాత వద్దాములే అని
గురువారం ఎందుకు ఆలోచించుకోదు?
12
పిట్టనుండి పిట్టకు ఎగురుకుంటూ తిరిగే
పువ్వుని ఏమని పిలుస్తారు?
13
సముద్ర మధ్యభాగం ఎక్కడుంటుంది?
అలలు అక్కడికి ఎందుకు వెళ్లవు?
14
4 అందరికీ 4 గేనా
అన్ని ఏడులు సమానమేనా?
15
కలల్లో మోగే గంట
నీకెక్కడ దొరుకుతుందీ?
16
దుఃఖం దళసరిగాను
మనోవ్యధ తాటగాను ఉంటుందంటారు నిజమేనా?
17
ధనవంతులు తమ స్వప్నాలను
బంగారు పెట్టెలలో భద్రపరచుకొంటారా?
18.
నా ఎముకలు చిలీలో నివసిస్తూంటే
నేనెందుకు అక్కడనుంచి వలసవెళ్ళాలని అనుకొన్నాను?
19
చెగువెరా రాత్రి తరువాత
బొలివియాలో ఎందుకు ఉదయం రాలేదు?
20
చెట్టు ఆకాసంతో మాట్లాడటానికి
భూమి నుంచి ఏ భాష నేర్చుకొందీ?
21
ఇంధ్రధనసు ఎక్కడ అదృశ్యమౌతుంది
నీ హృదయంలోనా, దిగంతాలలోనా?
22
స్వప్నాలలోని వస్తువులు ఎక్కడకు వెళ్లిపోతాయి?
ఇతరుల స్వప్నాలలోకా?
23
ఒకప్పుడు నేనొక బాలుడిని . వాడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు?
నాలోనా లేక వెళ్ళిపోయాడా?
విడిపోవటం కోసమే అయితే మేమిద్దరం అంతకాలం ఎందుకు కలిసున్నాం?
నా బాల్యం చచ్చిపోయాకా మేమిద్దరం ఎందుకు చనిపోలేదు?
24
డిసెంబరు, జనవరిల మధ్య వచ్చే నెల పేరేమిటి?
25
పిచ్చుకలు చంద్రునిపైకి వలసపోతాయన్న వార్తలు నిజమేనా?
అవి వసంతాన్ని వాటితో పాటూ తీసుకుపోతాయా?
26
నేను నిద్రపోతున్నప్పుడు
నాకు బదులు ఎవరు బయటకు వెళ్ళి జీవిస్తారూ?
27
మనం దయను నేర్చుకొంటామా
లేక దయ ముసుగునా?
28
గతించిన కాలాన్ని
ఏ కిటికీలోంచి అలా చూస్తూ ఉండగలనూ?
29
ప్రేమ గురించిన ఆలోచనలు
చల్లారిన అగ్నిపర్వతాలలోకి కూలిపోతాయా?
30
రుతువులకు తమ దుస్తులు మార్చుకోవాలని
ఎలా తెలుస్తుంది?
నవంబరు వయసెంత లాంటి చమత్కార వాక్యాల నుండి స్వర్గంలో ఎన్ని చర్చిలు ఉంటాయి? లాంటి గంభీరమైన అంశాలదాకా ఈ ప్రశ్నలు ఉన్నాయి.
ఈ ప్రశ్నలకు వివిధ విమర్శకులు అనేక వ్యాఖ్యానాలు చేసారు. ఉదాహరణకు ఒక శ్రామికుడు నాలుగు గంటల పనిచేస్తే దక్కే ప్రతిఫలం ఒక ధనవంతుడు నాలుగు గంటలు పని చేస్తే వచ్చే ప్రతిఫలంతో సమానం కాదు అనే విషయం 14వ ప్రశ్నచెపుతుందని అంటారు.
ఒక యూదుగాధలో- జీవితానికి అర్ధం ఏమిటని కొడుకు తండ్రిని అడిగినపుడు, “ఏదో ఓ జవాబు తెలుసుకొని, అంత గొప్ప ప్రశ్నను ఎందుకు నాశనం చేస్తావు? అని తండ్రి అన్నాడట. అలా పై ప్రశ్నలకు జవాబులు ఆశించటం, వెతుక్కోవటం నిష్ఫలం. ప్రశ్నను ఆస్వాదించటం, అనుభూతి చెందటం ముఖ్యం ఇక్కడ. బహుసా నెరుడా ఉద్దేశం కూడా అదే కావొచ్చు.
బొల్లోజు బాబా

1857 సిపాయిల తిరుగుబాటు మొదటి స్వాతంత్ర్య పోరాటమా?

సిపాయిల తిరుగుబాటు మొదటిదీ కాదు స్వాతంత్ర్యపోరాటమూ కాదు.

ఈస్ట్ ఇండియా కంపనీ (వ్యాపారుల కూటమి) 31 డిసంబరు, 1600 లో క్వీన్ ఎలిజబెత్ I నుంచి ఒక రాజపత్రం ద్వారా అనుమతి తీసుకొని భారతదేశంలో వ్యాపారం చేయటానికి అడుగుపెట్టింది. మొదట్లో దీనికి రాజ్యాధికారం చెలాయించాలనే కోరిక లేదు కానీ కాలక్రమేణా స్థానిక రాజకీయాలలో కలగచేసుకొని రాజ్యాలను ఆధీనంలోకి తెచ్చుకోవటం మొదలుపెట్టింది. సొంత సైన్యాన్ని ఏర్పాటుచేసుకొంది.

1803 లో ఈస్ట్ ఇండియా కంపనీ వద్ద రెండున్నరలక్షల "ప్రెవేట్ సైన్యం" ఉండేది. అప్పటి బ్రిటన్ ప్రభుత్వ సైన్యం సంఖ్యకు ఇది రెట్టింపు.

ఈస్ట్ ఇండియా కంపనీ యుద్ధాలు చేసింది. రాజుల్ని ఓడించింది. వారసులు లేని రాజ్యాలను ఆక్రమించుకొంది. తన "ప్రెవేట్ సైన్యం" సహాయంతో కప్పాలను వసూలు చేయటం మొదలెట్టింది. 1850 నాటికి భారతదేశంలోని మూడొంతుల భూభాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొంది.

అలా ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనం 1857లో సిపాయిల తిరుగుబాటు వరకూ కొనసాగింది. సిపాయిల తిరుగుబాటు ఉదంతంతో విక్టోరియారాణి ఈస్ట్ ఇండియా కంపనీని రద్దు చేసి బారతదేశాన్ని 1858లో తన పాలనలోకి ( క్రౌన్ పాలనలోకి) తీసుకొంది. అప్పటినుంచి 1947 దాకా సాగిన పాలనను బ్రిటిష్ రాజ్ అని చరిత్రకారులు పిలుస్తారు.

ఈ క్రమంలో భారతదేశంలో 1858 వరకూ జరిగింది - వ్యాపారస్తుల కూటమి ప్రెవేట్ సైన్యాన్ని ఏర్పరచుకొని జరిపిన ఆధిపత్యమే తప్ప ఒక ప్రజాస్వామ్యయుత, రాజ్యపాలన కాదు. అసలు అది ప్రభుత్వమే కాదు.

1858 నుంచి జరిగినది వ్యవస్థాగతంగా, చట్టాలకు లోబడి జరిగిన రాజ్య/ప్రభుత్వ పాలన.
****

సిపాయిల తిరుగుబాటే దేశంలో జరిగిన మొదటి తిరుగుబాటా?

వేలసంవత్సరాలుగా రాజు పేరుమీద ఉండిన భూమిహక్కులు ఒక్కసారిగా కంపనీకి దఖలు పడ్డాయి. ఆ భూమిని సాగుచేసుకొంటూ ఉన్న భూస్వాములకు పించను ఏర్పాటుచేసి వారిని తొలగించింది కంపనీ. ఈ చర్యతో అంతవరకూ ఒక హార్మొనీతో నడచిన సమాజం పెద్ద కుదుపుకు లోనైంది. నిజానికిది నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఆధారిత ఫ్యూడల్ సమాజం.

ఈస్ట్ ఇండియా కంపనీ వారి దుశ్చర్యలను ప్రతిఘటిస్తూ 1857కు ముందునించీ అనేక ప్రాంతాలలో తిరుగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి

కట్ట బొమ్మన తిరుగుబాటు, తమిళనాడు (1792-1799)
పైకుల తిరుగుబాటు, ఒరిస్సా (1804-1806)
వేలు తంబి తిరుగుబాటు, కేరళ (1808 - 1809)
కిట్టూరు తిరుగుబాటు, కర్ణాటక (1824-29)
బుందేల్ తిరుగుబాటు, మధ్య ప్రదేష్ (1842)
వీరభద్రరాజు తిరుగుబాటు, విశాఖపట్నం (1827-1833)
పాలకొండ తిరుగుబాటు, తూర్పుగోదావరి (1831-1832)
పర్లాకిమిడి తిరుగుబాటు, ఒరిస్సా (1829-35)

పై తిరుగుబాట్లన్నీ
తమతమ అధికారాలను నిలుపుకోవటానికి
భూమిపై తమ పెత్తనాన్ని కొనసాగించటానికి
ఇతర వ్యక్తిగతకారణాలతో
స్థానికంగా జరిగాయే తప్ప దేశభక్తి, స్వాతంత్ర్యకాంక్ష లాంటి జాతీయ భావాలతో దేశమంతా విస్తరించి జరగలేదు.

1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటు వీటన్నిటికన్నా పెద్దది. ఇది బ్రిటిష్ వారిని గడగడలాడించింది. ఇది కూడా వ్యక్తిగత కారణాల కోసమే జరగడం గమనార్హం.

ఈ తిరుగుబాటులో బెంగాల్ సైనిక పటాలం ఒక్కటే పాల్గొంది. మద్రాసు బొంబాయి సైనికులు పాల్గొనలేదు. బ్రిటిష్ సైనికులకు మూడురెట్లు ఎక్కువ జీతం ఇస్తున్నారనే అనే కారణం ప్రధానంగా కనిపిస్తుంది వారి తిరుగుబాటుకు

సిపాయిల తిరుగుబాటుకు మద్దతు పలికిన నాయకులకు కల వ్యక్తిగత కారణాలు ఇలా ఉన్నాయి.

1. బహదూర్ షా II అప్పటికి రాజ్యం లేని మొఘల్ చక్రవర్తి. మొఘల్ రాజ్య పునస్థాపనకొరకు యత్నించాడు.

2. నానాసాహెబ్ కు పించను తగ్గించారు. కంపనీవారితో చేసిన చర్చలు ఫలించలేదు.

3. కంపనీ వారు రాణి లక్ష్మి బాయి దత్తతకుమారుడిని వారసునిగా గుర్తించలేదు

4. బెంగాల్ సైనికులు మొఘల్ రాజ్యాన్ని స్థాపించటం లక్ష్యంగా పెట్టుకొంటే, నానాసాహెబ్, తాంతియాతోపెలు మరాఠా రాజ్యాన్ని స్థాపించాలని తలచారు. ఈ వైరుధ్యం తిరుగుబాటు వైఫల్యానికి ప్రధాన కారణం.

5. సిపాయిల తిరుగుబాటుకు ఆధ్యుడుగా భావించే మంగళ్ పాండే ఒపియం ఎక్కువగా తీసుకొని ఉద్రేకితుడై బ్రిటిష్ అధికారిని చంపాడని రికార్డులద్వారా తెలుస్తుంది.

అందుకనే జవహర్ లాల్ నెహ్రూ 1857 తిరుగుబాటుని ఫ్యూడల్ శక్తులు సమాజంపై తమ పట్టుని నిలుపుకోవటానికి చేసిన ఒక ప్రయత్నమని అన్నాడు.
****

1857 సిపాయిల తిరుగుబాటుని ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం అని మొదట ఎవరు అన్నారు?
The Indian War of Independence (1909) అనే పుస్తకంలో వీర్ సావార్కర్ 1857 నాటి సిపాయిల తిరుగుబాటుని మొదటి స్వాతంత్ర్యపోరాటంగా అభివర్ణించాడు. ఆయన సమకాలీనులు, చరిత్రకారులు ఆ వాదనను అప్పట్లోనే ఖండించారు.

వీరిలో ప్రముఖ చరిత్రకారుడు శ్రీ R.C Majumdar ముఖ్యుడు. భారతీయ మధ్యతరగతి వర్గాలు ఇంగ్లీషు చదువులు చదువుకొని, అంతర్జాతీయ పరిణామాలను అర్ధం చేసుకొని స్వాతంత్ర్య పోరాటానికి దేశాన్ని సమాయుత్తపరిచారని మజుందార్ అంటాడు.

1905 లో బెంగాల్ విభజన జరిగినపుడు దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని "మొదటి స్వాతంత్ర్య సంగ్రామం" అని మజుందార్ అభిప్రాయపడ్డాడు.

బెంగాల్ విభజనను దేశవ్యాప్తంగా జాతీయవాదులు వ్యతిరేకించారు. ఈ విభజన వ్యతిరేక ఉద్యమం/ వందేమాతర ఉద్యమం/స్వదేశీ ఉద్యమంగా మారి భారతదేశ ప్రజలను సంఘటితం చేసి బ్రిటిష్ పాలన నుండి దేశాన్ని విముక్తం చేయాలన్న కోర్కెను వారిలో రగిల్చింది. .

రవీంద్రనాథ్ ఠాగూర్, సురేంద్రనాథ్ బెనర్జి, సుబ్రహ్మణ్య భారతి, అరవింద్ ఘోష్, ముట్నూరి కృష్ణారావు, చిదంబరం పిళ్లై లాంటి ప్రముఖులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. పైన పేర్కొన్న ప్రముఖుల పేర్లను గమనిస్తే

1. ఈ ఉద్యమం మొత్తం దేశవ్యాప్తంగా జరిగినట్లు అర్ధమౌతుంది.

2. వారికి పరాయిపాలన నుండి దేశాన్ని విముక్తి చేయాలన్న కోరిక తప్ప మరేవిధమైన వ్యక్తిగత ప్రయోజనాలు కనిపించవు.
****

బ్రిటిష్ పార్లమెంటు 1784 లో చేసిన పిట్స్ ఇండియా యాక్టు ద్వారా కంపనీ మెంబర్లు సివిల్, మిలటరీ, రెవిన్యూ హక్కులు తెచ్చుకొన్నారు. (వీళ్ళే అక్కడ ఎలైట్ వర్గాలు). దాంతో మరింత రెచ్చిపోయారు. ఆ తరువాత వచ్చిన 1813, 1833 ల నాటి చార్టర్ల ద్వారా కంపనీ అతిని కొంతమేరకు నియంత్రించటానికి ప్రయత్నించింది బ్రిటిష్ పార్లమెంటు.

1857 తిరుగుబాటులో 6 వేల మంది బ్రిటిషర్లు చనిపోవడం ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన అరాచకాల ఫలితమని బ్రిటష్ పార్లమెంటులో Benjamin Disraeli వాదించిన ఫలితంగా భారతదేశం క్రౌన్ పాలనలోకి వచ్చింది. ఆ రకంగా సిపాయిల తిరుగుబాటుకి ఉన్న చారిత్రక ప్రాధాన్యత తక్కువేమీ కాదు.

1857 నాటి తిరుగుబాటునే ప్రధమ స్వాతంత్ర్య పోరాటంగా అంగీకరించటానికి ఇన్ని మతలబులు ఉన్నప్పుడు .......1847 లో పించను తగ్గించారని చేసిన ఒక ఉక్రోషపు తిరుగుబాటును "తొలి స్వాతంత్ర్యపోరాటం" అని ప్రచారించుకొంటూంటే ఆశ్చర్యంగా ఉంది.

బొల్లోజు బాబా