Sunday, November 16, 2014

అందరూ
ఉత్తపేర్లేనట
అనాచ్ఛాదిత ఆత్మలు
బయటపడేలా
ఈ పేర్లను
బండకేసి తోమాలి
బొల్లోజు బాబా

Saturday, November 15, 2014

1816 నాటి తెలుగు సమాజం - రంగుల చిత్రాలలో

రవివర్మ కు ముందు హిందూ దేవతల చిత్రాలు ఎలా ఉండేవో అంటూ ఎక్కడో చర్చ జరిగింది. 1816 లో M.Leger, Jean Amable అనే ఫ్రెంచి దేశస్థులు వేసిన కొన్ని చిత్రాల లింకు ఇది. ఇందులో మహిషాసురమర్ధిని, భక్తకన్నప్ప, వివిధ కులవృత్తులు, సారాతయారీ, పైపుతాగుతూ రాట్నం వడికే స్త్రీ, కసరత్తులు చేస్తున్న స్త్రీ, పురుషులు వంటి చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇవి తెలుగునాట చిత్రించబడటం మరో విశేషం. ఒకరకంగా టైమ్ మెషిన్ లో ప్రయాణించినట్టుంది నాకైతే. (క్లిక్ చేస్తే పెద్దవిగా కనిపిస్తాయి)
http://gallica.bnf.fr/…/12148/btv1b2300743r.r=telinga.langEN

Friday, November 14, 2014

చదువులు


స్వచ్ఛమైన
సెలయేరు
పొర్లుతూ దొర్లుతూ
నదిని చేరేసరికి
నిలువెల్లా
మురికి మురికి
బొల్లోజు బాబా

Thursday, October 30, 2014

నీటిపొర

తాగుడు పై సదభిప్రాయం లేకపోయినా
దురభిప్రాయం మాత్రం ఉండేది కాదు
అదో పురాతన విలాసం కదాని

కానీ
మొన్నోరోజు మా కాలేజీలో
ఓ విద్యార్ధిని తండ్రి తన కూతుర్ని
నలుగురెదుటా బూతులు తిడుతూ
అవమానించినపుడు
ఆమె కనుల నీటిపొరలో
తాగుబోతు తండ్రులందరూ
దగ్ధమైపోవాలనుకొన్నాను

“కొయిటా అమ్మ నా పేర్న పంపించే
డబ్బుల కోసమే ఇదంతా” అని ఆ అమ్మాయి అన్నప్పుడు
ఆ నీటిపొరలో ఈ మద్యప్రపంచం
కొట్టుకు పోవాలనుకొన్నాను

గత ఘర్షణల గాయాల్ని చూపించినపుడు
ఆ నీటిపొరలో ఈ మదపు నేల నిలువునా
కృంగి పోవాలనుకొన్నాను

సముద్రాన్నీదటానికి
పూచికపుల్లంత నమ్మకాన్ని తప్ప
ఏమివ్వగలిగాం? ఆరోజా అమ్మాయికి
*****
మూడ్రోజుల తరువాత
ముత్యాల్లాంటి అక్షరాలతో ఎసైన్మెంట్
రాసుకొచ్చిన ఆ అమ్మాయి
కనుల నీటిపొరలో ఎన్నెన్ని సౌందర్యాలు !


బొల్లోజు బాబా

Thursday, October 23, 2014

దీపావళి


కవులు దీపాల్లాంటి వారు
దీపారాధనలో
ఒక దీపం వందదీపాలను
వెలిగించినట్లుగా
కవి ఒక ఆలోచనను
సమాజంపై చల్లి
వేనవేల చైతన్య దీపాల్ని
పండిస్తాడు
ఈ ప్రపంచంలో ఎక్కడో, ఎప్పుడో ఏదో ఓ మూలనుంచి
చీకట్లోంచో లేక ఆకట్లోంచో
కవి కాంతి బొట్లుగా కాలంలోకి ప్రవహిస్తాడు
ఆకాశం నక్షత్రయుతమౌతుంది
నేల హరితకాంతుల్ని పొందుతుంది
దారితప్పిన అలలు దీపస్థంభాన్ని కనుగొంటాయి
కవి దీపధారా లేక
దీపమే కవిధారా అనేది
ఎవరూ తేల్చలేరు
ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తూంటుంది
దీపం వ్యక్తికి దారిచూపిస్తే
కవి సమాజానికి దారి
చూపిస్తూంటాడు
అందుకే నాకెవరైనా
కవి కనిపిస్తే
నడుస్తున్న దీపావళిని
చూసినట్లుంటుంది.
బొల్లోజు బాబా
(నిన్న కాకినాడలో "తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం" ఆధ్వర్యంలో దీపావళి సందర్భంగా జరిగిన కవి సమ్మేళనంలో చదివిన కవిత)

Sunday, August 31, 2014

నీలాగ ఒకడుండేవాడు పుస్తకం చదివాకా.......



ఈ లోకంలో నీలాగ ఉండేవారు ఏడుగురుంటారని మా నాయినమ్మ చెప్పేది.  ఇన్నాళ్లకు ఒకడు తారసపడ్డాడు "నీలాగే ఒకడుండేవాడు" పుస్తకంలో.

"నీలాగ ఒకడుండేవాడు" అనేది నందకిషోర్ వ్రాసిన 178 పేజీల కవిత్వ సంకలనం పేరు.   "నీలాగే ఒకడుండేవాడు" అనే వాక్యంలో ఇద్దరున్నారు.  ఒకడు వర్తమానం నుంచీ, మరొకడు గతంలోంచి.  వర్తమానం, గతాల  కలబోతే కదా కవిత్వం.

వైయక్తిక అనుభవాన్ని సార్వజనీనం చేసాడో లేక సార్వజనీన అనుభవాన్ని వైయక్తిక అనుభూతిగా పరిచయం చేస్తున్నాడో పట్టుకోలేకపోయాను కానీ,  చాలా వాక్యాలలో నాకు నేను దొరికాను.  వెతుక్కుంటే ఆ వాక్యాలలో మిమ్మల్ని మీరుకూడా పోల్చుకోగలరని నా నమ్మకం.
కవిసంగమం లో అప్పుడప్పుడూ నందకిషోర్ కవితల్ని చదివినప్పుడు అతని కవిత్వం "కలల ప్రపంచం" గా అనిపించేది.  సంకలనంగా చదివినప్పుడు అతను నేలమీదే ఉన్నాడని, మట్టినే గానం చేస్తున్నాడని అర్ధమైంది.

నందకిషోర్ కవిత్వంలో కనిపించే భావుకత ప్రకాశవంతంగా ఉంటుంది.  ఏ మరుగులూ, మర్మాలు లేకుండా తేటగా, సూటిగా అనిపిస్తుంది.  కొన్ని పోలికల్ని భలే పట్టుకొన్నాడే అనిపిస్తుంది.  ఈ సంకలనం నుంచి నాకు నచ్చిన కొన్ని వాక్యాలు.
1. చీకట్లోంచి చీకట్లోకి వెలుగు దారులమీద మన ప్రయాణం

2. మూడొంతులు కన్నీళ్ళు, ఒకవంతు దేహం

3. నీకు రెక్కలున్నాయని తెలిసి
        పక్షి వనుకొన్నా, నిజం
        ప్రవాహానికి ఎదురీదే
        చేపవని తెలిసీ
        ఇప్పుడుకూడా
        ఎగరమంటానా? చెప్పు

4. ఐ యామ్నాట్ ఫేక్ అని
        అని గట్టిగా అరవాలనిపిస్తోంది..
        నువ్వుగుర్తొచ్చిన ప్రతీసారీ

5. పూవుల బాషలో మాట్లాడడం
        గువ్వలభాషలో పాడడం
        పిల్లల భాషలో పదాలల్లటం కాదు
        మనుషుల భాషలో నటించటం నేర్చుకోవాలి.

6. మాటలనిండా చీకటి
        తెరలు తెరలుగా ఉదయిస్తుంటుంది.

7. ఎండిన యేరులో ఈదలేక
        తడవని పడవల్ని నడపలేక
        ఎగరని గువ్వల్ని కదపలేక
        ఏరిన గింజల్ని విసరలేక
        ఎవరికీ చెప్పకుండా
        ఎవర్నీ అడగకుండా
        ఎక్కడో గుట్టుగా
        ఉరివేసుకు చనిపోయాడు  (నీలాగ ఒకడుండే వాడు)

8. దేవీ
        ఎప్పటిలాగే, ఈ రోజు కూడా
        మెలకువ చివరి అంచువరకి
        ఎదురుచూస్తుంటే
        గడువు తీరిపోయింది
        నీవు రాలేదు

ఈ సంపుటికి పెట్టిన “నీలాగ ఒకడుండే వాడు” అనే పేరు చదివేవారిని చాలా బలంగా లోనికి లాక్కొంటుంది. ఈ వాక్యంలో ఉన్నది నేనే కదూ, ఈ కవిత నాగురించే కదూ అని అనుకొనేలా చేస్తుంది. ఒక కవికి అంతకు మించి విజయం ఏముంటుంది?

ఇక చివరగా నందకిషోర్ మాటల్లోనే......
........ ఇంతకు ముందులా రాయలేనందుకు ఎప్పుడో ఒకసారి బాధపడతాను.  ఇంతకుముందులా బాధలేనందుకు  ఎందుకో కాస్తంత రాసి చూస్తాను.  ఇంతకు ముందులా బతుకులేనందుకు అప్పుడూ ఇప్పుడూ నవ్వుకొంటాను.  ఎంతకాలమనే ప్రశ్నలు తగిలి ఒంటరిగా ఒక్కన్నే ఏడ్చిచూస్తాను........

ఈ పుస్తకాన్ని ఇచ్చిన తమ్ముడు కాశి రాజు కి ధన్యవాదాలు.  అన్నిటికీ మించి ఈ పుస్తకాన్ని కోరంగి మడఅడవి లో కూర్చొని చదవటం ఒక గొప్ప అనుభూతి. :-)

నందకిషోర్ గారికి అభినందనలతో

భవదీయుడు
బొల్లోజు బాబా

Monday, April 21, 2014

అతిశయం


అన్ని నిర్ణయాలు
ముందే అయిపోయాయి
ఏదో కాలక్షేపానికి
జీవించాలి అంతే!

పుట్టినపుడు
మతాన్ని బట్టి
గ్రహాలు పైకీ క్రిందకూ మారతాయి
కులాన్ని బట్టి
తారలు అటూ ఇటూ సర్దుకొంటాయి
కుటుంబాన్ని బట్టి
రాశిచక్రం రూపుదిద్దుకొంటుంది

కలహాలు, ప్రేమలు
పోటీలు, పధకాలు
అన్నీ మనది కాని
ఏదో ప్రణాళికలో భాగాలే
ఆఖర్న మరణం కూడా.

అయినప్పటికీ
ఓ మొగ్గ విరిసినా
ఓ తుమ్మెద వాలినా
ఓ డొలక రాలినా
ఈ చెట్టుకెంత తహ తహ!
వెలుగుని బంధించాననుకొనే
ఈ పత్రాలదెంత అతిశయం!


బొల్లోజు బాబా

అతిశయం


అన్ని నిర్ణయాలు
ముందే అయిపోయాయి
ఏదో కాలక్షేపానికి
జీవించాలి అంతే!

పుట్టినపుడు
మతాన్ని బట్టి
గ్రహాలు పైకీ క్రిందకూ మారతాయి
కులాన్ని బట్టి
తారలు అటూ ఇటూ సర్దుకొంటాయి
కుటుంబాన్ని బట్టి
రాశిచక్రం రూపుదిద్దుకొంటుంది

కలహాలు, ప్రేమలు
పోటీలు, పధకాలు
అన్నీ మనది కాని
ఏదో ప్రణాళికలో భాగాలే
ఆఖర్న మరణం కూడా.

అయినప్పటికీ
ఓ మొగ్గ విరిసినా
ఓ తుమ్మెద వాలినా
ఓ డొలక రాలినా
ఈ చెట్టుకెంత తహ తహ!
వెలుగుని బంధించామనుకొనే
ఈ పత్రాలదెంత అతిశయం!


బొల్లోజు బాబా
అతిశయం
అన్ని నిర్ణయాలు
ముందే అయిపోయాయి
ఏదో కాలక్షేపానికి
జీవించాలి అంతే!

పుట్టినపుడు
మతాన్ని బట్టి
గ్రహాలు పైకీ క్రిందకూ మారతాయి
కులాన్ని బట్టి
తారలు అటూ ఇటూ సర్దుకొంటాయి
కుటుంబాన్ని బట్టి
రాశిచక్రం రూపుదిద్దుకొంటుంది

కలహాలు, ప్రేమలు
పోటీలు, పధకాలు
అన్నీ మనది కాని
ఏదో ప్రణాళికలో భాగాలే
ఆఖర్న మరణం కూడా.

అయినప్పటికీ
ఓ మొగ్గ విరిసినా
ఓ తుమ్మెద వాలినా
ఓ డొలక రాలినా
ఈ చెట్టుకెంత తహ తహ!
వెలుగుని బంధించాననుకొనే
ఈ పత్రాలదెంత అతిశయం!


బొల్లోజు బాబా