ఈ లోకంలో నీలాగ ఉండేవారు ఏడుగురుంటారని మా నాయినమ్మ చెప్పేది. ఇన్నాళ్లకు ఒకడు తారసపడ్డాడు "నీలాగే ఒకడుండేవాడు" పుస్తకంలో.
"నీలాగ ఒకడుండేవాడు" అనేది నందకిషోర్ వ్రాసిన 178 పేజీల కవిత్వ సంకలనం పేరు. "నీలాగే ఒకడుండేవాడు" అనే వాక్యంలో ఇద్దరున్నారు. ఒకడు వర్తమానం నుంచీ, మరొకడు గతంలోంచి. వర్తమానం, గతాల కలబోతే కదా కవిత్వం.
వైయక్తిక అనుభవాన్ని సార్వజనీనం చేసాడో లేక సార్వజనీన అనుభవాన్ని వైయక్తిక అనుభూతిగా పరిచయం చేస్తున్నాడో పట్టుకోలేకపోయాను కానీ, చాలా వాక్యాలలో నాకు నేను దొరికాను. వెతుక్కుంటే ఆ వాక్యాలలో మిమ్మల్ని మీరుకూడా పోల్చుకోగలరని నా నమ్మకం.
కవిసంగమం లో అప్పుడప్పుడూ నందకిషోర్ కవితల్ని చదివినప్పుడు అతని కవిత్వం "కలల ప్రపంచం" గా అనిపించేది. సంకలనంగా చదివినప్పుడు అతను నేలమీదే ఉన్నాడని, మట్టినే గానం చేస్తున్నాడని అర్ధమైంది.
నందకిషోర్ కవిత్వంలో కనిపించే భావుకత ప్రకాశవంతంగా ఉంటుంది. ఏ మరుగులూ, మర్మాలు లేకుండా తేటగా, సూటిగా అనిపిస్తుంది. కొన్ని పోలికల్ని భలే పట్టుకొన్నాడే అనిపిస్తుంది. ఈ సంకలనం నుంచి నాకు నచ్చిన కొన్ని వాక్యాలు.
1. చీకట్లోంచి చీకట్లోకి వెలుగు దారులమీద మన ప్రయాణం
2. మూడొంతులు కన్నీళ్ళు, ఒకవంతు దేహం
3. నీకు రెక్కలున్నాయని తెలిసి
పక్షి వనుకొన్నా, నిజం
ప్రవాహానికి ఎదురీదే
చేపవని తెలిసీ
ఇప్పుడుకూడా
ఎగరమంటానా? చెప్పు
4. ఐ యామ్నాట్ ఫేక్ అని
అని గట్టిగా అరవాలనిపిస్తోంది..
నువ్వుగుర్తొచ్చిన ప్రతీసారీ
5. పూవుల బాషలో మాట్లాడడం
గువ్వలభాషలో పాడడం
పిల్లల భాషలో పదాలల్లటం కాదు
మనుషుల భాషలో నటించటం నేర్చుకోవాలి.
6. మాటలనిండా చీకటి
తెరలు తెరలుగా ఉదయిస్తుంటుంది.
7. ఎండిన యేరులో ఈదలేక
తడవని పడవల్ని నడపలేక
ఎగరని గువ్వల్ని కదపలేక
ఏరిన గింజల్ని విసరలేక
ఎవరికీ చెప్పకుండా
ఎవర్నీ అడగకుండా
ఎక్కడో గుట్టుగా
ఉరివేసుకు చనిపోయాడు (నీలాగ ఒకడుండే వాడు)
8. దేవీ
ఎప్పటిలాగే, ఈ రోజు కూడా
మెలకువ చివరి అంచువరకి
ఎదురుచూస్తుంటే
గడువు తీరిపోయింది
నీవు రాలేదు
ఈ సంపుటికి పెట్టిన “నీలాగ ఒకడుండే వాడు” అనే పేరు చదివేవారిని చాలా బలంగా లోనికి లాక్కొంటుంది. ఈ వాక్యంలో ఉన్నది నేనే కదూ, ఈ కవిత నాగురించే కదూ అని అనుకొనేలా చేస్తుంది. ఒక కవికి అంతకు మించి విజయం ఏముంటుంది?
ఇక చివరగా నందకిషోర్ మాటల్లోనే......
........ ఇంతకు ముందులా రాయలేనందుకు ఎప్పుడో ఒకసారి బాధపడతాను. ఇంతకుముందులా బాధలేనందుకు ఎందుకో కాస్తంత రాసి చూస్తాను. ఇంతకు ముందులా బతుకులేనందుకు అప్పుడూ ఇప్పుడూ నవ్వుకొంటాను. ఎంతకాలమనే ప్రశ్నలు తగిలి ఒంటరిగా ఒక్కన్నే ఏడ్చిచూస్తాను........
ఈ పుస్తకాన్ని ఇచ్చిన తమ్ముడు కాశి రాజు కి ధన్యవాదాలు. అన్నిటికీ మించి ఈ పుస్తకాన్ని కోరంగి మడఅడవి లో కూర్చొని చదవటం ఒక గొప్ప అనుభూతి. :-)
నందకిషోర్ గారికి అభినందనలతో
భవదీయుడు
బొల్లోజు బాబా
No comments:
Post a Comment