మాధురి అంతర్జాల పత్రికలో ప్రచురితమైన నా కవిత. మిత్రులు శ్రీ ఉండవల్లి ఎమ్ గారికి ధన్యవాదములు.
.
నీటిరంగుల సాయింత్రం
.
అందమైన కాన్వాస్ పై
సూర్యాస్తమయ దృశ్యాన్ని చిత్రించాను
రెండు కొండలు మధ్య
పండిన నారింజలా సూర్యబింబం,
వెండి అంచులతో మెరిసే మబ్బులు,
గూళ్ళకు చేరే పక్షులు
చిన్న కొలను దాని మధ్యలో కలువపూలు
అలలపై ఏటవాలు సూర్యకిరణాలు
రెక్కలమధ్య తలదాచుకొని ధ్యానముద్రలో కొంగ
ఒడ్డున పచ్చిక, పొదలు, దూరంగా రెండు కొబ్బరి చెట్లూ
అద్భుతంగా వచ్చింది చిత్తరువు
బ్రష్ మొనను నోటిలో ఉంచుకొని
పళ్ళమద్య ఆడిస్తూ
ఆ నీటిరంగుల చిత్రాన్ని, దాని సౌందర్యాన్ని
గొప్ప ఆరాధనతో ఆస్వాదిస్తూ
తదేకంగా ఆలా చూస్తూనే ఉండిపోయాను చాలాసేపు
చిత్తరువు కింద సంతకం చేద్దామనుకొనే లోపు
పండిన నారింజలాంటి సూర్యుడు
రెండుకొండల మధ్యలో అస్తమించాడు.
వెన్నెల నావనెక్కి వచ్చిన రాత్రి లోకి
నీటిరంగు వెలుగుల ఇంద్రజాలం అదృశ్యమైంది.
బొల్లోజు బాబా
No comments:
Post a Comment