Thursday, October 6, 2022

తొలితరం స్త్రీల అనుభవాలూ అనుభూతులూ....... శ్రీ దాట్ల దేవదానం రాజు



నేనెంతో అభిమానించే కవి కథకుడు శ్రీ దాట్లదేవదానం రాజు గారు నా పుస్తకంపై రాసిన ఆత్మీయ వాక్యాలు.
ధన్యవాదాలు రాజు గారు మీ ప్రేమకు
థాంక్యూ సర్
బొల్లోజు బాబా




తొలితరం స్త్రీల అనుభవాలూ అనుభూతులూ...


చరిత్ర, సామాజిక విశ్లేషకుడు బొల్లోజు బాబా. అంతే గాక కవీ, కవితానిర్మాణ పద్ధతులను విప్పి చెప్పే భాష్యకారుడు కూడా. ఇంకా అవన్నీ ప్రవృత్తులు. వృత్తిరీత్యా జీవశాస్త్రాధ్యాపకుడు. మొన్న బాబా వచ్చినపుడు నేను లేను. ఇంటికొచ్చి ఎంతో అందంగా మరెంతో తేలిగ్గా మరింకెంతో వినూత్న ఆకారంలో థేరీ గాథలు పుస్తకం చూసి ఆనందించాను. ఒకసారి తిరగేశాను. 

పుస్తకం చివర ముప్పై రెండు పేజీల ఎండ్‌ నోట్సు ఉంది. దీన్ని ఎలా చదవాలో అపుడే ఒక నిర్ణయానికి వచ్చేశాను. తప్పో ఒప్పో తెలీదు గానీ ముందు పుట్‌నోట్సు చదివి దాని నెంబరు ఆధారంగా థేరీ గాథలు చదవడం మొదలెట్టాను. అంటే ఎడమ చేతివేళ్లతో పేజీని ఎంచుకుని కుడి చేతి బొటనవేలు చూపుడువేలు మధ్య ముగింపు సమాచారం చదివిన తర్వాత థేరీలను చదివానన్నమాట. ఇదో గమ్మత్థైన పఠనానుభవం. ఇలా చదవడం మొదలెట్టాక మరోలా చదవడం సాధ్యం కాలేదు
.
నా ఉద్దేశంలో అనుసృజన అంటే ఇంతకంటే తేలిగ్గా భావప్రసారాన్ని చేయలేం అనిపించేలా వాక్యాల్ని రాయడం. సుబోధకంగా ఉండటం, అన్వయ క్లిష్టత లేకుండా చూసుకోవడం, నేటివిటీని సాధించి ఇది మన భాషే అనిపించేలా అనుసృజయించాలి. బొల్లోజు బాబా ఈ విషయంలో విజయం సాధించాడు.
 
ఒక సాధారణ స్త్రీ మౌలిక అనుభవాలే థేరీ గాథలు. ఆ స్త్రీ సంపన్నవర్గానికి చెంది ఉండొచ్చు లేదా పామర మధ్యతరగతి అయ్యుండొచ్చు. ఆ అనుభవాలకు కవితారూపంగా అర్థం చేసుకున్నాను.

ఎప్పటి సమాజం లోంచి ఇవి పుట్టుకొచ్చాయి. ఆ స్థితి ఇప్పుడుందా? అయినా గానీ అప్పటికీ ఇప్పటికీ స్త్రీ తాలూకు మనోభావాలకు దర్పణంగానే ఉన్నాయి. భిన్న సామాజిక నేపథ్యం లోంచి వచ్చినవి. కొన్ని గాథలు పునరుక్తుల్లా ఉండటంలో అనుసృజనకారుడు నిమిత్తమాత్రుడని నేను భావిస్తున్నాను.

బాధ్యతలు తీరింతర్వాత సన్యసించడం సరే ఎంపిక చేసుకున్న వరుడు చనిపోతే బలవంతంగా సన్యసింపచేయడాన్ని ఇందులో చూస్తాం. ఎక్కువ మంది అభాగినులు కుటుంబ కట్టుబాట్లలో ఇమడలేక జన్మరాహిత్యం కోసం పాకులాడటమూ కనిపిస్తుంది. కుటుంబ సభ్యులందర్నీ కోల్పోయిన పటాచర, ఇట్టే యవ్వనం కరిగిపోయడాన్ని గమనించిన అమ్రపాలి, తనూ తల్లీ ఒకే మగాడికి భార్య అని తెలిసి శరీర కోరికలకు దూరమవ్వాలని తలచిన ఉత్పలవణ్ణ, తన కళ్ళను మోహించిన కుర్రాడికి కళ్లనే పెకిలించిన శుభ

మనసును ఎలా నిగ్రహించుకున్న దంతిక...ఇలా ఎందరో భిక్షుణి అవతారం ఎత్తిన స్త్రీలు వారి గాథలూ ఇందులో వింటాం. ఇదంతా స్వచ్ఛమైన కవిత్వరూపంలోనే ఉన్నాయా అంటే నేను చెప్పగలిగేది కాదు.దేహం నిజస్వరూపం తెలిసాక ప్రశాంతత లభించడం అనేది ఇందులోని సగటు స్త్రీకి కలిగిన అనుభవంగా చూస్తాం. 

నాకు మొత్తం థేరీలు చదివాక కారణం తెలియదు గానీ నా మనసులో ఎందుకో వైరాగ్య భావనలు చెలరేగాయి. ఇది తప్పే లేదా నా బలహీనత కావచ్చు. జీవితం నీటిబుడగ అనీ దేహవాంఛలు తాత్కాలికమని ప్రశాంతమైన మార్గాల్ని ఎన్నుకోవాలనిపించింది.

బొల్లోజు బాబా నమ్మకమైన మంచి దారి ఎన్నుకున్నాడు. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. చారిత్రక పరిశోధనల అంచుకు చేరి మహాద్భుతాలు సృష్టించాలని ఎవరికీ తెలియని విషయాల్ని వెలికితీసి మంచి ఫలితాల్ని పొందాలని కోరుకుంటున్నాను. శ్రమించి థేరీగాథల్ని వెలువరించిన బాబాకు నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను- 

దాట్ల దేవదానం రాజు





No comments:

Post a Comment