Sunday, October 9, 2022

ప్రాచీన తమిళమతాలు

ప్రాచీన తమిళమతాలు
.
చోళులది ఏ మతం అని చర్చకు వచ్చినపుడు, అప్పట్లో హిందూమతమే లేదు అనే వాదన చేయటానికి కారణం, తమిళులకు బలమైన సాంస్కృతిక, ఆథ్యాత్మిక చారిత్రిక నేపథ్యం ఉండటమే. ఈ వాదనను పిడివాదం గానో, సంకుచిత వాదమనో భావించలేం. స్థానికంగా ఉండే బహుళతను విచ్చిన్నం చేసి, ప్రజలను సామాజికంగా ఒకరిమీదకు మరొకర్ని ఉసిగొల్పే హిందుత్వాను నిలువరించటానికి చేస్తున్న వాదనగా దీన్ని చూడాలి.
ఉత్తరభారతానికి చెందిన జైనం, బౌద్ధం, వైదిక మతాలు తమిళనేలపైకి ప్రవేశించేనాటికే ఇక్కడి ప్రజలకు తమవైన దేవుళ్ళు, తమవైన ఆథ్యాత్మిక మార్గాలు (మతం) ఉన్నాయి. వీటి ప్రస్తావన తమిళులు అత్యంత పవిత్రమైనదిగా భావించే తొల్కాప్యం అనే గ్రంధంలో కనిపిస్తుంది.
తొల్కాప్యం అంటే ఆదికావ్యం అని. ఇది రాయబడిన కాలం BCE 5,320 నుండి CE 8 వ శతాబ్దం వరకు ఉండొచ్చని కొద్దిమంది తమిళ చరిత్రకారులు క్లెయిమ్ చేసుకొన్నప్పటికీ, BCE మూడవ శతాబ్దం నుండి CE 8 వ శతాబ్దం మధ్య దీని రచన జరిగి ఉండవచ్చునని అధికులు అంగీకరించారు.
***
తమిళుల ప్రాచీన ఆరాధనా విధానాలు/మతాలు:
తమిళ భూమి 5 ప్రాంతాలుగా విభజించబడింది. అవి అడవులు, పర్వతాలు, వ్యవసాయ భూమి, సముద్రతీరం, బీడుభూములు.
అడవులకు మయోన్, పర్వతాలకు సేయోన్, వ్యవసాయభూమికి వెందాన్, సముద్రతీరానికి వరునమ్ అనే పేర్లు కల అధిపతులు ఉంటారని వారిని ఆయా ప్రాంత ప్రజలు పూజించి ప్రసన్నం చేసుకొనేవారని తమిళ తొల్కాప్యంద్వారా అర్ధమౌతుంది.
తొల్కాప్యం లో విజయాలను ఇచ్చే దేవతగా కొట్టవ్వై (అవ్వయార్) అనే స్త్రీ మూర్తి కలదు.
తొల్కాప్యంలో శివపెరుమాన్ పేరుతో శివుని ప్రస్తావన ఉంది. లింగరూపంలో శివుని ఆరాధన జరిగినట్లు ప్రాచీన తమిళ గ్రంధాలలో కనిపించదు.
***
ఉత్తరభారత మతాలు క్రమేపీ దక్షిణభారతం వైపు విస్తరించినపుడు మొదటగా జైనం క్రమేపీ బౌద్ధం వచ్చింది.
చీలికలు పేలికలు ఉన్న వివిధ వైదిక ఆరాధనాపద్దతులను ఏకం చేసే ప్రయత్నంలో - ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు సూర్యుడు, శివుడు, విష్ణుమూర్తి, విఘ్నేశ్వర, పార్వతీదేవి లను ప్రధాన దేవతలుగా చేసి ఆరాధించే పంచాయతన పద్దతిని ప్రవేశపెట్టాడు. వివిధ ఆరాధన పద్దతులు ఏకం అవ్వటంతో బలమైన హిందూమత భావన ఏర్పడింది.
శంకరాచార్యుడు అఖండ భారతావని అంతా తిరిగి హిందుధర్మాన్ని ప్రచారం చేసి, అనేకచోట్ల పండిత చర్చలు జరిపి ఆలయాలు స్థాపించి-హిందూమతానికి ఒక వ్యవస్థీకృత రూపాన్ని తీసుకొచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే నేడు మనం హిందూమతంగా అనుకొంటున్న జీవన విధానం ఎనిమిదో శతాబ్దం నుంచి మొదలైందని చెప్పవచ్చు.
అంతకు ముందు భిన్న ఆరాధనా పద్దతులు బౌద్ధం, జైనం లతో సహా కలిసి సహజీవనం చేసేవి. రాజులు కూడా బౌద్ధ ఆరామాలకు, జైన బసతులకు, హిందూ దేవాలయాలకు ఏ రకమైన వివక్షా లేకుండా దానదర్మాలు ఇచ్చేవారని అనేక శాసనాలు తెలియచేస్తున్నాయి. ఎప్పుడైతే అన్నింటినీ కలిపి హిందూమతం అనే ఒక చట్రంలో బిగించాలనే ప్రయత్నం జరిగిందో బౌద్ధ-వైదిక, జైన-శైవ, శైవ-వైష్ణవ వర్గాల మధ్య ఘర్షణలు తప్పలేదు. చరిత్ర వాటన్నింటినీ రికార్డు చేసింది.
***
రాజరాజ చోళుడు శ్రీలంకను జయించటాన్ని శ్రీరాముడు, లంకను జయించటంగాను, ఇతనిని రామునితో సమానమైన హిందూ రాజు అంటూ కొందరు హిందుత్వ వాదుల చేస్తున్న వ్యాఖ్యలు ఎవరికైనా చికాకు తెప్పించక మానవు. ముఖ్యంగా వారి సంస్కృతి భిన్నమైనది అని చెప్పుకొనే ద్రవిడులకు ఇలాంటి వాదన Safronizing their culture గా అనిపించకమానదు. 

ఇంతటి చరిత్ర కలిగిన తమిళ ఆరాధన విధానాలలోని బహుళతను విస్మరించి - శైవులైనప్పటికి జైన, బౌద్ధ, వైష్ణవ, శాక్తేయ మతాలను సమాదరించిన చోళులను హిందుత్వా అనే చట్రం లో బిగించటానికి చేస్తున్న ప్రయత్నాలు భావజాల ఘర్షణలకు దారి తీస్తున్నాయి.  లింగాయత్ లు తాము హిందూమతానికి చెందిన వారము కాదని సుప్రీం కోర్టులో కేసు నడుపుతున్నారు. చోళులు శైవులు, వారు హిందువులు కాదు అనే స్టేట్మెంట్ ఆషా మాషీ స్టేట్మెంట్ కాదు.  


బొల్లోజు బాబా

No comments:

Post a Comment