Monday, October 10, 2022

కాకినాడ ఆత్మను ప్రతిబింబించే రచన-అలనాటి కోకనాడ



శ్రీ గొడవర్తి సత్యమూర్తి గారు రచించిన అలనాటి కాకినాడ అనే పుస్తకంపై నేను చేసిన పరిచయ వ్యాసం. ఇది సాహిత్య ప్రస్థానం, అక్టోబరు, 2022 సంచికలో ప్రచురింపబడింది. ఎడిటర్ సత్యాజీ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
ఈ పుస్తకావిష్కరణ రోజున నా అభిమాన రచయిత శ్రీ యండమూరిగారి సమక్షంలో ప్రసంగించటం మరచిపోలేని గొప్ప జ్ఞాపకం.
బొల్లోజు బాబా
.
కాకినాడ ఆత్మను ప్రతిబింబించే రచన-అలనాటి కోకనాడ
.
కాకినాడ చుట్టూ చారిత్రిక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. వాటి చరిత్రపై ఇప్పటికే అనేక మంది పుస్తకాలు వెలువరించారు. పక్కనే ఉన్న పిఠాపురం చరిత్రపై పి.వి. పరభ్రహ్మ శాస్త్రి, కందుకూరి ఈశ్వర దత్తు, కురుమెళ్ళ వెంకటరావు, శ్రీరాం వీరబ్రహ్మకవి లాంటి చరిత్రకారులు గొప్ప లోతైన పుస్తకాలను రచించారు.
రాజమహేంద్రవరం చరిత్రను శ్రీచిలుకూరి వీరభద్రరావు, శ్రీభావరాజు వెంకట కృష్ణారావు, శ్రీబేతవోలు రామబ్రహ్మం గ్రంధస్థం చేసారు. కోరంగి చరిత్రను శ్రీ పొన్నమండ రామచంద్రరావు వెలువరించారు.
పెద్దాపురం, సామర్లకోట చరిత్రలను శ్రీ వత్సవాయి రాయజగపతివర్మ గారు రికార్డు చేసారు. ఇటీవల శ్రీ వంగలపూడి శివకృష్ణ పెద్దాపురం చరిత్రను పుస్తకరూపంలోకి తీసుకొని వచ్చారు.
ద్రాక్షారామం ఆలయచరిత్రపై SrI Y V Ramana , శ్రీ మారేమండ రామారావు, శ్రీ జాస్తి దుర్గాప్రసాద్ లు పుస్తకాలు వెలువరించారు. శ్రీ దాట్లదేవదానం , ఈ వ్యాసకర్త యానాం చరిత్రను గ్రంధస్థం చేసారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే- Nothing has really happened until it has been recorded అంటారు ప్రముఖ రచయిత్రి వర్జీనియా వుల్ఫ్. అలా చూసుకొన్నప్పుడు చరిత్రను రికార్డు చేయటం అనేది ఎంతటి అవసరమైన ప్రక్రియో అర్ధమౌతుంది.
 
1. కాకినాడ చరిత్రపై మొదటి పుస్తకం ఈ “అలనాటి కోకనాడ”

గొప్ప చారిత్రిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల మధ్య ఉన్నప్పటికీ కాకినాడ పట్టణ సమగ్ర చరిత్రను తెలిపే పుస్తకం ఇంతవరకూ రాలేదు. 1917 లో అనసూయ అనే పత్రికలో “కాకినాడపుర పూర్వచరిత్ర” పేరుతో ఒక వ్యాసం వచ్చింది.
కల్నల్ మెకంజి అనే బ్రిటిష్ అధికారి 1815-16 లలో ఈ ప్రాంతపు స్థానిక చరిత్రలను సేకరించి కైఫియ్యతుల రూపంలో భద్రపరిచాడు. వాటిలో రాజమహేంద్రవరం, సామర్లకోట, సర్పవరం, జల్లూరు ఉన్నాయి తప్ప కాకినాడ కైఫియ్యతు లేదు.
ఆ లోటును ఈ పుస్తకం భర్తీ చేస్తుంది. ఆ విధంగా శ్రీ గొడవర్తి సత్యమూర్తి గారి కృషి ఎంతో విలువైనది. చారిత్రాత్మకమైనది. తూర్పుగోదావరి జిల్లా చరిత్రకు సంబంధించి ఈ పుస్తకం ఒక గొప్ప జోడింపు.
***
కాకినాడకు సంబంధించిన అత్యంత ప్రాచీనమైన ప్రస్తావన మూడవ విష్ణువర్ధనుడు (క్రీశ.709-746) వేయించిన ఈపూరు శాసనంలో కనిపిస్తుంది. దానిలో కేశవశర్మ అనే బ్రాహ్మణునికి దానంగా ఇచ్చిన భూమి సరిహద్దులు ఇలా చెప్పబడ్డాయి.
“పోల్నాడు విషయే జలయూరు నామ గ్రామే పశ్చిమదిశాయాం ఏలియేరునదీ పశ్చిమతః ప్రభాకరక్షేత్రోత్తర కాకండివాడ క్షేత్రపూర్వతః….
పోల్నాడువిషయ అంటే నేటి పిఠాపురం తుని పెద్దాపురం ప్రాంతాలు, జలయూరు అంటే నేటి జల్లూరు, ఏలియేరునది అంటే నేటి ఏలేరునది, కాకండివాడ అంటే నేటి కాకినాడ. పై శాసనం ఆధారంగా ఎనిమిదవ శతాబ్దంలో కాకినాడ కాకండివాడ పేరుతో వ్యవహరింపబడిందని గుర్తించవచ్చు.
ఆ తరువాత కాకినాడ ప్రస్తావన పదిహేనో శతాబ్దం వరకూ ఎక్కడా కనిపించదు. పద్నాలుగో శతాబ్దంలో ఈ ప్రాంతంలో సంచరించిన శ్రీనాథుడు – పిఠాపురం, ద్రాక్షారామం, చాళుక్యభీమవరం, కోటిపల్లి, భైరవపాలెం, పట్టిసీమ, పలివెల లాంటి ప్రాంతాల గురించి చెబుతాడు తప్ప కాకినాడ ప్రస్తావన చేయలేదు. అంటే అప్పటికి కాకినాడ ప్రాముఖ్యత కలిగిన ఊరుగా రూపుదిద్దుకొని ఉండకపోవచ్చు.
రాజమహేంద్రవరం కైఫియ్యతులో కాకినాడ కాకినాడుగా చెప్పబడింది. క్రీశ.1450 ప్రాంతంలో మట్టుపిల్లివారు అనే కమ్మవారు, క్రీశ.1500ల ప్రాంతంలో చిట్నీడి ధర్మారాయినిం అనే వెలమవారు క్రీశ.1670 లలో చంద్రారాయిణింగారు ఈ కాకినాడు ప్రాంతాన్ని జమిందారీ చేసినట్లు మెకంజీ కైఫియ్యతుల ద్వారా తెలుస్తుంది. ఈ చంద్రారాయణింగారి వారసులే నేడు మనం చెప్పుకొనే పిఠాపురం జమిందారులు.
 
2. ఆసక్తికర సంఘటనల సమాహారం ఈ పుస్తకం

చరిత్ర రచన అనేది చాలా శ్రమతో కూడుకొన్నది. శక్తియుక్తులను హరించివేసే పని అది. ఎందుకంటే నేడు మనముందు అపారమైన సమాచారం ఉంది. దేన్ని సేకరించాలి, ఎంతవరకూ సేకరించాలి, సేకరించిన వాటిని ఎలా ఒక వరుసక్రమంలో అమర్చుకోవాలి అనే విషయాలు కత్తిమీద సాములాంటివి. ఈ పుస్తకం చదివితే ఆ పనిని శ్రీ గొడవర్తి సత్యమూర్తి గారు సమర్ధవంతంగా నిర్వర్తించారని అర్ధమౌతుంది. శ్రీ సత్యమూర్తిగారు ఐదేళ్లుగా ఎంతో ఓపికగా ఈ పుస్తక సమాచారాన్ని సేకరించారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా శోధించి, నిర్ధారించుకొన్న తరువాతే ఈ పుస్తకరూపంలోకి తెచ్చారు. అందుకనే దీనిలోని ప్రతివ్యాసానికి గొప్ప సాధికారికత వచ్చింది. ఇందులో ఎక్కడా అభూతకల్పనలు, అసత్యాలు, వక్రీకరణలు, హిస్టారికల్ ఇన్ కన్సిస్టెన్సీస్, హిస్టారికల్ ఫాలసీస్ లాంటివి లేకపోవటం సత్యమూర్తి గారి అకుంఠితమైన కృషికి, అనన్యసామాన్యమైన ప్రతిభకు, ఖచ్చితత్వానికి నిదర్శనం.
ఈ పుస్తకంలో ఇతరులు రాసిన కొన్ని వ్యాసాలు ఉన్నాయి. వాటిని యధాతధంగా మూలరచయిత పేరుతోనే ఈ పుస్తకంలో చేర్చారు. ఆ వ్యాసంలోని ముఖ్యాంశాలను గ్రహించి తిరిగి కొత్తగా తిరగరాయటం, ఎన్నో ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్న సత్యమూర్తి గారికి పెద్ద కష్టమైన పని కాదు. కానీ వీరు అలా చేయకపోవటం వీరి మంచితనం. నిజాయితీ. సత్యసంధత.
చరిత్రపుస్తకాలకు ప్రధానంగా ఉండాల్సినవి సంఘటనల క్రమం మరియు తదనంతరకాలంలో ఆ సంఘటనల వల్ల ప్రభావితమైన పరిణామాలు. అలనాటి కోకనాడ పుస్తకంలోని వ్యాసాలను 8 చాప్టర్లుగా విభజించారు. ఇలా విభజించటం వలన మంచి రీడబిలిటీ వచ్చిందీ పుస్తకానికి.
***
విలక్షణమైన నగరం పేరుతో ఉన్న మొదటి చాప్టర్ లో కాకినాడ ప్రాచీన చరిత్రను క్రీస్తుశకం ఏడో శతాబ్దం నుండి 1839 సంవత్సరంలో వచ్చిన కోరంగి తుఫాను వరకూ సవివరంగా చెప్పారు. చరిత్రగమనంలో కాకినాడ పాత్రను ఈ విభాగం సోదాహరణంగా వివరిస్తుంది.
రెండవ చాప్టరు పేరు అపురూప కట్టడాలు. ఈనాటికి నిలిచి ఉన్న డచ్ వారి నిర్మాణాలు, కలక్టర్ భవనము, పురపాలక భవనం, విక్టోరియా వాటర్ వర్క్స్ లాంటి కలోనియల్ బిల్డింగుల గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని పొందుపరిచారు. ఈ విభాగంలో మొత్తం 11 వ్యాసాలున్నాయి.
పరాయిపాలనలో నగరం అనే విభాగంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన కాకినాడ బాంబుకేసు, కాకినాడ దొమ్మీకేసు, ఇంగ్లీషు క్లబ్ ధ్వంసం లాంటి సంఘటనల పూర్వాపరాలు ఉత్కంఠ కలిగేలా వర్ణించారు.
స్వరాజ్య సైనికులు పేరుతో ఉన్న విభాగంలో స్వాతంత్రపోరాటంలో పాల్గొన్న అలనాటి యోధులైన మహర్షి బులుసుసాంబమూర్తి, మల్లిపూడి పళ్ళంరాజు, చెలికాని రామారావు, మర్ల అప్పయ్యశాస్త్రి లాంటి వారి గురించి అరుదైన సమాచారాన్ని పొందుపరచారు. ఈ విభాగంలో 10 వ్యాసాలున్నాయి.
విద్యాలయాలు పేరుతో ఉన్న అయిదో విభాగంలో పి.ఆర్. కళాశాల, ఆంధ్రా పాలిటెక్నిక్, మెక్లారిన్ హైస్కూల్, రంగరాయ మెడికల్ కాలేజ్, సిబిఎమ్ పాఠశాల ఎమ్.ఎస్ ఎన్. కళాశాల లాంటి వివిధ విద్యాలయాల ఆవిర్భావం, అభివృద్ధి, వాటి విశిష్టతలను తెలుపుతూ మొత్తం 20 వ్యాసాలు ఉన్నాయి.
అలనాటి సంస్థలు అనే ఆరో చాప్టరులో బాంక్ ఆఫ్ మద్రాస్, ఆంధ్రసాహిత్య పరిషత్, ప్రభుత్వ ఆసుపత్రి, కోకనాడ చాంబర్ ఒఫ్ కామర్స్, సరస్వతి గానసభ, యంగ్మెన్స్ లైబ్రేరి, బ్రహ్మసమాజమందిరం, ఈశ్వర పుస్తక భాంఢాగారం, గాంధిభవన్, టౌన్ హాల్, కాస్మొపాలిటన్ క్లబ్ లాంటి అనేక సంస్థల పుట్టు పూర్వోత్తరాలు వాటి చరిత్రను మొత్తం 32 వ్యాసాలలో అత్యంత ఆసక్తికలిగే విధంగా చెప్పారు. ఇవన్నీ దాదాపు వందా నూట యాభై ఏండ్లుగా నడిచిన ఇంకా నడుస్తున్న సంస్థలు.
ఈ సంస్థల చరిత్ర, కాకినాడ సమాజ నిర్మాణంలో ఇవి పోషించిన పాత్ర చదువుతున్నప్పుడు, మన ముందుతరం వారి క్రాంతదర్శనం, వారు చేసిన సాంఘిక సేవ మనకు అర్ధమౌతుంది. మనం ఇంకా ఎంత ఉన్నతంగా జీవించవచ్చో ప్రేరణ కలిగిస్తుంది.
ఎందరో మహానుభావులు పేరుతో ఉన్న చాప్టరులో శ్రీ మల్లాడి సత్యలింగనాయకర్, పిఠాపురం మహారాజ వారు, బుర్రా వెంకటప్పయ్య, లంకలపిల్లి రామారావు, వింజమూరి సిస్టర్స్, కృత్తివెంటి పేర్రాజు పంతులు, డా.లక్కరాజు సుబ్బారావు, దురిశేటి శేషగిరిరావు, పైడా వెంకట నారాయణ, లాంటి లబ్దప్రతిష్టులైన స్థానికుల జీవితాలను ఛాయామాత్రంగా స్పృశిస్తూ మొత్తం 24 వ్యాసాలు ఉన్నాయి.
ఇక చివరగా అలనాటి జ్ఞాపకాలు పేరిట ఉన్న విభాగంలో ఉన్న కాకినాడ పురపాలక సంఘానికి చైర్మన్ లుగా వ్యవహరించినవారి జాబితా, పార్లమెంటు సభ్యుల, శాసన సభ్యుల వివరాలు, వివిధ ప్రాంతాల పేర్లు ఎలా వచ్చాయో వంటి విశేషాలతో 15 వ్యాసాలు కలవు. ఇవి కాకినాడ ఉజ్వలవైభోగాన్ని తెలుపుతాయి.
నా ఊహలలో రేపటి కాకినాడ అనే పేరుతో వివిధ పట్టణ ప్రముఖులు చెప్పిన అభిప్రాయాలు ఈ పుస్తకం చివరలో పొందుపరచారు. వాటిలో కాకినాడ అత్యుత్తమనగరంగా రూపుదిద్దుకోవటానికి జె ఎన్ టి యు ప్రొఫసర్ డా. కె.వి.ఎస్. వి మురళికృష్ణగారు ఇచ్చిన కొన్ని సూచనలు ఇవి. వీటిపై నాయకులు దృష్టిపెడతారని ఆశిస్తాను.
*బీచ్ రోడ్డును అభివృద్ధి చేయాలి
* కోరంగి మడ అడవులను టూరిస్టు కేంద్రంగా తీర్చిదిద్దాలి
* ఆంధ్రుల సంస్కృతి, చరిత్రలను ప్రతిబింబించేలా కాకినాడలో మ్యూజియం నెలకొల్పాలి
* కాకినాడలో ఒకనాటి బ్రహ్మసమాజ మందిరంలాగ ప్రపంచంలోని 10 ప్రధాన మతాలకి సంబంధించిన ఆధ్యాత్మిక కేంద్రంను ఒకేచోట నిర్మించాలి
*బయో డైవర్సిటీ పార్క్ ను ఏర్పరచాలి

3. ముగింపు
ఒక ప్రాంత చరిత్రను చదివినపుడు ఆ ప్రాంతం ఏ మేరకు ప్రపంచ, దేశీయ పరిణామాలలో పాలుకొంచుకొంది అనే పరిశీలన చేసినపుడే ఆ రచన సమగ్ర రచన అనిపించుకొంటుంది.
ఈ పుస్తకం చదివినపుడు భిన్న కాలాలలో కాకినాడ తన అస్తిత్వాన్ని బలంగా చాటుకొందని అర్ధమౌతుంది.
క్రీస్తుశకం ఏడవ శతాబ్దంలో కాకినాడ జైన మతానికి చెందిన గొప్ప ఆథ్యాత్మిక కేంద్రమని, అనేక జైన ఆలయాలు ఉండేవని, వాటికి రెండవ విష్ణువర్ధనుడు కొన్ని భూములను దానం చేసాడని, అప్పట్లో ఇది కొకండ పర్రు పేరుతో వ్యవహరించబడిందని తెలుస్తుంది.
ఇంగ్లీషువారు ఇంజరం వద్దా, ఫ్రెంచి వారు యానాం వద్దా తమ గిడ్డంగులు నిర్మించుకొని వ్యాపారాలు చేస్తున్న సమయంలో 1734 లో Dutch వారు కాకినాడను స్థావరంగా చేసుకొని వ్యాపారాలు చేసి కాకినాడను ప్రపంచపటంలో నిలిపారు.
క్రీస్తుపూర్వం మూడో శతాబ్దం నుంచి క్రీస్తుశకం 19 శతాబ్దం వరకూ మనుగడలో ఉన్న కోరంగి ఓడరేవులో ఇసుక మేటలువేయటం వల్ల నిరుపయోగంగా మారినప్పుడు, కాకినాడ ఓడరేవు ఆ స్థానాన్ని భర్తీచేసి నేడు ఒక గొప్ప పోర్టుగా సేవలు అందిస్తున్నది
జాతీయోద్యమ సమయంలో కాకినాడలో జరిగిన భయంకరాచారి గారు జరిపిన కాకినాడ బాంబు కుట్ర కేసు, కాకినాడ దొమ్మీ కేసు దేశవ్యాప్తంగా పేర్గాంచాయి. ఎంతో మంది స్వాతంత్రోద్యమ కారులకు ప్రేరణగా నిలిచాయి.
శ్రీ మల్లాడి సత్యలింగనాయకర్ వీలునామా లో ఒక క్లాజ్ ఏమిటంటే ప్రతిఏటా ఒక విద్యార్ధిని ఉన్నత చదువులకొరకు విదేశాలకు పంపి ఆర్ధికసహాయం అందించటం. ఆ క్లాజ్ ద్వారా డా. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అమెరికాలో చదువుకొన్నారు. ఎల్లాప్రగడ సుబ్బారావుగారు కనిపెట్టిన టెట్రాసైక్లిన్ అనే మందు వలన కొన్ని కోట్లమంది ప్రాణాలు నిలిచిచాయి. బహుశా మానవాళికి అంతటి మేలు జరగబోతుందని శ్రీ మల్లాడి సత్యలింగనాయకర్ గారికి తెలిసే ఆ క్లాజ్ పెట్టి ఉంటారు.
కళా సాహిత్య రంగాలకు సంబంధించి- శ్రీ.రేలంగి, శ్రీ.ఎస్వీ రంగారావు, శ్రీమతి అంజలీ దేవి, శ్రీమతి.సూర్యాకాంతం, శ్రీరావు గోపాలరావు, శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ లాంటి ఆణిముత్యాలను కాకినాడ ప్రపంచానికి బహూకరించింది.
ప్రతీ ప్రాంతచరిత్రకు ఒక ఆత్మ ఉంటుంది. చరిత్రకారుడు ఆ ఆత్మను పట్టుకోవాలి. సత్యమూర్తి గారు కాకినాడ ఆత్మను పట్టుకొన్నారు. ఈ పుస్తకరూపంలో రికార్డు చేసారు. తన కాలాన్ని, మేధను వెచ్చించి ఇంతటి బృహత్ రచన గావించినందుకు కాకినాడ పౌరసమాజం వీరికి రుణపడింది. సత్యమూర్తిగారికి అభినందనలు.
బొల్లోజు బాబా

వెల: 300/-
పుస్తకం లభించుచోటు: గొడవర్తి కృష్ణకుమారి
3-16C-60, Union Bank Building
Shanti Nagar, Kakinada, 533003
Ph: 9949588222







No comments:

Post a Comment