ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారికి ధన్యవాదములు
థాంక్యూ సోమచ్ సర్.
బొల్లోజు బాబా
ఈ పుస్తకం ధర ₹150 + ₹30 పోస్ట్ ఖర్చులు. కావలసిన వారు 9848023384 కి కాల్ చెయ్యగలరు
.
చరిత్రను పొదువుకొన్న కవిత్వం-థేరీగాథలు
1. మీరు మౌలికంగా కవి అని అనుకుంటాను. చరిత్ర పట్ల మీ ఉద్వేగం చరిత్ర అధ్యయనం లో కనిపిస్తుంది. థేరీ గాథలు మిమ్మల్ని ఆకర్షించడానికి కారణం కవిత్వమా? లేక చరిత్రా?
జ. సాహిత్యంలో తొలిసారిగా నిక్షిప్తం చేయబడిన స్త్రీల హృదయస్వరాలు థేరీగాథలు. రెండున్నరవేల సంవత్సరాల క్రితపు థేరీ గాథలలోని కవిత్వం నేటికీ మన హృదయాల్ని కంపింపచేస్తుంది. ఆ కారణంగానే కావొచ్చు వీటిని అనువదించే సమయంలో గొప్ప అనుకంప పొందాను. ఆ కవిత్వం ఇచ్చే అనుభూతి కన్నా చరిత్రపరంగా ఆ గాథలద్వారా లభించే ఆనాటి సమాజం గురించిన సమాచారం మరింత విలువైనది అనుకొంటాను. ఇది వస్తువులకో సాహిత్యానికో ఉండే యాంటిక్ వాల్యూ లాంటిది కాదు. ఫెమినిజం విషయమై – స్త్రీపురుషులిద్దరూ సమానమేనని, పురుషాధిక్య పీడనను ఒదిలించుకోవటానికి ఒంటరిగానైనా జీవించవచ్చు అంటూ అప్పట్లోనే అంతటి పురోగమన భావాలను వ్యక్తం చేసిన సమాజం వాటన్నిటినీ కోల్పోయి ఇరవయ్యో శతాబ్దంలో పాశ్చాత్య సమాజాలనుండి ఫెమినిజం పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి రావటంలోని చారిత్రికపరిణామం పట్ల ఆసక్తి అది.
నీ నేత్రాలు అందంగా ఉన్నాయి అంటూ, తనను ప్రేమిస్తున్నానని వేధించే యువకునికి తన కనుగుడ్డును పెరకి నువ్వు ఇష్టపడే కన్ను ఇదిగో, ఇది శ్లేష్మంనిండిన గోళం అని చెప్పిన శుభ గొప్ప అసమానమైన ప్రతీకతో స్త్రీ దేహం సుఖాలకు నెలవు కాదు, స్త్రీ ఒక భోగవస్తువు కాదు అనే విషయాన్ని నిర్ధ్వంధ్వంగా ప్రకటించింది.
నేను స్వేచ్ఛనొందాను, మూడు కుటిల విషయాలనుండి, భర్త రోలు రోకలి – అంటూ ముత్త తన స్వేచ్ఛను, తన దేహంపై హక్కులను, తన శ్రమ విలువను తనకు తానే నిర్వచించుకొంటుంది. ఇలాంటి స్పష్టత కొరకు ఆధునిక మహిళ ఇంకా పోరాడుతూనే ఉంది.
2. దుఃఖం అనే మాట బౌద్ధంతో విడదీయరాని పదం. థేరీ గాథలలో స్త్రీల దుఃఖపు గాథల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?
జ. ఈ గాథలు చాలామట్టుకు దుఃఖాన్ని నేపథ్యంగా కలిగిన స్త్రీలుచెప్పుకొన్న అనుభవాలు. భర్తను మరో స్త్రీతో పంచుకోవటం, పుట్టిన సంతానం చనిపోవటం, కాపురంలో భర్త పెట్టే హింస, ప్రాణాలుతోడేసే కాన్పులు, సంసారంలో గొడ్డు చాకిరీ, భర్త చనిపోవటం లేదా వదిలేసిపోవటం, వార్ధక్యంలో పిల్లలు ఆస్తిలాక్కొని ఇంట్లోంచి గెంటేయటం లాంటి అనేక స్త్రీల దుఃఖాలు ఈ గాథలనిండా పరచుకొని ఉన్నాయి. “స్త్రీగా ఉండటమే ఒక దుఃఖం” అంటుంది కిసగౌతమి అంతిమంగా.
తాము సన్యసించటానికి ప్రధాన కారణాలు, దుఃఖ మూలాల అన్వేషణ, దుఃఖ నివారణ, దుఃఖం నుండి విమోచన చెందటం అని ఈ స్త్రీలు చాలా గాథలలో చెప్పుకొన్నారు. రాగ ద్వేష మోహాలను అధికమించిన స్థితి అయిన నిబ్బాణను సాధించటం జీవితాశయంగా భావించారు. “నా హృదయంలో దిగిన దుఃఖమనే అదృశ్యబాణాన్ని తథాగతుడు తీసివేసాడు” అని అనేకమంది థేరీలు ప్రకటించుకొన్నారు. తమ దుఃఖం బుద్ధుని బోధనల వల్ల తొలగిపోయిందని తొలితరం బౌద్ధ సన్యాసినులు చెప్పిన సాక్ష్యమే ఈ గాథలు.
3. భారతీయ సాహిత్యం మీద థేరీ గాథల ప్రభావం కొనసాగిందని భావించ వచ్చా?
జ. థేరీగాథలను ఒక సాహిత్య నెరేటివ్ గా భావిస్తే – విద్య, స్వేచ్ఛ, ఆథ్యాత్మిక సాధనలకు స్త్రీలు అర్హులని ప్రభోదించాయి. అప్పట్లో స్త్రీ పురుషునితో సమాన హోదాను పొందేదని అనేక గాథల ద్వారా అర్ధమౌతుంది. – “ధమ్మదిన్నా! రా నాపక్కన కూర్చుని విను, నేను సన్యసించదలిచాను, ఈ సంపదలకు నీవే వారసురాలవు, నీకు ఇష్టమైతే ఇక్కడే ఉండవచ్చు లేకపోతే మీ పుట్టింటికి వెళిపోవచ్చు” అంటూ ఒక భర్త భార్యతో చేసిన సంభాషణ ఈనాటికీ తాజాగానే ఉంది. కూతురు ఇసిదాసి కాపురం చెడిపోతూండటంతో రెండుసార్లు పునర్వివాహం చేస్తాడొక తండ్రి. నిన్నమొన్నటివరకూ పునర్వివాహం అన్నమాటే నేరం మన సమాజంలో. భర్త తనను చంపటానికి పన్నాగం పన్నాడని తెలుసుకొన్న భద్ధ, భర్తనే హత్యచేస్తుంది. హత్యచేయటం సమస్యకు పరిష్కారం కాకపోవచ్చు, కానీ అలాంటి ప్రమాదకర బంధంలోంచి నేడు ఎంతమంది ధైర్యంగా బయటకు రాగలుగుతున్నారనేది చర్చనీయం.
గాథాసప్తశతి, హరివిజయ, సేతుబంధ, గౌదావహొ, లీలావాయి, వజ్జాలగ్గ లాంటి ప్రాకృత రచనల నుండి సుమారు 3000 వరకూ అందమైన పద్యాలను వివిధ సంస్కృత అలంకార గ్రంథాలలోకి ఉదాహరణలుగా, ఇతర సంస్కృత కావ్యాలలో వర్ణనలుగా, తీసుకొన్నట్లు V.M. Kulkarni పరిశోధన చేసి తెలిపారు. థేరీ గాథలు కూడా అదే కోవకు చెందిన ప్రాకృత (పాలీ) రచన. కానీ థేరీ గాథలనుండి ఏ రకమైన భావాల సంగ్రహణ జరగకపోవటాన్ని బట్టి ప్రధాన స్రవంతి సాహిత్యం థేరీగాథలను ఫూర్తిగా విస్మరించిందనే భావించాలి. దీనికి కారణం కారణం భాష కాక భావజాలం అని అనుకోవచ్చు.
థేరీగాథల తదుపరి వచ్చిన భారతీయ సాహిత్యం స్త్రీపురుషులు ఇరువురూ సమానమే అనే భావననుండి దూరంగా జరిగి పాతివ్రత్యం, న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అనే భావజాలంలోకి జారిపోవటం గమనార్హం.
4. గాథాసప్తశతి, గౌడవహా, వజ్జలగ్గ, థేరీ గాథలు, ప్రాచీన భారతీయసాహిత్యంలో ఇవి ప్రధాన స్రవంతిగా కాక ఒక పాయగా వుండి నాయనిపిస్తుంది. దీని గురించి మీ అభిప్రాయం?
జ. చెప్పలేం. ఇవి బౌద్ధ, జైన మతాలతో సంబంధం ఉన్న ప్రాకృత రచనలు. ఎప్పుడైతే సంస్కృతం పండితభాషగా స్థిరపడిందో అప్పటినుంచి ప్రాకృత రచనలకు బదులు సంస్కృత కావ్యాలు రావటం మొదలైంది. ప్రాకృతభాష ఉత్థానపతనాలు ప్రాచీన భారతదేశ మతచరిత్రతో ముడిపడి ఉండటం ఆసక్తికరం. సాశ. 4వ శతాబ్దం నుండి సంస్కృతం భరతఖంఢంలో నలుమూలలకు విస్తరించ సాగింది. అంతవరకూ క్రతువులకు, మతసంబంధ రచనలకు పరిమితమై ఉన్న సంస్కృతం ఒక్కసారిగా రాజాశ్రయం పొంది రాజకీయభాషగా, సాహిత్యభాషగా మారటం దక్షిణ ఆశియా చరిత్రలో కీలక రాజకీయ, సామాజిక పరిణామంగా The Language of Gods అనే పుస్తకంలో Sheldon Pollock అభిప్రాయపడ్డాడు. ఈ వెల్లువలో అంతవరకూ ప్రధాన స్రవంతిగా ఉన్న ప్రాకృత రచనలు కొట్టుకుపోయి ఉండవచ్చ్చు.
నేడు తాళపత్ర గ్రంధాలను డిజిటైజ్ చేస్తున్నట్లుగానే ఆనాటికి ఉన్న ప్రాకృత రచనలలో మతప్రసక్తి లేని అంశాలను కొందరు పండితులు సంస్కృతభాషలోకి ఏదో మార్గం ద్వారా తీసుకొచ్చినట్లు పైన చెప్పిన V.M. Kulkarni పరిశోధన ధృవపరుస్తుంది.
5. ఈ రచన చేయటంలో మీ అనుభవాలు చెప్పండి
జ. మీకు గుర్తుందో లేదో చాన్నాళ్ళ క్రితం మీరు థేరీగాథలు చదివారా అని అడిగారు. అప్పటికి వాటిగురించి విన్నాను తప్ప చదవలేదు. నెట్ లో వెతికితే శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారి బ్లాగులో థేరీ గాథలపై వ్రాసిన అద్భుతమైన వ్యాసం కనిపించింది. మూలాల కోసం అన్వేషించాను. చాలానే కనిపించాయి. ఆనాటి స్త్రీలు, వారి జీవనం, చారిత్రిక నేపథ్యం చదువుతున్నప్పుడు గొప్ప అనుభూతికి లోనయ్యాను. దాని ఫలితమే నేడు మీ చేతిలో ఉన్న “థేరీగాథలు-తొలితరం బౌద్ధ సన్యాసినుల కవిత్వం” అనే పుస్తకం
థేరీ అంటే సన్యాసిని లేదా భిక్షుణి అని అర్ధం. తొలి తరం బౌద్ధ సన్యాసినులు తమ అనుభవాలకు ఇచ్చుకొన్న కవిత్వరూపమే థేరీ గాథలు. భిన్న సామాజిక నేపథ్యాలనుంచి వచ్చిన మొత్తం 73 మంది థేరీలు రాసుకొన్న 73 కవితలు ఇవి. మానవ దుఃఖం, వేదన, ముక్తికొరకు అన్వేషణ, తధాగతుని బోధనలలో దొరికిన సాంత్వన ఈ గాథల ప్రధాన ఇతివృత్తం. థేరీ గాథలు రెండున్నరవేల ఏళ్ళ క్రితపు సమాజాన్ని స్త్రీ దృక్కోణంలోంచి మనకు చూపిస్తాయి. ఈ పుస్తకం చివరలో ఒక్కో కవితయొక్క చారిత్రిక నేపథ్యాన్ని విపులంగా వివరించాను.
ఈ పుస్తక రచనా సమయంలో నాకు బౌద్ధ పరిభాష విషయంలో వచ్చిన అనేక సందేహాలను, ఎంతో ఓర్పుతో పూజ్య బిక్ఖు ధమ్మరక్ఖిత గారు తీర్చారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.
No comments:
Post a Comment