Sunday, October 2, 2022

"థేరీగాథలు".. వ్యథాభరిత వీచికలు - మార్ని జానకిరామ చౌదరి.



కాకినాడ సాహితీ మిత్రులలో సౌమ్యులు, కవి, సాహిత్యకార్యకర్త, అయిన శ్రీ మార్ని జానకీరామ్ చౌదరి గారు నా "థేరీ గాథలు" పుస్తకంపై రాసిన స్పందన ఇది. ఈ చక్కని సహృదయ వ్యాక్యాలు నాకు బహూకరించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను
బొల్లోజు బాబా

.

"థేరీగాథలు".. వ్యథాభరిత వీచికలు - మార్ని జానకిరామ చౌదరి.
.

రెండున్నర సహస్రాబ్దాలకు పూర్వం(2600 సం.కు పూర్వం) తొలితరం బౌద్ధ సన్యాసినులు/భిక్షుణిలు (బుద్ధుడి సమకాలికులు) తమ విషాదభరిత దుఃఖ గాథలను, తథాగతుడి బోధనలద్వారా చేకూరిన సాంత్వనను కవిత్వరూపంలో వ్యక్తీకరించారు. బహుశ ఇది ప్రపంచ సాహిత్య చరిత్రలోనే మహిళలచే చెప్పబడ్డ తొలి కవితాసంకలనంగా చెప్పుకోవచ్చు.

థేరీ గాథలు పాళీ భాషనుండి 1909 వ సంవత్సరంలో మొదటిసారిగా ఆంగ్లంలోనికి అనువదించబడ్డాయి. వీటిని చారిత్రక పరిశోధకులు, ప్రముఖ రచయిత శ్రీ బొల్లోజు బాబా గారు తులనాత్మకంగా పరిశీలించి, 73 మంది థేరీల గాథలను తెలుగు భాషలోకి అనుసృజన చేసారు. ఈ థేరీలందరూ అనేక సామాజిక వర్గాలకు చెందినవారు. సమాజంలోని బడుగు, బలహీన వర్గాలనుండి అంతఃపురంలోని రాజమాతల వరకూ ఉన్నారు.

నాటి సమాజంలో ప్రేమరాహిత్యంతో కూడిన వైవాహిక బంధంలో ఇమడలేని స్త్రీల దుర్భరమైన జీవనాన్ని, అనేకరకాలుగా కష్టాలకడలికి ఎదురీదిన మహిళల దైన్యాన్ని, విషాదవీచికల్ని ఈ 'థేరీగాథలు' ప్రతిబింబిస్తాయి. వీటిని పరిశీలిస్తే గుండెల్ని పిండే ఎన్నో బాధాతప్త గాథలు మనకు గోచరిస్తాయి.

ఉదాహరణకు మరణదండనకు గురికాబడిన దొంగను చూసి, మనసు పారేసుకొని, అతడిని వివాహమాడి జీవితాన్ని చేజేతులా బలిచేసుకొన్న 'బద్ధ' విషాదగాథ.

కట్టుకున్న భర్త పాముకాటుకి, పెద్ద కొడుకు వరద పోటుకి, చిన్న కొడుకు గ్రద్ధ ఎత్తుకుపోయి మరణించగా..... పుట్టింటికి చేరితే తుఫానుకి ఇల్లుకూలి, తల్లిదండ్రులు కూడా మరణించారన్న వార్త విన్న విధివంచిత 'పటాచార' హృదయవిదారక గాథ.

కాశీ పట్టణంలో సంపన్న వ్యాపారి కూతురుగా పుట్టి, అనూహ్యంగా వేశ్యగా మారి, కాశీ పట్టణం ఒక్కరోజు వ్యాపార ఆదాయం వేయి బంగారు నాణాలైతే.. ఈమె సంపాదన అయిదు వందల నాణేలు కావటంతో 'అర్థకాశి' గా పిలువబడిన ఓ అభాగ్యురాలి దయనీయగాథ.

కొడుకును కోల్పోయి, పుత్రశోకంతో ఉన్మత్తగా మారిన 'కిసగౌతమి' కి బుద్ధుడు మరణంలేని ఇంటినుండి ఒక ఆవగింజ తెమ్మని చెప్పి జ్ఞాననేత్రం తెరిపించిన గాథతో పాటు.. తన కళ్ళను మోహించిన యువకునికి కంటిగ్రుడ్డునే పెకలించి ఇచ్చిన 'శుభ' సాహసగాథ.

అశాశ్వతమైన సౌందర్యం, యవ్వనం ఎలా ఆవిరైపోతాయో వర్ణించిన అసాధారణ సౌందర్యరాశి ఆమ్రపాలి; తన తల్లి, తాను ఒకే పురుషునికి భార్యలుగా సవతులమని తెలిసాక, దేహవాంఛలను రోసి సన్యసించిన 'ఉత్పలవణ్ణ' వంటి స్త్రీలు తమ వేదనల్ని, విషాదభరిత గాథల్ని ఒకరితో ఒకరు పంచుకొని.. బాధలనుండి విముక్తి కొరకు అన్వేషణలో భాగంగా తథాగతుణ్ణి ఆశ్రయిస్తే, తన జ్ఞానబోధ ద్వారా వారి మనోక్లేశాన్ని తొలగించి, సాంత్వన చేకూర్చే విధానాన్ని కవిత్వీకరించటం జరిగింది.

విషాదమయ జీవితాలను సాహసోపేతంగా ఎదుర్కొని, పురుషాధిక్య సమాజానికి ఒక సవాలుగా, సమాధానంగా, సమాంతరంగా సహజీవనం గావించిన ఆనాటి స్త్రీల అనుభవాల గాథలను అనువాదంలో చేయితిరిగిన బాబాగారు చాలా సరళంగా, హృద్యంగా అనుసృజన చేసారు.

తథాగతుని బోధనలు అనుసరిస్తూ, దుఃఖసాగరాన్ని ఎలా అధిగమించామన్న విషయాన్ని థేరీలు కవిత్వరూపంలో అభివ్యక్తీకరించారు. వాటిలో కొన్ని వాక్యాలను పరిశీలిద్ధాం :

నేను స్వేచ్ఛనొందాను
మూడు కుటిల విషయాలనుండి
భర్త, రోలు, రోకలి
నేను ముక్తినొందాను
నన్ను వెనక్కిలాగే
మూడు కుటిల విషయాలనుండి
జననం, మరణం, పునర్జన్మ (ముత్త)
****

ఒకదీపం తీసుకొని నా కుటీరంలోకి వెళ్ళాను
చాపపై కూర్చున్నాను
సూదితో వత్తిని వెలుపలికి లాగాను
దీపం ఆరిపోయింది
నా మనస్సు కూడా విముక్తమయింది" (పటాచార)
****
నా జీవితంలోంచి దేవుళ్ళను
మగవాళ్ళనూ తరిమేసాను " (విమల)
****

శిథిలమైన నా దేహం
నేడు ఇది బాధలు వసించే చోటు
పెచ్చులు రాలుతున్న ఒక జీర్ణగృహం" (ఆమ్రపాలి)

****
ఆమె నా గుండెల్లో గుచ్చుకొన్న బాణాన్ని
నా పుత్రశోకాన్ని బయటకు లాగేసింది (అయిదు వందల థేరీలు)
****
వార్ధక్యమా/ నువ్విక వెళ్ళిపోవచ్చు
నేను జన్మరాహిత్యాన్ని పొందాను" (శోణ)
****
నీ వాంఛలన్నీ కుండలో దాచిన
మూలికల్లా వడలి ఎండిపోతాయి" (థేరిక)

ఇలా తనదైన శైలిలో బాబాగారు థేరీల వ్యథాభరిత గాథలలోని ఆత్మను ఆవాహన చేసుకొని, మనసుకు హత్తుకునేలా కవిత్వనిర్మాణం (అనుసృజన) చేయటం జరిగింది. ఈ పుస్తకాన్ని మామూలు కవిత్వంలా చదవకూడదు. ఏకాంతంగా కూర్చొని, ఏకాగ్ర చిత్తంతో చదివితే.. ఒకరకమైన అలౌకిక అనుభూతికి లోనవటంతోపాటు, థేరీల భావగర్భిత మనోస్పందనల్ని పట్టుకోవచ్చు.

పుస్తకం చివర్లో బాబాగారు 32 పేజీల్లో 'ఎండ్ నోట్స్' ద్వారా ఆయా బౌద్ధ సన్యాసినుల/థేరీల నేపథ్య కథనంతో పాటు ఆనాటి సామాజిక స్థితిగతులతో కూడిన ఉపయుక్తమైన చారిత్రిక అంశాలను విపులంగా అందించారు. దీనివలన చదువరులకు బౌద్ధ సన్యాసినులుగా మారిన థేరీల ప్రస్థానం, ఆయా కాలమాన పరిస్థితుల గురించి అవగాహన ఏర్పడుతుంది.

ఈ పుస్తకానికి పూజ్య బౌద్ధభిక్షు 'బిక్ఖు ధమ్మరక్ఖిత' అభిమానపూర్వకంగా ముందుమాట రాయగా, చివరి కవర్ పేజీపై సుప్రసిద్ధ సాహితీవేత్త శ్రీ చినవీరభద్రుడు గారు థేరీగాథల నేపథ్యాన్ని చక్కగా విశ్లేషించారు. 182 పేజీల ఈ పుస్తకానికి శ్రీ గిరిధర్ అరసవెల్లి చక్కటి ముఖచిత్రాన్ని అందించారు. అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలో లేదా 9848023384 నంబరులో లభించును.

- మార్ని జానకిరామ చౌదరి.



No comments:

Post a Comment