Sunday, January 31, 2021

Imported post: Facebook Post: 2021-01-31T12:13:37

కొన్ని సందేహాలు . 1. సమాజం నుంచి స్మశానం ఎన్నో తీసుకొంటుంది దేన్నీ తిరిగి ఇవ్వదు. మనుషుల్ని స్మశానాల్లా కాకుండా పంటచేల లాగ బ్రతకమనటం తప్పెందుకుకవుతుంది? 2. జీవశాస్త్రం ప్రకారం జీవుల విధి "To live and leave a generation behind". దీన్నుంచి జీవో కాదో కూడా తెలియని వైరస్ కూడా తప్పించుకోలేదు. దీనిని కాసేపు జీవనేచ్ఛ అనుకొందాం. మానవులు జీవనేచ్ఛ లేకుండా బ్రతకటం అసహజం అని చెప్పటం తప్పెందుకవుతుంది? 3. ఒక పాత్ర అపసవ్య పాత్ర అని అనిపిస్తే దాని అస్తిత్వాన్ని ఆ సమూహ అస్తిత్వంగా నిర్ధారించటం ద్వారా ఆ సమూహాన్ని అవమానిస్తున్నామన్న స్పృహ లేకపోవటం; ఇంకొంచెం ముందుకుపోయి ఆ రచయితకు ఆ పాత్ర లక్షణాలను ఆపాదిస్తూ అవమానించటం; తద్వారా సాహిత్యంలోని బహుళతను, వైవిధ్యాన్ని, రచయిత స్వేచ్ఛని చంపేప్రయత్నం చేయటం; ఎంతటి సమకాలీన విషాదం? 4. సాహిత్యంలో ఆత్మగౌరవాలు, విజయాలు, ఘర్షణలు మాత్రమే ప్రతిబింబించాలని జీవితంలో ఉండే అనూహ్యతలు, అసంభావ్యతలు, అసంబద్దతల గురించి మాట్లాడకూడదని, కథలు ఇలాగే రాయాలని రూల్స్ ఫ్రేమ్ చేసి, చట్రాలను, క్లిషేలను నిర్మించే విమర్శకులకూ- త్రిశూలాలు తిప్పుతూ తిరిగే గుంపులకూ తేడా ఏముందీ? . బొల్లోజు బాబా

Saturday, January 30, 2021

Imported post: Facebook Post: 2021-01-30T19:29:05

చానళ్లు చూసే దిగువ స్థాయి కాదు నాది. -- రాణి శివ శంకర శర్మ . Sir I love you. చాన్నాళ్లుగా ఈ చూడలేకపోవటాన్ని ఎలా వ్యక్తీకరించాలో తెలిసేది కాదు.

Thursday, January 28, 2021

Imported post: Facebook Post: 2021-01-28T23:55:31

thank you so much Haribabu Maddukuri garu for a wonderful introduction to the book. Thanks alot to all your friends who encouraged the work. Bolloju Baba *** మెకంజీ కైఫియత్తులు - తూర్పుగోదావరి జిల్లా.. ఇప్పుడు మనం వాడే అధునాతన కారు, బైకు ఎలా వచ్చాయి..?? మార్పులు చెందబడ్డ పాతతరం బళ్ళనుంచేగా.. అట్లాగే ప్రతీ పాతికేళ్ళకి కాలగతిలోనూ, జనజీవనంలో సంభవించే మార్పుల్ని గనుక సంఘటనలు, వ్యవహారాల పేరిట జాగ్రత్తగా రికార్డుల్లో భద్రపరిస్తే అవి రాబోయే తరాలకి దిక్సూచిగానూ, వివిధ భావజాలాలకి దర్పణంగానూ నిలిచి పలు అధ్యయనాలకి పనికొస్తాయ్, మనదైన ఒరవడిని ముందుకు తీసుకెళ్లగల్గుతాయి.. స్థానిక విషయాలైనా, సాంకేతిక అంశాలైనా వాటి చరిత్ర, నేపథ్యం తెల్సుకోవడం వల్లే నవీనస్రవంతికి పరిపూర్ణత చేకూరుతుందని నా నమ్మకం.. కానీ మనకి చరిత్ర సృష్టించి జబ్బలు చరుచుకోవడం మీదున్న శ్రద్ధ వాటిని భద్రపరచుకోవడం మీద ఉండదనేది కాదనలేని వాస్తవం.. దానిక్కారణం ముందునించీ 'కరణం గారు ఎంత కొలిస్తే అంత' అని మనకేం పట్టనట్టు ఉండటం.. 😊 మనదేశంలో బ్రిటీషర్లు బలపడుతున్న బలహీనరోజుల్లో ఇండియాకి పొట్ట చేత్తో పట్టుకునొచ్చిన ఇంగ్లీష్ దొరల్లో కొంతమంది మహానుభావులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని జీతం తీసుకునెళ్లిపోకుండా మనకెప్పటికీ పనికొచ్చే పనులు చేసి పెట్టి చరిత్రలో నిలిచిపోయారు.. వాళ్ళలో కోస్తా ప్రాతఃస్మరణీయులు కాటన్ దొర, తెలుగుసాహిత్య క్రౌన్ సిపి బ్రౌన్ అగ్రగణ్యులైతే వాళ్ళ తర్వాత గుర్తుంచుకోదగ్గ మరో ముఖ్యవ్యక్తి కల్నల్ మెకంజీ అనే బ్రిటిష్ మిలట్రీ ఇంజనీర్.. 17వశతాబ్దంలో కల్నల్ మెకంజీగారు తక్కిన బ్రిటీషర్లలాగే ఇక్కడికొచ్చాడు.. బ్రిటీషర్లకి, టిప్పుసుల్తాన్కి మధ్య జరిగిన మూడో మైసూర్ యుద్ధంలో టిప్పుసుల్తాన్ ఓడిపోయాకా అప్పటివరకూ అతగాడి ఏలుబడిలో ఉన్న ప్రాంతాల్ని, బ్రిటిష్ ప్రభుత్వ ప్రభావం ప్రత్యక్షంగా లేని పరగణాల్ని సర్వే చెయ్యమని 1800వ సంవత్సరంలో మెకంజీకి బాధ్యతలు అప్పగించింది ఈస్టిండియా ప్రభుత్వం.. అయితే ఆంగ్లేయుడు కావడంతో ఆంధ్రభాష రాదు కాబట్టి కావలి బొర్రయ్య, లక్ష్మయ్య అనే గొప్ప దక్షత కలిగిన ఇద్దరు నియోగ బ్రాహ్మణ కవలసోదరుల్ని గుమస్తాలుగా పెట్టుకుని పని కానిచ్చాట్ట.. (ఈ సోదరులిద్దరూ యే ఊరెళ్తే ఆ ఊరి గ్రామకరణాల సాయంతో చారిత్రక అవసరాలకి తగట్టు ఎలా అనువైన వచనం చేశారన్నది ఇంకో గొప్ప ఆసక్తికర చరిత్ర). అట్లా తెలుగునాట ఎన్నో జిల్లాలు తిరిగి సర్వేలు గట్రా నిర్వహించి పుట్టుపూర్వోత్తరాల్ని కలాలతో తవ్వితీసి ఆ అమూల్యమైన సమాచారానికి కైఫియత్తులని (స్థానికచరిత్ర అని అర్ధమట) అరబిక్ పేరుపెట్టారు.. కట్టింది కూలీవాళ్ళైనా కట్టించింది ఫలానా షాజహాన్ కాబట్టి తాజ్మహల్ అతడిదే అయినట్టు ఈ కైఫియత్తుల సమాచార కష్టమంతా కావలి కవలలు, కరణాలదే అయినన్నప్పటికీ ఈ తతంగం వెనుకున్న మూలకారణం కల్నల్ దొరది కాబట్టి అవి మెకంజీ కైఫియ్యత్తులయ్యాయ్.. వీటిలో అప్పటి సీడెడ్/దత్తమండలాలైన రాయలసీమ జిల్లాల్నుంచి కోస్తాజిల్లాల వరకూ ప్రతీ ప్రాంతానికి కైఫియత్తులున్నాయ్.. వీటినే మన ప్రభుత్వాలు ఇప్పటికీ రిఫరెన్సులుగా వాడుతున్నాయ్.. అదంతా గతం.. ప్రస్తుతానికొస్తే రచయిత బొల్లోజు బాబాగారు మెకంజీ కైఫియ్యత్తుల మీద తూర్పుగోదావరిజిల్లాకి సంబంధించి పుస్తకం వేశారని మొన్న శ్రీధరన్న చెప్పగానే సమయానికి ఇండియాలో ఉండబట్టి వెంటనే ఆర్డర్ పెట్టి సంపాదించి ఇందాకే పూర్తిచేసేసా.. చిన్నప్పట్నుంచీ ఎరిగిన ఊళ్లే అయినాగానీ చదువుతూ ఉండగానే ఎన్నో కొత్త విషయాలు తెల్సి ఆశ్చర్యానికి గురిచేశాయ్.. శ్రీధరన్న చెప్పినట్టు ఇది తూగోజి కైఫియత్తు అయినాగానీ ఈ పుస్తకాన్ని చదవడానికి తూగోజీవాళ్లే కానవసరం లేదు.. విజయనగరం, పిఠాపురం, రాజమహేంద్రవరం, పెద్దాపురం, సామర్లకోట, కోరుకొండ సంస్థానాలు మొదలుకుని వేంగీచాళుక్యులు, రెడ్డిరాజులు, కొండవీడు రాజులపాలనా కాలం నాటి చారిత్రక విశేషాలతో బాటు మెకంజీ సేకరించిన శాసనాలు, చారిత్రక వివరణలు ఉన్నాయి కాబట్టి చరిత్ర మీద ఆసక్తి ఉన్నవాళ్ళెవ్వరైనా నిరభ్యంతరంగా చదివెయ్యొచ్చు.. ఇన్నాళ్లూ మా ఊరిని అప్పుడెప్పుడో ఫలానా శ్యామలదేవి అనే రాణి పరిపాలించింది కాబట్టే మా శ్యామలకోట కాస్తా బ్రిటీష్ బండనోళ్ళలో పడి సామర్లకోట అయ్యి కూర్చుందని మా అందరి ప్రగాఢ నమ్మకం.. కానీ చామర్లకోట అనబడే చాళుక్యభీమవర పట్టణం కాలక్రమేణా శ్యామలకోటగా ఎలా మారిందనే కారణం వెనుక పదిపేజీల చరిత్ర ఉందని ఈ పుస్తకం చదివేదాక నాకు తెలీనే తెలీదు.. (ఆ..ట్ట్ మూమెంట్.. విజిల్స్..) ఇట్లాంటి మనదైన, అరుదైన చరిత్రని అతి చవగ్గా అందించిన ఈ 192 పేజీల పుస్తకం ధర కేవలం 200 రూపాయలే కావడం మరో ఆశ్చర్యకర విషయం.. పల్లవి పబ్లికేషన్స్ వారి ద్వారా దొరికే పుస్తకం కోసం 9866115655 కి వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు.. రిజిస్టర్డ్ పోస్టులో మీ ఇంటికొచ్చేస్తుంది.. Sri. Haribabu Maddukuri

Imported post: Facebook Post: 2021-01-28T01:54:03

thank you so much Haribabu Maddukuri garu for a wonderful introduction to the book. Thanks alot to all your friends who encouraged the work. Bolloju Baba

Wednesday, January 27, 2021

Imported post: Facebook Post: 2021-01-27T21:21:25

మిత్రులకు విజ్ఞప్తి. నా పేరుతో ఈ క్రింది ఐడి తో ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తున్నాయట. అది నాది కాదు. దయచేసి నమ్మకండి. డబ్బులు అడిగే బేచ్ లు కావొచ్చు. బ్లాక్ చెయ్యండి. https://www.facebook.com/vijay.kallar.58 బొల్లోజు బాబా

Saturday, January 23, 2021

Imported post: Facebook Post: 2021-01-23T01:50:39

హుయాన్ త్సాంగ్ పిఠాపురాన్ని సందర్శించాడా? . Yuan Chwang క్రీశ 631 లో భారతదేశం ప్రవేశించి 645 లో తిరిగి చైనా వెళ్లిపోయాడు. ఇతడు ఆంధ్రదేశాన్ని క్రీశ.635-36 ల మధ్య సందర్శించాడు[1]. హుయాన్ త్సాంగ్ కోశల నుండి బయలుదేరి An-to-lo చేరుకొన్నాను దీని రాజధాని Ping-chi/Ping-ki-lo అని పేర్కొన్నాడు. An-to-lo ని చరిత్రకారులు ఆంధ్రగా గుర్తించారు. ఇది క్రీశ మొదటి శతాబ్దానికి చెందిన రోమన్ చరిత్రకారుడు Pliny చెప్పిన Andara పదంతో సరిపోతుంది. ఇక Ping-ki-lo పదాన్ని Julein అనే చరిత్రకారుడు కొంత సంశయపూర్వకంగా Vingila లేదా వేంగి కావొచ్చునని (పెదవేగి, పశ్చిమగోదావరి) అన్నాడు. Fergusson ఈ రాజధాని ఎక్కడో తెలియటం లేదు కానీ ఉచ్ఛారణ రీత్యా వేంగి తో సరిపోలుతుంది అన్నాడు[2]. హ్యుయాన్త్సాంగ్ Ping-ki-lo నుంచి దక్షిణంవైపున 1000 లీలు ప్రయాణించి Te-na-ka-che-ka చేరుకొన్నట్లు చెప్పాడు[3]. Te-na-ka-che-ka అనే ప్రాంతాన్ని చాలా సులభంగానే Dhanakataka (ధరణికోట, గుంటూరు జిల్లా) గా అందరూ గుర్తించారు. హ్యుయాన్త్సాంగ్ 1000 లీలు ప్రయాణించానని అన్నాడు. హ్యుయాన్త్సాంగ్ కొలతలను అతను భారతదేశంలో సందర్శించిన ప్రాచీననగరాల మధ్య దూరంతో పోల్చిచూసి Cunningham 40 లీలు 6.75 మైళ్ళు గా తేల్చాడు. అంటే 6 లీలు ఒక మైలు దూరం[4]. 6 లీలు ఒక మైలు అయితే వెయ్య లీలు 167 మైళ్ళు అవుతుంది. Ping-ki-lo ని వేంగి అనుకొంటే వేంగి నుంచి ధరణికోటకు దూరం 167 మైళ్ళు లేదు 70 మైళ్ళే. కనుక హ్యుయాన్త్సాంగ్ చెప్పిన ఆంధ్రరాజధాని Ping-ki-lo వేంగి అయ్యే అవకాశం లేదు. Ping-ki-lo అనేది ధరణికోటనుండి 167 మైళ్ల దూరంలో ఉండే మరొక పట్టణం అవ్వాలి. ఇది పిఠాపురం కావొచ్చు. ఎందుకంటే 1. ధరణికోటనుంచి పిఠాపురానికి దూరం 160 మైళ్ళు. ఇది హ్యుయాన్త్సాంగ్ చెప్పిన వెయ్యి లీల దూరానికి సరిపోతుంది. 2. హ్యుయాన్త్సాంగ్ ఈ ప్రాంతాన్ని క్రీశ. 635-36 ల మధ్య సందర్శించాడు. అది కుబ్జ విష్ణువర్ధనుడి కాలము. అప్పటికి శ్రీకాకుళం నుండి నెల్లూరువరకూ విస్తరించిన ఆంధ్రప్రాంతానికి వేంగి రాజధానిగా లేదు. పిఠాపురం రాజధాని[5]. ఈ కోణంలోంచి ఆలోచించి చూస్తే హ్యుయాన్త్సాంగ్ కోసలనుండి ధరణికోటకు పిఠాపురం మీదుగా వెళ్ళి ఉంటాడని భావించటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. Ping-ki-lo (పిఠాపురం) గురించి హ్యుయాన్త్సాంగ్ చేసిన వర్ణనలు ఇవి. ఈ ఆంధ్ర దేశము వైశాల్యం 3000 లీలు. దీనికి రాజధాని Ping-ki-lo (పిఠాపురము). దీని విస్తీర్ణము 20 లీలు. ఇక్కడ సారవంతమైన నేలలు కలవు. తేమ, వేడి అధికము. ఇక్కడి ప్రజలు సాహసము కలవారు. వీరిభాష మధ్యభారతదేశ భాషకన్నా భిన్నముగా ఉనంది. లిపి మాత్రము మధ్యభారతదేశ లిపి వలె ఉన్నది (బ్రహ్మి లిపి కావొచ్చు) ఈ రాజధాని సమీపంలో ముప్పైకి పైగా బౌద్ధారామములు, 3000 మంది భిక్షువులు ఉన్నారు. ఒక సంఘారామము కలదు. ఇది పెద్ద పెద్ద గదులతో, అంతస్తులతో అందమైన అలంకారములతో శోభిల్లుతున్నది. ఇందులో ఉన్న బుద్ధుని విగ్రహము సుందరముగా, జీవకళ ఉట్టిపడుతూ ఉన్నది. ఈ సంఘారామము ప్రాంగణమున కొన్ని వందల అడుగుల ఎత్తైన స్తూపమొకటి కలదు. ఈ సంఘారామమును, స్తూపమును అచలుడను శిల్పి నిర్మించాడు. ఇక్కడి నుండి నైరుతి దిక్కుగా ఇరవై లీల దూరములో ఒంటరిగా ఒక కొండపై శిలాస్తూపము, అశోకవనము కలదు. ఇచ్చట జినభోధిసత్వుడు తన ప్రవచనాలను అందించి, మహిమలు చూపి, అనేకమందిని తన అనుయాయిలను చేసుకొన్నాడట[6]. హ్యుయాన్త్సాంగ్ Ping-ki-lo (పిఠాపురం) సందర్శించిన సమయములో చూసిన బౌద్ధఆరామాలు, స్తూపాలలో కొన్ని మనకు ఈ ప్రాంతపరిసరాలలో నేటికీ శిథిలాలరూపంలో కనిపిస్తాయి. పిఠాపురం సమీపప్రాంతాలైన గొల్లప్రోలు, కొడవలి, మల్లవరం, అన్నవరం, కొత్తపల్లి, కుమ్మరిలోవ, గోపాలపట్నం, శృంగవృక్షం, రంపఎర్రంపాలెం, కోరుకొండ, ఎర్రవరం, పెద్దాపురంలలో అసంఖ్యాకమైన బౌద్ధ అవశేషాలు కలవు. పిఠాపురానికి ఏడుకిలోమీటర్ల దూరంలో కల గొల్లప్రోలు, ఎవీ నగరం గ్రామంలో ఇటీవల భారీ బౌద్ధస్తూపం గుర్తించారు. ఇక్కడి శిథిలాలలో గాంధారశిల్పశైలిలో చెక్కిన బుద్ధుడి తలభాగం దొరికింది. స్తూపం వద్దకు వెళ్ళటానికి రాతితో చెక్కిన మెట్లు కలవు. ఇంకా లోతైన పరిశొధనలు జరిగితే మరిన్ని ప్రాచీన అవశేషాలు ఈ ప్రాంతంలో బయటపడతాయి. పిఠాపురం సమీపంలోని చిత్రాడ వద్ద వజ్రయానానికి చెందిన బౌద్ధ అవశేషాలు లభించాయి[7]. చేబ్రోలు వద్ద కూడా క్రీస్తుపూర్వంనాటి బౌద్ధ/జైన విగ్రహాలు బయటపడ్డాయి. Ping-ki-lo (పిఠాపురము) లో 30 కి పైగా బౌద్ధారామములు ఉన్నాయి అన్న హ్యుయాన్త్సాంగ్ ధనకటకంలో చాలా బౌద్ధారామాలు ఉన్నాయి కానీ చాలామట్టుకు ఖాళీగా ఉన్నాయి, మహాసంఘిక కి చెందిన బిక్షుకులు మాత్రం ఓ వెయ్యి మంది వరకూ ఉన్నారు, 100 కు పైగా దేవ ఆలయాలు (హిందూ) ఉన్నాయి అని చెప్పటం ఆసక్తికరం. అంటే ఆంధ్రలొ బౌద్ధం ధనకటంలో అప్పటికి క్రమేపీ కనుమరుగవుతూ ఉండగా పిఠాపురం వద్ద మెరుగైన స్థితిలో ఉండేదని భావించవచ్చు. *** హ్యుయాన్త్సాంగ్ చెప్పిన వర్ణనలను బట్టి Ping-ki-lo గొప్ప బౌద్ధక్షేత్రం గా విలసిల్లిందని అర్ధమౌతుంది. పిఠాపురం, సమీప ప్రాంతాలలో నేడు అడుగడుగునా అసంఖ్యాకంగా బౌద్ధ అవశేషాలు బయటపడుతూన్నాయి. 1848 లో పిఠాపురంలోని ఒక దిబ్బవద్ద జరిపిన తవ్వకాలలో ఒక గాజుభరిణి దొరికిందని దానిలో పచ్చలు, కెంపులు, పగడాలు, కొన్ని ముత్యాలు, స్వర్ణంతో చేసిన నగిషీలు ఉన్నాయని వాటిని మద్రాసు మ్యూజియంకు పంపటం జరిగిందని ప్రముఖ బ్రిటిష్ చరిత్రకారుడు Walter Elliot పేర్కొన్నాడు. (JAHRS Vol 5, 1930 p.no151). దొరుకుతున్న ఆధారాలను బట్టి హ్యుయాన్త్సాంగ్ వర్ణించిన ఒకనాటి Ping-ki-lo నేటి పిఠాపురం కావొచ్చు అనే ప్రతిపాదనను అంత సులభంగా త్రోసిపుచ్చలేం. (తూర్పుగోదావరి జిల్లా-ప్రాచీనపట్టణాలు- అనేపుస్తకంలో పిఠాపురం వ్యాసంలోని కొంతభాగం) రిఫరెన్సులు [1] ఆంధ్రదేశము విదేశీయాత్రికులు - భావరాజు కృష్ణారావు పేజినంబరు. 62 [2] On Yuan Chwang's travels in India, 629-645 A.D, Thomas Watters Vol II-p.no 210, The Capital, Ping-ki (or Chi)-lo, is restored doubtfully by Julien as Vingila//Fergusson says that the name here given for it “sounds very like Vengi… [3] Ibid p.no 214 [4] The Linear measures of Fahian and yuan chwang by Major W. Vost - The Journal of the Royal Asiatic Society of Great Britain and Ireland Jan., 1903), pp. 65-107) [5] తిమ్మాపురం తామ్రశాసనంలో -. EI Vol IX p. no 317 - Vishnuvardhana I (కుబ్జవిష్ణువర్ధనుడు క్రీశ. 624-641) resided at Pishtapura, the modern pithapuram in the godavari district అని ఉన్నది. [6] ఇది పిఠాపురం సమీపంలో కల కొడవలి స్తూపం కావొచ్చు. - Where the Buddha preached, displayed miracles, and received into his religion a countless multitude - p.209, On Yuan Chwang's Travels in India, Thomas Watters Vol II [7] The Hindu, 15, December, 2015


Thursday, January 21, 2021

Imported post: Facebook Post: 2021-01-21T20:21:30

నా టేబుల్ పై కవిసంధ్య కాలెండర్. కవిసంధ్య పత్రికతో వేయి పున్నములను వెలిగించే శక్తిని శిఖామణి గారికి ప్రసాదించాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని వేడుకొంటున్నాను. బొల్లోజు బాబా

Sunday, January 17, 2021

Imported post: Facebook Post: 2021-01-17T09:41:44

కులనిర్మూలన అంశంపై ఒక మిత్రుని వాల్ పై వ్రాసిన కొన్ని అభిప్రాయాలు..... కులం మతం సోషల్ డైనమిక్స్ ని ప్రభావితం చేస్తాయి. ఏ పరిస్థితుల్లో ఎలాచేస్తాయి అనేది సూత్రీకరణలకు లొంగదు. కులం, మతం ప్రభావితం చేసే సోషల్ డైనమిక్స్ పరిధి పెద్దది. కులనిర్మూలన అనేది పైపైన మాట్లాడుకొనేంత చిన్న విషయం కాదు. హిందూమత ఆయువుగా చెప్పబడే పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, వాజ్మయం అంతెందుకు నిన్నమొన్నటి చందమామ కథలవరకూ తిరిగి రాసుకోవాలి. కులభావన అంతలా విస్తరించింది, చొచ్చుకుపోయింది. దాని బదులు మరో కొత్తమతాన్ని స్థాపించటం సులభం. ఈ అంశంపై నా అవగాహన ఇది. ఇది లాజికల్ సత్యం అనుకొంటాను తప్ప ఇదే అంతిమ సత్యం అనను. 1. సనాతన ధర్మం మూలసూత్రం వర్ణధర్మం. పుట్టినవారు చతుర్వర్ణాలలో ఏదో ఒకదానిలో ఇమడాల్సిందే. వీరికి వెలుపల చండాలురు పుళిందులు వేదకాలం నుంచే ఉన్నారని చెప్పబడింది. హిందూమతంలో పుట్టామంటేనే ఏదో వర్ణానో/ కులాన్నో అంగీకరించి పుట్టామనే. వాటిని అంగీకరించని వారు హిందూమతాన్ని త్యజించాలి. దీనికి వేరే మాటలేదు. రెండువేల సంవత్సరాలుగా అనేకమంది వివిధ ధర్మాల పేరిట హిందూమతాన్ని విడిచి వెళిపోయారు. హిందూమతానికి సంబంధించి వారు ఏ మతంలోకి వెళ్ళినా, హిందూమతంలో పుట్టాడు కనుక వాడు చచ్చేవరకూ హిందువే. అందుకే హిందూమతంలోకి తిరిగి స్వీకరించే ప్రక్రియకు చెందిన శ్లోకాలు తంతులు మన శాస్త్రాలలో ఎక్కడా లేవు. ఏ క్రిష్టియనునో హిందూ మతంలోకి తీసుకోవాలంటే వాడిని ఏ వర్ణంలో ఉంచాలనేది కూడా ఎక్కడా హిందూమతం ఎక్కడా రాసుకోలేదు. . 2. సనాతన ధర్మం లో క్రతువులు క్రిందివర్గాలవారికి అనుకూలంగా లేవన్న కారణంగా భిన్న తిరుగుబాట్లు వచ్చాయి. అవే బుద్ధిజం, జైనిజం, శాక్తేయం, సూర్యారాధన, గణపత్యం, అజీవకులు ఇంకా తొంభై తొమ్మిది రకాల తిరుగుబాటు వర్గాలు... కొంచెం లేటుగా వీరశైవం. 3. శంకరాచార్యుడు ఈ వ్యవహారం గమనించి అందరినీ సంఘటిత పరచి, పంచ ఆరాధనా పద్దతిని ప్రవేశపెట్టి అన్ని వర్గాలకు ఎంతో కొంత ప్రాతినిథ్యం కల్పించి సనాతన ధర్మాన్ని హిందూమతంగా స్థిరీకరింపచేయటానికి దోహదపడ్డాడు. హిందూమతానికి అది పునరుజ్జీవనం అంటారు కానీ అది దాదాపు పుట్టుక 4. ఆ పిమ్మట వర్ణధర్మం ప్రకారం క్షత్రియుల చేతిలో ఉండాల్సిన రాజ్యం శూద్రులచేతుల్లోకి వెళ్ళింది. చాళుక్యులాదిగా. (శాతవాహనులు కూడా శూద్రులనే వాదన ఉంది). ఈ క్రమంలో బ్రాహ్మణుల పాత్ర మారలేదు. చండాలుర/పుళిందులది కూడా. ఇక శూద్రుల పాలనలో వివిధ వృత్తుల వారు కులాలుగా బిగుసుకుపోవటం మొదలైంది. 5. అంతవరకూ అనాదిగా వర్ణాల మధ్య, వృత్తికార శూద్రుల (నేటి సో కాల్డ్ కులాలు) మధ్య అంతర్వివాహాలు సుబ్బరంగా జరిగాయి. క్రీపూకి చెందిన చాళుక్యుని అర్ధశాస్త్రంలో వివిధ "వర్ణాల మధ్య" (చండాల వర్గంతో సహా) వివాహాల ద్వారా పుట్టిన వారికి వివిధ పేర్లు గమనించవచ్చు. అంటే అవి జరిగాయి. వర్ణాలమధ్య వివాహాలే చంపుకొనేంత నిషిద్దం కానప్పుడు శూద్రుల మధ్య (వర్ణంలోపల) అంతర్వివాహాల పట్ల అభ్యంతరాలు అసలు సోదిలోనే లేవు. శూద్రులందరూ ఒకే ఎంటైటీ అప్పట్లో. కనీసం పదోశతాబ్దం వరకూ. 6. 12-15 శతాబ్దంవచ్చేసరికి ఇలా కులాల పేరుతో శకలాలు, శకలాలుగా విడిపోతున్న సమాజాన్ని సంఘటితపరచటానికి హిందూ మతం చాలా సర్దుబాట్లే చేసింది. వాటి ఫలితమే కులపురాణాలు. అన్నింట్లో బ్రాహ్మలపై ఆధిపత్యం పొందినట్లు, విష్ణువుని ఓడించినట్లూ, తమకులం ప్రమేయం లేకపోతే ఇతరకులాలలో వివాహాలు, క్రతువులు జరగని విధంగా వరాలు పొందినట్లు- ప్రజలందరినీ కలుపుకుపోయేలా ముఖ్యంగా క్రింది వర్గాలను - అనేక పాచ్ వర్క్ లు చేసింది హిందూమతం. వెయ్యిలోపు జనాభా ఉండే అతిచిన్న యూనిట్ అయిన గ్రామాల్లో ఈ పాచ్ వర్క్ వల్ల అందరూ కలిసిమెలిసి బ్రతికారు. గుడులు అన్నివర్గాలను కలుపుకు పోయేది. మంగలులు, కంసాలులు, శిల్పులు, కుమ్మరులు వడ్రంగులు, యాదవులు, పల్లకి బోయిలు, కాపలా కాసే దళితులు, గుళ్లపై గద్దలు రాబందులు మాంసఖండాలు వేయకుండా చూసే ఒక వర్గం, పుల్లలు కొట్టేవారు, మాలకారులు, తోట మాలులు, కళావంతులు, వ్యాపారులు, బ్రాహ్మలు, రాజులు అందరినీ ఇముడ్చుకొంది గుడి. ఈ పై వృత్తులకు ఎంతెంత జీతాలివ్వాలనేది వివిధ శాసనాల్లో కనిపిస్తాయి ఈనాటికీ. మెకంజీ కైఫియ్యతులు రాసేకాలం వరకూ శ్రీశైలంలో రోజూ ఇచ్చే బలులను మాలమాదిగలే నిర్వహించేవారు. అది ఆనాటి ఆర్ధిక వ్యవస్థ . ఇదంతా హిందూమతం గొప్పతనం అనుకోలేం. ఎందుకంటే నిచ్చెనమెట్ల వ్యవస్థ మరింత బిగుసుకొంది క్రమేపీ. కానీ ఏదో విధంగా సమాజంలోని అన్నివర్గాలవారికీ ఉపాధులు దొరికాయి. ఆమేరకు కులంఅనేది ఒకనాటి ఉపాధి హామీ పథకం. ప్రతి ఊరిలో బారాబలవతీలు పేరుతో పన్నెండు కులాలకు చెందినవారు ఉండాలని నిర్ధేశించింది. వారిని ఆ ఊరికి నియమించటం రాజు బాధ్యత. ఏ ఒక్కరు తగ్గినా (వారసులు లేకుండా ఆకుటుంబం అంతరిస్తే) పక్కగ్రామం నుంచి ఆ వృత్తికార కుటుంబాన్ని మేళతాళాలతో ఆహ్వానించుకొని, వారికి వృత్తి మాన్యాలు ఇచ్చి వూరిలో ఉండేలా చూసుకొనేవారు. ఒక్కోసారి కొంతమంది వృత్తికారులు ఊరిపై అలిగి పొరుగూరుపోయి నిరసన తెలిపితే వారిని మరల బుజ్జగించి తెచ్చుకొన్నట్లు ఆధారాలున్నాయి. 7. ఒకప్పుడు సమాజ క్షేమమే మానవజాతి ముఖ్య ప్రయారిటీ. సమాజం తరువాతే వ్యక్తి. అందుకే ఒకనివల్ల సమాజానికి ముప్పు ఉందంటే వాడిని చంపేయటమే చట్టం. శిక్షల తీవ్రత ఒక్కో వర్గానికి/వర్ణానికి ఒక్కోలా ఉండేవనేది కూడా కాదనలేని సత్యం. కానీ నేడు సమాజ క్షేమం ప్రయారిటీ కాదు. వ్యక్తే ప్రధానం. ఇది ఆధునిక, పరిణామం. నాగరీకమైనది. అందుకే కరడు కట్టిన నేరస్థుడికి కూడా హక్కులు ఉన్నాయి. ఇది కాలమార్పు. యుగధర్మం. 8. ఈ వర్ణాలు, కులాలు వాటి హెచ్చు తగ్గులు, కట్టుబాట్లు, సంకరానికి శిక్షలు అనేవి సమాజమే ప్రధాన ప్రయారిటీ గా ఉన్నరోజుల్లో వ్రాసుకొన్న చట్టాలు. ఆ నేపథ్యానికి, ఆ కాలానికి అవి 100 శాతం కరక్టు కావొచ్చు. ఈ రోజు వాళ్లు అలా ఎందుకు చేసారు అని వాదించుకోవటం, వాళ్లు రాసుకొన్న అప్పటికి వర్తించే చట్టాలను తగలపెట్టటం మన పూర్వీకులను అవమానించటమే. వాళ్ళు వాటివల్ల సమాజానికి మంచి జరుగుతుందనే రాసుకొన్నారు. వారి పరిస్థితులు అలాంటివి. ఒకరిని ఒకరు చంపుకొని, ఆకలేస్తే పీక్కుతిని, కోర్కె రేగితే బలాత్కరించే ఆటవిక సమాజం నుంచి వచ్చినవారికి తప్పో ఒప్పో ఆపాటి "క్రమశిక్షణ" ఆనాటికి అవసరం అయి ఉండొచ్చు. మనం ఎవరు జడ్జ్ చెయ్యటానికి. 9. మరి నేటి సమాజంలో కులాల రిలవెన్స్ ఏమిటి? ఆధునిక సమాజం వ్యక్తి ప్రధాన సమాజం. వ్యక్తిప్రధానం అయిపోవటంతో వాడు ఒంటరి అయిపోయాడు. బలహీనుడు అయిపోయాడు. ఎదగటానికో, రక్షణ కొరకో అతనికి సమూహం అవసరం ఏర్పడింది. సమూహబలమే తనబలంగా భావించుకోవాల్సి వస్తుంది. టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎలక్త్రీషియన్లు, ప్లంబర్లు సమూహాలుగా ఏర్పడతారని మార్క్స్ ఊహించాడు. అది జరగలేదు. ఇక ఆధునిక మానవుడికి కనిపించే ఏకైక ప్రత్యామ్న్యాయం కులం. అప్పటికే నాలుగైదు వందల సంవత్సరాలుగా స్థిరపడిన కులం. కనుక కులం నేడు మరింత బలపడింది. ఇది పోవాలంటే మరలా సమాజమే ప్రధాన ప్రయారిటీగా ఉండే పరిస్థితులు రావాలి. కానీ మానవజాతి ప్రయాణం ఆ వైపు లేదు. 10. బ్రిటిష్ పాలన నేటి భారతదేశంలోని 60% భూభాగంలోనే జరిగింది. ఇక్కడ వారు బలమైన కుల వివక్ష వ్యతిరేక చట్టాలు, సంస్కరణలు చేసారు. బ్రాహ్మలు మాలమాదిగలు ఒకే బెంచిపై కూర్చుని చదువు నేర్చుకొనే స్కూళ్లను నెలకొల్పారు. ఆధునిక విద్య అందించారు. అందుకనే ఈ ప్రాంతాలనుంచి అనేక సంఘసంస్కర్తలు పుట్టుకొచ్చారు. అనేక మంది దళితులు విద్యావంతులై ఉన్నతోద్యోగాలు చేసారు. శూద్రులు వ్యాపారాలు చేసి కోటీశ్వరులయ్యారు. ఈ ప్రాంతాలలో బ్రిటిష్ పాలనలో కుల వివక్ష లేదని చెప్పలేం కానీ చంపుకునేంత ఉందని చెప్పటానికి బలమైన చారిత్రిక ఆధారాలు కనిపించవు. ఇక మిగిలిన 40% భారతభూభాగాన్ని హిందూ రాజులు పాలించారు. (నేటి ఉత్తరభారతదేశంలోని చాలావరకూ) వారి రాజ్యాలలో బ్రిటిష్ చట్టాలు వర్తించలేదు. వారు సమాజాన్ని ధర్మ శాస్త్రాల ఆధారంగా వెనక్కి నడిపించారు. శిక్షలు విధించారు. వర్ణధర్మం మీరినందుకు క్రింది కులస్థులను ఊచకోతలు కోసారు. ఈ విశాలమైన భారతదేశంలో వర్ణవివక్షకు సంబంధించి అన్నిప్రాంతాలలో ఒకేరకమైన న్యాయాలు లేవు. కొన్ని పోకెట్స్ లలో నడిచిన కులపీడన ఇతరప్రాంతాలలో కూడా అదేవిధంగా జరిగిందని భావించటం తప్పు. అది హిందూమతం పై చేసిన దుష్ప్రచారం. బొల్లోజు బాబా

Saturday, January 16, 2021

Imported post: Facebook Post: 2021-01-16T22:33:19

Narukuti Sridhar gaaru, The perspective you gave to the topic is awesome sir. thanks alot

Thursday, January 14, 2021

Wednesday, January 13, 2021

Imported post: Facebook Post: 2021-01-13T13:35:12

Publishing a volume of verse is like dropping a rose-petal down the Grand Canyon and waiting for the echo అంటారు కానీ ఈ రోజు నా పుస్తకపు ప్రతిధ్వనిని విన్నాను. శ్రవణానందకరంగా, హృదయోల్లాసంగా. Narukurti Sridhar గారు థాంక్యూ అనేది చాలా చిన్నమాట. సాధారణంగా సొంతంగా ముద్రించుకొన్నప్పుడు రెండుమూడు వందల కాపీలను మిత్రులకు పోస్ట్ చేస్తాను. ఓ వందమంది రెస్పాండ్ అవుతారు. ఓ పాతికముప్పై మంది పుస్తకంలోని మంచి చెడ్డలు చర్చిస్తారు. ఓ పది పదిహేను మంది చిన్నవో పెద్దవో పరిచయవ్యాసాలు రాస్తారు ప్రేమతో. ఇదీ ఇంతవరకూ జరిగిన నా సాహిత్యప్రయాణం. నా ఇటీవలి మెకంజీ కైఫియ్యతులు పుస్తకాన్ని పల్లవి ప్రచురణల వారు ముద్రించారు. మిత్రులకు పంచిపెట్టే అవకాశం లేదు. పుస్తకం ఎవరు చదువుతున్నారో వారి అభిప్రాయాలు ఏమిటో తెలియని పరిస్థితి. పుస్తకాల ముద్రణలో మంచి అభిరుచికలిగిన సహృదయులు, పల్లవి ప్రచురణల అధినేత శ్రీ ఎస్వి నారాయణగారిని రెస్పాన్స్ ఎలా ఉంది అని మొదట్లో అడిగాను. పరవాలేదు అన్నారు . మరలా అడగటానికి భయమేసింది ఏం చెబుతారో, ఏం వినాలో అని. కానీ వారిద్వారా చేరవలసిన వారికి నా పుస్తకాలు చేరుతున్నాయి. ఇది వ్యక్తిగా నేను చెయ్యలేని పని. మొన్న ఏలూరు నుంచి ఒక డాక్టరుగారు ఫోన్ చేసి మీ పుస్తకంలోని కావలి సోదరులపై వ్రాసిన వ్యాసం చాలా బాగుంది. నేను ఏలూరు సాహిత్యచరిత్ర వ్రాస్తున్నాను ఈ వ్యాసం ఎంతో ఉపయోగకరంగా అనిపించింది అన్నారు. సంతోషం వేసింది. నిజానికి చరిత్రపుస్తకాలు రాయటం చాలా శ్రమతో కూడుకొన్నది. "ఫ్రెంచిపాలనలో యానాం" పుస్తకానికి మూడేళ్ళు పట్టింది. కోవిడ్ లాక్ డౌన్ వల్ల ఈ పుస్తకం ఏడాదిన్నరలో పూర్తయింది. అయినా ఎన్నో స్పృశించలేని అంశాలుంటాయి. నా శక్తి ఇంతే అని అంగీకరించటానికి సంకోచించను. ఇదిగో ఈ భోగి పూట శ్రీథర్ గారి వ్యాసం చదవటం పెద్దపండుగలా ఉంది నాకు. నామీదనాకు నమ్మకాన్ని, తెలుగుపాఠకుల అభిరుచిపై గౌరవాన్ని పెంచే మీ ఈ వాక్యాలకు మరొక్కసారి మీకు ధన్యవాదములు శ్రీథర్ గారు. బొల్లోజు బాబా *** . కైఫీయత్తులు – నా యురేకా మూమెంట్ . . కైఫియత్తు ల గురించి ఎన్నాళ్ళనుంచో వింటున్నా, చదవాలనే ఉద్దేశ్యం మాత్రం ఆ పుస్తకం మీద ఉన్న మా తూర్పు గోదావరి జిల్లా పేరు, మ్యాప్ చూసిన తర్వాతే కలిగింది. రచయిత ‘బొల్లోజు బాబా’ గారి మీద నాకు కొంత అభిమానం ఉంది. సరళంగా , గాఢమైన భావంతో ఉండే ఆయన కవితలు , అనువాదాలు , ఏ విషయాన్నయినా చదివించ గలిగేలా ఉండే శైలి నాకిష్టం. కైఫియత్ అనే ఉర్దూ పదానికి ‘ సంగతులు , విశేషాలు ‘ అని అర్థం. స్థానికులు వారి గ్రామ చరిత్ర, సరిహద్దులు దేవాలయ భూములు , పాలకుల వివరాలు లాంటివి తాళపత్ర గ్రంథాలపై రాసుకుని భద్రపరుచుకునే వారట. వాటిని ‘దండెకవిలెలు’ అనేవారు.ముస్లిం పాలనలో వాటిని కైఫియత్ లు అనే పేరుతొ వ్యవహరించడం మొదలయ్యింది. చిన్నప్పుడు ‘ మన పొలం ఎక్కడినుంచి ఎక్కడికో ఎలా తెలుస్తుంది?’ అని నేను అడిగిన ప్రశ్నకి మా తాత గారు ఇచ్చిన సమాధానం ఇప్పటికీ నాకు గుర్తు. ’ మనకేమి తెలుస్తుందిరా .. కరణం గారు ఎంత చెపితే అంత’ అని. ఆ కరణం గారి దగ్గరే ఈ వివరాలు ఉండేవి. బహుశా ఊరుమ్మడి విషయాలు కూడా వారిదగ్గరే ఉండేవేమో. నా చిన్నప్పుడు మా ఊరిలో ఒక మట్టి కోట ఉండేది. దానిలో అప్పుడప్పుడూ పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలు చేస్తూ ఉండేవారు. ‘దానిని ఎవరు కట్టించి ఉంటారు?’ అని బహుశా ఊరిలో సగం మందిని అడిగి ఉంటాను. చాలా మంది ‘ఎప్పుడో రాజుల కాలం నాటిది ..మనకేం తెలుస్తుందిరా కరణం గారికే తెలియాలి ‘ అనేవాళ్ళు. అయితే నాకు ప్రశ్నించే వయసు వచ్చేటప్పటికే కరణం గారు కాలం చేయడం వల్ల నా సందేహం అలాగే ఉండిపోయింది . ఈస్టిండియా కంపనీ లో సర్వేయర్ గా పనిచేసిన మెకంజీ శాసనాలు,దండెకవిలెలు,ప్రాచీన ఆలయ చిత్రాలు , నాణాలు మొ.గు వాటిని విస్తారంగా సేకరించాడు. అలా సేకరించిన వాటి ద్వారా భారతీయుల చరిత్రను తెలుసుకోవచ్చని నమ్మాడు. తన దగ్గర పనిచేసే వారిని గ్రామ కరణాలు,పెద్దల దగ్గరికి పంపించి వాటిని సేకరించి ఆ విశేషాలతో వ్రాత ప్రతుల్ని తయారు చేయించాడు. హిందువులకి చరిత్రను రికార్డు చేసుకునే అలవాటు లేదనుకునే బ్రిటిష్ వారు ఆ కైఫీయత్తులు చూసి ఆశ్చర్యపడ్డారట. నిజానికి తూర్పు గోదావరి జిల్లా కి సంబంధించి పది కైఫీయత్తులు మాత్రమే లభ్యం . ఎక్కువగా రాయలసీమ కి సంబంధించినవే ఉన్నాయి. గొలుసుకట్టు రాతలో ఉన్న వీటిని రచయిత సరళమైన భాషలోకి మార్చి సామాన్య పాఠకులు చదువుకునేలా చేసారు. కైఫియత్తుల లోని విషయాలని యథాతధంగా ఇస్తూ , ఫుట్ నోట్స్ లో మాత్రం చారిత్రక విషయాలతో అనుసంధానించడానికి ప్రయత్నించారు. విజయనగరం, పిఠపురం , రాజమహేంద్రవరం , పెద్దాపురం , సామర్లకోట ,కోరుకొండ సంస్థానాల చరిత్ర , వేంగీ చాళుక్యులు, రెడ్డి రాజుల పాలనా కాలం నాటి చారిత్రక విశేషాలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ కైఫియత్తుల ని చరిత్ర అనుకోవచ్చా? స్థల పురాణ కథలు కూడా చేరిపోవడంతో వీటిని చరిత్ర అని చెప్పలేము కానీ , నమ్మశక్యం కాని విశేషాలని పక్కనబెడితే దీనిలో కచ్చితంగా చరిత్ర ఉందని నాకనిపించింది. ఎందుకంటే మా ఊరి కోట గురించి ఎంతమందిని అడిగినా దొరకని సమాధానం ఈ పుస్తకంలో ( కోరుకొండ కైఫియత్తులో ) దొరికింది. మా ఊరి కోటని వేమారెడ్డి నిర్మించాడట . బహుశా అది ఆరు వందల సంవత్సరాల క్రితం కావచ్చు. ఆ తర్వాత చాలా కాలానికి , బహుశా ఈస్టిండియా కంపనీ కాలంలో , మందపాటి రఘునాధ రాజు అనే జమిందారు ఆ కోటలోనే సర్కారు వారితో సంప్రదింపులు జరిపి కోరుకొండ పరగణాని సంపాదించుకున్నాడట . ఆయన కొడుకు తిరుపతిరాజు ఆ కోటని పెద్దది చేసాడట. మా ఊరిపేరు రహితాపురం అని ఉంది. చుట్టుపక్క ఊర్లన్నీ ఇప్పటి పేర్ల తోనే ఉన్నాయి . మా ఊరు మాత్రం కాలక్రమేణా రఘుదేవపురం అయింది. మా చిన్నప్పుడు (ఇప్పటికీ) వాడుకలో రైతాపురం అనేవాళ్ళం. బహుశా అది రహితాపురం నుంచే వచ్చి ఉంటుంది. ఆ కోరుకొండ కైఫియత్తు చదవడం నాకు ఒక ‘యురేకా’ మూమెంట్. ఉత్సాహం ఆపుకోలేక బాబా గారికి మెసేజ్ చేసాను. ఆయన నాకంటే ఎక్సైట్ అయ్యారు. ఈ పుస్తకంలో తూర్పు గోదావరి జిల్లా కైఫియత్తులతో బాటు , మెకంజీ జీవిత విశేషాలు , ఆయన సేకరించిన శాసనాలు, పుస్తకం చివర కొన్ని చారిత్రక వివరణలు ఉన్నాయి. అప్పటి తెలుగు వారి జీవన స్థితి గతులు , చరిత్ర మీద ఆసక్తి ఉన్నవారు తప్పక చదవవలసిన పుస్తకం. ఇది చదవడానికి తూర్పు గోదావరి వారే కానవసరం లేదు. ఒకవేళ తూర్పు గోదావరి వారయితే ,నాలా అదృష్టం కలిసొస్తే, మీ ఊరు చరిత్ర కూడా దొరకొచ్చు. ఈ పుస్తకం రాయడానికి రచయిత సంప్రదించిన పుస్తకాలు, వ్యాసాలు చూస్తే మతిపోతుంది. ఇది కేవలం Rs.200 లకే దొరకడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ విదేశీయులో అయితే ఇంత పరిశోధనకి కనీసం వంద డాలర్లు పెట్టి ఉండేవారు. మన దగ్గర ఉందని చెప్పుకోడానికైనా ఈ పుస్తకం కొనుక్కోవచ్చు. తాజాకలం: మెకంజీ ఆంధ్ర,కర్ణాటక, తమిళనాడు నుంచి కైఫీయత్తులు సేకరించాడు. కర్ణాటక, తమిళనాడు లలో సేకరించిన వాటిలో కూడా తెలుగులో రాయబడ్డవి ఉన్నాయట. బహుశా ఆంధ్ర దేశం నుంచి వెళ్ళిన తెలుగు వారే ఈ కైఫీయత్తులు రాయడం నేర్పించి ఉంటారని ఒక పరిశోధన ( ఆ విధంగా తెలుగు వాళ్ళని చరిత్ర ని రికార్డు చేయడంలో యూరోప్ వాళ్ళతో పోల్చవచ్చని నా ఇది..) ఈ పుస్తకం లో నాకు నచ్చిన విశేషాలతో ఇంకో రెండు పోస్ట్ లు రాస్తా.. ఇది పల్లవి పబ్లికేషన్స్ వారి ద్వారా దొరుకుతుంది. 9866115655 కి whatsup మెసేజ్ చేస్తే చాలు. by Sri. Narukurti Sridhar

Friday, January 8, 2021

Imported post: Facebook Post: 2021-01-08T02:03:09

వృత్తిని ప్రతిబింబిస్తూ వ్రాసిన కవితలు . ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేసించి పాతికేళ్ళు నిండాయి. మొదట్లో స్కూల్ టీచర్ గా, తరువాత జూనియర్ లెక్చరర్ గా ప్రస్తుతం డిగ్రీకాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసరుగా నా ఉద్యోగప్రయాణం సాగింది. ఈ సుదీర్ఘకాలంలో నా ఉద్యోగ అనుభవాలను ఏమేరకు కవిత్వంలోకి తీసుకొచ్చాను అని ఒకసారి పరిశీలించుకొంటే చాలానే కనిపించాయి. సమాజంలో ఉపాధ్యాయునికి గౌరవం ఉంది. తల్లితండ్రులలో, విద్యార్ధులలో. మనం ఎంత ప్రేమిస్తే అంత ప్రేమను తిరిగి ఇస్తారు. ఇది స్కూల్ స్థాయిలో మరీ ఎక్కువగా పొందాను నేను. మొదట్లో పిల్లలు పిలిచే “సార్ గారండీ” అనే పిలుపు నాకు వింతగా తోచేది. వాళ్ళు మనకిచ్చే ప్రేమ, గౌరవాలకు అనుగుణంగా ఒక స్వీయ డిసిప్లిన్ ఏదో తెలియకుండా మన వ్యక్తిత్వంలోకి ప్రవేశిస్తుంది. ఒక టీచరుగా నా బాధ్యతను ఆ పిలుపు గుర్తుచేస్తుందనే ఎరుకతో వ్రాసిన కవిత ఇది. *** 1. సార్ గారండీ… సార్ గారండీ… శరీరం మీంచి బాల్యం అదృశ్యమౌతుంది. దేహంపై యవ్వనం నూనూగుగా మొలకెత్తుతుంది. దాని గొంతుక వింతైన జీరతో “సార్ గారండీ, సార్ గారండీ” అంటుంది. ఆ మాధుర్యానికి ఒక జీవితాన్ని అర్పించుకోవచ్చు. ఆ అభిమానానికి ఒక హృదయాన్ని అంకితమీయచ్చు. వాడు నిర్మించుకొనే వ్యక్తిత్వ హర్మ్యానికి మేలిమి ఇటుకలను ఎంచి వాడికందిస్తాను. వాని ఆలోచనల చురకత్తులు పదును పెట్టుకోవటానికై నా మెదడును సానరాయి ని చేస్తాను. పరస్పర వైరుధ్యాల అరణ్యంలో వాడు దారి తప్పి కునారిల్లినపుడు నా అనుభవాల్ని దిక్సూచిగా చేసి బహూకరిస్తాను. రసాయనోద్రేకాల ప్రళయ కాలంలో అయితే కుంభవృష్టి లేకపోతే చండ్రగాడ్పులు తప్ప మధ్యస్థమెరుగని వాడి మనసుకు ఉదయ లేకిరణాల్ని వేసవి సాయంకాలాల్ని, మంచుసోనల్ని, వెన్నెలరాత్రుల్నీ పరిచయం చేస్తాను. ఒక తరం తన నడతను ప్రసవించుకొనే వేళ నేను మంత్రసాని నౌతాను. ఈ దేహం కలిసిపోయే లోపు ఎప్పుడో, ఎక్కడో వాడు కన్పించి, “బాగున్నారా మాష్టారూ” అంటాడు. అంతకుమించింకేం కావాలీ జీవితానికి. నవంబర్ 2008 *** నేను జంతుశాస్త్ర అధ్యాపకుడను. బైపిసి గ్రూపు తీసుకొన్నప్పటినుంచి డిసెక్షన్లు తప్పనిసరి. వానపాములు, బొద్దింకలు, కప్పలు, తొండలు, చేపలు ఎన్నో జీవుల అంతరావయువాలను డిసెక్ట్ చేసి పిల్లలకు చూపించటం వారితో చేయించటం నా వృత్తిలో భాగం. ఆయా జీవులను డిసెక్షన్ల పేరుతో చంపటం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందనీ ఇంకా జీవకారుణ్య కారణాల దృష్ట్యా యుజిసి వారు డిసెక్షన్లను నిషేదించారు. అలా అంతరించిపోయిన ఆ ప్రక్రియను ఒక కవితలో పర్యావరణ కోణంలోంచి ఇలా వ్యక్తీకరించాను. 2. సమతుల్యత కప్ప దమనీ వ్యవస్థ డిసెక్షన్ విద్యార్ధులకు డిమానుస్ట్రేషన్ క్లాసది. క్లోరోఫాం ఇచ్చిన కప్పను డిసెక్షన్ చెక్కపై ఉంచి కదలకుండా కాళ్ళకు మేకులు కొట్టాను. నా చుట్టూ విద్యార్ధులు నిల్చొని శ్రద్ధగా గమనిస్తున్నారు. సిజర్ తో చర్మాన్ని కొద్దికొద్దిగా తొలగిస్తూ స్టెర్నమ్ ఎముకను కత్తిరించి ఉరఃకుహరాన్ని బయల్పరిచాను. “మీ చేతులు వణుకుతున్నాయి సార్” అన్నాడో విద్యార్ధి. అప్పుడు గమనించాను నా చేతులు విపరీతంగా వణుకుతున్నాయి. మిగిలిన డిసెక్షన్ వెంటవెంటనే ముగించి వచ్చేవారం మీరు చేద్దురుగాని అని చెప్పి డిపార్ట్ మెంటుకు వచ్చేసాను. భయమేసింది జబ్బేదైనానా అని. కాగితం తీసుకొని నా పేరు వ్రాసుకొన్నాను ముత్యాల్లాంటి అక్షరాలు కొంచెం ధైర్యం వచ్చింది. *** విద్యార్ధుల ఒక్కొక్కరి ట్రేలో ఒక్కో కప్ప వాళ్ళు జాగ్రత్తగా డిసెక్షన్ మొదలుపెట్టారు. కాసేపయ్యాకా చూద్దును కదా ప్రతి ఒక్కరి చేతులూ వణుకుతున్నాయి అలా వణుకుతున్న చేతులతోనే అందరూ డిసెక్షన్ చేస్తున్నారు – ఆశ్చర్యంగా! *** నిన్నరాత్రి కప్పలు లేని చెరువుగట్టుపై మిడతలు వాలినపుడు గరికపూలు కూడా అలానే ఒణికుంటాయి. JULY 20, 2012 *** విద్యావ్యవస్థలో విద్యనేర్పటం ఎంతైతే భాగమో నేర్చుకొన్న దాన్ని మూల్యాంకనం చేయటం కూడా అంతే అవసరం. విద్యార్ధులు వ్రాసిన జవాబుపత్రాలను దిద్దేటప్పుడు ప్రతీసారీ కాకపోయినా చాలాసార్లు మనసులో మెదిలే భావాలకు అక్షరరూపం ఈ కవిత. 3. మూల్యాంకనం జవాబు పత్రాన్ని పట్టుకోగానే ఓ ఏడాది కాలాన్ని చేతిలోకి తీసుకొన్నట్లుంటుంది. ఏదో అపరిచిత జీవితాన్ని తడుముతున్నట్లనిపిస్తుంది. పాస్ మార్కులు వేయమంటూ కన్నీటి ప్రార్ధనో, వెయ్యినోటో, ఫోన్ నంబరో లేక శాపాల బెదిరింపో వంటి చేష్టలు బిత్తరపరచినా ఇన్నేళ్ళ చదువులో ఎక్కడా తగలని ఒక వాక్యమో, కొత్త కోణమో, వివరణో తళుక్కు మన్నపుడు కవిత్వం చదివినంత ఆనందమౌతుంది. జవాబు పత్రాల్ని మెదడు తూకం వేస్తే హృదయం మూల్యాంకనం చేస్తుంది. ఈ స్టూడెంట్ కి మమ్మీ డాడీ దీబెట్టి బెస్టాఫ్ లక్ చెప్పారో లేదో హైలైటర్స్, స్కెచ్ పెన్ లు కొనివ్వలేదు కాబోలు స్కేలు కూడా లేదేమో.. పేపరు మడతే మార్జినయ్యింది. ఈ అక్షరాలు వ్రాసిన చేయి పొలంపనులు చేసిందో, రాళ్ళు మోసిందో పెట్రోలు కొట్టిందో లేక అంట్లే తోమిందో అక్షరాల నిండా మట్టి వాసన ... మట్టి వాసన... హృదయానికి మట్టివాసన ఎంతిష్టమో! జవాబులు సరిగ్గా రాయకపోవటానికి కారణం ఒక్క చదవకపోవటమేనా... లేక ఆ సమయంలో జబ్బుచేసిందా? ముందురోజు తండ్రికి తలకొరివి పెట్టాడా? పెళ్ళిబట్టలలో నేరుగా పరీక్షహాలుకు వచ్చిందా? సమస్యలనుంచి రేపు పారిపోవాలనుకొంటున్నాడా? ఖాళీ జవాబు పత్రం ప్రశ్నల పత్రమౌతుంది పేపర్లు దిద్దటం అంటే ఒక్కోసారి పత్రికల్లో పతాక శీర్షికలవటం కూడా ఆత్మహత్యగానో, అత్యుత్తమ రాంక్ అనో. MARCH 30, 2012 *** పిల్లలు సున్నితమనస్కులు. ఒక్కోసారి మనం అనాలోచితంగా అన్నమాటలను వారు గుర్తుపెట్టుకొంటారు. ఆ తరువాత ఎప్పుడో మీరిలా అన్నారు అని చెప్పి ఆశ్చర్యపరుస్తారు. ఆ రోజు మీరు చెప్పిన ఈ మాటలవల్ల నేనీరోజు ఈ స్థాయిలో ఉన్నాను అన్నప్పుడు నిజానికి మనం అన్నమాటలు గుర్తులేకపోయినా సంతోషం కలుగుతుంది. అలా ఒక రోజు ఒక అమ్మాయి – "ఆ రోజు మీరు నా కంటే తెల్లగా అందంగా ఉన్న అమ్మాయి చేత బొకే ఇప్పించారు" అని అన్న మాటలు నన్నెంతగానో వెంటాడాయి. నేను చెప్పిన సారీలకు ఆ అమ్మాయి కన్విన్స్ అయి ఉండకపోవచ్చు. కానీ ఒక హృదయం గాయపడింది. ఆ గాయమే ఈ కవితగా పోతపోసుకొని నన్ను ఊరడిస్తుందింది నేటికీ. 4. చర్మం రంగు ముఖ్య అతిధికి బొకే నేను ఇస్తాను టీచర్” “నువ్వొద్దు ….. అందుకు వేరే వాళ్ళను ఎంపిక చేసాం” ఆ “వేరేవాళ్ళకు” తనకూ ఉన్న తేడా ఆ అమ్మాయికి కాసేపటికి తెలిసింది చర్మం రంగు. చరిత్ర లోయలోకి నెత్తురూ, కన్నీళ్ళూ పారిస్తూ, జీవన మార్గాలపై చీకటివెలుగుల్ని శాసిస్తోన్న చర్మం రంగు ….. చర్మం రంగు….. సంచి కన్నా ఆత్మ గొప్పదని వెర్రికేకలతో అరవాలనుకొంది ఆ అమ్మాయి. ఉబ్బిన మొహం, ఎర్రని కళ్లతో తనకొచ్చిన ప్రైజుల్ని తీసుకొని మౌనంగా నిష్క్రమించింది. పదేళ్ళ తరువాత ……. “ముఖ్య అతిధి” స్పీచ్ ముగించుకొని వెళుతూ వెళుతూ ఉబ్బిన మొహం, ఎర్రని కళ్ళతో ఉన్న ఓ స్టూడెంట్ చేతిలో బొకే పెట్టి, భుజం ఎందుకు తట్టిందో ఎవరికీ అర్ధం కాదు మరో పదేళ్ళ దాకా AUGUST 14, 2013 *** సాధారణంగా సెలవులలో కాలేజీకి వెళితే ఒక జడవాతావరణం తాండవిస్తూంటుంది. జీవం ఉండదు. పిల్లలు లేని కాలేజీ పక్షులెగిరిపోయిన వేడాంతంగళ్ (వలసపక్షులు వచ్చే ఒక ఊరు) లా అనిపించకమానదు. 5. సెలవుల్లో కాలేజీ సెలవుల్లో కాలేజీ పక్షులెగిరి పోయిన వేడాంతంగళ్ లా ఉంది. ఇసుక తుఫానులో తడిచిన ఖర్జూరపు చెట్టులా కాలేజీ గదుల కళ్ళపై ధూళి పొర పరచుకొంది. సరస్వతీ దేవికి నిద్రా భంగం కాకూడదని కామోసు ఇస్మాయిల్* నడచిన చెట్టుపై చిలకల సందడి విరామం తీసుకుంది. ఉపన్యాసాల పావురాళ్ళను ఎగరేసే తరగతి గదులు వర్జించిన పక్షిగూళ్ళై నిశ్శబ్ధాన్ని ధరించాయి. తమపై వ్రాసిన ప్రేమరాతలను చదువుకొంటున్న చెక్క బల్లలు వసంతంలో భ్రమరాలతో తమ సరాగాల్ని తలపోసుకొంటున్నాయి. శలవుల్లో కాలేజీ మొత్తం విత్తనాలకై ఎండబెట్టిన బీరకాయలా పొడిపొడిగా ఉంది. కోతకోసిన వరిచేను దుబ్బుల జీవరాహిత్యం గ్రవుండులోని పాదముద్రలలోకి ప్రవహించింది. విద్యార్ధుల్లేని కాలేజీ తలతెగిన వృక్షంలా, వృక్షాల్ని నరికిన వనంలా వనాల్ని మింగిన శిశిరంలా ఉంది. అచ్చు పగలు చూస్తే రాత్రి కవితలోకొచ్చేలా. OCTOBER 14, 2008 *ఇస్మాయిల్ గారు నేను పనిచేస్తున్న కాలేజీలో పనిచేసారు **** కాలేజ్ వయసుకు వచ్చిన విద్యార్ధులు తమ వ్యక్తిగత సమస్యలను చెప్పుకోవటం న్యూనతగా భావిస్తారు. అంత గమ్ముని ఓపెన్ అవ్వరు. టీచర్ల వద్దకూడా. అయినప్పటికీ కొన్ని కొన్ని కుటుంబసమస్యలు కాలేజీ వరకూ కూడా వస్తుంటాయి. ఇవి ఎక్కువగా ప్రేమ వ్యవహారాలుగా ఉంటాయి. వాటిని తీర్చటంలో మా పాత్ర పెద్దగా ఏమీ ఉండదు. కానీ ఈ కవితలోని సమస్య నన్ను చాన్నాళ్లు వెన్నాడింది. . 6. నీటిపొర తాగుడు పై సదభిప్రాయం లేకపోయినా దురభిప్రాయం మాత్రం ఉండేది కాదు అదో పురాతన విలాసం కదాని కానీ మొన్నోరోజు మా కాలేజీలో ఓ విద్యార్ధిని తండ్రి తన కూతుర్ని నలుగురెదుటా బూతులు తిడుతూ అవమానించినపుడు ఆమె కనుల నీటిపొరలో తాగుబోతు తండ్రులందరూ దగ్ధమైపోవాలనుకొన్నాను “కొయిటా అమ్మ నా పేర్న పంపించే డబ్బుల కోసమే ఇదంతా” అని ఆ అమ్మాయి అన్నప్పుడు ఆ నీటిపొరలో ఈ మద్యప్రపంచం కొట్టుకు పోవాలనుకొన్నాను గత ఘర్షణల గాయాల్ని చూపించినపుడు ఆ నీటిపొరలో ఈ మదపు నేల నిలువునా కృంగి పోవాలనుకొన్నాను సముద్రాన్నీదటానికి పూచికపుల్లంత నమ్మకాన్ని తప్ప ఏమివ్వగలిగాం? ఆరోజా అమ్మాయికి ***** మూడ్రోజుల తరువాత ముత్యాల్లాంటి అక్షరాలతో ఎసైన్మెంట్ రాసుకొచ్చిన ఆ అమ్మాయి కనుల నీటిపొరలో ఎన్నెన్ని సౌందర్యాలు ! October 30, 2014 *** ప్రభుత్వకళాశాలల్లో చదివే విద్యార్ధులు ఎక్కువగా దిగువతరగతులకు చెందినవారు. చాలామందికి చిన్నవయసునుంచే సంపాదించటం అనివార్యమైన బాధ్యత. కాలేజ్ డిస్కంటిన్యూ చేసిన పిల్లలు ఎక్కువగా అప్పట్లో ఆటో డ్రైవర్లుగా కుదురుకోవటం ఉండేది. అలా నాకు ఇష్టమైన విద్యార్ధి ఆటో డ్రైవరుగా మారి ప్రమాదంలో మరణించాడు. అతని ఇంటిమీదుగానే కాలేజీకి వెళ్ళేవాడిని. ఆ సందర్భం ఈ కవితకు నేపథ్యం. . 7. ఎందుకో తెలియటం లేదు......... ఎందుకో తెలియటం లేదు కానీ ఆ వీధిలోంచి వెళ్ళాలనిపించటం లేదు. ఆ గుడిసె ముందు ఆ ఆటోని చూసినప్పుడల్లా యాక్సిడంటులో నుజ్జు నుజ్జయిన ఆ ఆటోని చూసినప్పుడల్లా పగిలిన దాని హెడ్ లైట్ నిస్తేజాన్ని చూసినప్పుడల్లా.... "అటెండెన్స్ సరిపోలేదని స్కాలర్ షిప్ నిలుపు చేసేసారు సార్ డబ్బు చాలా అవసరం హెల్ప్ చేసి పెట్టండి సార్" అని అభ్యర్దించిన ఆ కుర్రవాని కనులే జ్ఞాపకం వస్తున్నాయి. కాగితాలు, కంప్యూటర్లూ జీవితాల్లోకి చూడలేవన్న విషయాన్ని ఎలా చెప్పగలిగానూ? ఆ వీధిలో, ఆ గుడిసె ముందు నిలిచిపోయిన ఆ ఆటోని చూసినప్పుడల్లా.... రంగువెలసీ, తుప్పు పట్టీ, గడ్డి మొలచీ శిధిలమౌతున్న ఆ ఆటోని చూసినప్పుడల్లా..... చాన్నాళ్ళ తరువాత ఆటో నడుపుతూ కనిపించిన వాడు "దేవుని కృప వల్ల అంతో ఇంతో సంపాదిస్తున్నాను కదా, నువ్వింక రిక్షా తొక్కడం మానేయమంటే వినటం లేదు సార్ మా నాన్న" అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి. క్లాస్ రూమ్స్ లో ఎప్పటికీ నేర్వలేని పాఠాలవి. ఆ రోజు వాడెంత ముద్దొచ్చాడనీ! యాక్సిడెంటులో నుజ్జు నుజ్జయిన వాడి ఆటో పక్కనే కొత్తగా గ్రీజు పెట్టిన డొక్కు రిక్షాను చూసినప్పటి నుంచీ ....... ఎందుకో తెలియటం లేదు కానీ .... .... MONDAY, JANUARY 24, 2011 *** ఇటీవల కాలేజీలలో ఉచిత వైఫై అమరుస్తున్నారు. ఇప్పుడంటే ఆన్ లైన్ పాఠాలు కానీ ఈ కవిత వ్రాసే సమయానికి అంత లేదు. అయినప్పటికీ విద్యార్ధులు ఉచిత వైఫిని వాడుకొంటూ టిక్ టాక్ లు చూస్తూ సమయాన్ని వృధాచేసుకోవటం గమనించి వ్రాసిన కవిత ఇది. నిజానికి పిల్లలే కాదు నేడు అందరూ కూడా సెల్ ఫోన్ కు దగ్గరై, మానవసంబంధాలకు దూరమై జీవిస్తోన్న చిత్రమైన కాలమిది. రంగురంగుల మాటల చిలుకలు ఎగిరే కాలాన్ని స్వప్నిస్తూ.... . 8. ఫ్రీ వైఫై కాంపస్ చెట్టునీడలో కూర్చొన్న విద్యార్దుల గుంపు వెలుతురు తెరలో దూకి వైఫై సముద్రంలో తేలింది. దారాన్ని స్రవించుకొని కాళ్లతో పేనుకొంటూ తనచుట్టూ తానే గూడు నిర్మించుకొనే పురుగులా ప్రతీ విద్యార్ధీ తనచుట్టూ ఓ మౌన పంజరాన్ని దిగేసుకొన్నాడు. వైఫై లింక్ తెగింది ఓహ్! షిట్..... గూడులోంచి సీతాకోక చిలుక మెత్త మెత్తగా బయటపడినట్లుగా ఒక్కో విద్యార్ధీ మాటల ప్రపంచంలోకి మెల మెల్లగా మేల్కొన్నాడు. కాసేపటికి కాంపస్ అంతా రంగు రంగుల మాటల చిలుకలు రెక్కల్లల్లార్చుకొంటూ ఎగురుతో! DECEMBER 19, 2015 బొల్లోజు బాబా

Tuesday, January 5, 2021

ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు- ఒక పరిశీలన

 ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు- ఒక పరిశీలన

తెలుగులో సాహిత్యవిమర్శకు సంబంధించి చాలా తక్కువ పుస్తకాలు వచ్చాయి. ఒక నిర్ధిష్టమైన సాహిత్యసిద్ధాంతాన్ని ప్రతిపాదించే పుస్తకాలు దాదాపు మృగ్యమనే చెప్పుకోవచ్చు. ఇటీవలి కాలంలో ప్రముఖ విమర్శకుడు శ్రీ సీతారంగారి వాల్ మీద ఈ అంశంపై మంచి చర్చ జరిగింది. ప్రముఖ కవి, విమర్శకులు, నవలా రచయిత శ్రీ సాగర్ శ్రీరామకవచం గారు “ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు” పేరిట ఒక విమర్శనాత్మకవ్యాస సంపుటిని వెలువరించారు. దీనిలో వారు సాహిత్యాన్ని అర్ధం చేసుకోవటానికి, విశ్లేషించటానికి, విమర్శచేయటానికి ఉపయుక్తంగా ఉండేలా ఒక సాహిత్యసిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనిని “ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు” అనే పేరుతో వ్యవహరించారు. ఇది ఆసక్తిదాయకంగా ఉండటమే కాక ఎంతో ఆలోచనాత్మకంగా అనిపిస్తుంది.
కవిత్వంలో వస్తువు అంటే చెప్పబడిన అంశమని, శిల్పం అంటే చెప్పిన విధానమని సాధారణ నిర్వచనాలు. అంతే కాక ఈ రెండిటినీ విడదీయలేమనీ, వస్తువుకు తగ్గ శిల్పం అదే అమరుతుంది అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అంటే తీవ్రమైన ధిక్కారాన్ని పలికించటానికి “ఒరేయ్ లంజాకొడకా…” (శిఖామణి) అనే ప్రయోగం, దుఃఖపెట్టే వియోగభారాన్ని చెప్పటానికి “నీవులేవు నీ పాట ఉంది… (తిలక్) లాంటి లలితకోమల వ్యక్తీకరణలు వస్తు శిల్పాల ఆధారితను నిరూపిస్తాయి. ఒక రచనలోని వస్తు శిల్పాల మధ్య ఉండే సంబంధం, వాటి స్వరూపాల గురించి శ్రీరామకవచం గారు లోతైన చర్చ చేసారు ఈ పుస్తకంలో.
***
ప్రచ్ఛన్న అంటే దాగి ఉండిన లేదా రహస్యంగా ఉండిన అని అర్ధం. ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు అంటే రచనలో కనిపించకుండా తెలుస్తూండే వస్తు శిల్పాలు అని. ఒక రచనలో పైకి కనిపించే వస్తువు వెనుక మరో వస్తువు, దానిని అనుసరిస్తూ మరో వస్తువు అదే విధంగా పైకి కనిపించే శిల్పం వెనుక మరో శిల్పం దాగి ఉంటుందని ఈ సిద్ధాంతకర్త ప్రతిపాదన. ఇలా కనిపించని వస్తుశిల్పాల సమాశ్రయమే ఆ రచన మొత్తం పాఠకునిలో కలిగించే రసస్పందన అంటారు. అంటే రచనలో పైకి కనిపించే వస్తు, శిల్పాలకు అతీతంగా అంతర్గతంగా భిన్న వస్తువులు శకలాలు శకలాలుగా, భిన్న శిల్ప రీతులు ఛాయలు ఛాయలుగా విస్తరించి ఉండి ఆ రచనను పండిస్తాయని చెపుతారు. ప్రచ్ఛన్న వస్తుశిల్పాల సిద్ధాంత నిర్వచనం వారిమాటల్లోనే….
వస్తువు యొక్క వస్తువు ప్రచ్ఛన్న వస్తువు!
శిల్పం యొక్క శిల్పం ప్రచ్ఛన్న శిల్పం!
ఇదే ప్రచ్ఛన్న వస్తుశిల్పాల ప్రచ్ఛన్న రహస్యయాత్ర రచనలో…
అది తొవ్వి తీయాల్సిన అవసరం ఎంతో వుంది…! భవిష్యత్తు విమర్శకి దాగిన పునాది ఇక్కడే ఉంది. అదే ప్రచ్ఛన్న సహిత్య అనాది రచనా చరిత్ర అవుతుంది. – సాగర్
ఒక కవి ఒక వస్తువును తీసుకొని దానికి సాహిత్యరూపం ఇచ్చేటపుడు ఆ వస్తువు స్వభావాన్ని సంపూర్ణంగా అర్ధం చెసుకోవాలి. ఆధునిక కాలంలో ఆ వస్తువు పరిణామశీలతను గుర్తించగలగాలి. అలా చేసినపుడే ఆ వస్తువుకు ఆ రచనలో కనిపించని ఆ వస్తువు యొక్క నీడలకు (ప్రచ్ఛన్న వస్తువు) మధ్య సమన్వయం ఏర్పడుతుంది. లేనట్లయితే అది కవియొక్క అజాగ్రత్తకి, అమాయకత్వానికి ఉదాహరణగా నిలబడుతుంది. ప్రచ్ఛన్న వస్తువు పొరలుపొరలుగా నిర్మితమైనప్పుడు గొప్ప మార్గం ఆవిష్కరింపబడుతుంది. రచనా నిర్మాణ క్రమంలో ప్రచ్ఛన్న వస్తువు ప్రధాన వస్తువుకి నీడలుగా, జాడలుగా విస్తరించి తత్ఫలితంగా రచన అద్భుత స్థాయికి చేరుకొంటుంది.
శిల్పం కూడా ఇదే పద్దతిని అనుసరించి, పైకి కనిపించే శిల్పం ప్రచ్ఛన్న శిల్పశకలాలుగా విడిపోయి భిన్న అనుభూతులకు తావిస్తుంది. ఒక కవి శిల్పనిర్వహణా రీతికి అతని సాంస్కృతిక వారసత్వం అవినాభాజ్యంగా ఉంటుందనే ప్రతిపాదన విలువైనది.
***
ఒక రచనలో కనిపించే ఏకసూత్రతను పట్టుకొని పాఠకులకు విప్పిచెప్పటానికి సాహిత్యసిద్ధాంతాలు దోహదపడతాయి. ఒక వాచకాన్ని ఎలా చూడాలో చెప్పటం సాహిత్యసిద్ధాంతం ముఖ్యోద్దేశంగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే కళ్లద్దాల వంటివి. శ్రీరామకవచం గారు తాను ప్రతిపాదించిన “ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు” సిద్ధాంతం ద్వారా, ఒక రచనలో పైకి కనిపించే వస్తువు వెనుక కనిపించని వస్తువులు అనేకం ఉండొచ్చునని, అదే పైకి చూపిస్తున్న శిల్పం వెనుక రహస్యమైన శిల్పశకలాలు ఉంటాయని, ఆ రచనను అర్ధం చేసుకోవాలన్నా, విమర్శించాలన్నా ఈ లోపలి పొరలను కూడా దర్శించవలసి ఉంటుందని చెపుతున్నారు. తెలుగు సాహిత్యం వస్తువాదకవిత్వానికి పెద్దపీటవేసి శిల్పాన్ని తృణీకరించిందని, వస్తు,శిల్పాల మధ్య వైరుధ్యాలు ఉండవని అనటం ద్వారా తెలుగు సాహిత్యానికి తీవ్ర నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. ఎండుకట్టెలో అగ్ని దాగి ఉన్నట్లు, నువ్వు గింజల్లో నూనె ఉన్నట్లు ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు చీకటివెలుగుల మాదిరి చలన నియమాలతో సాహిత్యంలో ప్రవర్ధిల్లుతాయి అంటారు.
శ్రీరామకవచం గారు ఈ పుస్తకంలో తమ సిద్ధాంతాన్ని అప్లై చేసి కొన్ని విపులమైన ఉదాహరణలు ఇచ్చి ఉంటే బాగుండేది.
***
ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు సిద్ధాంతం సాహిత్యవిశ్లేషణలో ఒక నూతన ఆవిష్కరణ. ప్రతీ ఆవిష్కరణా పూర్వరీతుల భుజాలపై నిలబడకుండా శూన్యంలోంచి రాలేదు. అలాగే ఈ సిద్ధాంతంలో మన పూర్వీకులు నిర్వచించిన రస సిద్ధాంతంలో కనిపిచే స్థాయీ భావాలు, సంచారీ, వ్యభిచారీ భావాలు లాంటి ఊహలను కొన్ని పోల్చుకొనవచ్చును. వాటిని ఆలంకారికులు వస్తు, శిల్పాలకు కాక రససిద్ధిని నిర్వచించటం కొరకు వినియోగించారు. అది వేరే సంగతి. ఒక కవితలో వాచ్యార్ధాన్ని ఆ కవిత Extension గాను, ధ్వనిపూర్వక అర్ధాన్ని Intension గాను గుర్తించాలంటాడు అలన్ టాటె. ఈ రెండు సమపాళ్లలో బింబప్రతిబింబాలుగా, బిగుతుగా, ఒకదానితో ఒకటి పోటీపడేటట్లుగ ఉండే స్థితికి ఆ రెండు పదాలలోని ప్రిఫిక్స్ లను తొలగించి Tension అని పేరుపెట్టాడు. కవిత్వానికి కవిత్వశక్తినిచ్చేది Tension మాత్రమే అంటాడు. ఇది కూడా శ్రీరామకవచంగారు చెపుతోన్న వస్తు, శిల్ప శకలాల నిర్వచనానికి దగ్గరగా అనిపిస్తుంది. ఈ పోలికలు ఈ రచయిత కృషిని తక్కువ అంచనా వేయటంగా కాక ప్రతిపాదిత సిద్ధాంతపు విస్తృతిగా అర్ధంచేసుకోవాలి.
శ్రీరామకవచంగారు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన రీతి, విశ్లేషించిన తీరు ఆమోదయోగ్యంగా ఉన్నది. ఇంతవరకూ తెలుగు సాహిత్యచరిత్రలో ఇది నేను ప్రతిపాదిస్తున్న సాహిత్యసిద్ధాంతం అని ఎవరూ ప్రకటించుకొన్న దాఖలాలు కనిపించవు. ప్రాత్య, పాశ్చాత్య సిద్ధాంతాలను సమన్వయపరుస్తూనో లేక దిగుమతి చేసుకొనో వచ్చిన వివరణలే తప్ప. ఆ రకంగా ఇది గొప్ప ప్రయత్నం. ప్రతి తెలుగు కవి, విమర్శకుడు తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ కోణంలోంచి కూడా సాహిత్యాన్ని దర్శించే దృష్టిని ఏర్పరుచుకోవటం అవసరం.
***
ఈ పుస్తకాన్ని మూడు అధ్యాయాలుగా విభజించారు. మొదటి అధ్యాయంలో “ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు” సిద్ధాంతాన్ని చాలా విపులంగా చర్చించారు. మిగిలిన రెండు భాగాలలో సాహిత్యంపై, విమర్శపై తన అభిప్రాయాలను పంచుకొన్నారు. చాలా అభిప్రాయాలు సమకాలీన సాహిత్యరీతులను, అపసవ్యతలను ప్రతిబింబించాయి. చాల విలువైన, వివాదాస్పదం అయ్యేటటువంటి అంశాలను కూడా ఏ శషభిషలకు తావివ్వకుండా చర్చించారు. వీటిలో వివిధ అస్తిత్వవాద ఉద్యమాలు గురించి; కీర్తివెంట పరుగులెత్తే వారిపై; ప్రాచీనతకు నవ్యత్వం సాధించే అవసరతపైనా; ప్రవచనకారులుగా మారిన సాహిత్యకారులపై; ఆధునిక విమర్శ మన లాక్షణికుల సిద్ధాంతాలను గుడ్డిగా తిరస్కరించటం పట్లా; శకలీకరణ పాలకవర్గాలకు ఉపయోగపడింది అనటం లాంటి స్టేట్మెంట్స్ చాలా లోతైనవి. వాటిని రచయిత ఎలా సమర్ధించారన్నది తెలుసుకోవాలనుకొనే వారు పుస్తకాన్ని చదివాల్సిందే. “పోస్ట్ మోడర్నిజం సిద్ధాంతపరిచయం” పేరిట ఉన్న వ్యాసంలో ఆ సిద్ధాంతం యొక్క చారిత్రిక పరిణామాన్ని, అది తీసుకొచ్చిన మార్పులను చాలా గొప్పగా ఆవిష్కరించారు.
ఈ పుస్తకం కవులకు, విమర్శకులకు కరదీపికగా నిలుస్తుందనటంలో సందేహం లేదు.
బొల్లోజు బాబా
పుస్తకం లభించు చోటు
ఫోన్: 9121683515
ప్రచురణ
నవ్యాంధ్ర రచయితల సంఘం
విజయవాడ.



Indian Literature, Sahitya Akademi's Bimonthly Journal - లో నా కవిత్వం

 Indian Literature, Sahitya Akademi's Bimonthly Journal. నేను డిగ్రీ చదువుతున్నప్పటినుంచి ఈ పత్రికను ఫాలో అయ్యేవాడిని. ఇంటర్ నెట్ రాకముందు సమకాలీన భారతీయ కవిత్వం చదవాలంటే Indian Literature, త్రివేణి పత్రికలే ఆధారంగా ఉండేవి.

Indian Literature పత్రికలోని నాకునచ్చిన కవితలను అనేక సందర్భాలలో అనువదించాను. అలా ప్రముఖ భారతీయకవులైన Sri Satchidanandan, Kedarnath singh, Chandrakant Deotale, Vatsyayan Agyeya, P.P. Ramachandran, Surjit pattar, Aashish Thakur, Lal Singh Dil, Eunice de Souza, Kanupriya Dhingra, Subhash Mukhopadhyay వంటి వారి కొన్ని కవితలను అనువదించి నా బ్లాగు https://sahitheeyanam.blogspot.com/ లో పోస్ట్ చేస్తూవచ్చాను.
***
Indian Literature మే-జూన్ 2020 సంచిక నాకెంతో ప్రత్యేకమైనది. దీనిలో నా కవితానువాదాలు ప్రచురింపబడటం నా కెంతో ఆనందాన్ని తృప్తిని ఇచ్చిన సందర్భం.
ఆ పత్రికా సంపాదకులకు ధన్యవాదములు. ఈ కవితలలో చాలామట్టుకు స్వీయానువాదాలు, మరికొన్నింటిని శ్రీ నౌడూరి మూర్తిగారు, శ్రీ ఆర్య గారు అనువదించారు. వారికి కృతజ్ఞతలు.
ఈ పిక్స్ పంపిన మిత్రులు రవీందర్ గారికి ధన్యవాదములు.
భవదీయుడు
బొల్లోజు బాబా






























మిత్రులకు విన్నపం

 మిత్రులకు విన్నపం

నేను ఇంతవరకూ ఏడు పుస్తకాలు వెలువరించాను - రెండు చరిత్రపై, మూడు కవిత్వసంపుటులు, ఒక అనువాదం, మరొకటి సాహిత్య వ్యాసాలు. ఇవన్నీ నేను సొంతంగా ప్రచురించుకొన్నవి.
నా ఎనిమిదవ పుస్తకం "మెకంజి కైఫియ్యతులు- తూర్పుగోదావరి జిల్లా". ఈ పుస్తకావిష్కరణ ఈ రోజు కాకినాడలో జరిగింది.
ఈ పుస్తకాన్ని పల్లవి పబ్లికేషన్స్, అధినేత Sri. Sv Narayana గారు ముద్రించారు. ఖరీదైన పేపరు, మంచి ప్రింటింగ్ క్వాలిటీ.
ఈ పుస్తకం విజయవాడ పుస్తక ప్రదర్శనలో పల్లవి స్టాల్ నందు లభిస్తుంది.
శ్రీ నారాయణ గారి ఫోన్ నంబరు: 98661 15655
.
మిత్రులారా...... దయచేసి...... ఈ పుస్తకాన్ని కొని చదవండి.
.
మీరు నేరుగా కొనటం కానీ, ఫోన్ ద్వారా సంప్రదించి తెప్పించుకోవటం కానీ చేస్తారని ఆశిస్తున్నాను.
***
ఈ రోజు పుస్తకావిష్కరణ సభా విశేషాలు ఇవి.
.
మెకంజీ కైఫియ్యతులు -తూర్పుగోదావరి జిల్లా పుస్తకావిష్కరణ
తూర్పుగోదావరిజిల్లా చరిత్ర-సంస్కృతి సామాజిక విషయాల అధ్యయన సంస్థ, కార్యదర్శి డా. పి.చిరంజీవిని కుమారి అధ్యక్షతలో జరిగిన సభలో ప్రముఖ కవి, చరిత్రకారుడు శ్రీ బొల్లోజు బాబా రచించిన "మెకంజీ కైఫియ్యతులు- తూర్పుగోదావరి జిల్లా" పుస్తక ఆవిష్కరణ జరిగింది.
ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన డా. పి. చిరంజీవిని కుమారి మాట్లాడుతూ "బ్రిటిష్ వారు భారతీయులకు చరిత్ర లేదు అనే అభిప్రాయాలను కలిగి ఉండేవారు, కానీ మన ప్రాచినులు దండకవిలెలలో అనూచానంగా మన చరిత్రను లిఖించుకొంటూ వచ్చేవారు. వాటిని బ్రిటిష్ అధికారి కాలిన్ మెకంజీ సేకరించి కైఫియ్యతుల పేరుతో భద్రపరిచాడు. ఈ కైఫియ్యతుల అధ్యయనంలో ఒక ప్రాంతపు ప్రజలు తమచరిత్రను ఏ విధంగా సృష్టించుకొన్నారు అనేది తెలుస్తుందని, ఏ దేశ చరిత్ర అయినా ఆ దేశంలోని ప్రాంతాలు, గ్రామాలు, వాడలలో జనం ఎలా జీవించారు, ఏ విధంగా పాలించబడ్డారు, మరి ఏ విధంగా మలుపు తీసుకుంటూ వచ్చారు అనేది వెలికితీయటం చరిత్రకారుల విధి - ఆ విధంగా రెండువందల ఏండ్ల క్రితం బ్రిటిష్ అధికారి కొలిన్ మెకంజీ సేకరించిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన స్థానికచరిత్రల కైఫియ్యతులను శ్రీ బొల్లోజు బాబా పుస్తకరూపంలోకి తీసుకురావటం అభినందనీయమని" అన్నారు.
సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గనరా మాట్లాడుతూ "తూర్పుగోదావరి జిల్లాచరిత్రకు సంబంధించి ఈ పుస్తకం ఎంతో విలువైనదని, దీనిద్వారా ఒకప్పటి ఈ ప్రాంత సామాన్య ప్రజలు ఎలాజీవించారు, వారి అనుభవాలు, ఆనాటి రాజకీయాలు అర్ధం చేసుకోవటానికి ఎంతో సహకరిస్తుందని, ఆంధ్రప్రదేష్ కు చెందిన పదమూడు జిల్లాలలో ఇంతవరకూ పది జిల్లాలకు చెందిన కైఫియ్యతులు పుస్తకరూపంలో వచ్చాయని, మన జిల్లాకు చెందిన కైఫియ్యతులు ఇంతవరకూ పుస్తకరూపంలో రాలేదని- తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మెకంజీ కైఫియ్యతులను ఎంతో శ్రమకోడ్చి శ్రీ బొల్లోజు బాబా సేకరించి వాటిని, సమకాలీన భాషలోకి మార్చి, లోతైన విశ్లేషణలతో, సమగ్రంగా చేసిన ఈ రచన కైఫియ్యతులను ఎలా అర్ధం చేసుకోవాలి, ఎలా సమకాలీన పఠితలకు అందించాలి అనే విషయంలో ఒక నమూనాగా నిలిచిపోతుందని" అన్నారు.
పుస్తక రచయిత శ్రీ బొల్లోజు బాబా మాట్లాడుతూ - భారతదేశ సర్వేయర్ జనరల్ గా పనిచేసిన కాలిన్ మెకంజీ మొత్తం రెండువేలకు పైబడి కైఫియ్యతులు అని పిలవబడే స్థానిక చరిత్రలను సేకరించాడు. వీటిలో తూర్పుగోదావరికి జిల్లాకు చెందిన రాజమహేంద్రవరం, కోరుకొండ, సామర్లకోట లాంటి మొత్తం పది ప్రాంతాల స్థానికచరిత్రలను 1814-15 ప్రాంతాలలో సేకరించాడు. ఇవి సమగ్రంగా ఇంతవరకూ పుస్తకరూపంలో రాలేదు. "మెకంజి కైఫియ్యతులు-తూర్పుగోదావరి జిల్లా" పుస్తకం ఆ లోటు తీరుస్తుందని భావిస్తున్నానని, ఈ పుస్తక ఆవిష్కర్తకు, ప్రచురించిన పల్లవి పబ్లికేషన్స్, ఫోన్:9866115655 వారికి కృతజ్ఞతలు తెలియచేసారు.
ఈ సభలో ఇంకా ప్రముఖకవి విమర్శకులు శ్రీ మాకినీడి సూర్యభాస్కర్, ప్రముఖరచయిత్రి పద్మజావాణి, ఐడియల్ కాలేజ్ అధికారి శ్రీ వర్మ, శ్రీ గౌరినాయుడు, శ్రీ సుబ్బారావు, శ్రీ సరిపల్లి శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.
****
కాపీల కొరకు
శ్రీ ఎస్వి నారాయణ ఫోన్ నంబరు: 98661 15655
పల్లవి పబ్లికేషన్స్
పేజీలు-192. వెల 200/-
దయచేసి సంప్రదించండి.
.
బొల్లోజు బాబా


మెకంజీ కైఫియ్యతులు - పుస్తకావిష్కరణ

 https://www.facebook.com/vbfsociety/videos/1012625015906701

మెకంజీ కైఫియ్యతులు - తూర్పుగోదావరి జిల్లా - పుస్తకావిష్కరణ

 ప్రెస్ కవరేజ్ - తాంక్యూ పాత్రికేయ మిత్రులారా

పుస్తకం కొరకు 9866115655 లో పల్లవి పబ్లికేషన్స్ వారిని సంప్రదించగలరు.
బొల్లోజు బాబా






మెకంజీ కైఫియ్యతులు - దాట్ల దేవదానం రాజు గారి పరిచయం

నేను నిత్యం స్ఫూర్తి పొందే వ్యక్తులతో శ్రీ దాట్ల దేవదానం రాజు గారు ముఖ్యులు. కవిగా, కాలమిస్ట్ గా, కథకునిగా, చరిత్రకారునిగా వారి కృషి అసమాన్యమైనది.
సమకాలీన చరిత్రకారునిగా వారు చేసిన ఈ సమీక్ష నాకెంతో విలువైనది. రాజు గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను
బొల్లోజు బాబా
****
.
చదవాల్సిన పుస్తకాలు ఎదురుగా వేచి చూస్తున్నాయి. వాటిని పక్కనబెట్టి బొల్లోజు బాబా 'తూర్పుగోదావరి జిల్లా - మెకంజీ కైఫియ్యతులు' చేతిలోకి తీసుకొన్నాను. దానికి కారణం మా ప్రాంతం గతం తాలూకు విశేషాల్ని తెలుసుకోవాలనే ఉత్సుకత ఒక్కటే కాదు మా బాబా ఏం రాశారో చూడాలని ఆతురత కూడా ఉంది. చాలా సంవత్సరాల క్రితం దినపత్రికలో ఒక వార్త నన్నెంతో ఆకర్షించింది. రాజస్థాన్ ప్రభుత్వం ఎనభై ఏళ్ళ వయసు ఉన్నవారి దగ్గర్నుంచి ఆయా గ్రామాల విశేషాల్నీ స్థలపురాణాల్నీ తెలుసుకుని గ్రంథస్థం చేస్తే ప్రభుత్వమే ముద్రిస్తుందని ఆ వార్త సారాంశం. ఆ తరం గతిస్తే వారితోనే అవి మురుగుపోతాయని భావించి వారుండగానే నమోదు చేయాలనే మహత్తర ఆలోచన అది. నాకు చాలా ఆనందం అనిపించింది. అది నన్ను యానాం చరిత్ర రాయడానికి పురిగొల్పడం కూడా జరిగింది. అది వేరే సంగతి.

కైఫియ్యతుల ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. మెకంజీకి ఏం అవసరం ఉండి వీటి పట్ల ఆసక్తి చూపించాడో తెలియదు. సేకరణ పనిని గ్రామకరణాలకు అప్పగించాడు. వారు రాసిందాన్ని జాగ్రత్త చేశాడు. భాషకు సంబంధించి పండితులు కారు వారు. విన్నది విన్నట్టుగా ప్రచలితంలో ఉన్నది ఉన్నట్టుగా వచ్చిన భాషలో రాశారు. రాసేటప్పుడు వారి నమ్మకాలూ విశ్వాసాలూ అందులో చోటు చేసుకోవడం తప్పదు. వాటిని మరలా నేటికాలానికి సరిపడా వాడుకభాషలో మార్చి రాయడం లోనే అసలు ప్రతిభ ఉంటుంది.
 
బొల్లోజు బాబా తన ముందుమాట లోనే చెప్పారు. పొడవుగా ఉన్న వాక్యాన్ని తను ఎలా విడగొట్టి రాయడం జరిగిందో అసలు వాక్యంతో బాటు తిరగ రాసిన వాక్యం ఉదహరించారు. తన విధానం చెప్పారన్నమాట. జరిగుండొచ్చు భావించొచ్చు అనుకోవచ్చు అంటూ తను రాసింది తన వ్యక్తిగత అభిప్రాయమే తప్ప నిర్ధారణ కాదు అన్నట్టుగానే చెప్పారు. చరిత్రను కొన్ని చోట్ల ఊహించాల్సి ఉంటుందన్నది నిజమే. ఆ ఊహకు కొన్ని ప్రాతిపదికలుండాలనేది ఒక వాస్తవం.
 
సర్కారు జిల్లాల నుంచి ఫ్రెంచి వారి నిష్క్రమణ చరిత్ర ఆధారంగానే (కైఫియతులు ఆధారం కాదు) చక్కగా చెప్పారు. ఇక గ్రామ కైఫియ్యతులు ద్వారా మనం కొత్తగా తెలుసుకునే అంశాలేమిటో చదివితేనే అర్ధం అవుతుంది. స్థల పురాణాలు అంటే కొన్ని కట్టుకథలు వ్యాప్తిలోకి తెచ్చి ఆయా దేవాలయాలకు మహిమలు కలిగించడం ద్వారా భక్తి వ్యాప్తి చేయడానికే అనుకొంటాను. ఇవన్నీ వాస్తవానికి దూరంగానే ఉంటాయి. సరదాగా చదువుకోడానికి ఉపయోగపడ్తాయి.

బొల్లోజు బాబా దృష్టి ఎప్పుడూ ఖాళీలను భర్తీ చేసే దాని మీదే ఉంటుంది. మెకంజీ ఎక్కువ కాలం సీమ ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడి కైఫియ్యతులనే ఎక్కువగా సేకరించాడు. తూర్పుగోదావరి జిల్లా కైఫీయతులు చాలా తక్కువగానే లభిస్తున్నాయి. వాటిని శ్రమకోర్చి, అంతర్జాలం, శాసనాలు, గ్రంధాల ద్వారా సేకరించి ఒక చోట గుదిగుచ్చి మనకు అందించారు. ఇప్పటి వరకు వెలుగు చూడని వీటిని సంస్కరించి రాయడంలో బాబా చేసిన విశేష కృషి ప్రతి పేజీలోనూ చూస్తాం. ఆధారాలను ఎక్కడికక్కడ ఇవ్వడం బావుంది.
 
తర్వాత చరిత్రపరంగా బొల్లోజు బాబా చూపు ఇపుడు దేని మీద పడుతుందో చూడాలి. ఇంత శ్రమనూ కాలాన్నీ వినియోగించి చేసిన కృషి తప్పక మంచి గుర్తింపును తెస్తుందని నమ్ముతున్నాను. కవిగా కవిత్వం, విమర్శకునిగా కవిత్వభాష, చరిత్రకారునిగా చారిత్రక విశేషాల్నీ అందించడం సృజననూ అవగాహనా పరిధినీ పెంచుకుంటూ వెళుతున్న బొల్లోజు బాబాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
.
- దాట్ల దేవదానం రాజు
(పుస్తకం దొరుకు చోటు - పల్లవి ప్రచురణలు, 9866115655)

ప్రముఖ హిందీకవి మంగలేష్ దబ్రాల్ కు నివాళిగా ఆయన కవిత్వానువాదాలు

 ప్రముఖ హిందీకవి మంగలేష్ దబ్రాల్ కు నివాళిగా ఆయన కవిత్వానువాదాలు


.
1. ఈ శీతాకాలం - This winter by Mangalesh Dabral
పోయిన శీతాకాలం చాలా బాధపెట్టింది
దాన్ని తలచుకొంటేనే వణుకు వస్తోంది
గత శీతాకాలం అమ్మ వెళ్ళిపోయింది
ఒక ప్రేమలేఖ కనపడకుండాపోయింది
ఒక ఉద్యోగం పోయింది
ఆ రాత్రులు ఎక్కడెక్కడ తిరిగానో గుర్తే లేదు
నేను చేసిన ఫోన్ కాల్స్, నా ఆత్మశకలాలూ
నాపై కుప్పకూలాయి
గత ఏడాది వేసుకొన్న దుస్తుల మూటల్ని విప్పదీసాను
దుప్పట్లు, మఫ్లర్లు, మంకీ కేప్ లు
వాటికేసి అలా తేరిపార చూసాను
ఆ రోజులు ముగిసిపోయాయి
ఈ శీతాకాలం అంత కఠినంగా ఉండదు... నిజంగానే!
.
2. తాత గారి ఫొటో - Grandfather's Photograph by Mangalesh Dabral
మా తాతగారికి ఫొటోలు తీయించుకోవటం
పెద్దగా ఇష్టం ఉండేది కాదేమో లేదా టైమ్ చిక్కలేదో
ఒకే ఒక ఫొటో ఉంది ఆయనిది
నీళ్ళబరువుతో వేలాడే మబ్బులా
రంగువెలసిన గోడకి తగిలించి
మా తాతగారి గురించి మాకు తెలిసిందల్లా
ఆయన బిచ్చగాళ్ళకు దానాలు చేసేవాడని
రాత్రుళ్ళు నిద్రపట్టక అటూ ఇటూ దొర్లేవాడని
ఉదయం తన పక్కను చక్కగా సర్దుకొనేవాడనీ.. అంతే
నేను అప్పటికి చాలా చిన్నపిల్లాడ్ని
ఆయన అమాయికత్వం కానీ కోపం కానీ ఎప్పుడూ చూడలేదు
ఫొటోలు మనుషుల అంతరంగాల్ని ఎన్నటికీ చెప్పలేవు.
అమ్మ అంటూండేది
మేం నిద్రపోతున్నప్పుడు
రాత్రిపూట మమ్మల్ని చుట్టుముట్టే వింత వింత జీవుల్ని
మా తాత ఫొటోలో మెలకువుగా ఉండి కాపలా కాస్తాడని
నేను మా తాత అంత ఎత్తు అవ్వలేదు
అంత శాంతంగానూ, గంభీరంగాను కూడా
కానీ ఆయన లక్షణాలు నాలో ఏమూలో ఉన్నాయనే అనుకొంటాను
ఆ అమాయికత్వం, ఆ కోపం.
నేనూ తలదించుకొనే నడుస్తాను
ప్రతీరోజూ ఒక ఖాళీ ఫొటో ఫ్రేములో
నన్ను నేను చూసుకొంటూంటాను.
మూలం. Mangalesh Dabral
అనువాదం: బొల్లోజు బాబా
Image may contain: 1 person, glasses
Kavi Yakoob, Sailaja Kallakuri and 122 others
20 comments
8 shares
Like
Comment
Share