Thursday, November 20, 2008

నైట్ షిఫ్ట్ కేబిన్ మాస్టర్

పట్టాలపై రైలుబండి
మిణుగురుల దండలా మెరుస్తోంది.
నిదురించే ప్రయాణీకులు
గమ్యాల్ని స్వప్నిస్తున్నారు.

వాడు మాత్రం
నిద్రను నిలువునా పాతరేసి
ఎరుపు ఆకుపచ్చ కాంతుల చేతులతో
ప్రతి రైలునూ నిలుపుతూ, పంపుతూ ఉంటాడు.

వాడూపిన పచ్చ జండాకి
వేయి స్వప్నాల్ని కడుపులో మోస్తున్న
ఇనుప అనకొండా భారంగా కదుల్తుంది.

ప్రయాణీకులు నిదురలో గమ్యాల్ని
పలవరిస్తూ ఉంటారు.

నూటనాలుగు జ్వరంతో ఉన్న వాడి కూతురుపై
కలిగిన ఆలోచనల్ని గౌతమీ ఎక్స్ ప్రెస్
తన చక్రాల పాదాలతో తొక్కేస్తుంది.
ఇంటివద్ద సగం ఖాళీగా ఉండే మంచపు తలపుల్ని
గూడ్సుబండి ఎక్కించుకు తీస్కుపోతుంది.
నిదురలో వీని మెడచుట్టూ చేతులువేసి
దగ్గరకు లాక్కొనే జీవనానురాగాలకు
వీడెప్పుడూ ఓ జీవిత కాలం లేటే.

ఒక్కోరాత్రి అరవై, డభ్బై రైళ్లను పంపించి
తెల్లారేసరికల్లా వీడో రైలు చక్రంలా మారిపోతాడు.

అదేపట్టాపై, అదే చక్రం అనంత దూరాలు సాగినట్లుగా
ఎరుపు, ఆకుపచ్చ కాంతుల మధ్య వీని జీవితం
జీవరాహిత్య గూడ్సు బండిలా సాగుతూంటుంది .

పట్టాకు చక్రానికి మధ్య నలిగిన రూపాయి బిళ్లలా
షిఫ్టుకీ, షిఫ్టుకీ మధ్య వీడి జీవగడియారం చితికి
ఎపుడో వచ్చే వృద్ధాప్యాన్ని ఇపుడే బోనస్ గా అందిస్తుంది.

నిదురించే ప్రయాణీకులు
గమ్యాలను మాత్రమే స్వప్నిస్తూంటారు.

వీని ఒక్క పొరపాటు
వేయి శవాలను పీల్చుకొనే మూడడుగుల నేలనే సత్యం
వీడి నరాలలో పాదరస ప్రవాహాల్ని పరుగులెట్టిస్తుంది.

తప్పుకొన్న పట్టాలమధ్య పొంచిఉన్న ప్రమాదాన్ని గుర్తించి
వీడో నిలువెత్తు ఎర్రజెండాయై
పరిగెత్తే రైలుకు ఎదురెల్తూవేసిన వెర్రికేకలు
అసహనపు ప్రయాణీకుల తిట్లలో కరిగిపోతాయి.

మెలుకువ గాజు పెంకులపై
వీడు చేసిన తపస్సు ఫలితంగా
నిదురించే ప్రయాణీకులు
తమ తమ గమ్యాలలోకి మేల్కొంటారు.

బొల్లోజు బాబా

11 comments:

  1. బాబా గారు చాలా హృద్యంగా రాసారు. మీరు ఏమి అనుకోను అంటే ఒక మాట... స్టేషన్ మాస్టర్ కన్నా కూడా కీమేన్ కాని, గేట్ మేన్ ను కాని తీసుకొని ఉంటే ఏలా ఉండేది అంటారు. దయచేసి క్షమించగలరు... తప్పైతే ...

    ReplyDelete
  2. చాలా బాగుంది బాబా గారు, ఎండ్లూరి "ఘూర్ఖా" గుర్తొచ్చింది మళ్ళీ!

    ReplyDelete
  3. కళ్ళకు కట్టి నట్టు చెప్పారు .స్టేషను మాస్టర్ డ్యూటీ +కర్తవ్యం గురించి మంచి కవిత,

    ReplyDelete
  4. బాగుంది గురువుగారు.... హృదయాన్ని చలింపచేసింది....

    మీ శ్రీసత్య...

    ReplyDelete
  5. అతని జీవన చిత్రాన్ని చక్కగా ఆవిష్కరించారు...కంగ్రాట్స్ బాబా.. !

    ReplyDelete
  6. చాలా చాలా బాగుంది బాబా గారు.
    ప్రతీ వాక్యం మనసుకి హత్తుకునేలా రాసారు.

    మీరు రాసిన క్రింది వాక్యాలు అద్భుతంగా ఉన్నాయి.

    "పట్టాలపై రైలుబండి మిణుగురుల దండలా మెరుస్తోంది."

    "వేయి స్వప్నాల్ని కడుపులో మోస్తున్న ఇనుప అనకొండా భారంగా కదుల్తుంది"

    "జీవితం జీవరాహిత్య గూడ్సు బండిలా సాగుతూంటుంది "

    "జీవగడియారం చితికి ఎపుడో వచ్చే వృద్ధాప్యాన్ని ఇపుడే బోనస్ గా అందిస్తుంది"

    "వీని ఒక్క పొరపాటు వేయి శవాలను పీల్చుకొనే మూడడుగుల నేలనే సత్యం"

    ReplyDelete
  7. బాగా రాసారండి.సాక్షిలో మీ కవిత కూడా బాగుంది.

    ReplyDelete
  8. mee posting chaduvutunte aa drushyam kuudaa kallamundu vunnattugaa kanipistundandi.chaalaa baagaa raasaaru.

    ReplyDelete
  9. బాబా గారు చాలా బాగుంది. మనసుకు హత్తుకునేలా రాశారు.
    ' వాడు ' బదులు 'అతను ' వాడి ఉంటే ఇంకా బాగుండేదేమో.

    ReplyDelete
  10. i thank one and all for responding to my poem and encouraging me.

    i will give detailed reply soon.
    thank you one and all

    ReplyDelete
  11. ఈ మధ్య కొంచెం బిజీ గా ఉండి బ్లాగుల వైపు చూడలేదు.

    ఈ కవితను నా రైల్వే మిత్రుడు పట్టి పట్టి రాయించుకొని పట్టుకొని పోయాడు.
    మిత్రులు సూచించినట్లుగా దీనికి కొన్ని మార్పులు చేయ వలసి ఉందని అర్ధమైంది. ధన్యవాదములు.

    చైసా గారు
    మీ సూచన కరక్టేనండీ. స్టేషను మాస్టరనగానే కొంత సింపథీ డైల్యూట్ అవుతుంది. కనుకనే కేబిన్ మాస్టరని మార్చాను. గమనించి ఉంటారు. నిజానికి ఈ కవిత కూడా ఉత్తర దక్షిణ కేబిన్ లలో ఒంటరిగా నైట్ డ్యూటీ చేసే స్టేషను మాస్టర్లగురించి ( వీరిని కూడా కేడర్ ప్రకారం స్టేషను మాస్టరనే అంటారు)
    సూచించినందుకు చాలా చాలా ధన్యవాదములండీ.

    సుజాత గారు
    అభిమానం కొద్దీ అలా అంటారు కానీ ............

    వేదగారు
    థాంక్సండీ

    భగవాన్ గారు
    థాంక్సండీ

    బాలు గారు
    థాంక్సండీ. మీరు చాలా కవితలను ఒకేసారి చదివి కామెంట్లిచ్చారు. థాంక్సండీ.

    శాంతి రాజు గారు
    థాంక్సండీ. మీ అందరి ప్రోత్సాహం వల్లే సాధ్యపడుతుందండీ.

    వివెక్ గారు
    థాంక్యూ అండీ.

    ఆత్రేయ గారు
    మీసూచన కూడా బాగుంది. సూచించినందుకు ధన్యవాదములండి

    ReplyDelete