Thursday, October 23, 2008

ఒక జ్ఞాపకం.......


ఏకాంత సాయింకాలపు పలుచని వెలుతురులో

హృదయంలో విరిసిన సన్నజాజుల గానంలా
ఓ జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.

గుప్పిట రహస్యాలను విప్పిన నూత్న యవ్వన వనాల
పరిమళాలు విరజిమ్మే శీతాకాల రాత్రులలో
నీ సాంగత్యపు కొలిమిలో నన్ను నేను
వెచ్చచేసుకొని, కరిగించుకొని మరిగించుకొనే క్షణాన
వర్షించిన సౌందర్యానందం నిన్నూ నన్నూ
ఆకాశపుటంచుల వరకూ విసిరికొట్టిన
జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.

రొచ్చులు, రోతలూ, రేషన్లు, నెలసరి వాయిదాలూ
ఇంకా కబళించని రోజులలో
వెన్నెల పిట్టలు వాలిన పొగడ చెట్టు క్రింద
రాలిపడే పొగడపూల వానలో తడుస్తూ
పెదవులతో దేహవీణియలను మీటుకుంటూ
ఆ గానలోకంలో విచ్చలవిడిగా విహరించి
కనిపెట్టిన రహస్యాలను దాచుకొంటూ
దోచుకొంటూ, పంచుకొంటూ పరువులిడిన దూరాల
జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.

పోటీలు, పోలికలూ, పధకాలు, పన్నాగాల వలల్లో
ఇంకా చిక్కుకోని ఆ అకలుషిత దినాల్లో
పట్టుకుచ్చులతో స్పృశించే నారింజ కాంతుల రాత్రిలో
వాంఛ, అంగీకారం పెనవేసుకొన్న క్షణాన
నీ కురులమల్లియలను కాల్చేలా నా శ్వాస జ్వలించేవేళ
విచ్చుకొన్న పెదవులు, సగంమూసిన కనులతో
నీ సౌందర్యం శాటిన్ తెరై నా హృదయంపై పరచుకొన్నప్పుడు
ఒక అదృశ్య హస్తం నిన్నూ నన్నూ ఎత్తుకపోయి
కాలరహిత, ఆలోచనారహిత, చేతనారహిత స్థితిలో కప్పెట్టిన
జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.
********************

ఏమిటీ పరధ్యానం! వింటున్నారా?
స్కూలు ఫీజ్ కట్టటానికి రేపే ఆఖరు రోజుట.
చంటిదాన్ని హాస్పటల్ కి తీసుకెళ్ళాలి నంబరుబుక్ చేసారా?

జ్ఞాపకం హాయిగా సలుపుతుంది
వాస్తవం ముల్లుగర్రై పొడుస్తుంది.

బొల్లోజు బాబా

14 comments:

  1. ఊహ జ్ఞాపకం అయితే చాలా బావుంటుంది..
    వాస్తవం ఎప్పుడో కానీ జ్ఞాపకం కాదు.
    చివరి లైన్లు చదవగానే ఫక్కున నవ్వు వచ్చినా, మన సాటి మహిళా బ్లాగర్లు మీ మీద ఎక్కడ దండెత్తుతారేమోనని భయంగా వుందన్నయ్య గారు.

    ReplyDelete
  2. Tilak gurtu vaccaru i kavita lo.

    ReplyDelete
  3. 'జ్ఞాపకం హాయిగా సలుపుతుంది..'
    ఈ వాక్యం చాలా బాగుంది.
    కలల లోకం నుంచి సంసారంలోకి ఊడిపడితే రేషన్లూ, రొచ్చులూ తప్పవు మరి. ఏ కాస్త మెత్తని హృదయమో ఉన్నవారికి దాన్ని అర్ధం చేసుకునే భాగస్వామి దొరకడం అపురూపమే. అందాకా ఇలాంటి నిట్టూర్పులూ తప్పవు. ఇంకా మంచి కవితలు రాయాలి మీరు.

    ReplyDelete
  4. జ్ఞాపకం ఎప్పుడూ ఒక తొలి స్వప్నమే.
    "వెన్నెల పిట్టలు వాలిన పొగడ చెట్టు క్రింద
    రాలిపడే పొగడపూల వానలో తడుస్తూ" ఈ ఊహ ఎంత అద్భుతంగా ఉందో!! ఇలా మీరు మాత్రమే రాయగలరు.
    ప్రతాప్ ఏమి అంటున్నావు నువ్వు? నీ ఉద్దేశ్యం ఏమిటో కొద్దిగా అర్ధమయ్యేలా చెప్పు.

    ReplyDelete
  5. "నిన్నూ, నన్నూ ఆకాశపుటంచుల వరకూ విసిరికొట్టిన జ్ఞాపకం...."

    "వెన్నెల పిట్టలు వాలిన పొగడచెట్టు కింద"

    "జ్ఞాపకం హాయిగా సలుపుతుంది, వాస్తవం ముల్లుగర్రై పొడుస్తుంది.."

    అసలు మీకింత అద్భుతమైన.....ఏమన్నా అంటే ములగచెట్టెక్కిస్తున్నానంటారు కానీ....!

    @ప్రతాప్,
    ఇందులో మహిళా బ్లాగర్లు దండెత్తడానికేముంది చెప్పండి? వాస్తవం ఎప్పటికైనా వాస్తవమే! ముల్లుగర్రే!జ్ఞాపకం హాయిగా సలిపేది స్త్రీనైనా కావొచ్చు! పోనీ చివరి వాక్యాలు ఇలా ఉంటేనో!

    'ఏయ్, వంటయిందా,
    నా బట్టలు ఇస్త్రీ చేశావా లేదా....
    రేపు నేను బిజీ, స్కూలుకెళ్ళి ఫీజు కట్టి వచ్చే దార్లో గాస్ సిలిండర్ సంగతి కనుక్కో..."
    అప్పుడు వాస్తవం ముల్లుగర్రై పొడిచేది ఆమెనే!

    బాబాగారు, క్షమించాలి.

    ReplyDelete
  6. బాగా గారు చాలా బాగుంది.

    ReplyDelete
  7. బాబా..కవిత చాలా బాగుంది..ఒక జ్ఞాపకం కవిత చదివి కామెంట్ రాయాలన్న జ్ఞాపకం నన్ను సలిపేస్తుంది..అందుకోండి నా అభినందనలు..

    ReplyDelete
  8. బాబా గారు,
    కవిత చాలా బాగుంది.

    అలాగే...కొద్ది కాలం క్రితం మీరు నా బ్లాగులో ఒక కామెంటు రాశారు. దానికి సరైన సమాధానం తెలియక వెంటనే ప్రత్యుత్తరం ఇవ్వలేకపోయాను. కొంచెం పరిశోధన చేసిన తర్వాత, ప్రస్తుతం నాకు తెలిసిన సమాధానం ఇచ్చాను. ఒకసారి చూసి మీ అభిప్రాయమును తెలుపగలరు.

    క్రింది లంకెను అనుసరించండి.
    http://nagaprasadv.blogspot.com/2008/10/blog-post_04.html

    ReplyDelete
  9. ప్రతాప్ తమ్మూడూ కొంచెం నిరాశకు గురిచేసినట్లున్నాను. ఈ కవితలో చివరి లైన్లను లేకుండగా చదూకొన్నా బాగానే ఉంటుంది. కానీ కవితలో సబ్జక్టివిటీ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. థాంక్యూ వెరీమచ్

    సుజాత గారూ
    చాలా చాలా థాంక్సండీ. మీ వాఖ్య వల్ల నా కవితలో ఎక్కడ తడబడ్డదో తెలిసిందండీ. you really saved my poem madam thank you very much. మీరు వ్రాసిన ముగింపుని నేను వాడుకోవటానికి మీరనుమతి నీవ్వాలి మేడం.

    అరుణ గారూ
    మీరు నా పాత కవితలను చదవండీ.
    ఈ కవిత ఉద్దేశ్యం. సాధారణంగా మన మూడ్స్ స్వింగ్ అయ్యేటపుడు ఉండే ఒక ట్రాన్సిషను లో ఒక రకమైన నిట్టూర్పు, నిర్వేదం చుట్టుముడుతుంది. దానిని పట్టుకోవాలని చేసిన ప్రయత్నమిది. ఎందుకంటే అలాంటి సందర్భాలు చాలామట్టుకు సార్వజనీనమే అని నా విశ్వాసం.
    కవిత్వమనేది కవి యొక్క సటిల్ ఫీలింగ్స్ ని ప్రతిబింబించేలా ఉండాలని నా అభిప్రాయం. అలా సటిల్ ఫీల్స్ ని గ్లోరిఫై చేసేదే మంచి కవిత్వం అని నా భావన.

    మీరన్నట్లు ఇంకా మంచి కవితలను వ్రాయటానికి ప్రయత్నిస్తాను మేడం.

    కలగారూ
    థాంక్సండీ.
    బహుసా ప్రతాప్ గారు కవితలోని వాస్తవం అన్న మాటని ఒక వ్యక్తి గా భావించి అలా కామెంటు చేసారనిపిస్తుంది.


    murali gaaru
    you got the thread sir. thank you.

    చైతన్య గారూ
    థాంక్సండీ. ఎండింగ్ మార్చుదామని అనుకుంటున్నాను. సుజాతగారి ముగింపుతో.

    భగవాన్ గారూ
    అంతేనంటారా? థాంక్సండీ.

    నాగ ప్రసాద్ గారూ
    థాంక్సండీ.
    ఇప్పుడే చూసాను మీ సమాధానం. బాగుంది.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  10. ఊహకూ నిజానికీ ఆమాత్రం తేడా వుండాలి లెండి. స్వాప్నికుడికి రొటీన్ జీవితం ముల్లుగర్రే!

    ReplyDelete
  11. అన్నయ్యగారు,
    ముగింపు నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఈ మధ్యే ఎక్కడో ఒక ఆర్టికల్ లో చదివాను బెడ్ రూమ్ లో ఊహల్లో విహరించేటప్పుడు (మాటలు రాకూడని వేళ అని వారి ఉద్దేశం కాబోలు) మాటలు ఎక్కువగా మాట్లాడే అలవాటు ఆడవారికే ఉంటుందట, మగవారు కూడా మాట్లాడుతారంట కానీ శాతం తక్కువట. అందుకని ఆ ముగింపు సమంజసమే అని నాకనిపిస్తోంది.

    @సుజాతగారు, నా ఉద్దేశ్యం సరిగ్గా చెప్పలేక పోయానేమో. ఇక్కడ ముగింపు పురుష పక్షపాతానికి దగ్గరగా ఉంది అని అందరు అపోహ పడతారేమోనని అలా అన్నాను. అందులోనూ కవిత రాసింది పురుషపుంగవుడాయే.

    @కలా ఇప్పుడన్నా అర్ధం అయిందా?

    ReplyDelete
  12. మహేష్.,
    .."స్వాప్నికుడికి రొటీన్ ముల్లుగర్రే.." ...అంటే? జీవితం ముల్లుగర్ర లా ఉండకూడదంటే స్వప్నించడం మానేయాలా? స్వప్నాలు లేకపోతే జీవితం మరీ రొటీనైపోదూ?

    ReplyDelete
  13. This comment has been removed by the author.

    ReplyDelete
  14. "వెన్నెల పిట్టలు వాలిన పొగడ చెట్టు క్రింద
    రాలిపడే పొగడపూల వానలో తడుస్తూ"

    "ఓ జ్ఞాపకం హాయిగా సలుపుతుంది" ... బాగుంది.

    ReplyDelete