Sunday, November 29, 2009

"మధుపం" పుస్తక సమీక్ష



పుస్తకం.నెట్ లో ప్రచురించబడ్డ "మధుపం" పుస్తక సమీక్ష ఈ క్రింది లింకులో చదువుకొనవచ్చును.


http://pustakam.net/?p=2544

భవదీయుడు
బొల్లోజు బాబా

Tuesday, November 17, 2009

వృద్ద జంట



తేనెవానల్ని కురిపించిన
వెన్నెల రాత్రులు
అదృశ్యమయ్యాయి.
స్వర్ణ వాసనల్ని ఎగరేసిన
జాజులు నేలకొరిగాయి.
ఇంధ్రధనస్సులపై
స్వారీ చేసిన మహోద్రేకాలు
ఇక శలవన్నాయి.

నే పూయించిన
విజయాలు కరిగిపోయాయి.
నే సాగించిన
యుద్దాలు ముగిసిపోయాయి.
నే మొలిపించిన
స్వప్నాలు వెలిసిపోయాయి.

నువ్వు మాత్రమే మిగిలావు నాకు.

ఈ దుర్భల దేహానికి
కాస్తంత
నమ్మికనివ్వటానికి
నా అనంత శయనాన
రవంత
కన్నీరు నించటానికి
నువ్వు మాత్రమే మిగిలావు నాకు.

పెళ్లిచూపుల్లో
తలుపు సందులోంచి నన్ను చూసి
సన్నగా నవ్విన ఆనాటి
నువ్వు మాత్రమే మిగిలావు నాకు.

బొల్లోజు బాబా

Tuesday, November 10, 2009

ఫార్వార్డ్ ట్రేడింగ్.*....

ప్రజాకవీ! రవీ!
ఏం తినేట్టు లేదు
ఏం తాగేట్టు లేదని
ఎంత సూటిగా చెప్పేసావూ!

పెద్దయ్యా!
నీవా మాటలన్నప్పుడు
బ్లాక్ మార్కెటింగ్ ఒక నేరం.
ఇపుడు అంతా చట్టబద్దమే.
ఎంత ఎదిగిపోయామో! చూసావా?

నిత్యావసర వస్తువుల్ని
ఫార్వార్డ్ ట్రేడింగ్ చేసి పారేసి
సామాన్యుని కడుపుపై
ఆకలి వాతల్ని పెట్టటం
చట్టప్రకారమే జరుగుతోందిపుడు.

వచ్చే ఏడాది
ఏ సరుకెంతకమ్మాలో ఇపుడే నిర్ణయించేసి
రేపటి శ్రమని కూడా పిండుకొనే
పగడ్భందీ పధకానికి తెర లేచింది.

జీవితాలకు భరోసా లేదు కానీ
ధరలకూ, దరిద్రాలకు మాంచి
గారంటీ లభిస్తోందిపుడు.

ప్రతీదీ ఓ వినిమయ వస్తువైనచోట
ఉప్పులు, పప్పులకు మాత్రమే
ఈ ఫార్వార్డ్ ట్రేడింగ్ పరిమితమవటం
ఆశ్చర్యమే మరి.

బహుసా ముందు ముందు
కలలు, కన్నీళ్లు, రోగాలు, చావుల్నీ కూడా
ఈ విష వ్యాపార పరిధిలోకి తీసుకొస్తారేమో!

అపుడిక
ఏడాది చివరకల్లా
ఇన్ని కలలు కొనాలి, ఇన్ని కన్నీళ్లు కార్చాలి
ఇన్ని సార్లు చావాలి, ఇన్ని రోగాల్ని
మోసుకు తిరగాలి అన్న
వాళ్ల లెక్కల ప్రకారం జీవించేస్తాం.

చూస్తా చూస్తా చచ్చిపోలేం కదా!

బొల్లోజు బాబా

(ఫార్వార్డ్ ట్రేడింగ్ విధానాన్ని నిరసిస్తూ..... ప్రజాకవి కాళోజీ మాటల్ని తల్చుకొంటూ)


*ఫార్వార్డ్ ట్రేడింగ్ అంటే: భవిష్యత్తులో పలానా వస్తువు ఇంత ధర పలుకుతుందన్న అంచనాతో ఈరోజే అమ్మకాలు కొనుగోళ్లు జరపటం. ఉదా: 2010 జనవరికి 1 నాటికి కందిపప్పు రెండు వందలుండవచ్చని ఈరోజే అమ్మకాలు కొనుగోళ్లు జరిగితే, జనవరి రెండవ తారీఖునుంచి మనం కందిపప్పుని రెండువందల పదిరూపాయిలకు కొనవలసి వస్తుంది. ధరల పెరుగుదలకు ఈ విధానమే ప్రధాన కారణమని ఒక అంచనా.


ఈ క్రింది లింకులోని వ్యాసాన్ని చదివితే విషయం మరింత స్పష్టమౌతుంది.
http://www.cpiml.in/Periodicals/Eco%20Notes%20Political%20economy%20of%20price%20rise%20PJ.html



Sunday, November 8, 2009

ఏమో తెలీదు......

ఎవరు వింటారని అక్షరాలను
వెదురు రంద్రాల గుండా
ప్రవహింపచేస్తున్నాను!

ఎవరు చూస్తారని
భావాలకు రెక్కలు తొడిగి
నీలాకాశంలోకి ఎగరేస్తున్నాను!

ఎవని మనో యవనికపై
మొలకెత్తుతాయని
కవితా బీజాలను
రాల్చుకొంటున్నాను.

ఏమో తెలీదు బహుసా
గాలికి పిట్టకి చెట్టుకీ
కూడా తెలీదేమో!

బొల్లోజు బాబా

Tuesday, November 3, 2009

పుస్తకం నెట్ లో ఒక పరిచయ వ్యాసం

ఆకెళ్ల రవి ప్రకాష్ – “ఇసక గుడి” కవితా సంకలనంపై పుస్తకం.నెట్ లో ప్రచురింపబడిన నా పరిచయ వ్యాసాన్ని ఈ క్రింది లింకులో చదువు కొనవచ్చును


http://pustakam.net/?p=2276