Tuesday, October 13, 2026

మొఘల్ పాలకులు -సంస్కృత పండితులు

భిన్నమతస్థులు ఒకరి ఆచార, వ్యవహారాల పట్ల మరొకరు సానుకూల దృక్పథంచూపటం, ఒకరి భాష, సాహిత్యాలను మరొకరు ఇష్టంగా అక్కున చేర్చుకోవటం లాంటి చర్యలద్వారా మతసామరస్యం వెల్లివిరుస్తుంది. మొదటిది సామాన్యజనం పాటించదగినది కాగా రెండవది మేధోపరమైన అంశం. మధ్యయుగాలలో అనేకమంది ముస్లిమ్, హిందూ ఆద్యాత్మికవేత్తల పరస్పర సంభాషణలు, చర్చల ద్వారా హిందూ ఇస్లాం మతాల మేళనం జరిగింది.

హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా (1238-1325), షేక్ ఫరీదుద్దీన్ గంజ్‌షకర్ (1173-1265), షా అబ్దుల్ కరిమ్ (1536-1623), షా ఇనాయతుల్లా (1655-1718) లాంటి సూఫీ సన్యాసులు హిందూ ముస్లిముల ఐక్యతను బోధించి ఇరుమతస్థులలో సమాన ఆదరణ పొందారు

సూఫీ వేదాంతి బాబా ఫట్టు, హిందూ గులాబ్‌సింగ్ వద్ద శిష్యరికం చేసాడు. ఇతని దర్గా హిమాచలప్రదేష్‌లో నేటికీ హిందూ ముస్లిములకు దర్శనీయ స్థలం. కబీరుదాసు (1399-1518) రామ్ రహీమ్ ఏక్ హై అనే తత్వాన్ని జీవితాంతం ప్రచారం చేసాడు.

నానక్ సాహెబ్ (1469-1539), దాదు దయాళ్ (1544-1603), యారిషా (1668-1725), బుల్లా సాహెబ్ (యారి షా శిష్యుడు), దరియాసాహెబ్ (1700-1780), తులసి సాహెబ్ (1760- 1842) లాంటి మహనీయులు హిందూ ముస్లిమ్‌ల ఆధ్యాత్మిక ఐక్యత, ఐహిక సామరస్యతల కొరకు ఎంతో కృషిచేసారు.

హిందూ ముస్లిమ్‌ల మధ్య సాంస్కృతిక భావనలను ఇచ్చిపుచ్చుకోవటంలో స్త్రీలు కూడా పాటుపడ్డారు. నాని బాయి, మాతా బాయి (వీరు దాదు దయాళ్ కుమార్తెలు), దయాబాయి, క్షేమాబాయి మొదలగు వారు ఒకనాటి హిందూ ముస్లిమ్ సఖ్యతను బలపరచిన సాధకురాళ్ళు

***

గౌడియ వైష్ణవ సంప్రదాయ స్థాపకుడైన శ్రీ చైతన్య మహాప్రభుకు (1486-1533) బుద్ధిమంతఖాన్ అనే ముస్లిమ్ అత్యంత సన్నిహితుడైన సేవకునిగా వ్యవహించేవాడు. బుద్ధిమంతఖాన్ ధనవంతుడు, దాత. ఇతను శ్రీచైతన్య మహాప్రభు, విష్ణుప్రియల వివాహం దగ్గరుండి జరిపించాడు. మహాప్రభు జరుపుతున్న హిందూ భక్తిఉద్యమంలో పాల్గొన్నాడు. అలా ఒక ముస్లిమ్ వ్యక్తి వైష్ణవ సంప్రదాయ స్థాపకుని ఆశయాలను, ఆదర్శాలను ముందుకు తీసుకొని వెళ్ళటంలో సహాయపడ్డాడు.

నజీర్ మహమ్మద్ [1], ఫకీర్ హబీబ్, సయ్యద్ మర్తూజా లాంటి కవులు -కృష్ణభక్తితో గీతాలు రచించారు.

ముస్లిమ్ యోగి వావర్‌తో అయ్యప్ప స్వామి, బీబి నాంచారితో వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆధ్యాత్మిక సంబంధాలను ఉత్త భక్తి కథలుగా కొట్టిపారేయలేం. వాటివెనుక మన పూర్వీకులు నిర్మించదలచిన మత సామరస్యతను అర్ధంచేసుకోవాలి.

***

ఏ కాలంలోనైనా అధికారం సాహిత్యాన్ని ప్రభావితం చేస్తుంది. బౌద్ధం అధికారంలో ఉన్నకాలంలో త్రిపిటకాలు, హిందూరాజుల పాలనలో ఇతిహాసాలు, పురాణాలు రాయబడ్డాయి. ముఘల్ పాలనలో ప్రత్యేకంగా ఇస్లామ్ మతాన్ని ప్రబోధించే రచనలేవీ రాలేదు సరికదా హిందూ వేద వేదాంగాలు ఇతిహాసాలు పర్షియన్ భాషలోకి తర్జుమా చేయబడ్డాయి. మొఘల్ పాలకులకు తమ పాలిత ప్రజల ఆచార వ్యవహారాలను, విజ్ఞానాన్ని తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. సమయానుకూలంగా అనేకమంది పండితులు, రాజపుత్రుల సిఫార్సులతోనో లేక స్వయంగానో- జ్యోతిష్కులు, అనువాదకులు, రాజకీయ రాయబారులు, గాయకులు, కవిపండితులు, స్థానిక సమాచారం ఇచ్చే ఉద్యోగులు లాంటి భిన్నపాత్రలలో మొఘలుల కొలువుల్లో కుదురుకున్నారు.

ముఘల్ చక్రవర్తులు సంస్కృత పండితులను సాంస్కృతిక రాయబారులుగా భావించి, వారికి తమ ఆస్థానాలలో గౌరవ స్థానాన్ని ఇచ్చేవారు. బాబర్ (1504-21) ఆస్థానంలో జయరాజ్,  హుమయÖన్ (1530-40) ఆస్థానంలో ఆనందరాయ అనే పేర్లుకల సంస్కృతపండితులు ఉండేవారు. అక్బర్ (1556-1605) కాలంలో దేశం నలుమÖలలనుంచి సంస్కృత పండితులు మొఘల్ ఆస్థానంలో చేరటం ప్రారంభమైంది. అక్బర్ తన సంస్థానంలో మతపరమైన తాత్వికచర్చలకొరకు ఒక సభను (ibadatkhanah) ఏర్పరచి దాని ద్వారా ఇస్లామ్, హిందూ, బౌద్ధ, జైన, క్రిష్టియన్ పండితుల మధ్య వేదాంత చర్చ జరిపించేవాడు. అక్బరీయ కాళిదాసు, హీరవిజయ సూరి, శాంతిచంద్ర లాంటి కవులు అక్బర్ సంస్థానంలో ఉండేవారు. ఇతనిపాలనలో మహాభారతం, అధర్వణవేదం, రామాయణం, హరివంశం, యోగవాసిష్టం లాంటి హిందూ గ్రంథాలు పర్షియన్ భాషలోకి అనువదింపబడ్డాయి.

అక్బరు సంస్థానంలో పెద్ద ఎత్తున ప్రవేశించిన పండితులు, చక్రవర్తిని ఆకర్షించటానికి అనేక యుక్తులకు పాల్పడేవారు.

ఒక బ్రాహ్మణుడు ముఘల్ పాలకుల ప్రాపకం పొందటం కొరకు ‘ష్యాయక్ భావన’ అనే పేరుతో ఇస్లాంలోకి మారిపోయి స్థానిక హిందూ పండితులకి అక్బర్‌కు మధ్య సంధానకర్తగా వ్యవహరించేవాడు.

హుమాయున్ కాలంలో అప్పటికే ఉన్న పెర్షియన్ జ్యోతిష్యానికి జోడింపుగా భారతీయ జ్యోతిష్యం కూడా ముఘల్ ఆస్థానంలోకి ప్రవేసించింది. కాలక్రమేణా అనేకమంది హిందూ జ్యోతిష్కులు అక్బర్ ఆస్థానంలో చేరి, చక్రవర్తి దినచర్యలలో మంచి చెడ్డలు చెప్పటం ద్వారా రాజకీయనిర్ణయాలను ప్రభావితం చేయసాగారు. ఈ ప్రభావం ఎంతవరకూ వెళ్ళిందంటే, అక్బరుకు మÖలా నక్షత్రంలో కూతురు జన్మించినందుకు శాంతిీVAమాలు జరిపించటం, రోజుకు నాలుగు సార్లు దగ్గరుండి ఆయనతో సూర్యనమస్కారాలు చేయించటం వరకు వెళ్ళింది.

కొందరు పండితులు “విష్ణుమూర్తి ఈ భూమిపై బాదుషాగా అవతరించనున్నాడని, ఆ అవతారంలో ప్రపంచాన్ని జయించి, గోవులను రక్షించి, బ్రాహ్మణులను ఆదరిస్తాడని” అంటూ కొన్ని సంస్కృతవాక్యాలను నలిగి, శిథిలమైన తాళపత్రాలపై రాసుకొచ్చి, ఇవి ఋషులు రచించినవని అక్బరు చక్రవర్తికి వినిపించగా ఆ మాటలను ఆయన నిజమని నమ్మేవాడట. (Culture of Encounters, Audrey Truschke pn.39)

మరో అనామక రచయిత 1580 ప్రాంతంలో మరింత ముందుకెళ్ళి అల్లోపనిషద్ (అల్లా యొక్క ఉపనిషత్తు) రచించాడు. హిందూ దేవీ, దేవతలు అందరూ అల్లాతో సమానులే అని చెప్పే ఒక చిన్న గ్రంథం ఇది. దీనిని అక్బర్ చక్రవర్తికి భక్తితో సమర్పించుకొన్నాడట. (ibid. pn.40)  ఈ ప్రయత్నాలన్నీ ముస్లిం పాలకుడిని ‘నా విష్ణుఃపృథ్వీపతి’గా మార్చటానికే అని అర్ధం చేసుకోవాలి. ఈ ప్రయత్నాలకు అక్బర్ ఎంతో కొంత ప్రభావితం అయ్యాడు.

అక్బర్ తరువాత వచ్చిన జహంగీర్ ఆ తరువాత వచ్చిన షాజహాన్‌లు కూడా ఇదే బాటలో పయనించి అనేకమంది సంస్కృత పండితులను ఆదరించారు. అనేక గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదింపచేసారు. షాజహాన్ చక్రవర్తి కొలువులో కవీంద్రాచార్య, జగన్నాథ పండితరాయలు వంటి జగత్ప్రసిద్ధి గాంచిన పండితులు ఉండేవారు.

తదనంతరం వచ్చిన ఔరంగజేబు (1658-1717) ఈ ఒరవడిని కొనసాగించలేదు. దానికి కారణం- సంస్కృతం నేర్చుకొని, ఎన్నో పవిత్ర హిందూ గ్రంథాలను సొంతంగా పర్షియన్‌లోకి అనువదిస్తున్న అన్నగారైన దారాషికోను హత్యచేసి రాజ్యాధికారం చేజిక్కించుకోవటం కావొచ్చు బహుశా. దారాషుకో చక్రవర్తి కావల్సిన వ్యక్తి. అప్పటికే ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించాడు. హిందూ-ఇస్లామ్ మతాలలోని సారాన్ని పోల్చుతూ వాటి ఐఖ్యతను కోరుతూ Majma-ul-Bahrain (రెండు సాగరాల సంగమం) అనే ఉద్గంథాన్ని వెలువరించాడు. ఇతను ముఘల్ చక్రవర్తి అయిఉంటే భారతదేశచరిత్ర మరోలా ఉండేదంటారు. (నేటి పండితులకు ఔరంగజేబుపై ఉండే ద్వేషానికి మÖలం ఈ నిరాదరణ కూడా కావొచ్చు)

ఔరంగజేబు అనంతరంవచ్చిన చక్రవర్తులు కూడా భిన్న సంస్కృతుల వాజ్ఞ్మయాలను ఇచ్చిపుచ్చుకోవటంలో పెద్దగా ఆసక్తి చూపలేదు. అంతే కాకముఘల్ సామ్రాజ్యం రాజకీయ ఒడిదుడుకుల పాలయి 1793 నుండీ క్రమేపీ బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళిపోయింది.

ఙఙఙ

ఎక్కడినుంచో వచ్చిన ముఘల్స్‌కు ఎందుకు సంస్కృతం అంటే అంత ప్రేమ కలిగింది అంటే బహుశా వారు భారతీయతను సాధించాలని భావించి ఉంటారు - అంటుంది ప్రముఖ చరిత్రకారిణి Audrey truschke.. పదిహేడవశతాబ్దం వచ్చేసరికి అప్పటికి సుమారు రెండు శతాబ్దాలపాటు పండిత మేధావులు మొఘల్ పాలక కులీన వర్గాలనుండి చక్కని ఆదరణ పొందారు. కొందరైతే పర్షియన్ భాషను నేర్చుకొని అధికారిక పదవులలో ప్రవేశించారు వీరి ప్రభావం మొఘల్ పాలన చివరివరకూ కొనసాగింది. ముస్లిమ్ ప్రపంచంలో భాగంగా ఉన్నప్పటికి దాని లోపలి విషయాలను, హిందూ ముస్లిమ్ సంస్కృతుల మధ్య జరిగిన అన్యోన్యాశ్రయతను, సాంస్కృతికపరమైన సంబంధబాంధవ్యాల గురించి పండితులు తమ సంస్కృత రచనలలో అక్కడక్కడా చేసిన చెదురు మదురు ప్రస్తావనలు తప్ప పెద్దగా ఎక్కడా ప్రతిబింబింపచేయలేదు. పండితుల చారిత్రిక నిశ్శబ్దం ఇది.

 

భానుకరుడు

భానుకర/భానుదత్త గొప్ప సంస్కృత కవి. తండ్రిపేరు గణపతి. నిజామ్ షా/షేర్ షా ఆస్థాన కవి. గీతాగౌరీశ, కావ్యదీపిక, రసమంజరి వంటి కావ్యాలను రచించాడు. అనేక పద్యాలలో ఇతను భూరన్ నిజామ్ షా ను కీర్తించటాన్ని బట్టి భానుకరుడు అతని ప్రాపకంపొందిన కవిగా గుర్తించటం జరిగింది. భూరన్ నిజామ్ షా 1510-1553 మధ్య పాలించాడు కనుక ఇతనిని 16 వ శతాబ్దపు కవిగా నిర్ణయించారు.

నిజాం షా సైన్యంతో యుద్ధరంగానికి కదం తొక్కుతున్న దృశ్యాన్ని భానుకరుడు ఇలా వర్ణించాడు. ఇవన్నీ అందమైన వర్ణనలు. భూమినే మూర్చిల్ల చేయటం కవియొక్క అసమాన ఊహాశాలిత.



గుర్రపు డెక్కలు కలిగించే ఒత్తిడికి భూమి మూర్చిల్లగా
సముద్రం అలలతో ఉప్పొంగి భూమిమోముపై నీళ్ళు జల్లిందట
దిక్పాలకి బలమైన గాలులను పంపి పతాకాలతో వీవెనలు వీచిందట
మÖర్చనుండి కోలుకొనే వైద్యం కొరకు
పైకెగసిన ధూళి అశ్వనీదేవతలవైపు పరుగులిడిందట
యుద్ధంలో విజయం సాధించిన నిజాం షా ని భానుకరుడు ఇలా స్తుతించాడు
నిజాంప్రభువు కోపంతో శత్రువులను చూస్తే
కంటిచూపుకే వారు తునియలైపోతారు
ఆకాశంలోని సూర్యుడు కూడా ఒణికిపోతూ
అపజయమే లేని మన ప్రభువు పతాకంలో తలదాచుకొంటాడు

మరొక పద్యంలో సైన్య పదఘట్టనల తాకిడి తట్టుకోలేక నేల బయటకు చాచిన ఒణికే నాలుక వలె నిజాం పతాకం రెపరెపలాడుతోన్నదని వర్ణించాడు భానుకరుడు. ఇది కూడా అసమానమైన ఊహ.

ఇతని రచనలు పద్యమిత్ర తరంగిణి, పద్యవేణి, రసిక జీవన సూక్తి సుందర లాంటి సంగ్రహాలలో ఉటంకింపుల ద్వారా మాత్రమే లభిస్తున్నాయి తప్ప సంపూర్ణ కావ్యాలు లభించలేదు.

 

అక్బరీయ కాళిదాసు

అక్బరీయ కాళిదాసు నిజనామం గోవింద భట్టు.  గొప్ప సంస్కృత పండితుడు.  అక్బరు ఆదరాభిమానాలు చూరగొన్న కవి. ఇతని పాండిత్యానికి మెచ్చిన అక్బర్ చక్రవర్తి బంగారు తులాభారం ఇప్పించి అక్బరీయ కాళిదాసు అనే బిరుదును బహూకరించాడు. అక్బర్ పాలనాకాలం 1542-1605  కనుక ఇతను ఆకాలానికి చెందిన వ్యక్తి. అక్బరీయ కాళిదాసు  రేవా ప్రాంత రాజైన వాఘేల రామచంద్రను కీర్తిస్తు “రామచంద్ర యశఃప్రశస్థి” అనే కావ్యం రచించాడు. ఇది కాక “బిరుదావళి” అనే మరొక కావ్యం తప్ప ఇతరరచనలు ఏవీ తెలియరావు.  17వ శతాబ్దంలో పద్యవేణి, సూక్తి సుందర లాంటి సుమారు ఆరు సంగ్రహాలలో ఇతని పద్యాలు అనేకం

ఉటంకించటాన్ని బట్టి ఇతను  అప్పట్లో బాగా పేరుగాంచిన కవిగా ఊహించుకోవాలి.  

కాళిదాసు ఉపమానానికి ప్రసిద్ధి. అదేవిధంగా అక్బరీయ కాళిదాసు కూడా అందమైన ఉపమానాలను కల్పనచేయగలడని ఈ క్రింది పద్యం నిరూపిస్తుంది.


ఇంద్రుడు మందార పుష్పాలతో దుర్గాదేవిని పూజించాడు
ఆ మందారపూలకు ఆకర్షించబడిన తుమ్మెదలు
దుర్గాదేవి బంగారు చత్రంపై వాలగా
అవి చత్రంపై మరొక చత్రంలా కనిపిస్తున్నాయట.

 

మరొక పద్యంలో ఒక రమ్యమైన ఘటనను రసార్థ్రంగా ఇలా చిత్రించాడు

గణేషుడు పార్వతీదేవి శిగలో పూలను తన తొండంతో లాగటం చూసి శివుడు చిరునవ్వులు చిందించగా, కార్తికేయుడు, ప్రమదగణాలు కూడా నవ్వారట. అందరినీ చూసి గణేషుడు కూడా నవ్వేసాడట.

 

జగన్నాథ పండితరాయలు

జగన్నాథపండితరాయలు (1590-1670) పదిహేడవ శతాబ్దపు కవి పండితుడు, సంగీతకారుడు. ఇతను పుష్టిమార్గీయ వైష్ణవసమాజాన్ని స్థాపించిన శ్రీమద్ వల్లభాచార్యుని మునిమనవడు. జగన్నాథుని తండ్రి శ్రీపెరమభట్ట వారణాసిలో విద్యనభ్యసించి, శ్రీమద్ వల్లభాచార్యుని మనవరాలిని పెండ్లాడి మధురసమీపంలోని గోకులం వద్ద స్థిరపడ్డాడు [2].  అలా జగన్నాథపండితరాయల తల్లి తరపు ముత్తాత వల్లభాచార్యుడు కాగా తండ్రితరపు పూర్వీకులు ఆంధ్రప్రదేశ్, అమలాపురం వద్ద

ఉన్న ముంగండ అగ్రహారానికి చెందినవారు.

జగన్నాథ పండితరాయలు ముఘల్ చక్రవర్తులైన జహంగీర్, షాజహాన్‌ల ఆస్థాన పండితునిగా విశేషగౌరవం పొందాడు. భామిని విలాసము, రసగంగాధర, గంగాలహరి, పంచవిలాసములు, చిత్రమిమాంసఖండన ఇతని లభిస్తున్న రచనలు. ఆనందవర్ధనుడి ప్రసిద్ధిచెందిన ధ్వన్యాలోకముతో పోల్చదగిన గొప్ప అలంకార శాస్త్ర గ్రంథం రసగంగాధర. దీనిలో “రమణీయార్థ ప్రతిపాదక శబ్ధమే కావ్యం” అంటూ కావ్యానికి ఇచ్చిన నిర్వచనం ఈనాటికీ ఎంతో విలువైనది. సంప్రదాయాలను ధిక్కరించి ముస్లిమ్ మతానికి చెందిన ఒక మహిళను పెండ్లాడటం ఇతని ధీరవ్యక్తిత్వాన్ని పట్టిచూపుతుంది.

జగన్నాథపండితరాయలు ముఘల్ సంస్థానంలోకి ఎలా ప్రవేశించాడనేదానిపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

జగన్నాథుని కుటుంబం ఉంఛవృత్తి (భిక్షాటన) సాగించేది. విస్తరాకుల కొరకు ప్రతిరోజు ఒకచెట్టు ఆకులను కోసుకొనేవారట. ఒకనాడు ఆ తోట కాపలాదారు ఆకులుకోస్తున్న జగన్నాథుని అడ్డగించి “ఈ ప్రాంతాన్ని చక్రవర్తిగారు మా యజమానికి కానుకగా ఇచ్చారు, ఇకపై ఇక్కడి చెట్ల ఆకులను కోయరాదు” అన్నాడు. ఈ సంఘటనకు మ్రాన్పడిన జగన్నాథుడు ఆ ఊరి కరణం వద్ద ఈ విషయం చెప్పగా అతను “అవును నిజమే. నువ్వేమైనా చెప్పాలనుకొంటే చక్రవర్తిగారితోనే చెప్పుకో” అంటూ అవమానించాడట. ఆ మాటను పట్టుకొని జగన్నాథుడు నిజంగానే ఢిల్లీ వెళ్ళి ముఘల్ చక్రవర్తి జహంగీర్‌ను కలిసి ఆయనను తన పాండిత్యంతో మెప్పించి ఆస్థానపండితునిగా స్థానం దక్కించుకొన్నాడట.

మరొక కథనం ప్రకారం జగన్నాథుడు మేవార్ మహారాజు జగత్ సింగ్ ఆస్థానపండితుడు. ఒకనాడు ముఘల్ చక్రవర్తి సభలో -రాజపుత్రులు క్షత్రియులు కారు,  సంస్కృతము అరబిక్ భాషకంటే ప్రాచీనమైనది కాదు అనే రెండు అంశాలపై వాదోపవాదాలు జరిగాయట. పండితులు రెండుగా చీలిపోయారు. ఈ నేపథ్యంలో మేవార్ మహారాజు ఆదేశాలపై వాదించటానికి ఢిల్లీ వెళ్ళిన జగన్నాథుడు నిండు సభలో- రాజపుత్రులు క్షత్రియులేనని, సంస్కృతము అత్యంత ప్రాచీనభాష అని తన వాదనలు వినిపించి అందరిని మెప్పించాడట. అలా చక్రవర్తి ప్రశంసలకు పాత్రుడై కొలువులో చేరాడట.

జగన్నాథుడు కొంతకాలం జైపూర్‌లో ఉన్నాడు. అప్పుడు మిత్రుడైన ఒక ముస్లిమ్ అధికారితో ఇస్లామ్ మతంపై లోతైన చర్చలు జరిపి అతనిని వాదనలో ఓడించాడట. ఆ అధికారి ఢిల్లీ వెళ్ళి ఈ విషయాన్ని చక్రవర్తికి చెప్పగా, ఆయన జగన్నాథుని పరీక్షించాలనే కోరికతో తనవద్దకు రప్పించుకొని అతని ప్రతిభపట్ల నమ్మకం కుదిరి తన ఆస్థానంలో నియమించుకొన్నాడంటూ మరొక కథనం ప్రచారంలో ఉంది.

పై కథనాలు ఊహాగానాలు కావొచ్చు. జగన్నాథుని మాతామహుని పేరు విట్టలేశుడు. ఇతను గొప్ప పేరుగాంచిన వైష్ణవ సన్యాసి. అక్బర్ సమకాలీనుడు. అక్బర్ అంతఃపురకాంతలలో కొందరు వైష్ణవం పట్ల ఆకర్షితులై, విట్టలేశుని ద్వారా వైష్ణవమతం పుచ్చుకొన్నారు. అలా విట్టలేశునికి ముఘల్ సంస్థానంలో ప్రవేశము, చక్రవర్తులతో సంబంధబాంధవ్యాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయంతో విట్టలేశుని మనుమడైన జగన్నాథుడు ముఘల్ చక్రవర్తి కొలువులో సులువుగానే ప్రవేశించి ఉండవచ్చు.

జగన్నాథుడు ముఘల్ కొలువులో ఉండగా లవంగి అనే ముస్లిమ్ అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు. లవంగి ఒక అంతఃపురకాంత. ఈమె నూర్జహాన్ ఆశ్రితురాలు. నూర్జహాన్ దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె నిర్భాగ్యులైన బాలికలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పి వారిని అర్హతకలిగిన హిందు లేదా ముస్లిమ్ యువకులకు ఇచ్చి వివాహం జరిపించేది. అలా నూర్జహాన్ ద్వారా రక్షణ పొందిన వారిలో లవంగి ఒకరు. జగన్నాథుడు లవంగి ద్వారా పొందిన కొడుకు చిన్నవయసులోనే మరణించాడు. ఈ మతాంతర వివాహం వల్ల జగన్నాథుడు జీవితాంతం స్వజనుల ఆక్షేపణలకు గురయినట్లు అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకనాడు జగన్నాథుడు వారణాసిలో గంగానదిలో స్నానం చేయబూనగా అక్కడి పండితులు “నువ్వు ముస్లిమ్ స్త్రీని పెళ్ళిచేసుకొని కులభ్రష్టత్వం పొందావుకనుక గంగను తాకరాదని” నిలువరించారట. (అలాచేసింది అద్వైతవేదాంతి అప్పయ్యదీక్షితులు అంటారు కానీ వీరిరువురు సమకాలీనులు కారు). ఈ సందర్భంగా జగన్నాథ పండితరాయలు గంగాలహరి పేరుతో గంగాస్తుతి చేసి గంగామాతను ప్రసన్నం చేసుకొని సచ్ఛీలుడిగా నిరూపించుకొన్నాడని ఒక ఐతిహ్యం. చనిపోయాడని మరొక కథనం కూడా కలదు.

1620లలో జహంగీరు ఆస్థానంలో కవిగా జగన్నాథుడు స్థానం సంపాదించుకొన్నాడు. షాజహాన్ ఆస్థాన చరిత్రకారులు రచించిన Padsష్ట్రaష్ట్రఅaఎaలో “మార్చ్ 9, 1634న Padshahnama లో జగన్నాథ కళావంత్ అనే గాయకుడు, చక్రవర్తిని కీర్తిస్తూ పన్నెండు అందమైన పద్యాలు సమర్పించుకోవటం జరిగింది. వాటికి సంతసించిన ప్రభువుల వారు, వెండితో తులాభారం గావించి, మొత్తం 4,500 రూపాయిలు బహుమతిగా ఇచ్చారు. “పండితరాయ” అనే బిరుదును కూడా ప్రసాదించారు” అని ఉన్నది. ఈ జగన్నాథ కళావంత్ అనే గాయకుడిని జగన్నాథకవిగా చరిత్రకారులు నిర్ధారించారు. ఆ విధంగా జగన్నాథుడు జగన్నాథపండితరాయలుగా మారిన చారిత్రిక సందర్భం లిఖించబడింది [3]. (కారణాలు తెలియరావు కానీ, జగన్నాథుడు, కవీంద్రుడు లాంటి సంస్కృత కవులను ముఘల్ చరిత్రకారులు తమ రాతలలో dhrupad గాయకులుగా వర్ణించారు).

***

నూర్జహాన్ సోదరుడు, షాజహాన్‌కు పిల్లనిచ్చిన మామగారు అయిన ఆసిఫ్‌ఖాన్  విజయాలను కీర్తిస్తూ జగన్నాథుడు “ఆసిఫ్ విలాసము” అనే కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఒక పద్యం

ఆసఫ్‌ఖాను యుద్ధంలో గణ్యుడు, దేవతలచే గౌరవింపబడినవాడు. ప్రపంచ విజేతకు సన్నిహితులుగా ఉండే అందరి రాజులలో ఆసఫ్ ఖాను- వాక్యాలలో కావ్యం వంటివాడు, కావ్యానికి ధ్వని, ధ్వనికి రసము, రసములలో శృంగారము వంటివాడు. అన్ని శాస్త్రాలను ఔపాసన పట్టిన ఆసఫ్‌ఖాన్ నవాబు తన మాధుర్యము, ఘనత కారణంగా విమర్శకుల హృదయాలను గెలుచుకొన్నాడు.

1641లో ఆసిఫ్‌ఖాన్ చనిపోయినపుడు జగన్నాథుడు ఇలా విలపించాడు.



ఆసిఫ్ ఖాను మరణంతో అతని యశస్సు,
అతని ఆశ్రితులు నశించటం సహజం.
కానీ ఇదేమి వింత!
అతని కీర్తి ఈ సువిశాల పృధ్విపై దశదిశలా వ్యాపిస్తున్నది!

ఆసిఫ్ ఖానుకు సమానుడు ఈ భూమిపై లేడు.
ఆయనమాటలు అమృతం, ఆయన వ్యక్తిత్వం రత్నగర్భ
ఆయన కీర్తి అమృతకిరణాలు కలిగిన చంద్రకాంతి,
ఆయన జ్ఞానం సాగరసమానం.
షాజహానుని కీర్తిస్తూ జగన్నాథపండితరాయలు చెప్పిన పద్యాలు
ఈ లోకంలో సహాయంకొరకు
ఇద్దరు ఈశ్వరులను మాత్రమే వేడుకోవాలి
ఒకరు ఢిల్లీశ్వరుడు మరొకరు సర్వేశ్వరుడు
ఆదరించటంలో మిగిలినవారెవరూ వీరికి సమ ఉజ్జీలు కారు.
ఓ షాబుద్దిన్ మహరాజా! నీవంటి సుగుణాలు కలిగిన వారు
ఈ ప్రపంచంలో మరొకరు ఉండరు
సృష్టికర్త మరోప్రపంచాన్ని పునఃసృష్టించినా
అక్కడ కూడా నీకు సమానుడు ఉండడు.
ఓ పాలసంద్రమా!
నీవు దేవుని ప్రత్యేక సృష్టి అని, అనంతమైన ఘనత, లోతు, రత్నాలతో
అనుగ్రహింపబడిన దానవని గర్వించకు
ఎందుకంటే నీకు సమానంగా ఢిల్లీ చక్రవర్తి దారాషుకో ఉన్నాడు

***

షాజహాన్‌ను చెరసాలలో పెట్టటం, అతని కుమారుడు, తనకెంతో ఆప్తమిత్రుడైన దారాషికో హత్యగావింపబడటం (1659) జగన్నాథపండితరాయలిని తీవ్ర మనస్తాపానికి గురిచేసాయి. దారాషికోను స్తుతిస్తూ “జగదాభరణ” అనే స్మృతి గీతాన్ని రచించాడు

ఇతను మొఘల్ ఆస్థానపండితుడిగా 1660 వరకూ ఉండి బయటకు వచ్చేసాడు. తరువాత బెంగాల్, కూచ్ బేహార్ రాజయిన ప్రాణనారాయణ వద్ద కొన్నాళ్ళు ఆశ్రయం పొందాడు. జీవిత చరమదశను వారణాసిలో గడిపాడు.

రాజాస్థానాలలో సత్యానికి తావులేదని, నిజాయితీ ఉండదని, ఋజువర్తనులకు రాజసేవ నరకప్రాయంబని తలచి ప్రశాంతంగా జీవించాలని వారణాసి వెళ్ళే సమయంలో రాసిన పద్యం అయి ఉంటుంది ఇది...

ఓ గార్దభమా! ఎన్నాళ్ళిలా ఎండుగడ్డి తింటూ,

బట్టలమÖటలు మోసుకొంటూ తిరుగుతావు?

రాజుగారి అశ్వదళంలో చేరి మంచి గ్రాసం తిను

అక్కడ నువ్వు గాడిదవని ఏ అధికారీ గుర్తించడులే!

తోక ఉన్న ప్రతీదీ అశ్వమని భావిస్తారు వారు

రాజుగారు కూడా వారినే విశ్వసిస్తారు

సత్యానికి చోటు లేదు అక్కడ  [4].

***

 

వారణాసిలో జగన్నాథపండితరాయలిని సంప్రదాయ బ్రాహ్మణులు మతాంతర వివాహం చేసుకొన్నాడనే నెపంతో అనేక అవమానాలపాలు చేసారు. ఒక కథనం ప్రకారం అయితే.... ఆ అవమానాలకు మనస్తాపం చెందిన జగన్నాథపండితరాయలు, భార్య లవంగితో కూడి గంగానదిలోకి మెట్టుమెట్టుకూ ఒక్కో పద్యం చొప్పున చెప్పుకొంటూ దిగుతూ 53 పద్యాలు చెప్పేసరికి భారాభర్తలు ఇరువురూ గంగానదిలో కొట్టుకుపోయి మరణించారట. ఇది కల్పన కావొచ్చు. రాజాశ్రయం కోల్పోయి, స్వజనుల నిందలకు గురయి, వృద్ధాప్యం మీదపడగా శ్రీనాథుని వలే కష్టాలపాలయి అనామకంగా మరణించి ఉండవచ్చు ఈ కవిరాజు. అభిమానులెవరో జగన్నాథపండితరాయలి దయనీయనిష్క్రమణను గౌరవనీయంగా మార్చటానికి పై కథను కల్పించి ఉంటారు.

 

కవీంద్రాచార్య సరస్వతి

కవీంద్రాచార్య సరస్వతి (c1600-1675) వారణాసిలో స్థిరపడ్డ మహారాష్ట్ర బ్రాహ్మణ పండితుడు. వారణాసి పండిత సమాజపెద్ద. తన ‘కవీంద్రకల్పదృమ’ కావ్యంలో -తాను గోదావరీ తీరంలో పుట్టిపెరిగానని, వేదవేదాంగాలు, సకల శాస్త్రాలు అభ్యసించి సన్యాసం స్వీకరించినట్లు చెప్పుకొన్నాడు.  

ఇతను ఎప్పుడు చేరాడో తెలియరాదుకానీ 1652 నాటికి షాజహాన్ ఆస్థానంలో- రాజకుటుంబీకులకు సంస్కృతం నేర్పటం, స్థానిక గీతాలను ఆలపించి వారికి వినోదం కలిగించటం లాంటి ప్రభావశీల పాత్రల్లోకి ఒదిగిపోయాడు. ఇతని ప్రతిభను గుర్తించి షాజహాన్ చక్రవర్తి “సర్వవిద్యానిధాన” అనే బిరుదుని ప్రదానం చేసాడు.  

కవీంద్రాచార్యుని రచనల్లో - కవీంద్ర కల్పదృమ, దండి దశకుమారచరితపై పాదచంద్రిక పేరుతో చేసిన వ్యాఖ్యానం, శతపథబ్రాహ్మణంపై యోగభాస్కర పేరుతో వ్యాఖ్యానం, ఋగ్వేదంపై మింమాంశ సర్వస్వం పేరుతో ఒక వ్యాఖ్యానం, కవీంద్రకల్పలత లాంటివి ప్రముఖమైనవి.  యోగవాశిష్ఠంపై కవీంద్రాచార్యుని భాష్యం ప్రామాణ్యం అని పేరుతెచ్చుకొన్నాడు. ఇతను షాజహాను ప్రభువు ఆర్ధికసహాయంతో రెండువేల తాళపత్ర సంస్కృత గ్రంథాలను, అనేక ఇతర రచనల వ్రాతప్రతులను సేకరించి ఒక బృహత్ గ్రంథాలయాన్ని నిర్మించాడు. వీటిలో చాలామట్టుకు నేడు వారణాసిలోని అనూప్ సంస్కృత గ్రంథాలయంలో భద్రపరచబడి ఉన్నాయి. 

నిజానికి రాజకుటుంబీకులకు యోగవాశిష్ఠం బోధించేనిమిత్తమై రాజాస్థానంలో కవింద్రాచార్యుడు  స్థానం సంపాదించుకొన్నాడు. 

అప్పట్లో వారణాసి, ప్రయోగలను సందర్శించే భక్తులపై “తీర్థయాత్రాసందర్శన పన్ను” [5] (Pilgrim tax) విధించేవారు. దీనివల్ల చాలామంది భక్తులు ఇబ్బంది పడేవారు. కవీంద్రాచార్యుడు షాజహాన్‌తో తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని, యాత్రికులపై వేసే ఈ తీర్థయాత్రా సందర్శనా పన్నును రద్దుచేయించగలిగాడు. ఇది ఇతను హిందూ సమాజానికి సాధించిపెట్టిన గొప్ప మేలుగా సాటి పండితులు  వేనోళ్ళ కొనియాడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇతనిని శ్లాఘిస్తూ సుమారు 70 మంది సంస్కృత పండితులు “కవీంద్రచంద్రోదయ” [6] అనే అభినందన సంచికను వెలువరించారు. ఈ సంచికకు శ్రీకృష్ణ ఉపాధ్యాయ అనే పండితుడు సంపాదకుడిగా వ్యవహరించాడు.

ఈ సంచికలో కవీంద్రాచార్యుని స్తుతిస్తూ రాసిన పద్యాలలో ఆనాటి చారిత్రిక విషయాలు అనేకం తెలుస్తాయి.



మూడులోకాలకు ప్రభువైన కవీంద్రుడు
ఢిల్లీశ్వరునికి ప్రతిరోజు వేద, శాస్త్ర, పురాణాల జ్ఞానంతో
హితోపదేశం చేస్తాడు.
తీర్థయాత్రాసందర్శన పన్నును రద్దుచేయించినా
‘విద్యానిధాన’ అనే బిరుదును పొందినా
ఎన్నడూ అహంకారానికి లోను కాలేదు. (115వ పద్యం)

పూర్ణానంద బ్రహ్మచారి రచించిన పై స్తుతిపద్యంలో కవీంద్రుడు నిగర్వి అని చెప్పటం ఒక పార్శ్వమైతే, ఇతను రోజు వెళ్ళి ఢిల్లీశ్వరునికి (షాజహాన్ చక్రవర్తి) వేదవిద్యలు బోధన చేసేవాడు అని చెప్పటం  మరొక ఆసక్తికర పార్శ్వం. ఈ పుస్తకంలోని పద్యాలలో అధికభాగం కవీంద్రస్తుతి. 

క్షమానంద వాజపేయి అనే మరో కవి షాజహాను ఇస్తానన్న ఏనుగులు, గుర్రాలు, బంగారం, రత్నాభరణాలు లాంటి సిరిసంపదలను తృణప్రాయంగా తిరస్కరించి, తీర్థయాత్రసందర్శన పన్నునొక్కదానిని రద్దుచేయమని కవీంద్రులవారు కోరినట్లు వర్ణించాడు.  కానీ ఇది చారిత్రికంగా అతిశయోక్తి. మొఘల్ చరిత్రకారుడు ముహమ్మద్ వారిస్ - కవీంద్ర సన్యాసి తన గానంతో షాజహాన్ ప్రభువుల వారిని సంతోషపెట్టినందుకు రెండువేల రూపాయలు, శాలువా, ఒక గుర్రం బహుమతిగా పొందాడని, మరొక సందర్భంలో లాహోర్ లో 1500 రూపాయిలు బహుమతి అందుకొన్నాడని రికార్డు చేసాడు. 

Travels in the Mughal Empire  చారిత్రిక యాత్రా పుస్తకాన్ని రచించిన  ఫ్రెంచ్ యాత్రికుడు François Bernier తన మిత్రునికి కవింద్రాచార్యుని గురించి ఇలా  ప్రస్తావించాడు - “నేను బెనారస్‌లో ఆగినప్పుడు, అక్కడి పండితసమాజానికి పెద్దగా వ్యహరిస్తున్న వ్యక్తిని కలిసాను. అతను ఒక హిందూ సన్యాసి... తెలుపు, కాషాయరంగు పట్టు దుస్తులు ధరించేవాడు. స్ఫురద్రూపి.  అతని పాండిత్యం పట్ల షాజహాన్‌కు ఎంతో గౌరవం. ఆ కారణంతోనో లేక హిందూ రాజులను సంతృప్తి పరచటానికో అతని రెండు వేల రూపాయిల పింఛను ఏర్పాటుచేసాడు”.

ఈ పింఛను బహుశా 1658లో షాజహానును ఖైదుచేసాకా నిలుపబడి ఉంటుంది 1659 లో కవీంద్రుడు దనిష్మాంద్ ఖాన్ అనే సంపన్నుని ఆశ్రయంచి, ఈ పించనును పునరుద్ధరణ కొరకు ప్రయత్నించినట్లు బెర్నియర్ రాతల ద్వారా తెలుస్తుంది [7].

***

చారిత్రికంగా వారణాసి హిందుమతానికి కేంద్రబిందువు వంటిది. ఇక్కడి పండితులు దేశవ్యాప్తంగా హిందూ మతానికి  దిశానిర్ధేశనం చేసేవారు. వీరు ముఘల్ పాలకులతో సామరస్యపూరక సత్సంబంధాలు కలిగి ఉంటూ హిందూ మతానికి పాదుకాపుగా ఉండేవారు. 

వారణాసిలో విరూపం చేయబడిన విశ్వనాథ ఆలయాన్ని నారాయణ భట్టు అనే  పండితుడు పునర్నిర్మాణం గావించాడు (1585).  నృసింహశర్మ అనే మరొక సన్యాసి పండితుడు, వారణాసిలో గోవధ నిషేదించమని, భక్తులకు సదుపాయాలు కల్పించమని,  హిందువులపై పన్నును (జిజియా పన్ను??) రద్దుచేయమని  అక్బరుకు పదే పదే వినతులు చేసేవాడు.  నృశింహశర్మ గొప్పతనం తెలుసుకొన్న అక్బర్ చక్రవర్తి ఒకనాడు ఆయనను దర్శించాడట. అతని అభ్యర్ధనమేరకు వారణాసిలో హిందూ వ్యతిరేక పనులను చేయరాదని శాసించి, హిందువులకు పన్నుమినహాయింపులు కల్పించి (జిజియా పన్ను??),  గంగానదిలో స్నానం చేయటానికి వచ్చే భక్తులకొరకు వెచ్చించమని నృసింహశర్మకు భారీఎత్తున ధనాన్ని బహూకరించి వెళ్ళాడట అక్బర్ చక్రవర్తి [8] .

కవీంద్రాచార్య సరస్వతి కూడా తన పూర్వీకుల అడుగుజాడలలో నడచి, షాజహాన్ చక్రవర్తి సహాయంతో హిందూమత ఉద్దరణకొరకు తన శాయశక్తులా ప్రయత్నించి సఫలీకృతుడనట్లు అర్ధమౌతుంది.

 

హీరవిజయ సూరి

హీరవిజయ సూరి (1526-1595) గుజరాత్‌కు చెందిన సంస్కృత పండితుడు. జైన మతావలంబి. ఇతను 1582లో అక్బర్ కోరికపై ఫతేపూర్ సిక్రిలో జరిగే భిన్నమతాల తాత్విక చర్చలలో జైనమతం తరపున పాల్గొనటానికి వచ్చాడు. ఇతని వైదుష్యంపై అక్బరుకు గౌరవం ఏర్పడింది. ఇతనికి “జగద్గురు” అనే బిరుదునిచ్చి సత్కరించాడు. ఇతని అహింసాబోధనలకు అక్బరు ఎంతో ప్రభావితం అయ్యి, వారంలో కొన్ని రోజులు మాంసాహారం తీసుకొనే వాడు కాదు.

హీరవిజయ మొఘల్ ఆస్థానంలో తనకున్న పరపతిని ఉపయోగించి కొన్ని రాజకీయ ఉత్తర్వులను సంపాదించాడు. 1584లో ప్రముఖ జైన “పర్యుషన” పండుగకాలంలో 12 రోజుల పాటు జంతుబలులను నిషేదించే రాజాజ్ఞను పొందాడు. ముఘల్ దండయాత్రలలో ఖైదీలుగా తీసుకుపోయిన వారిని అక్బర్‌చే విడుదల చేయించాడు. ఫతేపూర్ సిక్రీ సమీపంలో జైనులు పవిత్రంగా చూసుకొనే “దామర చెరువు” లో చేపలను పట్టుకోవటాన్ని నిలుపుచేసే ఉత్తర్వు ఇప్పించాడు. ఇలా విధించిన నిషేదం గురించి చక్రవర్తి గ్రామాలలో చాటింపు వేయించాడు. ఈ పనులన్నీ అహింసను జీవినవిధానంగా చేసుకొన్న జైనమతస్థులందరికీ సంతోషం కలిగించిన అంశం.

శాంతిచంద్ర అనే జైనకవి కృపాశకోశ (దయానిధి) అనే పేరుతో రాసిన అక్బరు జీవిత చరిత్రలో ఈ చేపలవేట నిషేదాన్ని ఇలా వర్ణించాడు-


భూలోక చంద్రుడైన అక్బరుని పుణ్యమహిమచేత
చేపలను ముక్కులతో పట్టుకొని తినే కొంగలు కూడా
జాలిపడి వాటిని తినటం మానేసాయి
ఇదే కావ్యంలో శాంతి చంద్ర అక్బరు సుగుణాలను ఇలా వర్ణించాడు
అతను జిజియాపన్ను తొలగించాడు
అనేక ఆలయాలు విరూపం కాకుండా కాపాడాడు
ఎందరో యుద్ధ బంధీలను దయతో విడుదల చేయించాడు
అందరినీ సమాదరించాడు
ఆలమందలు దూడలకు నిర్భయంగా జన్మనిచ్చాయి 

అక్బర్ ఆస్థాన చరిత్రకారుడు అబుల్ ఫాజిల్ కూర్పుచేసిన ఆనాటి 140 మంది ప్రముఖవ్యక్తుల జాబితాలో హీరవిజయ సూరిది 21వ స్థానం.

***

గోసాయి జద్రుప్/చిత్రరూప్

గోసాయి జద్రుప్ ఒక బ్రాహ్మణ సాధువు. ఇతనిని వివిధ సమయాలలో 1617 నుంచి 1620 మధ్య జహంగీర్ చక్రవర్తి కనీసం 6 సార్లు సందర్శించినట్లు ముఘల్ చరిత్రకారులు లిఖించారు. “గోసాయి జద్రుప్ వేదాంతం, సూఫీయిజంలలో గొప్ప పాండిత్యం కలిగిన వ్యక్తి. తన తండ్రి అక్బర్ చక్రవర్తి కూడా జద్రుప్‌ను ఉజ్జయిని వద్ద ఒకసారి సందర్శించాడు (1601)” అని జహంగీర్ చెప్పేవాడట. అక్బర్ కానీ, జహంగీర్ కానీ జద్రుప్‌ను ఆస్థానానికి పిలిపించుకొని మాట్లాడటం కాక తామే స్వయంగా జద్రుప్ ఆశ్రమానికి వెళ్ళి అతనితో సంభాషించే వారంటే జద్రుప్ పట్ల ఎంతటి గౌరవం కలిగిఉండేవారో ఊహించుకోవచ్చు.

జద్రుప్ 1560 ప్రాంతంలో జన్మించి ఉండవచ్చు ఎందుకంటే 1618లో జహంగీర్ ఇతనిని కలిసినప్పుడు 60 ఏళ్ల వయసు ఉండవచ్చు అని అన్నాడు. అప్పటికే జద్రుప్ భార్యబిడ్డలను త్యజించి సన్యాd ¾జీవనాన్ని సాగిస్తున్నాడు. జహంగీర్  తనకొడుకు ఖుశ్రోను తనపై తిరుగుబాటు చేసినందుకు1606లో ఖైదు చేయించాడు. ఖుశ్రో మామగారు జద్రుప్ ను కలిసి ఖుశ్రోను జైలునించి విడుదల చేయిమని జహంగీరు చక్రవర్తికి చెప్పమని కోరాడు. ఖుశ్రోను క్షమించి విడుదల చేయమని జహంగీర్‌ను జద్రుప్ కోరగా, అతను అంగీకరించి విడుదల చేసాడట.

మధురలో హకింబేగ్ అనే ఒక ముస్లిం అధికారి జద్రుప్‌కు కొరడా దెబ్బల శిక్ష విధించగా (ఏం నేరం చేసాడో తెలియరాదు), జహంగీర్ చక్రవర్తి హకింబేగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి విధులనుండి శాశ్వతంగా తొలగించాడట [9]. జద్రుప్ సూచనలపై ప్రాచీన భారతదేశ తూనికలు, కొలతలను జహంగీర్ తన రాజ్యంలో ప్రవేశపెట్టాడు.

1623 ప్రాంతంలో జద్రుప్ ఉజ్జయిని నుండి వారణాసికి మారిపోయి 1638లో అక్కడే మరణించాడు.

గోసాయి జద్రుప్‌తో జహంగీర్ మాట్లాడుతున్న వర్ణచిత్రం పారిస్ మÖ్యజియంలో భద్రపరచబడి ఉన్నది.

 

రుద్రకవి

రుద్రకవి ముఘల్ కుటుంబీకులపై నాలుగు కావ్యాలు రచించాడు. అవి అక్బర్ కుమారుడు దన్యాల్ షా పై దానషాహరచరిత్ర Danasahacarita-(1603), రాజ ప్రముఖుడైన ఖాన్ ఇ-ఖాన్ గురించి ఖానఖానాచరిత్ర khanakhanacarita (1609), జహంగీర్‌పై జహంగీరచరిత్ర జీaష్ట్రaఅస్త్రఱతీacaతీఱta, 1610-1620) షాజహానుపై కీర్తిసముల్లాస Kirtisamullasa  (1610-1620) కావ్యాలు. వీటిలో ముఘల్ ప్రముఖులను హిందూ రాజులను కీర్తించినట్లే ఇంద్రుడు, చంద్రుడు, ఈశ్వరుడు, విష్ణువు లాంటి ఉపమానాలతో పోల్చటం సంప్రదాయ సంస్కృతకావ్యాల ఒరవడి గానే కాక వారందరినీ హిందూ సంస్కృతిలోకి తీసుకువచ్చే ప్రయత్నంగా కూడా అర్ధం చేసుకోవచ్చు.

ఙఙఙ

తెలుగునాట కూడా ముస్లిం పాలకులు ఎందరో కవులకు ఆశ్రయం ఇచ్చిన

ఉదంతాలు కలవు. గోల్కొండ కుతుబ్ షాహీల పాలనలో ఇబ్రహిం కుతుబ్ షా (1550-1580) తెలుగు కవులను ఆదరించాడు. ఇతన్ని కవులు మాలిక్ ఇభరాముడని కీర్తించారు. ఇతను మరణించినపుడు ఒక తెలుగు కవి అయ్యో... లోభిరాజులను చంపకుండా మల్కిభరాముడిని చంపటం నీకు తగునా, ఇకపై అలాంటి రాజుని పుట్టించటం నీకు సాధ్యమౌతుందా అని దేవుడిని ప్రశ్నిస్తాడు ఇలా...


రార విధాత! యోరి వినరా! తగురా! తలకొట్టమారి!
నిస్సారపు లోభిరాజులను చంపక మల్కిభరామ భూవరున్
చారుయశోధనున్ సుగుణి చంపితివ అర్థులకేమి దిక్కురా!
చేరికనింత రాజును స్రుజింపగ నీతరమా వసుంధరన్

 

అద్దంకి గంగాధరుడు, మరిగంటి సింగరాచార్యులు, పొన్నగంటి తెలగన లాంటి కవులను మల్కిభరాముడు ఆదరించాడు.

ఈ ఇబ్రహిం కుతుబ్ షా రాజమహేంద్రవరంకోటను జయించి అక్కడ ఉన్న సితాఫిఖానును తుదముట్టించాడు. ఈ సందర్భంగా ఒక కవిగారు చెప్పిన పద్యం ఇది.

లలితంపు గౌతమిలవణవారధిగాగ, నాయోమగిరి సువేలాద్రిగాగ
మహుడు పెద్దనమంత్రి మహివిభీషణుగాగ, మల్కినేయబు హనుమంతుగాగ
బాహు బలేంద్రుండు భల్లూకపతిగాగ, కరకు తురకలు ప్లవంగములుగాగ
రాజమహేంద్రమే లంకాపురముగాగ, రమణతో నిభరామురాముగాగ
కనలియహితుని సీతాఫిఖానువెడల దోలియాంగీరయినందునుద్ధురతజూపి
సరవినాషాఢ శుద్ధపంచమి మొదలుగ, రాజ్యమేలెను ఇభరామరామశౌరి.

(గోదావరిని సముద్రంతో, వేమగిరిని సువేలాద్రితో, మొత్తం వ్యవహారానికి మంత్రాంగం జరిపిన  అవసరాల పెద్దిరాజును విభీషణునితో, సైన్యాధ్యక్షుడైన మల్కినేబును హనుమంతునితో,  బాహుబలిని(?) జాంబవంతునితో, ముస్లిం సైన్యాన్ని రామదండుతో, రాజమండ్రిని లంకతో, సితాఫిఖానుని రావణునితో ఇబ్రహిమ్ కుతుబ్ షాను రామునితో పోల్చుతూ- సీతాఫిఖానుడి వృత్తాంతాన్ని  రామాయణంతో సామ్యం చూపాడీ పేరు తెలియని కవి. (తూర్పుగోదావరి జిల్లా మెకంజీ కైఫియ్యతులు, బొల్లోజు బాబా)

సంగీత, అభినయాలకు ప్రసిద్ధి చెందిన పదాల సృష్టికర్త  క్షేత్రయ్యను అబ్దుల్లా తానీషా సన్మానించాడు. అబ్దుల్లాపై క్షేత్రయ్య వేయి పదాలు చెప్పాడంటారు.

కుతుబ్‌షాహిల  అనంతరం గోల్కొండ కొంతకాలం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలోకి (1687-1724) వెళ్ళింది. ఔరంగజేబు గొల్కొండను జయించిన సందర్భంగా విడుదల చేయించిన ఖైదీలలో భక్త రామదాసు కూడా ఉన్నాడని చరిత్రకారుల అభిప్రాయం (తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర, ముదిగంటి సుజాతారెడ్డి, పేనం. 99). ఆ తరువాత 1948 వరకు నిజాం రాజవంశం పాలించింది. ఈ కాలంలో  తెలుగు కవులకు రాజాస్థానంలో మునుపటి ఆదరణ లభించిన వివరాలు పెద్దగా తెలియరావు.

ముగింపు

ముఘల్ పాలకులు బాబరు కాలం నుంచీ సంస్కృత పండితులను చేరదీసారు. అనేక హిందూ పురణేతిహాసాలను పర్షియన్ భాషలోకి అనువదింపచేసారు. భారతీయ పెర్షియన్ సంస్కృతుల మేళనం కొరకు పాటుపడ్డారు. 1501-1722 మధ్య అనేకమంది మంది కవులు ఇరాన్, మధ్య ఆసియాలనుండి భారతదేశం వలస వచ్చారు. బాబర్ స్వయంగా కవి. గజల్స్ రచించేవాడు. హుమాయున్, జహంగీర్, షాజహాన్‌లు కవిత్వం పట్ల ఎంతో మక్కువ కలిగి ఉండేవారు. వీరి ఆస్థానాలలో Tahir Bukhari, Qara Bahadur Khan, Maulana Nadiri Samarkandi, Talib Amuli, Nur Jahan, Muhammad Quli Salim Tahani లాంటి ప్రముఖ పెర్షియన్ కవులు

ఉండేవారు.

ఒక్క ఔరంగజేబు మాత్రం సాహిత్యంపై విముఖత చూపాడు. ఇతని పాలనలో ఆస్థాన కవులు లేరు.

బహదూర్ షా జఫర్

చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్‌కు (1775-1862) యుద్ధాలకంటే కవిత్వం అంటే ఎక్కువ ఇష్టం. ఇతని ఆస్థానంలో మీర్జాగాలిబ్, మొమిన్ ఖాన్ వంటి గొప్ప కవులు ఉండేవారు. ఇతను స్వయంగా మంచి కవి. బ్రిటిష్ వారిపై ఇతను 1857లో చేసిన తిరుగుబాటు విఫలమైనప్పుడు ఆ సందర్భాన్ని ఇలా సాహిత్యంలో నిక్షిప్తం చేసాడు.


అయ్యో! ఎంత గొప్ప తిరుగుబాటు ఇది
దయలేని కాలం వల్ల
ఢిల్లీ ఒక్క క్షణంలో జాఫర్ చేతుల్లోంచి జారిపోయింది.
అయినా బహదూర్ షా తన భారతీయుల పోరాట పటిమపట్ల ఆశావహంగానే ఉన్నాడు ఇలా
భారతీయులకు నిజాయితీ,
ఆత్మగౌరవం ఉన్నంతవరకూ
ఎన్నటికైనా హిందూస్థాన్ ఖడ్గం
లండన్ సింహాసనం ముందు
తళుక్కున మెరవకపోదు.

 

బహదూర్ షాని రాజకీయ ఖైదీగా బంధించి రంగూన్‌కు తరలించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ సందర్భంలో అతను రాసుకొన్న చివరి కవిత్వం ఇది.


నీవు నన్ను చక్రవర్తిని చేసాననుకొన్నావు
కానీ నేను నా కిరీటాన్ని బిక్షాపాత్రగా,
నమ్మించి ద్రోహం చేయబడిన దానిలా
మిగుల్చుకొన్నాను //
తనకు ప్రియమైన భూమిలో ఖననం కొరకు
ఆరడుగుల స్థలం కూడా లేని
జాఫర్ ఎంతటి దురదృష్టవంతుడు [10]

బహదూర్ షాను స్థానికులు ఒక సూఫీ తాత్వికునిగా భావించి ఆశీర్వాదాలు తీసుకొనేవారట. బహదూర్ షా జాఫర్ చీశీఙవఎbవతీ 7tష్ట్ర, 1862న మరణించాడు. రంగూన్ (బర్మా) లోనే ఖననం చేయబడ్డాడు. ఇతని సమాధి చాన్నాళ్ళు కాలగర్భంలో ఉండిపోయింది.

1991 లో స్థానిక వర్కర్లు డ్రైనేజ్ కొరకు కాలువలు తవ్వుతున్నప్పుడు, భూమిలో 3 అడుగుల లోతులో ఇతని సమాధి కనిపించింది. జాఫర్‌ను జుఎజూవతీశీతీ-Saఱఅt గా గుర్తించి, ప్రస్తుతం దాని వద్ద ఒక సూఫీ దర్గా నిర్మించారు.

ఎవరు నా తరపున ప్రార్ధిస్తారు?
నాకొక పూలగుత్తి తీసుకొస్తారు?
నాకోసం ఒక కొవ్వత్తిని వెలిగిస్తారు?

నేను ఒట్టి చీకటి సమాధిని తప్ప మరేమి కాదు- అంటూ బహదూర్ షా రాసుకొన్న వాక్యాలు గుండెల్ని మెలిపెడతాయి.

2012లో భారత ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ఈ దర్గాని సందర్శించి బహదూర్ షా జాఫర్‌కు నివాళులు అర్పించారు. 2017లో ప్రధాని నరేంద్రమోడి  కూడా బహదూర్ షా జాఫర్ సమాధిని దర్శించి దానివద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచారు.

19 జూలై, 2024

 (పై వ్యాసం "హరప్పా నుండి నేటి వరకూ" పుస్తకం లోనిది) 

 

References

1. Page no. XI Muslim Patronage to Sanskritic, Learning  Jatindra bimal chaudari

2. New light on the life of Panditaraja Jagannatha, by R.B. Athavale

3. Jagannatha Pandita, by A ramaswami Sastri

4.https://bsvprasad.wordpress.com/2013/09/23/jagannatha-pandita-raya/

5. Kavindracaryasucipatram. Kavindracharya list. Edited with introd. by R. Ananta Krishna Sastry.

6.  Kavindracandrodaya, edited by pandit Har Dutt Sharma, 1939

7.  Bernier and Kavindracarya Sarasvati at the Mughal Court, Studies In Indian Literary History Vol. II,  By P. K. Code, M.A.

8. Kavindracarya Sarasyati, By V Raghavan-Acarya - Puspanjali Volume, ( In honour of Dr. D. R, Bhandarkar )

9. The Mughal Encounter with Vedanta: Recovering the Biography of Jadrup by Shireen Moosvi

10. https://www.prathaculturalschool.com/post/bahadur-shah-zafar-poetry

11. Bahadur Shah Zafar's wish remains unfulfilled despite promises by Indian leaders (business-standard.com)

12. Contested History: Brahmanical Memories of Relations with the Mughals, Audrey Truschke

13. Culture of Encounters, Audrey Truschke




Sunday, October 11, 2026

చివరి గిన్నీ వస్త్రపు ముక్క, (ఫ్రెంచి యానాం కథలు)

కథా కాలం 1840-1865

యానాం... తూర్పున సముద్రం, పక్కనే గోదావరి పాయ. ఉదయం ఇంకా పూర్తిగా నిద్ర లేవకముందే ఆ ఊరు మాత్రం శ్వాస తీసుకోవడం మొదలుపెడుతుంది. ఆ శ్వాస గాలిది కాదు, మగ్గాలది. గోదావరి  నుంచి వచ్చే చల్లటి గాలి, వీధుల్లో అప్పుడే ఆసు పోసి ఆరబెట్టిన నూలు దారాలను తడిమి వెళ్లేది.  రాత్రంతా నానబెట్టిన దారాలకు గంజి పెడుతున్న వాసన ఆ వీధికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చేది.

దూరంగా  రేవు నుంచి పడవల లంగరు చప్పుడు, ఎద్దుబండ్ల చక్రాల గరగరలు వినిపిస్తున్నా... యానాం నడిబొడ్డున ప్రతిధ్వనించేది మాత్రం ఒకే ఒక్క శబ్దం.

టక్... టక్... టక్...

అది మగ్గం నుంచి వచ్చే నాడె చప్పుడు. అచ్చు కర్రల మధ్య నుంచి,  పడుగు, పేకల  మధ్య నాడె ఒక కొస నుంచి మరో కొసకు పరుగులు పెడుతుంటే వచ్చే ఆ లయబద్ధమైన శబ్దం ఒక ఇంట్లో మొదలైతే, దానికి ఎదురింటి అచ్చు కర్రలు వెంటనే సమాధానం చెప్పేవి. ఒక మగ్గం మొదలైతే మరో మగ్గం, దాని వెంట ఇంకో మగ్గం. ఆ శబ్దం కలిసిపోయి యానాం వీధులకు ఒక ప్రత్యేకమైన లయను ఇచ్చేది.

వెంకటప్పయ్యకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ శబ్దమే అతని జోలపాట. ఆ పడుగు పేకల కలయికే అతని లోకం. అతని తండ్రి సుబ్బయ్య యానాంలోనే పేరుగాంచిన నేతకాడు. ఆ రోజు ఉదయాన్నే మగ్గం గుంటలో రెండు కాళ్లు తొక్కుడు పలకలపై ఆనించి  కూర్చున్న సుబ్బయ్య, పడుగు దారాలను సరిచేస్తూ ఎంతో ఏకాగ్రతతో పని చేస్తున్నాడు. పక్కనే చిన్న పీట మీద కూర్చున్న పదేళ్ల వెంకటప్పయ్య, తండ్రి చేతిలోని కండెలను ఆసక్తిగా చూస్తున్నాడు.

"నాన్నా... ఈ దారాలు అంత తెల్లగా ఎందుకున్నాయి? నిన్నటి దాకా పసుపు రంగులో ఉండేవి కదా?" అడిగాడు వెంకటప్పయ్య.

సుబ్బయ్య తన చేతిలోని నాడెను క్షణం పాటు ఆపి, కొడుకు వైపు చూసి నవ్వాడు. "నిన్న రాత్రంతా గంజిలో ఉడకబెట్టి, తెల్లవారుజామున రేవులో ఉతికి ఆరేశాం కదరా. దారానికి పట్టిన మురికి పోతేనే, మనం నేసే బట్టకు నిండుదనం వస్తుంది. ఇది మామూలు నూలు కాదురా కన్నా... మన బతుకు."

మగ్గం చెక్కను ఆప్యాయంగా తడిమాడు సుబ్బయ్య. "అది కేవలం ఒక చెక్క కాదు, ఒక తరం నుంచి మరో తరానికి అందించబడిన వారసత్వ సంపద. "మన తాత ఈ మగ్గం గుంటలోనే కూర్చున్నాడు. నేను కూర్చున్నాను. రేపు నువ్వు కూర్చోవాలి.  మనం నేసేది బట్ట కాదురా.. మన ధర్మం! మన కష్టం, చెమట ఈ దారాల్లోనే కలిసిపోతాయి.

ఇదుగో... ఈ తెల్లని నూలు దారాల్లో కొన్నింటిని తీసుకుని, మన ఊరిలోని అద్దకం పనివాళ్ల దగ్గరకు పంపుతాం. వాళ్లు ఈ దారాలను పెద్ద నీలిమందు తొట్లలో ముంచి, ముదురు నీలం రంగు అద్దుతారు.  ఎందుకో తెలుసా? ఏ రంగుకైనా వయసుంటుందేమో కానీ, ఈ నీలిమందుకు మాత్రం ఉండదు. గాలి తగిలేకొద్దీ రంగు ముదురుతుందే తప్ప చెదరదు. 

అలా చెబుతూనే నాడెను వేగంగా కదుపుతూ, సగం పూర్తయిన వస్త్రాన్ని పైకి లేపాడు. తెలుపు, ముదురు నీలం దారాలు అడ్డునిలువుగా కలిసి చదరంగపు గడుల్లా  అల్లుకున్న వస్త్రమది. చేతికి కాస్త గరుకుగా తగిలినా, ఆ పడుగు పేకల కలయికలో తరాలనాటి గట్టిదనం ఉట్టిపడుతోంది.

"దీని పేరే 'గిన్నీ' (Guinée). మన యానాం నేతకారుల చేతుల్లో తయారయ్యే ఈ నీలిరంగు గడుల కాటన్ బట్టంటే దొరలకు ప్రాణం. ఈ అల్లికలోనే మన  ఆత్మ కలిసి ఉంటుందిరా," అన్నాడు సుబ్బయ్య కళ్లలో గర్వం తొణికిసలాడుతుండగా.

అదొక అందమైన వలయం. తెల్లవారకముందే ఇంటి ముందు పత్తి మూటలు దిగేవి. సాలె ఇళ్ల ఆడవాళ్లు రాట్నాల మీద దారాన్ని వడికేవారు. ఆ దారాల్లో కొన్నింటిని నీలిమందు అద్దకానికి పంపేవారు. రంగు పులుముకున్న ఆ దారాలు సుబ్బయ్య మగ్గంలో గిన్నీ బట్టగా మారేవి.  సాయంత్రానికి నరసయ్య మనుషులు వచ్చి ఆరోజు  నేసిన బట్టల కట్టలు తీసుకెళ్లేవారు.

ఈ చక్రం సజావుగా తిరిగినన్ని రోజులు సాలెల  జీవితాల్లో వెలుగులు నిండేవి.  సుబ్బయ్యకు మగ్గం ఒక వస్తువు కాదు—ఆ వెలుగుల్ని నేసిపెట్టే జీవనాధారం.

ఒకసారి వెంకటప్పయ్య అడిగాడు, “ఇవన్నీ ఎక్కడికి పోతాయి నాన్నా?”

“నరసయ్య కొట్టుకు, అక్కడనుంచి కోరంగి ఓడల మీదికి. వాటిపై సముద్రం దాటి దూర దేశాలకు,” అన్నాడు సుబ్బయ్య. “అక్కడ పెద్ద పెద్ద వాళ్లు మన బట్టలు వేసుకుని మురిసిపోతారట.”

ఒకరోజు నరసయ్య స్వయంగా పత్తి మూటల లెక్క చూసుకుంటూ వచ్చాడు. సుబ్బయ్య అతని చేతిలోని లెక్కపుస్తకం చూసి, “ఏమయ్యా నరసయ్యా, పత్తి ధర ఇంత పెరిగిందేమిటి? గతవారం ఇంతకంటే తక్కువకే తీసుకొచ్చావు కదా?” అని అడిగాడు.

నరసయ్య మూట మీద చేయి వేసి, “పత్తి ధర కాదు సుబ్బయ్యా... దాని మీద పడిన సుంకం. బ్రిటిష్ వాళ్ల ప్రాంతం నుంచి తెచ్చుకుంటున్నాం కదా. అక్కడి పన్ను పెరిగింది,” అన్నాడు. సుబ్బయ్య ఏమీ మాట్లాడలేకపోయాడు.

కొన్నేళ్లు గడిచాయి. వెంకటప్పయ్య యవ్వనంలోకి అడుగుపెట్టాడు. తండ్రికి తగ్గ కొడుకుగా మగ్గం పనిలో ఆరితేరాడు. పడుగు దారాలు తెగకుండా అచ్చు వేయడంలో, నాడెను కంటికి కనిపించనంత వేగంగా పరుగెత్తించడంలో అతనికతనే సాటి అనిపించుకొన్నాడు. ఆ మగ్గం చప్పుడికి తోడుగా అతని ఇంటికి ఒక ఇల్లాలు వచ్చింది.  ఇంటికి వేసిన సున్నాలు వెలిసిపోయేలోపు పండంటి కొడుకు, ఓ కూతురు పుట్టారు.  ఇంటి దూలానికి చిన్న ఊయల వేలాడింది. మగ్గం శబ్దాల మధ్య పిల్లల ఏడుపులు, నవ్వులు కలిసిపోయాయి.  అతని సంసారం మగ్గం చుట్టూ మరింత అల్లుకుంది.

***

ఒక రోజు సాయంత్రం, సాలిపేట వీధి అరుగు మీద అందరూ కూర్చుని చుట్టలు కాలుస్తుండగా, వ్యాపారి నరసయ్య ఆదుర్దాగా అక్కడికి వచ్చాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఉండే చిరునవ్వు లేదు. చేతిలో సరుకు తాలూకు కాగితాలు లేవు.

"ఏమైంది నరసయ్య? అలా ఉన్నావు?" అడిగాడు సుబ్బయ్య చుట్ట ఆర్పేస్తూ.

నరసయ్య గొంతు సవరించుకుని, "పట్నం నుంచి కబురు వచ్చింది సుబ్బయ్యా... మన బట్టలు పోయే బోర్బన్ దేశం ఉందే... అక్కడ మన వస్త్రాల మీద కొత్త పన్ను వేశారట దొరలు. ఇరవై శాతం పన్ను అట!" అన్నాడు.

అక్కడ ఉన్న సాలెలందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్లకు పడుగు, పేకల లెక్కలు తెలుసు కానీ, ఈ శాతాలు, పన్నుల లెక్కలు తెలియవు.

"ఇరవై శాతం అంటే ఎంతన్నా?" వెంకటప్పయ్యకు ఆ సంఖ్య అర్థం కాక అడిగాడు.

నరసయ్య నిట్టూరుస్తూ, "అంటే... వంద రూపాయల బట్ట అమ్మితే, అందులో ఇరవై రూపాయలు ఆ దొరలకే కట్టేయాలి. మీ బట్టకు దొరికే ధరలో ఐదో వంతు అక్కడికే పోతుంది," అన్నాడు.

"అంతపన్నా? మన దగ్గర పన్నులు వసూలు చేయడం లేదా? మళ్లీ అక్కడ ఎందుకు?" సుబ్బయ్య గొంతులో కోపం.

"అది వాళ్ల రాజ్యం సుబ్బయ్యా. మన బట్టలు అక్కడికి వెళ్లాలంటే ఆ పన్ను కట్టాల్సిందే. కాబట్టి... మనం బట్టను ఇంకా చౌకగా అమ్మితే తప్ప వాళ్లు కొనరు."

వెంకటప్పయ్యకు ఆ మాట తీవ్రంగా కోపం తెప్పించింది. "ఎందుకు చౌకగా అమ్మాలి? రాత్రనక, పగలనక కళ్లు కాయలు కాచేలా, నడుములు వంగిపోయేలా మనం మగ్గం గుంటలో కుస్తీ పడితేగానీ ఆ గిన్నీ బట్ట తయారవ్వదు. వాళ్ల పన్నుల కోసం మన కష్టాన్ని ఎందుకు చౌకగా ఇవ్వాలి?"

నరసయ్య చేతులు నలుపుకొంటూ, "దొరల పన్ను తగ్గించమని మనం అడగగలమా బాబూ? వాళ్ల శాసనం వాళ్లది.”

అక్కడ భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. ముడిసరుకు కొందామంటే ధర ఎక్కువ. తీరా నెత్తురు ధారపోసి బట్ట నేసి అమ్ముదామంటే గిట్టుబాటు కాని పరిస్థితి.

సుబ్బయ్య లేచి నిలబడ్డాడు. తన చేతులలో ఉన్న నూలు దారపు పోగులను దులిపి, "ఏదేమైనా మన పని మనం చేసుకుందాం. మన చేతికి ఉన్న నైపుణ్యం ఏ పన్నుతోనూ పోదు. మన గిన్నీ బట్టకు విలువ ఎప్పటికీ ఉంటుంది," అని ధీమాగా చెప్పి ఇంట్లోకి నడిచాడు.

తండ్రి మాటల్లో ఉన్న నమ్మకం వెంకటప్పయ్యకు కొద్దిగా ధైర్యాన్ని ఇచ్చింది.

కానీ ఈ మార్పు మొదట మగ్గం వద్దకాదు, ఇంటి పొయ్యి దగ్గర కనిపించింది. వారానికి ఒకసారి కొనే పచారీ సామాన్లు పదిహేనురోజులకు, నెల్లాళ్ళకు ఒకసారి కొనుక్కొనేవారు.  “నీకిష్టమైన కూర రేపు వండుతానులే. ఈ రోజుకు చారు బువ్వ తినమ్మా,” అంటూ వెంకటప్పయ్య భార్య పిల్లలను బుజ్జగించేది.

సుబ్బయ్యకు తెలియదు... యూరప్‌ నుంచి ఓ తుఫాను అప్పటికే యానాం సాలెల ఉనికిని తుడిచిపెట్టడానికి దూసుకొస్తోంది. దాని పేరు ఆవిరి యంత్రం. అది సముద్రాలు దాటి యానాం రేవును తాకటానికి  ఎంతో కాలం పట్టలేదు.

***

యానాం బజారు ఆ రోజు ఎప్పటిలా లేదు. వస్త్ర దుకాణాల ముందు జనం గుమిగూడి ఉన్నారు. వెంకటప్పయ్య ఏదో పని మీద అటుగా వెళ్తూ, ఆ గుంపును చూసి ఆగాడు. వాళ్ల మధ్యలో వ్యాపారి నరసయ్య ఒక కొత్త రకం బట్టను విప్పి చూపిస్తున్నాడు. అది ముదురు నీలం రంగులో ఉండే తమ 'గిన్నీ' వస్త్రం కాదు, యానాం నేతకారులు సంప్రదాయంగా నేసే సన్నని మస్లిన్ (muslin)   బట్ట కూడా కాదు.

ఆ బట్ట ఎంతో పలుచగా, ఒకే తీరున గట్టిగా అల్లినట్లుంది. కానీ అందులో తమ చేనేత బట్టలకు ఉండే మృదుత్వం లేదు, ప్రాణం లేదు.

"ఏమిటీ బట్ట?" గుంపులో నుంచి ఒకరు అడిగారు.

"దీని పేరు మాదెపొలం (Madépolams). ఇంగ్లీషు వాళ్ల సరుకు. యూరప్  నుంచి ఓడల్లో మన రేవుకు వస్తోంది," నరసయ్య గొంతులో వ్యాపారపు లెక్కలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

వెంకటప్పయ్య ఆ బట్టను చేతిలోకి తీసుకున్నాడు. తన వేళ్లకు అది చాలా కర్కశంగా తగిలింది. మగ్గం మీద ఒక మనిషి చెమట చిందిస్తూ, పడుగు పేకలను కలుపుతూ నేసిన బట్టలా అనిపించలేదు అది.

"దీన్ని మనుషులు నేయలేదు బాబూ... యంత్రాలు నేసిన బట్ట ఇది. మనం నెల రోజుల్లో నేసే వస్త్రాన్ని, ఆ ఇనుప యంత్రాలు ఒక్క రోజులో నేసి పడేస్తాయట," అన్నాడు నరసయ్య.

వెంకటప్పయ్యకు ఆ మాట నచ్చలేదు. "బట్టకి ప్రాణం ఉండాలి కదా నరసయ్యన్నా? మన నీలి రంగు గిన్నీ బట్ట ముందు ఇది నిలబడుతుందా?"

నరసయ్య వ్యంగ్యంగా నవ్వాడు. "బట్ట ప్రాణంతో ఉందా లేదా అని కొనేవాడు చూడడు వెంకటప్పయ్యా... బట్ట ఎంత చౌకగా వస్తోందని మాత్రమే చూస్తాడు. మన బట్ట ధర కన్నా ఇది సగం ధరకే వస్తోంది. జనం ఎగబడి కొంటున్నారు."

“నా గోదాములోనే మీ బట్టల కట్టలు పేరుకుపోతున్నాయి వెంకటప్పయ్యా. నేను కూడా ఏం చేయాలో తెలియడం లేదు. కొనేవాళ్లు తగ్గిపోతున్నారు.

ఆ క్షణంలో వెంకటప్పయ్యకు మొదటిసారి గుండెల్లో భయం మొదలైంది. “మనిషితో పోటీ అయితే తన నైపుణ్యంతో గెలవడానికి ప్రయత్నించవచ్చు; వాళ్లు మనుషులతో పోటీ పడటం లేదు. వేగంతో, ధరతో, పెద్ద యంత్రాల శక్తితో పోరాడుతున్నారు.

యానాంలో పత్తి పండదు, బ్రిటిష్ ప్రాంతం నుంచి తెచ్చుకోవాలి. దానిపై ఇప్పటికే పదహారు శాతం సుంకం, నేసిన బట్టను ఎగుమతి చేస్తే ఇరవై శాతం పన్ను. స్థానికంగా అమ్మాలంటే ‘మాదెపొలం’ బట్టల పోటీ. ఇవన్నీ కలిసి మూడువైపులనుంచీ యానాం నేతకారుల ఉసురు తీయడం మొదలుపెట్టాయి.

ఫ్రెంచ్ ప్రభుత్వం నేతకారుల మీద 'మొంట్రఫాట్' (montrafat) అనే వృత్తి పన్ను వేసేది. యానాం పాలకులు ఇక్కడి నేతకారుల దుస్థితి చూసి, వారి మగ్గాలపై ఆ పన్నును మినహాయించారు. అప్పటికే ప్రాణం పోతున్న యానాం చేనేత వృత్తికి అది ఏమాత్రం ఊపిరి పోయలేకపోయింది.

ఇదే సమయంలో సుబ్బయ్య మంచం పట్టాడు. వయసు మీద పడటం కంటే, కళ్లెదుటే తన వృత్తి నాశనమైపోతుండటం ఆ వృద్ధుడిని కుంగదీసింది.

"వెంకటప్పయ్యా..." వణుకుతున్న స్వరంతో కొడుకును పిలిచాడు సుబ్బయ్య.

వెంకటప్పయ్య వెళ్లి తండ్రి చేతులు పట్టుకున్నాడు. ఆ చేతులు ముతకగా, దారాలు కోసుకుపోయిన మచ్చలతో నిండి ఉన్నాయి. ఎన్నేళ్లుగా మగ్గం మీద పని చేసిన చేతులవి!. వాటిని చూస్తూ వెంకటప్పయ్య కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు.

"మగ్గాన్ని వదిలిపెట్టకురా. మగ్గం  పచ్చగా ఉంటే, మన బతుకు పచ్చగా ఉంటుంది. నాకు అంతే తెలుసు"  ఆ చివరి మాట తర్వాత అతని వేళ్లు వెంకటప్పయ్య చేతిలో నెమ్మదిగా సడలిపోయాయి.

తండ్రి పోయిన వారం రోజులకు, వెంకటప్పయ్య మొదటిసారి ఒంటరిగా మగ్గం ముందు కూర్చున్నాడు. అచ్చు కర్రను లాగాడు.

'టక్'... నాడెను విసిరాడు.

ఆ శబ్దంలో మునుపటి గంభీరత లేదు. ఒక నిట్టూర్పులా వినిపించింది.

వీధిలో నెమ్మదిగా మార్పు మొదలైంది.

ముందుగా మల్లయ్య మగ్గం శబ్దం ఆగిపోయింది. రెండు రోజులైనా ఆ ఇంటి నుంచి నాడె చప్పుడు రాకపోవడంతో, వెంకటప్పయ్య వెళ్లి చూశాడు. అక్కడ మగ్గం లేదు, గుంట మాత్రమే మిగిలి ఉంది.

"ఏమైంది మల్లన్నా? మగ్గం ఏదీ?"

"అమ్మేశాను వెంకటప్పయ్యా. వారం రోజులు కష్టపడి బట్ట నేస్తే, కొనే నాథుడు లేడు. ఇంట్లో పిల్లలు పస్తులున్నారు. మగ్గం విప్పి ఆ కలపను  అమ్ముకున్నాను," మల్లయ్య కళ్లలో కన్నీళ్లు లేవు, ఒక రకమైన శూన్యం ఉంది.

"మరి బతుకెలా?"

మల్లయ్య గాల్లోకి చూస్తూ, "ఇక్కడుంటే పస్తులుండాల్సిందే వెంకటప్పయ్యా... అద్దరి రేవులో పెద్ద ఓడలు వచ్చాయట. ఎవరో దొరలు మనవాళ్లను ఎక్కడికో 'రీ యూనియన్' అట, ఆ దీవులకు తీసుకెళ్తున్నారట. అక్కడ చెరకు తోటల్లో పనట. ఏడు సముద్రాలు దాటే బట్ట నేసిన ఈ చేతులతో... ఇప్పుడు చెరకు గడలు నరకడానికి పోతున్నాను..." అన్నాడు.

ఖాళీగా ఉన్న మగ్గం గొయ్యి దృశ్యం వెంకటప్పయ్యను కలచివేసింది.

అది కేవలం ఒక మల్లయ్య కథ కాదు. యానాం అంతటా అదే పరిస్థితి. 

పక్కింటి తిమ్మయ్య కుటుంబంలో మరో విషాదం. వాళ్ళ పదహారేళ్ల అమ్మాయి లక్ష్మి పెళ్లి నిశ్చయమైంది. డబ్బు పుట్టక వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.  పొద్దున్న కట్టిన కొబ్బరాకుల పందిరి రాత్రికే  తీసేశారు. మామిడి ఆకులు నేలపై పడి ఉన్నాయి.

ఒకప్పుడు రంగులద్దే కేంద్రాలతో  కళకళలాడిన భూములు నెమ్మదిగా కళావిహీనమయ్యాయి. నిన్న మొన్నటి వరకూ వేల ఫ్రాంకుల పన్నులు కట్టిన నీలిమందు కేంద్రాలు ఆదాయం లేక  పన్నులు కట్టలేక మూతపడసాగాయి. ఒకప్పుడు పనివాళ్ళతో, బండ్లతో,  తెల్లటి వస్త్రాలతో, నీలిమందు మరకలతో జీవం ఉట్టిపడిన ఆ నేలలు... ఇప్పుడు కలుపు మొక్కలతో, ఎండిన గడ్డితో బీడువారుతున్నాయి.

మగ్గాలు ఆగిపోతున్నాయి. నీలిమందు అద్దే కేంద్రాలు మూతబడ్డాయి.  వ్యాపారులు, ప్రజలు చౌకబారు యంత్రపు బట్టల వైపు మొగ్గుచూపుతున్నారు.

ఒక ఉదయం వెంకటప్పయ్య తన మగ్గం దగ్గర కూర్చుని గిన్నీ వస్త్రం నేస్తుంటే, అతని కొడుకు అక్కడికి వచ్చాడు. కుర్రాడికి పదేళ్లుంటాయి.

"నాన్నా... నేను కూడా మగ్గం నేర్చుకుంటాను," అన్నాడు.

నిజానికి ఆ మాట వింటే ఏ చేనేత తండ్రికైనా గుండె ఉప్పొంగుతుంది. తన వంశధర్మం నిలబడుతుందన్న ఆనందం కలుగుతుంది. కానీ వెంకటప్పయ్య ఆ మాట వినగానే ఉలిక్కిపడ్డాడు. తన చేతిలో ఉన్న నాడెను ఆపేశాడు.

తండ్రి సుబ్బయ్య తనను కొత్తబట్టలు తొడిగి మగ్గం గుంటలో కూర్చోబెట్టి, అక్షింతలు వేసి ఆశీర్వదించిన దృశ్యం గుర్తొచ్చింది.

"మనం నేసేది బట్ట కాదురా, మన వృత్తిధర్మం, వంశాచారం" అన్న మాటలు చెవుల్లో మోగాయి. ఇప్పుడు ఆ మగ్గం తన కొడుకుకి ఆకలిని తప్ప మరేమీ ఇవ్వలేదని అతనికి స్పష్టంగా తెలుసు.

"వద్దురా... నువ్వు ఈ గోతిలో దిగొద్దు," అన్నాడు వెంకటప్పయ్య గొంతు వణుకుతుండగా.

కొడుకు ఆశ్చర్యంగా చూశాడు. ఒక సాలెవాడు తన బిడ్డను మగ్గానికి దూరం చేయడం అంటే, తన చేతుల్ని తానే నరుక్కోవడం లాంటిది. అయినా, ఆ నిర్ణయం తీసుకోక తప్పని స్థితికి వెంకటప్పయ్యను కాలమే నెట్టింది.

యానాం గాలిలో ఇప్పుడు మగ్గాల శబ్దం తగ్గిపోయింది. నిశ్శబ్దం పెరుగుతోంది.  వీధుల్లో మగ్గాల సవ్వడి సగానికి సగం తగ్గిపోయిన ఆ రోజుల్లో, ఒకనాడు బజారులో వ్యాపారి నరసయ్య దుకాణం ముందు వెంకటప్పయ్య నిలబడి ఉన్నాడు. దుకాణం నిండా ఆంగ్లేయులు దిగుమతి చేసిన కొత్త బట్టల కట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి.

"ఏమిటన్నా ఇది? ఎటు చూసినా ఈ 'మాదెపొలం' బట్టలే కనిపిస్తున్నాయి. అసలు ఈ మాదెపొలం పేరు మనదే కదా? మన నరసాపురం పక్కన ఉన్న మాధవాయపాలెం పేరే కదా ఆ ఆంగ్లేయులు పలుకలేక మాదెపొలం అన్నారు! మన బట్ట పేరు వాళ్ల సరుకుకు ఎందుకు పెట్టుకున్నారు?" వెంకటప్పయ్య గొంతులో ఆగ్రహం, అయోమయం కలగలిసి ఉన్నాయి.

నరసయ్య నిట్టూరుస్తూ ఒక బట్టల కట్టను చేత్తో తడిమాడు. "అదే వాళ్ళ తెలివైన వ్యాపారం వెంకటప్పయ్యా...“మన పత్తి అక్కడికి పోతుంది.  వాళ్ల యంత్రాలు ఒక్క రోజులో వేల గజాలు నేస్తాయి. వాటికే  'మాదెపొలం' అని పేరు పెట్టి, మళ్లీ పడవల్లో మన దగ్గరకే తెచ్చి మన బజార్లలోనే కుప్పలుగా పోస్తున్నారు.  దాని తయారీ ఖర్చు చాలా తక్కువ. అందుకే మన గిన్నీ బట్టకంటే సగం ధరకే ఆ బట్టను అమ్ముతున్నారు." 

“మన చేతుల్లోంచి మన బతుకును తీసుకెళ్లి... మళ్లీ మనకే అమ్ముతున్నట్టుంది.”

నరసయ్య ఏమీ అనలేక తల ఊపాడు.

***

భారంగా ఇంటికి చేరుకున్న ఆ రోజు సాయంత్రం చేతులు కడుక్కుని అరుగు మీద కూర్చోగానే, భార్య గుమ్మంలోకి వచ్చి నిలబడింది.

“ఏమయ్యా... ఎల్లుండి మన పిల్ల పుట్టినరోజు. గుర్తుందా?” అంది.

అతను తల ఊపి ఆమె ముఖంలోకి చూశాడు.

“అమ్మాయి పెద్దదవుతోంది. ఈ పుట్టినరోజుకైనా తొలిసారి చీర కట్టాలని  ముచ్చట పడుతోంది. ‘నాన్న తన చేతులతో నేసిన చీరే కట్టుకుంటానమ్మా... అని ఎప్పటినుంచో ఒకటే అడుగుతోంది. పండగొచ్చినా, పబ్బమొచ్చినా పాతబట్టలతోనే సరిపెడుతున్నాం. కనీసం ఈ పుట్టినరోజుకైనా పిల్ల ముచ్చట తీర్చాలనిపిస్తుంది...” అంది నెమ్మదిగా.

ఆమె కాసేపు ఆగి, అతని ముఖాన్ని చూసింది.

“నువ్వు ఇంతగా కుంగిపోకు. రోజులు అన్నీ ఒకేలా ఉండవు. ఇవాళ బజారులో మన బట్ట అమ్ముడుపోలేదని మన చేతులు ఒట్టిపోయినట్టేమీ కాదు.  మన పని మనకు తెలుసు. ఈ కష్టం కూడా ఏదోలా దాటిపోతుందిలే.”

వెంకటప్పయ్య ఏమీ మాట్లాడలేదు.

ఆమె భుజంపై చేయివేసి మళ్లీ మెల్లగా అంది,

“అప్పు తీసుకోవాల్సి వస్తే తీసుకుందాం. ఈ ఒక్కసారి పిల్ల ముచ్చట తీర్చుదాం. మన చేతులతో నేసిన చీర కాకపోయినా పర్లేదు. మన కష్టం తెలియకుండా అది నవ్వితే చాలు.

నువ్వు మాత్రం ఇలా దిగులుగా కూర్చోకు. నువ్వు దిగులుపడితే ఇంట్లో వాళ్లందరికీ భయం వేస్తుంది.”

వెంకటప్పయ్య ఏమీ మాట్లాడలేదు.

తనకూతురు మొదటిసారి కట్టబోయే చీరకు సరిపడా రంగు నూలు, పట్టు పోగులు కొనాలంటే తన దగ్గర చిల్లిగవ్వ లేదు. అప్పు చేసి నేసినా, అది పూర్తయ్యేసరికి అయ్యే ఖర్చుకి, బజారులో దొరికే బట్టల ధరకు పొంతనే ఉండదు. రాత్రంతా అచ్చు కర్రలకు ఆనుకుని కూర్చున్నాడు. నాడెను చేతిలోకి తీసుకున్నాడు.  చేతులు కదల్లేదు.

తన వంశధర్మం, తన రక్తం అయిన ఆ మగ్గం మీద తన కూతురికి చీర నేయలేని దుస్థితి.

మరుసటి రోజు బజారుకు వెళ్లి, అప్పు చేసి, చౌకగా దొరికే  యంత్రం నేసిన చీరను కొనితెచ్చి కూతురి చేతిలో పెట్టాడు.

ఆమె ఆ చీరను చూసి, తండ్రి కళ్లలోకి చూసింది.

ఏమీ అడగలేదు.

అందులో పడుగు పేకల కలయిక లేదు, తన తండ్రి చేతి స్పర్శ లేదు. మగ్గం గుంటలో పుట్టిన వాసన లేదు.

ఆమె ఏమీ అనకుండా  చీరను మడిచి లోపలికి తీసుకెళ్లిపోయింది.

వెంకటప్పయ్య గుండెలో ముల్లుదిగినట్లయింది.

***

వెంకటప్పయ్య ఆరుబయట నులకమంచంపై పడుకొని శూన్యంలోకి చూశాడు. అతని మనసు పాతికేళ్ల వెనక్కి వెళ్లింది. అప్పట్లో యానాం వీధుల్లో మగ్గాల చప్పుడే వినిపించేది. సుమారు మూడు వేల మంది నేతకారులతో ఊరంతా ఒక పెద్ద మగ్గంలా కదిలేది. రాత్రి వేళలు కూడా ఇళ్లల్లో ఎవరో ఒకరు మగ్గాన్ని ఆడిస్తూ ఉండేవారు.

అంతా మారిపోయింది. ఊరుమొత్తానికి ఇపుడు మహా అయితే ఓ వంద మగ్గాలుంటాయేమో.

ఒకప్పుడు వేల చేతులతో సాగిన ఆ వృత్తి కుంచించుకుపోయింది. 

ఆ వంద మందిలో తాను కూడా ఒకడినని వెంకటప్పయ్యకు తెలుసు. ఎదురింటి మల్లయ్య, పక్కింటి తిమ్మయ్య, వీధి చివర చెన్నయ్య... అందరూ ఆ లాంకషైర్ యంత్రాల దెబ్బకు రాలిపోయిన ఆకుల్లా ఆంగ్లేయుల ప్రాంతాలకు కూలీలుగా వెళ్లిపోయారు.   ఒకప్పుడు ప్రపంచాన్ని మురిపించిన అద్భుత వస్త్రాలను నేసిన చేతులు, ఇప్పుడు రేవుల్లో మూటలు మోస్తున్నాయి.

ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని అర్థం చేసుకొనే వయసుకువచ్చిన కొడుకు "నాన్నా... ఇక మనం కూడా ఎక్కడికైనా వెళ్లిపోదాం. ఈ మగ్గం మీద బతుకు లేదు," అన్నాడు ఒక ఉదయాన్నే.

వెంకటప్పయ్య ఏమీ మాట్లాడలేదు. ఆ రాత్రి ఒంటరిగా చీకటిలో మగ్గం గుంటలో కూర్చున్నాడు. తన పూర్వీకులందరూ కూర్చున్న గుంట. చెక్క చల్లబడిపోయి ఉంది. ఒకప్పుడు దారాలతో నిండిన కండెలు ఖాళీగా చూస్తున్నాయి. ఒకసారి అచ్చు కర్రను బలంగా లాగాడు. 'టక్'... . ఒకప్పుడు యానాం వీధులన్నీ కలిసి పాడిన ఆ సమూహ గానం, ఇప్పుడు ఒకే ఇంట్లో ఒంటరి ఆర్తనాదంగా మిగిలిపోయింది.

***

ఉదయం ఇంటి ముందు ఒక చిన్న మూటతో నిలబడ్డాడు వెంకటప్పయ్య కొడుకు.

"మగ్గాన్ని కూడా తీసుకెళ్దామా నాన్నా?" అడిగాడు.

"వద్దు... అది ఇక్కడి మట్టికే సొంతం," అని తల ఊపాడు

మగ్గానికి ఉన్న బట్టను చుట్టే తానుకర్రపై కొద్దిగా మిగిలి ఉన్న గిన్నీ వస్త్రపు ముక్కను నెమ్మదిగా చింపి జేబులో వేసుకొన్నాడు వెంకటప్పయ్య.

అందులో తన తండ్రి గర్వం ఉంది, యానాం చేనేత చరిత్ర ఉంది, లాంకషైర్ మిల్లులు మింగేసిన నెత్తురు ఉంది.

భుజాన మూట వేసుకుని అడుగు ముందుకు వేశాడు. తండ్రి కొడుకులిద్దరూ వెనక్కి తిరిగి చూడలేదు.

ఆ రాత్రి గోదావరి గాలి మాత్రం ఖాళీగా ఉన్న మగ్గం మీదుగా దిగులుగా  వీచింది.

 

బొల్లోజు బాబా

(ఈ కథ అక్టోబరు నెల ఈమాట వెబ్ పత్రికలో ప్రచురింపబడింది. ఎడిటర్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను)

చరిత్ర: ఫ్రెంచియానాంలో చేనేత పరిశ్రమ గొప్ప వెలుగు వెలిగింది.  1786-1787 మధ్య కాలంలో భారతదేశం నుండి సుమారు ఎనిమిది నౌకల్లో యూరోపియన్ మార్కెట్ కు ఎగుమతి చేయబడిన సుమారు 30 లక్షల రూపాయిల విలువైన చేనేత దుస్తులలో 12% యానాం ఉత్పత్తులే. ( The textile sector of Coramandal and the French Trade, 1750-1800- Arvind Sinha, Delhi University).

1841 లో సుమారు పదహారు లక్షల ఫ్రాంకుల విలువైన చేనేత ఉత్పత్తుల ఎగుమతి చేసిన యానాం, 1865 నాటికి  పూర్తిగా కుప్పకూలింది. ఎగుమతులే లేవు. చవకైన మాదెపొలం బట్టల వల్ల స్థానిక చేనేత కారులు వలసలు పోవటం. ఇవి చారిత్రిక రికార్డులు.  

కథాకాలం 1840-1865 మధ్య.  పాత్రలు, సంభాషణలు, సంఘటనలు, అనుభవాలు రచయిత కల్పన

 


Friday, October 2, 2026

నీ డబ్బు నువ్వే ఉంచుకో … (ఫ్రెంచి యానాం కథలు)

(ఈ కథ అక్టోబరు 2026 నెల విశాలాక్షి పత్రికలో ప్రచురింపబడింది.  ఎడిటర్ గారికి కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను -  బొల్లోజు బాబా)


స్వేచ్ఛ, సమానత్వం, పాలనా క్రమశిక్షణను తమతో తీసుకొచ్చిన ఫ్రెంచివారి ప్రపంచం ఒకవైపు; శతాబ్దాల నమ్మకాలు, ఆచారాలు, ధార్మిక విశ్వాసాలతో జీవిస్తున్న స్థానిక సమాజం మరోవైపు—ఆ రెండు ప్రపంచాల మేళవింపులో నిత్యం సంఘర్షించుకొంటూ  రూపుదిద్దుకున్న విచిత్రమైన సంధిస్థలం యానాం.

కాకినాడకు చెందిన మన్యం కనకయ్య 1790లలో పెద్ద ఎత్తున వ్యాపారం చేసి సంపన్నుడయ్యాడు. తరువాత యానాంలోకి మకాం మార్చి, అక్కడా వ్యాపారాన్ని విస్తరించి మరింత ఐశ్వర్యం సంపాదించాడు. అతని కుమారుడు మన్యం వెంకటరత్నం కూడా తండ్రి బాటలోనే నడిచి యానాంలో అత్యంత ధనిక వ్యాపారిగా ఎదిగాడు. ఫ్రెంచివారితో వ్యాపారం చేయడమే కాక, వారి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. అతని వ్యాపారాలు యానాంతో పాటు చుట్టుపక్కల బ్రిటిష్ ప్రాంతాలకూ విస్తరించాయి. ఫ్రెంచి దొరలతో ఉన్న ఆర్థిక సంబంధాలు అతనికి వ్యాపార లాభాలతో పాటు ప్రత్యేకమైన పలుకుబడినీ తెచ్చిపెట్టాయి.  ఫ్రెంచి ప్రభుత్వం అతనికి జమీందారు హోదా కూడా కల్పించింది.  ఈ హోదా కలిగినవారికి,  వెండి రాజదండాన్ని కలిగి ఉండటం, రెండు కాగడాలతో   పల్లకిలో తిరగడం లాంటి గౌరవ చిహ్నాలు ఉంటాయి.

యానాం నడిబొడ్డున కోటను తలపించే విశాలమైన మేడలో వెంకటరత్నం నివసించేవాడు. ఎత్తైన గోడలు, బరువైన కలప తలుపులు, ఇరువైపులా చిన్న ఫిరంగులు, వాకిట్లో ఇత్తడి దీపస్తంభాలు—ఆ ఇంటి దర్పాన్ని చాటేవి. మసూచితో భార్య చనిపోయిన తర్వాత, పనివాళ్లు ఎంతమంది ఉన్నా ఆ విశాలమైన మేడలో వెంకటరత్నం ఒంటరిగానే జీవించేవాడు.

లోపలికి అడుగుపెడితే అతని సంపద మరింత స్పష్టంగా కనిపించేది. యూరోపియన్ గడియారం, బర్మా టేకు మెట్లు, ఖరీదైన సామాన్లు, భారీ గాజు షాండ్లియర్లు, రంగురంగుల తివాచీలు, విదేశీ గాజు దీపాలు—ఆ మేడంతా అతని వైభవాన్ని చాటేవి.

ఇంటి వెనుక విశాలమైన పెరడు. ఒక మూల రాతి గట్టుతో బావి, మరో మూల తులసికోట. వెనుక కొబ్బరి, మామిడి, పనస చెట్లు; వాటి కింద పనివాళ్ల చిన్న గదులు వరుసగా ఉండేవి. పెరడు చివర గుర్రాల శాల, పక్కనే పల్లకీలు నిలిపే కొట్టు. ముందుభాగం జమీందారు వైభవాన్ని చూపిస్తే, వెనుకభాగం ఆ వైభవాన్ని మోసే మనుషుల ప్రపంచాన్ని దాచేది.

ఆ ఇంట్లోనే పనిచేసేవాడు తోట గవన్ను.

గవన్ను ఉదయం చీకట్లు తొలగకముందే లేచేవాడు. బావి నుంచి నీళ్లు తోడి పెద్ద రాతి తొట్టెలో పోయడం, గుర్రాల కొట్టం శుభ్రం చేయడం, చెట్లకు నీళ్లు పెట్టడం ఇతని రోజువారీ పని. గవన్ను భార్య పేరు గురవమ్మ. 

వీరి పదేళ్ల కూతురి పేరు మంగ.  అప్పుడే వికసిస్తున్న పారిజాతం.

ఆమెకు ప్రపంచం అంటే తండ్రి పని చేసే ఆ పెరడు, తల్లి వంటింటి పొగ, గోదావరి గట్టు, సాయంత్రం ఆడుకునే మట్టి బొమ్మలు, తలలో పెట్టుకునే మల్లెపూలు, పండుగరోజు దొరికే పటిక బెల్లం ముక్క.

ఉదయం తల్లి పక్కచాప మడిచి పెట్టుకునేలోపే మంగ నిద్రలేచి ఉండేది. కళ్లను రుద్దుకుంటూ బయటకు వచ్చి బావి దగ్గర కూర్చునేది. తల్లి నీళ్లు తోడుతుంటే తాడును పట్టుకుని సహాయం చేస్తాననేది.

"నీ చేతులతో బిందె ఎత్తగలవా?" అని తల్లి నవ్వేది.

"పెద్దదైనాక ఎత్తుతా."

"పెద్దదైనాక ఏం చేస్తావు?" మంగ కాసేపు ఆలోచించి,

"నాన్నలా పని చేయను." అనేది.

"అయితే?"

"నీలా ఇంట్లో ఉంటా."

తల్లి నవ్వేది.

"అది కూడా పని కాదా?"

మంగకు ఆ ప్రశ్న అర్థం కాదు.

ఆమె నవ్వేది.

ఆ నవ్వు తల్లికి ప్రపంచంలోనే పెద్ద సంపద.

***

మన్యం వెంకటరత్నం ఇంటికి ఫ్రెంచి అధికారులు వచ్చినప్పుడు గవన్ను దూరంగా నిలబడి గమనించేవాడు. తెల్లటి దుస్తులు, మెరిసే తోలుబూట్లు, బంగారు జేబుగడియారాలు, వెండిపాత్రల్లో పానీయాలు—వారి ప్రతి వస్తువులోనూ అతనికి ఒక పరాయి ప్రపంచం కనిపించేది. వెంకటరత్నం మాత్రం వారి ముందు ఒంగి, ఎంతో వినయంగా మాట్లాడేవాడు. అధికారులు కూడా అతనితో అదే మర్యాదను చూపేవారు. వారి మాటల్లో, చూపుల్లో ఆ పరస్పర మర్యాద వెనుక ఒకరి అవసరంలో మరొకరి ప్రయోజనం దాగి ఉన్నట్టు గవన్నుకు స్పష్టంగా కనిపించేది.

1856 ప్రాంతంలో వెంకటరత్నానికి జబ్బు చేసింది. మొదట జ్వరం, తర్వాత ఒళ్లంతా నొప్పులు. మందులు మారాయి, వైద్యులు మారారు. జబ్బు తగ్గకపోయే కొద్దీ పూజలు, మొక్కులు, ఉపవాసాలు పెరిగాయి. అయినా ఫలితం లేదు. కళ్లు లోపలకు పోయాయి, చర్మం పాలిపోయింది. పగలూ రాత్రీ తేడా లేకుండా దగ్గు వేధించేది. ఎంతమంది ఫ్రెంచి వైద్యులు చూసినా జబ్బు  తగ్గలేదు.

“తనకు డబ్బుంది. భూములున్నాయి. మేడ ఉంది. సేవకులు ఉన్నారు ఫ్రెంచి దొరలతో పరిచయం ఉంది.” కానీ మరణం ముందు ఇవేవీ తనకు రక్షణ ఇవ్వవని మొదటిసారి అతనికి అనిపించింది. "ఇది సాధారణ జబ్బు కాదు" అని ఎవరో ఒకరు చెప్పిన మాట అతని మనసులో విత్తనంలా పడి పెరగసాగింది.

అప్పుడు అతని ఇంట్లోకి వచ్చారు ముగ్గురు మంత్రగాళ్లు—షేక్ లాలా, ఆదినారాయణుడు, బావాజి.

వాళ్ల దుస్తులు, మాట తీరు, కదలికలు కూడా సాధారణంగా లేవు. నుదుటిపై పెద్దపెద్ద కుంకుమ బొట్లు, నల్ల దారాలు, నిమ్మకాయలు,  ఎవో తెలియని మూలికలు.  వాళ్ల దగ్గరున్న ప్రతి వస్తువూ ఒక రహస్యాన్ని మోస్తున్నట్టుండేది. ఎవరితోనూ నేరుగా కళ్లలోకి చూడరు.

వాళ్లు లోపలికి రాగానే ఇల్లంతా కలియదిరిగారు. ఏవేవో దిక్కులు చూస్తూ, చేతులతో గాలిలో గీతలు గీస్తూ వింతగా ప్రవర్తించారు. మొదటి రోజే వాళ్లు వెంకటరత్నం నాడిని పట్టి ఒకరి ముఖాన్ని మరొకరు చూసుకొని కొద్దిసేపు మౌనంగా ఒక మాట చెప్పారు.

"ఇది జబ్బు కాదు."

వెంకటరత్నం కళ్లు పెద్దవయ్యాయి.

"మరి?"

"చేతబడి."

ఆ మాట వినగానే వెంకటరత్నం కళ్లలో భయం మెరిసింది.

"ఎవరు చేశారు?"

మంత్రగాళ్లు వెంటనే పేరు చెప్పలేదు.

అది వారి విద్యలో మొదటి నియమంలా కనిపించింది.

ముందు భయపెట్టాలి. తర్వాత పరిష్కారం చెప్పాలి.

"అది తెలుసుకోవడం కష్టం. కానీ పరిహారం చేయకపోతే ప్రమాదం తప్పదు" అన్నారు.

జమీందారుకు నమ్మకం కుదరలేదు. ఆయన ముఖంలో అనుమానం చూసిన ఆదినారాయణుడు, పళ్లు పటపట కొరుకుతూ తన సంచిలోంచి ఒక నిమ్మకాయ తీశాడు. దానికి గుండుసూదులు గుచ్చి, ఏవో మంత్రాలు చదువుతూ కత్తితో రెండు ముక్కలుగా కోశాడు. కోయగానే ఆ నిమ్మకాయలోంచి నెత్తురు లాంటి ఎర్రటి నీరు కారింది. ఆ తర్వాత తన చేతిలో ఉన్న నల్లటి మట్టిని గాలిలోకి చల్లాడు. "మేం చదివే మంత్రం పూర్తికాగానే మీ ఇంటిపై రాళ్లు వర్షిస్తాయి చూసుకోండి" అని వణికిపోయే స్వరంతో అరిచాడు షేక్ లాలా.

"ఓం భీం... కాళీ... రక్త కాళీ..." అంటూ శరీరాన్ని వింతగా ఊపుతూ మంత్రాలు జపించారు ముగ్గురూ. వాళ్ల అరుపులు ముగిసేసరికి, నిజంగానే ఆ పెద్ద మేడ పెంకుల మీద "టపటప... దభదభ" మంటూ రాళ్ల వర్షం కురిసింది! ఎక్కడినుంచి వస్తున్నాయో ఎవరూ చూడలేదు, పిడికెడంత రాళ్లు మండువా లోగిలిలో పడుతున్నాయి.

రాళ్ల వర్షం చూసి గజగజ వణికిపోతూ, మంచం మీద నుంచి కిందకు దిగి, ఆ మంత్రగాళ్ల చేతులు పట్టుకొని. "నన్ను బతికించండి స్వామీ... నా ప్రాణాలు నిలపండి... మీకు ఎంత డబ్బయినా ఇస్తాను" అని వెక్కి వెక్కి ఏడ్చాడు.  ఆ క్షణం నుంచి వెంకటరత్నం వారి చేతుల్లోకి జారిపోయాడు.

మరుసటి రోజు నుంచి ఆ మేడ స్వరూపమే మారిపోయింది. తలుపులన్నీ మూసేశారు. పగలు కూడా ఇంట్లో చిమ్మచీకటి. ఎక్కడ చూసినా సాంబ్రాణి పొగ, గుప్పుమనే సారాయి వాసన, నిమ్మకాయల చెత్త, తెగనరికిన కోళ్ల నెత్తురు మరకలు. కొన్ని సార్లు మేకల అరుపులు,  ఎనిమిది రోజుల పాటు ఇంట్లో నిరంతరంగా క్షుద్ర పూజలు జరిగాయి. ఆ మంత్రగాళ్ల అరుపులు, వాళ్లు కొట్టే చేసే శబ్దాలు బయటకు వినిపించకుండా తలుపులు కిటికీలు అన్నీ బిగించి మూసేసారు. పనివాళ్లు దూరంగా ఉండేవారు.

ఎనిమిదో రోజు అమావాస్య రాత్రి మంత్రగాళ్లు తోటలో వెంకటరత్నంతో  ఏదో పూజ చేయించారు. పూజముగిసాక బావాజి రెండు చేతులు నేలకేసి బాదుకుంటూ, జుట్టు పీక్కొంటూ శ్వాస పీల్చటం కష్టమై రొప్పుతున్నాడు.  అప్పుడు షేక్ లాలా వాడి తల మీద చేయి పెట్టి, "ఎవరు నువ్వు? ఈ జమీందారు గారిని ఏం చేయాలని వచ్చావు?" అని గద్దించాడు.

బావాజి వికృతంగా నవ్వుతూ, బొంగురుబోయిన గొంతుతో అరిచాడు.... "నేను చావును! ఓయ్ జమీందారు! నువ్వొక నెల రోజుల్లో చనిపోతావు.  ఇప్పటికే ఆలస్యమయ్యింది. తొందరగా భూతశాంతి చేయించు. నాకు రక్తం కావాలి... స్వచ్ఛమైన రక్తం కావాలి..."

"ఏం రక్తం కావాలి?" అని అడిగాడు ఆదినారాయణుడు.

"పచ్చి నెత్తురు! ఓ మానవ కన్యను బలి ఇవ్వు! అప్పుడే నిన్ను వదిలేస్తా!" అని అరిచి స్పృహ తప్పి పడిపోయాడు.

ఆ మాటలు వినగానే జమీందారు ముఖం  పాలిపోయింది.  

"ఇది సాధారణ దెయ్యం కాదు.  మానవ కన్యతో పరిహారం చేయాలి." అన్నాడు షేక్ లాలా.  ఆ మాటకు గదిలో  చీకటి ఒక్కసారిగా ఎక్కువైనట్టనిపించింది.

మంత్రగాళ్లకు ఆ కన్య ఎక్కడ దొరుకుతుందో వెతకాల్సిన అవసరం లేదు. అదే మేడలో పనిచేస్తున్న తోట గవన్ను కూతురు మంగ వారి కళ్లకు అప్పటికే పడింది. పదేళ్ల చిన్నారి. సన్నటి శరీరం, రెండు జడలు, చేతులకు చవక గాజులు, తండ్రి పని చేసే మేడలోనే పరుగులు తీస్తూ పెరిగిన పిల్ల. భయపడటం ఇంకా నేర్చుకోని వయసు.

ఆమెకు ఆ ఇంటి రాజకీయాలు తెలియవు. తన తండ్రి ఎవరి కోసం పని చేస్తున్నాడో, జమీందారికి తన మీద ఎంత అధికారం ఉందో, మంత్రగాళ్లకు తన ప్రాణం ఎందుకు అవసరమో ఆమెకు తెలియదు.

ఆమెకు తెలిసింది ఒక్కటే—

మరుసటి రోజు తల్లి తనకు కొత్త పరికిణి కడుతుందట.

***

మే 15, 1856 మధ్యాహ్నం సూర్యుడు మండుతున్నాడు.. కొబ్బరి ఆకుల మధ్య నుంచి పడుతున్న కాంతి చిన్న చిన్న ముక్కలుగా నేలమీద చెల్లాచెదురౌతుంది.

మంగ అక్కడే వేపచెట్టు కింద కూర్చుని, మట్టితో చిన్న చిన్న బొమ్మలు చేస్తూ, తనలో తాను ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఆడుకొంటోంది.

సరిగ్గా అప్పుడే ఆదినారాయణుడు, బావాజి పెరట్లోకి వచ్చారు. వాళ్ల చేతిలో ఒక ఇత్తడి గ్లాసు ఉంది. అందులో ఏదో ఎర్రటి పానకం లాంటిది ఉంది. వాళ్లు మెల్లగా మంగ దగ్గరకు వచ్చి  “మంగా ఇదిగో, ఈ  ప్రసాదం తీసుకో... అమ్మవారు కలలోకొచ్చి నీకు మంచి బొమ్మలు ఇస్తుంది" అని చెబుతూ ఆ గ్లాసును ఆమె చేతికిచ్చారు. ఆ గ్లాసును నోటికి రాసుకుని గటగటా తాగేసింది మంగ.

తాగిన పది నిమిషాలకే మంగలో మార్పు మొదలైంది. కళ్లు ఎర్రబడ్డాయి. నడక తడబడింది. చేతిలో ఉన్న మట్టి బొమ్మ కింద పడిపోయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ, అడుగులు వేయలేక, తూలుకుంటూ వచ్చి తల్లి ఒళ్ళో పడిపోయింది.

"అమ్మా... కడుపు కాలిపోతోందే... అమ్మా గొంతు మండిపోతోందే..." అంటూ విలవిల్లాడిపోయింది. ఆ చిన్ని పెదవులు నల్లగా మారిపోయాయి.

గురవమ్మకు  గుండె ఆగినంత పనైంది. చేతిలో ఉన్న గిన్నెలు కింద పడేసింది.   బిడ్డను గుండెలకు హత్తుకుని, "ఏమైందే తల్లీ? ఏమైందిరా ?" అంటూ పెద్దపెద్దగా ఏడుస్తూ అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు విని మొగుడు గవన్ను పరిగెత్తుకుంటూ వచ్చాడు. బిడ్డ పరిస్థితి చూసి వాడు నెత్తి బాదుకున్నాడు.

వరుసగా రెండు రోజులు మంగ నరకయాతన అనుభవించింది. కడుపులో పేగులు కాలిపోతున్నట్టుగా మెలికలు తిరుగుతూ, శరీరం అదుపుతప్పి ఎగిరెగిరి పడేది.  జమీందారుగారు అనారోగ్యంతో ఉండి బాధపడుతుంటే మీ ఏడుపులు పెడబొబ్బలు ఏంటి అంటూ వారిని ఒక చీకటి కొట్లో బంధించి బయటకు వెళ్లనివ్వలేదు జమీందారు మనుషులు. మూడోరోజు రాత్రిపూట గురవమ్మ చేతుల్లో అమ్మా అమ్మా అంటూ మూలుగుతూ మంగ ప్రాణాలు విడిచింది.

ఆమె ఏడుస్తూ నేలపై కూలబడింది.

"నా మంగను నాకు తెచ్చివ్వండి!" ఎవరిని అడుగుతోందో ఆమెకే తెలియదు.

మంత్రగాళ్లనా? జమీందారునా? దేవుడినా? ఫ్రెంచి దొరలనా?

గవన్ను కళ్లలో కన్నీళ్లు లేవు. మంగ శవాన్ని పట్టుకుని కూర్చున్నాడు. జమీందారు మనుషులు వచ్చి శవాన్ని లాక్కున్నారు. గురవమ్మ అడ్డం పడింది. ఆమెను పక్కకు తోసేశారు. తెల్లవారక ముందే  ఊరి చివర ఎవరికీ తెలియకుండా దహనం చేశారు. ఒక పసిప్రాణం కాలి బూడిదైపోయింది.

***

మంగ మరణించిన రోజు నుంచి తోట గవన్ను ఇంట్లో వెలుగు తగ్గిపోయింది. మంగ తల్లి గురవమ్మ పగలంతా కూతురికి ఎప్పటికి తొడగలేని కొత్త పరికిణీని ఒడిలో పెట్టుకుని కూర్చునేది.  దాన్ని వేళ్లతో నిమురుతూ కన్నీళ్లు కార్చుతూ బాధపడేది.  గవన్ను ఎవరితో మాట్లాడేవాడు కాదు.

ఒకరోజు మేడ వెనుకనున్న చిన్న గదిలో ఆమె పొయ్యి మీద కుండ పెట్టి వంట చేస్తుండగా, పక్కనుంచి మంత్రగాళ్లలో ఇద్దరు నిలబడి మెల్లగా మాట్లాడుకోవటం వినిపించింది . స్పష్టంగా వినిపించలేదు.  "మందు", "పాప", "బలి" అనే మాటలు  మాత్రం ఆమె చెవికి తగిలాయి. వెంటనే ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. గోడకు చెవి ఆనించి మరింత శ్రద్ధగా విన్నది.

" మందు పనిచేసింది..." అని ఒక స్వరం వినిపించింది. "ఇక బలి పూర్తయినట్టే." మరొకడు నెమ్మదిగా అన్నాడు, "జమీందారు గారికి చెప్పాలి... ఆయనకు ప్రమాదం తొలగిందని." గరవమ్మ  శరీరం ఒక్కసారిగా చల్లబడిపోయింది.  ఆ మాటలు విన్న వెంటనే ఆమెకు ఇంకేమీ వినిపించలేదు.  మధ్యాహ్నం తన కళ్లముందు మత్తుగా తూలుతూ ఇంటికి వచ్చిన మంగ, ఆ తర్వాత రెండు రోజులు నరకయాతన పడటం, వైద్యుడిని పిలవనివ్వకపోవడం,  శవాన్ని వెంట వెంటనే దహనం చేయడం—అన్నీ కలిపిచూస్తే ఆమెకు నిజం అర్థమౌతోంది.

ఆమె గోడకు ఆనుకుంది. చేతులు వణికుతున్నాయి. పొయ్యి మీద కుండ పొంగిపోతోంది. పొగ కళ్లలోకి వస్తోంది.  ఆమెకు పొగ కనిపించలేదు. మంగ ముఖమే కనిపించింది. ఆ చిన్న ముఖం. చివరిసారి తనవైపు తిరిగి చూసిన కళ్లూ. "అమ్మా..." అని పలికిన ఆ ఒక్క మాట.

ఆ రాత్రి గవన్ను ఇంటికి వచ్చినప్పుడు గురవమ్మ అతని కోసం ఎదురుచూస్తోంది. అతను లోపలికి రాగానే ఆమె తలుపు మూసి గడియ పెట్టింది. చాలాసేపు మాట రాలేదు. చివరకు వణుకుతున్న గొంతుతో, "మన మంగను వాళ్లే చంపారు" అంది. గవన్ను ఆమె ముఖం వైపు చూశాడు. "ఏమంటున్నావు?" అని అడిగాడు. ఆమె తన చెవులతో విన్న మాటలన్నీ చెప్పింది.

గవన్ను కొద్దిసేపు మాటలేకుండా కూర్చున్నాడు. మంగ చనిపోయినప్పటి నుంచి తనలో తిరుగుతున్న అనుమానాలకు ఒక్కసారిగా రూపం వచ్చింది. అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి "జమీందారు బతకాలంటే మన పిల్ల చావాలా గవన్నూ?"

గవన్ను ఒక్కసారిగా లేచి గోడను గట్టిగా కొట్టాడు. మళ్లీ కొట్టాడు. అతని వేళ్లకు రక్తం కారింది. అతనికి నొప్పి తెలియలేదు. తన కూతురి చావుకు కారణమైన మనుషులు అదే మేడలో ఉన్నారు.

బయట కాపలాదారుల అడుగుల శబ్దం వినిపించగానే గవన్ను ఆగిపోయాడు. అతని కోపం కళ్లలోనే మిగిలిపోయింది. తలుపు వైపు చూసి మళ్లీ కూర్చున్నాడు. పేదవాడి కోపానికి కూడా ఒక గోడ ఉంటుంది.

మంగ చనిపోలేదు; మంగను చంపారు. తన కూతురి ప్రాణం మరొక మనిషి ప్రాణానికి బలిగా పెట్టారనే విషయం వాళ్ళిద్దరికీ అర్థమైంది.  ఇక ఎంతమాత్రం ఆ జమీందారు కొలువులో ఉండబుద్ధి కాక బయటకు  వచ్చేసారు.

జరిగిన విషయాన్ని గవన్ను కొందరు కులపెద్దల దృష్టికి తీసుకువెళ్ళాడు. కొద్దిసేపు అందరూ మౌనంగా ఉండిపోయారు. చివరకు కులపెద్ద చింతల కోటయ్య గట్టిగా అన్నాడు, “మనం కోర్టుకు వెళ్లాలి. ఇది ఒక్క పాపకు జరిగిన అన్యాయం కాదు—మన కులానికి జరిగిన అవమానం. ఈరోజు మనం మౌనంగా ఉంటే, రేపు ఇదే మనలో మరొకరికి జరుగుతుంది. ఇది మన కులగౌరవానికి సంబంధించిన విషయం. కోర్టుకు వెల్దాం.  అక్కడే తేల్చుకుందాం.”

గవన్ను కళ్లలో నీళ్లు తిరిగాయి. తన బాధకు తనతోపాటు నిలబడే వాళ్లు ఉన్నారన్న భావన అతనికి కొంత ధైర్యాన్ని ఇచ్చింది.

***

కేసు యానాం కోర్టుకు వెళ్లింది. గవన్ను ఇచ్చిన ఫిర్యాదులో మంగకు ఏదో మందు తాగించారని దానివల్ల ఆమె చనిపోయిందని ఆరోపించారు. మంత్రగాళ్లు విచారణకు హాజరయ్యారు. జమీందారు పేరు కూడా కేసులో ఉంది. మంత్రగాళ్ల మాటలకు గవన్ను భార్య సాక్ష్యం. మంగ మరణానికి అసలు కారణం ఏమిటి? శవపరీక్ష చేయడానికి శరీరం లేదు. అప్పటికే దహనమైపోవటం వల్ల ఆమె శరీరంలో విషం ఉందో లేదో పరీక్షించే అవకాశం లేదు.

యానాం కోర్టు జడ్జి De Saint Hilaire  కేసును విచారించాడు. సాక్ష్యాలు విన్నాడు.

 “నీ కూతురికి మందు ఎవరు ఇచ్చారు? నువ్వు చూశావా?”

“చూడలేదు.”

“అయితే నువ్వు చెప్పేది ఎలా నమ్మాలి?”

గురవమ్మ కొద్దిసేపు జడ్జిని చూసింది. “నా కూతురు చనిపోతుంటే నేను చూసాను.”

జడ్జి మౌనంగా ఉన్నాడు.

“అంతే నాకు సాక్ష్యం.”

పత్రాలు చూశాడు. చివరికి సాక్ష్యం సరిపోదని భావించి కేసును కొట్టివేశాడు.  మంత్రగాళ్లు నిర్దోషులుగా విడుదలయ్యారు. జమీందారు ప్రస్తావన లేనే లేదు. ఆ తీర్పుకు గవన్ను భార్య ఒక్కసారిగా నేలమీద కూలబడింది. ఆమె నోటి నుంచి మాట రాలేదు. కొద్దిసేపటికి తన తలను రెండు చేతులతో పట్టుకుని "అయితే నా మంగను ఎవరు చంపారు?" అని అరచింది. ఎవరూ సమాధానం చెప్పలేదు. గవన్ను తల వంచుకుని నిలబడ్డాడు. అందరికీ అర్థమైంది జమీందారు పలుకుబడి పనిచేసిందని.  అతని వెనుక నిలిచిన కుల పెద్దలు ఒకరినొకరు చూసుకొన్నారు. కులపెద్ద చింతల కోటయ్య దవడ బిగించాడు. “ఇది తీర్పుకాదు, ఇది ఇక్కడితో ముగిసిపోకూడదు" అన్నాడు. ఆ మాట ఆ రాత్రే యానాంలో ఇంటింటికీ చేరింది.

ఆ రాత్రి యానాం నిద్రపోలేదు.

సూర్యుడు అస్తమించిన తర్వాత వీధుల్లో గుంపులు కదలడం మొదలైంది. కుల పెద్దల పిలుపుతో గవన్ను సామాజిక వర్గానికి చెందినవారు గుంపులుగా చేరారు. మొదట మాటలు వినిపించాయి. తర్వాత అరుపులు. "న్యాయం కావాలి!" "పాపను చంపినవారిని శిక్షించాలి!" అంటూ నినాదాలు మొదలయ్యాయి. కొందరు చేతుల్లో కర్రలు పట్టుకున్నారు.

జనం యానాం కోర్టు జడ్జి ఇంటి వైపు కదిలారు. గుమ్మం ముందు ఉన్న పూల కుండలను ఒకరి తర్వాత ఒకరు నేలకేసి కొట్టారు. ఇంటి కిటికీ వెనుక నుంచి ఒక తెల్లని ముఖం బయటికి తొంగిచూసింది. వెంటనే గుంపులోంచి ఎవరో రాయి విసిరారు. రాయి కిటికీ అద్దాన్ని పగలగొట్టి లోపల పడింది. అద్దం ముక్కలు నేలమీద చెల్లాచెదురయ్యాయి. ఇంట్లో మహిళల అరుపులు వినిపించాయి. జడ్జి కుటుంబం వెనుక గదుల్లోకి వెళ్లి తలుపులు మూసుకుంది.

అక్కడితో గుంపు ఆగలేదు. మన్యం వెంకటరత్నం ఆస్తులపై దాడి జరిగింది. మేడకు చెందిన ఒక గిడ్డంగి తలుపులు పగలగొట్టబడ్డాయి. వాకిట్లో వెలుగుతున్న ఇత్తడి దీపస్తంభాన్ని కూలదోసారు.  బయట కట్టిన ఎద్దుల బండ్లకు తాళ్లు తెంచేశారు. కొంత సామాను వీధిలోకి విసిరేశారు.   ఫ్రెంచి పోలీసులు దూరంగా నిలబడి పరిస్థితిని గమనించారు. తుపాకులు చేతుల్లో ఉన్నా, అంత పెద్ద గుంపుపై కాల్పులు జరపడానికి వెనుకంజ వేశారు. ఒక చిన్న పాప మరణం మీద మొదలైన ఆగ్రహం ఇప్పుడు జమీందారు ఇంటిపై దాటి, అతనికి అండగా నిలిచిన అధికార వ్యవస్థ మీదకు మళ్లింది.

మరుసటి ఉదయం పెద్దొర కార్యాలయాల్లో నివేదికలు తయారయ్యాయి. పాండిచేరీ పంపించారు. జడ్జి ఇంటిపై దాడి, కిటికీలు పగలగొట్టడం, జమీందారు ఆస్తుల ధ్వంసం, రాత్రి గుంపుల రహస్య కదలికలు—అన్నీ అధికారిక నివేదికలలో నమోదయ్యాయి. యానాం నుంచి పాండిచేరీకి వెళ్లిన వాటిలో "శాంతిభద్రతలకు ముప్పు" అనే మాటలు ఉండవచ్చు; ఆ పత్రాల వెనుక ఉన్న రాయని వాక్యం మాత్రం ఒక్కటే—"ఒక పేద పిల్లకు న్యాయం జరగలేదు." అని.

అయితే యానాంలో ప్రజల ఆగ్రహం కూడా ఆగలేదు. గవన్ను, అతని భార్య, కుల పెద్దలు   అధికారులకు ఫిర్యాదులు పంపారు. యానాం కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాండిచేరీకి ఫిర్యాదులు వెళ్లాయి. "స్థానిక పలుకుబడితో కేసు ప్రభావితమైంది" అనే ఆరోపణలు వినిపించాయి. అక్కడి ఉన్నతాధికారుల దృష్టికి కేసు వెళ్లింది. కేసు పత్రాలను మరోసారి పరిశీలించాలని  ఫ్రెంచి గవర్నరు ఆదేశించాడు. అలా పాండిచేరీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రిజెల్ హ్యూబర్ వద్దకు ఈ కేసు చేరింది.

***

కోర్టు తీర్పు తదనంతర పరిణామాల పట్ల మన్యం వెంకటరత్నం అసహనానికి గురయ్యాడు.  కాకినాడ ఇంగ్లీషు వైద్యులు ఆరోగ్యం మెరుగవటం కొరకు కొంతకాలం ఉదకమండలం వెళ్లి విశ్రాంతి తీసుకొమ్మని  చెప్పి ఉండటంతో ఆ రాత్రే మన్యం వెంకటరత్నం ఉదకమండలం ప్రయాణం కట్టాడు.  ఉదయం వెలుతురు పడకముందే మేడ వెనుక భాగంలో బండ్లు సిద్ధమయ్యాయి. పెట్టెలు కట్టారు. బట్టలు సర్దారు. మందుల పెట్టెను ఒక సేవకుడు జాగ్రత్తగా పట్టుకున్నాడు. వెంకటరత్నం బలహీనంగా బయటికి వచ్చి బండిలోకి ఎక్కాడు.

అతను వెళ్లిపోయినా జమీన్ వ్యవహారాలు ఆగలేదు. వాటి బాధ్యత దివాన్ బులుసు శ్యామశాస్త్రిపై పడింది. యానాం జమీన్ లెక్కలు, భూములు, ఆదాయ వ్యవహారాలు, ఫ్రెంచి అధికారులతో సంప్రదింపులు—అన్నీ దివాన్ చూసుకునేవాడు. అప్పుడప్పుడు ఉదకమండలానికి వెళ్లి జమీందారుకు పరిస్థితులు వివరించేవాడు. జమీందారు భౌతికంగా దూరంగా ఉన్నా, ఆయన  పెత్తనం దివాన్ ద్వారా యానాంలో కొనసాగుతూనే ఉంది.

***

రిజెల్ హ్యూబర్ ముందు ఉన్నది ఒక విచిత్రమైన కేసు. ఒకవైపు శవం లేదు. మరోవైపు కుట్ర గురించి తల్లి విన్న మాటలు మాటలు మాత్రమే సాక్ష్యం.  ఒకవైపు స్థానిక కోర్టు నిందితులను విడుదల చేసింది. మరోవైపు ప్రజల తీవ్ర నిరసన ఉంది. ఒకవైపు మన్యం వెంకటరత్నంలాంటి  పలుకుబడి కలిగిన జమీందారు. మరోవైపు శోకం తప్ప మరేమీ మిగలని పేద తల్లి ఆమె వైపు నిలిచిన   ప్రజల ఆగ్రహం.

హ్యూబర్ కేసును తిరిగి పరిశీలించాడు. పత్రాలను చదివాడు. వాంగ్మూలాలను పరిశీలించాడు. సాక్షులను మళ్లీ విచారించాడు. యానాం కోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం జరిగిన పరిణామాలను కూడా పరిశీలించాడు.

“గురవమ్మ వాంగ్మూలాన్ని చదివిన తర్వాత హ్యూబర్ కొద్దిసేపు పత్రాన్ని పక్కన పెట్టాడు. ఆ వాంగ్మూలంలో చట్టపరమైన మాటల కంటే ఒక తల్లి తన కూతురి చివరి ఘడియలను చెప్పిన తీరు అతని దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది.”

కేసులోని సాక్ష్యాలను, నిందితుల వాంగ్మూలాలను, మంగ మరణానికి దారితీసిన పరిస్థితులను మరోసారి బేరీజు వేసిన తరువాత, చివరకు తన నిర్ణయాన్ని వెలువరించాడు. 

మంత్రగాళ్లకు మూడు నెలల జైలు శిక్ష విధించాడు. మొత్తం కేసుకు ప్రధాన బిందువుగా ఉన్న మన్యం వెంకటరత్నం జమీందారు  మంగ తల్లికి వెయ్యి రూపాయల పరిహారం చెల్లించాలని కూడా తీర్పు చెప్పాడు. అప్పటికి మంగ చనిపోయి రెండేళ్లు.

***

హ్యూబర్ తీర్పు వెలువడిన తర్వాత మన్యం వెంకటరత్నం  ఉదకమండలం నుండి యానాంకు తిరిగి వచ్చాడు.

ఒక రోజు ఉదయం శివాలయంలో పూజలు ముగించుకుని ఆయన పల్లకీలో ఇంటికి వస్తున్నాడు. ముందు వెండి శంకోలు మెరుస్తోంది. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి.   పల్లకీ మోసే బోయీలు సమంగా అడుగులు వేస్తున్నారు. ముందుగా సేవకులు, వెనుక కొందరు అనుచరులు నడుస్తున్నారు. పల్లకీ మీద రంగురంగుల వస్త్రాలు, అంచుల్లో వెండి అలంకరణలు. వెంకటరత్నం లోపల కూర్చుని అప్పుడప్పుడూ బయటకు చూస్తున్నాడు

అప్పుడే గుంపు మధ్య నుంచి ఒక స్త్రీ దూసుకొచ్చింది.

ఆమె జుట్టు చెదిరిపోయింది. చీర కొంగు బొడ్లో దోపి ఉంది.   కళ్లలో ఎన్నాళ్ల నుంచో నిద్ర లేదు. ముఖంలో భయం లేదు.

ఆమె మంగ తల్లి  గురవమ్మ.

ఆమె చేతిలో న్యాయస్థానం ఇచ్చిన పరిహారం— వెయ్యి రూపాయలు. ఎన్నాళ్లనుంచో చేతితో పట్టుకొని ఉన్నట్లు నాణాల సంచి నలిగి మట్టిగొట్టుకు పోయి ఉన్నాయి.

పల్లకీ ముందుకు దూకింది. సంచిలోని నాణాలను నోట్లను జమీందారు ముఖం వైపు విసిరి, " ఈ డబ్బు నువ్వే ఉంచుకో!  నువ్వసలు మనిషివేనా.  నా బిడ్డ ప్రాణానికి వెలకడతావా?" అని అరిచింది.  ఈ హఠాత్పరిణామానికి వాయిద్యాలు  ఆగిపోయాయి. . ఆమె రెండు చేతులతో తన గుండెలు బాదుకుంది. తర్వాత నేలలోని మట్టిని గుప్పెడు గుప్పెడుగా తీసుకుని వెంకటరత్నం వైపు రువ్వింది. "నీ డబ్బు నువ్వే ఉంచుకో! నాకు డబ్బు అక్కర్లేదు. నా బిడ్డను నాకు తెచ్చివ్వు! నా మంగను తిరిగి తెచ్చివ్వు! అది నీ వల్లే చనిపోయింది...

మట్టిని తీసుకొని జమీందారు వైపు గాల్లోకి విసురుతూ

"నువ్వు నాశనం అయిపోతావు! నా బిడ్డను చంపిన  పాపం నిన్ను వదలదు. నీ ఇంటిని వదలదు! నీ పిల్లలను కట్టికుడుపుతుంది! నీ వంశం నిలవదు!" అంటూ చేతులు ఆకాశం వైపు ఎత్తి శపించింది. వెంటనే మళ్లీ నేలపై కూర్చుని, "మంగ... నా మంగ..." అంటూ విలపించింది.

పల్లకీ చుట్టూ నిలబడ్డవాళ్లు కదలకుండా చూస్తున్నారు. కొందరి కళ్లలో నీళ్లు. కొందరి ముఖాల్లో భయం. మరికొందరి ముఖాల్లో ఆగ్రహం. వెంకటరత్నం మాత్రం క్షణం పాటు ఆమె వైపు చూసి, వెంటనే ముఖం తిప్పుకున్నాడు.

ఎక్కడినుంచో పరుగుపరుగున వచ్చిన గవన్ను భార్యను రెండుచేతులతో దగ్గరకు తీసుకొని, ఓదారుస్తూ దూరంగా తీసుకొని వెళ్ళిపోయాడు.

ఆ రోజు యానాం వీధిలో న్యాయం, పాపం, సంపద, దుఃఖం అన్నీ ఒకదానికొకటి ఎదురెదురుగా నిలిచాయి.

ఆమె శాపం నిజమైందా?

దానికి చరిత్ర దగ్గర సమాధానం లేదు.

 తరువాతి తరాలు ఒక కథను మాత్రం చెప్పుకుంటూ వచ్చాయి. మన్యం వెంకటరత్నం వంశానికి చాలా తరాలపాటు సంతానం కలగలేదని, దత్తత తీసుకున్నప్పటికీ వారు ఆస్తిని నిలబెట్టుకోలేకపోయారని, క్రమంగా ఆ జమీందారీ కరిగిపోయి ఆ వంశమే అంతరించిపోయిందని యానాం ప్రజలు చెప్పుకునేవారు.

అది నిజంగానే మంగ తల్లి శాపం వల్ల జరిగిందా, లేక తర్వాతి రోజుల్లో ఆ శాపానికి అలా ఒక కథ రూపం వచ్చిందా అన్నది చెప్పలేం.  ఆ రోజు ఆమె జమీందారు మీద రువ్విన మట్టి, ఆమె నోటి నుంచి వచ్చిన శాపం మాత్రం ప్రజల జ్ఞాపకాలలో నిలిచి పోయాయి. ఆ తర్వాత ఆ వంశానికి ఎదురైన కష్టాలు, దాని క్రమంగా వచ్చిన పతనం—అన్నీ మంగ తల్లి ఆ శాపంతోనే ముడిపడ్డాయి. కాలం గడిచేకొద్దీ ఆ శాపం మరింత బలమైన కథగా మారింది. చివరికి ఆ వంశం గురించి చెప్పేటప్పుడు మంగ తల్లి శాపాన్ని చెప్పకుండా ఆ కథనం పూర్తయ్యేది కాదు.

 

బొల్లోజు బాబా


చరిత్ర: ఈ కథకు ప్రధాన ఆధారం 25 మార్చి 1859న పాండిచేరీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రిజెల్ హ్యూబర్ ఇచ్చిన తీర్పు నివేదిక. అందులో 1856లో, యానాం జమీందారు మన్యం వెంకటరత్నం అనారోగ్యం, షేక్ లాలా, ఆదినారాయణుడు, బావాజి అనే ముగ్గురు మంత్రగాళ్లను ఆశ్రయించడం, 15 మే 1856న తోట గవన్ను పదేళ్ల కుమార్తె మంగకు వారు ఎదో పదార్థం తాగించడం, ఆమె తరువాత మరణించడం, గవన్ను యానాం కోర్టులో ఫిర్యాదు చేయడం, వంటి సంఘటనలు నమోదయ్యాయి. స్థానిక జడ్జి De Saint Hilaire కేసును కొట్టివేసి మంత్రగాళ్లను విడుదల చేయగా, చెలరేగిన ఘర్షణలు, ఫిర్యాదులపై హ్యూబర్ పునర్విచారణ చేసి 1859 మార్చి 25న మంత్రగాళ్లకు మూడు నెలల జైలు శిక్ష విధించి మంగ తల్లికి వెయ్యి రూపాయల పరిహారం ఇప్పించటం లాంటి వివరాలు నమోదై ఉన్నాయి.

పాత్రలు, వాటి వ్యక్తిగత జీవితం, సంభాషణలు, భావోద్వేగాలు, కథనం కోసం కల్పించినవి.