Saturday, May 7, 2011

సిద్ధాంతి (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)



నేనన్నానూ

"మునిమాపు వేళ నిండుచందమామ ఆ కాదంబరీ చెట్టు
కొమ్మలలో చిక్కుకున్నది.  ఎవరైనా దానిని అందుకోగలరా?" అని

పెద్దన్నయ్య నవ్వి "నాకు తెలిసి అతి పెద్ద తెలివి తక్కువ పిల్లవు నీవు, చెల్లీ!
చంద్రుడు సుదూరంగా ఉంటాడు, ఎవరైనా ఎలా పట్టుకోగలరూ?" అన్నాడు

నేనన్నానూ
"అన్నయ్యా నువ్వెంత అమాయకుడవూ!  మనం ఆడుకొనేపుడు
కిటికీ నుండి చూస్తూ నవ్వే అమ్మ మనకు సుదూరంగా ఉందా? అని

నీవు నిజంగా తెలివి మాలిన దానవే! చందమామ పట్టేంత పెద్దవల
నీవు సంపాదించగలవా? అన్నాడు

నేనన్నానూ
"నీ చేతులతోనే పట్టుకోగలవు" అని

అన్న మళ్ళీ నవ్వి "నీవు నిజంగా వెర్రిదానవే, చందమామ దగ్గరగా వస్తే
నీకు తెలుస్తుంది అదెంత పెద్దదో" అన్నాడు

నేనన్నానూ
"అన్నయ్యా నీకు బడిలో అర్ధంలేని విషయాలేవో చెపుతున్నారు
అమ్మ మనల్ని ముద్దిడ వంగినపుడు ఆమె మోము చాలా పెద్దదిగా ఉంటుందా?

"నీవు తెలివి తక్కువ పిల్లవే" అన్న ఇంకా అంటూనే ఉన్నాడు.



(మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Astronomer గీతం)



బొల్లోజు బాబా


1 comment: