Tuesday, May 17, 2011

ఓడంగి (రవీంద్రుని "క్రిసెంట్ మూన్" కు తెలుగు అనువాదం)

రేవులో కలాసి మధు పడవ లంగరు వేసిఉంది
పడవంతా గోగునార తో నింపారు అనవసరంగా
చాలా కాలంగా అలానే జరుగుతూంది.

అతను తన పడవను నాకు ఇస్తేనా....
దానికి ఓ వంద తెడ్లూ అయిదో ఆరో ఏడో తెరచాపల్నీ బిగిస్తాను
దానిని ఈ పిచ్చి బజారులవైపు నడిపించను
ఇంద్రజాలలోకపు సప్త సముద్రాలు, పదమూడు నదులవైపు నడిపిస్తాను.

అమ్మా! అలా మూల కూర్చొని నాకొరకు బాధపడకు.
రామచంద్రునిలా పద్నాలుగేళ్ళ అనంతరం రావటానికి నేను
అడవులకు పోవటం లేదు కదా!

నువ్వు చెప్పిన కధలో రాకుమారునిలా మారిపోయి
ఇష్టమైన వాటితో నా పడవను నింపుతాను.
నా మిత్రుడు చంటిని కూడా తోడ్కొని వెళతాను.
మేమిద్దరం కలసి ఇంద్రజాల లోకపు సప్త సముద్రాలను,
పదమూడునదులను వేడుకగా చుట్టివస్తాను.

ఉషాకాంతిలో మా ప్రయాణాన్ని మొదలుపెడతాము
మధ్యాహ్నం నీవు కొలనువద్ద స్నానంచేసే వేళకు
మేము మరో ప్రపంచంలో ఉంటాం.
పగడపుదీవులను దాటుకొంటో, మరుగుజ్జు లోకపు
రేవులమీదుగా ముందుకు సాగుతాం.

మేం తిరిగి వచ్చేసరికి చీకటి పడుతుంటూంది.
మా ప్రయాణపు వింతలు విశేషాల్ని నీకు చెపుతాను.

అతను తన పడవను నాకు ఇస్తేనా....
ఇంద్రజాలలోకపు సప్తసముద్రాలను, పదమూడు నదులనూ
వేడుకగా చుట్టివస్తాము.

(మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Sailor   గీతం)



Sunday, May 15, 2011

ఒక పాత కామెంటు


వెబ్ లో వెతుకుతూంటే చాన్నాళ్ళ క్రితం ఓ బ్లాగులో చేసిన ఓ కామెంటు కనపడింది.  బాగున్నట్టనిపించి ఇక్కడ పంచుకొంటున్నాను. పూర్ణిమ గారికి ధన్యవాదములతో........


Your absence has gone through me
Like thread through a needle.
Everything I do is stitched with its color.

– W.S. Merwin

పై కవితకు అనుసృజనగా నే  వ్రాసిన కొన్ని రూపాలు

1.నీవియోగం నన్ను చీల్చుకొంటో పోయింది.
పూమాలలోంచి దారంలా
నా హృదయం నిండా నీజ్ఞాపకాల పరిమళాలే.

2. నీవు లేని ఆ క్షణం ఒక దారమై
నా మనసనే సూది గుండా దూసుకుపోయి
నా ప్రతి ఆలోచనకూ నీవర్ణాన్నే అద్దుతోంది.

3.దారానికి సూది వేలాడినట్లుగా
నీ వియోగానికి నా హృదయం వేలాడుతోంది.
ఎంత ప్రయాణించినా నీ వృత్తంలోనే నడకలు.


ఆ పాత పోస్టు లింకు ఇక్కడ

http://pisaller.wordpress.com/2008/12/21/separation/

మాయా లోకం (రవీంద్రుని "క్రిసెంట్ మూన్" కు తెలుగు అనువాదం)


నా రాజభవంతి ఎక్కడుందో ఎవరికైనా తెలిసిపోయిందంటే అది గాలిలో మాయమైపోతుంది తెలుసా!  దానికి వెండి గోడలు బంగారపు పై కప్పు ఉంటాయి.

ఏడు మండువాలున్న ఆ నగరులో రాణీగారుంటారు.  ఆమె మెడలో మణి సప్తరాజ్యాల సంపదంత విలువ.

నా రాజభవంతి ఎక్కడుందో నీకు చెప్పనా అమ్మా! ఎవరికీ చెప్పకూడదు మరి. మన మిద్దెపై మూలనున్న తులసి కోటవద్ద.

ఎవరూ దాటలేని సప్తసాగరాల సుదూర తీరంపై రాకుమారి శయనిస్తూంటుంది.  ఆమెను నేను తప్ప ఈ లోకంలో మరెవ్వరూ కనిపెట్టలేరు.

ఆమె చేతికి గాజులు, చెవులకు ముత్యాల దుద్దులు ఉంటాయి.  ఆమె కురులు నేలను తాకుతూంటాయి.

నా మంత్ర దండంతో తాకితే ఆమె నిదురలేస్తుంది.
ఆమె నవ్వితే నోటివెంట ముత్యాలు రాలుతాయి.

గొప్ప రహస్యం చెపుతాను విను అమ్మా!
మన మిద్దె పై మూలనున్న తులసికోటే ఆమె నివాసం.

ఏటి స్నానానికి నీవు వెళ్ళినపుడు నేను మిద్దె పైకి చేరి గోడల నీడలు కలుసుకొనే ఆ మూలన కూర్చుంటాను.  చిట్టిని మాత్రమే నాతో రానిస్తాను.  ఎందుకంటే కథలోని మంగలి ఎక్కడుంటాడో తనకే తెలుసు.

కథలో మంగలి ఎక్కడుంటాడనేది ఒక రహస్యం.  నీ చెవిలో చెపుతాను విను.
అతనుండేది మన మిద్దె పై మూలనున్న తులసికోటవద్ద. 

(మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని Fairy Land   గీతం)

బొల్లోజు బాబా

Monday, May 9, 2011

న్యాయాధిపతి (రవీంద్రుని "క్రిసెంట్ మూన్" కు తెలుగు అనువాదం)


నా చిన్నారి గురించి 
నువ్వెన్ని మాటలు చెప్పినా
నాకు తెలుసు వాని దోషాలు.
ఉత్తమమైనవాడని కాదు 
నేను వాడిని ప్రేమించేది
నా చిన్నారి శిశువు కనుక.

వాని అర్హతలను దోషాలతో తూకం వేసే మీకు
వాడు నాకెంత ప్రియమైన వాడో 
ఎలా తెలుస్తుంది?

వాడిని దండించేటపుడు 
వాడు నాలో భాగమై ఉంటాడు.

వాడికి కంటనీరు తెప్పించేటపుడు
వానితో కలసి నా  హృదయమూ ఏడుస్తుంది.

వాడిని నిందించటానికి కానీ 
దండించటానికి కానీ
నాకే అధికారముంది ఎందుకంటే
ఎవరైతే ప్రేమిస్తారో వారే శిక్షించగలరు.

(మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Judge గీతం)

బొల్లోజు బాబా

Saturday, May 7, 2011

సిద్ధాంతి (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)



నేనన్నానూ

"మునిమాపు వేళ నిండుచందమామ ఆ కాదంబరీ చెట్టు
కొమ్మలలో చిక్కుకున్నది.  ఎవరైనా దానిని అందుకోగలరా?" అని

పెద్దన్నయ్య నవ్వి "నాకు తెలిసి అతి పెద్ద తెలివి తక్కువ పిల్లవు నీవు, చెల్లీ!
చంద్రుడు సుదూరంగా ఉంటాడు, ఎవరైనా ఎలా పట్టుకోగలరూ?" అన్నాడు

నేనన్నానూ
"అన్నయ్యా నువ్వెంత అమాయకుడవూ!  మనం ఆడుకొనేపుడు
కిటికీ నుండి చూస్తూ నవ్వే అమ్మ మనకు సుదూరంగా ఉందా? అని

నీవు నిజంగా తెలివి మాలిన దానవే! చందమామ పట్టేంత పెద్దవల
నీవు సంపాదించగలవా? అన్నాడు

నేనన్నానూ
"నీ చేతులతోనే పట్టుకోగలవు" అని

అన్న మళ్ళీ నవ్వి "నీవు నిజంగా వెర్రిదానవే, చందమామ దగ్గరగా వస్తే
నీకు తెలుస్తుంది అదెంత పెద్దదో" అన్నాడు

నేనన్నానూ
"అన్నయ్యా నీకు బడిలో అర్ధంలేని విషయాలేవో చెపుతున్నారు
అమ్మ మనల్ని ముద్దిడ వంగినపుడు ఆమె మోము చాలా పెద్దదిగా ఉంటుందా?

"నీవు తెలివి తక్కువ పిల్లవే" అన్న ఇంకా అంటూనే ఉన్నాడు.



(మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Astronomer గీతం)



బొల్లోజు బాబా