Tuesday, February 16, 2010

రెండు నిముషాల మౌనం -Two minutes silence by కేదార్ నాథ్ సింగ్

సోదర సోదరీ మణులారా 

ఈ రోజు మరణిస్తున్నది మరణిస్తున్న ఈ దినం కోసం రెండు నిముషాల మౌనం

ఎగిరిపోతూన్న పక్షికోసం నిశ్చల జలాల కోసం మీద పడుతున్న రాత్రికోసం రెండు నిముషాల మౌనం

దాని కోసం కాని దాని కోసం అయిఉండాల్సిన దానికోసం రెండు నిముషాల మౌనం

విసిరేసిన తొక్కకోసం నలిగిపోయిన గరిక కోసం ప్రతీ యత్నం కోసం ప్రతీ పధకం కోసం రెండు నిముషాల మౌనం

ఈ గొప్ప శతాబ్దం కోసం ఈ శతాబ్దపు ప్రతీ గొప్ప ఆలోచన కోసం దాని గొప్ప పదాలకోసం ఇంకా గొప్ప ఉద్దేశాలకోసం రెండు నిముషాల మౌనం

సోదర సోదరీమణులారా ఈ గొప్ప విజయాలకోసం

రెండు నిముషాల మౌనం రెండు నిముషాల మౌనం

మూలం: శ్రీ కేదార్ నాథ్ సింగ్,  Kedarnath Singh -- A Two-Minute Silence

అనువాదం:  బొల్లోజు బాబా

Saturday, February 13, 2010

రండి రండి - శ్రీ కేదార్ నాధ్ సింగ్

1. రండి రండి - శ్రీ కేదార్ నాధ్ సింగ్ 
 రండి మీకు వీలు కుదిరినపుడు రండి 
మీకు వీలు కుదరనప్పటికీ రండి 
చేతులలో శక్తిలా 
నాళాలలో రక్తంలా రండి 
కుంపట్లోని సన్నని మౌన జ్వాలల్లా 
 రండి రండి 
వానల తరువాత మొలిచే తాజా తుమ్మ ముళ్లల్లే 
 రాలిపోయే రోజుల్లారా 
కూలిపోయే వాగ్దానాల్లారా 
రండి రండి 
మంగళవారం తరువాత వచ్చే 
బుధవారంలా రండి రండి 

 మూలం: COME WHEN YOU FIND THE TIME - KEDARNATH SINGH 

 2. పండు రుచి లా.... 
 ఆకాశంలో తారలు 
నీళ్లల్లో చేపలు 
గాలిలో ప్రాణవాయువు 
 సరిగ్గా అలానే 
ఈ భూమిపై నేను నువ్వు 
అనిలము 
మరణము 
దిరిసెన పూలు 
 అగ్గిపుల్ల తల 
ఇంటి తలుపు 
వీపుపై కురుపు 
పండు రుచి 
 సరిగ్గా అలానే...... సరిగ్గా అలానే....... 

 మూలం:LIKE FLAVOUR OF FRUIT - KEDARNATH SINGH 

 భవదీయుడు బొల్లోజు బాబా

Wednesday, February 10, 2010

పదాలు చలికి చచ్చిపోవు - శ్రీ కేదార్ నాధ్ సింగ్

పదాలు చలికి చచ్చిపోవు
ధైర్యం లోపించటం వల్ల చస్తాయంతే
పదాలు తడి కాలంలో
చెడిపోతాయి ఎక్కువగా

మా ఊరి ఏటిగట్టుపై
ఒకసారి నేనో పదాన్ని కలిసాను
మెరిసే ఎర్రపిట్టలా ఉందది
ఇంటికి తీసుకొచ్చాను
గుమ్మం వద్దకు చేరగానే
వింతైన బెదురు చూపులతో
నన్ను చూస్తూ చచ్చిపోయింది అది

అప్పటి నుంచీ పదాలంటే భయం నాకు
వాటి మధ్యకు వెళ్లినా వెంటనే వెనక్కు వచ్చేస్తాను
రంగు రంగుల దుస్తులు వేసుకొని
జుట్టు విరబోసుకున్న పదం నా వైపు రావటం చూస్తే
వెంటనే నా కనులు మూసేసు కొంటాను

నెమ్మది నెమ్మదిగా
ఈ ఆటను ఆనందించటం మొదలెట్టాను
నేనో రోజు గడ్డి మేటు కింద
పాములా నక్కిన ఓ అందమైన పదాన్ని
రాయితో గాయపర్చాను అకారణంగా

దాని చక్కని మెరిసే కళ్ళను
ఈ నాటికీ నేను మరచిపోలేదు

కాలం గడిచే కొద్దీ
నా భయం తగ్గసాగింది
ఈ రోజు పదాలు ఎదురైతే
కుశల ప్రశ్నలు వేసుకుంటాం

ఇపుడు నాకు
అవి దాక్కునే చోట్లెన్నో తెలిసాయి
వాటి వివిధ వర్ణాలు చాలామట్టుకు
నాకు పరిచితమయ్యాయి
సాదా పదాలు, గోధుమ చామనిచాయ రంగుల్లోను
విధ్వంశక పదాలు, లేత పసుపు పింక్ రంగుల్లోను
ఉంటాయని నేనిప్పుడు చెప్పగలను

విషాదకర, గంభీర సందర్భాలకోసం
మనం దాచుకొన్న పదాలు
వాటికుద్దేశింపబడిన సందర్భాలలో
చాలా జుగుప్స కలిగించే పదాలే కావటం
తరచూ జరిగేదే


బొత్తిగా పనికి రానివనీ
హీన వర్ణాలను తొడుక్కొన్నాయనీ
చెత్తలో పారేసిన పదాలే

నా ఆపత్కాలలో సహాయపడ్డాయన్న 
నిజాన్ని కనుగొన్నాను
ఇపుడేం చేయగలను నేను

నిన్నేం జరిగిందంటే
ఓ అరడజను సొగసైన పదాలు
చీకటి వీధిలో అకస్మాత్తుగా
నన్ను చుట్టు ముట్టాయి
భయమేసింది నాకు

మాటల్లేకుండా కొద్దిసేపు వాటిముందు
అలా నిలచుండి పోయాను, చమటతో తడుస్తో
తేరుకొని పరుగు ప్రారంభించాను
నా పాదాలు గాల్లోకి లేస్తుండగా
రక్తంలో తడిచిన ఓ చిన్నారి పదం
ఎక్కడినుంచో ఆయాసపడుతూ నన్ను చేరి
" రా, నేను నిన్ను ఇంటికి చేరుస్తాను" అంది.

మూలం: WORDS DON’T DIE OF COLD - KEDARNATH SINGH


భవదీయుడు
బొల్లోజు బాబా

రెండు నిముషాల మౌనం

రెండు నిముషాల మౌనం సోదర సోదరీ మణులారా ఈ రోజు మరణిస్తున్నది మరణిస్తున్న ఈ దినం కోసం రెండు నిముషాల మౌనం ఎగిరిపోతూన్న పక్షికోసం నిశ్చల జలాల కోసం మీద పడుతున్న రాత్రికోసం రెండు నిముషాల మౌనం దాని కోసం కాని దాని కోసం అయిఉండాల్సిన దానికోసం రెండు నిముషాల మౌనం విసిరేసిన తొక్కకోసం నలిగిపోయిన గరిక కోసం ప్రతీ యత్నం కోసం ప్రతీ పధకం కోసం రెండు నిముషాల మౌనం

కేదార్ నాథ్ సింగ్

Monday, February 8, 2010

దేవుడు లేకుండానే!


శ్రీ కేదార్ నాధ్ సింగ్ (1934) ప్రముఖ ఆధునిక హిందీ కవి. వీరు రచించిన Akaal Mein Saras (Cranes in Drought) సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. శ్రీ కేదార్ నాధ్ న్యూ ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లో హిందీ భాషా ప్రొఫసరుగా పనిచేసారు.

వీరి కవిత్వం సరళంగా ఉంటూనే లోతైన భావాల్ని కలిగి ఉంటుంది. ఈయన శైలి "బహుళ స్వరాలతో సంభాషణాయుతం" గా ఉంటుందని విమర్శకులు అంటారు.
రోజూ దర్శించే దైనందిక విషయాలే వీరి కవిత్వంలో గొప్ప నిగూఢార్ధంతో, ఒక నూతన దృష్టితో వర్ణింపబడుతూంటాయి.

స్థూలంగా చెప్పాలంటే్, శిల్పం పట్ల మక్కువ కలిగిన, ప్రయోగశీలి అయిన, ఒక మానవతావాద కవిగా శ్రీ కేదార్ నాథ్ సింగ్ గారిని చెప్పుకోవచ్చు.

శ్రీ కేదార్ నాథ్ సింగ్ రచించిన Even Without God కు స్వేచ్ఛానువాదం ఇది. మరికొన్ని వీరి కవితానువాదాలు మరోసారి........

దేవుడు లేకుండానే!

ఇదేమి వింత
ఉదయం పదికల్లా ఈ ప్రపంచం
తన పని తాను చేసుకుపోతోంది
దేవుడు లేకుండానే!

వాహనాలు నిండిపోయాయి
జనాలు తొందరలో ఉన్నారు
ఎప్పట్లానే.

భుజానికి సంచి తగిలించుకొన్న
తపాలావాలా రోజూలానే
తిరుగుతున్నాడు
దేవుడు లేకుండానే!

బ్యాంకులు వేళకే తెరవబడ్డాయి
గడ్డి పెరుగుతూనే ఉంది
అన్ని లెక్కలూ ఎంత క్లిష్టమైనవైనా
చివరకు ఓ కొలిక్కి వచ్చేస్తున్నాయి
జీవించాల్సిన వాళ్లు
జీవిస్తున్నారు
చనిపోవాల్సిన వాళ్లు
చనిపోతున్నారు
దేవుడు లేకుండానే!

ఇదేమి వింత
రైళ్లు ఆలస్యంగానో సమయానికో
ఏదో గమ్యానికి వెళ్లటమో రావటమో
జరిగిపోతూనే ఉంది
ఎన్నికలు జరుగుతున్నాయి
ఆకాశంలో విమానాలు ఎగురుతూనే ఉన్నాయి
దేవుడు లేకుండానే!

దేవుడు లేకుండానే!
గుర్రాల సకిలింపు కొనసాగుతూంది
సాగరంలో ఉప్పు ఇంకా తయారవుతూనే ఉంది
అటూ ఇటూ పిచ్చిగా తిరిగిన పిచ్చుక
చివరకు ఎలానో
తన గూటికి తిరిగి చేరుకొంటూంది
దేవుడు లేకుండానే!

దేవుడు లేకుండానే!
నా విషాదం మునుపెన్నడూ లేనంత
చిక్కబడుతూనే ఉంది
పది సంవత్సరాల నా పాత ప్రియురాలి కురులు
ఎన్నడూ లేనంత నల్లనైనాయి
ఇంటినుంచి బయటకెళ్లి తిరిగి చేరుకోవటం
ఇంకా వ్యామోహం గానే ఉంది ఎప్పట్లానే

ఇదేమి వింత
నీరు ప్రవహిస్తూనే ఉంది
ప్రవాహం మధ్యలో చేతులు చాపి
అలా నుంచునే ఉంది వంతెన
దేవుడు లేకుండానే!

మూలం: శ్రీ కేదార్ నాథ్ సింగ్ రచించిన Even Without God
బొల్లోజు బాబా

Saturday, February 6, 2010

స్త్రీ దేహం....... పాబ్లో నెరుడా

స్త్రీ దేహమా!
తెల్లని గిరులు, ఊరువులతో
నీవు వశమయిన ప్రపంచంలా కనిపిస్తున్నావు.
ధృఢమైన నా రైతు దేహం నిన్ను దున్నుతోంది
అవని లోతుల్లోని శిశువును పైకి తీసుకు రావటానికై.

నేనో సొరంగంలా ఒంటరినై ఉండేవాడిని.
పక్షులు నాలోంచి ఎగిరేవి.
రాత్రి ముట్టడి చేసి నన్ను ముంచెత్తేది.
నే బతకటం కోసమే నిన్నో ఆయుధంగా చేసుకొన్నాను
నా ధనస్సులో బాణంలా నా ఒడిసెలలో రాయిలా.

కానీ ప్రతీకార క్షణాలు కరిగిపోయాకా
నిన్ను ప్రేమిస్తున్నట్లు గ్రహించాను.
చర్మం, మట్టి, వాంఛ, చిక్కని పాలు నిండిన దేహానివి నీవు.
ఓహ్! చనుల ధ్వయం విరహ నేత్రాలు
కటిప్రాంత ఎర్రగులాబీలు సన్నని విషాద స్వరంతో నీవు.

ఓ నా స్త్రీ దేహమా!
నీ సౌందర్యంలోనే నా మనుగడ.
నీవే నా దాహానివి, అంతే లేని నా కోర్కెవు, మారిపోయె నా మార్గానివి.

చీకటి నదీ గర్భాన
ఆధ్యంతరహితమైన దాహం ప్రవహిస్తూంటుంది.
అనంతమైన బాధ అలుపు అనుసరిస్తూంటాయి.

బొల్లోజు బాబా

పాబ్లో నెరుడా Body of woman కు స్వేచ్ఛానువాదం