Wednesday, October 28, 2009

జీవన సౌందర్యం


వేసవి చివరి తెమ్మెరపై
తేలుతూ వచ్చిన తొలకరిమబ్బు
అవని పెదవులపై ఆకుపచ్చని
చుంబనాన్ని వొదిలిపోయింది.

వర్షాకాలపు ఆఖరు చినుకుపై
స్వారీ చేస్తూ వచ్చిన శీతవాయువు
దేహ దేహానికీ వెచ్చని స్పర్శలను
ప్రసాదించి సాగిపోయింది.

శీతవేళ చివరి ఘడియలో
మొలకెత్తిన వేసవి
గుప్పెడు మల్లెల్ని పెద్దలకు
పుట్టెడు జ్ఞాపకాల్ని పిల్లలకూ ఇచ్చి
కనుమరుగైంది.

పుడమి సంగీతాన్ని
నూత్న సృష్టి, మృత్యువు లు
నిత్యం శ్రుతి చేస్తూనే ఉంటాయి.

జీవితపు దారులను
ప్రేమ తన పరిమళాలతో
ప్రకాశింపచేస్తూనే ఉంటుంది.

కాలానికో, ప్రేమకో
వినమ్రంగా నమస్కరించి
అస్థిత్వాన్నో, ఆత్మనో
ఆనందంగా సమర్పించుకోవటంలో
ఎంతటి జీవన సౌందర్యముందీ!

బొల్లోజు బాబా

18 comments:

  1. "కాలానికో, ప్రేమకో
    వినమ్రంగా నమస్కరించి
    అస్థిత్వాన్నో, ఆత్మనో
    ఆనందంగా సమర్పించుకోవటంలో
    ఎంతటి జీవన సౌందర్యముందీ!"
    ఎంత చక్కగా చెప్పారండి!

    ReplyDelete
  2. బాగుందండి.. కాని

    తొలకరి మబ్బులు తొలకరిలో రావటం లేదు
    శీత వాయువు శీఘ్రముగ సీత కన్ను వేస్తున్నది
    మల్లె మాత్రము ఎప్పటిలా గుబాలిస్తూ
    జీవన సౌందర్యమును గుర్తు చేస్తున్నదట..

    ReplyDelete
  3. పుడమి సంగీతాన్ని
    నూత్న సృష్టి, మృత్యువు లు
    నిత్యం శ్రుతి చేస్తూనే ఉంటాయి.

    చాలా బాగా చెప్పారు సార్. ధన్యవాదాలు.

    ReplyDelete
  4. పద్మ గారికి, కుమార్ గారికి థాంక్సండి

    సురేష్ గారికి
    పోనీ తొలి కరిమబ్బు అనుకోండి. :-)

    థాంక్యూ

    ReplyDelete
  5. ‘పుడమి సంగీతం’ గురించి రాసిన మీరు వాక్యాలు చాలా బావున్నాయి! అభినందనలు.

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. నాకు 'ఆకుపచ్చ చుంబనం' ప్రయోగం భలేగా నచ్చింది బాబా గారూ.

    ReplyDelete
  8. ఒక్కసారిగా అన్ని కాలాల్లోకి అలా అలా వెళ్ళి మీ కవిత అద్దిన సౌందర్యాన్ని దర్శించి, అటువంటి కవి మనసు నాకిచ్చిన జీవితం లోని సంతృప్తినీ అనుభూతిగా మిగుల్చుకుని వచ్చాను. మంచి ఫీల్.

    ReplyDelete
  9. Beautiful.

    ప్రతి ఏడాదీ ఇక్కడ వసంత శిశిరకాలాల్లో జరిగే ప్రకృతి అందాల ఆవిష్కరణ చూసినప్పుడల్లా విభ్రాంతిలో మునిగిపోతుంటాను. రెండేళ్ళ క్రితం ఆకురాలుకాలపు సౌందర్య విభ్రమంలో రాసుకున్న ముక్కలివి.
    http://kottapali.blogspot.com/2007/11/blog-post.html

    ఒక్క మాట. మొదటి చరణంలో తెమ్మెర అన్న మాట పలకడానికి చాలా చక్కగా ఉన్నది గానీ .. ఇప్పుడే నిఘంటువు చూశాను. తెమ్మెర అంటేనే చల్లటి గాలి అని అర్ధము. అంచేత వేసవి చివరి తెమ్మెర అనడం అభాస అవుతుంది. గమనించండి.

    ReplyDelete
  10. వేణుగారికి, వాసు గారికి ఉషగారికి థాంక్సండీ
    గురువుగారు కొత్త పాళీ గారికి
    థాంక్యూ సార్. మంచి విషయం చెప్పారు.
    తెమ్మెర బదులుగా గాడుపు పదం సరిపోతుంది కదండీ.
    తెమ్మెర పదప్రయోగం
    ఒకటి అది అభాస అవుతుందని తెలియనితనం.
    రెండు నడకబాగుంది కదా అని.
    థాంక్సండీ.

    మీరిచ్చిన లింకులో నేను పైన చేసిన కామెంటు, నేను బ్లాగులోకంలో నేను చేసిన మొట్టమొదటి కామెంటు. 2008 ఏప్రిల్ 27 న నేను బ్లాగు ప్రారంభించాను. ఆ రోజే మీ బ్లాగులో అలా కామెంటాను. అప్పటికి మీరెవరో, మీరేమిటో తెలియదు నాకు. చిత్రంగా ఉంది కదండీ.

    అదే పోస్టులో నా రెండవ కామెంటు నేను స్ట్రే బర్డ్స్ అనువాదం చేస్తున్నప్పడు కలిగిన ఒక అనుమాన నివృత్తి జరిగిన సంతోషంలో చేసింది.
    అప్పటికి మీరెవరో తెలిసిపోయింది లెండి. :-))

    బొల్లోజు బాబా

    ReplyDelete
  11. కాలానికి, ప్రేమకు వినమ్రం గా మొక్కి ప్రాణాన్ని అస్తిత్వాన్ని పణం పెడితే దొరికే జీవన సౌందర్యమూ, బలి దాన మివ్వక పోతే ఆ రెండు చేసే ప్రళయ కాల విన్యాసమూ రెండూ అధ్బుతాలే కదా బాబా గారు.

    ReplyDelete
  12. మన్నించండి - వాదన నా ఉద్దేశ్యం కాదు కానీ, వేసవి చివరన తొలకరిచినుకులు వెంటబెట్టుకు వచ్చేది తెమ్మెర నే. నడివేసవి అయితే ఆ [వడ] గాడ్పు అన్న పదం సరిపడుతుంది. ఇక్కడ అభాసు లేదు రసాభాస లేదు [నా వరకు]. రసానుభాతికి మాత్రం కొదవలేదు. :)

    ReplyDelete
  13. ఉషగారు థాంక్యూ
    కొత్తపాళీగారన్నది
    తెమ్మెర అంటే చల్లగాలి అనికదా. వేసవి చివరి (గమనించండి చివర కాదు) తెమ్మెర పదప్రయోగం వలన వేసవి చివరి చల్లగాలి అవుతుంది. అంటే అది అభాస అయ్యింది కదా అని ఆయన సూచించారు.

    మీ ఇంటర్ప్రెటేషను కూడా నాకు హేపీగా ఉంది. :-))

    గాడుపు పదం విషయంలో మీరన్నది కరక్టే.

    పోనీ చివరి బదులుగా చివర అని మారిస్తే సరిపోతుంది కానీ కవిత ఫ్లో పాడవుతుంది. ఎందుకంటే తదుపరి రెండుపాదాలు చివరి ఆఖరు అంటూ సాగుతాయి.

    ఏం చెయ్యాలి? మీ సలహా ఏమిటి? మిత్రులెవరైనా పరిష్కరించగరేమో చూద్దాం అండీ

    బొల్లోజు బాబా

    థాంక్యూ మేడం.

    ReplyDelete
  14. వేసవి చివరి తెమ్మెర అన్నారు. అంటే ఆఖరి తెమ్మెర(ఆఖరి చల్లని గాలి)
    అని అర్ధం. అసలు వేసవిలో తెమ్మెరలెక్కడివి.
    నాకు తోచింది....ఇలా..

    వేసవి తొలి తెమ్మెరకి తెరతీస్తూ
    తేలుతూ వచ్చిన తొలకరిమబ్బు
    అవని పెదవులపై ఆకుపచ్చని
    చుంబనాన్ని వొదిలిపోయింది.

    ReplyDelete
  15. sreenika gaaru adbutaMgaa uMdi.

    thaankyou madam thankyou

    bollojubaba

    ReplyDelete
  16. సహజంగా, శొభనంగా వుంది...
    జీవన్మృత్యువుల ప్రకృతిని ఎంత సునాయాసంగా చెప్పుకొచ్చారు ?

    కవి స్పందన ఇలాగే ఉంటుంది ...
    శిల్పం , తత్వం వాటంతటికవే వచ్చి చేరుతాయి.... ధన్యులం

    ReplyDelete
  17. సత్య గారికి
    థాంక్సండీ.
    బొల్లోజు బాబా

    ReplyDelete