Showing posts with label కవిత్వం సాహిత్యం సౌందర్యం. Show all posts
Showing posts with label కవిత్వం సాహిత్యం సౌందర్యం. Show all posts

Wednesday, October 28, 2009

జీవన సౌందర్యం


వేసవి చివరి తెమ్మెరపై
తేలుతూ వచ్చిన తొలకరిమబ్బు
అవని పెదవులపై ఆకుపచ్చని
చుంబనాన్ని వొదిలిపోయింది.

వర్షాకాలపు ఆఖరు చినుకుపై
స్వారీ చేస్తూ వచ్చిన శీతవాయువు
దేహ దేహానికీ వెచ్చని స్పర్శలను
ప్రసాదించి సాగిపోయింది.

శీతవేళ చివరి ఘడియలో
మొలకెత్తిన వేసవి
గుప్పెడు మల్లెల్ని పెద్దలకు
పుట్టెడు జ్ఞాపకాల్ని పిల్లలకూ ఇచ్చి
కనుమరుగైంది.

పుడమి సంగీతాన్ని
నూత్న సృష్టి, మృత్యువు లు
నిత్యం శ్రుతి చేస్తూనే ఉంటాయి.

జీవితపు దారులను
ప్రేమ తన పరిమళాలతో
ప్రకాశింపచేస్తూనే ఉంటుంది.

కాలానికో, ప్రేమకో
వినమ్రంగా నమస్కరించి
అస్థిత్వాన్నో, ఆత్మనో
ఆనందంగా సమర్పించుకోవటంలో
ఎంతటి జీవన సౌందర్యముందీ!

బొల్లోజు బాబా