Saturday, August 1, 2009

నీలాపనిందలు (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)


నా చిట్టితల్లీ! ఎందుకమ్మా ఏడుస్తున్నావు?
నిష్కారణంగా వాళ్లు నిన్ను తిట్టటం ఎంత దారుణం?

నీ బుగ్గలు , వేళ్లపై సిరా మరకలు చేసుకొన్నందుకు నిన్ను మురికి పిల్ల అని గేలి చేసారా?

అయ్యో రామ! తన మొహం నిండా మరకలు చేసుకొన్నందుకు
నిండు చందమామను మురికి అనే ధైర్యం చేయగలరా వాళ్ళు?

ప్రతి చిన్న విషయానికీ నిన్ను నిందిస్తున్నారు.
నిష్కారణంగా తప్పులెన్నటానికి వారెప్పు డూ సిద్దం గా ఉంటారు.

ఆటలో నీ దుస్తులు చిరిగిపోయినందుకేనా వారు నిన్ను వికారంగా ఉన్నావని అన్నది?

అయ్యో రామ! చిరిగిన మబ్బుల గుండా చిరునవ్వులు చిందించే
శరత్కాల ఉదయాన్ని వారేమని పిలుస్తారట?

వాళ్ల మాటలనేమీ పట్టించుకోకు తల్లీ!
వాళ్ల మాటలనేమీ పట్టించుకోకు!

నీ లోపాల చిట్టాను వారు తయారు చేస్తూంటారు.
నీకు మిఠాయిలంటే ఇష్టమని అందరకూ తెలుసుకదా.
దీనికే వారు నిన్ను ఆశలమారివని అంటారా?

అయ్యో రామ! సరిపోయింది. మరి నిన్ను ప్రేమించే మమ్ములనేమని పిలుస్తారో!


బొల్లోజు బాబా

మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని DEFAMATION

8 comments:

  1. మీరు అభినందనీయులు. ఠాగూరు ఆత్మ కనబడేలా అనువాదం చక్కగా వుంది. వీలైతే అన్నీ రాశాక PDF లో పెట్టండి

    ReplyDelete
  2. శ్రీధర్ గారు
    థాంక్సండి. మీరన్నట్లు అన్ని అనువాదాలు పూర్తయ్యాయి. దీనిని నెలవంక పేరుతోను మరియు సూఫీ కవిత్వాన్ని ఎడారి అత్తరులు పేరుతోను పి.డి ఎప్ రూపంలో తీసుకొద్దామనుకొంటున్నానండీ. మీ సూచనకు ధన్యవాదములతో.

    ఫణీంద్రగారు

    మీ కామెంటు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించిందండి. మీ సహృదయతకు సదా కృతజ్ఞతలతో

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    ReplyDelete
  3. నా చిట్టితల్లీ!.. మరి నిన్ను ప్రేమించే మమ్ములనేమని పిలుస్తారో!" చిట్టికి తల్లివి, నీవూ ఓ పిచ్చిదానివే అంటారేమో, చందమామనంటి పెట్టుకున్న వెన్నెల నేనని, ఉదయంలోనూ నవ్వే కలువ నేనేనని తెలియని అమాయకులు వారు కనుక. నా చిట్టిని ప్రేమించే నేను చెట్టంత విశాలం, నా ప్రేమ ఆ నీడంత చల్లన...
    కొడతానికి సిద్దమయ్యారా బాబా గారు? ఈ రోజు మనసంతా అమ్మతనంతో ఎగిరెగిరి పడుతోంది... :)

    ReplyDelete
  4. చాలా బాగుంది బాబా గారు. బంగారు తల్లి సిరా మరకలతో, బట్టలు చింపుకుని బిక్క మొకం తో చిట్టి తల్లి కళ్ళ ముందు ప్రత్యక్షమైతే బలే జాలి వేసింది, ముద్దు కూడా వచ్చింది.

    ReplyDelete
  5. ఉషగారికి, భావన గారికి
    థాంక్సండీ

    బొల్లోజు బాబా

    ReplyDelete
  6. భలే ఉందండి. అనువాదంలో అనువాద ఛాయలు లేకపోతే అది గొప్ప అనువాదం అవుతుంది. మీరు చేసిన అనువాదం అలాంటిదే.

    కాకతాళీయంగా మా పాప మొన్న చేసిన పని గుర్తొచ్చింది. - మా పాపకు కొత్త గవును తొడిగి, ఏదో పని మీద లోపలకెళ్ళింది మా ఆవిడ. నేనూ లోపల ఏదో సర్దుతున్నాను. ఇంతలో మా పాప పాక్కుంటూ టాయిలెట్ కెళ్ళి, అక్కడ బిందెలో నీళ్ళు మగ్గులో తీసుకుని గవును మొత్తం తడిపేసుకుందది. నాకు సడన్ గా పాప గుర్తొచ్చి, బయటకొచ్చి చూస్తే - నన్ను చూస్తూ తను చేసిన ఘనకార్యాన్ని నవ్వుతూ చూపించింది.

    కోపమూ, చిరాకూ రాకపోగా, భలే నవ్వొచ్చింది.

    ఎంతయినా పసి మనసుతో ఎంత మమేకం కాకపోతే ఇలాంటివి రాయగలడు కవి?

    ReplyDelete
  7. రవిగారికి
    థాంక్సండీ.
    మీ అనుభవాన్ని పంచుకొని ఈ సందర్భాన్ని మరింత ప్రకాశింపచేసారు.

    పసి మనసుతో ఎంత మమేకం కాకపోతే ఇలాంటివి రాయగలడు కవి?

    ఈ భావనలే నన్నీ అనువాదానికి పురిగొల్పింది.

    ఎన్నో సందర్భాలు, ఎన్నో ఉపమానాలు, ఎన్నో ఉదంతాలు ఆ కవితలలో నాకు సాక్షాత్కరించి, అవన్నీ నిన్నోమొన్నో లేక ఏదో కలలోనో, మా ఇంట్లో జరిగాయి కదా అన్న ఫీల్ ఉన్నాది చూసారూ....... బహుసా నేను వర్ణించలేనేమో. (మాకు ఇద్దరు పిల్లలు- అమ్మాయికి ఎనిమిది సంవత్సరాలు, అబ్బాయికి నాలుగు).

    ఆ సార్వజనీనతే టాగోర్ కవిత్వంలోని శక్తి. టాగోర్ కల్పనలోని కాంతి, టాగోర్ అక్షరాలవెనుక కదలాడే ఆకాశం.

    ఆ మహానుభావునికి శిరస్సువంచి నమస్కరించటం తప్ప ఈ రోజు నేనింకేం చేయగలను. ఆయన విడిచి వెళ్లిన అక్షర సుమాలను భక్తిగా కళ్లకద్దుకొని శిరసున ఉంచుకోవటం వినా ఏమి చేయగలను.

    మీరు చెప్పిన ఉదంతంవంటిదే టాగోర్ వర్ణించిన తీరు వేడుక అనే గీతంలో చూడండి.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    ReplyDelete