Sunday, May 10, 2009

పోలవరం కవితలు

గోదావరి నది పై ప్రయాణించటం ఒక మంచి అనుభూతి. ఇంతవరకూ బస్సులోనో, రైల్లోనో ప్రయాణిస్తూ గోదావరిని దాటటం తప్ప బోట్ పై పాపికొండల వరకూ వెళ్లటం జరగలేదు. మొన్న సాధ్యపడింది. ఎత్తైన కొండలు, వాటిమధ్య పరవళ్లుతొక్కుతూ ప్రవహించే అఖండ గోదావరి, దారిపొడుగునా ఒడ్డుపై కనిపించే పల్లెటూర్లు, అక్కడక్కడా కనువిందు చేసే పక్షుల నడుమ సాగిన మా ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది.

బహుసా ఈ అనుభూతి ఇంత డీప్ గా ఉండటానికి కారణం పోలవరం ప్రోజెక్టు కావొచ్చు. ఎందుకంటే దాని నిర్మాణం పూర్తయ్యే సరికి సుమారు 450 గ్రామాలు నీటమునిగి, ఇప్పుడు కనిపిస్తున్న పాపికొండల అందాలు కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది కనుక.

ఆ సందర్భంగా నాలో కలిగిన ఆలోచనల శకలాలను ఇలా మీతో పంచుకోవాలనిపించి........

బోటు ఎక్కగానే నది నీటిని చూస్తున్నప్పుడు, రాజమండ్రిలో పుట్టి, గతించిన మా పూర్వీకులు జ్ఞాపకం వచ్చారు. భద్రాచలంలో ఆలయ పునర్నిర్మాణంలో పన్నెండేళ్ల పాటు శిల్పిగా పనిచేసిన మా తాతగారి రూపం కదలాడింది. ధవళేశ్వరంలో పుట్టిన మా అమ్మమ్మ తలపుల్లోకి వచ్చింది. వీళ్లందరకూ ఈ గోదావరి తెలుసు/గోదావరికి వీళ్లందరూ తెలుసు అనిపించింది.
అలా ఎన్ని కోట్ల జీవితాలతో ఈ గోదావరి పెనవేసుకుపోయి ఉంటుందో కదా అన్ ఊహకు .......

ఆమెను తాకగానే,
ఓ నీటి బిందువులోంచి
నా ప్రవర వినిపించింది.
ఇక్కడి ప్రజల గుండెల్లో
గోదావరి ఉత్త నదే కాదు, మరింకేదో!

*********

నదిపై లారీ టైర్లలో గాలినింపి దానిపై ఒక చెక్కవేసుకొని కూర్చొని చేపలు పడుతున్న జాలరులను చూసి ముచ్చటేసింది. చిన్నప్పుడు మా వూరి చర్చి ఫాదరు జేబునిండా చాకలేట్ లు వేసుకొని, స్కూలు నించి వచ్చే మాకు పంచిపెట్టేవారు. మేము కూడా స్కూలు అవ్వగానే బిళ్లలకోసం చర్చివీధి గుండా ఇళ్లకు చేరేవాళ్లం. నదినీ, జాలర్లను చూసినపుడు ఎందుకో నది చాక్లెట్లిచ్చే చర్చి ఫాదరులాగా కనిపించింది.

పిల్లలకు చాక్లెట్లు
పంచిపెట్టే చర్చి ఫాదర్ లా
జాలర్లకు చేపలు
పంచిపెడుతోంది, నది.
********

పాపికొండల మధ్య ఒక చోట గోదావరి దాదాపు తొంభై డిగ్రీల టర్న్ తీసుకొంటుంది. దూరంనుంచి చూస్తుంటే నదికి అడ్డంగా ఓ పెద్ద కొండ ఉన్నట్టు అనిపిస్తుంది. నది అక్కడతో అంతం అయినట్లు అనిపిస్తుంది. దానినే చిన్న చిన్న మాటలలో ఇలా.

నదికి అడ్డంగా పెద్ద కొండ.
ప్రవాహం ఆగలేదు
మలుపు తీసుకొంది.

ఇక్కడ నదీ ప్రవాహం జీవితం కావొచ్చు. అడ్డంకుల వద్ద జీవితం ఆగిపోదుగా. మలుపు తీసుకోవటమూ ఒక వ్యూహమే. అలా మలుపు తీసుకొన్నచోట గోదావరి లోతు వంద మీటర్ల పైన ఉంటుందట. మన జీవన మార్గాన్ని మళ్లించే ఏ అనుభవమైనా ఆ మాత్రం లోతుగానే ఉంటుంది.
**********

పర్యావరణ విచ్చిన్నం వలన వర్షాలు పడకపోవటం, ఎక్కడికక్కడ డాములు కట్టటమూ వంటి కారణాల వల్ల నదుల్లో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక పరిణామం.

తమిళ కవి వైరముత్తు వ్రాసిన ఒక అద్బుతమైన కవితలో తన ఊరి నది గురించి వర్ణిస్తూ --- 1967 లో పాలనురుగులాంటి పౌర్ణమి రాత్రుల్లో వెన్నెల కరిగించుకొని తెల్లగా ప్రవహించిందని, 1977 లో కాల ప్రవాహంలో కాలువలా మారిందని, 1987 లో జలదానం కోల్పోవటంతో ఇసుక దానం చేస్తున్నదనీ, 1997 ఎక్కడకు మాయమయ్యావో చెప్పవా నదీ --- అంటూ ఆర్తిగా ప్రశ్నిస్తారు.

గోదావరికి కూడా నీటి కరువు వచ్చి (ప్రస్తుత ఎండాకాలం కాదు ప్రధాన కారణం) అక్కడక్కడా నదీ గర్భం బయట పడి వికృతంగా కనిపించటం ఒక విషాద దృశ్యం. దాని పదచిత్రం ఇలా....

నీరులేక బయటపడ్డ నదీగర్భం.
రాచపుండు గుంతల్లోంచి
కనిపించే వెన్నెముకలా ఉంది.
**********


ఈ నదిపై డామ్ నిర్మాణం పూర్తయితే ఇలా ప్రవహించే ఈ అఖండ గోదావరి జలాలు రిజర్వాయిర్ లో మురిగిపోవాల్సిఉంటుందేమో. అవసరాలకు తగ్గట్టుగా వేసిన కూడికలు తీసివేతల ప్రకారం ప్రవహించవలసి ఉంటుంది. ఇప్పటి స్వేచ్ఛ, విశృంఖలత్వం ఉండదు. అలాంటి పరిస్థితి ఊహకు వచ్చి, ఇలా

డామ్ సంకెళ్లు
వేయించుకోబోతున్న
ఈ నదీ ప్రవాహాన్ని
చూస్తూంటే జాలేస్తుంది.




ఇంకా మరికొన్ని

సముద్రానికి దారెటని
అడిగిన వాన చినుకుకు
దారి చూపుతోంది, నది.
******

బరువైన దినాల మధ్య
ప్రవహించే నీ జ్ఞాపకాల్లా
చుట్టూ కొండల మధ్య
అఖండ గోదావరి.
*******

ఒక్క క్షణం ఆగానో లేదో
నది నన్ను దాటుకొని
నవ్వుకొంటూ వెళ్లిపోయింది.
*********


ప్రస్తుతానికి ఇంతే.
పోలవరం ప్రోజెక్టు నిర్మాణంలో ఏర్పడే వాక్యూం గురించి వ్రాయాలని ప్రయత్నిస్తున్నాను.
అది కూడా త్వరలో.......

బొల్లోజు బాబా

15 comments:

  1. "నీరులేక బయటపడ్డ నదీగర్భం.
    రాచపుండు గుంతల్లోంచి
    కనిపించే వెన్నెముకలా ఉంది." excellent sir!

    ReplyDelete
  2. సందోర్భోచితంగా బొమ్మలకి తగిన కవితలతో అందంగా చెప్పేరండి. ఇంతకుముందు నాటపాలో రాసేరు కనక చెప్పుతున్నాను.
    ఈ అఖండ గోదావరి జలాలు రిజర్వాయిర్ లో మురిగిపోవాల్సిఉంటుందేమో - ఇదీ ఈనాటి వాస్తవమూ, విషాదమూ. మొత్తంమీద నిజంగా బాగుంది. :)
    డీప్ అంటే బలంగా అని, టర్న్ తీసుకుంది అనడానికి బదులు 90 డిగ్రీలు కుడి లేక ఎడంవేపుకి మళ్లిందని రాయొచ్చు.

    ReplyDelete
  3. పరిమళంగారూ
    థాంక్యూ
    అమ్మా,
    మీరు నా బ్లాగుకొచ్చి, మంచి వాఖ్య చేసినందుకు సంతోషంగా ఉందండీ.
    మీ సూచన బాగుందండీ. వ్రాసేటపుడు గబుక్కున కొన్ని పదాలకు తెలుగు తట్టదు. :-)
    కృతజ్ఞతలతో
    బొల్లోజు బాబా

    ReplyDelete
  4. అయ్యో ఎంత పని చేసారు బాబా గారు,
    నాకు చెప్పకుండానే మీరు పాపికొండలు చూసివచ్చేసారా ??
    నాకు చెబితే నేనూ వచ్చేవాణ్ణే... :)

    నేను మొన్న పట్టిసీమ బైకు మీద వెళ్ళివచ్చాను.
    మీకు వీలైనపుడు నాకు ఒక సారి ఫోను చేయగలరు.

    - రాకేశ్వర 08813 229757

    ReplyDelete
  5. చాలా బాగా రాసారు బాబా గారు ఎందుకో కళ్ళలో నీళ్ళు తీరిగాయి

    ReplyDelete
  6. హేట్సాఫ్ బాబాగారు
    అసలు కవిత్వం ఎలా రాయాలో, ఒక అనుభూతిని కవిత్వంగా ఎలా మలచొచ్చో ఇంత గొప్పగా వివరించే వ్యాసాన్ని నేనెప్పుడూ చదువలేదు.

    ReplyDelete
  7. కోనసీమలో...
    గోదారి కడలిలా కౌగిట వుండే నేను ఈనిజాన్ని జిర్నిచుకోలేకపోతున
    నా అదృష్టం కొద్ది గోదారిని, పాపికొండల అందాల్ని, ఆ అడవుల్ని తనివితీరా చూసినా బాధతో వెనుతిరిగిన రోజులు... మీకు తిలియని కొన్నినిజాలు రాజుకు పదికి తగ్గని వేటగాళ్ళు (బయటివారు) ...
    దానికి తోడూ అడవి బిడ్డల సాంప్రదాయ వేట ...
    గ్రహౌండ్స్ గన్స్ కు, అన్నల అవసరాలకు ఆవిరయ్యే హరిణి
    స్నేహం కోసం సహనాన్ని చంపిన వైనం, బాధతో వెనుతిరిగిన రోజులు...

    శ్రీ శ్రీ గారు చిప్పినది అడవి కోసం అనువదించి ...
    ఏ అడవి చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం ...
    జంతు జాతి చరిత్ర సమస్తం మన (మనిషి) పిదన పరాయణత్వం ...

    (Anyhow, that's a never ending story on Indian ecology)

    మాస్టారు...చాలా బాగుంది, బా రాసారు...

    ReplyDelete
  8. చాలా బాగా కళ్ళకు కట్టినట్లు వ్రాసారండి. నాకు నాగార్జుగసాగర్ జ్ఞాపకాలు, ముఖ్యంగా కృష్ణమ్మతో ముడిపడిన నా అనుబంధాలు గుర్తుకొచ్చాయి, గోదావరితోను నాకు దగ్గర సంబంధం వుంది. కొంచం బాధ కలిగిస్తున్నా ఆ ప్రయత్నం నుండి మరొక ప్రగతి రావచ్చేమో మనం పురొగమిస్తామేమో అన్న ఆకాంక్ష. ఇలా కారడువులు చీల్చుకుని, నదీనదాలు వాడుకునే కదా మన రాజ్యాలు, నాగరికతలు వెల్లివిరిసింది. జనజీవనం, ప్రకృతి తడబడకుండా నడిచిందెపుడూ లేదు, మార్పు అనివార్యం, ఆ మర్పుకణుగుణంగా పరిణమించటం సహజం, కాదంటారా?

    అలాగే దాదాపు 5సం. క్రితం చదివిన "దేవభూమి", ఇది స్వాతి మాసపత్రిక అనుబంధ నవలగా రెండు భాగాల్లో అందించబడింది, గుర్తుకొచ్చింది.

    ReplyDelete
  9. రాకేశ్వర గారు
    థాంక్సండీ. పట్టిసీమ వెల్లేపుడు మీరే మాకు తోడు. :-)

    నేస్తంగారు
    థాంక్సండీ.
    రమేష్ గారు, ఉష గారు
    మీ ఆలోచనలను పంచుకొన్నందుకు ధన్యవాదములండీ.

    ప్రతీ చర్యకు ప్రతిచర్య ఉండటం సహజం. అదే విధంగా మానవుడు ప్రకృతిపై చేసే ప్రతిపనులు మంచివనీ అనలేం, అలా చేస్తే కానీ మానవమనుగడ అసాధ్యం అనికూడా అనలేం.
    ప్రోస్ అన్ద్ కాన్స్ ఎప్పుడూ ఉండేవే. కానీ మనచర్యలు ఎంతమేరకు ప్రకృతికి అనుగుణంగా ఉంటున్నాయన్నదే సమస్య.
    ఎందుకంటే డైనోసార్ల ఉద్డాన పతనాల్ని చూసింది కూడా ఇదే ప్రకృతి కనుక. అన్ని కోట్ల సంవత్సరాల వయసున్న ఈ ప్రకృతిముందు మనకుప్పిగంతులు ఎంత?

    మన జీవితకాలం వరకూ అయితే ఢోకా లేదు కదాని, భావి తరాల జీవితాల్ని పణంగా పెట్టటమూ మంచిది కాదు కదా?

    బొల్లోజు బాబా

    ReplyDelete
  10. Godavari ni sakshatarinpachesaru

    ReplyDelete
  11. ఎన్నో ఊసులు పంపించింది. నేనెన్నొ చెప్పుకున్నాను. మా ఈ గొదావరిని చూస్తుంటే ఒక్కోసారి జాలి వేస్తుంది. ఒక్కోసారి భయం వేస్తుంది. గోదారి నీ దారి ఎటే. నువ్వు కావాలని ఎంత మంది కొట్టుకుంటున్నారు. మున్ముందు కేవలం నదీ గర్భాలే కనపడతాయేమో. :(

    ReplyDelete
  12. మే నెలలో మేము కూడా పాపికొండలు లాంచీలో వెళ్ళిచూసామండి....
    అది ఒక మధురమైన అనుభూతి....
    Photos & Kavitha both are EXCELLENT....

    ReplyDelete
  13. ఆమెను తాకగానే,
    ఓ నీటి బిందువులోంచి
    నా ప్రవర వినిపించింది.
    ఇక్కడి ప్రజల గుండెల్లో
    గోదావరి ఉత్త నదే కాదు, మరింకేదో!

    ReplyDelete
  14. పోలవరం అని చదివినా, పేరు విన్నా నా వళ్ళు పులకరిస్తుంది
    నా బాల్యం, నా నడక ఈ ఊరిలోనే జరిగాయి గోదారి నదిఒడ్డునే ఎన్నో నేర్చుకున్నాను.

    బహుశ నా కవిత్వానికి అదే మూలమేమో!

    మళ్ళీ ఒకసారి వెళ్ళివచ్చినట్టయ్యింది

    ReplyDelete
  15. ఎంతనుభూతి బాసూ మీ మాటల్లో
    నేను అక్టోబర్ మోదటి వారంలో చూసివచ్చాను పాపికోండలను,గోదారమ్మను.
    కాని మీ కవితల్లో దాగిన వేదన మల్లీ మల్లీ ఈ అందాలను "మిస్"అవుతామనే భావన తలచుకుంటే బాధ కలుగుతుంది.
    ప్రక్రుతిని నాశనం చేయటంలో మనిషికి మించిన శత్రువు మరోకరు వుండరేమో....

    ReplyDelete