Sunday, May 3, 2009

జీవనమాధుర్యం


చేయాల్సిన పనులలా
మిగిలిపోతూనే ఉంటాయి.

కెరటాలు ఒకదానివెనుక ఒకటి
పరుగులేడుతూనే ఉన్నాయి.
నెలనెలా వెన్నెల కుబుసం
ఆకాశం నుండి రాలిపడుతూనేఉంది.
వర్షాకాలంనుంచి తీసుకొన్న పగ్గాల్ని
వేసవికిచ్చేసి సాగిపోతుంది శీతాకాలం.

చేయాల్సిన పనులలా
పేరుకుపోతూనే ఉంటాయి.

కొన్నిపనులు
మరుపులోయల్లోకి జారినట్లే జారి
ఫీనిక్స్ పక్షుల్లా పైకి లేస్తున్నాయ్.

రేపు, వచ్చేఏడాది, ఎప్పటికైనా - అంటూ
చేయాల్సిన పనులు
భవిష్యత్తునిండా
చిక్కుడుపాదులా
అల్లుకొని బిగుసుకొన్నాయి.
జీవితాన్ని అడ్డంగా, నిలువుగా
అడ్డదిడ్డంగా పరుగులెట్టిస్తూన్నాయి.


రెండుకాళ్లపై నించొని
ఆకులనందుకో
యత్నించే మేకపిల్లలా
హృదయం శ్రమిస్తూనే ఉంది.

అయినా సరే
చేయాల్సిన పనులలా
మిగిలిపోతూనే ఉన్నాయి.



బొల్లోజు బాబా

7 comments:

  1. చెయ్యాల్సిన పనులు మిగలకపోతే
    రేపటి కోసం బ్రతుకెందుకు?

    ReplyDelete
  2. మహేష్ గారూ
    థాంక్యూ
    అందుకేగా దాన్ని జీవనమాధుర్యమంది.

    ReplyDelete
  3. ఏదో వెలితి ఉన్నట్టు అనిపించింది. కానీ ఏంటో తెలియదు.

    "రెండుకాళ్లపై నించొని
    ఆకులనందుకో యత్నించే మేకపిల్లలా
    హృదయం శ్రమిస్తూనే ఉంది."


    మేకపిల్లకి ఆకులు దేనికన్నా అన్వయాల లేక వాటి శ్రమ గురించి చెప్పదనికేనా? కేవలం శ్రమ గురించైతే కొంచం wordy గా అనిపించింది

    నాకు మీ కవితని analyze చేసే అంత అనుభవం లేదు, విమర్శించే అంత జ్ఞానమూ లేదు. కేవలం అనుభవిన్చగలను అంతే. నాకు చదవగానే అనిపించినది చెప్పాను. మన్నించగలరు.

    ReplyDelete
  4. My initial reaction is same as Mahesh's. U already replied it.

    Visit...

    http://thinkquisistor.blogspot.com/2009/01/blog-post.html and

    http://thinkquisistor.blogspot.com/2008/11/blog-post_23.html

    ReplyDelete
  5. చేసిన వాటిల్లో తృప్తి వెదుక్కుని
    చేయాల్సిన వాటికి స్ఫూర్తి నింపుకుని
    చేయకూడనివి వేరు చేసుకుని
    చేసే తీరాలన్నవి మననం చేసుకుంటూ
    ఈ జీవనమాధుర్యాన్ని మళ్ళీ మళ్ళీ ఆస్వాదిస్తూ సాగుదాం పదండి.

    ReplyDelete
  6. పిల్లల పరీక్షలు ముగిసినాఇ
    ఎంత దుద్దిన పేపర్లు మురుగుతూనే వునై
    మాస్టారికి మామిడి పళ్ళు తినే సమయం కూడాలేదు
    రాయాల్సిన కవితలు మిగిలిపోతూనే ఉన్నాయి

    చాలా బాగుంది... మాస్టారు ( i am just kidding, please take it easy)

    ReplyDelete
  7. ఒక్కోసారి, మనకు అయ్యబాబోయ్ చెయ్యాల్సిన పనులు చాలా మిగిలిపోయినయ్ అంటూ అనిపించటాన్ని పట్టుకోవటానికి చేసిన ప్రయత్నమే ఈ కవిత.

    టాల్ స్టాయ్ వ్రాసిన వాట్ మెన్ లివ్ బై అన్న కధను చదివారా? అందులో పాత్రలు రేపీ పని చేయాలి, ఎళ్లుండీ పని చేయాలీ అనుకొంటూ ఉంటాయి. నిజానికి ఆయా పాత్రలకు ఆమరునాడు జరిగే ఉపద్రవాలు తెలియవు. ఉదా: మరునాడు ప్రమాదంలో కాలు కోల్పోబోతున్న ఓ పాత్ర, చెప్పులు కుట్టేవానితో, "చెప్పులకు అందమైన పువ్వు కుట్టాలి, ఎక్కువకాలం మన్నాలి సుమా" అంటూ చెపుతూంటాడు.

    చివరలో మెన్ లివ్ బై హోప్ అని ముగిస్తాడు టాల్ స్టాయ్.

    మిగిలిపోయిన పనుల్ని చేయాలన్న ఆశే జీవన మాధుర్యం కదూ.

    లేకపోతే మహేష్ గారు అడిగినట్లుగా రేపటికై బతకటం ఎందుకు.

    వాసు గారు
    ఐ టూ కుడ్ సెన్ఫ్స్ ఇట్. థాంక్యూ.

    మీ సందేహం గురించయితే, ఆ వాక్యం శ్రమనుద్దేసించినదే.

    ఉషగారూ
    థాంక్సండీ.

    రమేష్ గారూ
    :-)
    అంతే అంతే.


    బొల్లోజు బాబా

    ReplyDelete