Wednesday, October 8, 2008

స్వప్నలోకం



స్వప్నం భళ్లుమంటుంది
ముత్యం భస్మం అయినట్లు.

వృద్ద కన్యని పరిణయమాడిన
రాకుమారుడూ లేడు,
మహాపతివ్రత మనోప్రపంచపు
శృంగార విహార యాత్రలూ లేవు.
బ్రహ్మచారితో అంతవరకూ
సరసమాడిన సినీతార
అమాంతం అదృశ్యమవుతుంది.
నిరుద్యోగి గ్రోలుతున్న
ఉద్యోగామృతధారలు ఆగిపోతాయి.

తెల్లారేసరికల్లా
స్వప్నం భళ్లుమంటూంది.
ముత్యం
భస్మం అయినట్లు.

సాయింత్రం నాన్న కొనని ఐస్ క్రీం తిన్న
కుర్రాడిచేతిలో కప్పు మాయమవుతుంది.
క్షుధార్తునికి వడ్డించిన విస్తరి
కన్ను తరచేలోగా కప్పుకొన్న
గోనె సంచీ అయిపోతాది....

దేవుడినే ఓదార్చి,
వీధి దాకా సాగనంపిన కవికి కూడా
తెల్లారే సరికల్లా
స్వప్నం భళ్లుమంటూంది.
ముత్యం
భస్మం అయినట్లు.

బొల్లోజు బాబా




9 comments:

  1. అవును,
    నేనూ కంటున్నాను శిరచ్చేదిత స్వప్నాలని.
    అవును,
    నేనూ కంటున్నాను వర్ణం లేని రంగుల స్వప్నాలని.
    అవును,
    నేనూ కంటున్నాను చితాభస్మం పూసుకొన్న స్వప్నాలని,

    మాష్టారు, భశ్మం కాదేమో, భస్మం అనుకొంటా (i'm also not sure) :-).

    ReplyDelete
  2. ప్రతాప్ గారూ
    థాంక్యూ. సవరించాను.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  3. మీ రచనలు చాలా బాగున్నయీ.మీరు ఏదుటవారి కామేంట్స్ని స్వికరించడమె కాకుండ వారికి మల్లి సమాధానములు పంపడం నాకు నచ్చింది.నా బ్లాగర్ ఐడి పంపుతున్నాను.మీ అభిప్రాయాలను పంపించండి.http://sreesatya.blogspot.com/
    ధన్యవాదములు....

    ReplyDelete
  4. దేవుడినే ఓదార్చి,
    వీధి దాకా సాగనంపిన కవికి కూడా
    తెల్లారే సరికల్లా
    స్వప్నం భళ్లుమంటూంది.
    ముత్యం భస్మం అయినట్లు.

    చాలా బాగుంది బాబా గారు. మంచి అర్ధం ఉంది ఇందులో, అంతా భ్రమే అని చెప్పేరా లేకా అంతా కలే అన్నారా? 'భ్రమ' కి 'కల' కి తేడా ఎంటండీ?

    ReplyDelete
  5. బావుంది బాబా....గోనెసంచి (అయిపోతాది)కొంచెం యాసనిపించింది....

    ReplyDelete
  6. బాగుంది బాబా గారు.

    ReplyDelete
  7. Good one.
    @Ramani - that's a reference to a poem by Devarakonda Balagangadhara Tilak.

    ReplyDelete
  8. ప్రతాప్ గారూ
    మీ పాదాలు చాలా బాగున్నాయి. మీ సూచన కు చాలా థాంక్స్. సవరించాను.

    ఒరెమునా గారికి
    థాంక్సండి.

    శ్రీసత్య
    మీ అభిమానానికి థాంక్స్.

    రమణి గారికి
    కొత్తపాళీ గారు చెప్పినట్లు ఇది తిలక్ కవితకు రిఫరెన్స్ అండి. దానిలో జరుగుతున్న పరిణామాలపై చించిస్తున్న దేముడు కవివద్దకు వచ్చినపుడు, కవి ఆయన్ను ఓదార్చి, " పాపం పెద్దాయన, కన్నబిడ్డలే కత్తులు దూసుకొంటుంటే, కడుపు తీపి! ఏమిచేయగలడు? " అంటూ జాలిప్రకటించి, వీధి వరకూ సాగనంపుతాడు.

    ఆధునిక తెలుగు సాహిత్యం లో ఇంతకు మించి కరుణార్ధ్ర భరితంగా, సామాజిక స్పృహను ఆవిష్కరించిన కవితను నేనింత వరకు చదవలేదు.

    భ్రమకూ కలకూ తేడా నేను చెప్పగలనా? ప్రయత్నిస్తాను. కల నీడ అనుకుంటే, బ్రమ అనేది నీడకు నీడ లాంటిది. ఏదీ వాస్తవాలు కావు. రెంటిలో కలకు కొంత అస్థిత్వమైనా ఉంటుంది. బ్రమ కు అది కూడా ఉండదు. బ్రమ అనే పదాన్ని నెగటివ్ షేడ్స్ కి వాడతారు.

    భగవాన్ గారూ
    నిజమే గమనించలేదు. మారుస్తాను. నిజానికి అదే వాక్యం మన యాస లో అయితే " గోన్సంచీ ఐపోద్ది"

    చైతన్య గారూ
    థాంక్సండీ

    కొత్త పాళీ గారు
    థాంక్సండీ.
    ఇది చాలా కాలం క్ర్తతం వ్రాసిన అసంపూర్ణ కవిత. ఆఖరి చరణాన్ని కలిపి పోస్ట్ చేసాను. గమనిస్తే కవిత గమనంలోని టెంపో లో తేడా గుర్తించవచ్చు.

    బొల్లోజు బాబా

    ReplyDelete