Friday, September 5, 2025

ఫ్రెంచి యానాం రాజకీయ చిత్రం

నా మూడవ పుస్తకం “ఫ్రెంచి పాలనలో యానాం” (2012).  యానాంలో ఫ్రెంచివారి కలోనియల్ చరిత్ర గురించి.  ఈ పుస్తకం ఫ్రెంచివారు ఈ నేలపై అడుగుపెట్టిన 1723 తో మొదలై, వారు విడిచివెళ్ళిన 1954 తో పూర్తవుతుంది.  ఆనాటి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలను ఈ పుస్తకం చర్చిస్తుంది.  ఈ క్రింది వ్యాసం ఆనాటి రాజకీయ చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది.  ఆనాటి నాయకులు, గ్రూపులు, ఎన్నికలు, కోర్టుకేసులు లాంటి అంశాల క్రోడీకరణ ఇది. ఇంతసమగ్రంగా వ్యాసం రావటానికి ఫ్రెంచి ప్రభుత్వ ఆర్చైవ్స్ కారణం. చరిత్రకు సంబంధించి చిన్న చిత్తుకాగితమైనా భద్రపరచిన వారి చారిత్రిక స్పృహ గొప్పది.  

ఈ వ్యాసంలో ఎంతమంది వ్యక్తులను ఉటంకించానో పునరుక్తులను మినహాయించి చెప్పు అని చాట్ జిపిటి ని అడిగితే 137 మంది అని లెక్కగట్టి లిస్టు ఇచ్చింది. వీరిలో ప్రారంభంలో 8 మంచి ఫ్రెంచ్ దేశస్థులు ఉన్నారు. మొత్తం మీద ఏడుమంది ముస్లిములు, నలుగురు బ్రాహ్మణులు, ఆరుగురు వైశ్యులు, ఆరుగురు దళితులు, ముగ్గురు బిసీలు ఉండటం మిగిలినవారందరూ కాపు సామాజిక వర్గానికి చెందటం ఉజ్జాయింపుగా గమనించవచ్చు. 

ఐరనీ ఏమిటంటే అప్పట్లోనే ముప్పై వేల రూపాయల వెచ్చించి ముద్రించిన ఈ పుస్తకాన్ని 137 మందికాదు కదా ఆ సంఖ్యలో సగం మంది కూడా యానాంలో కొనుక్కోలేదు.

బొల్లోజు బాబా


ఫ్రెంచి యానాం రాజకీయ చిత్రం

            యూరోపియన్‌లు భారతదేశాన్ని తమ కాలనీలుగా చేసుకోవటానికి మొదట్లో వారిని ఆకర్షించింది ‘పత్తి’ అంటే ఆశ్చర్యం కలుగక మానదు. పత్తి పంట యూరప్‌దేశాలలో ఉండదు.  వారి దుస్తులు ఊలు తో తయారయ్యేవి.  కాటన్‌ దుస్తులలో వారికి ‘ఉజ్జ్వలమైన వ్యాపార భవిష్యత్తు’ కనిపించింది.  ఇక్కడ తయారయ్యిన కాటన్‌ వస్త్రాలను యూరప్‌ మార్కెట్లకు తీసుకువెళ్ళి అధికధరలకు విక్రయించి విపరీతంగా  లాభాలార్జించటం మొదలుపెట్టారు.  తమ వ్యాపార స్థిరీకరణ కోసమని స్థానిక రాజులకు బహుమతులిచ్చి ‘మంచి’ చేసుకోవటం ద్వారా స్థానిక రాజకీయాలలో వేలు పెట్టటం మొదలెట్టారు.  ఈ జోక్యం ఎంతవరకూ వెళ్ళిందంటే ఇంగ్లీషు వారు ‘బ్రిటిష్‌ ఇండియా’ ను ఫ్రెంచివారు ‘ఫ్రెంచి ఇండియా’ ను నిర్మించేటంత వరకూ సాగింది. 

            ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్న రీతిలో ఇంగ్లీషువారు, ఫ్రెంచివారు  ఆధిపత్యం కోసం అనేక యుద్ధాలు చేసుకొన్నారు. డూప్లే కాలంలో ఫ్రెంచి వారిదే పైచేయి గా  ఉన్నప్పటికీ, చివరకు ఇంగ్లీషువారు వివిధ ఒప్పందాల ద్వారా వీరిని భారతదేశంలో పాండిచేరీ, మాహే, కారైకాల్‌, చంద్రనాగూర్‌, మచిలీపట్నం యానాం వంటి  ప్రాంతాలకు పరిమితం చేయగలిగారు. యానాం, మచిలీపట్నం వంటి ప్రాంతాల వల్ల ఫ్రెంచి ఇండియా ప్రభుత్వానికి ఒకానొక దశలో ఏవిధమైన ఆర్ధికలాభం లేకపోయినా వాటిని తమ ‘గౌరవచిహ్నాలు’ గా భావించుకొంది.  వీటిని వదిలించుకోవటం అంటే ఫ్రెంచి ఇండియా నిర్మాణ సమయంలో వేల సంఖ్యలో అసువులు బాసిన ఫ్రెంచిసైనికుల బలిదానానికి అర్ధం లేకుండా పోతుందని తలచింది.

           1701 లో జారీ చేసిన ఒక రాజశాసనం ద్వారా పాండిచేరీలోని గవర్నరుకు పరిపాలన విషయంలో ఫ్రాన్స్‌ ప్రభుత్వం సర్వాధికారాలు కట్టపెట్టింది. చాలా కాలంవరకూ గవర్నరే పాలనా వ్యవహారాలు నడిపించేవారు.

          ఫ్రెంచి గవర్నరుకు పరిపాలనా వ్యవహారాలలో సూచనలు ఇవ్వటానికని, 1790 లో 27 మంది పౌరులతో కూడిన ఒక జనరల్‌ అసెంబ్లీ ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఫ్రెంచి ఇండియాలో మొదటిసారిగా పరిపాలనలో పౌరుల భాగస్వామ్యం మొదలయ్యిందని చెప్పవచ్చును.  1791 జూలై 5 న పాండిచేరి ప్రజలు సమావేశమయి, ఆ సంఖ్యను 21 కి కుదించి ఆ కూటమికి ‘కలోనియల్‌ అసెంబ్లీ’ అని పేరు పెట్టారు.  వీరందరూ ఫ్రెంచి దేశస్థులే. ఈ 21 మందిలో 15 మంది పాండిచేరీ నుంచి, ముగ్గురు చంద్రనాగూరునుంచి, మాహే కారైకాల్‌ యానాంల నుంచి ఒక్కొక్కరు చొప్పున అభ్యర్ధులుండాలని నిర్ణయించారు.  ఇదే సమయంలో ఇతర ఫ్రెంచికాలనీలుగా ఉన్న సూరత్‌, కాలికట్‌, మచిలీపట్నం ల నుండి ప్రాతినిధ్యం లేకపోవటంతో వాటిని  యానానికి అనుసంధానం చేసారు.

          ఈ కలోనియల్‌ అసెంబ్లీకి యానాం నుంచి ఒక ప్రతినిధి ఉండేవాడు.  పాండిచేరీలో జరుగుతున్న ఈ రాజకీయ ప్రక్రియలపట్ల ఉత్తేజితులైన కొంతమంది యానాం పౌరులు ఇక్కడ కూడా ‘యానాం కలోనియల్‌ అసెంబ్లీ’ ని ఏర్పాటు చేసుకొన్నారు.  దీనికి Marietta ను ప్రెసిడెంటుగాను,  Pithois ను వైస్‌ ప్రెసిడెంటుగాను ఎన్నుకొన్నారు. 1791లో యానాం కలోనియల్‌ అసెంబ్లీ కి ‘యాక్టివ్‌ సిటిజెన్స్‌ అసెంబ్లీ’ గా పేరు మార్చారు.  ఈ అసెంబ్లీకి అప్పటి పెద్దొర సొన్నరెట్‌ కు మధ్య అనేక వివాదాలు నడిచాయి.  1793 లో ఫ్రెంచి కాలనీలను బ్రిటిష్‌ వారు ఆక్రమించుకోవటంతో ఈ మొత్తం వ్యవస్థ తుదిరూపు దిద్దుకోకముందే అదృశ్యమైపోయింది.  

స్థానికమండలి  మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆవిర్భావాలు

            ఆనాటి యానాం రాజకీయ చిత్రంలో రెండు వ్యవస్థలుండేవి.  నలుగురు సభ్యులతో ఉండే స్థానిక మండలి మరియు 12 మంది మెంబర్లతో ఉండే మున్సిపల్‌ కౌన్సిలు.  ఇంతమంది ఉన్నా వీరి పాత్ర పర్యవేక్షణకే తప్ప నిర్ణయాధికారాలు ఏమీ లేవు.  ట్రెజరీ, విద్యావ్యవస్థ, ప్రజాపనులు, పన్నులు, పోలీసు, వైద్యం, రవాణా వంటి వివిధ శాఖలకు సంబంధించిన విశిష్టాధికారాలు అన్నీ పెద్దొర చేతిలో ఉండేవి. ప్రజలచే ఎన్నుకొన్న ఈ మొత్తం 16 మంది ప్రతినిధుల పాత్ర సలహాలు, సంప్రదింపులకే పరిమితం.

            25 జనవరి, 1871 న ఫ్రెంచి ప్రభుత్వం జారీ చేసిన ఒక డిక్రీ కి అనుగుణంగా యానాంలో స్థానిక మండలి (Local Council) ఏర్పాటు జరిగింది. దీనిలో నలుగురు మెంబర్లు మరియు వారినుంచి ఒక అధ్యక్ష్యుడు ఉంటారు. 21 సంవత్సరములు దాటిన పౌరులు ఈ మెంబర్లను ఎన్నుకొంటారు. ఈ నలుగురిలో ఒకరు పాండిచేరీలో కల జనరల్‌ కౌన్సిల్‌కు యానాం తరపు మెంబరుగా పంపబడేవాడు.  28 మంది సభ్యులుండే పాండిచేరీ జనరల్‌ కౌన్సిల్‌ తరపున ఫ్రాన్స్‌ లోని ఫ్రెంచి సెనేట్‌ కు ఒక ప్రతినిధిని పంపించేవారు. ఇదీ అప్పటి రాజకీయ వ్యవస్థ.

        1880 లో ఫ్రెంచి ప్రభుత్వం మరో డిక్రీ ద్వారా స్థానిక పరిపాలన కొరకు మున్సిపాలిటీలను ఏర్పాటుచేసింది. ఆ విధంగా 1880 మార్చి, 12 న యానాం మున్సిపాలిటి  పన్నెండు వార్డులతో ఏర్పడిరది.  ఈ పన్నెండు వార్డులకు సాధారణ ఎన్నికల ద్వారా 12  మంది మెంబర్లు ఎన్నికవుతారు.  వీరిలో ఒకరు మేయర్‌ గా ఎన్నిక కాబడి స్థానిక పరిపాలనను పర్యవేక్షిస్తాడు.

స్థానికమండలి మొదటి ఎలక్షన్లు

            భారతదేశానికి ప్రజాస్వామ్యపు తొలిరోజులవి.  1872 లో 21 సంవత్సరములు నిండిన అర్హత కలిగిన 1394 మందితో కూడిన యానాం ఓటర్ల లిస్టు తయారయ్యింది.  ఫ్రెంచి దేశస్థులకు, భారతీయులకు విడివిడిగా ఓటరు లిస్టులుండేవి.  ఆనాటి యానాంలో అతికొద్ది సంఖ్యలో ఫ్రెంచి దేశస్థులున్నప్పటికీ స్థానిక మండలిలో వారి ప్రాతినిధ్యానికేమీ లోటులేకుండా చూసుకొనేవారు.

                  1872 లో యానాంలో ప్రప్రథమంగా స్థానిక మండలి ఎలక్షన్లు జరిగాయి. ప్రజలకు  ఎలక్షన్ల పట్ల ఏ మాత్రమూ అవగాహన లేని కారణంగా అభ్యర్ధులను పోటీ చేయమని బ్రతిమాలవలసి వచ్చిందట. ఈ ఎన్నికలలో కవల వెంకట చలపతి, పైడికొండల కృష్ణయ్య నాయుడు, కంతేటి సత్యప్రసన్నం, డకోస్టా జార్జ్‌స్‌ అనే నలుగురు మెంబర్లతో అప్పటి పెద్దొర Bayot అధ్యక్షతన యానాంలో మొదటి స్థానిక మండలి ఏర్పడిరది. 1878 లో కవల వెంకటసుబ్బారాయుడు, పైడికొండల కృష్ణయ్యనాయుడు, డకోస్టా జార్జ్‌స్‌ ల స్థానాలలో సమతం వెంకట సుబ్బారాయుడు, కొమండూరి జియన్న, పైడికొండల సుబ్బారాయుడులు ఎన్నికయ్యారు.  ఆ తరువాత కొమండూరి జియన్న స్థానంలో బెజవాడ బాపనయ్య నాయుడు ఎన్నికయి కొంతకాలం స్థానిక మండలి అధ్యక్ష్యునిగా పనిచేసారు.

            1879`1884 లలో యానాం నుంచి Le Faucheur మరియు పైడికొండల సుబ్బారాయుడులు పాండిచేరీలోని జనరల్‌ కౌన్సిల్‌ కు పంపించబడ్డారు.  1884 లో లె ఫాషర్‌ స్థానాన్ని బెజవాడ బాపనయ్య నాయుడు కైవసం చేసుకొన్నారు.

మున్సిపల్‌ కౌన్సిల్‌ మొదటి ఎలక్షన్లు

            1880 మార్చి లో జరిగిన యానాం ప్రథమ మున్సిపల్‌ ఎన్నికలలో బెజవాడ బాపనయ్యనాయుడు విజయ ఢంకా మోగించారు.  కంతేటి సత్యప్రసన్నం, పైడికొండల కృష్ణయ్య,  కసిరెడ్డి బ్రహ్మానందం, కోన నరసయ్య, సిదరాల సన్యాసయ్య, అబ్దుల రెహ్మాన్‌, కసిరెడ్డి తిమ్మన్న, ఎర్రంశెట్టి వెంకట రామయ్య, Pharamond లు మెంబర్లుగా ఎన్నికయ్యారు.

వివిధ సార్వత్రిక ఎన్నికలు ` గెలుపోటములు

        బెజవాడ బాపనయ్యనాయుడు అశేషప్రజల అభిమానం చూరగొన్నప్పటికీ, ఆయనకు 25 సంవత్సరములు నిండని కారణంగా మేయర్‌ పదవికి అనర్హుడంటూ ప్రత్యర్ధులైన పైడికొండల సుబ్బారాయుడు, కామిశెట్టి పేరమనాయుడులు చేసిన అభియోగాలు  ­జువు కావటంతో ఆయన ఎన్నిక చెల్లదంటూ యానాం కోర్టు తీర్పుచెప్పింది.  దరిమిలా యానాంలో మరలా మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి.

            1883 ఎలక్షన్లలో పైడికొండల సుబ్బయ్య మేయర్‌ గా విజయం సాధించారు. Pharamond బెజవాడ బాపనయ్యనాయుడు, సిదరాల సన్యాసయ్య, కసిరెడ్డి బ్రహ్మానందం, వర్ధినీడి కొండలనాయుడు, సమతం వెంకటసుబ్బారాయుడు, అబ్దుల్‌ రెహ్మాన్‌Kerjean Theophile  లు మెంబర్లు గా ఎన్నికయ్యారు.  బెజవాడ బాపనయ్యనాయుడు 1885 లో మేయరు పదవిని తిరిగి దక్కించుకొన్నారు.  పైడికొండల సుబ్బయ్య 1886 లో చనిపోవటాన్ని బట్టి ఆయన బహుసా అనారోగ్యకారణాల వల్ల 1885లోనే మేయరు పదవినుంచి వైదొలగి    ఉండవచ్చు. బెజవాడ బాపనయ్యనాయుడు కౌన్సిల్‌ లో విజే  (చెళ్ళపిల్ల వారు తాను యానాంలో చదువుకొనేటపుడు, విజే అనే ఒక టీచర్‌ ఉండేవారు అని చెప్పింది వీరి గురించే)  కాళ్ళ రాయపురాజు అనే ఇద్దరు కొత్త మెంబర్లు చేరారు. 

               సమతం వెంకటసుబ్బారాయుడు 1886 లో కొంతకాలం మేయర్‌ పదవి అధిష్టించారు.

            వీరినుంచి మరలా బెజవాడ బాపనయ్యనాయుడు అదే సంవత్సరంలోనే మేయర్‌ పదవిని స్వీకరించి 1890 డిశంబరు 19 న జరిగిన స్థానిక కౌన్సిల్‌ కు మొదటి మెంబరుగా ఎన్నికయ్యేవరకూ కొనసాగారు. ఈ ఎన్నికలలో ఆనాటి యానాం మొత్తం ఓటర్లు 1103 లో 715 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.  బెజవాడ బాపనయ్య 429 ఓట్లను సంపాదించుకొని విజయం సాధించారు.  ఇదే ఎలక్షన్లలో పుణ్యమూర్తుల వెంకటసుబ్బారాయుడు కూడా విజయం సాధించి రెండవమెంబరు స్థానాన్ని కైవశంచేసుకొన్నారు.

            1891 లో జరిగిన ఎలక్షన్లలో కోన నరసయ్య మేయరు గా, పుణ్యమూర్తుల వెంకటసుబ్బారాయుడు, బెజవాడ బాపనయ్యనాయుడు, కాళ్ల రాయపురాజు, సమతం కృష్ణయ్య, వెలగలపూడి లింగయ్య, కాపగంటి చినసారయ్య, కూనపురెడ్డి కృష్ణ, గిరి సుబ్బారాయుడు, సాత్తార్‌ సాహెబ్‌, వంకాయల వీరన్న, వంటెద్దు వెంకటస్వామి లు మెంబర్లుగాను ఎన్నికయ్యారు.

         వీరిలో కూనపురెడ్డి కృష్ణమ, సత్తర్‌ సాహెబ్‌ లు గతించటం వలన మరియు వంకాయల వీరన్న రాజీనామా చేయటంతో ఖాళీలను బర్తీచేయటానికి 1892, డిశంబరు 4 న మధ్యంతర ఎన్నికలు జరిగాయి.  మొత్తం 1115 ఓటర్లకు గాను 382 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకోవటం గమనార్హం.  కొల్లూరి భీమయ్య, కశిరెడ్డి వెంకయ్య, బళ్ళ లక్ష్మయ్య లు కొత్త మెంబర్లుగా ఎన్నికయ్యారు.

            1894 లో బెజవాడ బాపనయ్య నాయుడు మేయర్‌ పదవి దక్కించుకొని చాలాకాలం కొనసాగారు.  1899 ఎలక్షన్లలో బెజవాడ బాపనయ్యనాయుడు తన మేయర్‌ పదవిని నిలబెట్టుకొన్నారు.        

          1903నాటి యానాం మున్సిపల్‌ కౌన్సిల్‌ కు మేయరుగా బెజవాడ బాపనయ్య నాయుడు, సమతం వెంకట సుబ్బారాయుడు, కోన సత్తియ్య, ఇబ్రహిం ఖాన్‌, కాపగంటి సత్తిరాజు, కూనపురెడ్డి సుబ్బారాయుడు, కోన కృష్ణ, బళ్ళా వెంకట రత్నం, పుణ్యమూర్తుల వెంకట సుబ్బారాయుడు, వంటెద్దు వెంకట స్వామి లు మెంబర్లుగాను ఉన్నారు.

             1912 లో అప్పటి మేయరయిన సమతం వెంకటసుబ్బారాయుడు అనారోగ్యకారణాలతో పదవినుండి వైదొలగడంతో ఆయన కుమారుడు సమతం లక్ష్మీనర్సయ్య మేయర్‌ పదవిని పొందారు.

        బెజవాడ బాపనయ్యనాయుడు 1914 లో తాను చనిపోయేవరకూ యానాం కౌన్సిల్‌ మెంబరుగా కొనసాగారు. ఆయన మరణంతో వారి కుమార్డు బెజవాడ వెంకటరెడ్డి రాజకీయాలలో ప్రవేశించారు.  వీరు పిన్నవయసులో చనిపోవటంచే వీరి కుమారుడు బెజవాడ బాపన్నాయుడు (తాత గారి పేరు) ప్రవేశించి 1922 లో మున్సిపల్‌ మెంబరుగా ఎన్నికయ్యారు.

           1922 లో కామిశెట్టి అయ్యప్పనాయుడు మేయరు పదవి దక్కించుకొన్నారు.  1881 నుంచి  కామిశెట్టి పేరమనాయుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. వీరి కుమార్డు కామిశెట్టి వేణుగోపాలరావునాయుడు 1922 ఎలక్షన్లలో స్థానిక మండలి మెంబరుగా ఎన్నికయ్యారు. 

      1925 లో కాపగంటి మంగయ్య, ఇబ్రహిం ఖాన్‌, కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు, కాళ్ళ వెంకటరత్నం లు స్థానిక మండలి మెంబర్లుగా ఉన్నారు.  ఇదే సమయంలో బెజవాడ బాపన్నాయుడు మున్సిపల్‌ మేయర్‌ గాను, కొత్త వెంకటరత్నం, మాజేటి సోమరాజు, కాపగంటి సత్తిరాజు, సమతం లక్ష్మీనరసయ్య, గిరిమాధవరావు, దవులూరి చినవీరాస్వామి, కనకాల బ్రాహ్మడు, కోన వెంకటరాజు, ఉడతా రెడ్డినాయుడు, సాదనాల వెంకన్నలు మెంబర్లుగాను ఉన్నారు.

        1925 ఎన్నికలలో పరాజయం పాలయిన అభ్యర్ధులలో కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు, ఎర్రా జగన్నాథరావు, వెలగలపూడి వీరయ్య, మహమ్మద్‌ ఉస్మాన్‌, నాగసూరి కామరాజు, కనకాల చిన నరసయ్య, తిక్కిరెడ్డి సత్యానందం తదితరులు ఉన్నారు. 1930 లో మహమ్మద్‌ ఉస్మాన్‌ స్థానంలో బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రులు వచ్చి చేరారు.

            పాండిచేరి నాయకులకు యానాం నాయకులకు మధ్య సత్సంబంధాలు ఉండేవి. 1928 లో బెజవాడ బాపన్నాయుడు పాండిచేరి కి చెందిన సెల్వరాజు చెట్టియార్‌ ను యానాం నుంచి పోటీ చేయించి, గెలిపించి పాండిచేరి కౌన్సిల్‌ కు పంపించటం జరిగింది. 

           1931 లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలో కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు మేయర్‌ పదవిని దక్కించుకొన్నారు.  తోట రామన్న, నాగసూరి వెంకటరాజు, చిక్కాల  సీతయ్య, తిక్కిరెడ్డి సత్యానందం, షేక్‌ అహ్మద్‌, కొమ్మిరెడ్డి రామన్న, కొత్త వెంకట రత్నం, బెజవాడ బాపన్నాయుడు, కనకాల బ్రాహ్మడు, కోన వెంకట రాజులు విజయం సాధించారు.

            1934 లో మరలా జరిగిన ఎన్నికలలో కామిశెట్టి వేణుగోపాలరావునాయుడు బృందం ఘనవిజయం సాధించింది.  బెజవాడ బాపన్నాయుడుకు కుడిభుజమైన సమతం లక్ష్మీనరసయ్య 1933 లో మరణించటంతో ఆయన ఒంటరిపోరు సలపవలసి వచ్చింది.  ఈ ఎలక్షన్లలో తోట నరసింహస్వామి, కోన సుబ్బారావు, చింతా బ్రహ్మానందం, చిక్కాల సూర్యనారాయణ, కామిరెడ్డి వెంకటస్వామి, కుంచం రావి వంటి కొత్త నాయకులు మున్సిపల్‌ మెంబర్లుగా తెరపైకి వచ్చారు.

ప్రతిపక్షాల ఐక్యత

       1931 నుంచి కామిశెట్టి వేణుగోపాలరావునాయుడు వర్గం రాజకీయంగా రోజు రోజుకూ బలపడుతూండటంతో, ప్రతిపక్షాలు ఒకానొక దశలో ఏమీచేయలేక నిస్సహాయులైపోవలసి వచ్చింది. రాజకీయాలలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. అధికారాన్ని అనుభవిస్తున్న కామిశెట్టి ఈ సమయంలో అనేక ఆరోపణలను ఎదుర్కోవలసివచ్చింది.  అంతవరకూ బెజవాడ వర్గంలో ప్రధాన పాత్రవహించిన తోట రామన్న వంటి వారు కామిశెట్టి పక్షాన చేరిపోయారు. 1935 లో జరిగిన కౌన్సిల్‌ ఎన్నికలలో బెజవాడ వర్గం తరపున పోటీ చేసిన మద్దింశెట్టి సత్యనారాయణ (ఫ్రెంచి టీచరు) అయిదు ఓట్లు మాత్రమే పొందగలిగారు.  బెజవాడ బాపన్నాయుడు కూడా ఈ ఎన్నికలలో పోటీచేయగా ఆయనకు కూడా అయిదు ఓట్లు మాత్రమే రావటం, ఆయన ప్రత్యర్ధికి 587 ఓట్లు రావటం అనేది కామిశెట్టి వర్గం ఆధిపత్యాన్ని తెలియచేస్తుంది. ఈ ఎన్నికలలో భారీస్థాయిలో రిగ్గింగు జరిగిందని బెజవాడ బాపన్నాయుడు వేసిన కోర్టు కేసు కొట్టివేయబడిరది. 

            ఈ సమయంలో కామిశెట్టి వ్యతిరేక వర్గం చేతులుముడుచుకొని కూర్చోక అధికార పక్షం కనుసన్నల్లో జరిగే అనేక అవకతవకలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేది.

            అప్పటికి 17 నెలలుగా వెల్ఫేర్‌ కమిటీ నెల నెలా ఇచ్చే ప్రభుత్వ పించనులను  పంపిణీ చేయటం లేదని ఆ సొమ్ము స్వాహా అయిపోతున్నదని, పించనులు అందక లబ్దిదారులు బిక్షాటన చేసుకొంటున్నారని, కొంతమంది ఆకలితో చచ్చిపోయారంటూ` ప్రతిపక్షం పాండిచేరీకి పిర్యాదులు చేసింది.

          అప్పటి యానాం అడ్మినిస్ట్రేటరు అయిన జీవరత్నం, కామిశెట్టికి కొమ్ముకాస్తూ ప్రతిపక్షానికి చెందిన వారిపై అక్రమకేసులు బనాయించి వేధిస్తున్నారని బెజవాడ వర్గం ఆరోపించింది. బెజవాడ అనుచరుడైన దున్నా కమలనాభం ఇంటిపై కామిశెట్టి వర్గానికి చెందిన వారు దాడిచేసి ఆయనను, కుటుంబసభ్యులను గాయపరచారని తెలిపారు.

             కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడుకి ఫ్రెంచి రాదు కనుక ఆయన మేయర్‌ పదవికి అనర్హుడంటూ కోర్టులో కేసు వేయటం జరిగింది.

           కామిశెట్టి ఆర్ధిక పరిస్థితి అంత బాగాలేని కారణంగా (453 రూపాయిల బాకీ చెల్లించని కారణంగా ఇంటిలోని వస్తువులను జప్తు చేయటం జరిగింది) పదివేల రూపాయిల మున్సిపల్‌ బడ్జెట్టును నిర్వహించే అర్హత అతనికి లేదని కూడా పిర్యాదు చేసారు.

            యానాం నుంచి పదే పదే వస్తున్న పిర్యాదుల నేపధ్యంలో, విచారణ జరపమని పాండిచేరీ కోర్టు జడ్జి వీతీ. Mr. Philippon, ఇన్‌స్పెక్టర్‌ బసవా సుబ్బారాయుడు లను  ఫ్రెంచి ప్రభుత్వం నియమించి డిశంబరు 1933 లో యానాం పంపించింది. వీరి విచారణలో ఈ అవకతవకలకు, ఘర్షణలకు కారణం అడ్మినిస్ట్రేటర్‌ జీవరత్నమని తేల్చటంతో, జీవరత్నాన్ని బదిలీచేసి కొమరన్‌ ను యానాం అడ్మినిస్ట్రేటర్‌గా నియమించటం జరిగింది.

             ఇలాంటి ఉద్రిక్త రాజకీయపరిస్థితుల నడుమ జనవరి 1935 లో  ఫ్రెంచి గవర్నరు యానాం పర్యటనకు వచ్చారు. ఆయన గౌరవార్ధం మేయర్‌ హోదాలో కామిశెట్టి ఇచ్చిన విందుకు, బెజవాడ వర్గానికి చెందిన కౌన్సిల్‌ మెంబర్లను ఎవరినీ ఆహ్వానించలేదు. దీనికి ప్రతిచర్యగా బెజవాడ బాపన్నాయుడు తన ఇంటివద్ద ఒక  రీడిరగ్‌ రూమ్‌ శంఖుస్థాపన కొరకు గవర్నరుగారిని ఆహ్వానించి ఆయననే తన ఇంటికి రప్పించుకొన్నారు. కామిశెట్టితో విభేదించి బయటకు వచ్చేసిన యర్రా జగన్నాధరావు, గవర్నరుగారిని కలసి మేయరు పాలనలో జరుగుతున్న అవకతవకల గురించి పిర్యాదు చేసారు.

            ఇదే సమయంలో యర్రా జగన్నాధరావు ఆధ్వర్యంలో ఒక గొప్ప విందు జరిగింది.  కామిశెట్టి వ్యతిరేక వర్గం చేసిన ఒక రకమైన బలప్రదర్శనగా ఈ విందు నిలచింది.  దీనికి యానానికి చెందిన అనేకమంది ఆనాటి ప్రముఖులు హాజరయ్యారు. అలా హాజరయిన వారిలో ` బెజవాడ  బాపనయ్య, ఇబ్రహిం ఖాన్‌, కాపగంటి సత్తిరాజు, నల్లం సుబ్బారావు, మహేంద్రవాడ వీరగణపతి శాస్త్రులు, కశిరెడ్డి వెంకటరామయ్య, దవులూరి చిన వీరాస్వామి, దున్నా కమలనాభం, సమతం గోపాలం, పంపన వీరాస్వామి, నల్లం సత్యనారాయణ, మద్దింశెట్టి సత్తిరాజు, దవులూరి రాజారావు, గల్లా శ్రీనివాసులు, మొహమ్మద్‌ ఉస్మాన్‌, తోట నరశింహస్వామి, గిరి మాధవరావునాయుడు, దవులూరి వెంకటరాజు, మొహమ్మద్‌ జిక్రియా, మలిపెద్ది అంకయ్య, గిరి లక్ష్మినారాయణ, మద్దింశెట్టి సత్యనారాయణ మూర్తి, మద్దింశెట్టి బాపన్న తదితరులు ఉన్నారు. (ఇరవయ్యవ శతాబ్దంలో ఫ్రెంచియానాంలో పేర్గాంచిన వ్యక్తులను గూర్చి తెలుసుకొటానికి ఉపయోగ పడుతుందని మొత్తం లిస్టు ఇవ్వటం జరిగింది` రచయత)

యానాం రాజకీయచిత్రాన్ని మార్చివేసిన కలయిక

            ఆనాటి యానాం నాయకులు పాండిచేరీలో ప్రధాన పాత్రవహించే కూటములకు మద్దతు పలికేవారు. ఆ విధంగా బెజవాడ బాపన్నాయుడు వర్గం పాండిచేరీలోని సెల్వరాజు చెట్టియార్‌ పక్షానికి మద్దతు ఇచ్చేది.  ఒకానొక సందర్భంలో సెల్వరాజు ను యానాంనుంచి గెలిపించటం కూడా జరిగింది.  కామిశెట్టి వర్గం పాండిచేరీలోని జోసఫ్‌ డేవిడ్‌ పక్షాన నిలచేది.  అలా  యానాంలోని రెండు వర్గాలకు వారివారి గాడ్‌ఫాదర్ల ఆశీస్సులు, అండదండలు ఉండేవి.  1936 లో పాండిచేరిలో  రాజకీయాలలో జరిగిన నాటకీయపరిణామాల వల్ల సెల్వరాజ చెట్టియార్‌, జోసఫ్‌ డేవిడ్‌ లు ఒకటైపోయారు.  అందుచేత దాదాపు అరవై సంవత్సరాలుగా రెండు వర్గాలుగా విడిపోయి యానాం రాజకీయాల్ని నిర్ధేశిస్తూ ఉన్న బెజవాడ, కామిశెట్టి లు కలిసి పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడిరది.

          ఆ విధంగా వీరిరువురూ కలిసి 1937 ఎలక్షన్లలో పోటీ చేసి విజయకేతనం ఎగరేసారు.  వీరికి ప్రతిపక్షంగా ఎర్రా జగన్నాధరావు, తోట నరసింహమూర్తి, సమతం కృష్ణయ్య, నాగసూరి వెంకటరాజులు పనిచేసారు.

            భిన్న పక్షాలు చేరి కూటమి కట్టినపుడు, ఒక దానిని మరొకటి మింగివేయటమనేది రాజకీయాలలో ఒక సహజపరిణామం.  కామిశెట్టి వర్గం యానాం రాజకీయాలలో ఆ తరువాత కాలంలో మరో అర్ధశతాబ్దం పాటు ఏక ఛత్రాధిపత్యంగా కొనసాగటం  ఆ మాటను నిజం చేసింది.

మున్సిపల్‌ కమిషన్‌ పాలన

            1937 ఎలక్షన్లలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావటంతో, ఫ్రెంచి ప్రభుత్వం 1938 లో ఈ ఎన్నికలను రద్దు చేసి, మున్సిపల్‌ కౌన్సిల్‌ స్థానంలో మున్సిపల్‌ కమిషన్‌ ను ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షునిగా మారిపళన్‌ ను, ఉపాధ్యక్ష్యునిగా  ఎర్రా జగన్నాథరావును నియమించింది. ఈ కమిషన్‌ మెంబర్లు గా కోన వెంకటరాజు, మలిపెద్ది అంకయ్య, కామిశెట్టి అయ్యప్పనాయుడు, శింగంశెట్టి కామరాజు లు వ్యవహరించారు. కొంత కాలానికి శింగంశెట్టి కామరాజు స్థానంలో ఉడతా సాంబశివరావు నియమితులయ్యారు. 1938 నుంచి 1946 లో మున్సిపల్‌ ఎన్నికలు జరిగే వరకూ యానాం మున్సిపల్‌ పరిపాలనా వ్యవహారాలను ఈ మున్సిపల్‌ కమిషనే చూసింది.

మరలా ఎన్నికలు

            ఫ్రెంచి ఇండియా ఎన్నికలకు రెండు రకాల వోటరు జాబితాలు ఉండేవి. ఒకటి ఫ్రెంచి దేశస్థులకొరకు మరొకటి భారతీయుల కొరకు. 1946 లో జరిగిన ఎన్నికలకు ఈ పద్దతికి స్వస్థి పలికి మొత్తం ఓటర్లందరినీ ఒకే జాబితా క్రిందకు తీసుకువచ్చారు. (యానాంలో ఫ్రెంచి దేశస్థుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల వారికోసం ప్రత్యేక జాబితా తయారుచేయటం 1899 లోనే నిలిపివేసారు). 1946 జూన్‌ 23 న జరిగిన మున్సిపల్‌ ఎలక్షన్లలో ఎర్రా జగన్నాధరావు మేయరుగా ఎన్నికయ్యారు. వీరి పానెల్‌లో గిరి మాధవరావు, అబ్దుల్‌ వహీద్‌ ఖాన్‌, దవులూరి వెంకటరాజు, తోట వెంకట వేణుగోపాలరావు, కాపగంటి సూర్యప్రకాశ రావు, నాటి చినవెంకన్న  కామిశెట్టి భాష్యకారులు నాయుడు తదితరులు ఉన్నారు. వీరికి ప్రత్యర్ధులుగా కసిరెడ్డి బ్రహ్మానందం, కామిశెట్టి పరశురామరావు నాయుడు, మద్దింశెట్టి సత్యానందం, కాపగంటి బులిమంగరాజు, గుర్రపు వెంకటరత్నం, రొక్కం వెంకటరెడ్డి వంటి ప్రముఖులు ఉండేవారు. 

            ఈ ఎలక్షన్లలో పోటీచేసి విజయం సాధించిన కామిశెట్టి పరశురాంకు 25 సంవత్సరములు నిండని కారణంగా ఆయన ఎన్నికను యానాం కోర్డు రద్దు చేసింది.  అదే విధంగా మద్దింశెట్టి సత్యానందం పేరు ఓటర్ల లిస్టులో లేని కారణంగా ఆయన ఎన్నిక కూడా చెల్లదని తీర్పుచెప్పింది.  ఇవే కాక ఈ ఎన్నికలలో అనేక అవకతవకలు జరిగినట్లు నిరూపణ కావటంతో, 1946 ఆగస్టు 12 నాటి ఈ ఎన్నికలను రద్దు పరుస్తూ యానాం కోర్టు తీర్పు చెప్పింది.

            1948 లో జరిగిన మున్సిపల్‌ ఎలక్షన్లలో కామిశెట్టి పరశురాం బృందం విజయం సాధించి, ఆయన మేయర్‌ పదవి దక్కించుకొన్నారు.  చింతా బ్రహ్మానందం, ఉడతా సాంబశివరావు, కాపగంటి బులిమంగరాజు, వెలగలపూడి వీరయ్య, అబ్దుల్‌ వహీద్‌ ఖాన్‌, కోటి సత్యం, మోకా మహలక్ష్మి, రొక్కం వెంకటరెడ్డి, కోన నరసయ్య, కనకాల తాతయ్య,  యర్రా సత్యనారాయణమూర్తి  లు (యర్రా జగన్నాథరావు కుమార్డు) మెంబర్లు  గా నెగ్గారు.  యానాం రాజకీయ చరిత్రలో ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి, ఎందుకంటే, ఈ ఎన్నికలు ప్రధానంగా ఫ్రెంచి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగాయి.  కామిశెట్టి వర్గం ఫ్రెంచి అనుకూల ధోరణి కలిగిన రిపబ్లిక్‌ పార్టీ తరపున, యర్రా వర్గం ఫ్రెంచి వ్యతిరేక ధోరణి కలిగిన ప్రజా పార్టీ తరపున పోటీ చేసింది.  వీటిలో కామిశెట్టి వర్గం అఖండ విజయం సాధించటంతో యానాం ప్రజలందరూ ఫ్రెంచి పాలనకు అనుకూలమని ఫ్రెంచి ప్రభుత్వం తలచింది.  ఈ ఎలక్షన్లలో భారీఎత్తున రిగ్గింగు జరిగిందన్న ఆరోపణల కారణంగా ప్రభుత్వం ఈ ఎన్నికలను కూడా రద్దు చేసింది.

అంతర్జాతీయ పరిశీలనా బృందం`యానాం పర్యటన

            బ్రిటిష్‌ వారు భారతదేశం నుండి నిష్క్రమించటంతో ఫ్రెంచి వారిపై ఒత్తిడి పెరిగింది.  వీరు కూడా భారతదేశాన్ని విడిచిపెట్టి వెళిపోవాలన్న డిమాండ్‌ ప్రాధాన్యత సంతరించుకొంది. మరో వర్గం ఫ్రెంచి వారికి అనుకూలంగా ఉంటూ వారు భారతదేశం నుండి వైదొలగరాదని  కోరేది. ఇలాంటి పరిస్థితుల నడుమ 1947 లో ఫ్రెంచి ప్రభుత్వం తన కాలనీలకు, సముద్రానికి ఆవలనున్న ఫ్రాన్స్‌ యొక్క భూభాగం అనే అర్ధం వచ్చెలా ‘ఫ్రెంచి ఓవర్‌ సీస్‌ టెరిటరీస్‌’  అని నామకరణం చేసింది. ఇలా చేయటం ద్వారా ఈ కాలనీలన్నీ ఫ్రాన్స్‌ అంతర్భాగాలని ప్రపంచానికి చెప్పటానికి ప్రయత్నించింది. ఫ్రెంచి కాలనీలు భారతదేశంలో విలీనం కావాలంటే 1948 లో చేసుకొన్న భారత్‌`ఫ్రెంచి ఒప్పందం ప్రకారం ప్రజలందరూ పాల్గొనే సాధారణ ఎన్నికల ద్వారా ‘రిఫరెండం’ జరగాలి. ఇట్టి రిఫరెండపు ఎన్నికలలో ఎప్పటిలానే రిగ్గింగులు, బెదిరింపులు ఉన్నట్లయితే ఆ విధంగా వచ్చే ఫలితం ఫ్రెంచివారికి అనుకూలంగా ఉండవచ్చుననే అనుమానాలు తలెత్తాయి. అందువల్ల రిఫరెండం జరపటానికి తగిన పరిస్థితులు ఈ ఫ్రెంచికాలనీలలో లేవని భారత్‌ అంతర్జాతీయంగా తన నిరసనను తెలియచేసింది.

            భారతదేశంలో ఫ్రెంచికాలనీలలో రిఫరెండం జరపటానికి తగిన పరిస్థితులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని అధ్యయనం చేయటానికి 5 సభ్యులున్న అంతర్జాతీయ బృందం మార్చి 1951 లో పాండిచేరీలో అడుగు పెట్టింది. భారతదేశం ఈ బృందానికి అభ్యంతరం చెప్పకపోయినా ఈ బృందం ఇచ్చే రిపోర్టుకు కట్టుపడనని ముందే చెప్పేసింది. ఈ బృందంలో ఒకరైన ఆండ్రసన్‌ ఏప్రిల్‌ లో రెండురోజులపాటు యానాంలో బసచేసి విచారణ చేపట్టాడు.  ఈయన  కామిశెట్టి, మద్దింశెట్టి, గిరి మాధవరావునాయుడు, దవుళూరి వెంకటరాజు, మహమ్మద్‌ జిక్రియా వంటి వారితో భేటీ అయి యానాం ఆర్ధిక రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకొన్నాడు. 1948 ఎన్నికల సమయంలో జరిగిన అవకతవకల గురించి సమాచారం అడిగి తెలుసుకొన్నాడు.  యానాన్ని భారతావనిలో విలీనం చేయాలని పోరాడుతున్న దడాల రఫేల్‌ రమణయ్య ఆండ్రసన్‌ ను కలిసి మెమొరాండం సమర్పించారు.

            యానాం చాలా ప్రశాంతంగా ఉందనీ, ఇక్కడి ప్రజలలో, అణగారిన వర్గాలకు చెందిన కొంతమంది వ్యక్తులు తప్ప మిగిలిన పురప్రముఖులందరూ ఫ్రెంచి పాలన ఉండాలని కోరుకొంటున్నారని ఆండ్రసన్‌ తన తన రిపోర్టులో పేర్కొన్నాడు.  భారతదేశంలో రిఫరెండం జరిపే పరిస్థితులు లేవని ఈ బృందం రిపోర్టు ఇచ్చింది.

యానాం మొదటి దళిత మేయరు

            శ్రీ పాము రామమూర్తి గారు రచించిన ‘తూర్పుగోదావరి జిల్లా ఆది ఆంధ్రప్రముఖుల జీవితచరిత్రలు’ అనే పుస్తకములో శ్రీ గుర్రపు వెంకటరత్నం గురించి ఈ క్రింది విధంగా ఉంది.

          //శ్రీ గుర్రపు వెంకటరత్నం గారు శ్రీ గుర్రపు సత్తెయ్యగారి కనిష్టపుత్రులు.  యానాం పురపాలక సంఘ ఎన్నికలలో వీరు తొమ్మిది సంవత్సరములు జయము పొందినారు.  ఒక ఎన్నికలో పాల్గొన్న ఇరుపార్టీలందును సమానముగా సభ్యులు ఎన్నికైరి.  ప్రభుత్వ పద్దతి ప్రకారము అత్యధిక వోట్లు సంపాదించిన సభ్యుని మేయరుగా నిర్ణయించవలసి యున్నది.  అట్టి నిబంధనల ననుసరించి వెంకటరత్నం గారు యానాం మేయరు పదవిని నలంకరించినారు// 

           పై వివరణలో ఏ సంవత్సరములో ఆ సంఘటన జరిగిందో,  ఎంతకాలం  వారు మేయరుగా పనిచేసారో వంటి వివరాలు తెలియరావు.  Journal officiel de l'Inde française  అనే పేరుగల ఆనాటి ఫ్రెంచి ప్రభుత్వ పత్రిక యొక్క 1881 నుంచి 1943 వరకూ లభ్యంలోఉన్న కాపీలలో ఈ సంఘటన ప్రస్థావన లేకపోవటాన్ని బట్టి ఇది బహుశా ఆ తరువాత కాలంలో జరిగి ఉండొచ్చని భావించాలి.  (పై పత్రికలను  http://gallica.bnf.fr/ అనే వెబ్‌ సైటులో  చదువుకొనవచ్చును)  1930 లలో యానాంకు చెందిన  శ్రీ వెంకటరత్నం గారు ఫ్రెంచి ప్రభుత్వంచే మేయరుగా కొంతకాలం నియమించబడ్డట్లు స్థానికులు చెపుతారు. ఎలా చూసినా శ్రీగుర్రపు వెంకటరత్నం గారు ప్రజలచే ఎన్నుకోబడిన మొదటి దళిత మేయరు అన్న విషయం సుస్ఫష్టం.

కొన్ని విచిత్రమైన ఎన్నికలు

            1900 సెప్టెంబరులో జరిగిన స్థానిక కౌన్సిల్‌ కు ఇద్దరు సభ్యులకొరకు ఎన్నికలు జరిగాయి.  ఓటరు లిస్టులో ఓటర్ల సంఖ్య 859.  వారిలో 288 మంది ఓట్‌ చేసారు.  అలా బెజవాడ బాపనయ్య 288 ఓట్లతోను, సమతం కృష్ణమనాయుడు కూడా 288 ఓట్లను పొంది విజేతలుగా నిలిచారు.  ఓటు హక్కును వినియోగించుకొన్నవారు 288 మంది.  నెగ్గినవారికి సరిగ్గా 288 ఓట్లు మాత్రమే రావటం వైష్ణవమాయగా అనిపించకమానదు.  ఒక వేళ ఇద్దరు అభ్యర్ధులు మాత్రమే పోటీ చేసారనుకొన్నా ఇద్దరికీ సమానంగా ఓట్లు రావటం కూడా విడ్డూరమే!

            1901 మే లో స్థానిక మండలికి  ఒక అభ్యర్ధి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక వివరాలను చూస్తే ఇవసలు ఎన్నికలా లేక ఏకగ్రీవ ఎన్నికా అనేది అర్ధంకాదు.  మొత్తం 847 ఓటర్లు కాగా వారిలో 430 మంది ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఎంతమంది పోటీ చేసారో తెలియరాదు కానీ, సమతం లక్ష్మీనరసయ్య 429 ఓట్లతో పొంది విజయం సాధించినట్లు మాత్రమే రికార్డులు చెపుతున్నాయి. నెగ్గిన అభ్యర్థికి తగ్గిన ఒక ఓటు చెల్లని ఓటు అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఈ ఎన్నికలలో చెల్లని ఓట్లేమీ లేవట!   బహుసా ఆ ఒక్క ఓటు ఈయన పోటీ అభ్యర్ధికి  పడిఉండాలి.  అది ఆయన ఓటేమో పాపం!

            అప్పట్లో ఎన్నికల లో జరిగే అవకతవకలను వైరి వర్గాలు డేగకళ్ళతో వీక్షించేవారు. ఏ చిన్న లొసుగు ఉన్నా కోర్టును ఆశ్రయించేవారు.  ప్రతీ ఎన్నిక అనంతరం తప్పనిసరిగా కోర్టు కేసులు నడిచేవి. చాలా కేసులు కొట్టివేయబడినా కొన్ని నెగ్గిన సందర్భాలు కూడా లేకపోలేదు.   

ఫ్రెంచి ప్రభుత్వం జరిపిన చివరి ఎన్నికలు

            1951 లో నిర్వహించిన ఎన్నికలే ఫ్రెంచి ప్రభుత్వం నిర్వహించిన ఆఖరు ఎన్నికలు.  భారతదేశంలో ఫ్రెంచి పాలన కొనసాగాలా వద్దా అని నిర్ణయించటానికి జరిపిన ఎన్నికలు ఇవి. 1948 లో యానాం ఓటర్ల సంఖ్య  1200 లు ఉండగా ఈ ఎలక్షన్లకు ఆ సంఖ్య 1662 కు పెరిగింది.  ఈ ఎలక్షన్లలో కామిశెట్టి పరశురాం, యర్రాలు కలిసి మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య లకు వ్యతిరేకంగా పోటీ చేసారు. 

            ఈ ఎలక్షన్లలో కామిశెట్టి, యర్రాల  వర్గం ఓడిపోయింది.  మద్దింశెట్టి, కనకాల తాతయ్యలు విజయం సాధించారు.  వీరిలో మద్దింశెట్టి మేయర్‌ పదవి చేపట్టారు.  ఈ ఎలక్షన్లలో నెగ్గిన మెంబర్లు వరుసగా, మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య, దవులూరి వెంకటరాజారావు, గిరి మాధవరావు నాయుడు, నాటి చినవెంకన్న, కశిరెడ్డి బ్రహ్మానందం, కోన నరసయ్య, సమతం కృష్ణయ్య, పంపన వీరాస్వామి, గుర్రపు వెంకటరత్నం, జ్ఞానవేల్‌ నాచియప్పన్‌ మొదలగువారు.

          1947 లో బ్రిటిష్‌ వారు ఇండియా విడిచిపోవటంతో ఫ్రెంచి కాలనీలలో కూడా జాతీయభావనలు బలపడ్డాయి.  తదనంతరం జరిగిన అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఈ ఎన్నికలలో నెగ్గిన మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య, దవులూరి వెంకటరాజారావు, నాటి చినవెంకన్న మరియు కశిరెడ్డి బ్రహ్మానందం తదితరులు, అక్టోబరు 18, 1954 న పాండిచేరీ వద్ద కల కీళూరు  లో జరిగిన అభిప్రాయసేకరణ లో యానాం తరపున పాల్గొని ` ఫ్రెంచి కాలనీలను భారతదేశంలో విలీనం చేయాలని ఓట్‌ చేసారు.  ఆ విధంగా యానాంలోని ఫ్రెంచి పాలనకు చరమ గీతం పాడబడిరది.

భిన్న రాజకీయ వర్గాలు - వివిధ దశలు

            యానాం చిన్నప్రాంతం అవ్వటం, అప్పటి నాయకులు కూడా ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారవ్వటం వలన చాలా సందర్భాలలో నెగ్గిన, ఓడిపోయిన పక్షాల వారి మధ్య ఏదో విధమైన చుట్టరికాలు ఉండేవి.  అంతేకాక ఎన్నికలలో ఏ పానెల్‌ పై పోటీ చేసినప్పటికీ అవి ముగిసాక మేయర్‌ ఎన్నిక సమయంలో నెగ్గిన అభ్యర్ధుల  రాజకీయ పునర్వవస్థీకరణ  జరిగేది. ఆ కారణంగా యానాం రాజకీయపరంగా రెండు వర్గాలుగా స్థిరీకరణ జరగలేదు.  అయనప్పటికీ యానాం రాజకీయ చిత్రాన్ని మూడు దశలుగా గుర్తించవచ్చును.

            మొదటి దశలో బెజవాడ బాపనయ్య, కంతేటి సత్యప్రసన్నం, సమతం వెంకటసుబ్బారాయుడు, పుణ్యమూర్తుల వెంకట సుబ్బారాయుడులు ఒక వర్గంగాను ` పైడికొండల సుబ్బయ్య, కామిశెట్టి పేరమనాయుడు, ఫారమాండ్‌ లు మరో వర్గం గా రాజకీయాలు నడచాయి.  మొదటి వర్గంలోని బెజవాడ బాపనయ్య, పుణ్యమూర్తుల వెంకట సుబ్బారాయుడు, సమతం వెంకటసుబ్బారాయుడు ల స్థానాలలోకి వారి వారసులుగా బెజవాడ వెంకటరెడ్డి (కొంతకాలం మాత్రమే), పుణ్యమూర్తుల శ్రీవెంకట రమణప్రసాదరావు, సమతం లక్ష్మినరసయ్యలు రంగప్రవేశం చేసారు.  కామిశెట్టి పేరమనాయుడు స్థానంలో వారి కుమారుడు  వేణుగోపాలరావునాయుడు రంగప్రవేశం చేసారు.  ఈ మొదటి దశకు చెందిన నాయకులు 1880`1920 ల మధ్య యానాం రాజకీయాల్ని నడిపించారు.

            రెండవ దశలో బెజవాడ వెంకటరెడ్డి కుమారుడు బెజవాడ బాపన్నాయుడు, కొత్త వెంకటరత్నం, కాపగంటి చినమంగరాజు, సమతం లక్ష్మినరసయ్య, కనకాల బ్రాహ్మడు, బులుసు సుబ్రహ్మణ్యశాస్త్రి, మహేంద్రవాడ గణపతి శాస్త్రులు, కసిరెడ్డి గోపాలం, మలిపెద్ది అంకయ్య, దున్నా కమలనాభం, మద్దింశెట్టి సత్యనారాయణ, గిరి మాధవరావునాయుడు వంటి ప్రభృతులు ఒక వర్గం కాగా ` కామిశెట్టి వేణుగోపాల రావు నాయుడు, యర్రా జగన్నాథరావు (వీరు తరువాత కామిశెట్టితో విభేదించి విడిపోయారు), నాగసూరి కామరాజు, తిక్కిరెడ్డి సత్యానందం, కొల్లాటి రెడ్డినాయుడు, గ్రంధి లక్ష్మయ్య, నాగసూరి వెంకటరాజు, వెలగలపూడి వీరయ్య, కోన సుబ్బారావు, చింతా బ్రహ్మానందం, కామిరెడ్డి వెంకటస్వామి, కూనపురెడ్డి సుబ్బారాయుడు, దనార్లకోట వెంకటరాజాచారి తదితరులు మరో వర్గంగాను ఉండేవారు.  ఈ రెండవతరం నాయకుల హవా  1920`1950 ల మధ్య నడిచింది.

             మూడవ దశ ఫ్రెంచి యానాం రాజకీయ చరిత్రలో అత్యంతకీలక మైనది.  1948 లో జరిగిన ఎన్నికలు ఫ్రెంచి కాలనీల భవిష్యత్తు నిర్ణయించటానికి జరిగాయి. (ఈ ఎలక్షన్లనాటి ప్రధాన, వైరిపక్షాల వివరాలు ఇదే వ్యాసంలో  చూడవచ్చును)  1951 ఎలక్షన్లలో నెగ్గిన నాయకులు అచంచల పోరాట ఫలితంగా యానాంలో ఫ్రెంచి పాలనకు తెరపడిరది. 

ముగింపు

            యానాం నాయకులు ప్రారంభదశ నుండి పాండిచేరీ నాయకులతోనే తాము మమేకమయ్యారు.  అలా చేయటం ద్వారా యానానికి మరింత మేలు చేయవచ్చునని వీరు భావించారు.  యానాం ఎన్నికలలో మొదట్లో ఉండిన ఫ్రెంచి దేశస్థుల ప్రాతినిధ్యం క్రమక్రమంగా తగ్గిపోయింది.

           1872 లో ఇక్కడ జరిగిన ఎన్నికలు భారతదేశంలోనే ప్రప్రథమంగా జరిగిన ప్రజాస్వామ్యయుత సాధారణ ఎన్నికలు.  బ్రిటిష్‌ ఇండియాలో 1919 నుండి కౌన్సిల్‌ మెంబర్లను కొద్దిమంది ఉన్నత వర్గాల ప్రజలు మాత్రమే ఎన్నుకొనేవారు. సామాన్య ప్రజలకు ఓటుహక్కు  ఉండేదికాదు.  బ్రిటిష్‌ ప్రభుత్వం 1935 లో చేసిన చట్టం ద్వారా ఎన్నికలలో సామాన్య ప్రజలందరికీ ఓటుహక్కు కల్పించబడిరది.  ఆ విధంగా డబ్బయి లక్షలుండే ఓటర్ల లిస్టు మూడున్నర కోట్లకు చేరింది.  కానీ ఫ్రెంచ్‌ ఇండియాలో 1871 లోనే  21 సంవత్సరములు నిండిన ఓటర్లందరికీ ఓటుహక్కు కల్పించబడిరది.

             ఎన్నికల ప్రక్రియపై అవగాహన లేకపోవటం వల్ల యానాం మొదటి ఎన్నికలలో 1394 మంది ఓటర్లకు 12 ఓట్లు మాత్రమే పోల్‌ అవ్వటం ఆశక్తిదాయకం.

            ఎన్నికల తంతు ముగిసిన వెంటనే ఓడిపోయిన అభ్యర్ధులు నెగ్గినవారి ఎన్నిక చెల్లదని కోర్టుకేసులు వెయ్యటం రివాజుగా ఉండేది.  ఏవో రెండుమూడు కేసులను తప్ప దాదాపు అన్నిసార్లూ ఆయా కేసులను యానాం కోర్టు కొట్టివేసింది.

            యానాం ఎన్నికలలో దళితుల ప్రాతినిధ్యం ప్రారంభంలో లేకపోయినా వారి ఉనికి నెమ్మది నెమ్మదిగా బయటపడిరది.  దున్నా కమలనాభం, గుర్రపు వెంకట రత్నం, మోకా మహలక్ష్మి, రొక్కం వెంకటరెడ్డి, కమిడి వెంకట స్వామి వంటివారు మెంబర్లుగా ఎన్నికయ్యారు.  యానాన్ని భారతావనిలో విలీనం చేయటంలో శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య పాత్ర అనన్యమైనది.  ఫ్రెంచి ఇండియా ఎన్నికలలో ముస్లిముల పాతినిధ్యం కూడా సముచితంగానే ఉన్నట్లు తెలుస్తుంది.

         ఇక బి.సి. లకు సంబంధించిన వివరాలే నిరాశను కలిగిస్తాయి.  నాటి చినవెంకన్న, పంపన వీరాస్వామి, వెలగలపూడి వీరయ్య వంటివారు మాత్రమే మెంబర్లు గా ఎన్నికయ్యారు.  ఏతావాతా ఫ్రెంచి పాలనలో బి.సి. లు రాజకీయంగా ఒక శక్తిగా ఎదగలేక పోయారన్నది ఒక చారిత్రక సత్యంగా మిగిలిపోయింది.

ఈ పుస్తకానికి అందమైన కవర్ పేజ్ నా బాల్యమిత్రుడు చిన్నారి డిజైన్ చేసాడు.


I still believe this is my work. No other book crossed it in my sweat and satisfaction. Its like my first love with history. :-)


ఐరనీ ఏమిటంటే అప్పట్లోనే ముప్పై వేల రూపాయల వెచ్చించి ముద్రించిన ఈ పుస్తకాన్ని 137 మందికాదు కదా ఆ సంఖ్యలో సగం మంది కూడా యానాంలో కొనుక్కోలేదు.

బొల్లోజు బాబా


బొల్లోజు బాబా

ఫిబ్రవరి, 2011






Thursday, September 4, 2025

నిత్య యవ్వనమే’ సాధు సందేశం!


.
నేను ఒక ఏడాది క్రితం నా ఫేస్ బుక్ వాల్ పై మృత్యువు గురించి రాసిన ఒక కవితకు స్పందిస్తూ సాధు సుబ్రహ్మణ్య శర్మ ఇలా కామెంట్ చేసారు.
 
“As age increases try to become younger. Don't await death. let death take one unawares while fully immersed in executing a huge project , as in a battlefield!-- Sadhu Sarma.” (వయసు పెరిగే కొద్దీ పడుచువారయ్యేందుకు ప్రయత్నించండి. చావుకోసం ఎదురుచూడవద్దు. ఏదో ఒక పెద్దకార్యంలో పూర్తిగా నిమగ్నమై ఉండగా చావు మనకే తెలీకుండా వచ్చి మనల్ని లాక్కెళ్ళిపోవాలి, యుద్ధరంగంలో లాగ- సాధుశర్మ)

సాధుశర్మ పరిపూర్ణ జీవితం ఆస్వాదించారు. ఈ ప్రపంచాన్ని ప్రేమించారు. తన చుట్టూ ఉన్న పిల్లలను ప్రోత్సహించారు. 90 ఏళ్ళు వయసులో కూడా ఈ ప్రపంచాన్ని మార్చటానికి కొత్తకొత్త తాత్త్వికభూమికల గురించి అన్వేషిస్తూ, తాను కనుగొన్న సత్యాలను ప్రపంచంతో పంచుకొంటూ జీవించారు. పైన ఆయనే చెప్పినట్లు మరణించే సమయంలో కూడా ఏదో పెద్దప్రోజెక్టును ఊహిస్తూ ఉండి ఉంటారు
 
శ్రీ సాధు సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ సాధు లక్ష్మీనరసింహ శర్మ శ్రీమతి సుబ్బమ్మ దంపతులకు 6-3-1932న జన్మించారు. వీరి ప్రాధమిక చదువు బళ్ళారిలోను, కాలేజి చదువు అనంతపురం, హైదరాబాద్ లోను జరిగాయి. వీరు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖలో వివిధ హోదాలలో పనిచేసి, చివరకు జెనరల్ మేనేజర్ ఇన్ చార్జిగా 1990, మార్చి 31న పదవీవిరమణ చేసారు. 2025, జూలై 18న 93 ఏళ్ళ వయసులో కాకినాడలోని స్వగృహంలో పరమపదించారు.
శ్రీ సాధు సుబ్రహ్మణ్య శర్మ గొప్ప మేధోసంపన్నులు, వారి జ్ఞానదాహం అపారమైనది. ఒక వ్యక్తి కవిత్వం, చరిత్ర, భాషాసంబంధ పరిశోధన, తత్త్వశాస్త్రం వంటి వివిధ రంగాలలో వారు చేసిన ప్రామాణిక రచనలు అసాధారణమైనవి. ఇది వారి అసామాన్య ప్రతిభ, బహుముఖీన పాండిత్యానికి, అవిశ్రాంత శ్రమకు నిదర్శనం.

వీరి రచనలు

“సాధువాడిమాట-నవసహస్రాబ్ది బాట” అనే మకుటంతో సమకాలీన అంశాలు, నైతిక విలువలపై రాసిన పద్యాలు. కాలవాహిని పేరుతో కవిత్వం సాధుబాల శిక్ష - అక్షరాలు దిద్దనవసరం లేకుండా తెలుగును బోధించేందుకు రచించిన పాఠ్యపుస్తకం.
New Frontiers of Philosophy for an Alternate model of society or the Human Manifesto. ఈ పుస్తకంలో మానవజాతి ఎదుర్కొంటున్న సాంఘిక, ఆర్ధిక, రాజకీయ పర్యావరణ సంక్షోభాలను చర్చించారు. ప్రాచీనభారతదేశ తత్త్వసారాన్ని ఆధునిక సమాజానికి అన్వయిస్తూ చేసిన ప్రతిపాదనలు ఇవి. సమకాలీన సమాజాన్ని, మానవజీవనాన్ని పునర్నిర్మించే దిశలో ఒక గొప్ప మేధావి చేసిన ఆలోచనలు ఇవి.

Dialectics of Evolution, Systems Approach and New frontiers of Philosophy అనే పేరుతో 2015 లో రచించారు. 590 పేజీలు. దీనిని Partridge India వారు ముద్రించారు. చరిత్రను ఒక కొత్త తాత్విక దృష్టితో ఎలా చూడాలో ఈ పుస్తకంలో సుబ్రహ్మణ్య శర్మ వివరించారు. మరింత శాంతిమయ భవిష్యత్తు, శ్రేయస్సుతో కూడిన సమాజాన్ని సాధించేందుకు ఒక విన్-విన్ వ్యూహాన్ని దీనిలో ప్రతిపాదించారు. చరిత్రలో సామాన్యమానవుడు కేవలం విధేయతకలిగిన వస్తువుగానే ఉన్నాడని అతను మరింత తెలివైన పాత్రపోషించాలి అని అంటారు.
 
మేటి భారతదేశం - మన చరిత్ర మూలాలను అన్వేషిస్తూ వ్రాసిన విశ్లేషణాత్మక 770 పేజీల గ్రంధం. Fight for peace and struggle for an Ideal society అనే పుస్తకంలో ఆధునిక సమాజం, హింస యుద్ధాలనుండి ఎలా విముక్తి చెంది శాంతివైపు ప్రయనించాలో చర్చించారు.
బంకోలా నవల. సాధు సుబ్రహ్మణ్య శర్మ తెలుగు పాఠకులకు ఎక్కువగా తెలిసింది బంకోలా నవల ద్వారా. బంకోలా అంటే లైట్ హౌస్ అని అర్ధం.
 
అది విదేశీయులు వ్యాపారనిమిత్తమై వచ్చి దేశరాజకీయాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకొంటున్న కాలం. స్వదేశీయులు మూడురకాలుగా విడిపోయారు. ఈ మార్పుని తమకు అనుకూలంగా మలచుకొని బాగుపడాలనుకొన్నవారు. రాజెవ్వడైతే మాత్రం నా కష్టమే కదా నాకు దిక్కు అనుకొని తటస్థంగా ఉండిపోయినవారు. రాబోతున్న ఉపద్రవాన్ని పసిగట్టి సమాజాన్ని అప్రమత్తం చేయటానికి ప్రయత్నించిన ఆలోచనా పరులు మరోపక్క.
 
వీరందరి మధ్యా సంఘర్షణ ఫలితంగా జరిగిన నాటకీయపరిణామాలే బంకోలా నవల.
కథానాయకుడు భైరి, ఓడల యజమాని నరసింహనాయకర్ కొడుకు. భైరి ఆలోచనాపరుడు, ఆంగ్లేయ స్నేహితుల నుంచి ప్రపంచ విజ్ఞానం గ్రహిస్తాడు, బ్రిటిష్ రాజకీయ ఆధిపత్య ఆలోచనలను గుర్తిస్తాడు. యానాం ఫ్రెంచివారి వద్ద గుమస్తాగా పనిచేస్తూ వారి దాష్టీకాలను ఎదిరించి గొడవపడతాడు. మంజరి అనే వేశ్యద్వారా విదేశీయుల దోపిడీని తెలుసుకొని ఢిల్లీ సుల్తానును కలిసి విదేశీయులను నిలువరించమని కోరటానికని ఢిల్లీ వెళతాడు. అక్కడ ఎవరూ ఇతని మాట ఖాతరు చేయకపోవటంతో తిరిగి కోరంగి వచ్చేస్తాడు. మరదలు పరదేశిని పెళ్ళాడి వ్యాపారంలో విజయం సాధిస్తాడు. అయితే బ్రిటిష్ వ్యతిరేక భావాలతో ఉన్నందుకు భైరి కొడుకును బ్రిటిష్ వారు హతమారుస్తారు. చివరకు, 1789 డిసెంబర్ 10న వచ్చిన కోరంగి సునామీలో భైరి, పరదేశి కొట్టుకుపోయి మరణించటంతో నవల ముగుస్తుంది.

ఈ రచనలో సుబ్రహ్మణ్య శర్మ ఆ కాలపు సామాజిక సంఘర్షణను నేపథ్యంగా తీసుకోవటం వల్ల ఇది గొప్ప చారిత్రిక నవలగా రూపుదిద్దుకొంది. తెలుగులో ఈ కాలానికి సంబంధించి సామాన్యుల జీవితాలను ప్రతిబింబించే సాహిత్యం పెద్దగా లేదు. ఆ లోటు ఈ పుస్తకం తీర్చటంతో తెలుగు పాఠకులు దీనిని అపూర్వంగా ఆదరించారు. తెలుగువారు గర్వించదగిన గొప్ప తాత్త్విక రచనలను సుబ్రహ్మణ్య శర్మ చేసారు. వాటిపట్ల తెలుగునాట పెద్దగా చర్చ జరగకపోవటం నిజంగా బాధాకరం.
ఇవే కాక జహిశత్రుల మహాబాహో - మెట్టవేదాంతాన్ని విడనాడి శాస్త్రీయ మార్గం అవలంబించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపే రచన. History of Freedom Struggle. శ్రీసాధు సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రతిపాదించిన "స్వల్ప సంకేతాలతో సకల భాషలను వ్రాసే విశ్వజనీన లిపి" కి సోమనాథ కళాపీఠం వారు "స్వచ్ఛంద భాషా సేవా పురస్కారం" ను 2010 లో ప్రదానం చేసారు. ఈ విశ్వజనీన లిపి లాంటివి ఇంకా అముద్రితాలే.
 
సాధు సుబ్రహ్మణ్య శర్మ సాధు ప్రైవేట్ లైబ్రేరిని స్థాపించి స్కూల్ విద్యార్ధుల కొరకు స్వయంగా నడిపారు. పిల్లలు ఆటలు ఆడుకోవటానికి ఒక ఇల్లును అద్దెకు తీసుకొని అన్ని రకాల ఆటవస్తువులను వారికి అందుబాటులో ఉంచారు. నిత్యయవ్వనంతో జీవించటమే ఆ గొప్ప తత్త్వవేత్త మనకిచ్చిన సందేశం.
 
(ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజ్ లో ప్రచురింపబడింది ఎడిటర్ గారికి, మెహర్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను)

బొల్లోజు బాబా



ఫ్రెంచి ఇండియా పాస్ పోర్టు



పాండిచ్చేరి భారతదేశంలో విలీనం కాకముందు అక్కడి ప్రజలు సమీప భారతభూభాగాలోకి వెళ్లాలంటే గుర్తింపు పత్రాలు చూపించాల్సి వచ్చేది. నేటి పాస్ పోర్ట్ లు లాగా. ఇవి లేకపోతే పాండిచేరి నుంచి వెలుపలికి రావటానికి లేదు.

అప్పట్లో మా నాన్నగారు శ్రీ బొల్లోజు బసవలింగం గారు పాండిచేరి Calve College లో Brevet చదువు తున్నారు (equivalent to higher secondary).
 
యానాం రావటానికి 20, ఏప్రిల్ 1954 న ఫ్రెంచి ప్రభుత్వం మానాన్నగారికి ఇచ్చిన పాస్ పోర్ట్ ఇది. (గమనిస్తే దానిలో నేషనాలిటి "ఫ్రెంచ్" (francaise)అని ఉంటుంది. ఫ్రెంచి వారు వెళ్ళిపోయే ముందు ఇక్కడి ప్రజలకు తమ నేషనాలిటి నిలుపుకొంటారా భారతదేశంలో కలిసిపోతారా అని option ఇచ్చారు. అలా చాలామంది ఫ్రెంచినేషనాలిటి ఉంచుకున్నారు. అడగని వారు డిఫాల్ట్ గా భారతీయులుగా మారిపోయారు. మానాన్నగారు మాతృదేశాభిమానంతో తీసుకోలేదు. ఆనాటి బ్రిటిష్ వారు రాత్రికి రాత్రి జంప్ అయిపోయారు.)

అలా యానాం వచ్చిన వీరు ఫ్రెంచి పాలన నుండి యానాం విమోచనోద్యమంలో శ్రీ దడాల రఫెల్ రమణయ్య నాయకత్వంలో పాల్గొన్నారు. ఫ్రెంచి పోలీసు దెబ్బలు తిన్నారు. 13, జూన్ 1954 న ఉద్యమ నాయకులు కలక్టర్ బంగ్లాను ముట్టడించి యానాం భారతావనిలో విలీనమైందని ప్రకటించారు.
 
"యానాం విమోచనోద్యమం" నా మొదటి పుస్తకం. ఆనాటి నాయకులను రికార్డు చేసే ఉద్దేశంతో రాసింది. మొదటి కామెంట్లో డౌన్ లోడ్ లింకు కలదు.
 
"ఫ్రెంచిపాలనలో యానాం" పేరుతో రాసిన యానాం కలోనియల్ చరిత్ర పుస్తకం డౌన్ లోడ్ లింక్ రెండవ కామెంటులో కలదు.
 
ఇదే సబ్జెక్టుపై రాసిన "ఫ్రెంచి ఇండియా స్వాతంత్ర్యపోరాట యోధుడు - శ్రీ దడాల రఫెల్ రమణయ్య" పుస్తకం కావలసిన వారు పల్లవి పబ్లిషర్ శ్రీ నారాయణ గారి నంబరులో 9866115655 సంప్రదించగలరు.

పొట్టచేత పట్టుకొని బయటకు వచ్చేసినా నేను పుట్టిన ఊరిపై రాసిన మూడు పుస్తకాలు ఇవి.

బొల్లోజు బాబా




ఈ ఫోటో ప్రత్యేకమైనది. నా పుస్తకం కవర్ పేజ్ శిల్పం ముందు. 🙂. @ajanta caves

 


ప్రాచీన గాథలు review



Manasa Chamarthi gaaru, ఎంతమంచి కాన్క. శ్రద్ధగా చదివి చెప్పే వాక్యాల పరిమళం గొప్ప సౌందర్యాన్ని కలిగి ఉంటాయి ఇలా...
Loved every line. Thank you so much madam.
బొల్లోజు బాబా
*****

బెంగళూరులో ఈ నెలలో వాన పడని రోజే లేదనుకుంటాను! ఆఫీసు పనులను దాటుకుని సాయంకాలాల్లో కాస్త బయటికి వచ్చి చూస్తే, ఆకాశమంతా నల్లటి మేఘాలు బరువుగా కదులుతూ కనపడుతూనే ఉన్నాయి. ముసురుకునే చీకట్ల మధ్య ఎక్కడో దూరాల్లో చిన్న తెలిమబ్బు...దాని నుండి పాకే మృదువైన కాంతి. గాలుల్లో సన్నగా వణికించే చలి. ఈ మధ్యాహ్నమూ అలాగే కుండపోతగా వాన కురిసి వెలిసింది. బాల్కనీలో వానకు తడిసి తీవెల నుండి రాలిపడ్డ సన్నజాజుల రెక్కలు. శ్రావణ మాసపు సౌందర్యానికి సెలవురోజు సోమరితనం తోడైంది, విశ్రాంతిగా వెనక్కు సోలిపొమ్మని చెబుతూ వీధిలో ఎవరింటి నుండో పాత హిందీ పాటలు. నా చేతిలోనేమో బొల్లోజుబాబా గారి ప్రాచీన గాథల సంకలనం. తెరిచానా...


*
ప్రాయపు నాయకుల సరస సంభాషణల్లో మత్తుగా కురుస్తోంది వాన. యుద్ధానికి పోవలసిన సేనాధిపతి అంటున్నాడూ -
శాంతి నిండిన పూల కన్నులదానా!
"వాన వచ్చేలా ఉంది" అంటూ
నువ్వు నన్ను వెళ్ళనివ్వలేదు
నిన్ను విడిచి నేను రానేమోనని
యుద్ధ ప్రయత్నాన్ని
విరమించుకున్నాడు రాజు"

ఏమి వ్యాఖ్యానం కావాలీ పద్యాలకి? యుద్ధానికి వెళ్ళబోయే సేనాధిపతి, భార్యను శాంతి నిండిన పూల కన్నులదానా అని పిలవడంతో కవిత మొదలయ్యాక, ఇంకా రాని వర్షాన్ని నెపంగా చూపించి ఆ పడతి మగడిని యుద్ధానికే వెళ్ళనివ్వకుండా చేసిందని తెలిసాక, ఇతను రాడేమోనని, యుద్ధాన్నే విరమించుకున్న రాజుని తలచాక - ఇంకా ఏమి చెప్పుకోవాలి? ఆ ప్రేమ రుచి అనుభూతిలోకి తెచ్చుకుని సుఖించడమే తక్క!
*

వాన ఇంకా కురుస్తూనే ఉంది. ఎర్రమట్టినీ వాననీటినీ కలిపిన చందాన..ఇదిగో ఇలా...
నా తల్లి నీ తల్లి ఒకరికొకరు తెలియరు
నా తండ్రి నీ తండ్రి బంధువులూ కారు
కానీ నువ్వూ నేనూ
ఎలా ఒకరినొకరం కనుగొన్నాం?
మన హృదయాలు ఎర్రమట్టి వాననీరుల్లా
ఎలా ఒకదానిలో ఒకటి కరిగిపోయాయి?
*
అమాయకమైన ప్రేమ, అమాయకంగా తనవాడి చుట్టూ అల్లుకున్న లోకం ఈ కవితల్లో తారసపడినప్పుడల్లా నాకెందుకో పట్టరాని సంతోషం వేసింది. యే ఆర్భాటాలూ లేని పల్లె ప్రపంచాన్ని ప్రకృతిని ఈ కవితల్లో చూస్తే అట్లాంటి జీవితం ఇక దొరికేది ఇలాంటి పుస్తకాల్లోనేనని కూడా గుర్తొచ్చింది. ఈ కవితల్లో ధ్వని..ఆ కవిత చెక్కడంలో ఉన్న చతురత - కవిత్వమంటే మళ్ళీ మోజు పెంచింది.
-
తమ ప్రియులను కనీసం స్వప్నాలలో
దర్శించుకునే వారు ధన్యులు
నీవు నా పక్కన లేకుంటే కలలమాట అటుంచు
నిదురే రాదు నాకు.
*
ఈ జాణని చూడండి -
మగడెంత బ్రతిమాలినప్పటికీ
తన కోపం తగ్గలేదన్న విషయాన్ని
ఆమె బహునేర్పుగా చెప్పగలదు
ఏకాంత మందిరంలో కూడా
మగనికి మర్యాదలు చేస్తోంది.
*
లేత పెదవిని కొరకగా కోపంతో
"ఎంత ధైర్యం నీకు" అంటూ
ద్రాక్షలతల్లాంటి కనుబొమల్ని ముడివేసి
తర్జని ఆడిస్తూ కీచుగొంతుకతో హెచ్చరించే
కోడెవయసు చిన్నదాని నుండి
దొంగిలించిన ముద్దే అమృతం
సాగరాన్ని మథించిన దేవతలు
ఉత్త వెర్రివాళ్ళు.
*
కలహించు, రాజీపడు, సంగమించు
అవన్నీ ప్రేమ దయతో అనుగ్రహించే వరాలు
**
"నా కృష్ణుడు ఇంకా చిన్నపిల్లాడే" అని
యశోద అన్నప్పుడు
గోపికలు కృష్ణున్ని చూస్తూ
ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.
*
ఈ నల్లపిల్ల కౌగిలింతలో నాకు
ఇల్లు ఇచ్చే చనువు
ఇంటి భోజనపు సుఖం లభిస్తాయి
*
దూరదేశం నుండి తిరిగొచ్చిన ప్రియుడు
నన్ను మోహావేశంతో ముద్దులాడుతూ
"అంతా బానే ఉంది కదా" అంటూ
అడిగిన రోజులు గొప్పవి
నా ప్రియుడు చెప్పాపెట్టకుండా
వచ్చినరోజు ధన్యమైనది
మధువు నిండిన ఆ రాత్రి పవిత్రమైనది
*
హాలుడు గాథాసప్తశతిని అమృతకావ్యమన్నాడని ఎక్కడో చదివాను. ఈ ప్రాచీన గాథలు చదువుతున్నప్పుడు ఎన్నిసార్లో ఆ మాట జ్ఞాపకం వచ్చింది. పన్నుగ దాని (సరసాన్ని) వర్ణింపలేనట్టి పదములేటి పదములే అన్న మాట ఈ పుస్తకాన్ని చదివితే నిజమనిపించి ఈ పదాల్లో ఇంకొన్ని సార్లు పడిమునకలేయాలనిపించింది. పరిచయానికిట్లా ఈ కాసిన్ని మాటలూ రాయడమే తప్ప, ఏ పుటా నన్ను నిరాశపరచలేదు. అక్కడక్కడా, అరుదుగా, కొన్ని పదాలు, ఇంకాస్త లాలిత్యంతో నిండి ఉంటే ఆ అపురూపమైన భావం మరింత గాఢంగా నాటుకునేదేమో అని మాత్రం అనిపించింది. ఈ వర్షం వెలిసిన సాయంత్రం, ఈ చలిగాలులు కోసేస్తున్న సాయంత్రం, ఇట్లా ఈ అందమైన కవిత్వాన్ని చదవడంలో...




సృజనకు దిక్సూచి



శ్రీ అవధానుల మణిబాబు కవిగా, విమర్శకునిగా మంచి పేరుతెచ్చుకొని, తెలుగు సాహిత్యరంగంలో తనకంటూ ఒక చక్కని స్థానాన్ని సంపాదించుకొన్నారు. వీరి మూడు కవిత్వసంపుటులపై శ్రీ పెండ్యాల కామేశ్వరరావు గారు ఒక సమీక్షా గ్రంథం "అతడిలా అర్ధమయ్యాడు" పేరుతో రచించారు. దీనిని ఆత్మీయుల సమక్షంలో ఆవిష్కరించారు.
ఈ గ్రంథాన్ని శ్రీ మధునాపంతుల సత్యనారాయణ మూర్తి ఆవిష్కరించగా, శ్రీ మాకినీడి సూర్యభాస్కర్, శ్రీ సి.ఎస్. శ్రీ రాజా రామవరపు లు సమీక్షించారు. ఇంకా డా.కాళ్ళకూరి శైలజ,శ్రీ రామకృష్ణ శ్రీవత్స శ్రీ మార్ని జానకిరాం చౌదరి, శ్రీ కాకరపర్తి, శ్రీ మేకా మన్మథరావు ప్రభృతులు తమ అభినందనలు తెలియచేసారు.
ఈ పుస్తకానికి నేను రాసిన బ్లర్బ్ ఇది....

***

సృజనకు దిక్సూచి
.
శ్రీ అవధానుల మణిబాబు కవిత్వం, విమర్శలో తనదైన ముద్రను ఏర్పరచుకొన్న సాహితీవేత్త. వ్యక్తిగా మృధు స్వభావి. కవిగా స్వాప్నికుడు, సున్నిత భావుకుడు. అంశాన్ని తులనాత్మకంగా తూకం వేస్తూ లోతుగా మూల్యాంకనం చేయగల విమర్శకుడు. నిరంతర అధ్యయనశీలి. శ్రోతలను తనతో పాటూ అనుభూతి పడవలో ప్రయాణం చేయించగల చక్కని వక్త. అది ఆథ్యాత్మిక ప్రసంగమైనా, ఆధునిక కవిత్వంపై ఉపన్యాసమైనా. వీరు రాసినపుస్తకాలు మొత్తం పది. వేటికవే వైవిధ్యభరితమైనవి. ఎంత గొప్ప రచన చేసినా అంతకంత ఒదిగి ఉండటం, ఆదరణ, ఆర్థ్రత లాంటి లక్షణాలు శ్రీ మణిబాబును ఉన్నతంగా నిలుపుతాయి.
ఈ పుస్తకరచయిత శ్రీ పెండ్యాల కామేశ్వరరావు నాలుగు దశాబ్దాలపాటు ఆధునిక ఆంగ్లసాహిత్య అధ్యయనం, బోధన చేసిన నిష్ణాతులు. సాహిత్యసభలలో శ్రీ కామేశ్వరరావు గారిని తరుచుగా చూస్తుంటాను కానీ, వారిలో సాహిత్యంపట్ల ఇంత అపారమైన అనురక్తి, లోతైన విశ్లేషణాశక్తి ఉన్నాయని తెలియదు. వారు శ్రీ మణిబాబు రచనలలోంచి “బాటే… తన బ్రతుకంతా”, “నాన్న…పాప”, “నేనిలా….తానలా”, “నింగికి దూరంగా… నేలకు దగ్గరగా” కవిత్వసంపుటులలోని కవిత్వంపై అద్భుతమైన ఆత్మీయపరామర్శ చేసారు. ఈ వ్యాసాలను “అతడిలా అర్ధమయ్యాడు” అనే పేరుతో పుస్తకంగా వెలువరిస్తున్నారు. ఈ విశ్లేషణాత్మక సమాలోచనలో శ్రీ కామేశ్వరరావు చేసిన పరిశీలనలు శ్రీ మణిబాబు కవిత్వంలోని తాత్వికతను, కవితాలక్షణాలను, సామాజిక స్పందనను ప్రతిబింబిస్తాయి.

శ్రీ మణిబాబు కవిత్వాన్ని శ్రీ కామేశ్వరరావు దర్శించిన తీరు వారి వాక్యాలలో….

• విషాదానికి తాత్వికత జోడించడం ఋషి లక్షణం. భారతియ చింతనా మర్మం అది. మణిబాబుకి ఆ చింతన బాగా వంటపట్టింది.

• కవితావస్తువు ఎంపిక విషయంలో ఈయనకో ప్రణాళిక ఉంటుందనిపిస్తుంది. పూలన్నీ రాశిగా పోసి కావలసిన పూలను, ఒకదాని తర్వాత ఒకటి ఏది ఉంటుందో, ఉండాలో ఎంచి అల్లినట్లు ఒకదండలా కవిత్వం చెప్పడం ఆయన కవితాలక్షణం.

• వేర్వేరు కార్యక్షేత్రాలలోని విషయాలను సమన్వయం చేయడంలో కవి విజయవంతం అయ్యాడు;
• కవి సమూహంలోను ఉంటాడు. తనకు తానుగానూ ఉంటాడు; కవి ముద్ర, సమాజపు బ్రతుకు బాటలో, బలంగా పడాలి. మార్గదర్శకం కావాలి

• మణిబాబు గారి కవితల పుస్తకం ముఖచిత్రం చూడండి. “బాటే… తన బతుకంతా”. ఏడు అడుగులుంటాయి. గుబురునీడలలో సాగే పయనమది. నిండారా పచ్చదనం. స్నేహం సప్తపదీనాం. మణిబాబుగారి వ్యక్తీకరణలన్నీ ఇలాగే ఉంటాయి.

పై వాక్యాలు శ్రీ మణిబాబు కవిత్వతత్వాన్ని చక్కగా ఆవిష్కరిస్తాయి. అవి ప్రశంసలు కావు, పరిశీలనలు.

ఏ కవికైనా సహృదయుడైన పాఠకుడు దొరకటం గొప్ప అదృష్టం. అలాగే ఒక విశ్లేషకుడు, కవి తన కవిత్వంలో నిగూఢంగా దాచిన అర్ధాలను, నిక్షిప్తం చేసిన రహస్యాలను, పొదిగిన సొగసులను విప్పిచెప్పి కొన్ని సార్లు ఆ కవినే విస్మయపరచినపుడు అలాంటి కవిత్వం ధన్యతనొందినట్లే. ఆమేరకు శ్రీ మణిబాబుకు అభినందనలు.
తన లోతైన విశ్లేషణల జోడింపుతో తెలుగు విమర్శనారంగానికి కొత్త వన్నెలద్దుతూ, సిసలైన సృజనకు దిక్సూచిగా నిలిచిన శ్రీ కామేశ్వరరావు గారికి నమస్కారములు
భవదీయుడు

బొల్లోజు బాబా









Monday, September 1, 2025

చరిత్రపుటలలో – కోరంగి మహాపట్టణం

        కాకినాడకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరంగి గొప్ప చారిత్రిక ప్రాధాన్యత కలిగిన ఒకనాటి రేవుపట్టణం. క్రీస్తుపూర్వకాలం నుండి ఇరవయ్యో శతాబ్ద ప్రారంభం వరకూ కోరంగి ఓడరేవుగా, నౌకాపట్టణంగా, నౌకా నిర్మాణ కేంద్రంగా ఒక వెలుగు వెలిగింది.


1. గత వైభవం

    సముద్రంలోకి నాలుక ఆకారంలో చొచ్చుకొని ఉన్న భూభాగాన్ని Cape (మూలాగ్రము) అని అంటారు. కోరంగి సహజసిద్ధంగా ఏర్పడిన ఒక Cape. క్రీశ మొదటి శతాబ్దానికి చెందిన రోమన్ చరిత్రకారుడు Pliny, గంగానదీముఖము నుండి 625 రోమన్ మైళ్ల దూరంలో Cape Calingon అనే ప్రముఖ రేవుపట్టణం ఉందని పేర్కొన్నాడు. దాన్ని కోరంగిగా Cunningham, Fergusson వంటి చరిత్రకారులు గుర్తించారు. కాలక్రమేణా తీరము విస్తరించటం, ఇసుక మేటలు వేయటం వల్ల ప్లీని వర్ణించిన కోరంగి రేవుపట్టణం నేడు సముద్ర తీరానికి దూరంగా జరిగింది.

    ప్లీని వర్ణించిన Cape Calingon అనేది నేటి కళింగపట్నం రేవు ఎందుకు కాకూడదని అనిపించవచ్చు. కానీ ఆ అవకాసం లేదు ఎందుకంటే గంగానదిముఖద్వారం నుండి కళింగపట్నం సుమారు 400 రోమన్ మైళ్ళు మాత్రమే ఉండగా (1 రోమన్ మైల్=1.47కిమీ). కోరంగి సుమారు 610 రోమన్ మైళ్ల దూరంలో ఉన్నది. ఇది ప్లీని చెప్పిన 625 రోమన్ మైళ్లతో సరిపోతుంది. అంతే కాక ఒకప్పుడు కళింగ సామ్రాజ్యం ఒరిస్సానుంచి గోదావరి వరకూ తూర్పు తీరం అంతటా విస్తరించి ఉండేది. కోరంగి కళింగ సామ్రాజ్యంలో ఒక భాగం ఆనాడు. కనుక Cape Calingon కోరింగ అనటం సబబుగానే అనిపిస్తుంది.

    ఒకటో శతాబ్దానికి చెందిన పెరిప్లస్ అనే గ్రీకు నౌకాయాన గ్రంథంలో ఒక గోదావరి రేవు నుంచి నిత్యం మలేషియాకు నౌకలు ప్రయాణంచేస్తున్నాయి, దానికి సమీపంలో అల్లోసినె (Allosygne) అనే పెద్ద పట్టణం కలదు అని వర్ణించాడు. Mccrindles అనే చరిత్రకారుడు ఆ రేవుపట్టణం కోరింగ కావొచ్చునని ఊహించాడు. [1] కోరంగికి ఆరుకిలోమీటర్ల దూరంలో ఆర్యావటం అనే ప్రముఖ బౌద్ధ క్షేత్రం కలదు. బహుసా టొలెమి చెప్పిన అల్లోసినె పట్టణం ఆర్యావటం కావొచ్చు.

    కోరంగి రేవుపట్టణం నుండి రోమ్, ఈజిప్టు లకు భారీగా వర్తకం జరిగేది. ఎక్కువగా సుగంధపరిమళాలు, మిరియాలు, యాలకులు, నీలిమందు, ఉక్కు, వజ్రాలు, ముత్యాలు, పత్తి, ఏనుగుదంతాలు, చందనము ఎగుమతి జరిగేది. సముద్రవ్యాపారం కారణంగా అపరిమితమైన బంగారం రోము నుండి భారతదేశానికి చేరిపోతున్నదని ప్లీని, హిప్పాలస్ వంటి వారి చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేసేవారు. కోరంగి రేవుద్వారా జరిగిన విదేశీ వాణిజ్యానికి సాక్ష్యంగా కోరంగి సమీపంలో కల మట్లపాలెం వద్ద రెండో శతాబ్దానికి చెందిన రోమను నాణెములు లభించాయి [2]. రేవు పట్టణములలో రాజు తరపున సుంకకరణములు అనే రాజోద్యోగులు ఉండేవారు. వీరు విదేశీ ఓడలకు రక్షణ కల్పించినందుకు, వ్యాపారులమధ్య ఘర్షణలు రాకుండా చూసినందుకు, మోసములు జరుగకుండా ఖచ్చితమైన తూకములు అమలుజరిపించేందుకు, ఓడదొంగలనుండి కాపాడేందుకు సరుకుల విలువలో నూటికి పది వంతులు చొప్పున రేవు సుంకము వసూలు చేసేవారు.

    అయిదవ శతాబ్దంలో రోమను సామ్రాజ్యం పతనమయ్యాకా, కొంతకాలం భారతదేశం నుండి జరిగే విదేశీ వాణిజ్యం మందగించింది. కానీ ఈ ప్రాంత వ్యాపారులు కొత్త వ్యాపార అవకాసాలను వెతుక్కొన్నారు. కోరంగి నుండి చైనా, జపాను, బర్మా, మలేషియా, జావా సుమత్రా లాంటి తూర్పు దేశాలను చేరి అక్కడి వారితో తమ వ్యాపారాలను కొనసాగించారు.

    క్రీశ. పదవ శతాబ్దములో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన రాజరాజ నరేంద్రుడు వేయించిన నాణెములు బర్మా దేశములో ఇసుకలో కూరుకుపోయిన ఒక ఓడ శిధిలములమధ్య లభించటాన్ని బట్టి ఆ తరువాత కూడా కోరంగి రేవు ప్రముఖ వ్యాపారకేంద్రంగా ఉండేదని ఊహించవచ్చును [3]. పదమూడవ శతాబ్దములో ఆంధ్రదేశాన్ని పాలించిన కాకతీయపాలకులు రేవులలో క్లుప్తశుంకమును (ముప్పదింట ఒకవంతు. అంతకుపూర్వం ఇది నూటికి పది వంతులు ఉండేది) ప్రవేశపెట్టి నౌకా వ్యాపారాన్ని ప్రోత్సహించారు. కాకతీయులు కృష్ణా తీర రేవులను ఎక్కువగా ప్రోత్సహించారు.
    ఈ కాలములో ఆంధ్రదేశాన్ని సందర్శించిన మార్కోపొలో కృష్ణా, గోదావరి రేవుల నుండి పెద్ద ఎత్తున విదేశీ వర్తకము జరుగుతున్నదని అన్నాడు. అంతే కాక ఇక్కడి ఓడలు చాలా బలమైనవని, పెద్దవిగా ఉన్నాయని; ఒక్కొక్క ఓడా అయిదారువేల మలగల (మలగ అనగా ఒక ఎద్దుమోయగల బరువు) మిరియములను మోయసామర్ధ్యము కలిగినవని; ఓడను నడుపుటకు మూడువందలమంది నావికులు ఉండాలని; ఓడ అడుగుభాగమున గదుల వంటి నిర్మాణములు కలవని, రాళ్లు లేదా తిమింగముల వలన ఏ గదికి దెబ్బతగిలితే ఆ భాగముమాత్రమే చెడిపోవును తప్ప ఓడ మునిగిపోయే ప్రమాదము లేదని అన్నాడు [4] . మార్కోపోలో కోరంగి అని ప్రత్యేకముగా ప్రస్తావించకపోయినా ఇక్కడకూడా నౌకా వ్యాపారం జరిగే ఉంటుందని ఊహించవచ్చును.

    ఆ తరువాత వచ్చిన నిజాం పాలకులు మచిలీపట్నాన్ని ప్రముఖ ఓడరేవుగా ప్రోత్సహించటం వల్ల క్రమక్రమంగా కోరంగిరేవు ప్రాభవం కొంత మసకబారినా అది ఏనాడూ మూతపడలేదని అనేక ఆధారాలు లభిస్తాయి.

   1619 జూలై నెలలో మచిలీపట్నం నుండి కెప్టైన్ Martin Pling నాయకత్వంలో సూరత్ కు బయలుదేరిన ఒక ఓడ, వాతావరణం సహకరించక కోరంగిరేవులో కొన్ని వారాలపాటు నిలిపి ఉంచవలసి వచ్చిందట. ఈ ఉదంతం ద్వారా కోరంగి రేవు అప్పటికి ఓడలకు కొన్ని వారాలపాటు ఆశ్రయం ఇచ్చే ఒక రేవు పట్టణంగా ఉండేది అని అర్ధం చేసుకొనవచ్చును [5].

    1666 జూలై లో ఒక ఓడ లోని సరుకులు ఎవరికి చెందాలి అనే అంశంపై వచ్చిన ఒక వివాదంలో మచిలీపట్నం వ్యాపారులు బెంగాలులో ఉండే కంపనీ అధికారులకు వ్రాసిన ఒక లేఖలో కోరింగ ప్రాంతానికి ‘మహమ్మద్ బేగ్ అనే వ్యక్తి సుబేదారుడు’ గా ఉన్నాడు అని చెప్పటాన్ని బట్టి కోరంగి రేవు గోల్కొండ నవాబు ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తుంది [6]. (ఈ మహమ్మద్ బేగ్ 1670-1676 మధ్య రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా చేసుకొని, నిజాం ప్రభువు ప్రతినిధిగా వేంగిరాజ్యాన్ని పాలించినట్లు మెకంజీ కైఫియ్యతుల ద్వారా తెలుస్తున్నది)

    ఆ తదుపరి కాలంలో నెలకొని ఉన్న రాజకీయ అస్థిరతల వల్ల కోరంగి నుండి జరిగే నౌకా వ్యాపారం క్షీణించింది. ఓడదొంగల దుర్మార్గములు పెరిగిపోయినవి. విదేశీ నౌకలు రేవులను చేరుటకు భయపడే పరిస్థితి వచ్చినది.

       కోరంగికి సమీపంలో ఉన్న ఇంజరం బ్రిటిష్ వారికి ఒకనాటి ప్రముఖ వర్తక కేంద్రం. ఇంజరంలో నివాసముండే ఈస్ట్ ఇండియా కంపనీ ప్రతినిధి అయిన జాన్ సాండర్ సన్ 1731, ఏప్రిల్ 7 న వ్రాసిన ఒక ఉత్తరంలో కోరంగికి సమీపంలో డచ్చి వారు ఒక స్థావరాన్ని నిర్మించుకోనున్నట్లు తెలిసింది, మనం కూడా అక్కడ ఏదైనా గొడౌన్ నిర్మించుకోగలిగితే ఉపయోగకరంగా ఉంటుందని పై అధికారులకు విన్నవించాడు [7] .

    1739 జూన్ 1 న ఇంజరం కంపనీ ప్రతినిధి Rich Prince వ్రాసిన ఒక ఉత్తరంలో బ్రిటిష్ వారు ఇంజరంలో కొనుగోలు చేసిన కాటన్ వస్త్రాలను రోడ్డుమార్గం గుండా కోరంగి రేవుకు చేరవేసి అక్కడ నుంచి ఎగుమతి చేయటం ఇబ్బందిగా ఉందని, వర్షాకాలంలో రోడ్డుమార్గంపై సరకులను చేరవేసేటపుడు తడిచిపోయి పాడయిపోతున్నాయని చెప్పాడు.

    1751, జనవరి 6 న ఇంజరంలో నివసించే ఈస్ట్ ఇండియా ప్రతినిధి వెస్ట్ కాట్ (Mr. Westcot) వ్రాసిన ఒక లేఖలో స్థానిక రాజు (పూసపాటి పెదవిజయరామరాజు) కోరంగిని సాలుకు 120 పగోడాల చొప్పున గోల్కొండ నవాబు నుండి కౌలుకి తీసుకొన్నాడు. అదే ధరకో కొంచెం ఎక్కువకో మనం తీసుకోగలిగితే మన వ్యాపారాలకు కోరంగి రేవు ఎంతో ఉపయోగపడుతుందని, తనకు అనుమతి ఇస్తే ముందుకు వెళతానని - అంటూ తన ఉన్నతాధికారులకు విన్నవించుకొన్నాడు. అదే సంవత్సరం సెప్టెంబరు నెలలో వ్రాసిన మరో ఉత్తరంలో కోరంగిని కౌలుకు తీసుకోవటం విషయంలో తన ఆలోచనను సమర్ధించినందుకు వెస్ట్ కాట్ ధన్యవాదాలు చెప్పినట్లు ఉండటాన్ని బట్టి ఈస్ట్ ఇండియా గవర్నరు ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి ఉంటారని భావించాలి.

    1753 ఫిబ్రవరి 1 వ తేదీన వెస్ట్ కాట్ ఉన్నతాధికారులకు వ్రాసిన ఒక లేఖలో - రాజుగారి నుండి కోరింగ రేవు పట్టణాన్ని ఏడాదికి రెండువందల అరవై పగోడాల మొత్తానికి కౌలుకు తీసుకొన్నానని, కోరంగి రేవును స్వాధీనం చేసుకొన్నానని; అంతే కాక ఇక్కడ దిగే ఓడలకు మూడు సంవత్సరాలపాటు సుంకం చెల్లించక్కరలేదని ప్రకటించానని, అలా చేయటం ద్వారా వివిధ దేశాలకు చెందిన నౌకలు ఇక్కడకు వస్తాయని తద్వారా ఎక్కువ వ్యాపారం చేసే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు [8]. కోరంగి రేవుపట్టణాన్ని కౌలుకు ఇప్పించటంలో సహకరించిన వారికి 66 పగోడాల బహుమతులను ఇచ్చినట్లు 1756 నాటి కంపనీ జమా ఖర్చులలో ఉండటం ఆనాటి సమాజంలో ఉన్న అవినీతిని పట్టిచూపుతుంది [9] .

        అంతవరకూ ఇంజరంలో ఉంటూ వ్యాపారాలు చేసిన వెస్ట్ కాట్ కోరంగికి తన మకాం మార్చి 1759 లో కోరంగి కాలువకు తూర్పువైపున అనేక నూతనభవనములు, గిడ్డంగులు నిర్మించాడు. వెస్ట్ కాట్ అభివృద్ది పరచిన ఈ ప్రాంతం కొత్తకోరంగి గా పేరుగాంచినది. కోరంగి కాలువకు పశ్చిమఒడ్డున కల ప్రాచీన కోరంగిపట్టణాన్ని పాతకోరంగిగా ప్రజలు పిలుచుకొంటున్నారు.
    వ్యాపారనిమిత్తం భారతదేశం వచ్చిన ఇంగ్లీషు, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు వర్తకుల మధ్య పద్దెనిమిదో శతాబ్దంలో విపరీతమైన పోటీ ఉండేది. ఒకరినొకరు బద్ద శత్రువులుగా చూసుకొనేవారు. ఆనాటి అరాచక పరిస్థితులను 1789 లో కోరంగిని సందర్శించిన Mr. Topping అనే బ్రిటిష్ వ్యాపారి కళ్లకు కట్టినట్లు వర్ణించాడు – “కోరంగిలో ఇంగ్లీషు, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు ఓడలు లంగరు వేసి ఉన్నాయి. చెడు ప్రవర్తన కలవారు ఇక్కడ విపరీతంగా సంచరిస్తున్నారు. ఎవరికీ భద్రత లేదు. రాత్రివేళల మద్యం మత్తులో ఎవరు ఎవరిని హత్యచేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఎవరు దోపిడీ చేస్తారో తెలియని పరిస్థితులు కోరంగిలో నెలకొని ఉన్నాయి” అంటూ Mr. Topping తనకు రక్షణ కల్పించమని కంపనీ అధికారులను కోరుకొన్నాడు [10]. పంతొమ్మిదో శతాబ్దం వచ్చేసరికి ఇంగ్లీషు వారు రాజకీయంగా బలపడటంతో ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు నెలకొన్నాయి.

    బ్రిటిష్ వారు కోరంగి రేవుకు తిరిగి పూర్వవైభవాన్ని తీసుకొచ్చి, ప్రపంచ ప్రసిద్ధ రేవుపట్టణంగా అభివృద్దిచేసారు. 1802 లో Mr. Ebenezer Roebuck అనే వ్యాపారి ఓడలు నిలుపుచేసే స్థలాన్ని (Dock) ను నిర్మించాడు. Ebenezer Roebuck ఒక లండన్ వ్యాపారి. ఇతను వ్యాపారనిమిత్తం భారతదేశం వచ్చి కోరంగిలో స్థిరపడి వ్యాపారాలు సాగించాడు. ఇతను నిర్మించిన Dock లో 155 అడుగుల పొడవు, 51 అడుగుల వెడల్పు ఉన్న Albatros పేరుగల ఓడకు మరమ్మత్తులు చేయటం అప్పట్లో ఒక రికార్డుగా నిలిచింది ఎందుకంటే కలకత్తా నుండి శ్రీలంక మధ్యలో ఎక్కడా ఇంతపెద్ద ఓడలను నిలుపుచేసే సౌకర్యం ఉండేది కాదు [11]. 1855 లో ఈస్ట్ ఇండియా కంపనీ 62,638 రూపాయిలతో కోరింగ హార్బర్ ను ఆధునీకరించింది. కోరంగి రేవు ద్వారా 1877-78 మధ్య ఎనిమిదిలక్షల రూపాయిల వ్యాపారం జరిగింది [12]. 1845 కోరంగి లైట్ హౌస్ ను నిర్మించారు. దీని నిర్మాణానికి 73 వేల రూపాయిలు ఖర్చు అయ్యాయి. 1855 లో దీని ఎత్తు 20 అడుగులు పెంపుచేసి, ఎక్కువదూరం కనిపించటం కొరకు లైట్ హౌస్ దీపం సామర్ధ్యం పెంచారు. ఈ లైట్ హౌస్ నుంచి వచ్చే కాంతి సముద్రంలో పద్నాలుగుమైళ్లవరకూ ప్రసరిస్తూ నౌకలకు దారిచూపేది. 1902 తరువాత దీనిని వినియోగించటం నిలిపివేసారు. ప్రస్తుతం ఇది కోరంగి మడ అడవులను సందర్శించటానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ఒక టూరిస్టు స్పాటుగా ఉంది.

    మద్రాసు గవర్నరుగా పనిచేసిన లార్డ్ కన్నెమెరా 19 డిసంబరు 1889 న మద్రాసులో Sirsa అనే ఓడపై బయలుదేరి మచిలీపట్నం, కాకినాడ రాజమండ్రి ప్రాంతాలను సందర్శన చేసాడు. ఇతను కోరంగిరేవులో దిగి కాకినాడ వెళ్ళిన వివరాలు ఇలా ఉన్నాయి "మచిలీపట్నం నుంచి బయలుదేరి ఆ రాత్రంతా ప్రయాణించి ఉదయానికల్లా కాకినాడకు పదిమైళ్ళ దూరంలో ఉన్న కోరంగి రేవుకు చేరుకొన్నాం. కోరంగి రేవు సందడిగా ఉంది. పెద్ద సంఖ్యలో ఓడలు, పడవలు లంగరు వేసి ఉన్నాయి. దూరంనుంచే యజమానులు తమ ఓడలను గుర్తించేందుకు వీలుగా ఓడలకు వివిధ రకాల రంగురంగుల జండాలు ఎగురుతూన్నాయి. జిల్లా కలక్టర్ Mr. Power వచ్చి ఓడలో గవర్నరుగారిని కలిసాడు. అప్పటికే సిద్ధం చేసిన ఆవిరి పడవ ఎక్కి కాకినాడ చేరుకొన్నాము [3]. " పై వివరాలనుబట్టి 1889 నాటికి కోరంగి రేవు ప్రధాన జలమార్గంగా, ఓడరేవుగా ఉన్నట్లు అర్ధమౌతుంది.

    1901 లో బ్రిటిష్ ప్రభుత్వం Mr. Brown అనే ఇంజనీరు ఆధ్వర్యంలో కోరంగి వద్ద తెరుచుకొనే వంతెన (Bascule Bridge) ను నిర్మించింది. ఓడలు వచ్చినప్పుడు ఈ వంతెన రెండుగా తెరచుకొని సుమారు 50 అడుగుల దారి ఇచ్చేది. ఈ వంతెన తలుపులను పైకిలేపటానికి ఎనిమిదిమంది అవసరపడేదట [14] .

    ఇరవయ్యో శతాబ్దం వచ్చేసరికి కోరంగి రేవులో ఇసుకమేటలు వేయటంతో దానిలోతు క్రమేపి తగ్గనారంభించింది. ప్రతి పదేళ్లకు ఒక అడుగుచొప్పున ఇసుక పేరుకుపోయేదట. పెద్దఓడలు వచ్చినపుడు అవి ఇసుకలో కూరుకుపోయేవి. అందుచేత ఓడల రాక నెమ్మదినెమ్మదిగా తగ్గిపోవటం జరిగింది. 1898-99 నాటికి కోరంగి రేవులోకి ఓడలరాక పూర్తిగా నిలిచిపోయింది. కోరంగి తన వైభవాన్ని కోల్పోవటంతో కాకినాడ నౌకాశ్రయం క్రమేపీ దీని ప్రాభవాన్ని అందిపుచ్చుకొని ప్రధాన రేవుపట్టణంగా ఎదిగింది.

2. కోరంగి ఒకనాటి నౌకా నిర్మాణ కేంద్రం

        పూర్వం నౌకల నిర్మాణం, మరమ్మత్తులకు కోరంగి ప్రపంచవ్యాప్త కీర్తి గడించింది. 500 టన్నుల బరువును మోయగలిగే సామర్ధ్యం కల ఓడలు ప్రతీ ఏటా వందకుపైగా తయారయ్యేవి. అంతే కాక ఈ సంఖ్యకు నాలుగురెట్లు ఓడలు మరమ్మత్తుల కొరకు వచ్చేవి. నౌకానిర్మాణానికి ప్రధాన ముడిసరుకు టేకు కలప. గోదావరి జిల్లాలోని అడవులలో టేకు కలప విస్తారంగా కలదు. ఇది ఇతర ప్రాంతాలలో దొరికే టేకు కన్న తక్కువ ధరకు లభించటవల్ల కోరంగిలో నౌకా నిర్మాణ పరిశ్రమ బాగా అభివృద్ధిచెందింది. అంతే కాక కోరంగి నుంచి ప్రతీఏటా 2000-3000 టేకు దూలాలు కోరంగి ఇతరప్రాంతాలకు ఎగుమతి జరిగేది. 1793 లో Hamilton అనే ఈస్ట్ ఇండియా వ్యాపారికి కోరంగిలో వెయ్యి టేకుదూలాలను నిలువ చేయగలిగే గొడౌన్ ఉండేదంటే ఏ స్థాయిలో ఇక్కడ కలప వ్యాపారం జరిగిందో అర్ధం చేసుకొన వచ్చును [15]. నేటికీ కోరంగిలో వందగదుల బిల్డింగ్ పేరుతో కొన్ని శిథిలాలను చూపిస్తారు స్థానికులు అది ఒకనాడు ఇక్కడ జరిగిన లావాదేవీలకు జ్ఞాపకంగా మిగిలిన ఆనవాలు.

        నిజానికి భారతదేశ నౌకాయాన పరిశ్రమ అతి ప్రాచీనమైనది. వేదాలలో నావికా పరిశ్రమ, నౌకా వ్యాపారమును గురించి ప్రస్తావనలు ఉన్నాయి. భుజ్యురాజు ఓడ ప్రమాదమునకు గురయినపుడు అశ్విని సోదరులు తమ నూరుతెడ్ల ఓడలో అతనిని సంరక్షించిన కథ వేదరుక్కులలో కలదు. మహాభారతంలో రాజసూయయోగ సందర్భముగా సహదేవుడు అనేక ద్వీపములను జయించాడని ఉన్నది. వరాహపురాణములో గోకర్ణుడను వర్తకుడు నౌకాయానముచేస్తూ నౌకా భంగానికి గురయినట్లు తెలుపబడింది. నౌకానిర్మాణానికి అనుకూలమైన కలప గురించి, నౌకా లక్షణముల గురించి, వివిధ అవసరాలకు తగినట్లు సుమారు 25 రకాల వివిధ నౌకలనిర్మాణం వాటి మంచి చెడ్డల గురించి "యుక్తికల్పతరువు" అనే గ్రంథంలో మన ప్రాచీనులు విపులంగా వర్ణించారు. మనుస్మృతిలో నౌకా వ్యాపారం చేసేందుకు అనుకూలమైన కాలములు చెప్పారు. రేవుపట్టణంలో ఉండే రాజప్రతినిధి అయిన నావాధ్యక్షుని విధులు -పన్నులు వసూలు చేయటం, నౌకలకు కావలసిన సదుపాయములు కల్పించటం, ఎగుమతి దిగుమతుల్లో అక్రమాలు జరగకుండా చూడటం, ఓడదొంగలనుండి వ్యాపారులకు రక్షణ కల్పించటం- అని చాణక్యుని అర్ధశాస్త్రంలో చెప్పబడింది. శాతవాహనపాలకులు నౌకా చిహ్నాలను తమనాణాలపై ముద్రించుకొన్నారు [16].

        అంతటి ఘన చరిత్ర కలిగిన భారతీయ నౌకా పరిశ్రమ శాస్త్రీయంగా నిర్మించిన ఓడలను తొలిసారిగా చూసిన యూరోపియన్ లు అచ్చెరువొందారు. వాళ్ళు వ్యాపారం కొరకు వచ్చారు కనుక ఇక్కడ నిర్మించిన నౌకలను విదేశాలకు ఎగుమతి చేసి పెద్దఎత్తున వ్యాపారం చేసారు. కోరంగిలో నిర్మించిన నౌకలు దేశవిదేశాలలో క్షణాలలో అమ్ముడు పోయేవి. ఉదాహరణకు 1814లో కోరంగిలో నిర్మించబడ్డ Lady Hood పేరుకల ఓడ ఫ్రాన్స్ దేశం లో విక్రయించబడింది. 1816లో తయారైన City of Edinurgh ఓడను ఇంగ్లాండు వ్యాపారులు కొనుక్కొన్నారు. 1818 నాటి Isabella ఓడను అమెరికా కు పంపించటం జరిగింది [17] .

        1833 లో కోరంగిలో నిర్మితమైన Charles Eaton అనే ఓడ ఎలా ఉండేదో వివరాలు ఇలా ఉన్నాయి.

        "Charles Eaton 350 టన్నుల బరువును మోయగలిగే సామర్ధ్యము కలిగి ఉన్నది. కోరంగి ఓడరేవు అధికారిగా పనిచేసి 1827 లో ఇక్కడే మరణించిన Charles Eaton పేరును ఈ ఓడకు పెట్టారు. ఈ ఓడ అత్యుత్తమ టేకు తో తయారయినది. రెండు అంతస్థులు కలవు. ఒక్కో అంతస్థు ఎత్తు ఆరున్నర అడుగులు. ఓడముందరి భాగము ఎత్తుగా అందముగా నగిషీలతో ఉన్నది. గదుల మధ్య నడవటానికి పొడవుగా, వెడల్పైన వసారా కలదు. ఓడ వెలుపలి భాగం దృఢంగా ఉండటం కొరకు చెక్కలకు సున్నం, తారులతో రాగిరేకులు తాపడం చేసి ఉన్నవి. ఈ ఓడకు చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే, ప్రయాణికులు బసచేసే గదులు పెద్ద ఓడలలో ఉన్నట్లుగా చాలా విశాలంగా, విలాసవంతంగా ఉండి, ప్రతి గదికి ప్రత్యేకమైన Toilet కలిగి ఉండటం. ఈ ఓడను లండన్ మార్కెట్టులో అమ్మకానికి పెట్టగా Gledstanes & Co అనే కంపనీ కొనుగోలు చేసింది" [18].

        కోరంగి ఓడలకు ఉన్న డిమాండ్ కారణంగా నౌకానిర్మాణకారులకు ముందస్తుగా అడ్వాన్సులు ఇచ్చి తయారుచేయించుకొనేవారు. ఉదాహరణకు; 1854 లో Delacombe అనే ఫ్రెంచి వ్యాపారి మాసరయ్య అనే వడ్రంగికి 20 మీటర్ల పొడవైన నౌకను నిర్మించి ఇవ్వటానికి 350 రూపాయిలు అడ్వాన్సుగా ఇచ్చి ఎగ్రిమెంటు చేసుకొన్నాడు [19].

        పై వర్ణనలను బట్టి కోరంగి నౌకా నిర్మాతలు అంతర్జాతీయ ప్రమాణ నైపుణ్యాలను కలిగి ఉండేవారని అర్ధమౌతుంది.

        కోరంగి రేవు వద్దకు అనేక అంతర్జాతీయ నౌకలు మరమ్మత్తుల కొరకు వచ్చేవి. CPT Laplace అనే ఒక ప్రపంచ యాత్రికుడు 1830 జూలై నెలలో కోరంగిలో ఆగి తన 120 అడుగుల పొడవు, 33 అడుగుల వెడల్పు కల La Favourite అనే నౌకను మరమ్మత్తు చేయించుకొన్న సంగతిని “Voyage autour du Monde” (Travel around the world) అనే పుస్తకంలో ఇలా గ్రంథస్థం చేసాడు.

        "కోరంగి వద్ద నైపుణ్యం కలిగిన వడ్రంగులు, కమ్మరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. La Favourite చెడిపోయిన చుక్కాని యొక్క లోహఅమరికను జాగ్రత్తగా విప్పి, దాన్ని కరిగించి ఎంతో ఖచ్చితత్వంతో, నైపుణ్యంగా పూర్తిగా కొత్తదానివలె తయారు చేసి తిరిగి ఓడకు బిగించారు. చాలా చవకగా, తక్కువ సమయంలో ఓడకు వీరు చేసిన ఇది ఇంకా ఇతర మరమ్మత్తులు నాకెంతో సంతృప్తిని ఇచ్చాయి" అంటూ ప్రపంచాన్ని చుట్టి వచ్చిన లాప్లాస్ కోరంగి ఓడలు నిర్మించేవారి పనితనాన్ని గురించి చేసిన వ్యాఖ్యలు విలువైనవి.

        తుఫానులు, వరదలు, ఉప్పెనల కారణంగా ఏర్పడ్డ ఇసుకమేటల వలన ఇక్కడి నౌకా నిర్మాణ, మరమ్మత్తుల వ్యాపారం కాలక్రమేణా క్షీణించింది. అంతేకాక ఆవిరి ఓడల రాకవల్ల తెరచాపలపై ఆధారపడి నడిచే ఓడలు తమ ప్రాముఖ్యతను కోల్పోవటం కూడా మరో కారణము. గతవైభవానికి చిహ్నంగా కోరంగి సమీపంలో కల తాళ్లరేవులో పడవల నిర్మాణం ఇంకా నేటికీ కొనసాగుతున్నది.

3. కోరంగిని ధ్వంశంచేసిన తుఫానులు ఉప్పెనలు

        కోరంగి తీరప్రాంతంలో ఉండటం వలన ఉప్పెనల తాకిడి ఎక్కువ. Topping అనే బ్రిటిష్ ఇంజనీరు 1789 లో కోరింగని సర్వే చేసేటపుడు, అతడు స్థానిక ప్రజలను చేసిన విచారణల ద్వారా 1706 లో కోరంగిలో వచ్చిన ఒక ఉప్పెన వల్ల స్వల్ప నష్టం జరిగిందని, ఆ తరువాత 1787 మే 20 న వచ్చిన ఉప్పెన మహా ప్రళయాన్ని సృష్టించిందని రికార్డు చేసాడు.

        ఈ ఉప్పెన వచ్చిన మర్నాడు ఇంజరంలో నివాసం ఉంటున్న ఇంగ్లీషు అధికారి తన పై అధికారులకు వ్రాసిన ఉత్తరంలో ... “ఉప్పెన వల్ల కోరంగిపట్టణం, చుట్టుపక్కల గ్రామాలు నేలమట్టం అయ్యాయి. బంధువులను కోల్పోయిన ప్రజలు అటూ ఇటూ పరుగులెడుతూ రోదిస్తూ తిరిగుతుండటం హృదయవిదారకరంగా అనిపిస్తుంది. నూతులు చెరువులు ఉప్పునీటితో నిండిపోయాయి. ప్రజలకు తాగునీరు ఎక్కడా లభించటం లేదు. కనీసం ఇరవైవేలమంది ప్రజలు, అయిదులక్షల పశువులు కనిపించటం లేదు. ఆహారనిల్వలు, పంటలు అన్నీ నాశనం అయ్యాయి” అంటూ ఆనాటి ఉప్పెన విధ్వంసాన్ని వర్ణించాడు.

        ప్రపంచయాత్రికుడు లాప్లాస్ తన పుస్తకంలో ఆనాటి విధ్వంసం గురించి ఇలా చెప్పుకొచ్చాడు "తుఫాను ఒక్క రోజులో విలయం సృష్టించింది. తాడెత్తు కెరటం కోరంగిపై విరుచుకుపడింది. ఇరవై వేలమంది ప్రజలు ఆ ఉప్పెనలో కొట్టుకు పోయారు. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. తుఫాను ముగిసాక కోరంగి పోర్టు ఆఫీసరు ఇల్లు, ఓడలు నిలుపు స్థలము తప్ప సర్వం మట్టిలో కప్పబడిపోయాయి. అంతవరకూ ఇక్కడ అన్ని యూరోపియన్ దేశాలకు చెందిన వర్తక స్థావరాలు ఉండేవి. 1787 లో వచ్చిన ఉప్పెనకు ముందు కోరంగిలో ముప్పై వేలమంది నివసించేవారు. అనేక ఎత్తైన భవనాలు ఉండేవి. ఈ రోజు ఏమీ లేదక్కడ " [20].

        1787 నాటి ఉప్పెనకు కోరంగిలో నిలుపుచేసిన ఓడలు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో కల రాజమండ్రి వరకు కొట్టుపోయాయంటే ఎంత ఎత్తులో నీరు వచ్చిందో ఊహించుకొనవచ్చును.

        ఆ తరువాత కాలంలో కోరంగిని అతలాకుతలం చేసిన అతి పెద్ద తుఫాను 1839 నవంబరు 16, 17 తారీఖులలో వచ్చింది. ఈ తుఫాను అండమాను నుంచి మొదలై తక్కువ వ్యాసంతో, ఎక్కువ శక్తితో, సుడులు తిరుగే గాలులతో కోరంగిని తాకిందని వాతావరణ శాస్త్రవేత్త Henry Piddington అభిప్రాయపడ్డాడు. ఈ రకపు తుఫానులకు Cyclone అనే పదాన్ని సృష్టించి వాడుకలోకి తీసుకొచ్చాడు
    ఆనాటి రాజమండ్రి కలక్టర్ George Smith ఈ తుఫానుగురించి ”16 వ తారీఖు ఉదయం నుంచీ గాలులు తీవ్రంగా వీచటం మొదలైంది. ఆ రాత్రికల్లా సముద్రం అనేక తీరప్రాంత గ్రామాలను ముంచెత్తింది. సుమారు అయిదువేలమంది మరణించి ఉంటారని అనుకొంటున్నాను” అంటూ తుఫానుపై తన తక్షణ రిపోర్టును పై అధికారులకు తెలిపాడు [21] .

    నవంబరు 27వ తారీఖు Madras Herald అనే పత్రిక ఈ తుఫానును గురించి ఇలా వ్రాసింది “పదహారవ తారీఖు రాత్రి పదకొండు గంటలనుండి గాలుల తీవ్రత పెరిగి ఉదయం 4 గంటలవరకూ బీభత్సాన్ని సృష్టించాయి. ఆ సమయంలో కోరంగిలో కాస్త ఎత్తులో ఉన్న ఒకే ఒక పెద్ద బిల్డింగు, ఇంకా మూడు నాలుగు చిన్న ఇళ్ళు మాత్రమే మిగిలాయి. సర్వం ఆ ఉప్పెనలో కొట్టుకుపోయాయి. సుమారు 20000 మంది చనిపోయారు. ఎక్కడ చూసినా శవాల కుప్పలు.

    కోరంగికి దానికి నాలుగైదుమైళ్ళ దూరంలో ఉన్న Onagalo ఆలయానికి మధ్య నివాసప్రాంతాలన్నీ నిర్జనమయ్యాయి. (బహుశా చొల్లంగి ఆలయం కావొచ్చు). లైట్ హౌస్ లాంతరు, ఫోకస్ అద్దం పగిలిపోయాయి [22] .

    1839 డిసంబరు 7 వ తేదీ "Bombay Courier" అనే పత్రిక "నవంబరు లో వచ్చిన తుఫాను కారణంగా యూరోపియన్, దేశీయుల ఇళ్ళన్నీ నేలమట్టం అయ్యాయి. కోరంగిలో నేడు చూడటానికి ఏమీ లేవు శిథిలాలు తప్ప. ఒక్క అయిదారు గంటలు మాత్రమే సాగిన విధ్వంసంలో సుమారు 20000 మంది పైగా మృతి చెందారు. ఎటుచూసినా మృతదేహాలు. పెద్ద పెద్ద ఓడలు నదిలో ఎక్కడెక్కడికో కొట్టుకుపోయాయి. వందలాది చిన్న పడవలు గల్లంతు అయ్యాయి. " అంటూ 1839 కోరంగి తుఫాను నష్టాన్ని రిపోర్టు చేసింది.

    1839 కోరంగి తుఫాను ఉగ్రత గురించి సమీప ఫ్రెంచి కాలనీ అయిన యానాం అధికారి Colin De Bar పాండిచేరీకి గవర్నరుకు వ్రాసిన లేఖలలో ఇలా తెలియచేసాడు. "ఆ రాత్రి 11 గంటలకు తుఫాను గాలులు తీవ్రతరం కావటంతో ప్రజలు భయాందోళనలకు గురయి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవటం మొదలుపెట్టారు. నా అధికారిక నివాసంలోకి నీళ్ళు ప్రవేశించి చాలా రికార్డులు కొట్టుకు పోయాయి. నేనుకూడా నా నివాసాన్ని విడిచి మన్యం వారి మేడపైకి చేరుకొన్నారు. ఫ్రెంచి జండాను ఎగరేసే జండా స్థంభం మొదలులోకి విరిగిపడింది. యానాం, కాకినాడ రాజమండ్రి ప్రాంతాలలో సుమారు 130 నౌకలు ఎక్కడెక్కడికో కొట్టుకుపోయాయి. అనేక వందల పడవల ఆచూకీ లేదు. కొంతమంది వ్యక్తులు, శవాలు తమతమ ఇళ్ళకు కొన్ని కిలోమీటర్ల వరకూ విసిరివేయబడ్డారు. నాలుగొందలమంది తలదాచుకొన్న ఓ ఇల్లు కూలిపోవటంతో అందరూ అక్కడికక్కడే చనిపోయారు " [23]

    కోరంగిలో వచ్చిన ఈ రెండు తుఫానులు ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైనవిగా, గరిష్టస్థాయిలో నష్టాన్ని కలిగించిన వాటిగా నేడు గుర్తిస్తున్నారు. 1839 కోరింగ సైక్లోనులో మూడు లక్షల మంది చనిపోయారని, ఇది ప్రపంచ తుఫానులలో మూడవ అతి పెద్ద తుఫాను అంటూ అనేక ఇంటర్నెట్ సైట్లలో చెప్పబడుతూ ఉన్నది. కానీ ఈ సంఖ్యలకు సంబంధించిన సరైన చారిత్రిక ఆధారాలు కనిపించలేదు.

4. కోరంగి రేవునుంచి జరిగిన వలసలు

    గోదావరి జిల్లాలలో పద్దెనిమిదో శతాబ్దంలో ఆహారపంటలు బదులుగా ఎక్కువలాభాలను అందించే నీలిమందు, పత్తి, చెరకు, పొగాకు, నువ్వులు వంటి వ్యాపార పంటలను పెంచి వాటి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే వారు. అలా సంప్రదాయ వ్యవసాయంలో వచ్చిన మార్పు వలన ఆహారధాన్యాలకు కరువు ఏర్పడింది. వ్యవసాయకూలీలకు పనులు లేక తిండిలేక కోరంగి కాకినాడ లాంటి రేవులలో కూలీలుగా మారి జీవనం సాగించేవారు. అనేకమంది కూలీలు ఇక్కడ విలయతాండవం చేస్తున్న కరువునుండి తప్పించుకోవటం కొరకు రంగూను, మారిషస్ ప్రాంతాలకు వలసపోయేవారు. ఎక్కువమంది అక్కడే స్థిరపడిపోయారు. ఇలాంటి వలసలు 1830 ల నుంచి మొదలైంది. కోరంగి రేవునుంచి రంగూను, మలేషియా వెళ్ళి అక్కడ స్థిరపడిన వారిని అక్కడి స్థానికులు నేటికీ కొరంగీలు అని పిలుస్తారు. 1850 ల తరువాత ధవళేశ్వరం ఆనకట్ట కారణంగా వేల ఎకరాలు సాగులోకి వచ్చి ఈ ప్రాంతంలో కరువు పరిస్థితులు తగ్గాయి. ఆ కాలంలో ఈ ప్రాంతవాసులు మెరుగైన అవకాశాలకొరకు, వ్యాపారం చేయటానికి రంగూను వెళ్ళేవారు. అలా వెళ్ళినవారిలో కోరంగి గ్రామానికి చెందిన శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ ఒకరు. వీరు రంగూన్ వెళ్ళి, వ్యాపారాలు చేసి సంపాదించిన ఎనిమిది లక్షల రూపాయిలతో కాకినాడలో విద్యాసంస్థలు నెలకొల్పమని 1919 లో ఏర్పాట్లు చేసారు. వారి ఆశయాలకు అనుగుణంగా నెలకొల్పిన MSN Charities విద్యాసంస్థలు నేటికీ నడుస్తూ జిల్లాకి తలమానికంగా నిలిచాయి.

5. కోరంగి సాంస్కృతిక అంశాలు

    కోరంగి ఊరికి ఆ పేరెలా వచ్చిందో చెప్పే స్థలపురాణం ఒకటి మెకంజీ సేకరించిన సిద్ధాంతం కైఫియ్యతులో కలదు. "త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తున్నపుడు గోదావరి తీరంపై కొంతకాలం నివసించాడు. ఒకనాడు సీత ముచ్చట పడిన బంగారు కురంగమును (జింక) పట్టుకోవటానికి దానిని చాలాదూరము వెంటతరిమాడు. అది ప్రాణము విడిచిన ప్రాంతములో ఆ పిమ్మట ఒక గ్రామము ఏర్పడినది. దానిని కోరంగి అని ప్రజలు పిలుచుకొంటున్నారు". ఈ కథ కోరంగి గ్రామనామానికి ఐతిహాస్య సంబంధాన్ని కల్పిస్తుంది.
ఏడవ శతాబ్దంలో కోరంగి కురంగేశ్వరపురము పేరుతో ప్రఖ్యాతిక్కెకిన పట్టణముగా ఉండెను. [24] నేడు కోరంగి సమీపములో ఉన్న తూరంగి వద్ద రాముడు ప్రతిష్టించినట్లు చెప్పబడే తురంగేశ్వర ఆలయము కలదు. కురంగేశ్వర నామం తురంగేశ్వరం గా కాలానుగుణ మార్పు చెంది ఉండవచ్చు.

    తూర్పుతీరంపై నవంబరు నుండి జనవరి మధ్య మధ్య ఉత్తరతూర్పు గాలులు బలంగా వీస్తాయి. భారతీయ పంచాంగం ప్రకారం ఈ రోజులు కార్తీకమాసంలో వస్తాయి. ఈ సమయంలో ఓడలు సరుకులు తీసుకొని తూర్పుదక్షిణ దేశాలకు వ్యాపారనిమిత్తం బయలుదేరేవి. ఓడలపై బయలుదేరివెళ్ళే పురుషులకు వారి కుటుంబస్త్రీలు తీరంవద్దకు వచ్చి ఆనందోత్సాహాలతో వీడ్కోలు చెప్పేవారు. తీరప్రాంతాలలో ఈ సమయంలో పెద్ద ఎత్తున ఉత్పత్తుల అమ్మకాలు కొనుగోళ్ళు జరుగుతూ ఒక పండగవాతావరణం ఉండేది. నేటికీ కార్తీకపౌర్ణమిరోజున నౌకాయానంతో సంబంధం ఉన్న ఒరిస్సానుంచి తమిళనాడు వరకూ స్త్రీలు బొమ్మపడవపై దీపాన్ని ఉంచి నదులలోకి విడిచిపెట్టటం ఒక ఆచారంగా పాటిస్తారు. దీనిని ఒరిస్సాలో బాలియాత్ర గా, తెలుగు, తమిళప్రాంతాలలో ఈ పండుగను కార్తీకపౌర్ణమిగా పాటిస్తారు. తెలుగు ప్రాంతాలలో కార్తీక అమావాస్య మరుసటి రోజు అంటే మార్గశిర పాడ్యమి నాడు నదీ స్నానం ఆచరించి అరటి డొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెట్టడం ఆనవాయతి గా ఉన్నది.

    ఇదే విధంగా నీటిలో దీపం ఉంచిన పడవబొమ్మలను విడువటం అనే ఆచారం ఇక్కడ నుంచి మనవాళ్ళు బయలుదేరి ఎక్కడైతే వ్యాపారాలు చేసేవారో అక్కడి దేశాలలో కూడా ఉండటం గమనార్హం. థాయిలాండ్ లో స్త్రీలు నీటిలో బొమ్మపడవలో దీపం ఉంచి విడిచే పండుగను Loykrathong పేరుతో, బాలి లో Masakapan Ke Tukad పేరుతో జరుపుకొంటారు. ఈ సాంస్కృతిక సారూప్యతను వందల సంవత్సరాల క్రితం జరిగిన Cultural Exchange గా అనుకోవచ్చు.
కార్తీక మాసంలో ఆడపడుచులు తమ సోదరులకు భగినీ హస్తభోజనం పేరుట విందు ఏర్పాటు చేసే ఆచారం కూడా తెలుగునాట కనిపిస్తుంది. ఇది బహుసా వ్యాపారాల నిమిత్తం బయలుదేరుతున్న సోదరులకు శుభకామనలు చెప్పటం కొరకు లేదా ఎక్కువ ధనంతో తిరిగి వచ్చి తమకు మంచి బహుమతులు ఇవ్వవలసి ఉంటుంది అంటూ తమ బంధాలను దృఢపరచుకోవటం కావొచ్చు. కారణమేదైనా ఈ పండుగలు నౌకలు ప్రయాణించే నెలలలో రావటం వెనుక ఉండే చారిత్రిక కారణాలను విస్మరించలేం. [25]

        వ్యవసాయ ఉత్పత్తులు వచ్చే కాలంలో సంక్రాంతి పండుగ జరుపుకోవటం ఎలాంటి ఆచారంగా పరిణమించిందో తూర్పుతీరంలో నౌకా వ్యాపారాలు జరుపుకొనే ఈ కాలంకూడా పండుగల రూపంలో మన సంస్కృతిలో ఒక భాగంగా స్థిరపడటం జరిగింది. ఈ పండుగలు ఒకనాడు ఈ ప్రాంతాలలో జరిగిన నౌకావ్యాపారాల అవశేషంగా భావిస్తారు.

ముగింపు

        కోరంగి సెమెటరీ లో బ్రిటిష్ అధికారులకు చెందిన ఏడు సమాధులు ఉన్నట్లు List of Inscriptions on Tombs in Madras Vol II లో సమాచారం ఉంది. అవి William Clark (1802), A. Meris (1804), Alexander Woodcock (1816), John Eaton (1819), Charles Eaton (1827), William Charles Eaton (1857) వ్యక్తులవి. వీరు కోరింగలో కంపనీ అధికారులుగా పనిచేసి ఇక్కడే గతించారు.

2009 లో ఈ సమాధులను మొత్తం పెకలించి ఆ ప్రాంతాన్ని చదును చేసినట్లు తెలిసింది. వాటిని విక్టోరియా సమాధులు అని స్థానికులు పిలుచుకొనేవారట. స్థానిక మాజీ సర్పంచి శ్రీ బుజ్జి గారి సహాయంతో, అతి కష్టం మీద ఎవరో ఔత్సాహికుడు భద్రపరచిన ఒక సమాధి ఫలకం దొరికింది. దానిపై
.
        "Sacred to the memory of Alexander Woodcock, Esq, who departed this life on 19th May 1816, aged 46 and Mary Ann, his infant daughter, who died in March, 1810, aged 11 months" అని ఉన్నది.

        ఈ అలెగ్జాండర్ వుడ్ కాక్ కోరంగి ఒక పెద్ద ఓడరేవుగా, నౌకా నిర్మాణకేంద్రంగా వెలుగొందిన కాలంలో ఓడరేవు అధికారిగా పని చేసాడు (Master attendant).
1817 నాటి Asiatic Journal and Monthly Register లో ఈ అలెగ్జాండర్ వుడ్ కాక్, Lark అనే ఓడపై కోరంగినుండి మద్రాసు వెళుతూ దారిమధ్యలో చనిపోయాడని ఉంది.
పైన చెప్పిన ఫలకం మద్రాసులో తయారైనట్లు క్రింద రాసి ఉంది. ఆ ఫలకంపై అలెగ్జాండర్ పేరుతో పాటు అంతకు ఆరేళ్ల క్రితం పదకొండునెలల వయసులో చనిపోయిన అతని కూతురు Mary Ann పేరు కూడా ఉండటం గమనార్హం. బహుశా అలెగ్జాండర్ మిత్రులో బంధువులో ఎవరో ఈ ఫలకాన్ని మద్రాసులో తయారుచేయించి ఆ తండ్రి కూతుర్ల జ్ఞాపకార్ధంగా పాతించి ఉంటారు.

        1915 లో గోదావరి జిల్లా చరిత్ర వ్రాసిన హెమ్మింగ్ వే "నేడు సముద్రంలో తీరానికి ఒక మైలు దూరంలో జాలరుల వలలకు ఏవో నిర్మాణాలు తగులుకొంటున్నాయి; పాటు సమయంలో అనేక ప్రాచీన నాణాలు బయటపడుతున్నాయి; సముద్రం లోపలేదో మునిగిపోయిన పట్టణం ఉండే ఉంటుంది" - అంటూ ఈ ప్రాంత ప్రాచీనతకు సముద్రాన్ని సాక్ష్యం చేస్తాడు. భారతదేశ చరిత్రలో జగజ్జేయమానంగా వెలుగొందిన ఒకనాటి కోరంగి, తుఫానులు, సునామీలు, వరదలు వంటి ప్రకృతివైపరీత్యాల కారణంగా పదుల అడుగుల మట్టి క్రింద కప్పడిపోయింది, కొంత సముద్రంలో కొట్టుకుపోయింది. ఏమో నేటి కోరంగి మట్టిపొరల క్రింద ఒకనాటి ఆంధ్రదేశ ఔన్నత్యాన్ని చాటే ఏఏ ఆధారాలు నిద్రిస్తున్నాయో! కానీ పైకి కనిపిస్తూ గతవైభవాన్ని సూచించే ఏ చిహ్నాలూ నేడు ఇక్కడ లేవు. సెమెటరీని కూడా ఇటీవలే పాడుచేసుకోవటం దురదృష్టకరం.

బొల్లోజు బాబా
8/9/2020


Footnotes

1.     1.     Ancient India of Ptolemy by Mccrindles, p.no 68

2.    సేకరణశ్రీ వెంకటేష్ కందులప్రముఖ ప్రాచీననాణెముల సేకర్త

3.    ప్రాచీనాంధ్ర నౌకాజీవనము - భావరాజు వెంకట కృష్ణారావు పే. 61

4.    ప్రాచీనాంధ్ర నౌకాజీవనము - భావరాజు వెంకట కృష్ణారావు 

5.    The English Factories in India 1618-1621

6.    The English Factories in India 1665-1667

7.    Letters to Fort St. George 1731

8.    Letters to Fort St. George 1752-53

9.    Dairy and Consultation book 1756

10.  Madras District Gazetteers, Godavari Vol I by FR Hemmingway p.211

11.   A descriptive & historical account of the Godavery District by Henry Morris, 

12.  Ibid p.40

13.  Narratives of Tours in India by JD Rees

14.  Madras District Gazetteers, Godavari Vol I by FR Hemmingway p. 126

15.  Economic Development of Andhra pradesh 1766-1957 by AV Ramana Rao.

16.  భారత నౌకాపరిశ్రమకర్రి సీతారామయ్య

17.  A Collection of Papers Relative to Ship Building in India By John Phipps p. 174

18.  Charles Eaton: wake for the melancholy shipwreck - Australian maritime history

19.  ఫ్రెంచిపాలనలో యానాంబొల్లోజు బాబా 

20.  Sailors Horn-book by  Henry Piddington

21.  The progress of the development of the law of storms Reid, William పే. 99

22.  Journal of Asiatic society, 1840 p.410

23.  ] ఫ్రెంచిపాలనలో యానాంబొల్లోజు బాబా p.32

24.  ఆంధ్రుల చరిత్రము - ప్రధమ భాగము చిలుకూరి వీరభద్రరావు పే.24

25.  https://www.ancient-asia-journal.com/articles/10.5334/aa.118/