Sunday, February 9, 2020

బ్రౌన్ లేఖల్లో ఉయ్యలవాడ నరసింహారెడ్డి



చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 1820- 1822 మరియు 1826-1829 ల మధ్య కడపలో పనిచేసాడు. 1846 నుండి 1855 వరకూ మద్రాసులో పోస్ట్ మాస్టర్ జనరల్ గా ఉద్యోగం చేసాడు.

అదే సమయంలో జరిగిన ఉయ్యలవాడ తిరుగుబాటు బ్రౌన్ ను ఆకర్షించి ఉంటుంది, కడపలోని తన పాత మిత్రులవద్ద ఆ ఉదంతం గురించి కూపీ తీసి ఉంటాడు.

ఉయ్యలవాడ తిరుగుబాటు ఉదృతంగా సాగుతున్న సమయంలో సిపి సుబ్బయ్య అనే వ్యక్తి 14 సెప్టెంబరు, 1846 న బ్రౌన్ కు వ్రాసిన లేఖ ఈ విధంగా ఉంది. అప్పటికి ఇంకా ఉయ్యలవాడ నరసింహారెడ్డి పట్టుబడలేదు.

ఉయ్యలవాడ సరసింహారెడ్డి చరిత్రకు సంబంధించి ఇదొక ఆనాటి కాలానికి చెందిన విలువైన చారిత్రిక ఆధారంగా భావించాలి.

****

మహారాజశ్రీ సి.పి. బ్రౌన్ ఇస్కోయరు గారి సముఖానికి

శేవకుడు సుబ్బయ్య అనేక సలాములు చేసి వ్రాసుకున్న విజ్ఞాపనము. ఈ నెల 14 వ తేది వరకు ప్రభువులవారి అనుగ్రహము వల్లను కడపలో క్షేమం. అచ్చట ప్రభువులవార్లయొక్క క్షేమ సంతోషాతిశయములు మాకు తెలిపి సంతోషం పొందుటకు అనుగ్రహ పత్రికె దయచేసి అంపించవలయునని ప్రార్థిస్తున్నాను.

ఇటీవల కర్నూలులో రెడ్డిగారిగుండా ఎక్కువలు జరిగినట్లు తెలియనందున విజ్ఞాపనం వ్రాసుకోనభ్యంతరమైనది.... సముఖానకు వస్తున్నానని తెలియపరుచుకున్న ప్రకారం ఈ నెల 6 తేదిని ప్రయాణమై మొన్నటి రోజున కడపకు వచ్చి చేరినాను.

ఇచ్చట కడపలోనున్న చుట్టుపక్కల 5, 6 ఆమడ పరియంతం రెడ్డియొక్క భయం వల్లను ధనికులు ఊళ్ళు విడిపెట్టిపోయినారు. ధనము మాత్రం బైట జాగ్రతపరచుకొన్నారు.
కడమ సాధారణమైనవారు సాయింత్రం అయిదు, అయిదున్నర గంటలకు వీధి తలుపులు పెరటి తలుపులు వేసుకునేవారు. కొందరు ఆ వేళకే భోజనములు కాచేసుకొని పక్కవీధులలో నిరుపేదలైన వారి ఇండ్లలో పరుండేవారున్ను పల్లెలకు పోయి పరుండేవారుగా ఉన్నారు.

ఇదికాక పదిరోజుల నాడు ఇచ్చటి సెషన్ జెడ్జి గారికి రెడ్డి అర్జి మూలముగా కడప ఖజానా కొళ్ళకు వస్తున్నాను మీరు వుండవలసిన జాగ్రతలో వుండవలసినదని తెలియజేసుకున్నాడు. అది మొదలు ఖజానా వద్దను 200 సిపాయిలను కత్తులు తుపాకిలతో సిద్దపరచి కావలి వుంచినారు. జావాన్ లు మొదలు తుపాకిలు కత్తులతో వుషారుగా ఉన్నారు.

అయితే రెడ్డిగారి తరపు దివిటీ దొంగల వుపద్రవము వల్లను ప్రజలు అత్యంతమైన భీతిని పొందుతున్నారు. 5-6 రోజుల కిందట దివిటి దొంగలు వచ్చి రెండు ఇండ్లు దోచుకునిపోయినారు. వారు రావడం 150-200 దివిటీలు వేసుకొని బొగ్గులు పూసుకుని తుపాకిలు కాల్చుకుంటూ వచ్చి యిండ్లలో జొరబడి వున్నవల్లా యెత్తుకొని చేతుల వేళ్లకు గుడ్డలు చుట్టి నూనె పోసి ముట్టించి వున్న ద్రవ్యమంతా అగుపరచమని శ్రమపెట్టుతున్నారని ఇచ్చటి వార్తలవల్లను తెలిసినది.

నేను ఇచ్చటికి వచ్చిన రోజు సమాచారం బెతం చెరువువద్దను రెడ్డిగారు ఉన్నారని కడప కలకటరు వారు యింకా కొంత జనమున్ను కర్నూల్ నుంచి కమిషనర్ వారు కొంత తురుపున్నుపోయి కాచివుండగా, సదరు రెడ్డిగారు కొవెలగుంట తాలూకాకు వచ్చి పొద్దుటూరిలో ఉండేవారికి ఒక వుత్తరం మూలంగా రెండు మూడు రోజులలో ఈవూరు కొళ్ళకు వస్తున్నాను మీరు తగు జాగ్రత్తలో వుండవల్సినదని వ్రాసిన వుత్తరమును కలకటరువారి వద్దికి అంపించగా కలకటరు వారు పొద్దుటూరికి పోవుటకు 4 కుంపిణిలను దౌడు అంపించమని వ్రాసిన ప్రకారం అంపించినారున్ను, కొంతమంది జవానులను నూతనముగా జీవనము కలగచేసి అచ్చటికి సహాయార్ధమై అంపించినారు. యింతకు మించిన సమాచారములు తెలియలేదు. చక్కగా విచారించుకొని వస్తున్నాను.

కర్నూలు వద్ద జరిగే సంగతులు ప్రభువుల వారికి విశదమయ్యేకొరకకు అచ్చట వుండే రైటరు గుండా సముఖానకు అర్జీవచ్చును. ఒక వేళ నా పేర వచ్చిన దొరవారు చిత్తగించవలసినది. ఇచ్చట జరిగే సమాచారములు ఇచ్చట నాకు మిక్కి స్నేహితుడున్నాడు గన్కు ఆయనగుండా ముందు వుత్తరములు వచ్చేలాగున జాగ్రత్త పరచివున్నాను. దివ్యచిత్తానకు తేవలెను.
నేను రేపటిదినం ఇచ్చటనుండి తర్లి వస్తున్నాను. దివ్యచిత్తానకు తెచ్చి రక్షించకోరుతున్నాను

ఇదే అనేక సలాములు

sir,
your most obedient
humble servant
C. Soobiah

Cuddapah
14-sept. 1846

*****

ఈ లేఖను బంగోరె మద్రాసు ఆర్చైవ్స్ నుండి వెలికి తీసాడు. ఈ లేఖ బంగొరె సంకలన పరచిన "బ్రౌన్ జాబుల్లో కడప చారిత్రిక శకలాలు" (1977) అనే పుస్తకంలో ఉంది.

బ్రౌన్ బహుసా తనవద్దకు వస్తాను అన్న ఈ సుబ్బయ్య అనే వ్యక్తిని కడప వెళ్లి నరసింహారెడ్డి తిరుగుబాటు విషయాలు తెలియచేయమని అడిగి ఉంటాడు. సుబ్బయ్య మద్రాసు వస్తూ వస్తూ కడపలో ఆగి వివరాలు సేకరించి అక్కడ నుంచి ఈ ఉత్తరం వ్రాసి - తదుపరి సమాచారం బ్రౌన్ కు తెలియచేయమని ఒక స్నేహితుడికి, అక్కడి ఓ రైటరుకు అప్పగించి బయలుదేరి ఉంటాడు. వాళ్ళిద్దరూ బ్రౌన్ కు వ్రాసిన జాబులు దొరికితే వుయ్యలవాడ గురించి మరింత సమాచారం లభించే అవకాసం ఉంటుంది.

మొత్తం ఉత్తరంలో ఆసక్తి కలిగించే అంశమేమంటే కొల్లగొట్టటానికి వస్తున్నాను అంటూ ముందస్తు సమాచారం ఇచ్చి దాడులు చేయటం. ఇది ధైర్యమా, పక్కదోవపట్టించే వ్యూహమా, లేక పుకార్లా అనేది తెలియదు. ఎందుకంటే సెప్టెంబరునాటికే కాలికి గాయమై నరసింహారెడ్డి నల్లమల అడవులలో దుర్భేద్యమైన రహస్యప్రదేశాలకు వెళ్ళిపోయినట్లు రికార్డులు చెపుతున్నాయి.

నరసింహారెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్యద్వారా 16 ఏండ్ల కొడుకు, రెండో భార్యద్వారా ఒక కుమార్తె, మూడో భార్యకు ఇద్దరు కొడుకులు. వీరందరినీ అప్పటికే కడపలో ఒక బంగళాలో గృహనిర్భంధం చేసి నరసింహారెడ్డికి రావాల్సిన పించనును వాళ్లకు బృతిగా ఏర్పాటు చేసింది కంపనీ.

1846 అక్టోబర్ 6 న వంటమనిషి ద్వారా మత్తుమందు ఇప్పించి నరసింహారెడ్డిని అరెస్టు చేసాడు కడప కలక్టర్ కాక్రేన్

బొల్లోజు బాబా

(రిఫరెన్స్: బంగోరే బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు కడపజాబుల సంకలనం అనుబంధం 1 ---- దీనికి మూలం మద్రాసు ఓరియంటల్ మాన్యు స్క్రిప్ట్ లైబ్రేరీలో బ్రౌన్ జాబుల సంపుటం ఎమ్ 419 పేజీ 126)

పూలతోట



అమ్ముడు పోని పూలు
వాడి
ఎండిపోయాయనీ
ధరతక్కువ
ప్లాస్టిక్‌ పూలతో ఈ లోకం
నిండిపోయిందనీ
నిందిస్తూన్నంత కాలం
నువ్వు ఇంకా పంజరంలోనే
ఉన్నావని అర్ధం

కిటికీ అద్దాన్ని బొగ్గుపొడితో
శుభ్రం చేయి.

ఎండిన పూలు విత్తనాలై
మొలకలెత్తి పూల తోటల్ని సృష్టిస్తోన్న
దృశ్యం కనిపిస్తుంది.

ప్లాస్టిక్‌ పూలపై
ఏ తుమ్మెదా వాలటం లేదనే
సత్యం గోచరిస్తుంది.

నీలోపలకు తొంగిచూసుకో
పరిమళమేదో
సన్నగా వీచటం తెలుస్తుంది.
దాన్ని అనుసరించు.
నీ పంజరాన్ని తెరిచే
తాళంచెవి ఉన్న చెట్టుతొర్ర వద్దకు
నిన్ను తీసుకెళుతుంది.

నువ్వొక రెక్కల
కుసుమానివన్న స్పృహ
ఒక్కసారిగా కలుగుతుంది నీకు
పంజరం వీడి
ఎగరటం మొదలెడతావు

జీవితపర్యంతమూ
పరిమళించీ పరిమళించీ
పూదోటగా విస్తరించటానికే
నువ్వు ఇక్కడకు వచ్చావు


బొల్లోజు బాబా

విశ్వబ్రాహ్మణులు ఎవరు?



భారతదేశ మత చరిత్రను రెండు రకాలుగా విభజించుకోవాలి. ఒకటి వేదాలకు పూర్వ మత చరిత్ర, రెండు వేదాల ఆవిర్భావం తరువాతి మత చరిత్ర. వేదాలకు పూర్వ మత చరిత్ర 1750 BCE వరకూ జరిగిన చరిత్రగా గుర్తించారు. ఇందులోనే సింధులోయ నాగరికత కొన్ని స్థానిక మతాలు వృద్ధిచెందాయి. కాలక్రమేణా జైన, బౌద్ధ మతాలు విస్తరించాయి.

వేదకాలానంతర హిందూ మతం 6 వ శతాబ్దం నాటికి విస్తరించి ప్రముఖ మతంగా ఆవిర్భవించింది. 8 వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు అద్వైత సిద్ధాంతంతో దేశమంతా పర్యటించి, వెళ్ళినచోటల్లా గుళ్ళను స్థాపించి హిందూ మతానికి ప్రచారం కల్పించాడు.

12 వ శతాబ్దం వరకూ హిందూ, బౌద్ధ, జైన మతాలన్నీ సమాజంలో సమాదరణ పొందుతుండేవి. మూడు మతాలు దాదాపు పక్కపక్కనే సహజీవనం చేసాయి.

అప్పట్లో హిందు బ్రాహ్మణులు, జైన బ్రాహ్మణులు, బౌద్ధ బ్రాహ్మణులు (శ్రమణులు) అని విడివిడిగా ఉంటూ ఆయా మత సేవలు చేస్తూండేవారు.

భూమి నుండి వచ్చే ఆదాయంలో వీరికి వాటా ఉండేది.

వీరు కాక చార్వాకులనబడే నిరీశ్వరవాదులు కూడా మనుగడ సాగించారు.

వీరందరిమధ్యా శతృత్వాలు ఉండేవని పదకొండవ శతాబ్దపు పర్షియన్ యాత్రికుడు Al-Biruni రికార్డు చేసాడు.

ఈ మత ఘర్షణలలో మొదట చార్వాక, బౌధ్ద మతాలు క్షీణించాయి. ఆ తదుపరి జైన మతం కూడా తొలగిపోవటంతో హిందూ మతం ప్రధాన మతంగా మిగిలింది. ఈ తతంగం దాదాపు అయిదారువందల ఏళ్ల పాటు జరిగింది.
***

నేటి దళిత, బహుజన కులపురాణాలను పరిశీలిస్తే అనేక ఆసక్తి కరమైన విషయాలు తెలుస్తూంటాయి. చాలా వాటిలో ఆయాకులాల మూల పురుషుడు చక్రవర్తి అని, గొప్ప సామ్రాజ్య నిర్మాత అని, ఈ సృష్టికే మూల పురుషుడు అని అనేక ఉక్తులు కనిపిస్తాయి. ఈ విషయాలను ఉత్త అతిశయోక్తులుగా అనుకోలేం.

బహుసా వీరందరూ నిర్మూలించబడిన లేదా హిందూ మతంలో విలీనం చేసుకోబడిన- పశుపతినాథ, శాక్తేయ జైన, బౌద్ధ, చార్వాక, స్థానిక మతస్థుల వంశీయులు అవ్వొచ్చు అనే విషయాన్ని కూడా తృణీకరించలేం.

మతపరంగా ప్రాధాన్యతకోల్పోయాకా సామాజికంగా దస్యులుగా మిగిలిపోయి, శూద్రులుగా పిలువబడిన నాలుగవ వర్ణపు సమూహమే- ఒకనాటి వేదపూర్వకాల ప్రిమిటివ్ మతాలకు చెందిన వారై ఉండవచ్చుననే అభిప్రాయం చరిత్రకారులలో ఉంది.

ఈ నేపథ్యంలోంచి ప్రస్తుత విశ్వబ్రాహ్మణ వివాదాన్ని రెండు కోణాల్లోంచి పరిశీలించొచ్చు.

I.----- నేటి విశ్వబ్రాహ్మణులు ఒకనాటి జైనులా?----

తెలుగునాట జైన మతం ఒకప్పుడు విస్తారంగా విలసిల్లింది. వెంగి, భట్టిప్రోలు, కళింగ, ఉదయగిరి, బోధన్, నల్గొండ, విజయవాడ, కడప, విశాఖపట్నం, పెనుగొండ, నెల్లూరు జిల్లాలలో పురావస్తు శోధనల్లో జైన మత శకలాలువిరివిగా లభిస్తున్నాయి.

ఆంధ్రదేశంలో పన్నెండవ శతాబ్దం నాటికి- విశ్వబ్రాహ్మణులు, జైనులు గ్రామాలలో కరణాలుగా చేసేవారు. హిందూ మతవ్యాప్తి జరగాలంటే వీరిని తొలగించి వారి స్థానంలో బ్రాహ్మణులను నియమించటం అప్పటికి రాజకీయ అవసరం. దీని కొరకు బెనారస్, హొయసల, యాజ్ఞవల్క, తమిళ్, కాయస్థ బ్రాహ్మణులను గుంటూరు జిల్లాలో అధికారిక పదవులలో నియమించటం జరిగింది. వీరి సంఖ్య తక్కువ.

అలా నియమింపబడిన బ్రాహ్మణులలో ఆరువేలమందిని ఒక సారి, మూడువేల మందిని ఒకసారి కరణాలుగా నియోగింప చేసిన ఉదంతం ఆంధ్రదేశానికి సంబంధించి ప్రత్యేకమైనది.

అంత పెద్ద సంఖ్యలో ఖాళీలు సృష్టించాలంటే అప్పటికి కరణీకాలు చేస్తున్న అన్యమతస్థులను తొలగిస్తే తప్ప సాధ్యం కాదు.

జైన బ్రాహ్మణులకు, హిందూ బ్రాహ్మణులకు ఒక మోసపూరిత సమస్య ఇచ్చి పరిష్కరించలేదని వేలమంది జైన బ్రాహ్మణులను గానుగ తొక్కించిన కథ ఒకటి మెకంజీ కైఫీయత్తులలో లభిస్తున్నది.

---------"ఆఖరి కాకతీయ రాజు జైనులను గానుగలో తిప్పించి చంపించాడు. రెడ్డి రాజులు కూడా హిందూవేతర మతస్థులను ఊచకోత కోయించారు. " --------- (Ref: A Mannual of Kistna District (Madras: 1883), pp. 1-50.)

కులపురాణంలో చెప్పినట్లు చరిత్రలో విశ్వబ్రాహ్మణులు, వేదాలకంటే ముందునించే ఉండటం, కరణాలుగా పనిచేయటం నిజమే అయితే వారు వేదకాలం కంటే ప్రాచీనమైనదని చెప్పబడే జైనమతానికి చెందినవారని అనుకోవటానికి ఆస్కారం ఉంది.

12 వ శతాబ్దంలో ఈ ఊచకోతలకు వెరసి జైన మతాన్ని వదిలేసి హిందూ మతంలోకి మారిపోయి ఉండవచ్చు.

వీరబ్రహేంద్రస్వామి కాళికాంబ శతకంలో కనిపించే - బ్రాహ్మణ ధిక్కారం, విగ్రహారాధన నిరసన, కులవ్యవస్థను నిరాకరించటం, మనుషులందరూ ఒక్కటే అని భోధించటం, హిందూ దేవుళ్లను ప్రస్తావించకపోవటం - లాంటి విషయాలన్నీ హిందూ మతాన్ని అన్యమతంగా భావించి ప్రవచించినవే అనే ఊహ తార్కికమే అవుతుంది.

రామాయణంలో రామసేతును నిర్మించిన విశ్వకర్మ కొడుకైన "నల" జైనుడని జైన పురాణాలు చెపుతున్నాయి. (రి. wiki/Nala_)

II. --------విశ్వబ్రాహ్మణులు సాంస్క్రిటైజేషనుకు గురయిన శూద్రులు--------

A. హిందూమతంలో నాలుగే వర్ణాలు ఉన్నాయి. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు.

విశ్వబ్రాహ్మణులు అంటే బంగారు పని వారు మాత్రమే కాదు. కంచర, కమ్మర, వడ్రంగి, శిల్పకార లాంటి చేతి వృత్తుల వారు. వీరందరిలో స్వర్ణకారులకు కాస్త సమాజంలో మెరుగైన జీవనం ఉండేది. ఎందుకంటే వీరు ఎలైట్ ప్రజల అవసరాలు తీరుస్తుంటారు కనుక.

B. ఈ స్వర్ణకారులు, కొంతమేరకు శిల్పులు- ఇతర కులాల వలెనే "Sanskritization" కి గురయ్యారు. అంటే బ్రాహ్మణులను అనుకరించటం -శాకాహారం, జంద్యం, ఆచారవ్యవహారాలు లాంటివి పాటించటం. (నేడు కార్పొరేట్ సంస్కృతిలో అందరూ సూటూ బూటూ వేసుకొని, స్పూను ఫోర్కులతో బర్గర్లు, పిజ్జాలు తింటున్నట్లు)

C. మిగిలిన పంచవృత్తుల వారు పెద్దగా బ్రాహ్మణీకరణకు పోలేదు. వారికి మనుగడే ప్రశ్నార్ధకం. కనుక.

D. ఇక రిజర్వేషన్ల అంశానికి వస్తే వీరందరూ చేతి వృత్తుల వారు. ఆధునిక కాలంలో చేతి వృత్తులన్నీ దాదాపు అంతరించి పోయాయి. దానిలో కులప్రాధాన్యత కూడా పోయింది. (ఉండాలని నా ఉద్దేశం కాదు). అందుచే వీరిని చేతివృత్తులు కోల్పోయిన కులాల సమూహంలో చేర్చి రిజర్వేషన్లు ఇస్తున్నారు.

దీనికీ వీరి బ్రాహ్మణీకరణకు సంబంధం లేదు. ఈ రెండిటిని కలిపి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు.

E. విశ్వబ్రాహ్మణులు/పంచవృత్తికారులు నిచ్చెన మెట్లలో శూద్రులే.
ఎందుకంటే ఫ్యూడల్ వ్యవస్థలో ఒక వడ్రంగో, కంచరో, కంసాలో వూరు దాటి పొరుగూరుకు వెళ్ళే స్వాతంత్ర్యం ఉండేది కాదు. ఒక వేళ పారిపోతే చేతులు నరికే వారు. మిడివియల్ చరిత్రలో వీరూ ఇతర శూద్ర, అతిశూద్ర కులాలలాగ బానిసజీవితాన్ని గడిపారు. శిల్పులు సంచార జీవనం గడిపేవారు.
****

ఇక ప్రస్తుత వినోదినిగారిపై జరుగుతున్న దాడిని నేను ఖండిస్తున్నాను. వారు ఎంతో లోతైన విశ్లేషణ చేసి వీరబ్రహ్మేంద్ర స్వామిని ఒక సంఘ సంస్కర్తగా శాస్త్రీయంగా నిరూపించారు. ఇంతకాలం కాలజ్ఞాన కవిగా వేసిన ముద్రను తొలగించినందుకు వారికి మనం రుణపడాలి. ఆ విషయంలో ఆమెతో అప్పట్లో మాట్లాడి అభినందించాను కూడా.

శూద్ర అన్న పదం ఎంత మాత్రం తప్పుకాదు. ఎందుకంటే అది ఉత్పత్తి కులాలలో మనల్ని ఉంచుతుంది. ఈ రోజు భారతదేశం కొన్ని కోట్ల డాలర్ల విదేశీమారకాన్ని పొందటానికి కారణమైన - నలందా, అజంతా, ఎల్లోరా, మహాబలిపురం, బృహదీశ్వరాలయం, కంచి, మధుర, హంపి, కోణార్క్, బదామి కేవ్ టెంపుల్స్, ఢిల్లీ ఐరన్ పిల్లర్ లాంటి అనేక టూరిస్ట్ నిర్మాణాలను ఉత్పత్తి చేసింది మనమే అని గర్విద్దాం.

బొల్లోజు బాబా

కల్నల్ కాలిన్ మెకంజి



కాలిన్ మెకంజీ 1754 లో స్కాట్లాండులో జన్మించాడు. 2 సెప్టెంబర్ 1783 న ఈస్టిండియా కంపనీ ఉద్యోగిగా మద్రాసులో అడుగుపెట్టాడు. అది మొదలు 1821 లో కలకత్తాలో చనిపోయేవరకూ మెకంజీ ఇండియాలోనే ఉన్నాడు.

1784-90 ల మధ్య ఇతను రాయలసీమ-కృష్ణా పరిసర ప్రాంతాలలో కంపనీ సైనిక ఇంజనీరుగా పనిచేసాడు. 1799 లో టిపు సుల్తాను ఓటమి కారణంగా కంపనీ పరమైన కర్ణాటక జిల్లాలను, నిజాం దఖలు పరచిన సీడెడ్ జిల్లాలను సర్వే చేసే బాధ్యతను మెకంజీకి అప్పగించింది కంపనీ. ఆ సమయంలో సర్వే నిమిత్తం కృష్ణా దిగువ ప్రాంతాలను విస్త్రుతంగా పర్యటించాడు. కావలి వెంకట బొర్రయ్య, వెంకటనారాయణ, వెంకట రామస్వామిల సహాయంతో అనేక శాసనాలను, గ్రామచరిత్రలను సేకరించాడు.

వీరందరిలో బొర్రయ్య చాలా చురుకైన వాడు. ఇతను తెలుగు, సంస్కృతం, పర్షియన్, ఆంగ్లభాషలలో ప్రావీణ్యుడు. బొర్రయ్య వ్రాసిన- Account of the Jains, collected from a priest of this sect at Mudgeri; Translated by Cavelly Boria, Brahmin: for Major C Mackenzie - 1809 Asiatic Researches vol 9 - అనే పరిశోధనాత్మక వ్యాసం భారతదేశ జైనమత పునరుజ్జీవనంలో మైలురాయిగా నిలిచిపోయింది. తనపేరుతో కాక తన క్రింద పనిచేసే బొర్రయ్యకే ఆ వ్యాస కర్తృత్వాన్ని ఇవ్వటం మెకంజీ నిజాయితీని ప్రతిబింబిస్తుంది.

ఈ కావలి వెంకట బొర్రయ్య అనేక సంస్కృత, కన్నడ శాసనాలను ఇంగ్లీషులోకి అనువదించినట్లు ఏసియాటిక్ జర్నల్స్ లో కనిపిస్తుంది. ఆ తరువాత చాలా సంచికలలో “బొర్రయ్య నిర్ధారించాడు” అంటూ ఇతరులు వ్రాసిన వ్యాసాలలో కొన్ని రిఫరెన్సులు కనిపిస్తాయి. గొప్ప మేథావి అయిన బొర్రయ్య 1803లో 27 సంవత్సరాల వయసులోనే మరణించాడు.
.
బొర్రయ్య స్థానాన్ని అతని సోదరుడు కావలి వెంకట లక్ష్మయ్య కొనసాగించాడు. ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా 1817 లో మద్రాసు సమీపంలో ఒక గ్రామాన్ని వంశపారంపర్యంగా అనుభవించేలా ఈస్ట్ ఇండియా కంపనీ దానం చేసింది. (రి. ఎన్సైక్లోపెడియా ఏసియాటికా వా. 5)

మెకెంజీ చేస్తున్న కృషిని గుర్తించిన కంపనీ 1810 లో ఇతనిని మద్రాసు ప్రెసిడెన్సీ సర్వేయర్ జనరల్ గా నియమించింది. కానీ వెంటనే జావా ద్వీపానికి బదిలీ చేయటంతో 1811-1813 మధ్య మెకంజీ ఇండియాకు దూరంగా ఉన్నాడు. అక్కడే 18 నవంబరు 1812 న డచ్ సంతతికి చెందిన Petronella jacomina Bartels ను వివాహమాడాడు.

తిరిగి ఇండియా చేరుకొన్నాకా 1815 లో మెకంజీ సర్వేయర్ జనరల్ గా నియమించబడ్డాడు. కలకత్తా సెయింట్ జార్జి కోటలో లో ఇతని ఆఫీసు ఉన్నప్పటికీ – అంతవరకూ ఆంధ్ర, తమిళ, కర్ణాటక ప్రాంతాలలో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించటం కొరకు మద్రాసులో ఉండేందుకు కంపనీ అనుమతి తీసుకొని 1817 వరకూ మద్రాసులోనే ఉన్నాడు.

1, ఫిబ్రవరి 1817 న మెకంజి తన మిత్రుడైన అలెగ్జాండర్ జాన్ స్టన్ కు వ్రాసిన ఒక లేఖలో ఈ స్థానిక చరిత్రలను సేకరించటంలో తన ఉద్దేశాలను, నిబద్దతను, కష్టాలను ఇలా చెప్పుకొన్నాడు.

1. 1799 లో కంపనీకి సంక్రమించిన ప్రాంతాల హద్దులను నిర్ణయించే పని నాకు అప్పగించినపుడు- సరిహద్దులే కాక ఆ ప్రాంత చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని కూడా అధ్యయనం చేస్తానని నేను చెప్పిన ప్రణాళికను కంపనీ ఆమోదించి, ముగ్గురు గుమస్తాలను, ఒక నాచురలిస్ట్ ను నాకు సహాయకులుగా ఇచ్చింది. కానీ 1801 లో వీరిని తొలగించటంతో నా ప్రణాళికలన్నీ భగ్నమయ్యాయి. ఈ ప్రాంతాల జీవరాశిని రికార్డు చేద్దామనే నా ఆలోచన ఫలించలేదు. అంతే కాక నా జీతం, నాకు ఇచ్చే కంటింజెన్సీ డబ్బులు కూడా తగ్గించేసారు. దీనివల్ల నా ప్రణాళిక దాదాపు కుంటుపడింది.

2. అయినప్పటికీ నేనీ పనులు చేయగలిగాను

జైనులు, బుద్ధులు వేరు వేరు అని నిర్ధారించగలిగాను (అప్పట్లో వీటిని హిందూ మతంలో అంతర్భాగాలుగా గుర్తించేవారు); ప్రాచీన మతసాంప్రదాయాలైన లింగాయత్, శైవం, పాండరం, మఠాలు వివిధ శాఖలు వాటి పుట్టుపూర్వోత్తరాలు స్పష్టపరిచాను; సుమారు మూడు వేల వివిధ శిలా శాసనాలు, తామ్రపత్రాలకు నకళ్ళు తీయించాను; ఢిల్లీ నుంచి కేప్ కొమరిన్ దాకా ఉన్న Veeracul, Maastie cull లలోని పురాతనజాతుల సంస్కృతిని వెలికితీసాను. (పైన చెప్పిన అన్ని అంశాలను మెకంజీ మొత్తం 12 రీసెర్చ్ పేపర్లుగా ఆసియాటిక్ జర్నల్ లో ప్రచురించాడు)

3. కొన్నాళ్ళు మద్రాసులోనే ఉంచమని కోరటానికి కారణాలు ఈ లేఖలో ఇలా చెప్పుకొన్నాడు మెకంజీ – “నాకు సహాయకులుగా ఉన్న వ్యక్తులతో నా అనుబంధం వ్యక్తిగతమైనది. వాళ్ళు ఈ ప్రాంతపు స్థానికులు, కలకత్తాకు నాతో పాటు వచ్చి జీవించలేరు. మేము సేకరించిన విషయాలను కేటలాగ్ చేయాలి. చాలా వాటిని అనువదించాలి. ఇది కలకత్తాలో సాధ్యపడదు. నేను ఇంగ్లాండు వెళ్ళే లోగా కనీసం స్థానిక వ్రాతప్రతులు, పుస్తకాలు, శాసనాల సంక్షిప్తసమాచారాన్ని పుస్తక రూపంలో చూడాలని నా కోరిక. దీనికి నా ఆరోగ్యం సహకరించకపోవచ్చు. కనీసం విద్యావంతులకు తదుపరి పరిశోధనలకు వీలుగానైనా వీటిని కేటలాగ్ చేయించాలి"

అలా ఇంగ్లాండు వెళ్లాలని ఆశపడ్డ మెకంజీ పాపం వెళ్ళనే లేదు కలకత్తాలో 8 మే 1821 న మరణించాడు. మెకంజీ సేకరణలు శిధిలమౌతున్నాయని గమనించిన సి.పి. బ్రౌన్ 1840 ల ప్రాంతంలో వాటికి నకళ్ళు తయారు చేయించాడు. వాటికి మరలా తిరిగి 1930-40 లలో బ్రిటిష్ ప్రభుత్వం మరోసారి నకళ్ళు తీయించటం జరిగింది. నేడు మద్రాసు లైబ్రేరీలో ఉన్నతెలుగు మెకంజీ కైఫీయత్తులు చదవటానికి వీల్లేని విధంగా పూర్తిగా పాడయిపోయాయిని తెలుస్తూన్నది.
******
మెకంజీ సేకరణా విధానం

మెకంజీ ఒక సర్వేయరు. ఆఫీసులో కూర్చునే అధికారి కాదు. సర్వే అనేది వెళ్ళి స్థానికంగా చేయాల్సినపని. అందువలన ఇతనికి అనేక ప్రాంతాలలో స్వయంగా పర్యటించే అవకాశం వచ్చింది. దీనిని వినియోగించుకొని అక్కడ గ్రామ కరణాల వద్ద ఉండే కవిలెకట్టలలో గ్రామ చరిత్రలను, స్థానికంగా లభించే తాళపత్ర గ్రంధాలను, పుస్తకాలను సేకరించాడు. వివిధ ఆలయశాసనాలను చూసి వాటి ప్రతులను తయారు చేయించాడు. శిల్పాలకు డ్రాయింగులు గీయించాడు. ఇతను నియమించుకొన్న ఉద్యోగుల జీత భత్యాలు కంపనీ భరించేది. ఇది లక్షరూపాయిల మేరకు అయినట్లు రికార్డులు చెపుతున్నాయి. క్రమేపీ కంపనీ, డబ్బులు ఇవ్వటం మానేసాకా ఒకానొక దశలో వారికి జీతాలు మెకంజీయే స్వయంగా ఇచ్చాడు. మెకంజీ సేకరణలలో ఎక్కువ భాగం ఈ విధంగా స్వయంగా సేకరించినవే.

తాను స్వయంగా వెళ్లలేని ప్రదేశాలకు తన అనుచరులను పంపి రిపోర్టులు తెప్పించుకొనే వాడు. అలా నారాయణరావు అనే వ్యక్తి పంపిన అనేక రిపోర్టులు మెకంజీ కైఫీయత్తులలో లభిస్తాయి. (ఇతని రిపోర్టులలో ఆ యా ఊర్లకు ఎలా వెళ్ళిందీ, ఎంతదూరం, ఎక్కడ బసచేసాడు, ఎంతెంత ఖర్చయిందీ లాంటి వివరాలు కూడా ఉండటం విశేషం).

మెకంజీ సేకరించిన ప్రతులు సుమారు “14 భాషలకు” సంబంధించినవి. వీటిని మెకంజీ కూడా సంపూర్ణంగా పరిశీలించలేదు. వాటిని ఎప్పటికైనా స్థిమితంగా కూర్చొని క్రోడికరించాలని అనుకొని, తనదారిలో కనిపించిన ప్రతి చిన్న అంశాన్నీ సేకరించుకొంటూ పోయాడు. వీటన్నింటిని అనువదించటమో క్రోడీకరించటమో ఒక వ్యక్తి వల్ల అయ్యేపని కాదు.

మెకంజీ మరణం తరువాత

మెకంజి మరణానంతరం అతని భార్య మరొకరిని వివాహం చేసుకొని దేశం విడిచి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకొంది. మెకంజి సొంతడబ్బులు పెట్టికొనుక్కొన్న పుస్తకాలు, పురాతన వస్తువుల విలువ సుమారు లక్షరూపాయిలు ఉండొచ్చని గుర్తించారు. వీటన్నింటిని ఇరవై వేల రూపాయిలకు మెకంజీ భార్య బెంగాల్ ప్రభుత్వానికి ఇచ్చివేసింది. (బహుసా అన్నీ ఒకచోట ఉంటాయని భావించి ఉండవచ్చు). ఇవి ప్రస్తుతం బ్రిటిష్ లైబ్రేరీ, బ్రిటిష్ మ్యూజియం, మద్రాస్ మ్యూజియం లలో భద్రపరచబడి ఉన్నాయి.

ఇవి కాక ప్రభుత్వోద్యోగిగా మెకంజీ సేకరించిన వస్తువులు అనేకం ఉన్నాయి. మెకంజీ మరణించాక అతని స్థానంలోకి వచ్చిన అధికారికి దాదాపు “లక్ష పేజీల” వరకూ ఉన్నవ్రాతప్రతులను, వేలకొలది ఇతర సేకరణలను ఏం చెయ్యాలో తెలియలేదు. ఇవన్నీ కంపనీకి చెందిన ఆస్తి అయినప్పటికీ వీటిని ఎలా వదిలించుకోవాలా అని కంపనీ అధికారులు తలలు పట్టుకొని కూర్చునేవారట. అలాంటి సమయంలో H H Wilson అనే అధికారి, వీటిని క్రోడికరించటానికి ముందుకురాగా కంపనీ బోర్డు వెంటనే అనుమతినిచ్చింది.

అప్పటికే మెకంజీ తన సేకరణలకు రఫ్ కేటలాగు తయారుచేసినట్లు విల్సన్ గుర్తించాడు. దాని ప్రకారం మొత్తం వ్రాతప్రతులను స్థానిక చరిత్రలు (2070), శాసనాలు (8076), సాహిత్యవిషయాలు (1568), అనువాదాలు (2159), చిత్రాలు/డ్రాయింగ్స్ (2559), నాణాలు (6218) అంటూ వేరుచేసి వాటికి ఇండెక్స్ నంబర్లు ఇచ్చి మొత్తం మెకంజీ సేకరణల వివరాలను Meckenzie Collection - A Descriptive Catalogue of the Oriental Manuscripts and Other articles అనే రెండువాల్యూముల పుస్తకాలుగా 1828 లో వెలువరించాడు.

విల్సన్ కేటలాగు ప్రకారం తెలుగుకు సంబంధించి 285 కావ్యాలు, సీడెడ్ జిల్లాల 358 గ్రామ చరిత్రలు, ఇతర తెలుగు తమిళ గ్రామచరిత్రలు 274 ఉన్నట్లు తెలుస్తున్నది. ఎనిమిది వేల శాసనాలలో తెలుగు శాసనాలు ఎన్ని ఉన్నాయో చెప్పలేదు.

విల్సన్ ఈ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో- వీటన్నింటిలో శాసనాలు, స్థానిక చరిత్రలు ముఖ్యమైనవని, వీటిని మరింత శోధించవలసి ఉందని బావించాడు. తెలుగు సాహిత్యంలో ఎక్కువగా సంస్కృత అనువాదాలు ఉన్నాయని, కొద్దిగా మాత్రమే స్వతంత్ర రచనలు లభించాయని అన్నాడు.

మెకంజీ సేకరణలు కృష్ణా నదికి దక్షిణభాగం (రాయలసీమ ప్రాంతం) నుంచి ఎక్కువ ఉన్నట్లు, ఉత్తరభాగం నుంచి పెద్దగా లేనట్టు గుర్తించాడు. బహుసా ఆ కారణం వల్లనే కడపజిల్లా కైఫీయత్తులు ఏడు సంపుటాలుగా మనకు లభించినట్లుగా ఇతరకోస్తా జిల్లాల కైఫీయత్తులు లభించవు.

కాలిన్ మెకంజీ ప్రాసంగికత

కైఫీయత్తు అంటే స్థానిక చరిత్ర అని అర్ధం. మెకంజీ సేకరించిన ఈ కైఫీయత్తులలో ఆనాటి సామాజిక వ్యవస్థ, చరిత్ర, సాహిత్యం, గ్రామాల సరిహద్దులు, అప్పటి పాలకుల వంశావళి వంటి అనేక అపురూపవిషయాలు తెలుస్తాయి. ఇవి స్థానికుల నుండి సేకరించినవి కనుక అప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తుల వంశ చరిత్రలు ప్రధానంగా కనిపిస్తాయి. గ్రామ ఆలయాలు, వాటికి గల మాన్యాలు, అక్కడ పండే పంటలు, పన్నులు, వృత్తికులాల మాన్యాలు, గ్రామ పుట్టుపూర్వోత్తరాల గురించిన ఆనాటి కట్టుకథలు గాథలు, విశ్వాసాలు, ఆచారవ్యవహారాలు లాంటి అనేక సంగతులు కైఫీయత్తులలో ఉన్నాయి.

అమరావతిలోని బౌద్ధ స్థూపాన్ని కూలగొట్టి ఏదో భవన నిర్మాణానికి అక్కడి అవశేషాలను వినియోగిస్తున్నట్లు తెలుసుకొన్న మెకంజి అమరావతి వెళ్ళి, తవ్వకాలు జరిపి అక్కడి బౌద్ధ స్థూప ఉనికిని ప్రపంచానికి తెలియచేసాడు.

రెండు శతాబ్దాల క్రితం తెలుగు నేల ఎలా ఉండేది అనే విషయాలు నేడు తెలుసుకోగలుగుతున్నామంటే ఆనాడు మెకంజీ జరిపిన కృషివల్లనే అనేది అక్షర సత్యం. లేనట్లయితే చాలావిషయాలు కాలగర్భంలో కలసిపోయి ఉండేవి.

బొల్లోజు బాబా

మెకంజీకి సహాయపడిన కావలి సోదరులు



ఏలూరు కు చెందిన కావలి వెంకట సుబ్బయ్యకు నలుగురు కుమారులు ఒక కుమార్తె. ఆ నలుగురూ వరుసగా వెంకట సీతయ్య, వెంకట రామస్వామి, వెంకట బొర్రయ్య, వెంకట లక్ష్మయ్య. కుమార్తె పేరు లక్ష్మి దేవమ్మ. ఈమెకు విస్సన్నకోట జమిందారు రమణప్పతో వివాహం అయింది. వారికి పిల్లలు లేకపోవటంతో వెంకట సీతయ్య తన కుమారుడిని దత్తత ఇచ్చి విస్సన్నపేట జమిందారీని సొంతం చేసుకొన్నాడు. (రి. కృష్ణా జిల్లా మాన్యువల్, పే 339)

మిగిలిన ముగ్గురు సోదరులు కల్నల్ కాలిన్ మెకంజీ వద్ద సహాయకులుగా పని చేసారు.

కావలి వెంకట బొర్రయ్య (Cavelly Venkata Boriah) (1776-1803)

బొర్రయ్య 1776 లో ఏలూరులో జన్మించాడు. ఇతను ఏలూరు లోని ఒక ప్రెవేట్ స్కూలు లో పది సంవత్సరముల వరకూ విద్యనభ్యసించాడు. ఆ తరువాత సంస్కృతం నేర్చుకోవటంకోసమని ఆ స్కూలునుండి బయటకు వచ్చేసి సాంప్రదాయ సంస్కృతపాఠశాలలో చేరాడు. ఇక్కడ అయిదారు నెలలలోనే సంస్కృతంలో ప్రావీణ్యత గడించి సొంతంగా పద్యాలల్లేవాడట.

అప్పటికే ఇతని అన్నలు ఈస్ట్ ఇండియా కంపనీలో ఉద్యోగులుగా ఉండటం, వారిలాగే తానుకూడా ఉన్నతంగా జీవించాలనే ఆశయంతో ఉండేవాడు బొర్రయ్య. ఈ క్రమంలో తన ఇంటికి రెండుమైళ్ల దూరంలో కల కొత్తూరు వెళ్ళి పెర్షియన్, హిందీ భాషలను,నేర్చుకొన్నాడు. పద్నాలుగేళ్ళు వచ్చాక మచిలీపట్నంలో Mr. Morgan నడుపుతున్న స్కూలులో చేరి కొన్నాళ్లు విద్యాభ్యాసం చేసాడు. ఇది 1790-93 మధ్య కాలం కావొచ్చు. అప్పట్లో చర్చిఫాదర్లే చర్చ్ లలో విద్యాబోధన చేస్తుండేవారు.

తీరిక సమయాలలో తెలుగు సాహిత్యం, చందస్సు, అలంకారశాస్త్రం అభ్యసనం చేస్తూ పద్యాలు రాయటం మొదలు పెట్టాడు. అత్తలూరి పాపయ్య వ్రాసిన కవిత్వం ఎక్కువగా ఇష్టపడేవాడు.

మచిలీపట్నంలో ఆంగ్లేయులతో ఏర్పడిన పరిచయాల ద్వారా బొర్రయ్య ఈస్ట్ ఇండియా కంపనీ, మచిలీపట్నం సైనిక విభాగంలో ఉద్యోగం సంపాదించాడు. ఒంగోలు, మునగాల, కొండపల్లి లాంటి వివిధ ప్రాంతాలలో ఉంటున్న సైనికులకు జీతాలను తీసుకొనివెళ్ళి పంచిపెట్టే ఉద్యోగం అది. ఉద్యోగరీత్యాకూడా బొర్రయ్యకు అనేకమంది ఆంగ్లేయులతో పరిచయాలు పెరిగాయి. అప్పటికి ఇతని వయసు పద్దెనిమిదేళ్ళు. కొంతకాలం నర్సాపురంవద్ద బ్రిటిష్ స్థావరమైన మెడపొల్లం (మాధవపాలెం) లో కూడా పనిచేసాడు.

కల్నల్ మెకంజీ వద్ద పనిచేస్తున్న సోదరుడు నారయణప్ప (క్రిష్ణా జిల్లా మాన్యువల్ 338 పేజి లో నారాయణప్ప వెంకట లక్ష్మయ్య కొడుకు అని ఉంది) సిఫార్సుతో, బొర్రయ్య మెకంజీ వద్ద ప్రధాన లేఖకునిగా ఉద్యోగంలో కుదిరాడు. బొర్రయ్య మేధాశక్తులపట్ల మెకంజి ఎంతో మాన్యత కలిగిఉండేవాడు. బొర్రయ్య చక్కని చిత్రకారుడు కూడా కావటంతో అనేక ఆలయాల డ్రాయింగులను చిత్రించాడు

1798 లో టిప్పుసుల్తాను గొడవల సమయంలో ఒక నిజాం జమిందారుకి చెందిన అనుచరులు కంపనీ కాగితాలను ఎత్తుకుపోతే, వాటిని తిరిగి సంపాదించిపెట్టమని బొర్రయ్య ను కోరాడు మెకంజీ. ఆ జమిందారు బొర్రయ్యను ఖైదు చేయించి తిండితిప్పలు పెట్టకుండా హింసించాడు. బొర్రయ్య ధైర్యం కోల్పోకుండా ఆ జమిందారుని పొగుడుతూ పద్యాలు అల్లి, అతని విశ్వాసాన్ని చూరగొని మెకంజీ కాగితాలతో పాటూ తనుకూడా అనేక బహుమతులను సంపాదించుకొన్నాడు.

తెలుగు, తమిళ, కన్నడ, సంస్కృతం, పర్షియన్, భాషలలో ప్రావీణ్యం కలిగి ఉండటంతో దక్షిణ భారతదేశ శాసనాలను అర్ధంచేసుకొని అవలీలగా ప్రతులు తీసి ఇంగ్లీషులోకి అనువదించేవాడు బొర్రయ్య. కొన్ని సార్లు బొర్రయ్య దట్టమైన అరణ్యాలు, కొండలు, వాగులు దాటుకొని విషయసేకరణ జరపాల్సివచ్చేది.

బొర్రయ్య వ్రాసిన- Account of the Jains, collected from a priest of this sect at Mudgeri; Translated by Cavelly Boria, Brahmin: for Major C Mackenzie - 1809 Asiatic Researches vol 9 - అనే పరిశోధనాత్మక వ్యాసం భారతదేశ జైనమత పునరుజ్జీవనంలో మైలురాయిగా నిలిచిపోయింది.
మెకంజీ 1811-13 ల మధ్య జావా బదిలీ అయినపుడు బొర్రయ్య ఏలూరు వచ్చేసాడు. ఈ కాలంలో టిప్పు సుల్తాను, బ్రిటిష్ వారికి మధ్య జరిగిన యుద్ధవిశేషాలను కావ్యంగా రాసాడు (?). శ్రీరంగ రాజుల వంశావళిని తెలియచేసే “శ్రీరంగరాజ చరిత్ర” కావ్యాన్ని రచించాడు.

1803 లో ఇరవైఆరేళ్ల వయసులో బొర్రయ్య, రుద్రవాతం (మెదడు నరాలు చిట్లి హఠాత్తుగా మరణించటం) బారిన పడి అకస్మాత్తుగా చనిపోయాడు. బొర్రయ్య స్మారకచిహ్నాన్నిమద్రాసు సముద్రపు ఒడ్డున ఏర్పాటు చేయించాడు మెకంజీ. ఇది 1834 నాటికి అక్కడే ఉన్నట్టు కావలి లక్ష్మయ్య దక్కను కవులపుస్తకం పై The Journal Of The Royal Asiatic Society 1834 Vol. I లో వచ్చిన ఒక రివ్యూ వ్యాసం ద్వారా తెలుస్తున్నది.

బొర్రయ్యకు పన్నెండేళ్ళ వయసులోనే కసింకోట జమిందారైన వెంకటాచలం చిన్న సోదరితో వివాహమైంది. వీరిద్దరికీ ఒక కూతురు పుట్టి చనిపోయింది.
****
కావలి వెంకట లక్ష్మయ్య

ఇతని గురించి పెద్దగా వివరాలు తెలియవు. బొర్రయ్య చనిపోయాకా అతని ఉద్యోగాన్ని ఇతనికి ఇచ్చినట్లు అనుకోవాలి ఎందుకంటే ఇతను బొర్రయ్య తమ్ముడు కనుక.

మెకంజీ ముఖచిత్రంతో వచ్చిన Saturday Magazine, June 28, 1834 సంచికలో మెకంజీపై Alexander Johnston వ్రాసిన ఒక సంస్మరణ వ్యాసంలో వెంకట లక్ష్మయ్య ప్రస్తావన ఉంది. ఇందులో మెకంజీ మొదలుపెట్టిన పనిని కొనసాగించాలని, దీనికొరకు Royal Asiatic Society చర్యలు తీసుకొని, మెకంజీ సహాయకులను సంప్రదించాలని, వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలని రాసుకొచ్చాడు.

తాను కావలి వెంకట లక్ష్మయ్యకు పైన చెప్పిన పనులను చేపట్టమని ఒక ఉత్తరం వ్రాసానని, అది అందుకొని – వెంకటలక్ష్మయ్య మద్రాసులో రెండువందల మంది ఔత్సాహిక స్థానికులతో Madras Literary Society ని స్థాపించి మెకంజీ ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నట్లు నాకు తెలియచేసాడు- అని అలెగ్జాండర్ పేర్కొన్నాడు
.
ఇదే వ్యాసంలో వెంకట లక్ష్మయ్య రాయల్ ఏసియాటిక్ సొసైటి లండన్ కు భారతదేశప్రతినిధిగా కావలి వెంకట లక్ష్మయ్య వ్యవహరిస్తూన్నడని ఉంది. అంతే కాక మెకంజీ చిత్రపటంలో టెలిస్కోపు ధరించిన వ్యక్తే లక్ష్మయ్య అని – అతన్ని నేను ఇటీవల కలిసానని చిత్రపటంలో ఉన్నట్లే ఉన్నాడని A. Johnston చెప్పినట్లు ఫుట్ నోట్సుద్వారా తెలుస్తుంది.

చాలాచోట్ల టెలిస్కోపు పట్టుకొన్న వ్యక్తి కిష్టప్ప అనే నౌకరుగా చెప్పబడ్డాడు. ఇది మరింత శోధించవలసిన విషయం. (ముందుపోస్టులో ఫొటో ఉంది) వెంకట లక్ష్మయ్య మద్రాసులో స్థిరపడ్డాడు.

ఇక మెకంజీ సేకరణలను కేటలాగు చేసింది లక్ష్మయ్య అని ఒక వాదన వినిపిస్తుంది. దీనికి ఆధారాలు లభించవు కానీ, మెకంజీ 1817 లోనే తన మిత్రుడు, అప్పటి ఏసియాటిక్ సొసైటీ వైస్ ప్రెసిడెంటు అయిన Alexander Johnston రాసిన ఒక ఉత్తరంద్వారా -తన సేకరణలను 17 విభాగాలుగా విభజించుకొని సుమారు పది పేజీల నోట్సు రాసుకొని ఉన్నట్లు అర్ధమౌతుంది. (రి. Royal Asiatic society, Journal 1834 vol 1 p.no 333)
****

కావలి వెంకట రామస్వామి

ఇతని గురించి కూడా పెద్దగా వివరాలు లభించవు. మెకంజీ మరణించాక ఇతను ఉద్యోగం కోల్పోయి ఉంటాడు. వెంకట లక్ష్మయ్యలా అదే రంగాన్ని కాక మెకంజీ సేకరించిన విషయాలను పుస్తక రూపంలోకి తీసుకురావటానికి ప్రయత్నించినట్లున్నాడు. సి.పి బ్రౌన్ కూడా కాటమరాయని కథ, బొబ్బిలి యుద్ధం, కడప రాజుల చరిత్ర లాంటి పుస్తకాలు మెకంజీ సేకరణలనుంచే గ్రహించి ఉండచ్చనే ఊహ సత్యదూరం కాకపోవచ్చు. ఈ పని బ్రౌన్ కన్నా ఓ ముప్పై ఏళ్ల ముందే చేయటం రామస్వామి ముందు చూపు తెలియచేస్తుంది.

రామస్వామి 1829 లో కలకత్తా నుంచి, “దక్కను కవుల” పేరిట కవుల చరిత్ర అనే ఒక్క పుస్తకం మాత్రమే వెలువరించాడు.

ఈ పుస్తకాన్ని విలియం బెంటింగ్ కి చాలా భక్తితో అంకితమిచ్చాడు. దీనిలో నన్నయ, పోతన, అవ్వయార్, సుందరర్ లాంటి మొత్తం 79 మంది కవుల చరిత్రను ఇంగ్లీషులో అక్షరబద్దం చేసాడు. ఇది గొప్ప విశేషం. బహుసా ఇదే మొదటి తెలుగు కవుల చరిత్ర కావొచ్చు. (ఇందులో చాలామంది నేటి తెలంగాణాకు చెందిన కవులు కూడా ఉన్నట్లున్నారు. నాకు తెలియటం లేదు మిత్రులు పరిశీలించగలరు)

ఇతను చాలా కాలం కలకత్తాలో వ్యాపారాలు చేసి, చివరకు మద్రాసులో స్థిరపడినట్లు అర్ధమౌతుంది

బొల్లోజు బాబా

దక్కను కవుల పుస్తకం లింకు
https://archive.org/details/in.ernet.dli.2015.47980

ఆత్మను శుభ్రపరచే కవిత్వం - వసుధారాణి “కేవలం నువ్వే”



(29, సెప్టెంబరు న పల్లిపాలెం మధునాపంతుల ఆంధ్రీకుటీరంలో జరిగిన "కేవలం నువ్వే" పుస్తక పరిచయసభలో నేచేసిన ప్రసంగ పాఠం)

విజయవాడలో జరిగిన “కేవలం నువ్వే” పుస్తకావిష్కరణ సభలో శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు వసుధారాణి గారి కవిత్వాన్ని టాగోర్, గోథే, జిబ్రాన్, నీషే, రూమీ లాంటి మహామహుల కవిత్వాలతో పోల్చుతూ సారూప్యాలను వివరించారు. ఆ ప్రసంగ పాఠాన్ని వారు క్లుప్తీకరించి ఫేస్ బుక్ లో పెట్టినపుడు ఒకాయన “మీరు అతిగా పొగిడారు” అని కామెంట్ చేసారు. అక్కడ నేను “సార్ అది అతిగా పొగడటం కాదు, భద్రుడు గారు ఇలాంటి పుస్తకాలను ఎలా పరిచయం చేయాలో ఒక నమూనాను ఇస్తున్నారు” అని బదులిచ్చాను.

అక్కడ నేను “నమూనా” అన్న మాట ఎందుకు వాడానంటే – ఈ పుస్తకంలోని కవిత్వం ప్రత్యేకమైనది. మామూలుగా అందరూ రాసే వస్త్వాశ్రయ, ఆత్మాశ్రయ కవిత్వం లాంటిది కాదు. అంతకు మించినది ఏదో ఉంటుంది ఇలాంటి కవిత్వంలో. దాదాపు ఇదే తరహా కవిత్వంతో మూడేళ్లక్రితం మోదుగు శ్రీసుధ గారి “అమోహం” సంపుటి వచ్చింది. దానిపై పరిచయవ్యాసం రాయాలని మూడ్నాలుగు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాను నేను. అదే విధంగా భద్రుడి గారి “నీటిరంగుల చిత్రం” పై కూడా.

ఇంతెందుకు చెపుతున్నానంటే- ఇలాంటి కవిత్వాన్ని చదవటం మంచి అనుభవం. గొప్ప ఆత్మానుభూతి కలుగుతుంది. కానీ చదివిన దానిపై నాలుగు వాక్యాలు రాయటం చాలా కష్టం. ఒక్కో మూడ్ లో ఒక్కో అర్ధాన్ని ఇస్తుంటాయి, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్ధమౌతాయి. హృదయానుభూతిని అక్షరాలలో పెట్టటం చాలా కష్టం. ఉదాహరణకు ఒక కవితను చూద్దాం

నేను నీకు ఒక పూలమాలని అర్పించి పొంగిపోయాను
నీవు నాకోసం పూల తోటనే సృష్టించావు
అడవిపూలతో సుగంధం నింపి పంపావు నాకొరకై
నీవు నా సత్కారాలకై చూస్తావని అనుకోవటం నా అవివేకమంటావా?
నాకోసం ఇంత ఇచ్చిన నీకు మనసైనా అర్పించనీ
ఇవ్వటం నీకేనా? నాకూ తెలుసు

పై వాక్యాలలో నీవు అన్నమాటలో ఎవరున్నారు?

నేను నమ్మే కొత్తలంక బాబా గారా? కావొచ్చు. ఇంతచక్కని జీవితాన్ని, కుటుంబాన్ని, మీలాంటి సజ్జన సాంగత్యాన్ని నాకు ఇచ్చినందుకు.
నా భార్యా? కావొచ్చు. నేను ఆమె మెడలో పూలమాల మాత్రమే వేసాను. నాజీవితాన్ని పూలతోటగా మార్చిందామె.
ఈ సమాజమా? కావొచ్చు. నేనీ సమాజానికి ఇస్తున్నదల్లా “పాఠాలు చెప్పటమే”. కానీ ఈ సమాజం నాకు తిండి బట్ట, సంతోషాల్ని, భద్రతను ఇస్తోంది. నా జీవనాన్ని సంపూర్ణం చేస్తోందీ సమాజం

ఈ ప్రకృతా? కావొచ్చు. పై కవితలో వాచ్యార్ధం తీసుకొంటే అంతే అవుతుంది. ఏ సభలోనో ఎవరో వేసిన ఓ పూలమాలను నా పెరట్లో ఏ చెట్టుకొమ్మకో వేలాడదీసాను అనుకొందాం కాసేపు. అది కొన్నాళ్లకు వాడి ఎండి దానిలోని పూల విత్తనాలు వెదజల్లబడి మొలకెత్తి పూలతోట ఏర్పడవచ్చు. నేను వేసిన మాలను ఈ నేల తీసుకొని సుగంధాలు వెదచల్లే పూలతోటగా తిరిగి అందించింది అని అనుకోవచ్చు.

ఇన్ని అర్ధాలు ధ్వనించే కవితను ఒక బావంలోకో, ఒక చట్రంలోకో కుదించటం అన్యాయమౌతుంది. ఆ అనుభూతిని ఎవరికి వారు అనుభవించాల్సిందే. ఎవరికి వారు అర్ధాలు చెప్పుకోవలసిందే. ఇలాంటి కవిత్వాన్ని సమీక్షకుడు ఎంత గొప్పగా పరిచయం చేసినా అది విఫలయత్నమే అవుతుంది తప్ప సంపూర్ణ దర్శనం కాబోదు. భద్రుడుగారి ప్రసంగాన్ని ఒక నమూనా అన్నది అందుకే. ఇపుడు నేను చూపించేది కూడా ఒక దృక్కోణమే.
***
వియోగం లేదా ఎడబాటు అనేది మానవులనందరినీ నిత్యం జ్వలింపచేస్తూ ముందుకు నడిపించే చోదకశక్తి. ఆ శక్తే లేకపోతే అందరు జఢులమై ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఉండిపోతాం. ఈ వియోగం భారం అనేది మనకు బయటా, లోపలా కూడా ఉంటుంది. బయట ఉండే వియోగ భారం మనకు ఇష్టమైన వస్తువుల్ని, ఆస్తుల్ని, హోదాలను సంపాదించుకోవటానికి ప్రేరేపిస్తుంది. బాహ్యమైన వస్తువులపట్ల వియోగభారం అశాశ్వతం. ఒకసారి కారు కొనేసాకా ఇక కారు కి సంబంధించిన వియోగభారం ఉండదు.

లోపల ఉండే వియోగ భారాన్ని ఒదిలించుకోవటం దానినుంచి తేలిక పడటం అంత సులువుకాదు. ఒక్కోసారి ఏది మనకు వియోగ భారాన్ని కలిగిస్తుందో కనుక్కోవటం కూడా కష్టం. అది దైవమా, సహచరుడా, సాటిమనిషా, ప్రకృతా, మానవోద్వేగాలా లేక ఇవన్నీ కలగలిపా అనేది కూడా గుర్తించలేం మనం. అయినా ఏదో తెలియని మోయలేని వియోగభారం హృదయాన్ని నిలువనీయదు. ఈ భారం నుంచి విముక్తమవ్వటం కొరకు లోలోపల ఒక యుద్ధమే జరుతుంది. ఆ యుద్ధాన్ని జయించే క్రమంలో ఇదిగో ఇలా “కేవలం నువ్వే” లాంటి కవిత్వం పుడుతుంది. ఒక రవీంద్రనాథ్ టాగోర్ గీతాంజలి పుడుతుంది. ఒక ఖలీల్ జిబ్రాన్ ప్రొఫెట్ పుడుతుంది. ఒక జలాలుద్దీన్ రూమీ మస్నావి పుడుతుంది.

ఇలాంటి కవిత్వాలను వస్త్వాశ్రయమా, ఆత్మాశ్రయమా, సమాజాశ్రయమా అని తర్కించుకోవటం అనవసరం. ఇలాంటి కవిత్వం పూర్తిగా ఆత్మగతమైనవి. వియోగభారాన్ని మోస్తున్న ఒక మనిషి ఆత్మను ఆవిష్కరిస్తాయి. ఆత్మను ఆవిష్కరించటానికి సాహిత్యం వినా మరోమార్గం లేదు మానవజాతికి. భక్తి గీతాలు, సూఫీ కవిత్వం, జెన్ కథలు ఆ పని చేసాయి.

ఈ రోజు రూమీ కవిత్వం ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఆదరణ పొందుతోంది. ఎందుకంటే మానవోద్వేగాలైన ఆనందం, స్వేచ్ఛ, దైవం, స్నేహం, దుఃఖం, మంచి చెడు, సౌందర్యంపట్ల వివశత్వం, పశ్చాత్తాపం, కరుణా లాంటి సామాన్య మానవుల వియోగబారాలన్నింటికీ “ప్రేమ” అనే ఒక నిర్ధిష్ట రూపాన్ని ఇచ్చాడు రూమీ. ఈ లౌకిక బంధనాలనుంచి ఆత్మను శుభ్రం చేసుకోవటం, మనల్ని అర్పించుకోవటం, అహాన్ని చంపుకోవటం ద్వారా మాత్రమే “ప్రేమ” లో ఐక్యం అవగలమని రూమీ తన కవిత్వంద్వారా చెప్పాడు. ఫై లక్షణాలన్నీ వసుధారాణి కవిత్వంలో కనిపిస్తాయి.
***

కేవలం నువ్వే సంపుటిలోని కవితలలోని వ్యక్తీకరణ విధానాన్ని, శిల్పరీతుల్ని అయిదు కోణాలలో విశ్లేషించుకోవచ్చు. అవి

1. కవి గొంతుక: నేను నువ్వు అనే రెండు మాటలతో మొత్తం కవితను అంతా నడిపించటం చాలా చోట్ల గమనిస్తాం. ఆ కవితలలో కనిపించే "నేను" ఎవరు కవా? ఒక సమూహమా? ఒక జాతా? అని తరచిచూస్తే అది కవి స్వీయగొంతుక అని అర్ధమౌతుంది. చాలా చోట్ల అది స్త్రీ స్వరమే కూడా. ముందుగా అనుకొన్నట్లు నేను అనేది కవి అయితే నువ్వు మాత్రం అనిర్ధిష్టం.

నా రోదనతో నిన్ను మొరలిడాను, నావేదన తీర్చావు
నా వాంఛల్ని నీకు విన్నవించాను, నా కోర్కెలని తీర్చావు
నా మౌనాన్ని నీకు నివేదించాను, నన్నే స్వీకరించావు
ఈ బుద్ది నాకు మొదట కలిగింది కాదేమి?

“మౌనం నువ్వు సాధన చేయాల్సిన కళ” అంటాడు రూమీ. పై కవితలో “నీవు నన్నే స్వీకరించావు” అనటం కైవల్యాన్ని సూచిస్తుంది. అంటే రూమీ చెప్పిన మౌనాన్ని వసుధారాణి గారు కొంచెం ముందుకు తీసుకువెళ్ళి భారతీయ భక్తిసంప్రదాయంలోని కైవల్యంతో ముడిపెట్టారు. ఇవి కవి పలుకుతున్న మాటలు.

నువ్వు నా జీవితంలోకి
వచ్చాకా నా జీవితాదర్శమే
మారిపోయింది
ఇప్పటిదాకా నాకోసం నేను
ఇప్పటినుంచి నీకోసం నేను.

పై వాక్యాలలో మనల్ని మనం మరొకరికి నిర్నిబంధంగా అర్పించుకోవటం అనే లక్షణం గమనించవచ్చు. ఇది కవి హృదయపు లోతుల్లోంచి పలుకుతోన్న స్వరం.

2. కథనాత్మక శైలి: కథనాత్మక శైలి పఠితల్ని ఆకర్షిస్తుంది. చెపుతున్న సంఘటననో దృశ్యాన్నో మనో ఫలకంపై చిత్రించుకోవటం ద్వారా చక్కని అనుభూతిని కలిగిస్తుంది. మొత్తం సంపుటిలో నాలుగైదు కవితలు మాత్రమే కథనాత్మకశైలిలో ఉండటం గమనించవచ్చు. ఉన్నవి కూడా ఆ శైలిలో తప్ప వేరేరకంగా చెప్పనలవికానివే కావటం గమనార్హం.

నిన్నటి ప్రదోష కాల పూజలో దోషం ఏదైనా చేశానా?
ఈరోజు సుప్రభాత వేళకి నీ మోము చిన్నబుచ్చుకుంది
మరీ వేడి పదార్ధాలు, తొందరలో నివేదించానా?
నాసాగ్రం ఎర్రబడి, చుబుకం కందివుంది.
నీకిచ్చిన కర్పూరతాంబూలం తీసుకెళ్లి దేవేరికి సమర్పించావా?
ఎర్రగా ఉండాల్సిన నీ పెదాలు మామూలుగా ఉన్నాయి.
రోజూ నే చేసే సపర్యలన్నిటికి నిజంగా నీ ప్రతిచర్య ఉంటుందా?
ఇవన్నీ నా భావనలేనా ఐతే
ఇంత వింత భావనలతో నను పుట్టించినది నీవే కదూ? విచ్చిన నీ పెదవుల దరహాసం
నా కథని మళ్ళీ మొదటికి తెస్తోంది.

చక్కని ఊహ. పై కవితలో ఒక భక్తురాలు భగవంతునితో సంభాషిస్తోంది. నేనిచ్చిన తాంబూలాన్ని సేవించావా లేక పట్టికెళ్ళి అమ్మవారికి ఇచ్చావా అని అడగటంలో – ప్రేమకన్నా భగవంతునిపై భక్తునికి ఉండే హక్కు ధ్వనిస్తుంది. నా పూజలలో ఉన్న లోపాలేమైనా ఉంటే అది నీ సృష్టిలోని లోపాలే అని భగవంతుడినే తిరిగి నిందించటం కూడా ఇలాంటిదే. ఇవన్నీ భక్తిసారం లోతుల్ని తరచిచూసినవాళ్లు మాత్రమే రాయగలిగే వాక్యాలు. ఈ భావాలను చెప్పటానికి కథనాత్మక శైలిని ఎంచుకోవటం కవి ప్రతిభ.

3. అలంకారాలు: కవిత్వాన్ని అలంకారయుతంగా చెప్పటం ఒక పద్దతి, ఏ అలంకారాలూ లేకుండా చెప్పటం మరొక పద్దతి. రెండవ పద్దతిలో బలమైన ఊహలేకపోతే ఉత్తవచనంగా మిగిలిపోతుంది. ఈ పుస్తకంలో కొన్ని కవితలు నిరలంకారంగా ఉన్నాయి. మిగిలిన చోట్ల పారడాక్స్/విరోధాభాస అలంకారాన్ని విరివిగా వాడుకోవటం గమనించవచ్చు. ఉపమ, రూపకాలు చాలా అరుదుగా కనిపించాయి.

పరస్పరవ్యతిరేక అర్ధాలు కలిగిన రెండు భావాల్ని కలిపి చెప్పటాన్ని పారడాక్స్ అంటారు. గీతాంజలిలో, రూమీ వాక్యాలలో, భగవద్గీతలో పారడాక్స్ వ్యక్తీకరణలను అనేకం చూడవచ్చు. మిస్టిక్ కవిత్వ ప్రధానలక్షణం పారడాక్స్.
ఈ పుస్తకంలో కొన్ని పారడాక్సికల్ వ్యక్తీకరణలు

అమితమైన ఆనందాన్ని ఇచ్చేది
అంతులేని దుఃఖాన్ని కూడా ఇస్తుంది. (29)

గాయమూ
లేపనమూ
రెండూ నువ్వే (12)
ప్రేమికుడొక
స్వేచ్ఛాయుత బంధీ (19)

నీకూ నాకూ మధ్య
వారధి ఏమిటంటే
దుఃఖం
నిన్ను నన్నూ విడదీసేది
సుఖం
చిత్రంగా నీతో నా మొరలన్నీ
సుఖం కోసమే (51) ఇదొక గడుసైన విరోధాభాస. నిన్నూ నన్నూ కలిపేది దుఃఖం అనటం ఒకె. నిన్ను నన్ను విడదీసేది సుఖం అనటం కూడా ఒకె. నా మొరలన్నీ సుఖం కోసమే అనటం అంటే విడదీయటం కోసమనా? మరో మెట్టుకు వెళ్ళి ఆలోచిస్తే మనమందరం సుఖాలకోసం ఈశ్వరునికి మొరపెట్టుకోవటం వల్ల ఆయనకు మరింత దూరమౌతున్నాము అన్న సూచన అనన్యమైన ఆలోచన.

కళ్ళువిప్పుకుని
మెళకువగానే
ఉన్నాననుకున్నాను
అది నిద్రావస్థ అని
నువ్వు జాగృతం
చేసినాక కానీ
తెలిసింది కాదు. (50) (ఇక్కడ మెళకువ, నిద్రావస్థ, జాగృతం పదాల ప్రయోగం చాలా ఔచిత్యవంతంగా ఉంది)

చక్కని అందమైన ఊహాచిత్రాలు ఈ సంపుటిలో అనేకం ఉన్నాయి

ఆవిర్భావం, అంతం లేని
ప్రవాహంలో
ఆ గడ్డిపువ్వూ, ఆ కొండా
ఆ పాలపిట్టా, నేనూ
అందరం కొట్టుకు పోతున్నాం (67)

సంతోషం దుఃఖం
కోపం విచారం
ప్రేమ ద్వేషం
అన్నీ మనసు
ఊదుకొనే గాలిబుడగలే (9) లాంటి ఊహాచిత్రాలు కవికి కల కల్పనా చాతుర్యము, వాటిని అక్షరాల్లో పెట్టగలిగే ఒడుపు ఉన్నతస్థాయివని నిరూపిస్తాయి.

నాకున్న నైపుణ్యం ఒక్కటే
నువ్వు ఉన్నావని తెలుసుకోవటం
నాకు ఇప్పటికీ చేతకానిది ఒక్కటే
ఎక్కడున్నావో తెలుసుకోలేకపోవటం (70) ఇది నిరలంకార కవిత. దేవుడున్నాడని నమ్మేవాళ్ళలో కూడా అతను ఎక్కడున్నాడో చెప్పలేకపోవటం ఒక వైరుధ్యం. ఒక్కొక్కరిది ఒక్కొక్క భాష్యం. ప్రతి సామాన్యుడు నిత్యం ఎదుర్కొనే ఈ సార్వజనీన సత్యం వలన పైవాక్యాలలో ఏ రకమైన అలంకారాలు లేకపోయిన లోతైన కవితగా రూపుదిద్దుకొంది.

4. ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు: మన జీవితాలను నడిపించే ఒక శక్తిని దైవమని నమ్మి అలాంటి దైవంపట్ల చింతన కలిగిఉండటమే ఆధ్యాత్మికత. ఈ సంపుటిలో అనేక కవితలలో జీవితానికి చేసిన ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు కనిపిస్తాయి.

నీవున్నావనే ఆధారాలతో కొందరు
నీవు లేవనే నిరూపణలతో కొందరు
మొత్తం మీద నీ స్మరణలోనే అందరూ (18) ఇదొకరకమైన నిందాస్తుతి అనుకోవచ్చు.

అద్భుతాలని
ఎరగా వేసి జీవితంపై
ఆశలు పెంచుతావు
ఇంతలోకే ఉదాసీనత
పెంచే కష్టం చూపి
జీవితం ఇదేనా అనిపిస్తావు. (10) మనమందరం భగవంతుడు ఆడించే బొమ్మలమనీ, ఇదంతా ఆయన లీలా వినోదమనీ చిన్నచిన్న వాక్యాలలో పొదిగారు.

5. జీవిత సూక్తులు: ఈ తరహా కవిత్వంలో జీవితసూక్తులు ఉంటాయి. ఉత్తమజీవనం ఎలాసాగించవచ్చో సూచనలుంటాయి. ఇవన్నీ జీవితాన్ని దీప్తిమంతం చేసుకోవటానికి సహాయపడతాయి.

నీకో శత్రువుండాలి
లేకుంటే నీ జీవితానికి
లక్ష్యం లేదు
నీకో మిత్రుడుండాలి
లేకుంటే నీ సంతోషానికి
అర్ధం లేదు
నీవు అజాత శత్రువువే ఐనా
అంతర్గత శత్రువుని గుర్తించు (6)

స్వర్గానికి దారెటు అని
నరకంలో ఉన్నవాడిని ప్రశ్నించకు (58)

పగ తెచ్చిపెట్టుకొనేది
అందుకు బోలెడు కారణాలు
మరి ప్రేమో
కారణం లేకుండానే కలిగేది. (44)
***
నేను అనే భావనలో మనందరం కూరుకుపోయి ఉంటాం. అంతసులభంగా ఆ ఊబిలోంచి బయటపడలేం. కనీసం ఈ పుస్తకాన్ని చదువుతున్నంతసేపైనా మనం ఆ బంధనాల్లోంచి బయటపడతాం. కనీసం ఆ కాసేపైనా మనల్ని మనం మనకు ప్రియమైనవారికి అర్పించుకొంటాం. కనీసం ఆ కాసేపైనా మనం తేలికపడతాం. కనీసం ఆ కాసేపైనా మన ఆత్మ శుభ్రపడుతుంది. ఇరవయ్యొకటో శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా కవిత్వం ఒక ఫీనిక్స్ పక్షిలా పైకి లేవటానికి కారణం ఆత్మని శుభ్రపరచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ కలగటమే.

ఈ తరహా కవిత్వం ఏకాలంలోనైనా, ఏ దేశానికి చెందినదైనా ఇలాగే ఉంటుంది. “కేవలం నువ్వే” పుస్తకాన్ని ఆ పరంపరకు కొనసాగింపుగా, ఈ తరంలో పలుకుతున్న వాళ్లందరి ఉమ్మడి స్వరంగా చూడాలి. ప్రతీ తరంలోనూ ఎవరో ఒకరు గానాన్ని కొనసాగిస్తారు. ఆ బావజాలపు మాధుర్యాన్ని నేటి తరానికి అందించినందుకు వసుధారాణిగారిని మనం అభినందిద్దాం.
ఈ పుస్తకానికి డా. వాడ్రేవు వీరలక్ష్మి దేవి చక్కని ముందుమాట వ్రాసారు. పుస్తకం గెటప్ బాగుంది. లోపల రత్న పోచిరాజు గారి వాటర్ కలర్ పెయింటింగ్స్ పుస్తకానికి అదనపు అందాన్ని ఇచ్చాయి.

కవయిత్రి ఫేస్ బుక్ వాల్: https://www.facebook.com/vasudha.rani.731

(ఈ వ్యాసం సారంగ లో ప్రచురింపబడినది. ఎడిటర్ గారికి ధన్యవాదములు)

కరువుకాలం కొంగలు - Cranes in Drought ( Akaal men Saras) by Kedarnath Singh

కరువుకాలం కొంగలు - Cranes in Drought ( Akaal men Saras) by Kedarnath Singh

ఒకానొక మధ్యాహ్నం వేళ
అవి వచ్చాయి
అవి వచ్చినపుడు
అవి అలా వస్తాయని ఎవరూ ఊహించలేదు

ఒకదానివెనుక మరొకటి
గుంపులు గుంపులుగా వచ్చాయి
మెల్లమెల్లగా ఆకాశం మొత్తాన్ని
అలముకొన్నాయి
క్రమక్రమంగా ఊరు మొత్తం
కొంగల అరుపులతో నిండిపోయింది.

చాలాసేపు అవి ఊరిమీద తిరుగుతూ
రెక్కల్లోంచి ఊడిపడినట్లు
ఇంటికప్పులపై, పాకలపై, గడ్డిమేట్లపై వాలాయి.

ఒక ముసలమ్మ వాటిని చూసింది.
అవును... అవును...
ఇవి నీటికోసమే వెతుకుతున్నాయి
అని అనుకొంది

వంటింట్లోకి వెళ్ళి
ఒక కుండతో నీరు తెచ్చి
పెరటి మధ్యలో ఉంచింది

కొంగలు మాత్రం
ఆ ముసలమ్మని, ఆమె ఉంచిన నీటికుండనూ
గమనించకుండా
ఊరిమీదే చాలాసేపు తిరుగాడాయి.

క్రింద నివసించే జనం
తమను కొంగలు అని పిలుస్తారని కూడా
బహుసా ఆ కొంగలకు తెలియకపోవచ్చు

సుదూరప్రాంతం నుంచి
నీటికొరకు అన్వేషణలో ఆ కొంగలు
ఈ ఊరికి వచ్చాయి

తమ మెడలను వెనక్కు తిప్పి
అసహ్యమో, జాలో తెలియని చూపులతో
ఊరినొకసారి చూసి
గాల్లో రెక్కలు తపతప లాడించుకొంటూ
ఎగిరిపోయాయి.

Source: Cranes in a Drought ( Akaal men Saras) by Kedarnath Singh
English Translation: Sri. B.S.N Murthy
తెలుగు అనువాదం: బొల్లోజు బాబా
One year has passed since Sri Kedarnath Singh left us. But he still lingers in his Poetry
శ్రీ కేదార్ నాథ్ సింగ్ ఇతర కవితానువాదాలు ఈ లింకులో కలవు.

English Medium

నాలుగువందల ఏళ్లుగా ఈ నేలపై జీవించిన ఇంగ్లీషు పరాయి భాష ఎప్పుడయింది?

రాత్రికి రాత్రి మతభాష ఎందుకయిందీ?

ఈ మీడియం మార్పు అనేది లెక్కలు, సైన్సు, సోషలు సబ్జక్టులకే పరిమితం. మిగిలిన తెలుగు, ఇంగ్లీషు, హిందీ/ఉర్దు లు యధాతధంగా ఉంటాయి. ఈ విషయం తెలుసుండీ ఎందుకింత రాద్దాంతం?

విద్యార్ధులలో డబ్బైశాతం మంది ఇంగ్లీషు మీడియం ముప్పై శాతం మంది తెలుగుమీడియంలో చదువుకొంటున్నారు. ఈ తెలుగుమీడియంలో చదువుతున్న వారిలో 75 శాతం మంది బడుగు విద్యార్ధులు.

లెక్కలు ఇలా ఉన్నప్పుడు ఈ బడుగు విద్యార్ధులు మాత్రమే తెలుగును బ్రతికించాలని కోరుకోవటం దుర్మార్గం.

లెక్కలు, సైన్సు, సోషలు అంతర్జాతీయ శాస్త్రాలు. వాటిని ఇంగ్లీషులోనే నేర్చుకోవటం సముచితం. వాటిని తెలుగులో నేర్పి ఆ కుర్రాడిని ఆత్మవిశ్వాసం లేనివాడిగా తయారు చెయ్యాలనుకోవటం అమానవీయం.

Enough is enough. ఇప్పటికైనా జరిగిన తప్పును సవరించుకొందాం.

కావలి బొర్రయ్య నుంచి గురజాడ వరకూ చాలామంది ఇంగ్లీషులో కూడా నిష్ణాతులు. కావలి వెంకట రామస్వామి 1829 లోనే ఇంగ్లీషులో రచనలు చేసిన తొలితరం తెలుగు రచయిత. గురజాడ కన్యాశుల్కానికి అద్భుతమైన ముందుమాట ఇంగ్లీషులో వ్రాసుకొన్నాడు. శ్రీశ్రీ తన కవితల్ని తానే ఇంగ్లీషులోకి తర్జుమా చేసుకొనేవాడు.

ఈ రోజు మనలో ఇంగ్లీషులో రచనలు చేయగలిగే వాళ్ళసంగతి దేవుడెరుగు, కనీసం తమ కథల పుస్తకాలకు ఇంగ్లీషులో ముందుమాట రాసుకోగలిగే తెలుగు కథకులు కానీ అనువదించుకోగలిగే కవులు కానీ ఎందరున్నారు?

దీనికి కారణం యాభై ఏళ్లపాటు తెలుగు మీడియం తెలుగు సాహిత్యానికి చేసిన ద్రోహం కాదా?

వాస్తవాలు మాట్లాడుకొందాం. రెండు మీడియం లు ఉండాలని నంగిరిమింగిరి మాటలు ఒద్దు..

ఇప్పట్లో తెలుగుకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు.
మన ఊరి చేపల మార్కెట్టుకు వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఇంగ్లీషులో మాట్లాడుకొంటున్నప్పుడు తెలుగు ప్రమాదంలో పడిందని భావిద్దాం. అంతవరకూ తెలుగుభాష అంతరించిపోతుందని ఆందోళన చెందక్కరలేదు.

బొల్లోజు బాబా

సర్వాయి పాపన్న – ఒక చారిత్రిక పరిశీలన



దళితబహుజనులు ఏకమై ఉద్యమిస్తే రాజ్యాధికారం సాధించవచ్చని 17 వ శతాబ్దంలోనే నిరూపించిన విప్లవకారునిగా కొందరు చరిత్రకారులు సర్వాయి పాపన్నకు పట్టం కట్టారు. చరిత్రలోంచి వ్యక్తులను తీసుకొని వారిద్వారా సమకాలీన రాజకీయ ప్రాసంగిత కలిగిన దృక్పథాన్ని ప్రకటించటం నేడు సర్వదా నడుస్తున్న వ్యవహారం.

సర్వాయి పాపన్న జీవితం జానపదగాథలలో నిక్షిప్తమై ఉంది. ఇదొక కళాత్మక రూపం. సాధారణంగా కళాత్మక రూపంలో కల్పన ఉంటుంది. కథానాయకుడి చుట్టూ వ్యతిరేక వాతావరణ రూపంలో ఒక ఘర్షణ చిత్రించబడుతుంది. చివరకు ప్రొటగానిస్ట్ మరణించటంతో కథ ముగుస్తుంది. ఆనందోపదేశాలు కళ బాధ్యతలు. చరిత్రను మోసే అవసరం కళకు ఉండదు. అందుచేత ఆ రచయిత కళారూపానికి విరుద్ధంగా ఉండే కొన్ని సామాజిక, చారిత్రిక వాస్తవాల పట్ల అయితే మౌనమైనా వహించాలి లేదా వాటిని వంకరలైనా తిప్పాలి. అందుకే వీరగాథలలో కనిపించే కథానాయకులకు చరిత్రపుస్తకాలలో కనిపించే కథానాయకులకు హస్తిమశకాంతర వ్యత్యాసం ఉంటుంది.

J.A. Boyle, 1874 లో Telugu Ballad Poetry అనే వ్యాసంలో పాపారాయుని వీరగాథను బళ్ళారికి చెందిన ఒక బోయవాని నోటివెంట విన్నట్లు, అది ఇటీవలే వ్రాసినదని పేర్కొన్నాడు. అందులో పాపన్న తల్లితో తన జీవితాశయాలను ఇలా చెపుతున్నాడు.

తల్లీ కొలువుకు వెళ్లను/
ఎంగిలి ముంత ఎత్తలేను
కొట్టుదును గొల్కొండ పట్టనము
ఢిల్లికి మొజుర్ నవుదును
మూడు గడియల బందరు కొట్టుదును
బంగార కడియాలు పెట్టుదును

ఆ తరువాత సర్వాయి పాపన్న వీరగాథను వచనరూపంగా మార్చి సర్వాయి పాపన్న చరిత్ర పేరుతో 1931 వచ్చింది. ఇది మరింత కాల్పనికతో ఉంటుంది.
***

I. సర్వాయి పాపన్న చరిత్ర

పాపన్న పన్నెండేళ్ల వయసులో చెట్టుక్రింద పడుకొన్నప్పుడు పన్నెండు తలల నాగుపాము అతనికి నీడపట్టింది. అటే పోతున్న కొంతమంది బ్రాహ్మణులు అది చూసి పాపన్న మహర్జాతకుడని, పల్లకిలో తిరుగుతాడని, గోల్కొండను ఏలుతాడని చెపుతారు. (పాపన్న కల్లుగీత వృత్తి చేసే గౌండ కులానికి చెందిన వ్యక్తి. అప్పట్లో బ్రాహ్మణ, క్షత్రియులకు తప్ప ఇతరులకు పల్లకిలో తిరిగే అర్హత ఉండేది కాదు),

అప్పటినుంచి పాపన్న నోటిమాటకు మహత్యం వచ్చిందట. తాడిచెట్టును కల్లు ఇమ్మని అడిగితే ఒంగి ఇచ్చేదట. తల్లి దాచుకొన్న కొంత సొమ్మును దొంగిలిస్తాడు. వెంకటరావు అనే ఒక భూస్వామిని శిక్షించి అతని ధనాన్ని లాక్కొంటాడు. ఒక ఎరికల ఆమెను పెండ్లిచేసుకొంటాడు. వజ్రనబుద్దు అనే జమిందారుని కొల్లగొడతాడు. గోల్కొండ సైనికులతో తలపడి విజయం సాధిస్తాడు. గోల్కొండకోటపై దాడి చేసి ఆక్రమించుకొంటాడు. తరువాత ముస్లిం సైనికులు చుట్టుముట్టినప్పుడు ఇక చిక్కక తప్పదని తెలుసుకొని కత్తితో తలనరుక్కొని చనిపోతాడు.

గోల్కొండ నవాబు ఇతని గొప్పదనాన్ని గుర్తించి రాజలాంఛనాలతో అంత్యక్రియలు జరిపించటంతో కథ ముగుస్తుంది.

సమకాలీన కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే ఈ గాథలో బ్రాహ్మణ వ్యతిరేకత (వర్ణ వ్యవస్థను ధిక్కరించి పల్లకిలో తిరగటం), సామ్రాజ్య వ్యతిరేకత, భూస్వామ్య వ్యతిరేకత, దళితబహుజన రాజ్యాధికార సాధన లాంటి రొమాంటిక్ ఊహలు అనేకం కనిపిస్తాయి.

వీరగాథలు చరిత్రగా చలామణీ అయ్యేచోట చారిత్రిక వాస్తవాలు నిర్ధాక్షిణ్యంగా మరణిస్తాయన్నది ఒక నిష్టుర సత్యం.
****

II. చరిత్ర రికార్డులలో సర్వాయి పాపన్న (1650-1710)

1. ఆనాటి రాజకీయ పరిస్థితులు

సర్వాయి పాపడు 1695 నుంచి 1710 మధ్యలో క్రియాశీలకంగా ఉన్నాడు. ఔరంగజేబు1687 లో గోల్కొండను వశపరచుకొని గోల్కొండ రాజు అబుల్ హసన్ ను బంధీగా తీసుకొనిపోయి దక్కనును నేరుగా ఢిల్లీ పాలనలోకి తీసుకొచ్చాడు. స్థానికేతరులు అధికారులుగా రావటంతో స్థానిక జమిందార్లు, కులీనులు అసంతృప్తితో ఉండేవారు. పన్నుల భారం అధికమైంది. కరువుకాటకాలు చుట్టుముట్టాయి. ఈ కాలంలో మొఘల్ సామ్రాజ్యం రాజకీయంగా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. అప్పటికే ఔరంగ జేబుకు తొంభైఏళ్ళు దాటాయి. ఇక చక్రవర్తి రేపోమాపో చచ్చిపోతాడని దేశం అంతా ఎదురుచూసే పరిస్థితి. వారసత్వ పోరు ఉండనే ఉంది. సామంతులు ఎవరి మట్టుకు వారు స్వతంత్రతను ప్రకటించుకొనే ఆలోచనల్లో ఉన్నారు. కేంద్రంలో కానీ, స్థానీయంగా కానీ బలమైన నాయకత్వం లేదు.

పరిస్థితి ఎంతెలా ఉండేదంటే ఔరంగజేబు 1700 లో Riza Khan అనే సైనికాధికారిని, బీదరు అల్లర్లను కట్టడి చేయమని పంపిస్తే అతను ఇక్కడకు వచ్చి స్వతంత్రాన్ని ప్రకటించుకొని, సమీప సంస్థానాలను ఆక్రమించుకొని, గ్రామాలను దోచుకొంటూ ఆ ప్రాంతాన్ని ఒక నియంతలా ఏలటం మొదలెట్టాడు.

2. పాపడి రంగ ప్రవేశం

ఇలాంటి అస్థిర పరిస్థితులలో సర్వాయి పాపడు తెరమీదకు వచ్చాడు.

వరంగల్ కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తరికొండ గ్రామంలో పాపడు జన్మించాడు. 1690 ల ప్రాంతంలో పాపడు ధనికురాలైన తన విధవ సోదరిని చంపి ఆమె ధనాన్ని దొంగిలించాడు. ఈ డబ్బుతో కొంతమంది అనుచరులను కూడగట్టుకొని తరికొండపై చిన్న దుర్గాన్ని నిర్మించుకొన్నాడు. (అనుచరులు అంటే కూలి ఇచ్చి పెట్టుకొనే వ్యక్తులు. అప్పట్లో సైన్యం అంటే కూడా కూలికి పోరాడే వ్యక్తులు. అంతే తప్ప ఆశయాలకు ఆకర్షితులై వచ్చి చేరే ఆదర్శపురుషులు కారు. యుద్ధంలో జయిస్తే రాజుకు భూములు, అధికారం, అందమైన స్త్రీలు దక్కితే; ఓడిన రాజ్యంలోని ప్రజల డబ్బులు, నగలు, బిందెలు, చెంబులు లాంటివి ఈ సైనికులు బలవంతంగా లాక్కొని పంచుకొనేవారు. సైనికులకు ఇదొక అదనపు ఆకర్షణ. యుద్ధానంతరం దొమ్మీ అనివార్యం).

అలా పాపడి నాయకత్వంలో ఈ దండు, దుర్గంలో ఉంటూ రాజమార్గం (Highway) పై హైదరాబాదువైపు వెళ్ళే వ్యాపారస్తులను, ధనిక పరివారాన్ని అటకాయించి దోపిడీలు చేసేది. ఇది చూసిన స్థానిక నాయకులు పాపడిని తరిగొండనుంచి తరిమేసారు. అక్కడనుంచి వందమైళ్ల పారిపోయి వెంకటరావు అనే జమిందారు వద్ద సేనానిగా చేరాడు పాపడు.

అక్కడ కూడా పాపడు తన పాతపద్దతులలో దారిదోపిడీలు చేస్తున్నట్లు తెలుసుకొన్న వెంకటరావు ఇతన్ని ఖైదుచేయించాడు. వెంకటరావు భార్య, తనబిడ్డకు అస్వస్థత తగ్గాలని ఖైదీలనందరినీ విడిపించిన సందర్భంలో పాపడు కూడా విడుదలై తిరిగి జనజీవనంలోకి వచ్చాడు.

3. పాపడి దురాగతాలు

పాపడు తన పుట్టిన ఊరు సమీపంలో షాపూర్ (Shahpur) అనే ప్రాంతాన్ని తన నివాసంగా చేసుకొని మరలా దారిదోపిడీలు కొనసాగించాడు. ఇక్కడ ఇతనికి సర్వాయి అనే మిత్రుడు తగిలాడు. వీరిద్దరి స్నేహం బలపడి కొండపై ఒక బలమైన దుర్గాన్ని నిర్మించి మరిన్ని క్రూర కృత్యాలు చేయటం మొదలెట్టారు. వీరి అరాచక చర్యలకు ముస్లిమ్, హిందువులు ఇద్దరూ కూడా బాధితులుగా ఉండేవారు. ఈ విషయాలు కొంతమంది ఔరంగజేబుకు తెలియచేయటంతో అతను కాసిం ఖాన్ అనే సేనాధిపతిని పాపడిని తొలగించమని పంపించాడు.

పాపడిని పట్టుకోవటానికి వెళ్ళిన కాసిం ఖాన్ ను పాపడి అనుచరులు చంపేయటంతో వీరు మరింత విజృంభించటం మొదలెట్టారు.

1702 లో గోల్కొండ డిప్యూటి గవర్నల్ రుస్తుం దిల్ ఖాన్ స్వయంగా పాపడిని అంతమొందించటానికి షాపూర్ వచ్చి రెండునెలలపాటు పాపడి బృందంతో పోరాడాడు. ఈ పోరాటంలో పాపడు, సర్వాయిలు తప్పించుకోగా, రుస్తుం దిల్ ఖాన్ కోటను ధ్వంశం చేసి హైదరాబాదు తిరిగి వచ్చేసాడు.

రుస్తుం దిల్ ఖాన్ వెళిపోయాక పాపడు, సర్వాయిలు తిరిగి వచ్చి కోటను మరింత విస్తరించి కట్టుకొని తమ కార్యకలాపాలు కొనసాగించటం మొదలెట్టారు. ఇదే సమయంలో పాపడి అనుచరులు- సర్వాయికి పుర్దిల్ ఖాన్ కి మాటామాటా వచ్చి కొట్టుకొని ఇద్దరూ హతమవటంతో పాపడు నాయకత్వానికి తిరుగులేకుండా పోయింది. పాపడు బృందం సమీపంలో ఉన్న కోటలను ముట్టడించి ఆక్రమించుకోసాగింది.

1706 లో గోల్కొండ డిప్యూటి గవర్నరు పైన చెప్పిన మరొక దోపిడిదారుడు Riza Khan ను పాపడిని నిలువరించమని అభ్యర్ధించాడు. బహుసా ముల్లును ముల్లుతో తీయాలని గోల్కొండ పాలకులు భావించి ఉంటారు. రిజాఖాన్ కొంతమంది సైన్యాన్ని పంపాడు. పాపడి ముందు వీరు నిలువలేక వెనక్కి వచ్చేస్తారు.

ప్రజలనుండి వస్తున్న ఒత్తిడులకారణంగా 1707 లో డిప్యూటి గవర్నరు రుస్తుం దిల్ ఖాన్ పాపడిని పట్టుకోవటానికి సైన్యంతో షాపుర్ వచ్చి పాపడితో తలపడ్డాడు. ఈసారి పాపడు తెలివిగా భారీ ధనాన్ని రుస్తుం దిల్ ఖాన్ కు లంచంగా ఇచ్చి తప్పించుకొన్నాడు. రుస్తుం దిల్ ఖాన్ హైదరాబాదు వెళిపోయాడు.

4. వరంగల్ కోటపై దాడి

రుస్తుం దిల్ ఖాన్ కు లంచమిచ్చి తప్పించుకొన్న పాపడు తనకు ఇక తిరుగే లేదని భావించి ఏప్రిల్ 1708 లో మూడువేలమంది అనుచరులతో వరంగల్ కోటపై దాడి చేసి, వశపరచుకొని అపారమైన సంపద, వస్తువులను చేజిక్కించుకొని; వేలమంది ధనిక వర్గానికి చెందిన స్త్రీలను బంధీలుగా తనవెంట తీసుకొని పోయాడు.

పాపడి అనుచరులు వరంగల్ పట్టణాన్ని లూటీ చేసారు. వరంగల్ మేలుజాతి కార్పెట్లకు ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. పెద్ద పెద్ద కార్పెట్లను తీసుకెళ్లలేక ముక్కలు చేసి పట్టుకెళ్లారు.

షాపూర్ కోటలో ఎత్తైన గోడలతో నిర్మించిన ప్రదేశంలో అపహరించిన స్త్రీలను, పిల్లలను బంధించారు. వీరిలో వరంగల్ పట్టణ న్యాయాధికారి భార్య, ఎనిమిదేళ్ల కూతురు కూడా ఉన్నారు. అపహరించిన వారి బంధువులనుండి పెద్దమొత్తాలలో ధనాన్ని వసూలు చేయటానికి డబ్బు ఉన్న వారి స్త్రీలను పిల్లలను పాపడు ఎంచుకొనేవాడు.
(ఆ న్యాయాధికారి భార్యను పాపడు సొంతానికి ఉంచుకొని, కూతురిని నాట్యకత్తెగా తర్ఫీదు ఇమ్మని భోగం స్త్రీలవద్దకు పంపించాడు. ఆ చిన్నిపాప తాత పేరు షా ఇనాయత్. ఇతను ఆనాటి సమాజంలో గౌరవనీయుడు. ఇతను డిల్లీ వెళ్ళి బహదూర్ షా వద్ద తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొన్నప్పుడు, బహుదూర్ షా పెద్దగా స్పందించలేదు. చేసేదేమీ లేక ఇతను ఇంటికి వచ్చి తన నౌకరులందరికీ కానుకలిచ్చి స్వేచ్ఛగా బ్రతకమని పంపించేసి కొద్దిరోజులకే బెంగతో చనిపోయాడు)

5. భోనగిరి కోటపై దాడి

వరంగల్ కోటపై చేసిన దాడిద్వారా పాపడు విపరీతమైన ధనాన్ని కూడగట్టాడు. దీనితో ఆంగ్లేయులు, డచ్చివారినుండి 700 తుపాకులు కొన్నాడు. బంగారు పల్లకిలో తిరగటం మొదలెట్టాడు. చుట్టూ 700 మంది సాయుధులైన సైనికులను రక్షణగా పెట్టుకొన్నాడు.

ఆహారధాన్యాలు పెద్దఎత్తున కొంటానని పాపడు ఒకరోజు వ్యాపారస్తులకు కబురు పెట్టి, వారి ధనాన్ని, వస్తువులను, బండ్లను, పదివేల పశువులను బలవంతంగా లాక్కొని, వారిని బంధించి ఖైదులో పడేయించాడు. ఆ పశువుల సాయంతో చుట్టుపక్కల ప్రాంతాలను సాగుచేయించటం మొదలు పెట్టాడు.

వరంగల్ కోటదాడి తరువాత భోనగిరి కోటపై జూన్ 1708 లో దాడి చేసాడు. ఈ సమయంలో తన అనుచరులకు- స్త్రీలను తీసుకొచ్చిన వారికి వెండినాణాలు, ఉన్నతవర్గ స్త్రీలను ఎత్తుకొచ్చినవారికి 5 బంగారు నాణాలు ఇస్తానని చెప్పాడు. అలా భోనగిరి కోటదాడిలో సుమారు 2000 మంది స్త్రీలు అపహరింపబడ్డారు.

ఉన్నతవర్గాలు వైభవంగా జరుపుకొనే పెళ్ళిళ్లలో పాపడు మెరుపుదాడులు చేసి స్త్రీలను అపహరించి, వారి బంధువులనుండి అధికమొత్తాలలో ధనాన్ని రాబట్టేవాడు. Kilpak జమిందారు పాపడికి లొంగనందుకు తన వద్ద బంధీగా ఉన్న అతని భార్య నాలుకను కోసి అతనికి కానుకగా పంపించి హెచ్చరించాడు.

ఈ దోపిడీలలో హిందువు ముస్లిమ్ అనే వ్యత్యాసం ఉండేది కాదు. అందువల్ల ముస్లిమ్ శ్రీమంతులు, తెలుగు జమిందార్లు పాపడి అరాచకాలకు బలయ్యి, ఇతని పీడను ఒదిలించమని గోల్కొండకు మొరపెట్టుకొనేవారు.

6. చక్రవర్తి తో సన్మానం

ఔరంగజేబు చనిపోయాకా ఏర్పడిన వారసత్వపోరులో బహదూర్ షా సింహాసనాన్ని చేజిక్కించుకొన్నాడు. ఇది నచ్చని బహదూర్ షా సోదరుడు Kam Baksh హైదరాబాదుకు స్వతంత్ర రాజుగా ప్రకటించుకొన్నాడు. ఇదివిన్న బహదూర్ షా దక్కను వచ్చి అతనితో పోరాడి అంతమొందించి దక్కను సామ్రాజ్యానికి తన చక్రవర్తి స్థానాన్ని స్థిరపరచుకొన్నాడు. ఆ సందర్భంలో బహదూర్ షా హైదరాబాదు ప్రముఖులతో దర్బారు ఏర్పాటు చేసినప్పుడు పాపడు 14 లక్షల రూపాయిలు కానుకగా ఇచ్చి బహుదూర్ షా చేత సన్మానం పొందాడు.

పాపడి చేతిలో బలయినవారు ఈ చర్యతో తీవ్ర అసంతృప్తిచెందారు. ముఖ్యంగా పాపడు వద్ద బంధీలుగా స్త్రీలు, పిల్లల బంధువర్గాలు. వీరంతా కలిసి బహదూర్ షాకు తమ అసంతృప్తిని తెలియచేసారు. వారి విజ్ఞాపనల మేరకు హైదరాబాద్ నూతన గవర్నరైన Yusuf Khan కు పాపడిని అంతమొందించమని ఆదేశాలిచ్చాడు చక్రవర్తి. Yusuf Khan తిరిగి ఆ పనిని Dilawar Khan అనే సేనాపతికి అప్పగించాడు.

1709 లో పాపడు ఒక జమిందారుపై దాడుచేయటానికి వెళ్ళినపుడు షాపుర్ కోటలో పాపడిచే బంధింపబడిన వారు తిరుగుబాటు చేసి చెరనుంచి విడిపించుకొన్నారు. వీరందరికీ నాయకత్వం వహించింది పాపడి బావమరిది కావటం విశేషం. పాపడి భార్య తన భర్తలేనప్పుడు బంధీగా ఉన్న తమ్ముడికి, రహస్యంగా ఆకురాయిలను భోజనంలో దాచి అందించగా వాటి సహాయంతో అతను తన సంకెళ్లను తెంచుకొని మిగిలిన వారిని కూడా విడిపించాడు. ఇది తెలుసుకొన్న పాపడు షాపూర్ కోటకు వచ్చినపుడు అంతవరకూ బంధీలుగా ఉన్నవారు కోటలోంచి ఫిరంగులు కాలుస్తూ పాపడు అనుచరులపై ఎదురుదాడి చేసారు.

కోపోద్రిక్తుడైన పాపడి ఆదేశాలతో- కోట గుమ్మాలను తగలపెట్టి, గేదెలను చంపి రక్తంతో తడితడిగా ఉన్న వాటి చర్మాలను తొడుక్కొని ఆ మంటలలోంచి కోటలోకి వెళ్లటానికి ప్రయత్నించారు అతని అనుచరులు. ఇదే సమయానికి దిలావర్ ఖాన్ తనసైన్యంతో పాపడిని బంధించటానికి అక్కడికి వచ్చాడు. ఇలా రెండు వైపులనుండి దాడి ఎదురవ్వటంతో పాపడు తరికొండ కోటకు పారిపోయ్యాడు.

7. పాపడి పతనం

దిలావర్ ఖాన్ పాపడిని బంధించటంలో విఫలమవటంతో యూసఫ్ ఖాన్, మార్చ్ 1710 లో ఇరవై వేలమంది సైనికులను తీసుకొని తానే స్వయంగా తరికొండ కోటను చేరి పాపడి తో తలపడ్డాడు. పాపడు సైనికులకు యూసఫ్ ఖాన్ రెట్టింపు కూలి ఇస్తానని ప్రకటించటంతో అలసిపోయిన చాలామంది పాపడిని విడిచి యూసఫ్ ఖాన్ సైన్యంలో చేరిపోయారు. పాపడు కొద్ది నెలలు ప్రతిఘటించి, మందుగుండు అయిపోవటంతో మారువేషం వేసుకొని ఎవరికీ చెప్పకుండా రహస్యమార్గం ద్వారా కోటవిడిచి పారిపోయాడు. అప్పటికి అతని కొడుకులు ఇంకా యూసఫ్ ఖాన్ తో పోరాడుతున్నారు.

పాపడు మారువేషంలో హసన్నబాద్ అనే గ్రామాన్ని చేరుకొని అక్కడ ఒక కల్లు దుకాణంలో కూర్చొని కల్లు కావాలని అడగగా, ఇతన్ని ఆ దుకాణదారుడు గుర్తుపట్టి సైనికులకు అప్పగించటం జరుగుతుంది. వాళ్ళు పాపడిని బంధించి యూసఫ్ ఖాన్ వద్దకు తీసుకువెళ్లారు. దొంగిలించిన సొత్తు ఎక్కడదాచాడో చెప్పమని ఎంత హింసించినా పాపడు ఏమీ చెప్పకపోవటంతో - పాపడి తలనరకి బహదూర్ షా వద్దకు పంపించి దేహాన్ని హైదరాబాద్ గేట్ కు వేలాడదీయించాడు యూసఫ్ ఖాన్.

అలా పాపడు కథ 1710 లో ముగిసింది.
****

III. చారిత్రిక పాపడికి వీరగాథ పాపన్నకు ఎందుకు ఇన్ని వ్యత్యాసాలు?

పాపన్న జీవితం వీరగాథగా మారటానికున్న కారణాలలో ముస్లింలపై తిరుగుబాటు అనే అంశం ప్రధానంగా వినిపిస్తుంది. కానీ పాపన్న అనుచరులలో హుస్సైన్, తుర్కా హిమాన్, కొత్వాల్ మీర్ సాహిబ్ లాంటి ముస్లిమ్ వ్యక్తులు ఉన్నారు. అంతే కాక పాపడు దోపిడీ చేసిన వారిలో ముస్లిమ్ ఫౌజ్ దార్ లతో పాటు అనేక మంది హిందు జమిందార్లు కూడా ఉన్నారు. పాపడి ప్రధాన అనుచరులైన సర్వా హిందువు, పుర్దిల్ ఖాన్ ముస్లిము. కనుక పాపడి తిరుగుబాటు ప్రత్యేకించి ముస్లిముల ఒక్కరిపైనే కాదని అనుకోవచ్చు.

పాపడు అప్పటి అగ్రవర్ణ ఆధిపత్య వ్యవస్థపై తిరుగుబాటు చేసాడు అనేది మరొక కారణం. దీనికి ఆధారంగా- పాపడి అనుచరులలో చాకలి సర్వన్న, మంగలి మన్నన్న, కుమ్మరి గోవిందు, మేదరి యెంకన్న, యెరికల చిట్టేలు, యానాది పశేలు వంటి బలహీన వర్గాల వ్యక్తులు ఉండటం కనిపిస్తుంది.

అప్పట్లో వ్యవసాయ పనులులేని రోజుల్లో సగం ప్రజలు ఖాళీగా ఉండేవారు. వీరందరూ పాపడిని అనుసరించి ఉండొచ్చు అనే వాదనను త్రోసిపుచ్చలేం. అంతే కాక ఆనాటి సమాజంలో దొంగతనాన్ని వృత్తిగా కలిగిన కులాలు కూడా ఉండేవి. వీరు పాపడికి నాయకత్వంలో నడిచారు. వీరికి పాపడు వ్యవసాయ భూమిని ఇచ్చాడు. అందువల్ల వీరు పాపడిని ఒక వీరుడిగా జ్ఞాపకం పెట్టుకొని ఉంటారు.

ఇక మరొకవాదన- పాపన్న సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొన్నాడు అనేది. J.A. Boyle, 1874 లో సేకరించిన వీరగాథలో గోల్కొండను, బందరును కొల్లకొడతాను, బంగారు కడియాలు చేయిస్తాను అన్నపదాలు ఉన్నాయి. కొల్లకొడతాను అంటే దొంగతనం చేస్తాను అని అర్ధం. బంగారు కడియాలు చేయిస్తాను అంటే అందులో వ్యక్తిగత లాభాపేక్షే తప్ప సామ్రాజ్య వాదాన్ని అంతమొందిద్దామనే ఉద్దేసాలున్నాయనటం పాపన్నకు లేని ఔన్నత్యాన్ని ఆపాదించటంగా అనుకోవచ్చు.
****

IV. పాపడిని సామాజిక బందిపోటు అనుకోవచ్చా?

Eric Hobsbawn అనే చరిత్రకారుడు శ్రామిక వర్గాల తిరుగుబాట్లను విశ్లేషిస్తూ “Social Bandit” అనే ఒక పదాన్ని వాడాడు. అంటే రాబిన్ హుడ్ లా ధనికులను కొట్టి పేదలకు పెట్టే బాపతు అని.

ఈ సామాజిక బందిపోట్లకు సిద్ధాంత నేపథ్యం ఉండదు. రాజకీయ, ఆర్ధిక అస్థిర పరిస్థితులు తలెత్తినప్పుడు వీరు తెరపైకి వస్తారు. వీరికి మార్గం ముఖ్యం కాదు గమ్యం ప్రధానం. ఇలాంటి వ్యక్తుల చర్యలు హింసాపూరితంగా, అమానవీయ ధోరణిలో ఉంటాయి.

అలాంటి పనులను ఈనాటి రాజ్యాంగం ప్రకారం విశ్లేషించవలసి వస్తే క్రిమినల్ చర్యలుగా పరిగణించాలి. ఇలాంటి వారిని రాజ్యం దోపిడి దారులుగా జమకడితే, సామాన్యజనం వీరులుగా కీర్తిస్తారు. వీరగాథలు అల్లుకొంటారు. పాపడిని ఈ కోణంలోంచి చూస్తే Social Bandit గా భావించవచ్చు.

పాపడు ధనికులను కొట్టటం అనే మాట సత్యమైనా ఆ సంపదలను నిర్మాణాత్మక పనులకు ఉపయోగించినట్లు కనిపించదు. (గుళ్ళూ, పంట చెరువులు తవ్వించాడని చెపుతున్నా అవి ఫ్యూడల్ వ్యవస్థలో పరోక్ష దోపిడీ మార్గలే).
***

ఉపసంహారం

పాపడి జీవితాన్ని గమనిస్తే సొంత భార్య, బావమరిది, చివరలో ఇతని అనుచరులు, సాటి కులస్తుడైన కల్లువ్యాపారి ఇతడిని విశ్వసించలేదని అర్ధమౌతుంది. ఇది బహుశా అంతవరకూ పాపడు చేస్తున్నది పులిస్వారీ అని అతని సన్నిహితులకు అర్ధమై ఉంటుంది. అందుకనే అందరూ చివరలో తనని విడిచిపెట్టేసారు.

వాతావరణం, విద్యావిధానం, మూఢనమ్మకాలు, కట్టుకథల పట్ల మోజు లాంటి కారణాలవల్ల హిందువులలో చరిత్రపట్ల ఉదాసీనత, నిర్లక్ష్యము ఏర్పడ్డాయని అన్న మెకంజీ అభిప్రాయం నేటికీ ప్రాసంగితను కోల్పోలేదు. అందుకనే దేవాలయాల స్థలపురాణాలకు ఉన్న ప్రాధాన్యత చారిత్రిక అంశాలకు ఉండదు.

బహదూర్ షాతో సన్మానం అందుకున్న తరువాత పాపన్న దొంగతనాలకు స్వస్థి చెప్పి తాను ఆక్రమించుకొన్న జమిందారీలను అనుభవించుకొంటూ ఉండినట్లయితె బహుసా రెడ్డి, వెలమ, నాయక రాజుల్లా ఒక రాజవంశాన్ని నిర్మించిన మూలపురుషుడిగా చరిత్రలో నిలిచిపోయేవాడేమో. అప్పుడు
సర్వాయి పాపన్న వీరగాథ ఉండేది కాదేమో- అది వేరే విషయం.

బొల్లోజు బాబా

References
1. J. F. Richards and V. Narayana Rao, “Banditry in Mughal India: Historical and Folk Perceptions,”
2. A Social History of the Deccan, 1300–1761 edited By Richard M. Eaton, Chapter 7 Papadu (F L. 1695–1710): Social Banditry In Mughal Telangana
3. The Mughal State 1526-1750 Edited By Muzaffar Alam Sanjay Subrahmanyam
4. The Indian Antiquary, A Journal Of Oriental Research. Telugu Ballad Poetry By J. A. Boyle, Esq., Mos.
5. Khafi Khan, Muntakhab al-lubab (Calcutta, 1874).
6. సర్వాయి పాపన్న పై వికిపీడియా వ్యాసం
7. సర్దార్ సర్వాయి పాపన్న, దళిత బహుజన వీరుడు, కొంపెల్లి వెంకట్ గౌడ్.

Arthur Purvis

(కాకినాడ పి.ఆర్. కళాశాల హెరిటేజ్ భవనం వెనుకవైపున ఒక పాలరాతి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని అనేక సార్లు చూసి ఉంటాను. అసలు ఎవరితను అని ఆర్చైవ్స్ లో వెతికితే దొరికిన సమాచారం ఇది)

1852 లో కాకినాడ పురప్రముఖులు కొంతమంది, ఆనాటి కలక్టరు T. Prendergast, రెవిన్యూ అధికారి తులసింగ చెట్టియార్ ల ప్రోత్సాహంతో Anglo Vernacular School ను స్థాపించారు. ఈ స్కూలుకు ఏ రకమైన ప్రభుత్వ సహాయము లేనందువల్ల క్రమేపీ ఆదరణ కరువై 1862 నాటికి మూతపడే స్థితికి వచ్చింది. (Madras District Gazetteers Godavari By F. R. Hemingway)

విద్యావంతుడు, సేవాతత్పరుడు అయిన అప్పటి గోదావరి జిల్లా కలక్టరు Arthur Purvis చొరవతీసుకొని ఆ స్కూలును తిరిగి ప్రారంభింపచేసాడు. అలా ఆ స్కూలు 28 అక్టోబరు, 1863న మరలా తెరుచుకొంది. నిర్వహణ నిమిత్తం ఆ స్కూలుకు ప్రభుత్వం తరపున నెలకు 70 రూపాయిలు చొప్పున వచ్చేలా Purvis మంజూరు చేసాడు. పిఠాపురం రాజా Venkata Mahapati Gangadhara Rama Row గారు ఇదే పాఠశాలలో చదువుకొన్నారు కనుక ఆయనకూడా నెలకు 100 రూపాయలు చందాగా అందించేవారు. (ఆ తరువాత పిఠాపురం రాజా వారు ఈ స్కూలుకు భారీ నిధులు, స్థలాలు ఇచ్చి అభివృద్ధి చేసారు. అదే నేటి కాకినాడ పిఠాపురం రాజాస్ ప్రభుత్వ కళాశాల)

మూతపడిన స్కూలును కొనసాగించి దానిని తిరిగి బ్రతికించిన Arthur Purvis గౌరవార్ధం ఆయన బస్ట్ సైజ్ పాలరాతి విగ్రహాన్ని పి.ఆర్. కళాశాల నూతనభవనం (నేటి హెరిటేజ్ బిల్డింగ్) వద్ద ప్రతిష్టించారు. ఇది ఈరోజుకూ ఆ కాలేజ్ ప్రాంగణంలో ఉన్నది.

ఈ విగ్రహం ఇంగ్లాండులో తయారయ్యింది. దీనిని చెక్కినది ఆనాటి ప్రసిద్ద శిల్పకారుడు Butler Timothy. Royal Academy of Arts రికార్డులలో ఈ విగ్రహం 1870 లో తయారుచేయబడినట్లు తెలుస్తున్నది. విగ్రహం పై టి. బట్లర్, లండన్ 1869 అని ఉంది.

Arthur Purvis తండ్రి Lieut. Col. Purvis ఇంగ్లాండులో ధనికవర్గానికి చెందిన వ్యక్తి. Arthur ఇతని పెద్దకొడుకు.

ఈస్ట్ ఇండియా కంపనీకి లండన్ లో East India College (1806-1858) అనే పేరుతో ఒక కళాశాల ఉండేది. భారతదేశంలో సివిల్ సర్వెంట్స్ గా పనిచేయాలనుకొనే ఔత్సాహిక విద్యార్ధులకు ఇక్కడ శిక్షణ ఇచ్చేవారు. ఈ కాలేజ్ లో Arthur Purvis 1831 విద్యాసంవత్సరంలో మద్రాసు ప్రొవిన్స్ నందు పనిచేయటానికి కావల్సిన శిక్షణ తీసుకొన్నాడు. వారు పెట్టిన పరీక్షలో ఇతను అత్యుత్తమ రాంకుతో ఉత్తీర్ణుడయ్యాడు. 1831 లో Arthur Purvis కు నెల్లూరు జిల్లా కలక్టరు, మాజిస్ట్రేట్ కు ప్రధాన సహాయకునిగా ఉద్యోగం వచ్చింది. ఇతను చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ సమకాలీనుడు. (రి. List Of The Honourable United East-India Company’s Covenanted Civil Servants P.No 301)

Arthur Purvis కు Mary jane తో 7 ఆగస్టు 1847 న కలకత్తాలో వివాహమైంది (Gentle Man’s Magazine 1847)

1849 సెప్టెంబరు 25 న నెల్లూరు లో ఉద్యోగం చేస్తుండగా Arthur Purvis కు కొడుకు పుట్టాడు. (The gentleman's magazine 1849)
Arthur Purvis గోదావరి జిల్లా కలక్టరుగా 1854 నుండి 1863 వరకూ పనిచేసారు.

Arthur Purvis జనన మరణాలు తెలియరావటం లేదు. ఈస్ట్ ఇండియా కాలేజ్ లో ప్రవేశార్హత 16 సంవత్సరాలు. ఇతను అక్కడ 1831 లో చదివాడు కనుక బహుసా 1810-1815 మధ్య పుట్టి ఉండాలి. సాధారణంగా చనిపోయినవారి జ్ఞాపకార్ధం విగ్రహాలను నిలుపుతారు. ఇతని విగ్రహం 1869 లో తయారుచేయించారు. ఆ లెక్కన ఈయన అదే కాలంలో చనిపోయి ఉండవచ్చు.

ఈ విగ్రహాన్ని కళాశాల గ్రౌండ్ ఔత్సాహిక వాకర్స్ కొంతమంది ఇటీవల రినొవేట్ చేసారు.

తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పి.ఆర్. కళాశాల అత్యున్నత ప్రమాణాలతో దాదాపు 150 సంవత్సరాలుగా విద్యాసుగంధాలను వెదజల్లుతున్నది. ఈ కళాశాల రూపుదిద్దుకోవటంలో ప్రముఖపాత్రకలిగిన Arthur Purvis చిరస్మరణీయుడు
(బర్డ్ డ్రాపింగ్స్ లోని యాసిడ్ కంటెంట్ వల్ల పాలరాయి రంగు మారి ఉండొచ్చు)

బొల్లోజు బాబా