థేరీగాథలు BCE ఆరోశతాబ్దానికి చెందిన తొలితరం బౌద్ధ బిక్కుణిల అనుభవాలు. మానవ దుఃఖం, వేదన, ముక్తికొరకు అన్వేషణ, తధాగతుని బోధనలో దొరికిన సాంత్వన ఈ గాథల ఇతివృత్తం.
వీటిని అనువదించి 2022 లో పుస్తకంగా తీసుకొచ్చాను. ఛాయావారు ప్రచురించారు.
ఈరోజు వాటిని మరలా చదువుకొంటే, మంచి అనుభూతిని ఇచ్చాయి ప్రతి గాథ వెనుక చారిత్రిక అంశాలను పుస్తకం చివరలో నోట్సు రూపంలో ఇచ్చాను.
****
.
భద్ధ కుండలకేశ
.
శిరోముండనం గావించుకొని
దుమ్ముపట్టిన దుస్తులు ధరించి
తప్పులు లేనిచోట తప్పులు ఉన్నాయని
తప్పులు ఉన్నచోట వాటికి అంధురాలినై
సంచరించేదానిని
యాభై ఐదేండ్లపాటు
అంగ, మగధ, వజ్జి, కాశి, కోశల రాజ్యాల
నలుమూలలా పర్యటించాను
ఆ రాజ్య ప్రజలు ఇచ్చిన భిక్షను తిన్నాను
ఒకనాడు
నిర్మలమైన బుద్ధభగవానుడు శిష్యులతో కలసి వుండగా
గృధ్రకూటపర్వతం వద్ద చూసాను
ఎదురుగా మోకాళ్లపై కూర్చొని
చేతులు జోడించి భక్తితో నమస్కరించాను
“రా భద్దా” అన్నారాయన
ఆ క్షణమే నా ధమ్మ దీక్షా స్వీకారం జరిగింది
తధాగతుడు ఇచ్చిన వస్త్రాన్ని ధరించిన భద్ధ
అన్ని బంధనాలనుంచి విముక్తమయింది.
.
నోట్స్
.
రాజగృహలో ఒక వడ్డీవ్యాపారస్తుని కుమార్తె బద్ద. ఒకరోజు పురవీధిలో మరణదండన విధించటానికి తీసుకొని వెళుతున్న ఒక దొంగను చూసి మనసుపారేసుకొని, అతనిని తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోను అని తల్లిదండ్రులకు చెప్పటంతో- భద్ధ తండ్రి తలారులకు భారీగా లంచాలిచ్చి ఆ దొంగను రహస్యంగా విడిపించి ఇంటిలోకి తీసుకొని వచ్చి, స్నానం చెయించి, అలంకరించి, కూతురు ముందు నిలబెట్టాడు. ఆ దొంగ పేరు సత్తుక. ఇంతచేసినప్పటికీ ఇతనిలో ఏ మార్పు రాక, భద్ధ ఒంటిపై ఉన్న నగలను ఎలా దొంగిలించాలా అని ఆలోచించసాగాడు.
మరణదండన నుండి తప్పించుకొన్నందుకు కొండదేవతకు మొక్కుకున్నానని, అది తీర్చుకొనటానికి వెళ్లాలని, బద్దను నమ్మించి ఆమెను ఒక పెద్దకొండపైకి తీసుకొనివెళ్ళాడు సత్తుక. అక్కడ ఆమె ఒంటిపైఉన్న నగలను దొంగిలించి ఆ కొండపైనుండి కిందకు తోసేసి చంపెయ్యాలని అతని పథకం. అతని పన్నాగాన్ని గ్రహించిన భద్ధ, మిమ్ములను చివరిసారిగా ఒకసారి కౌగిలించుకోవాలనిఉంది నా ఆఖరుకోర్కె తీర్చమని అని అడిగి, సత్తుకను కౌగిలించుకొని క్షణకాలంలో అతనిని ఆ కొండపైనుంచి తోసి చంపివేసింది. ఇంత జరిగిన తరువాత ఇంటికి వెళ్ళటానికి భద్ధకు మొఖం చెల్లక, శ్వేతాంబర జైనమతంలో చేరి సన్యాసిగా జీవనం ప్రారంభించింది. అప్పట్లో జైనమతం తీసుకోవాలంటే తలపై జుత్తును చేతితో పెకలించుకోవాలి. ఆ విధంగా చేయటంవలన కేశాలు చిక్కులు పడటంతో అప్పటినుండి భద్ధకు భద్ధ కుండలకేశ (Good one with curly hair) అనే పేరు వచ్చింది. ఈమె జైనబోధనలను మొక్కవోని దీక్షతో సంపూర్ణంగా అధ్యయనం చేసి దేశసంచారానికి బయలుదేరింది.
ఏదైనా ఊరు వెళితే అక్కడ ఒక ఖాళీ స్థలంలో ఒక నేరేడు కొమ్మను పాతి తనతో ఆధ్యాత్మికంగా వాదించేవారికొరకు ఎదురుచూసేది. ఆ ఊరిలో ఎవరైనా ఈమెతో వాదించాలనుకొంటే ఆ నేరేడు కొమ్మను తొలగించి, ఈమెతో వేదాంత చర్చ చేసేవారు. అలా ఈమె యాభై ఏండ్లపాటు ప్రాచీన ఉత్తరభారతదేశంలోని అనేక పట్టణాలు సంచరించి ఎందరినో తన వాదనాపటిమతో ఓడించి దిగ్విజయయాత్ర జరుపుతూ ఒకనాడు శ్రావస్తి వచ్చింది. అక్కడ బుద్ధుని శిష్యుడైన సారిపుత్త తో వాదనకు దిగింది. వీరిరువుతూ హోరాహోరిగా వేదాంత చర్చ చేసారు. సారిపుత్త జ్ఞానసంపత్తిని గ్రహించిన భద్ధకుండలకేశ అతనిని గురువుగా ఉండమని కోరింది. సారిపుత్త బుద్ధునివద్దకు వెళ్ళమని చెప్పటంతో, భద్ధకుండలకేశ గృధ్రకూటపర్వతంపై ఉన్న బుద్ధభగవానుని చేరి నమస్కరించగానే, ఆయన “రా బద్ధా” అన్నాడట. ఆ మాటే భద్ధ కు బుద్ధుడు నేరుగా ఇచ్చిన దీక్షగా పరిగణిస్తారు.
బొల్లోజు బాబా
No comments:
Post a Comment