ఈ వ్యాసాన్ని కవిసంధ్య స్వర్ణోత్సవసంచికలో ప్రచురించిన గురువుగారు, శిఖామణి కి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
బొల్లోజు బాబా
సమకాలీన తెలుగు లాక్షణికుడు - శ్రీ ఇస్మాయిల్
చాన్నాళ్ళ క్రితం ప్రముఖ విమర్శకులు శ్రీ సీతారాం "కావ్యసౌందర్యశాస్త్రం లేదా భారతీయ లాక్షణిక సిద్ధాంతాలు వినా, మనవీ అని చెప్పుకోదగిన సాహిత్య సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా?" అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీనికి ప్రముఖ విమర్శకులు శ్రీ లక్ష్మి నరసయ్య "దళిత, బహుజన, ముస్లిం వాద సాహిత్య దృక్పథాలు వాటికి సంబంధించిన ఈస్థటిక్స్ లాంటివి దేశీయ సాహిత్య సిద్ధాంతాలు" అన్నారు.
షేక్ పీర్ల మొహమ్మద్" ఏ సిద్దాంతానికైనా యూనివర్సల్ అప్పీల్ ఉండాలి కదా" అనే కోణాన్ని గుర్తుచేసారు.
సోషల్ మీడియాలో ఈ అంశంపై జరిగిన చర్చ చాలా ఆలోచనల్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు ప్రముఖ కవి శ్రీ ఇస్మాయిల్ సమకాలీన తెలుగు లాక్షణికుడిగా కనిపించారు.
***
1. Literary theory అంటే ఏమిటి?
Literary theory సాహిత్యంలో ఉండే "సాహిత్యసంబంధి" (Literary) ఏమిటి? అని ప్రశ్నించి దానికి సమాధానాలు రాబడుతుంది. అంటె రసము, ఔచిత్యం, ధ్వని, Tension, Texture, Ambiguity లాంటి ఏ ప్రక్రియ వల్ల ఒక కవిత ఎలా గొప్పకవిత అయ్యిందో/అవ్వగలదో సిద్ధాంతీకరిస్తుంది. లిటరరీ సిద్ధాంతం అంటే సాహిత్యాన్ని అర్ధం చేసుకోవటానికి, విశ్లేషించటానికి, సృజించటానికి ఉపయోగపడే ఆలోచనలు, పద్దతులు
Literary Criticism సాహిత్యాన్ని విశ్లేషిస్తుంది, తూకంవేస్తుంది మంచి చెడ్డలు విడమరచి చెపుతుంది. ఈ విమర్శలో ఒక కవిత ఎందువల్ల మంచికవితో లేక అకవితో పై సిద్ధాంతాల ఆధారంగా నిరూపిస్తుంది. ఎక్కడ రసభంగం జరిగింది, ఎక్కడ ఔచిత్యదోషం ఉంది, ఉద్దేశించిన ధ్వనికి ఎలా అన్వయం కుదరలేదు అనే విషయాలను విపులీకరిస్తుంది.
Literary theory, Literary Criticism లు పరస్పరాధారితాలు. ముందు theory పుడుతుంది, దానికనుగుణంగా విమర్శ జరుగుతుంది. ఉదాహరణకు సాహిత్యమనేది ఒక సాంఘిక కార్యక్రమమని, కవి సామాజిక మార్పుకు దోహదపడాలనే మార్క్సిజసిద్ధాంతం మొదటగా పుట్టింది. ఆ సిద్దాంతాన్ని ఉపయోగించుకొని ఒక కవితలో "సామాజిక ప్రయోజనం" ఏమేరకు ఉంది అంటూ విమర్శ సాగుతుంది. అలాగన్నమాట.
నిజానికి ఈ సిద్ధాంతకర్తకు, విమర్శకుడి కన్నా ముందు సృజనకారుడు అనే వాడు ఒకడుంటాడు. వాడికీ గొడవలేమీ పట్టవు. వాడిమానాన వాడు రాసుకొంటూ పోతాడు. వాడు రాసినవాటిలోంచే ఈ సిద్దాంతాలు, విమర్శలు పుట్టుకొస్తాయి.
***
2. దేశీయ లాక్షణిక సిద్ధాంతాలు
సాహిత్యం ఎలా ఉండాలి ఏవేం అంశాల వలన ఒక రచన సాహిత్యవిలువలను పొందుతుంది అనే విషయాలను లోతుగా శోధించి, కొన్ని ప్రతిపాదనలను చేసారు మన పూర్వీకులు. ప్రాచీన భారతీయ సిద్ధాంతాలలో ప్రధానంగా అలాంటివి ఆరింటిని గుర్తించవచ్చు
• భరతుని రస సిద్ధాంతం: రసాత్మకమైనదే కావ్యమని ప్రతిపాదిస్తుంది.
• భామహుని అలంకార సిద్ధాంతం: కావ్యానికి అలంకారాలు ప్రధానం అంటుంది
• వామనుడి రీతి సిద్ధాంతం: మంచి కావ్యానికి మంచి గుణాలుండాలంటుంది.
• ఆనందవర్ధనుని ధ్వని సిద్ధాంతం: వాచ్యంగా చెప్పిన విషయం కన్నా చెప్పకుండా వదిలేసిన విషయం ప్రధానమంటుంది.
• కుంతకుని వక్రోక్తి సిద్ధాంతం: వక్రోక్తి అంటే అలంకారములతో నర్మగర్భంగా చెప్పటం. ఇది ఆనందవర్ధనుని ధ్వనిని పోలి ఉంటుంది.
• క్షేమేంద్రుని ఔచిత్య సిద్ధాంతం: ఏది దేనికి తగి ఉంటుందో దాన్ని ఔచిత్యం అంటారు. కావ్యానికి ఔచిత్యం ఉండాలంటుందీ సిద్దాంతం.
ఇరవయ్యోశతాబ్దంలో పాశ్చాత్య Literary theory లలో అనేక దృక్పథాలు ప్రవేశించి Literary criticism ను నడిపించాయి. దేశీయ లాక్షణిక సిద్ధాంతాలకు పాశ్చాత్య సిద్ధాంతాలకు పొంతన ఉండదు. భారతీయ, పాశ్చాత్య సంస్కృతులు పూర్తిగా భిన్నమైనవి కనుక ఈ రెండిటి మధ్య పోలికలు తేవటం దాదాపు అసాధ్యం.
మొదట్లో అరిస్టాటిల్ లాంటివారు జీవితాన్ని అనుకరించేదే కళ అన్నారు. తరువాత మిల్టన్ కాలంలో చందస్సును అనుసరించి చెప్పటమే సాహిత్యం అన్నారు కాల్పనికతే (romanticism) సాహిత్యమని షెల్లీ, కీట్స్ కవిత్వం చెప్పింది.
3. ఆధునిక సిద్ధాంతాలు
• అభ్యుదయ, సామాజిక ప్రయోజనం కలిగి ఉండటం (మార్క్సిస్ట్ సిద్ధాంతం)
• భిన్నత్వాలను celebrate చేస్తూ చరిత్రను నిరాకరించటం ద్వారా స్వీయ అస్తిత్వాన్ని ప్రకటించుకోవటం (పోస్ట్ మోడర్న్)
• మనో వైజ్ఞానిక అంశాలను పొదువుకోవటం (ఫ్రాయిడియన్)
• స్త్రీవాద (gender and Queer theories)
• సాంస్కృతిక వైవిధ్యాలను ప్రతిబింబించటం (Cultural theory)
• పాఠంలోనే అన్ని అర్ధాలు ఉంటాయి అనే ప్రతిపాదన (Structuralism)
• పాఠం వెలుపల సోషల్ పొలిటికల్, హిస్టారికల్ కారణాల వల్ల చాలా కనిపించని అర్ధాలు ఉంటాయి అనే ప్రతిపాదన (Post structuralism)
• రచనలో బహుళార్ధాలను వెతకటం (Deconstruction)
• వలసపాలనానంతర ప్రభావం (Post Colonial)-- లాంటి రకరకాల లిటరరీ సిద్ధాంతాలు సాహిత్యంలో "సాహిత్యసంబంధి" ఏదో తేల్చి చెప్పటం కొరకు ప్రతిపాదించబడ్డాయి. ఒక్కోక్కటీ అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్న రీతిలో సాగుతాయి.
పైన చెప్పిన ఆధునిక లిటరరీ థీరీలను గమనిస్తే, భారతదేశానికి సంబంధించి ఎప్పుడో వందల సంవత్సరాలక్రితం ఏర్పరచిన లాక్షణిక సిద్ధాంతాలే తప్ప ఆధునిక కాలంలో మనం సృష్టించుకొన్న ఆధునిక దేశీయ సాహిత్య సిద్ధాంతాలు ఏమున్నాయి అని ప్రశ్నించుకోవటం సందర్భోచితమే కాదు అవసరం కూడా. ఆమేరకు లక్ష్మి నరసయ్య గారు చెప్పిన దళిత,బహుజన ఈస్థటిక్స్ కొంతమేరకు ఆ లోటును తీర్చిందని భావించవచ్చు.
మన తరంలో తెలుగులో అంత స్పష్టంగా కవిత్వానికి చక్కని నిర్వచనాన్ని, అసలు ఏది కవిత్వం అన్నదానికి సమాధానాన్ని, కవిత్వపు పరిధులు, బలహీనతలను విస్పష్టంగా చెప్పిన ఒక సిద్ధాంతకర్తగా శ్రీ ఇస్మాయిల్ కనిపిస్తారు. ఈయన వెలిబుచ్చిన అభిప్రాయాలపై పాశ్చాత్యప్రభావం లేదని చెప్పలేం అయినప్పటికీ ఇస్మాయిల్ గారి అభిప్రాయాలు స్వతంత్రంగా, స్థానీయంగా ఉండటం గమనించవచ్చు.
4. సమకాలీన లాక్షణికుడు - శ్రీ ఇస్మాయిల్
తెలుగుకు సంబంధించినంత వరకూ కవిత్వాన్ని నిర్వచించి, కొన్ని లక్షణాలను ప్రతిపాదించిన ఆధునిక కవులలో ఇస్మాయిల్ కనిపిస్తారు. నేనొక లాక్షణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాను అని ఆయన ఎక్కడా చెప్పుకోకపోయినా ఆయన వదిలివెళ్ళిన ప్రతిపాదనలు, చేసిన చర్చలు, వాదప్రతివాదనలను ఈ రోజు మనముందే ఉన్నాయి. వాటి ద్వారా, ఇస్మాయిల్ తనజీవితకాలమంతా తపస్సుచేసి ఆధునిక కవిత్వంలోని "సాహిత్యసంబంధి" లక్షణాలను నిర్వచించారని, కవిత్వాన్ని విశ్లేషించటానికి కావాల్సిన పనిముట్లను గుర్తించారని తెలుసుకోవచ్చు.
ఒక లాక్షణికుడిగా ఇస్మాయిల్ చేసిన ప్రతిపాదనలు
1. కవిత్వంలో నిశ్శబ్దం:
మన చుట్టూ ఉన్న అనుభవిక ప్రపంచాన్ని ఆవిష్కరించటమే కవిత్వ లక్ష్యం. అనుభవాన్ని అనుభవంగానే ప్రత్యక్షం గా అందించటం కవిత్వం పని. అనుభూతి సామాన్య భాషకు అందదు. ఆ అనిర్వచనీయమైన ఆ నిశ్శబ్దాన్ని వాక్యాలలోకి ప్రవేశపెట్టటమే కవిత్వ లక్షణం. కవిత్వానికి శబ్దమెంత ముఖ్యమో నిశ్శబ్దం కూడా అంతే. (ఇది కొంతమేరకు ధ్వని సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. శబ్దం అంటే ఒక కవితలో పైకి చెపుతున్న విషయంగాను, నిశ్శబ్దం అంటే అన్యాపదేశంగా చెపుతున్న లేదా చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంచిన విషయంగాను అర్ధం చేసుకోవాలి)
2. కవిత్వం హృదయ సంబంధి:
కవిత్వం హృదయ సంబంధి. ఆలోచనా వ్యవస్థ బుద్ధికి సంబంధించినది. కవిత్వాన్ని బుద్ధి (Reason) శాసించలేదు. దాని సామ్రాజ్యమే వేరు. కవిత్వానికి "కరుణ ముఖ్యం".
అసలు సృజనాత్మకతకి మూలమేమిటి? కవి యొక్క దర్శనం (vision). ఇది పూర్తిగా వైయక్తికమైనది. ఏ కవి దర్శనం వానిది. దీన్నించే అతని కవిత్వం ఉద్భవిస్తుంది. కనక, కవి నిబద్ధుడై ఉండవలసింది తన సొంత దర్శనానికే!
కవిత్వం తల్లివేరు కవి అంతర్లోకమూ, బహిర్లోకమూ కలిసేచోట తన్ని ఉంటుంది.
3. కవిత్వం చేసే పని చదువరి మనస్సులో దీపం వెలిగించడం:
కవిత్వం చేసే పనల్లా చదువరి మనస్సులో దీపం వెలిగించడమే. దీని వల్ల అతని అవగాహన పరిధి విస్తరిస్తుంది. తన మనస్సులో వెలిగిన దీపం వెలుతురు తన దారి తను వెతుక్కోవడానికి సహాయపడుతుంది. ఫలానా దారినే నడవమని ఒకరు చెబితే వినడు మనిషి. అది తనకు తోచాలి. తన దారేదో తను నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయానికి కవిత్వం తోడ్పడుతుంది.
“కళ కళ కోసమే” అనే వాదనా, “కళ సాంఘిక రాజకీయ ప్రయోజనాల కోసం” అనే వాదనా – రెండూ అతి వాదాలే! ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఏదీ వుండదు. ఐతే దేని ప్రయోజనం దానికుంటుంది. ఇది గుర్తించడం ముఖ్యం. ప్రపంచాన్ని అవగాహన చేసికోవటమూ, తద్వారా ప్రపంచంతో అనుభౌతిక అనుసంధానం (emotional adjustment) సాధించటమూ – అనాది నుంచీ కళా ప్రయోజనమని ఇస్మాయిల్ గారి ప్రతిపాదన.
4. భాషని శుభ్రపరచటం:
నేను (ఇస్మాయిల్) కవిత్వంలో ఒక ముఖ్యమైన పని చేయడానికి పూనుకున్నాను. భాషని శుభ్రపరచడానికి ప్రయత్నించాను. చాలా మాటలకు మాసిన రంగులు, పాత వాసనలు ఉంటాయి. అలాంటి మాటల్ని కవిత్వంలో వాడలేదు. పాత కావ్యాల్లోనివి, పురాణాల్లోని పదాలు, సమాసాలు, పేర్లూ, కథలూ నా కవిత్వం జోలికి రాకుండా జాగ్రత్తపడ్డాను. నా స్వంతమైన, సరికొత్త అనుభవాల్ని వ్యక్తపరచటానికి, వ్యావహారికప్రపంచంలోని సరికొత్త మాటల్నే కోసుకొచ్చి వాడుకున్నాను.
5. కవిత్వానికి లేబుల్స్ ఉండకూడదు:
కవిత్వానికి లేబిల్స్ అంటించడం నాకిష్టం ఉండదు. ఆలోచన నుంచి తప్పించుకొనే మార్గాలు లేబిల్స్. అర్థం చేసుకొనే కష్టానికి పాల్పడకుండా, తేలిగ్గా కొట్టిపారెయ్యడానికి లేబిల్స్ ఉపయోగిస్తారు. ‘బూర్జువా, శ్రామికవర్గం, రివిజనిస్టు లాంటి లేబిల్స్ అంటించి ఇక ఆ విషయం గురించి ఆలోచించడం మానేయవచ్చు.
***
పైన చెప్పిన అయిదు పాయింట్లు ఆధునిక కవిత్వాన్ని అర్ధం చేసుకోవటానికి, విశ్లేషించటానికి దోహదపడే అంశాలు. పై అయిదు పాయింట్లు స్వేచ్ఛాప్రతిపాదనలు.
కవిత్వంలో నిశ్శబ్దం అనే ప్రతిపాదనకు ధ్వనిసిద్ధాంతం మూలాలు కనిపిస్తున్నా, చెప్పిన విధానం కొత్తది.
కవిత్వం హృదయసంబంధి అన్నటువంటి మాట emotions recollected in tranquility అన్న మాటకు దగ్గరగా అనిపించవచ్చు. కవిత్వం పూర్తిగా వైయక్తికఅనుభవంగా, దర్శనంగా ఆమేరకు తన సృజనను కొనసాగించటం ఇస్మాయిల్ నిబద్దతగా భావించాలి. సాహిత్యప్రయోజనం ఆనందోపదేశాలు అని మనవాళ్లు, పాశ్చాత్యులు అంగీకరించారు. ఆ మాటకు భిన్నంగా కవిత్వం చదువరి మనస్సులో దీపం వెలిగించడం అనటం నవ్యమైన ప్రతిపాదన
అదే విధంగా భాషను శుభ్రపరచటం తెలుగుకు మాత్రమే అన్వయించబడే ఒక విషయంగా భావించవచ్చు. ఈ ప్రతిపాదనకు మూలాలు వాడుకభాషోద్యమంలో ఉంటాయి. అలాంటి క్లిష్టపదాలను వాడటం గురించి, డెడ్ మెటఫర్లను ఒదిలించుకోవటం గురించి ఈ ప్రతిపాదన మాట్లాడుతుంది.
కవిత్వానికి లేబుల్స్ ఉండకూడదు అన్నటువంటి ప్రతిపాదనకూడా పూర్తిగా ఆధునికమైనదే. కామెడిలని, ట్రాజెడీలని సాహిత్యాన్ని లేబ్లింగ్ చేసే పద్దతి పాశ్చాత్యులది. దేశీయమైన ప్రాచీన సాహిత్యంలో ఈ పద్దతిలేదు. ఒక కావ్యం జీవితసామస్త్యాన్ని ప్రతిబింబించేవిధంగా ఉండటంచే లేబ్లింగ్ అవసరపడలేదు భారతీయ లక్షణకారులకు. ఆధునిక కాలంలో కవిత్వాలకు వేసే లేబ్లింగ్ వలన జరిగే నష్టం గురించి మాట్లాడటం కూడా "సాహిత్య సంబంధి" కి లేబుల్స్ తో పనిలేదు అని చెప్పటమే.
.
ఈ అయిదు ప్రతిపాదనలతో కూడిన "Ismayil Literary theory" సాహిత్యంలో ఉండే "సాహిత్యసంబంధి" (Literary) ని నిర్వచిస్తుంది.
బొల్లోజు బాబా
No comments:
Post a Comment