Monday, September 16, 2024

కవిత్వంలో అస్పష్టత - సంక్లిష్టత


‘‘కవిత్వమనేది
ఆత్మలోకంలో ఇద్దరి సంభాషణ
అది
స్వగతమూ కాదు
ఊదరగొట్టే ఉపన్యాసం
అంతకంటే కాదూ’’

కవిత్వం ఒక సామాజిక వ్యవహారం. నా ఆత్మతృప్తికోసం వ్రాసుకొంటాను అనటం ఒక హిపొక్రిసి. ఒక ఊహకు అక్షరరూపమివ్వగానే అది రచన అయిపోదు. దాన్ని మరొకరు చదివినప్పుడే అవుతుంది. కవికి కలిగిన ఊహను అదే స్థాయిలో పాఠకునిలో ప్రవేశపెట్టినపుడు ఏ పేచీ ఉండదు. కవిచేసిన కల్పనను పాఠకులు అందుకోలేకపోతే ఆ కవిత అస్పష్టంగా (Obscurity) ఉందని అర్ధం. అలా కాక పాఠకుడి కొంత శ్రమించి అందులో ఉన్న గూఢార్ధాన్ని విప్పుకొని ఆనందించినపుడు ఆ కవిత సంక్లిష్టంగా (Difficulty/Complexity)) ఉందని భావించాలి.

ఒక కవిత అర్ధం కాకపోవటానికి అనేక కారణాలుంటాయి. ‘‘పాఠకులే నా స్థాయికి ఎదిగి కవితను అర్ధం చేసుకోవాలని’’ కవి కోరుకోవటం సహజమైనా అదంత మర్యాదకరమైన వాదన కాదు. తన కవిత్వంలో తనకు తెలియకుండా దొర్లిన లోపాలను పరిశీలించుకోవటం అవసరం.
స్పష్టాస్పష్టంగా ఉండటం కూడా ఒక కవిత్వ లక్షణమే అయినప్పటికీ హద్దులు దాటకుండా చూడటం కవి బాధ్యత. కొన్ని కవితలు పూర్తిగా అర్ధమవ్వకపోయినా ఏదో అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించటం చేస్తాయి. దానికి కారణం ఆ కవితలలో కవి వాడిన ట్రోప్స్‌ చేసే మాయ అనుకోవచ్చు.

కవి భావం పాఠకునికి అందకపోవటాన్ని అస్పష్టతగా నిర్వచించు కొనవచ్చును.
రమణీయార్ధ ప్రతిపాదనే కవిత్వం అన్నారు ప్రాచీనులు. వివిధ రకాలైన శబ్ద, అర్ధ కావ్యదోషాలను ప్రతిపాదించి కావ్యం రమణీయంగా, స్పష్టమైన అర్ధం కలిగి ఉండేలా శాసించారు. ఆధునిక కవిత్వం ఆ శృంఖలాలను ఛేదించుకొంది. ఇది యుగధర్మం.

ఒకప్పుడు కవిత్వం ఏదో ఒక కథతో ముడిపడి ఉండేది. నేడు కవిత్వం నుండి కథ వేరుపడి స్వతంత్రంగా ప్రయాణిస్తున్నది. కవిత్వం అనేది ఒక సంపూర్ణమైన కథను కాక భావాలను, అనుభూతులను మాత్రమే వ్యక్తీకరించే సాధనంగా మారింది.

ఈ నేపథ్యంలో- జీవితం నుంచి వస్తువును తీసుకొని మూర్త వర్ణణలతో వ్రాసిన కవిత్వం సులభంగా అర్ధమౌతుంది. కుందుర్తి, తిలక్‌, శేషేంద్ర శర్మ, శిఖామణి, శివారెడ్డి, ఇస్మాయిల్‌ లాంటి కవులు ఆ కోవకు చెందిన కవిత్వాన్ని వ్రాసారు. అలాకాక అమూర్త/నైరూప్య భావాలద్వారా కవిత్వం చెప్పినప్పుడు భావప్రసరణలో కొంత సంక్లిష్టత ఏర్పడుతుంది.

ఎందుకంటే ఇక్కడ కవి వాడే ప్రతీకలు, ఉపమానాలు, భాష, చేసే ప్రయోగాల వల్ల అభివ్యక్తి జటిలమౌతుంది. ఆరుద్ర, మో, సిద్దార్థ, ఎమ్మెస్‌ నాయుడు, ఎమ్మెస్‌ సూర్యనారాయణ, అనంతు లాంటి కవుల కవిత్వం ఈ బాపతు.

కవిత్వంలో కనిపించే అస్పష్టతను - భాషాపరమైన అస్పష్టత, వస్తుపరమైన అస్పష్టత, భావపరమైన అస్పష్టతలుగా పరిశోధకులు విభజించారు.

నువ్వు దగ్గరుంటే
కోటినక్షత్రాల వెలుగునౌతాను
నువ్వు దూరమైతే
తోకచుక్కలా నేల రాల్తాను `` అంటూ తన ప్రేయసిని గురించి వర్ణించాడో యువకవి. ఇది చదివిన పాఠకుడు అయోమయానికి గురవుతాడు ఎందుకంటే తోకచుక్కలు నేల రాలవు, ఉల్కలు రాల్తాయి. పాపం ఆ యువకవికి తోకచుక్కలకు, ఉల్కలకు భేధం తెలియక చక్కని అనుభూతిని పాడుచేసాడు. ఇది భాషాగతమైన అస్పష్టత.

కవిత్వంలో అస్పష్టతను గురించి మాట్లాడుకొనేపుడు వేగుంట మోహన ప్రసాద్‌ ప్రస్తావన రాక మానదు. మో అధివాస్తవిక కవిత్వానికి చిరునామ.

రెబెకా
ప్రజాపతి ఉరుముతాడు
ఐవీ శంపాలత క్రీపర్‌ మెరుస్తుంది
ఇసిరిస్‌ వినాయకుడు చెర్లో మునుగుతాడు
కప్ప తల్లి పెళ్ళి అయిపోతుంది
బతకమ్మ పండగ చేసుకుంటాం
నీ ప్రప్రధమ అధమాధమ ప్రేయసి
చాటల్ని పంచుతుంది
కదలని అకతా నదిలో
ఆత్మకు లంగరు వేస్తాం
అక్షరం క్షయమవుతుంది
ఆత్మ శరీరమవుతుంది (రహస్తంత్రి - వేగుంట మోహన ప్రసాద్‌)

ఇది ఒక పూర్తి కవిత. క్రింద ఇచ్చిన ఫుట్‌ నోట్సులో రెబెకా అంటే Daphne Du Maurier నవల అని, ఇసిరిస్‌ అంటే ఇలియట్‌ ‘వేస్ట్‌ లాండ్‌’ లో ఫెర్టిలిటీ గాడ్‌ అని ఇంకా ఇ.ఎం.ఫార్‌ స్టర్‌ తన నవలలో ఉపయోగించిన ‘కనక్ట్‌’ థీరీ ఈ కవితలో వాడాను అని చెప్తాడు కవి. ఇవేవీ కవితను అర్ధం చేసుకోవటానికి ఏమాత్రం సహాయపడవు సరికదా మరింత క్లిష్టతరం చేస్తాయి. కవితా వస్తువు అంతుచిక్కదు. కవితమొత్తం ఒక ఆత్మాశ్రయ అంతర్ముఖత్వ మేధావితన ప్రకటనలా అనిపిస్తుంది. వస్తుపరమైన అస్పష్టతకు రెబెకా ఉదాహరణగా నిలుస్తుంది. అయినప్పటికీ కవితలో మెరిసే విభ్రమ ఆకట్టుకొంటుంది. విభ్రమను కావ్యలక్షణంగా ప్రాచీనులు గుర్తించారు. ‘‘తిక్కగా ఉన్నా కవిత్వం ఉంటే క్షమిస్తాం’’ అని మో గురించి ఇందుకే అన్నాడేమో చేరా.

“To be or not to be” షేక్స్‌పియర్‌ హామ్లెట్‌ స్వగతం లోని ప్రసిద్ధ వాక్యం. ఒక డోలాయమాన మానసిక స్థితిని అద్భుతంగా వ్యక్తీకరిస్తుంది.

ఆలూరి బైరాగి ‘‘హామ్లెట్‌ స్వగతం’’ కవిత ఇలా మొదలౌతుంది
తీగలు త్రెంచిన తుఫాను తగ్గిన తరువాత నేడు
తెలుస్తున్నది విధ్వంసపు టడుగుజాడల రాలుటాకుల పూల మధ్య
వేసిన ప్రశ్న ఒప్పైన ప్రత్యుత్తరం తప్పేనని
ప్రత్యుత్తరం తప్పైతే వేసిన ప్రశ్న తప్పేనని
వానకు తడిసి ఎండకెండి చేరుకొన్నది నావ నేడు తీరాన్ని
పగిలి చెదిరి చిద్రుపలై మునిగి దూరపారాన్ని
యిప్పుడిరక పగమరచిన సెగలారిన చీకటిలో
నీడల నటన బాధించదు ఇంద్రియాలను
ఆవేశం అలసటగా, చైతన్యం వేడిలేని వెలుతురుగా,
కలగా, అలగా, ఒక తీయని జలగా మారిన ఈ వేళలందు
తెలుస్తున్నది చావు బ్రతుకులిక్కడ లెక్కకు రావని
లెక్కకు వచ్చేవిచ్చట ఒక చూపని,
ఒక నవ్వని, ఒక కిరణం, ఒక పూవని,
తెలుస్తున్నది//......... అంటూ ఒక ప్రవాహగతిలో సాగిపోతుంది కవిత.

తీగలు తెంచిన తుఫాను అన్న ఊహే బుద్దికి అందదు. ఏం ప్రశ్నో, ఎవరు వేశారో అర్ధం కాదు. ఒక వేళ టుబి ఆర్‌ నాటుబి ప్రశ్నే అనుకొన్నా ఆ ప్రశ్నెందుకు తప్పో, జవాబెందుకు తప్పవుతుందో అర్ధం కాదు. నీడల నటన, అలసట చెందే ఆవేశం, వేడిలేని వెలుతురు చైతన్యం, లెక్కకు వచ్చే చూపు- లాంటి అమూర్తభావనలు కవితను అర్ధం చేసుకోవటంలో అడ్డుతగుల్తాయి. మొత్తం కవితలో వేదనలాంటి అనుభూతి స్పష్టాస్పష్టంగా తెలుస్తూంటుంది తప్ప విషయం అర్ధం కాదు. దీన్ని భావపరమైన అస్పష్టతగా భావించవచ్చు.

ఎమ్మెస్‌ నాయుడు తెలుగు సాహిత్య రంగంలో పేర్గాంచిన కవి. ‘‘ఒక వెళ్లిపోయాను’’ కవితా సంకలనంతో అలజడి రేపి తనని తాను నిరూపించుకొన్న భావుకుడు. ‘గాలి అద్దం’ ఇతని రెండవ సంపుటి. నాయుడు కవిత్వంలో అద్బుతమైన పదచిత్రాలు ఉంటాయి. ఒక మత్తులోకి లాక్కెళ్తాయి. భావం కనపడీ కనపడకుండా దోబూచులాడి నేను చెప్పేది ఇంతవరకే ఆపై నీ ఊహకు పనిపెట్టుకో అంటూ అదృశ్యమైపోతూంటుంది.

ఆధునిక జీవితంలో ఎన్ని అసంగతాలు, మార్మికతలు, అస్ఫష్టతలూ ఉన్నాయో అన్నీ ఇతని కవిత్వంలో ప్రతిబింబిస్తాయి. చెప్పేది ఎంతైతె ఉంటుందో చెప్పనిదీ రెట్టింపు ఉంటుంది.

(( మరల తల ))
ముఖమొహ్హటే
చలామణి గారడి
చలనం చలచలన
మరో మర
మరల తల
తాటకతై
మోహ మొహాల దడబడ
నయన ఖార్ఖానాలో మకమక
దాటని కన్నీటి పొలిమేర
ఆలోచనల పశువు
చిద్విలాస సంఘర్షణలో
దిగంబరై `` (ఎమ్మెస్‌ నాయుడు).

కవితా శీర్షికే తిరకాసుగా ఉంది. ఇక లోపలకు వెళితే పదాలను ఓ డబ్బాలో వేసి తిప్పి తిప్పి పేపరుపై బోర్లించినట్లు అనిపిస్తుంది.

బి.ఎస్‌.ఎం కుమార్‌ కవిత్వం మరీ అరాచకంలా అనిపిస్తుంది. అస్పష్టతకు మించిన పేరేదైనా ఉంటే సరిగ్గా సరిపోతుంది. ఆయన ఒక కవితలో కొంతభాగం ఇది. (పూర్తికవితలు కూడా ఇలానే ఉన్నాయి)

//తరగని నడకల్ని వేలాడేసిన సమయాన్ని పీలుస్తూ
రాత్రి మెల్లగా కూల్చే సంభాషణ
ఇద్దరమూ ఎదురుగానే కూర్చున్నాం
తన గాజు బిందువుల్ని నా తలమీదుగా ఒదులుతూ
అరచేతులు కలగనే కన్నీళ్లు బయటపడని రోడ్డు పగులుతూ.... (పేజి.నం: 3 నిఘాలు, వృత్తాలూ, వెల్తురారిన కళ్లు)

కుమార్‌ మంచి ప్రతిభాశాలి భాషాపటిమా, నూత్నపదబంధాల్ని సృష్టించగలిగే శక్తి కలిగినవాడు. అయినప్పటికీ పదానికి పదానికి పొంతన కానీ, వాక్యానికి వాక్యానికీ మధ్య ఒక క్రమం కానీ, భావానికి భావానికి మధ్య ఒక అన్వయం కానీ ఉండదు ఇతని కవిత్వంలో. ప్రముఖ విమర్శకుడు శ్రీ తమ్మినేని యదుకుల భూషణ్‌ అన్నట్లు ‘‘కవిత వ్రాయటం పూర్తయింది, ఇక అర్ధం చేసుకోవటమే మిగిలుంది’’ అనుకోవాలి.

నేడు వస్తువినిమయ ధోరణులు, ఉపాధులు విచ్ఛిన్నం కావటం, జీవికకోసం వలసలు తప్పని సరి అవ్వటం, రాజకీయ అవినీతి పెచ్చరిల్లటం లాంటి సాంస్కృతిక సామాజిక మార్పులు అనేకం చోటుచేసుకోవటం వల్ల జీవనం సంక్లిష్టమైపోయింది. ఆధునిక కవులు వైయక్తికమైన తమ విరక్తిని, అసంతృప్తిని, బాధను వ్యక్తీకరించటానికి చేసే ప్రయత్నంలో జీవితంలోని అస్పష్టత కవిత్వంలోకి వచ్చి చేరింది.

కవి మానసిక సంక్షోభం, అతి ప్రతీకాత్మకత, భావాలను నియంత్రించలేక పోవటం, మితిమీరిన నైరూప్య భావచిత్రణ మొదలగునవి కవిత్వంలో అస్పష్టతకు కారణాలుగా చెప్పుకోవచ్చు.
కవిత్వంలో అవిచ్ఛిన్నత, అసంబద్దత పోస్ట్‌మోడర్న్‌ లక్షణాలుగా చెపుతారు. అలాంటి కవిత్వం సామాన్య పాఠకునికి అస్పష్టంగా ఉంటుందని యువకవులు గుర్తించాలి.
****
కొంతమంది పాఠకులు కవిత్వాన్ని అర్ధం చేసుకోవటానికి ఏమాత్రం ప్రయత్నం చేయరు. కవిత్వం అంటే న్యూస్‌ పేపర్‌ కథనంలా సుభోధకంగా ఉండాలని భావిస్తారు. ఇలాంటి వారికి కవితలోని ‘కవిత్వభాష’ అర్ధం కాక ఆ కవిత అస్పష్టంగా ఉందని ఆరోపిస్తారు. నిజానికి అది అస్పష్టత కాదు సంక్లిష్టత. ఒకే కవితలో విభిన్న ఆలోచనలను, కోణాలను, సన్నివేశాలను చొప్పించటం సంక్లిష్టతకు దారి తీస్తుంది. అలాంటి కవిత్వాన్ని పొరలు పొరలుగా విప్పుకొని చదువుకొన్నప్పుడు రససిద్ధి కలుగుతుంది. వాక్యాల మధ్య అర్ధాలను వెతుక్కొని, కలుపుకొని హృదయగతం చేసుకొన్నప్పుడు ఆ కవిత తాలూకు సంపూర్ణ చిత్రం ఏర్పడుతుంది. కవి ఉద్దేశించిన భావాలు అవగతమౌతాయి. ఒక పజిల్‌ ను విప్పుకొన్నప్పుడు కలిగినటువంటి ఆనందం కలుగుతుంది.

ఒక కవి ఎంతో శ్రమించి కవిత్వాన్ని సృజించినపుడు, పాఠకులు కూడా కొంత శ్రమించి ఆ కవితాఫలాన్ని అందుకోవటం వారి బాధ్యత. అలాంటి పాఠకులే కవిత్వానికి సహృదయులు. ఈ ప్రక్రియలో ఒక రచనలోని మంచి చెడ్డలను విశ్లేషించే విమర్శకుల పాత్రకూడా ముఖ్యమైనది.
కవి ఊహలను అందుకోవటానికి ఒక పాఠకుడు ఏమేరకు శ్రమించాలో, చెల్లి సురేంద్రదేవ్‌ వ్రాసిన ‘‘ ఎంగిలి బిర్యాని చేతులు’’ అనే కవితను ఉదాహరణగా తీసుకొని పరిశీలిద్దాం.

ఈ కవిత కావేరి జలవివాదం గురించి. దీనిలో అతని సామాజిక దృక్ఫథం, రాజకీయ అవగాహన, కవిత్వతత్వం స్పష్టంగా వ్యక్తమవటం గమనించవచ్చు. కర్ణాటకలో పుట్టి తమిళనాడులో ప్రవహించే కావేరి జలాల పంపకం ఇరురాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. తమిళనాడు దిగువ రాష్ట్రం కనుక కర్ణాటక విడుదల చేస్తేనే నీరు పొందే పరిస్థితి. దీన్ని నేపథ్యంగా తీసుకొని వ్రాసిన ఒక కవితలో, కావేరి నదికి తమిళులకు మధ్య ఉన్న చారిత్రిక, ఐతిహాసిక అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు సురేంద్ర.

ఎంగిలి బిర్యానీ చేతులు

ఎవడో గిట్టనివాడు
మన గడ్డివాములపైన
పూరిగుడెసెల పైన
లంకచుట్ట విసిరినట్లు
ఈ రెండు రాష్ట్రాల నడుమ
ఏ ఫారిన్‌ సిగరెట్‌ చిచ్చుపెట్టిందో
బెంగుళూరు నడిబడ్డున తగలబడిపోయిన
వాహనాల అస్తికలను పశ్చిమవాహిని లో
ఎవరు కలుపుతారో?

ఎంగిలి బిర్యానీ చేతులు అనే కవితా శీర్షిక- కావేరి వివాదం కారణంగా కర్ణాటకలో తమిళులపై జరుగుతున్న దాడులు అన్నీ రాజకీయ ప్రేరేపితమని, కవి తీసుకొన్న స్టాండ్‌ ని ముందే బలంగా వ్యక్తీకరిస్తుంది.

తమిళనాడులోని శ్రీరంగపట్నం వద్ద ప్రవహించే కావేరినదిని పశ్చిమ వాహిని అంటారు. దీన్ని దక్షిణ గంగగా భావించి పితృదేవతలకు తర్పణం విడువడం అనాదిగా ఆ నాటలో ఒక ఆచారం. సురేంద్ర పై కవితా వాక్యాలలో బెంగళూరులో తగులబడిన అస్తికలు తమిళులవని అన్యాపదేశంగా చెపుతున్నాడు.

చోళరాజు కంఠమండు నీటి కొరకు
అగస్త్య మహర్షిని ప్రార్ధిస్తే
జంభాపతి దేవత
వెనవా తీర్థ విళక్కువా...!
అంటూ స్వాగతించిన కావేరి నది...
గుర్తుచేస్తున్నాడు కవి.
తన రాజ్యంలోని ప్రజలు నీరులేక కరువులతో అల్లాడుతున్నప్పుడు కంఠమాన్‌ అనే తమిళ చోళ రాజు తన సమకాలీనుడైన అగస్త్య మహామునిని వేడుకొన్నాడట. అపుడు అగస్త్యుడు తన కమండలం నుంచి నీరును నేలపై చల్లగా కావేరి నది ఏర్పడిరదని, ఆ నదిని జంభాపతి అనే దేవత ‘‘ఈ రాజ్య ప్రజల దాహాన్ని తీర్చే కాంతిపుంజం’’ గా ఆహ్వానించినట్లు - ఒక తమిళ ఇతిహాసం చెపుతుంది.

పై ఖండికల ద్వారా తమిళుల సంస్కృతి, చరిత్రలలో కావేరినది ఒక భాగంగా ఎప్పటినుంచి ఉన్నదో స్పష్టపరుస్తున్నాడు కవి.

/నాడు తైత్తరీయ ఉపనిషద్‌ లో ‘‘అన్నం బహు కుర్వీత’’
అంటూ కావేరిని కీర్తించారు
నేడు
శ్రీరంగనాథలో ఎండిన కావేరినదిని చూడు
ఇప్పటికైనా సిగ్గేస్తుందా...?

భారతీయులకు నది అంటే దైవం. ఆవిషయాన్ని మన పూర్వీకులు ఏనాడో గుర్తించి తైత్తరీయ ఉపనిషద్‌ లో నదీ వనరుల్ని ప్రస్తావిస్తూ let us share, let us produce and share”అన్నారు. కానీ ఈరోజు పంచుకోవటానికి ఇన్ని యుద్ధాలా అన్న సూటి ప్రశ్న ఆలోచింపచేస్తుంది.
కర్నాటిక్‌ సంగీత విద్వాంసులు

త్యాగరాజు... ముత్తుస్వామి దీక్షితార్‌..
శ్యామశాస్త్రి
ఈ నీళ్ళు త్రాగిన వాళ్ళే//
ఎక్కడో కొడగు కనుమలలో జన్మించి
తమిళుల దాహార్తిని తీరుస్తూ
పుదుచ్చేరి తీరానా పూమ్బుహార్‌ లో
కావేరి బంగాళాఖాతంలో కలిసిపోతుంది
పెట్రోల్‌ బాంబ్స్‌ వేసిన ఎంగిలి బిర్యానీ చేతులకు
కనీసం ఇదైనా తెలిసిందా!
‘బిలగుండ్లు’ భద్రంగా ఉండాలి. /

తమిళనాట స్థిరపడిన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రిలను కర్ణాటక సంగీతానికి కావేరినది అందించిన కానుకలు. వీరు కావేరిఒడ్డున నివసిస్తూ, అనేక కీర్తనలలో కావేరిని స్తుతించారు.

కావేరి నది కర్ణాటకలో పుట్టి, తమిళనాడులో ప్రవహించి, పుదుచ్చేరి వద్ద సముద్రంలో కలుస్తోన్నదనే సంగతైనా కనీసం ఈ అలజడులు చేస్తున్న వారికి తెలుసా- ఇది మూడు రాష్ట్రాల ఉమ్మడి సొత్తని ప్రశ్నిస్తున్నాడు కవి.

తమిళుల పక్షాన నిలబడి ఇంత గొప్పగా చెప్పిన కవి చివరలో కర్ణాటకకు ఒక హెచ్చరిక కూడా చేస్తాడు ‘‘బిలగుండ్లు భద్రం గా ఉండాలి’’ అని.

బిలగుండ్లు అనేది కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతం. అక్కడ తమిళనాడుకు ఎంతనీరు వస్తుందో నీటిపారుదల నిపుణులు బొట్టు బొట్టు లెక్కిస్తారు. బిలగుండ్లు జోలికి వస్తే ఊరుకోమన్న హెచ్చరిక ఆఖరి వాక్యంలో ధ్వనిస్తుంది.

అనేక మంది చారిత్రిక వ్యక్తులు, సంఘటనలు, ఉటంకింపులతో కవిత రాయాలంటే ఆయా అంశాలపట్ల కవి రీసెర్చ్‌ చేయాలి. చదవాలి, అవగాహన పెంచుకోవాలి. తనదైన వ్యాఖ్యానం చేయగలగాలి. ఇవన్నీ పై కవితలో కనిపిస్తాయి. యధాలాపంగా చదివితే ఇలాంటి కవితలు అర్ధం కావు. అలాగని అస్ఫష్టత ఉందని కాదు. ఇది సంక్లిష్టత. కవిత్వంలో సంక్లిష్టతను విప్పుకోవాలంటే పాఠకుడు కొంచెం శ్రమించాలి. కవి స్థాయిని అందుకోవటానికి ప్రయత్నించాలి.

పై కవితలో కవిత్వాంశ ఎక్కడ ఉంది అనే అనుమానం కలగవచ్చు. కావేరి అల్లర్లను ‘‘ఎంగిలి బిర్యాని చేతులు’’ అనటం లోనే ఉంది. నేడు సమాజంలో ఉండే రాజకీయ వ్యూహాలు, ఈ సమస్య పట్ల కవికి ఉన్న దృక్ఫధం సూటిగా స్పష్టంగా ఆవిష్కృతమై కవితను ఊహించని ఎత్తులకు తీసుకువెళ్ళింది. మిగిలిన వాక్యాలన్నీ ఆ దృక్ఫధానికి రక్తమాంసాలుగా మారిపోయి గొప్ప ఉద్వేగభరితమైన అనుభవాన్ని అందిస్తాయి.

(కవిత్వంలో ఉండే సంక్లిష్టతను వివరించటానికి పై కవితను ఉదాహరణగా తీసుకొన్నాను తప్ప కవిత్వపఠనం ఇంత శ్రమతో కూడుకున్నది అని భయపెట్టటానికి కాదు. కవి ఎంతో శ్రమించి ఒక సృజన చేస్తున్నపుడు పాఠకుడు కూడా కొంత శ్రమించాల్సిన భాద్యత ఉండాలని చెప్పటానికి మాత్రమే. అదే లేకపోతే భాషపుట్టినపుడు పుట్టిన కవిత్వం ఇంతకాలం మనగలదా?)

రాత్రి హోరున వర్షం
ఉదయం లేచి చూస్తే
ఎదురింటాయనకు రెండు మేడలు. (ఇస్మాయిల్‌ హైకు)

యాధాలాపంగా చదివితే వర్షానికి రెండుమేడలకు సంబంధం తెలియదు. సాధారణంగా భారీ వర్షం వచ్చినపుడు రోడ్లపై నీళ్లు నిలబడటం సాధారణం. అలా నీళ్లు నిలిచినపుడు ఎదురింటాయన మేడ ఆ నీళ్లలో ప్రతింబింబంగా ఏర్పడి రెండు గా కనిపిస్తున్నదనే చక్కని ఊహను ఈ హైకూ దృశ్యమానం చేస్తుంది.
****

కొన్ని కవితలు ఒకే అర్ధాన్ని కాక భిన్న అర్ధాలను ఊహించుకొనేలా ఉంటాయి. ఆలా ఉండటాన్ని అనిర్వచనీయత (Ambiguity) అని కొందరు నిర్వచించారు. కవిత్వం ప్రధానంగా అర్ధకళ. బహుళార్ధాలు వచ్చేలా రాయటం కవిత్వంలో సామాన్యమే. కవిత్వాన్ని ఎలా వ్రాసినా ఇస్మాయిల్‌ గారు అన్నట్లు ‘‘కవిత్వం చేసే పనల్లా చదువరి మనస్సులో దీపం వెలిగించడమే. దీని వల్ల అతని అవగాహన పరిధి విస్తరిస్తుంది. తన మనస్సులో వెలిగిన దీపం వెలుతురు తన దారి తను వెతుక్కోవడానికి సహాయపడుతుంది’’.

మామూలు భాషవేరు కవిత్వభాష వేరు. కప్పిచెప్పేది కవిత్వం అన్నారు. కవిత్వం కొంత గూఢతను సహజంగానే కలిగిఉంటుంది. పాఠకునిలో హృదయాన్ని కదిలించగలిగే ఉద్వేగాలను/అనుభూతులను ఇవ్వగలిగితే అది మంచి కవిత్వమౌతుంది. ఈ ప్రక్రియలో కవిత అర్ధమైందా లేదా అనేది కొంత అప్రస్తుతం అయినప్పటికీ అస్పష్టకవిత్వం ఉత్తమ కవిత్వమనిపించుకోదు.
కవి, ఒక భావ వాహిక, పాఠకుడు ముగ్గురూ కలిసినపుడే రచన అవుతుంది. భావాలు కవి వద్దే ఆగిపోతే దాన్ని కవిత్వం అనలేం. కవిత్వంలో అస్పష్టతకు కవిని నిందించరాదు. అస్పష్టత అనేది భావప్రసార సంబంధమైన సమస్య. ఈ అంశానికి సంబంధించి ఆధునిక కవిత్వం మరిన్ని మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది.

బొల్లోజు బాబా

(కవిత్వభాష పుస్తకంలోని “అస్పష్టత-సంక్లిష్టత” పేరుతో రాసిన వ్యాసం.
పూర్తిపుస్తకాన్ని కింది లింకులోనుంచి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును).

3 comments:

  1. https://archive.org/details/kavithva-bhasha-by-bolloju-baba

    ReplyDelete
  2. ఈ కవిత ఏ క్లాసిఫికేషన్లో వస్తుందండి ?


    ఓ ఫకీరు కి లడ్డు తినాలన్న

    కోరిక కలిగింది

    మనసు - ఆ హా

    ఇంకా జిహ్వ చాపల్యం

    వదల్లేదే అంది


    బుద్ధి పొతే పోనీలే -

    అంతా వాతాపి జీర్ణం

    అని కానిన్చేయ్ అంది

    ఫకీరు లడ్డు

    లాగించి

    బ్రేవ్ మన్నాడు

    ప్రాణం గాలి లో కలిసి పోయింది

    ReplyDelete
  3. పై రచనను తవిక అని అంటారు. అద్భుతంగా ఉంది.

    అర్థం కాని కవితల కన్నా
    అలరించే తవికలు మిన్న.

    ఫకీరు లడ్డూ తిన్నా
    అమీరు గుడ్డు తిన్నా
    సమీరు బ్రెడ్డు తిన్నా
    వెర్రీ గుడ్డే నన్నా









    ReplyDelete