Saturday, September 7, 2024

మిత్రుని వాల్ పై చేసిన కామెంటు....(ఎడిటెడ్)


బ్రాహ్మణ భక్తి బ్రాహ్మణ ద్వేషం కవలలు ---కొంతవరకూ నిజమే కావొచ్చు.

రెండో శతాబ్దానికి చెందిన సంస్కృత వ్యాకరణ వేత్త పతంజలి అతని మహాభాష్య అనే గ్రంధంలో – బ్రాహ్మణులు శ్రమణులు(బౌద్ద, జైన, ఆజీవికులు) పాము ముంగిసల్లా ఆగర్భ శత్రువులని అన్నాడు.
కాపాలికా మతంలో చేరిన ప్రతీ వ్యక్తి ఒక బ్రాహ్మణుడిని చంపి అతని పుర్రెలో భిక్షాటన చేయాలని ఒక నియమం ఉండేది.

చార్వాకులు బ్రాహ్మణుల పట్ల సెటైర్స్ వేసారు "తోడేలు పాదముద్ర" అనే పిట్టకథ పేరుతో. వారు అభూతకల్పనలతో మాయమాటలు చెబుతారని అన్నారు. వేదాలను రచించినవారు విదూషకులు, మోసగాళ్ళు, రాక్షసులు అన్నారు.

వేదాలను అధ్యయనం చేస్తున్నవారిని "మూర్ఖుల సమూహం" గా వర్ణించాడు, ఏడవ శతాబ్దానికి చెందిన జైన మత ఉద్యోదన సూరి తన కువలయమాల కావ్యంలో.
 
బౌద్ధులు బ్రాహ్మణీయ సిద్ధాంతాలను అంగీకరించలేదు. బుద్ధుడు బ్రాహ్మణులు చెప్పుకొనే ఉత్తమజన్మ భావనను విమర్శించాడు. వారు కూడా మామూలు మనుషులే అన్నాడు. అది ద్వేషంగా పరిణమించిందో లేదో తెలియదు కానీచాలామంది హిందూ బ్రాహ్మణులు బౌద్ధంలో చేరారు
.
అశోకుడు లౌకిక భావనలని అవలంబించాడు. బ్రాహ్మణులకు అగ్రపీఠం ఇవ్వలేదు. అందరినీ సమాదరించాడు. ఈ రాజనీతి బ్రాహ్మణవాదుల సామాజిక, రాజకీయ ప్రాధాన్యతను సవాలు చేసింది.

బ్రాహ్మణుల పట్ల ద్వేషం అనేది సైద్ధాంతికంగా వారు చేస్తున్న అశాస్త్రీయ అరాచకాల పట్ల అని ఊహిస్తాను ముఖ్యంగా జన్మ ఆధారిత హెచ్చుతగ్గుల వ్యవస్థ పట్ల.
 
కిందనున్నవారు పైకి చేరలేక, ఒక వర్ణంలో పుట్టినందుకు జీవితాంతం బానిస జీవితాన్ని గడపాల్సి రావటం, దానికి కారణమైన "బ్రాహ్మనిజం" పై కలిగిన ద్వేషం అది.

ఈ ద్వేషం నుండి తప్పించుకోవటానికి ధర్మశాస్త్రాలలో బ్రాహ్మణుని సేవించాలి. దూషించరాదు, తాకరాదు, దండించరాదు (రాజుకూడా), గాయపరిస్తే మరణ శిక్ష, ఇక హత్య అయితే వేయి జన్మలవరకూ విముక్తే ఉండదు (ఈశ్వరునికూడా బ్రహ్మహత్యాపాతకదోషం అంటుతుంది అనే పురాణాలతో) అంటూ చాలా చాలా బలమైన రాతలు రాసుకొన్నారు. బ్రాహ్మణాధిక్యతను చాటి చెప్పే పురాణాలు ఇతిహాసాలు రాసుకొన్నారు.
 
సమాజంనుంచి ప్రతిఘటన రాకుండా. ధర్మశాస్త్రాలను రాజుచే బలంగా అమలుచేయించుకొన్నారు.
 
బ్రాహ్మనిజానికి- ఇతర సాంస్కృతిక జీవనాలకు మధ్య జరిగిన సంఘర్షణే మన చరిత్ర. ఇది ముఖ్యంగా బౌద్ధ హిందూ మతాల ఘర్షణ అంటారు డా. అంబేద్కర్ గారు.

 
బొల్లోజు బాబా

No comments:

Post a Comment