ఆ కారణంగా, అర్బనైజేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో నేనే నా మనవిమాటలలో వివరించాను. ఈ వ్యాసం నాకెంతో ఇష్టమైనది. నిన్నచదివితే ఇంకా తాజాగానే అనిపించింది. కవర్ పేజ్ పై ఉన్నది ద్రాక్షారామ ఆలయాన్ని నిర్మించిన చాళుక్యభీముడు. బాక్ డ్రాప్ లో బిక్కవోలులో శంకోలు ధరించిన శివుడు.
ఈ పుస్తకం ఇప్పడు రెండో ముద్రణలో ఉంది. కావలసిన వారు, పల్లవి పబ్లికేషన్స్, శ్రీ వి.నారాయణ గారిని, ఫోన్ నంబరు. 9866115655 లో సంప్రదించగలరు.
బొల్లోజు బాబా
ప్రాచీనపట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా
మనవి మాటలు
వ్యవసాయంద్వారా ఆహారోత్పత్తుల మిగులు ఏర్పడ్డాక ప్రజలు ఒక చోట స్థిరంగా నివసించటానికి మొగ్గుచూపారు. జీవించటానికి అనువుగా ఉంటూ రాజకీయ, ఆర్ధిక, మతపరమైన ప్రాధాన్యత కలిగిన జనావాస ప్రాంతాలు క్రమేపీ పట్టణాలుగా రూపుదిద్దుకొన్నాయి. మెగస్తనీస్ ఆంధ్రులకు ప్రాకారాలు కలిగిన ముప్పై పట్టణాలు ఉన్నాయని చెప్పాడు. ఇవి ఎక్కడెక్కడ ఉండేవో నేడు గుర్తించటానికి ఏ రకమైన ఆధారాలు లభించవు.
శాసనాలలో జనసాంద్రత కలిగిన ప్రాంతాలు - నగర, పుర, పట్టణ అనే మూడురకాల పేర్లతో చెప్పబడ్డాయి. పర్వతాలవంటి భవనాలతో, వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ఊరును ‘‘నగరము” అని; తీరప్రాంతంలో ఉండే రేవుస్థలాన్ని ‘‘పట్టణము” అని; బలమైన కోటను కలిగి ఉన్న ఊరుని ‘‘పురము” అని చరిత్రకారులు నిర్వచించారు. పిఠాపురం, రాజమహేంద్రవరం లలో బలమైన కోటలు ఉండేవి కనుక వాటికి పిష్టపురి, జననాథపురం అనే పేర్లు ఉన్నాయని ఊహించవచ్చు కానీ ఈ విభజనను అంత ఖచ్చితంగా పాటించినట్లు కనిపించదు. రాజమహేంద్ర పట్టణం (EI Vol 5 p.32), పిఠా పట్టణం (శ్రీనాథుని పద్యం) లాంటి ప్రయోగాలు కూడా ఉండటం గమనార్హం.
ఒక ప్రాంతంలో ఏమేరకు పట్టణీకరణ జరిగిందో అనేది అది ఆ ప్రాంతపు రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక అభివృద్ధికి, నాగరికతకు సూచిక. ఆయా పట్టణాల ఉత్థానపతనాలు ఆ ప్రాంత చరిత్రకు అద్దంపడతాయి.
భౌగోళికంగా వివిధ ప్రాంతాలను కలిపే రహదారులు; అన్ని వృత్తుల వారికి అవకాశాలు; ఆర్ధిక వ్యవస్థను నడిపించే ఏదైన ఒక ప్రముఖ దేవాలయం; ఓడరేవుల ద్వారా విదేశీ వ్యాపారం;ప్రజలకు రక్షణ; భిన్నమతాల మధ్య సహిష్ణుత; రాజకీయ ప్రాధాన్యత కలిగి ఉండటం- లాంటివి పట్టణీకరణకు దోహదపడే అంశాలు.
తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పట్టణీకరణపై ఆథ్యాత్మిక కేంద్రాల ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో ఆలయాలు సమాజంలో Money Circulate చేసే ఆర్దిక కేంద్రాలు. ఇవి గ్రామీణ ఎకానమీని అర్బన్ ఎకానమీని అనుసంధానం చేసేవి. దేవుని పేరుమీద జరిగే ఈ తతంగంలో అప్పటి సమాజంలోని దాదాపు అన్ని సామాజిక వర్గాలకు ఏదోఒక పాత్ర ఇవ్వబడింది.
జిల్లాలో ప్రాచీన చరిత్ర కలిగిన ద్రాక్షారామ, సామర్లకోట, సర్పవరం, పిఠాపురం, బిక్కవోలు, పలివెల లో నెలకొని ఉన్న వివిధ ఆలయాలు ఆయా ప్రాంతాలు అభివృద్ధిచెందటానికి సహాయపడ్డాయి. బౌద్ధ, జైన మతాలకు సంబంధించి జిల్లాలో అనేక చోట్ల భారీ అవశేషాలు లభిస్తూండటాన్ని బట్టి ఈ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధ, జైన విశ్వాసులకు కూడా దర్శనీయస్థలంగా ఉండేదని భావించవచ్చు. ఒక ప్రాంతంలో నెలకొన్న ఆథ్యాత్మిక కేంద్రం మతాలకు అతీతంగా ఆ ప్రాంత పట్టణీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
ఆథ్యాత్మిక కేంద్రాల తరువాత జిల్లా పట్టణీకరణకు దోహదపడిన మరొక అంశం కోరంగి, ఆదుర్రు లాంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఓడరేవులు. పట్టణాలలో నివసించే వృత్తికారులు, వర్తకులు వివిధ వ్యాపార శ్రేణులుగా (Guilds) సంఘటితమై ఈ ఓడరేవుల ద్వారా పెద్దఎత్తున విదేశీ వ్యాపారం జరిపేవారు. కోరంగి ఓడరేవు మాత్రమే కాదు ఒకప్పటి గొప్ప నౌకానిర్మాణ కేంద్రం కూడా. పిఠాపురం కూడా ఒకనాటి ఓడరేవు కావొచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది.
తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం కొంతకాలం కళింగరాజ్యానికి, రాజమహేంద్రవరం వేంగి రాజ్యానికి రాజధానులుగా ఉన్నాయి. అవికాక బిక్కవోలు, చాళుక్యభీమవరం, కోరుకొండ, కడలి, ముమ్మిడివరం, రంప లాంటి ప్రాంతాలు వివిధకాలాలలో రాజకీయ కేంద్రాలుగా ఉండటం వల్ల అవి పట్టణాలుగా మారి అభివృద్ధిపథంలో నడిచాయి.
వేంగి, కళింగ రాజ్యాలను కలిపే ప్రాచీన రహదారి జిల్లా లోని రామచంద్రపురం, బిక్కవోలు, పిఠాపురం, కొడవలి మీదుగా రామతీర్థం వైపు వెళుతుంది. ఇది సుమారు రెండువేల సంవత్సరాలనాటి జాతీయ రహదారి. ఆ విధంగా ఈ ప్రాంతం ఒకప్పటి ప్రముఖ ప్రాచీన రాజ్యాలతో అనుసంధానింపబడి ఉంది. ఈ లక్షణం కూడా పట్టణీకరణకు అనుకూలించే అంశము.
హిందు, బౌద్ధ, జైన విశ్వాసాలకు చెందిన అనేక ప్రాచీన క్షేత్రాలు జిల్లాలో కనిపిస్తాయి. బౌద్ధానికి సంబంధించి ఆదుర్రు, పిఠాపురం, గొల్లప్రోలు, కొడవలి, కాపవరం, తుని, రంపఎర్రంపాలెం, కోరుకొండ లాంటి ప్రాంతాలలో వివిధ భారీ బౌద్ధ అవశేషాలు లభిస్తున్నాయి. ఇవి ఆయా ప్రాంతాల ప్రాచీన ప్రాధాన్యతను నిరూపిస్తాయి. అదే విధంగా జిల్లాలో జల్లూరు, కాజులూరు, ఆర్యావటం, పిఠాపురం, బిక్కవోలు, తాటిపాక, రాజోలు, రామచంద్రపురం లాంటి ప్రాంతాలలో ఒకప్పుడు జైనమతం వెలసిల్లినట్లు నేడు అనేక విగ్రహాలు బయటపడుతున్నాయి.
ఈ భిన్న మతాలు ఒకనాడు సమాంతరంగా సహజీవనం చేసినట్లుకూడా అర్ధమౌతుంది. ప్రజలు భిన్నవిశ్వాసాలకు సహిష్ణుత కలిగి ఉండటం మానవ నాగరికత, సంస్కృతుల ఔన్నత్యానికి ఉత్తమోత్తమ నిదర్శనం.
***
ఈ పుస్తకంలో తూర్పుగోదావరికి చెందిన ప్రాచీనపట్టణాల చరిత్రను చెప్పటానికి ప్రయత్నించాను. దీనిలో హుయాన్ త్సాంగ్ పిఠాపుర సందర్శన, గుణగ విజయాదిత్యుని చారిత్రిక స్థానం, బిక్కవోలు ఆలయ శిల్ప సంపద, కోరంగి సాంస్కృతిక అంశాలు లాంటివి విశిష్టమైనవి అని తలుస్తాను.
నిజానికి ప్రాచీనపట్టణాలు అనే అంశం చాలా లోతైనది. ఎంత చదివినా తరగని మెటీరియల్ అందుబాటులో ఉంది. వాటిని శక్తిమేరకు క్రోడీకరిస్తూ, సులభంగా అందించాలని నేను చేసిన ప్రయత్నం ఇది. నేను విస్మరించిన లేదా నా దృష్టికి రాని అనేక అంశాలు మిగిలే ఉంటాయి అన్న స్పృహ నాకు ఎప్పుడూ ఉంటుంది.
భవదీయుడు
బొల్లోజు బాబా
అక్టోబరు 2021
No comments:
Post a Comment