Thursday, November 30, 2023

భిన్నమతాలలో ఉమ్మడి పాత్రలు - యక్షులు


.
యక్షులు, నాగులు, గంధర్వులు, కుబేరుడు, మాతంగులు లాంటి వారు జైన, బౌద్ధ, హిందూ పురాణాలలో కనిపిస్తారు. BCE 3 వ శతాబ్దం నుంచి వీరి శిల్పాకృతులు లభిస్తున్నాయి.
యక్షులు
యక్షులు/వీరు నగరం, గ్రామం, వనం, సరస్సు, నుయ్యి లాంటి వాటిని సంరక్షించే ఇష్టదేవతలు. యక్షులను పూజించటం వేదాలకు పూర్వమే ఉన్న సంప్రదాయం. వేదాలలో వీరు “ఇతరజనులు” గా పేర్కొనబడ్డారు. యక్షుడు పురుష, యక్షిణి స్త్రీ.
బౌద్ధసాహిత్యంలో యక్షిణిలు వృక్షాలతో సహవాసం చేస్తూ ఉంటారు. BCE మూడోశతాబ్దానికి చెందిన సాంచి స్తూపంపై వృక్షదేవతా యక్షిణి ప్రతిమలు అనేకం ఉన్నాయి. ఈ బౌద్ధ వృక్షదేవత అర్ధసమ భంగిమలో ఒక చేతితో చెట్టుకొమ్మను పట్టుకొని, దేహాన్ని విల్లులా వంచి నిలబడే నర్తకి motif కాలక్రమేణా హిందూ శిల్పాలలో సాల వృక్షాన్ని (ఏగిస చెట్టు) ఆశ్రయించి సొగసుగా నిలుచునే సాలభంజిక గా రూపాంతరం చెందింది.
***
జైన తీర్థంకరుల మంచి చెడులు పర్యవేక్షించటానికి ఇంద్రుడు యక్షులను నియమించాడు. ఒక్కో తీర్థంకరుని విగ్రహం పైన కుడివైపున యక్షుడు, ఎడమవైపున యక్షిణి దంపతులు పూలమాలలు ధరించి ఉంటారు. నిజానికి మొదట్లో వీరు తీర్థంకరుల సేవకులు. క్రమేపీ అంబిక, సరస్వతి, పద్మావతి లాంటి సేవక యక్షులను నేరుగా పూజించసాగారు.
.
1. జైన అంబికా దేవి
.
ఇరవై రెండవ తీర్థంకరుడైన నేమినాథుని యక్షిణి అంబికాదేవి. ఈమె సింహవాహిని. సంతానాన్ని ఇచ్చే దేవత.. మామిడి చెట్టు క్రింద ఇద్దరు పిల్లలను ఎత్తుకొనిఉంటుంది. ఈమె తన భర్త అయిన శర్వణ/గోమేధ యక్షునితో కలసి కొన్ని శిల్పాలలో కనిపిస్తుంది. ఈమెకే కూష్మాండిని అనే పేరుకూడా కలదు. ఈమె కాకతీయుల కాకతిదేవి అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.
మహారాష్ట్ర, జున్నార్ గుహలలో CE 2వ శతాబ్దానికి చెందిన అంబికాదేవి శిల్పం అత్యంత ప్రాచీనమైనది. CE 6 వ శతాబ్దానికి చెందిన అంబిక శిల్పం అమెరికాలో Los Angeles County Museum of Art భద్రపరచబడి ఉంది. CE 8 శతాబ్దపు శిల్పం అమెరికా రాయల్ ఆంటారియో మ్యూజియంలో ఉంది. CE 9 వ శతాబ్దపు అంబికాదేవి శిల్పం ఎల్లోరా 34 వ నంబరు గుహలో కలదు.
హిందూ ఐకనోగ్రఫీలో సింహవాహిని - అంబిక, పార్వతి, దుర్గ, చండి, భద్రకాళి, సర్వమంగళ, అపరాజిత, వింధ్యవాసిని, మహిషాసుర మర్ధిని, కాళికాదేవి అంటూ వివిధపేర్లతో అనేక బాహువులతో, వివిధ ఆయుధాలతో దర్శనమిస్తుంది.
.
2. జైన సరస్వతి
.
బుద్ధి, జ్ఞానం, సంగీతాలకు అధిష్టాన దేవత సరస్వతి దేవి. సరస్వతీ నది ఒడ్డునే వేదవాజ్ఞ్మయం విలసిల్లింది. దిగంబర జైనులు కొలిచే సరస్వతి నెమలిని వాహనంగాను, శ్వేతాంబర జైనసరస్వతి లేదా హంస ను వాహనంగా కలిగి ఉండే యక్షిణిదేవత. ఈమెకు శృతదేవి (వాక్కు నిచ్చే దేవత) అని మరొక పేరు. జైన శిల్పాలలో సరస్వతిదేవి చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. జైన సరస్వతి శిల్పాలు CE 1 వ శతాబ్దం నుంచి కనిపిస్తాయి. బౌద్ధ సరస్వతిదేవి కి ప్రజ్ఞాపారమిత అని పేరు.
సరస్వతి దేవి శిల్పానికి నాలుగు చేతులుంటాయి. ఈ చేతులలో పుస్తకం, కమండలం, రుద్రాక్ష మాల మరొక చేయి వరదముద్రను కలిగి ఉంటాయి. కొన్ని శిల్పాలలో వీణ వాయిస్తూ ఉంటుంది.
అత్యంత ప్రాచీనమైన ఒకటో శతాబ్దానికి చెందిన జైన సరస్వతి ప్రతిమ మధురలో లభించింది. ఈమె కు రెండుచేతులు మాత్రమే కలవు. ఒకచేతిలో పుస్తకము, మరొక చేయి అభయహస్త ముద్రలో ఉన్నట్లు తెలుస్తుంది. తల లేదు.
.
3. జైన పద్మావతి

.
పార్శ్వనాథుని సేవించే యక్షిణి పద్మావతి. కామత్ అనే ఒక యోగి కట్టెలను మండిస్తూ యాగాన్ని నిర్వహిస్తుండగా, అలా మంటలతో యాగం నిర్వహించటం వల్ల జీవరాశి మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని- అప్పటికి తీర్థంకరునిగా ఇంకా మారని పార్శ్వనాథ యువరాజు కామత్ ను వారించాడు . ఆ మండుతున్న ఒక కట్టెలోంచి వేడిని తాళలేక రెండు పాములు బయటకు వచ్చి చనిపోయాయి. ఇవి తదుపరి జన్మలో నాగలోకంలో ధరణేంద్ర, పద్మావతి గా తిరిగి జన్మించాయి. కామత్ కూడా మేఘాలను శాసించే మేఘమాలిగా జన్మించాడు.
పార్శ్వనాథ యువరాజు ముప్పై ఏండ్లవయసులో ఈ లోకాన్ని పరిత్యజించి పార్శ్వనాథునిగా అవతరించాడు. ఒకనాడు ఈయన తపస్సు చేస్తున్నపుడు మేఘమాలి భీకరమైన వర్షాన్ని, ఉరుములను తీవ్రమైన వరదను పంపించి తపోభంగం కావించాలని ప్రయత్నించాడు. నాగలోకపు రాణి అయిన పద్మావతి ఆ ఉత్పాతం నుండి పార్శ్వనాథుని పైకి లేపి, తన పడగలతో గొడుగుపట్టి కాపాడింది. అందుకు గాను పార్శ్వనాథుడు ఆమెకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి గౌరవించాడు. ఏదేని జైన విగ్రహం తలపై ఏడు పడగల సర్పం ఉంటే ఆ విగ్రహం పార్శ్వనాథునిదని ఇట్టే గుర్తించవచ్చు.
 
జైన పద్మావతీదేవికి అనేక ఆలయాలు ఉన్నాయి. పద్మావతి దేవి విగ్రహాన్ని పద్మ ఆసనం, శిరస్సుపైన గొడుగుపట్టే నాగపడగలు, చేతిలో పద్మము, ఫలము, రుద్రాక్షమాల, అంకుశము లాంటి ప్రతిమా లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.
***

బౌద్ధ జైన సంప్రదాయాలలో యక్షులు రక్షణ, ఆరోగ్యం, సంపద మరియు సంతానాన్ని ప్రసాదిస్తారని ప్రజల విశ్వాసం. హిందూమతంలో యక్షుల ప్రత్యక్ష ఆరాధన కనిపించదు. బౌద్ధ జైన యక్ష ఐకనోగ్రఫికల్ నమూనాలను హిందూమతంలోని దేవతా మూర్తులుగా స్వీకరించటం గమనించవచ్చు.
 
బొల్లోజు బాబా









Tuesday, November 28, 2023

శ్రీ మువ్వా శ్రీనివాసరావు కవిత్వంలో వస్తు వైవిధ్యం

 

కవి ఏ విషయాన్ని చెప్పదలచుకొన్నాడో దాన్ని వస్తువని చెప్పిన విధానాన్ని శిల్పమని అంటారు.  సామాజిక జీవితం, జీవనవైరుధ్యాలు, మానవసంబంధాలు, పర్యావరణం లాంటి అనేక అంశాల కళాత్మక వ్యక్తీకరణే సాహిత్యంలో వస్తువుగా మారుతుంది.  ఏ వస్తువుకైనా మానవజీవితమే భూమిక.  ఒక సంఘటన లేదా ఒక అనుభూతి లేదా ఒక ఆలోచనా ఏదైనా వస్తువుగా ఉండొచ్చు.   సాహిత్య వస్తువు కాలానుగుణంగా నిరంతరం మారుతూ ఉంటుంది.   ప్రబంధకవులు ఎన్నుకొన్న కథా వస్తువుకు ఆధునిక కవి రాస్తున్న వస్తువుకూ తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఒక కవి సుదీర్ఘకాలంపాటు చేసిన సాహితీయానంలో కూడా ఈ వస్తు పరిణామం గమనించవచ్చు.

ప్రతికవికి ఒక నిర్ధిష్టమైన  సాహిత్య దృక్ఫథం ఉంటుంది.  తన ఆశయాలకు, నిబద్ధతకు, ఆలోచనా విధానానికి అనుగుణంగా ఉండేవాటినే వస్తువులుగా స్వీకరిస్తాడు. వస్తు శిల్పాలు ఒకదానినొకటి కబళించుకోకుండా పరస్పర ఫూరకాలుగా ఉన్నప్పుడు అది గొప్ప కవిత్వమౌతుంది.  శ్రీ మువ్వా శ్రీనివాసరావు ఇంతవరకూ సమాంతర ఛాయలు, 6th ఎలిమెంట్, వాక్యాంతం, వైరాయణం అనే కవితాసంపుటులను వెలువరించారు.  వీరి వస్తు స్పృహ గొప్పది. వైవిధ్యభరితమైనది. వీరి కవిత్వంలో వస్తువైవిధ్యం ఉత్తమస్థాయిలో ఉన్నట్లు ఈ క్రింది పరిశీలనల ద్వారా అర్ధంచేసుకోవచ్చు.

 

1. రైతు పట్ల సహానుభూతి

ప్రకృతిపరంగా, రాజకీయకారణాలతో, ప్రపంచీకరణ ప్రభావం వలనా నేడు రైతు  దిగులు అంచులకు నెట్టివేయబడుతున్నాడు.  గౌరవంతో జీవించే పరిస్థితులు కరువయ్యాయి.  జీవనం ఛిద్రమైంది. శ్రీనివాసరావు అనేక కవితలలో రైతు దీనస్థితిని చిత్తరువుగా నిలిపారు. 

సూర్యుడు మేఘాలను కుప్పపోసి

గిట్టుబాటు ధర దొరకని రైతు

పత్తిని కాల్చినట్లు కాలుస్తున్నాడనిపిస్తుంది  (బొట్టుసూర్యుడు-6th ఎలిమెంట్)

పై వాక్యాలు సూర్యుని ఎండతీవ్రతను వర్ణించటానికి ఉద్దేశించినవైనా, అక్కడ తెచ్చిన రైతుప్రస్తావన ద్వారా ఈ కవికి రైతులపై ఉన్న సహానుభూతిని అర్ధం చేసుకోవచ్చు.

పండిన పిడికెడు గింజలు 

పుట్టకముందే నపుంసకత్వం నిర్ధేశించుకొన్నాయి//

విధిలేక తనే అంతమై

అలజడి విత్తుతున్నాడు అలలు మొలవాలని

నడిచిన అలలు సందేశం చేరవేస్తాయని// (సమాంతర ఛాయలు)

ఒకప్పుడు   రైతు పండించిన పంటలోని కొన్ని గింజలను విత్తనాలుగా దాచుకొని తదుపరి పంటకు వాదుకొనేవాడు.  ఆధునిక వ్యవసాయం వాడే హైబ్రిడ్ విత్తనాలు ఒక పంటమాత్రమే పండుతాయి.  వాటి గింజలు మొలకెత్తవు, విత్తనాలుగా పనికిరావు.  ప్రతీ పంటకూ విత్తనాలు కొనుక్కోవలసి రావటం రైతుకు అదనపు ఖర్చు. పై కవితలో పిడికెడు గింజల నపుంసకత్వం అర్ధం అది.  ఆ చితికి పోయిన రైతు తన చావు అలలుగా మారి  తన వాదన వినిపిస్తుందని భావించటం సమకాలీన  విషాదం.

***

ఈ రోజు ఏనాడూ ఒక ఆవుకు పేడ ఎత్తని, గడ్డి మేపని సమూహాలు ఆవుని కాపాడతామని కత్తులు ధరించి గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. అది రాజకీయ ప్రేరేపితం. కానీ  నిజానికి రైతుకు పశువుతో ఉండే అనుబంధం అలాంటిది కాదు.  హృదయగతమైనది.   ఒక   కవితలో చనిపోయిన ఎద్దుని తలచుకొని వెక్కి వెక్కి ఏడ్చిన ఒక రైతుని మనకళ్ళముందు నిలుపుతాడు కవి.  ఇదొక గ్రామీణ పురాపరిమళం.

ఏడ్చి ఏడ్చి చింతనిప్పులయిన

నాన్న కళ్ళు నాకింకా గుర్తే

ఎద్దుపోతేనే గుండెలవిసిన నాన్న కళ్ళు

మానవత్వపు వాకిళ్ళు (నాన్నకళ్ళు-సమాంతర ఛాయలు)

డంకెల్ ఒప్పందాల వల్ల సంప్రదాయ వ్యవసాయరంగం చితికిపోయింది.  అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యచేసుకొన్నాడట రైతు.  అతను పండించిన పత్తితో చేసిన వత్తే అతని తలవద్ద వెలగటం ఒక సామాజిక వైఫల్యం.

డంకెల్ రంకెలకు

అప్పుల వేలం డప్పుల చప్పుళ్ళకు

తను పండించిన పత్తి,  దీపం వత్తులై

రైతన్నల నెత్తిమీద వెలుగుతున్నాయి (పోస్ట్ మార్టం- సమాంతర ఛాయలు)

 

2. పర్యావరణ పరిరక్షణ/ప్రకృతి సౌందర్యం

కవులు ప్రకృతిని ఎంతైతే ఆస్వాదిస్తారో దాని విధ్వంశం పట్ల కూడా అంతే వ్యసనపడుతూంటారు. శ్రీ శ్రీనివాసరావు ప్రకృతిని ఆస్వాదిస్తూ రాసిన కవితలకన్నా పర్యావరణ పరిరక్షణను వస్తువుగా చేసుకొని వ్రాసిన కవితలు ఎక్కువ.

మనిషిని కట్టేయ్యడానికి

మబ్బులు

నాలుగు మెరుపు తాళ్ళు ఇస్తానన్నాయి

మనిషిని కడిగెయ్యడానికి

సూర్యుడు

నాలుగు బిందెల ఎండనీరు ఇస్తానన్నాడు

మనిషిని మత్తులో ముంచెయ్యడానికి

చంద్రుడు

నాలుగుతీగెల వెన్నెల వీణను ఇస్తానన్నాడు

 

కానీ

మనిషిని మనిషిగా మార్చెయ్యడానికి

ఎవరైనా

నాలుగు కవితావాక్యాలు ఇవ్వగలరా? (ఏమివ్వాలి? -వాక్యాంతం)

మెరుపుతాళ్ళు, ఎండనీరు, వెన్నెల వీణ గొప్ప సౌందర్యాత్మక వ్యక్తీకరణలు.  మానవజీవితానికి ప్రకృతికి ఉండే సంబంధాన్ని అందంగా చెబుతూనే అంతిమంగా  మనిషిని మనిషిగా మార్చేది కవిత్వమే  అని స్పష్టపరుస్తాడు.

 

పదిలంగా పేడ ఉండ్రాల్లు చుడుతోంది

ఏ వినాయకుడి కోసమో//

దేహానికి దీపాన్ని తొడుక్కొన్నది

ఏ కళ్ళకు

చీకటి రంద్రాల చమత్కారాన్ని చూయించడం కోసమో//

ప్రకృతి కళ్యానపు పనిలో

మనకు తప్ప

ప్రతిపురుగుకూ ఓ పాత్ర ఉంది (ప్రతికథనం-వాక్యాంతం)

పేడపురుగు పేడతో ఉండ్రాళ్ళు చుట్టి వాటిని దొర్లించుకొంటు వెళ్ళటం ఒక అందమైన ప్రకృతిదృశ్యం. మిణుగురు పురుగులు రాత్రివేళల మెరుపులు చిందించటం ఒక హృద్యచిత్రం.  ఆ మెరుపు వెలుగులని చీకటి రంద్రాలు అనటం అద్భుతమైన వర్ణన. ప్రకృతిలో   ప్రతిజీవికీ ఒక స్పష్టమైన పాత్ర ఉందని చెబుతూ,   మనిషికే ఏ పాత్రా లేదు అని కుండబద్దలుకొడతాడు.  ఆ విధంగా మనిషి చేస్తున్న పర్యావరణ విధ్వంసాన్ని పరోక్షంగా ఎత్తిచూపుతున్నాడు కవి.

 

3. మధ్యతరగతి జీవన వాస్తవికత

మధ్యతరగతి జీవులకళ్ళు పైవర్గాలకు అతుక్కుపోయి, కాళ్ళుమాత్రం పేదరికంలో కూరుకుపోయి ఉంటాయి. నిత్య సంఘర్షణ, ఉన్నదాంట్లో సర్దుకుపోవటం, అసంతృప్తుల మధ్య సాగుతుంది మధ్యతరగతి జీవనయానం.   ఈ అంశాలను ఒకకవితలో ఆలోచనాత్మకంగా ఇలా చెబుతున్నాడు కవి.

రెండు విసుర్రాళ్ళ మధ్య

పెసరగింజల్లా పగిలిపోతుంటాం//

తాత తాతెవరో తెలియకున్నా

వంశవైభవాన్ని వర్ణిస్తూంటాం

మధ్యతరగతి మనుషులం మేం

 

ఒంటినిండా పులుముకొన్న ఇంటిపేరును

ఏ పలుకుబడి వున్నోడితోనో అంటుగట్టి

ఆశల చిగురులు తొడుక్కుంటాం// (మధ్యపర్వం-సమాంతర ఛాయలు)

 

ఆ రెండు విసుర్రాళ్లను  సంఘర్షణ,  సంక్షోభం అని కవిత చివర్లో గుట్టు విప్పుతాడు కవి.  గొప్పలకు పోవటం, ఒకే ఇంటిపేరున్నగొప్పవ్యక్తులతో పోల్చుకోవటం, నిత్యం ఆశ నిరాశల మధ్య ఊగిసలాడటం మన నైజమని;   గతంలో కూరుకుపోయి  భవిష్యత్తు పట్ల నేలవిడిచి సాముచేస్తూ  గ్లోబల్ గుహలో రెక్కలు తెగిన పక్షుల వలే జీవిస్తున్నామని అంటాడు కవి. 

 

4. స్త్రీలు పిల్లల పట్ల గౌరవం

ఈ కవికి స్త్రీల పట్ల ప్రగాఢమైన గౌరవం, ప్రేమ ఉన్నట్లు దయ్యాలమాణిక్యమ్మ, క్షమించకు తల్లి, అమ్మమ్మ, నెలరాని రోజు లాంటి అనేక కవితల ద్వారా అర్ధమౌతుంది.

వయసు ముడతల మీద భయాన్ని వాలనీయక

ధైర్యపు నీడలా నడుస్తుండేది

కాలువ మడవ మీద కాచుకు కూర్చున్న

రైతు మాణిక్యం

మా నాయిన అమ్మ  (దయ్యాల మాణిక్యమ్మ- సమాంతర ఛాయలు)

***

అమ్మమ్మ పిడికిలి నుండి

జారిన

పంచదార ధార

నా నాలుకపై చేసిన

చేసిన సంతకం

నేనికా దాచుకునే ఉన్నా  (అమ్మమ్మ-సమాంతర ఛాయలు)

చిన్నవయసులోనే భర్తను కోల్పోయినా ధైర్యాన్ని కోల్పోక పసివాళ్లుగా ఉన్న పిల్లలను పెంచి ప్రయోజకులను చేసిన కవి నాయినమ్మ దయ్యాల మాణిక్యమ్మ గురించి వ్రాసిన ఈ వాక్యాలు స్త్రీల పట్ల, మరీ ముఖ్యంగా ఆత్మవిశ్వాసం కలిగిన స్త్రీల పట్ల ఉన్న కవికి ఉన్న గౌరవం తెలియచేస్తుంది

ఈ కవికి అమ్మంటే అనురాగం. అమ్మంటే ఒక భాగ్యం. అమ్మంటే భరోసా.  అనేక కవితలలో అమ్మతనం గురించిన వాక్యాలు పాయసంలో ద్రాక్షపలుకుల్లా తియ్యగా తగుల్తూంటాయి.  అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదూ…

భాగ్యం అంటే ఏమిటో తెలుసా

అమ్మచూస్తుండగానే ముసలాడైపోవడం

అమ్మనీడలోనే అమ్మంత అయిపోవడం (అమ్మంత కావడం-వాక్యాంతం) – నిజంగానే అమ్మచూస్తుండగానే

ముసలాడైపోవటం ఎంత అదృష్టం. ఇదొక నవ్యమైన ఊహ.

 

ఈ మధ్యనే మొదలైంది

నాకో మహాగురువు సాన్నిధ్యం… అంటూ తన మనవడి గురించి చెప్పుకోవటం ఒక నులివెచ్చని

హ్రుదయస్పర్శ.

 

5. ఉద్యమ స్పృహ

సాహిత్యం మానవోద్వేగాల వ్యక్తీకరణ మాత్రమే కాదు అవసరపడినప్పుడు సామాజిక చైతన్యంతో రాజ్యవ్యతిరేక ఉద్యమబాట పట్టవలసి ఉంటుంది. దానికి అందరు కవులూ సిద్ధంగా ఉండరు. ప్రజలస్వామ్యమెప్పుడు? ఈ పద్యానికి ముగింపులేదు, గురితప్పిన పిడికిళ్ళు లాంటి కవితలలో ఈ కవికి ఉద్యమభావజాలం పట్ల సానుకూల వైఖరి ఉన్నట్లు కనిపిస్తుంది.

మా వూరి మర్రి చెట్టుమీద

అర్ధరాత్రి

మందారం పూసిందని

ఖాకీలు కాలువల్లా ప్రవహించాయి

 

తుపాకి గొట్టాలు

తూర్పు మొక్కలను పసిగట్టాయి

తెల్లవార్లూ

లాఠీలు ఎముకలూ

మాట్లాడుకొంటూనే ఉన్నాయి ( 1975 … ఓ పోరాట గాథ - సమాంతర ఛాయలు)

ఎమర్జెన్సీ కాలంలో ఏ కాస్త ప్రభుత్వ వ్యతిరేకత వాసన తగిలినా బిలబిలమంటూ పోలీసులు దిగిపోయి, రాజ్యధిక్కారనేరం మోపి ఆలోచనాపరులను చితకబాది జైళ్ళకు తరలించేవారు.  ఆ నేపథ్యంలోంచి రాసిన కవిత ఇది.   రాజ్యధిక్కారాన్ని, మందారం పూసింది, తూర్పుమొక్కలు అనటంలో రాజ్యవ్యతిరేక భావజాలం పట్ల ఉన్న సానుకూల దృక్ఫథం అర్ధమౌతుంది.

 

6. మానవసంబంధాలు

మానవసంబంధాలను స్పృశించని సాహిత్యం ఉండదు. ప్రపంచీకరణ, పరాయీకరణ, వస్తువ్యామోహం లాంటి ఆధునిక జీవనసరళులు మానవసంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. అదే సమయంలో ఇద్దరుమనుషులు కలిసిన చోట సంబంధాలు ఉండక తప్పదు.  మానవసంబంధాలు ఎంతగా విచ్ఛిన్నమైపోయినా మనకుటుంబవ్యవస్థ నేటికీ ప్రపంచానికి ఆదర్శంగానే ఉంది. శ్రీనివాసరావుని మానవసంబంధాల కవి అని పిలుచుకునే విధంగా మానవసంబంధాలపై అచంచలమైన విశ్వాసంతో లోతుగా, వివిధ కోణాలలో, మానవసంబంధాలలోని చీకటివెలుగులను ప్రతిబింబిస్తూ అనేక కవితలు రాసారు.

            //ఒక్కొక్కటిగా గదులన్నింటినీ

బయటకు విసిరేయాలి//

అటాచ్డ్ బాత్రూం ని

పెరటి చివరి గోడమీద ఉతికెయ్యాలి

ఈ లివింగ్ రూముని

ఇరుగుపొరుగు వచ్చిపొయ్యేలా

ఇంటిముందు అరుగుగా పరిచెయ్యాలి//

గడుల గడుల ఈ ఇంటిని

ఎక్కడకక్కడ విడగొట్టాలి

కుటుంబసభ్యుల మధ్య

కొత్తకూడికలు మొదలెట్టాలి (కూడికలు+తీసివేతలు- వాక్యాంతం)

ఈ కవితలో కవి-మానవ సంబంధాల విచ్చిన్నానికి మనిషికో గది ఉండే ఆధునిక ఇంటి ప్లాను కూడా కారణమే అనే చిత్రమైన పరిశీలన చేస్తాడు. లివింగు రూముని ఇరుగుపొరుగు వచ్చిపొయేలా ఇంటిముందు అరుగులా పరిచేయాలి అనటం అంటే కూలిపోతున్న మానవ సంబంధాలను నిలబెట్టుకొమ్మని చెప్పటం. ముక్కలు ముక్కలుగా ఉన్న ఇంటిని ఎక్కడికక్కడ విడగొట్టినప్పుడే, కుటుంబసభ్యుల మధ్య బంధాలు మెరుగవుతాయి అంటాడు. ఇది ఏకకాలంలో సమాజానికి చేస్తున్న హెచ్చరికా, ఉపదేశం.

పెళ్ళంటే

అతను ఆమెగా మారటం

ఆమె అతను కావటం//

ఒకరినుండి ఒకరు నిరంతరం ప్రవహించడం

జీవితానికి కొత్తపిలకలు వేయడం

చెరో అమ్మనాన్నను అదనంగా పొందటం

రెండు చెవులై వినడం, రెండు కళ్లై చూడటం

రెండు పాదాల్లా నడవటం, ఒక్క గుండెగా మిగలటం// (పెళ్ళి @ - వాక్యాంతం)

మానవసంబంధాలను ఉజ్వలీకరించే  కవితా వాక్యాలవి. ఆదర్శ వైవాహిక జీవిత ఔన్నత్యానికి శిలాక్షరాలు.  ఒకరికొరకు ఒకరు అని అన్న భావనకు అద్భుతమైన వ్యక్తీకరణ. ఒక కొత్త తరాన్ని సృష్టించటం, చెరో అమ్మనాన్నను అదనంగా పొందటం అనే వాక్యాలలో- ఒక సాంస్కృతిక పరంపర దాగి ఉంది, మూడు తరాలను పెనవేసే అందమైన అల్లిక ఉంది. ఈ కవి దార్శనికుడు కనుకనే ఒకే వస్తువులోని మంచి చెడుల గమనింపు లోతుగా చేయగలిగాడు.

అదేం చిత్రమో

ఈ ప్రకృతికి ఎందుకింత నిర్దయో

రవ్వంత దుఃఖాన్ని స్వీకరించదు//

దుఃఖాన్ని ఇంకెక్కడా పారబోయలేం

ఇంకో మనిషిలో తప్ప

అందుకైనా ఒక తోడుండాలి (కన్నీటికి తోడూ జోడూ - వాక్యాంతం)

గొప్ప తాత్వికత నిండిన వాక్యాలివి.  మనిషికి మనిషి అవసరాన్ని విశదపరచే వాక్యాలు.  మన ఉద్వేగాలను దుఃఖమైనా, సంతోషమైనా మరొక మనిషితో పంచుకోగలమే తప్ప ఈ భౌతిక ప్రపంచంతో కాదు అనే భావన ఉదాత్తమైనది. మన దుఃఖాన్ని పంచుకోవటానికైనా మనకొక తోడుండాలి, మానవసంబంధాలను నిలుపుకో అని హెచ్చరిస్తున్నాడు కవి.

అమాయకంగా అనుకున్నా

కొడుకు మొక్కలా ఉన్నప్పుడు

ఎక్కడయితేనేం

ఎలా నయితేనేం

చెట్టంత ఎదగాలని

ఆ నీడలో సేదదీరాలని.

 

రోజూ చెట్లమధ్యలో

బతికే నాకు

ఎందుకు గుర్తులేదో

చెట్టు కదలదని

నీడకోసం దానిచెంతకే చేరాలని (ఆవలితీరం-సమాంతర ఛాయలు)

గొప్ప ఆర్తి ధ్వనించే వాక్యాలివి. ప్రపంచీకరణ ప్రభావంచే ఉపాథి కొరకు వలసలు అనివార్యమైనాయి. ఆ కారణంగా కుటుంబ సభ్యులు చెట్టుకొకరుగా విడిపోక తప్పనిసరైంది.  నా కొడుకు చెట్టంత ఎదగాలి అని కోరుకోవటం సహజమే.  కానీ ఆ చెట్టు మనవద్దే ఉండి మనకు నీడనివ్వాలని కోరుకోవటం ఆధునికకాలంలో అమాయకత్వమే.  సమకాలీన మానవసంబంధాలకు అద్దం పట్టే కవిత ఇది.

కవిగారు గుమ్మం పక్కనే సోఫాలో పేపరు చదువుకొంటున్నపుడు ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు.  ఆ వచ్చిన వ్యక్తి ఎవరో పోల్చుకోవటానికి ప్రయత్నించి విఫలమై అర్ధాంగిని పిలుస్తాడు కవి “ఏమోయ్ ఎవరో వచ్చారు చూడు అంటూ” ఆమె “ఎవరో తెలుసుకోలేకపోయారా” అంటూ వస్తుందామె.   ఇంతవరకూ అందరి ఇళ్ళలో జరిగేదే.  ఈ ఘటనతో ఘర్షణపడి కూలిపోయిన సంసారాలు ఉండొచ్చు. కానీ దాని నుండి ఒక జీవితసత్యాన్ని వెలికి తీయటం కవి ప్రతిభ. ఆ సత్యమేదో మానవసంబంధాలను పటిష్టపరిచేదిగా ఉండటం మరింత ప్రశంసనీయం. ఆ కవిత ఇలా ముగుస్తుంది. 

క్షమించడంలో కూడ

ఆనందం వెతుకుతూ ఆమె

క్షమించబడటంలో

సంతోషంలో నేను

 

సంసారం సజావుగా

సాగిపోతూనే ఉంది (థింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్-సమాంతర ఛాయలు) .

క్షమ మనుషుల్ని కలిపి ఉంచుతుందనటంలో సందేహం లేదు.  ఆ క్షమ  స్త్రీ ద్వారానే పలికించటం అనాదిగా జరుగుతున్నదే కావొచ్చు. అది పితృస్వామ్య భావన అంటూ ఎన్ని సార్లు చెప్పుకొన్నా అది సంసారం సజావుగా సాగిపోవటానికి దోహదపడే అంశం కాకపోవచ్చు అన్నివేళలా.  క్షమించబడటానికి సంతోషించి, విశ్వాసంగా ఉన్నప్పుడే ఆ ఇరువురి మధ్య ప్రేమ పరిపూర్ణమవుతుంది.

***

కరోనా వైరస్ ప్రపంచంలోని మనుషుల మధ్య అనుబంధాలను విచ్ఛిన్నం చేసిందని బాహ్యంగా కనిపిస్తున్నా, ఈ కవి తన అంతర్దృష్టితో చూసి ఇలా అంటున్నాడు.

రొసెట్టా రాయినుండి

మాసిపోయిన భాషనే బతికించుకున్నోళ్ళం

మహా అయితే… ఏమవుతుంది

మాలోమాకు యుద్ధాల పేరుతో

గతంలో

పోయినంత మంది మళ్ళీ పోతాం

అప్పుడు ద్వేషంతో కొట్టుకున్నోళ్ళం

ఇప్పుడు ఐకమత్యంతో పోరాడుతున్నాం

కరోనా… కారణజన్మమే నీది  (వైరాయణం)

క్రీస్తుపూర్వం రెండో శతాబ్దానికి చెందిన రోసెట్టా రాయిపై ఉన్న లిపిని ఛేదించిన తరువాత మాత్రమే ఆర్కియాలజిస్టులకు ఈజిప్టు పిరమిడ్ల గోడలపై ఉన్న Hieroglyphs లిపిని డీకోడ్ చేయటం సాధ్యమైంది. అలా ఒక ప్రాచీనఈజిప్షియన్ ప్రపంచాన్ని తిరిగి బతికించుకోగలిగాం.  ఓ కరోనా నీవల్ల ఏం జరుగుతుంది అని ప్రశ్నించటం, ఏం జరిగినా నువ్వు మాలో ఐకమత్యాన్ని పెంచుతున్నావు అంటూ గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించటం మానవజాతి పరిణామక్రమాన్ని అర్ధం చేసుకొన్న క్రాంతదర్శి మాత్రమే రాయగలిగే వాక్యాలు.

 

7. ప్రపంచీకరణ

మన జీవన విధానం, అలవాట్లు, సంప్రదాయాలు, పండుగలు, భాష, సాహిత్యం, కళలు అన్నీ కలిస్తే మన సంస్కృతి. ప్రపంచీకరణ ప్రభావం వల్ల ఇవన్నీ  మార్కెట్ సరుకులుగా మారిపోతున్నాయి. మనిషితనం పోయి వస్తువులకు ప్రాధాన్యం పెరిగింది.  గుంపులో ఏకాకితనం, అమానవీకరణ,, నగరంలో ఉంటూనే నగరం పట్ల విముఖత లాంటివి   ప్రపంచీకరణ దుష్పరిణామాలు.   దీన్ని కవులు గుర్తించి వాటినికవిత్వంలోకి తీసుకొస్తున్నారు.  

మహానగరం అంటే

మంచితనం కోసం

వెతుకులాడటమేనట

 

మహానగరమంటే

బతుకుల్ని

బహుచౌకగా అమ్ముకొనే

పెద్ద తిరనాళ్ళట//

అయినా సరే

ఉసిళ్ళలా ఊళ్ళన్నీ

ఇక్కడే వాలిపోతున్నాయి

ఏమీ సాధీంచకుండానే

రాలిపోతున్నాయి (సమాంతర ఛాయలు)

పై కవితా వాక్యాలలో కవి  నగరజీవితాన్ని నగ్నంగా మనముందు నిలుపుతాడు, నగర జీవనపు ఒరిపిడిని, వలస దుఃఖాన్ని, దాని అనివార్యతని అలతి అలతి మాటలలో  పట్టుకొన్నాడు.

//వస్తువుల్లో ఇరుక్కుపోయిన నా జీవితాన్ని

పట్టుకొందామని పరిగెత్తుతున్నా

పక్కనే ఉన్నట్లనిపించినా

చటుక్కున మాయమై

అందీ అందనంత దూరం జరిగి

దొరక్కుండా దోబూచులాడుతుంది

వస్తువుల్ని ప్రేమిస్తూ

మనుషుల్ని వాడుకొంటున్న

సమాజంలో సగటు మనిషిగా వున్నానేమో (గాజుపూల కంపు- సమాంతర ఛాయలు)

వస్తువుల్ని వాడుకోవాలి మనుషుల్ని ప్రేమించాలి అనేది ఒక ఆదర్శవంతమైన జీవనశైలి.  ప్రపంచీకరణ దీన్ని తారుమారు చేసింది. మనిషికి కాక వస్తువులకు ప్రాధాన్యం పెరిగింది.  మనిషిని వస్తువులకు బానిస చేసింది. మార్కెట్ నిర్ధేశించిన వస్తువులని కొంటున్నాం, వింటున్నాం, తింటున్నాం.  వస్తువుల క్రింద మనిషి కూరుకుపోయాడు.  ఇద్ సమకాలీన జీవన వైచిత్రి.

 

8. దురాచారాల పట్ల నిరసన

కవిత్వం ప్రజలలో నెలకొని ఉన్న మూఢనమ్మకాలను ప్రశ్నించాలి, దురాచారాలను ఖండించాలి.  ఇప్పటికీ అనేక చోట్ల నేలలో ఏదైనా విగ్రహం దొరికితే దానికి గుడి కట్టించి జాతరలు చేయటం ఒక తంతులా మారింది ప్రతీచోటా.  నిజానికి అక్కడ దొరికింది ఒకనాటి గుడికి చెందిన సాలభంజికో, యక్షిణో విగ్రహం కావొచ్చు.  వాటికి పూజలు, జాతరలు చేయడంలో భక్తి కన్నా వ్యాపారం ఉంటుందనటంలో సందేహం లేదు.  ఇలాంటి విషయాలను  స్పృశించటం అంటే శాస్త్రీయ దృక్పథాన్ని పలికించటం.  

నేలలో దొరికితే చాలు

సాలభంజిక కూడా’

అమ్మవారిగా పూజలందుకొంటుంది

తిరునాళ్ళు జరుగుతాయి

పూలదండలు

విలపిస్తాయి కానీ ఎవరికీ వినబడవు  (స్థలభంజిక-వాక్యాంతం)

 

9. మెటపొయెట్రి

కవిత్వంపై రాసే కవితలను మెటపొయెమ్స్ అంటారు.  ప్రతికవి తన కవిత్వతత్వాన్ని కవితాత్మకంగా చెప్పుకోవటం కద్దు.

మిత్రమా ప్రియురాలి పెదాలపై అంటిన

వెన్నెల ఎంగిలిలో కలిసిపోతే పో

కానీ

అవసరం అయినప్పుడన్నా

అక్షరాన్ని ఆయుధంగా మార్చు(అక్షరాయుధం -వాక్యాంతం)

ప్రేమగీతాలు, చెట్టు పిట్టా కవిత్వాలు మాత్రమే వెలువరిస్తూ, సామాజిక స్పృహకొరవడిన కవులపై సంధించిన వ్యంగ్యాస్త్రం పై కవిత.

కవి గాడు అనే కవితలో “వాడు మాటల్ని మంత్రిస్తాడు/జనం నాలుకలపై ప్రశ్నల్ని అతికిస్తాడు అంటూ కవికి ఉన్న సామాజిక బాధ్యతను గుర్తుచేస్తాడు.

నా ఏడుపేదో

నేనే ఏడుస్తుంటే

మెల్లగా నా పక్కన చేరి

నా ఏడుపుకు రాగం కట్టి

నువ్వు మాత్రమే ఆస్కార్

కొట్టేస్తావనుకోలేదు (అశ్రు సంగీతం-వాక్యాంతం)

 

చాలా సూటిగా, పదునుగా కవిత్వంలోని ఒక ధోరణిపై చేసిన విమర్శ ఇది.  ఇన్ని దశాబ్దాలుగా పేదల కష్టాలపై కవిత్వం రాసి రాసి ఆ రాసినోళ్ళు అవార్డులు పొందారు తప్ప ఆ కష్టాలు అనుభవించినవారికి ఆ కవిత్వాల వల్ల ఏం మేలు జరిగింది అన్న ప్రశ్న విలువైనది.    

 

10. పర్యాటక కవిత్వం

పర్యటనకోసమో, చుట్టపుచూపుగానో కొత్తప్రాంతాలను దర్శించినపుడు అక్కడి పర్యాటక స్థలాల అందాలను, వింతలు విశేషాలను చాలా మంది కవులు తమ కవిత్వంలో బంధించారు.  శ్రీనివాసరావు కూడా తన అమెరికా పర్యటనలో చూసిన అక్కడి విశేషాలతో కొన్ని కవితలు రాసారు. 

అతిశయించిన ప్రకృతిపై

జలఖడ్గం సాగించిన

వేల ఏండ్ల అందమైన పోరాటం//

ప్రతిరోజు

వేలాది జనం సాక్షిగా

ఉభయ సంధ్యల అందాన్ని

ఓడిస్తున్న గ్రాండ్ కేనియన్ (గ్రాండ్ కేనియన్ - వాక్యాంతం)

గ్రాండ్ కేనియన్ అనేది అమెరికాలోని కొలరాడొ నది వెంబడి నీటిప్రవాహపు కోతకు  సహజసిద్ధంగా ఏర్పడిన కొండచరియలసమూహము.   ఇది సహజసిద్దమైన ఒక ప్రకృతి వింతగా గుర్తింపబడి, గొప్ప పర్యాటక క్షేత్రంగా పేరుతెచ్చుకొంది.  నదీ కోతను జలఖడ్గం చేసిన పోరాటంగా చెప్పటం చక్కని పోలిక.

***

వాళ్ళక్కడ వెలుగుల వడియాలు పెట్టుకొన్నారు

వందలకొద్దీ సూర్యుళ్ళనీ

వేలాది చంద్రుళ్ళనీ

ఒకే గ్రైండర్లో నూరి

వెలుగు వలయాల వడియాలు

పెట్టుకొన్నారు//

చీకటికి బట్టలిప్పి

చిందులేయిస్తారిక్కడ (లావేగాస్- 6th ఎలిమెంట్)

లాస్ వేగాస్ గురించి వ్రాసిన కవితా వాక్యాలవి. లాస్ వేగాస్ జూదానికి, రాత్రి జీవితానికి ప్రసిద్ధి.  రాత్రి జీవితం అనగానే తప్పని సరిగా మిరిమిట్లు గొలిపే లైటింగ్ ఉంటుంది.  ఆ లైటింగ్  సూర్యచంద్రులని నూరి వడియాలుగా పెట్టినట్లుంది అనటం నవ్యమైన ఊహ.   

     

11. రాజకీయ అభిప్రాయాలు

నేడు మతతత్వ పార్టీలు ప్రజలను పోలరైజేషను గురిచేసి రాజకీయ అధికారం పొందటం కోసం   ముస్లిములను టార్గెట్ చేయటం జరుగుతున్నది.  ఈ క్రమంలో భాగంగా తాజ్ మహల్ ఒకనాటి శివాలయమని ఆధారరహిత వాదనను కొందర ముందుకు తెచ్చారు. ఈ అంశంపై శ్రీనివాసరావు నిర్ధ్వంధ్వంగా తన అభిప్రాయాన్ని ఇలా చెబుతారు.

వేదికనెక్కిన వీధి కుక్కలు వాగినంతనే

తాజ్ మహల్ పునాది వాసన మారుతుందా?

ఇప్పుడూ మనదే కదా!

అయినా

అప్పుడెప్పుడో మనదనుకోవడం

నిజంగానే దౌర్భాగ్యం

కోట్లమంది దేవుళ్ళున్న దేశంలొ

ఇంకో ఇద్దరిని కలుపుకుంటే పోయేదేముంది? (వాక్యాంతం)

            కోట్ల మంది దేవుళ్ళున్న దేశంలో ఇంకోఇద్దరిని కలుపుకొంటే తప్పేమిటి? అనే ప్రశ్నలోని సహిష్టుత ప్రతి నిజమైన హిందువుకూ అర్ధమౌతుంది. అది భారతజాతి గమ్యం అవ్వాలి.   

తెలంగాణా ఉద్యమం నడిచే సమయంలో ప్రత్యేక తెలంగాణా అంశం గొప్ప భావోద్వేగాలను రేకెత్తించిన అంశం.   అంశంపై చేసిన ఈ వ్యాఖ్య చాలా విలువైనది

విడివడటం నేరమేమీ కాదు

వేర్పాటే విముక్తీకాదు

మునిగిపోయిందేమీ లేదు

మళ్ళీమొదలుపెడదాం పరుగు//

అక్కడైనా, ఇక్కడైనా పేదజనం ఒక్కటే

ఎప్పటికయినా

ప్రపంచ పేదలంతా ఏకం కావాల్సిందే (వాక్యాంతం)

పేదప్రజలు ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే, వాళ్ళు ఏనాటికైనా ఏకంకావాల్సిందే అనే ఆకాంక్ష నరనరానా కమ్యూనిష్టు భావజాలంనింపుకొన్న వారు మాత్రమే చేయగలిగే వ్యాఖ్య.

మహాత్మా

నీవు నడిచి వెళ్ళిన బాటను

అక్షరాలతో పుస్తకాలనిండా ముద్రించుకున్నాం

భద్రంగా బీరువాల్లో దాచుకున్నాం//

మహాత్మా

నీవు విడిచివెళ్ళిన ఆశయాలను

అందంగా మూటగట్టి

మా పిల్లలెవరికీ అందకుండా

ఆకాశపు ఉట్టిలో దాచిపెట్టాం//

మహాత్మా

ఉత్తమాటలుగానే మిగిలిపోయాం 

మన్నిస్తావా? (మార్గదర్శి - వాక్యాంతం)

గాంధీ ఆలోచనలవైపు నేడు ప్రపంచదేశాలు చూస్తున్నాయి. మనవద్దమాత్రం గాడ్సే క్రమక్రమంగా పూజనీయుడౌతున్నాడు.  ఈ సున్నితాంశాన్ని కవి గుర్తించాడు. మహాత్మా నన్ను మన్నించు అని కోరుతున్నాడు.

 

12.  సమకాలీనత

సమాజంలో సమకాలీన సంక్షోభాలు, వైరుధ్యాలను కవిత్వంలోకి తీసుకురావటం వల్ల ఆ కవిత్వానికి గొప్ప లోతు విస్తృతి వచ్చి చేరతాయి. సమకాలీనత పాఠకునిలో ఆసక్తి రేపుతుంది. శ్రీనివాసరావు కవిత్వంలో సమాజంలో సమకాలీన  ఆధునిక అంశాలు వివిధ కవితలలో కనిపిస్తాయి.  సోషల్ మిడియాలో అజ్ఞాతంగా ఉంటూ నకిలీ ప్రొఫైళ్ళతో చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేసే వ్యక్తులు ఉంటారు.  కొన్ని సందర్భాలలో వీరు చేసే ట్రోల్స్ మర్యాదస్తుల పాలిట తలనొప్పిగా పరిణమిస్తాయి.  ఇది అవాంఛనీయం. Fake ID అనే కవిత ఈ అంశాన్ని స్పృశిస్తుంది.

            వెలుగులో ఓడిపోయేవాడు

ముఖపుస్తకంలో తలదాచుకొని

ముఖానికి వేరే బొమ్మేసుకుని

నకిలీ ప్రొఫైళ్ళ నెమలీకలతో దర్శనమిస్తుంటాడు//

అసలు మనిషెవరో ఎప్పటికీ తెలియదు  (Fake ID - వాక్యాంతం)

కరోనా ప్రపంచ విలయాన్ని సృష్టించింది.  తన ప్రయాణం ఎటువైపు మార్కెట్ వైపా మనిషితనం వైపా అని ఒక్కసారి ఆగి ఆలోచించుకోవాల్సిన స్థితి కల్పించింది మనిషికి. ఆ సంక్లిష్టతను అలతి అలతి మాటలలో ఇలా అక్షరీకరించారు శ్రీనివాసరావు

మనుషులు చస్తే

మళ్ళీ పుడతారు

మార్కెట్ చస్తే మనమెట్లా అంటాడొకడు!

బతికుంటే చాలు

బలుసాకు తినైనా బతకొచ్చంటాడు మరొకడు

ఒకే యుద్ధంలో

రెండు గీతోపదేశాలు వినిపించి

తర్క తాంబూలమిచ్చి తన్నుకు చావమంటున్నావు కదా!

కరోనా… కారణ జన్మమే నీది! (వైరాయణం)

వైరాయణం సంఘటనాత్మక కవిత్వసంపుటిగా భావించవచ్చు. పై కవితలోని బలం అంతా “ఒకే యుద్ధంలో రెండు గీతోపదేశాలు” అన్నవాక్యం వద్ద ఉంది. ఇంతవరకూ జరిగిన మానవపరిణామం అంతా కరోనా కారణంగా కొత్తగా కనిపించటం పట్ల చేసిన లోతైన వ్యాఖ్య అది. కరోనా నేపథ్యంలో  మనిషిపై మార్కెట్ చేస్తూ వచ్చిన దాడి ఒకవైపు, మానవ జీవనేచ్ఛ మరోవైపు చేరగా జరిగిన సంఘర్షణను ఇముడ్చుకొన్న అనల్పార్ధ తాత్విక వచనమిది.

శ్రీనివాసరావు కవిత్వం సమకాలీనంగా ఉండే సామాజిక అంశాలను ప్రతిభావంతంగా ఇముడ్చుకొందని వీరి అనేక కవితలు సాక్ష్యమిస్తాయి.

***

మువ్వా శ్రీనివాసరావు వస్తు స్పృహ వైవిధ్యభరితమైనది. ఇతని  ప్రారంభకవితలలో కనిపించే వైయక్తిక వస్తువు క్రమేపీ సార్వజనీన వస్తువుగా పరిణామం చెందటాన్ని గమనించవచ్చు. పల్లెటూరి అనుభవమైనా, మానవసంబంధాల పరిమళమైనా, నగర చిధ్రజీవనశకలమైనా, పదునైన రాజకీయ అభిప్రాయమైనా ఇతని చేతిలో కళాత్మకతను సంతరించుకొంటుంది. ఏ వస్తువును తీసుకొని రాసిన కవితలోనైనా  అంతఃస్సూత్రంగా మానవతావాదం పలుకుతుంది. అదే శ్రీనివాసరావు కవిత్వ స్వరం.

 

బొల్లోజు బాబా

5/03/2022