Wednesday, August 7, 2013

కొన్ని పదాల గురించి......


ఏమీ గుర్తు లేవిపుడు
జేబుడు సూర్యకిరణాలు
గుప్పెడు చందమామ 
ముక్కలు తప్ప.

దుఃఖాశ్రువులు నిండిన
సాయింత్రాన్ని
రాత్రి రెప్పల క్రింద
నిదురపుచ్చి అన్నీ 
మరచిపోదామనుకొంటాను
కానీ
కొన్ని పదాలు నా నుండి రాలిపడి
ఓ ఎడారిని సృష్టిస్తాయి
ఆ ఎడారిలోంచి ఓ అరణ్యము
ఆ అరణ్యం లోంచి కుంభవృష్టీ
ఒక్కొక్కటిగా విచ్చుకొని
నన్ను కబళిస్తాయి.
నానుంచి పుట్టినదైనా
నన్నో పూచికపుల్లను చేసి
కొట్టుకొని పోతుంది

ఏమీ గుర్తులేవిపుడు
జేబుడు పదాలు
గుప్పెడు కలల
ముక్కలు తప్ప

బొల్లోజు బాబా

Monday, July 29, 2013

ఒక జ్ఞాపకం ....

మొదటి సారి
కలిసి చూసిన  సినిమా టిక్కెట్టు
నాది నావద్ద భద్రంగా ఉంది
తన వద్ద కూడా
ఉండి ఉంటుందా!

రాత్రి పొడవునా
చూపులు వర్షిస్తూనే ఉన్నాయి
స్వప్నం అంచుల చుట్టూ
ఆలోచనల చీమలు చేరి
కతుకుతున్నాయి.

చీకటి వేళ్ళు
హృదయంలో లోతుగా
పాతుకొంటున్నాయి.

స్వరపేటికపై వసంతాల్ని
నాట్యం చేయించిన పిట్ట
వర్షాన్నలా వింటూ ఉండిపోయి
నిలువెల్లా తడిచిపోయింది.
బిరబిరా పారుతున్న గాలికి
గజ గజ వణుకుతోంది.

ఛ..ఛ... మరచిపోవటం ఎలానో
జ్ఞాపకం ఉంచుకోకూడదు ఇకపై..

బొల్లోజు బాబా

Tuesday, July 23, 2013

ఒక పాత కామెంటు...... సి. పి. బ్రౌన్ గురించి

చాన్నాళ్ల క్రితం ఈ క్రింది లింకులో బ్రౌన్ గురించి నే చేసిన కామెంటు బాగున్నట్టనిపించి మరలా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను
http://telugu.anilatluri.com/2012/04/18/i-found-telugu-literature-dead/

అనిల్ అట్లూరి గారికి వందనములతో......

బ్రౌన్ తెలుగు నేర్చుకోవటం అనేది తెలుగులో మతప్రచారం చేసుకోవటానికే అనే అర్ధం వచ్చేలా చేసిన ఒక కామెంటు పట్ల అప్పటి  నా స్పందన ఇది.....

ఎందుకు నేర్చుకున్నాడు
ఎందుకంటే ప్రాంతీయ బాషలో మత ప్రచారం కోసం అనీ మన దరిద్రం మనం అతన్ని ఎత్తున ఉంచుతున్నాము.

ప్రసాద్ గారూ

మీరు చాలా తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు. బ్రౌన్ మతప్రచారకుడిగా లేడు. అతనిని క్రిష్టియనులే విమర్శించేవారు. బ్రాహ్మణ పండితులతో కూడా బ్రౌన్ కు పొసిగేది కాదు. కాస్తో కూస్తో నాస్తిక భావాలున్నాయనికూడా విమర్శలకు గురయ్యాడు. (విశ్వాసి అయినప్పటికీ కూడా) తెలుగులో బైబిలులు ఇతని కంటే వందేళ్ళ ముందే వ్రాయబడ్డాయి.

మనుచరిత్ర, పల్నాటియుద్దం, బొబ్బిలి యుద్ధం, కడపస్థానికచరిత్ర, భాగవతం, డిక్షనరీలు ఒకటా రెండా బ్రౌన్ మాత్రమే చేసిన పనులు.

తెల్లవాళ్ళందరూ దోపిడీదారులు, మతప్రచారకులు అన్న కండిషనింగ్ నుంచి బయటపడండి సార్. వారిలో కూడా కొంతమంది ప్రత్యేకులు ఉన్నారు. వారిని గుర్తించి సముచిత స్థానం ఇవ్వటం నేటి కాలావసరం.
బ్రౌన్ ఇందియానుంచి లండన్ వెళిపోయి మరో ముప్పై సంవత్సరాలు బ్రతికాడు అప్పుడు కూడా తన తెలుగు సేవను మరువక, పుస్తకాలసేకరణ, డిక్షనరీ ఆధునీకరణ వంటి పనులు చేసాడు. ఆ పనులను ఇప్పటి వరకూ ఇండియాకు తెచ్చుకోలేని దౌర్భాగ్యులం మనం. అంతేకాదు, బ్రౌన్ సేకరించిన సుమారు పాతికవేల గ్రంధాలు ఆర్చైవులలో మూలుగుతున్నా (ప్రతీదానికి పేజీపేజీలో బ్రౌన్ విశ్లేషణ, వివరణలతో కూడినట్టివి) ఈనాటికీ సంపూర్ణంగా వెలికి తీసుకురాలేకపోతున్న వెధవాయిలం మనవాళ్ళం.

చచ్చిపడున్న తెలుగు సారస్వతాన్ని పైకి లేపాను అని బ్రౌన్ చెప్పుకొన్న మాటలు అక్షర సత్యాలు. కొన్ని వేల తెలుగు గ్రంధాలను, నయాన భయాన, సామధానబేధ దండోపాయాలను ఉపయోగించి బ్రౌన్ సేకరించాడు. నేడు మనం మన ప్రాచీనసాహితీ సంపద అని చెప్పుకొంటున్న ప్రతీ కావ్యంపై బ్రౌన్ ముద్ర ఉంది. ఒక్కొక్క కావ్యానికి అనేక ప్రతులు వచ్చినపుడు వాటిని పక్కపక్కన పెట్టి అసలైన దానిని శాస్త్రీయంగానిర్ధారించి ప్రక్షిప్తాలను తొలగించి చాపు చేసిన మహనీయుడు అతడు. వేమన పద్యాలు బ్రౌన్ అప్పట్లో సేకరించకపోయినట్లయితే ఈ నాడు మనకు ఉండేవి కావనటం అతిశయోక్తి కాదు. ఎందుకంటే వేమన పద్యాలంటే పండితులు ఒక జబ్బుపని గా తలచి ముందుకొచ్చేవారు కాదట.

మీకువీలైతే ఆరుద్ర సమగ్రాంధ్ర చరిత్రలో బ్రౌన్ చాప్టరు చదవండి (ఆరుద్ర బ్రౌన్ సేవంతా అతని వద్ద పండితులుగా పనిచేసిన వారి ఘనతే అన్న అర్ధం వచ్చేలా వ్రాయటం జరిగింది – కానీ బ్రౌన్ స్వదస్తూరీతో ప్రతీ గ్రంధానికీ చేసిన వ్యాఖ్యలు, అప్పటి జర్నల్స్ లో వ్రాసిన వివిధ పేపర్లగురించి తక్కువగా ఉంటుంది – గమనించవచ్చు)- అంతర్జాలంలోనే లభించే బండి గోపాలరెడ్డి బంగొరె (ఇతనిదో విషాదగధ పాపం) సంకలన పరచిన భ్రౌన్ లేఖలు చదవండి. వీలైతే

ఇక ప్రస్తుతకాలంలో అయితే బ్రౌన్ లాగ చేసే పరిస్థితులు కనిపించవు. ఆఫ్ట్రాల్ ఒక కధా సంకలనం తీసుకొస్తే వెంటనే మా ప్రాంతం కధలు లేవు, జిల్లా కథలు లేవు, కులం మతం ప్రతిబింబించలేదు, అతని కధలున్నాయి ఇతనికంటా గొప్పా అంటూదుమ్మెత్తి పోసే రోజులోకి వచ్చాం. బహుసా ఆస్థాయి కృషి జరపటం ఎవరివల్లా కాదు. ఎందుకంటే మితిమీరిన డెమోక్రిసీ దశకు చేరుకున్నామేమో మనం అందరం.

ఇంత పెద్ద వ్యాఖ్యకు కారణం బ్రౌన్ మతప్రచారం కోసం తెలుగుసేవ చేసాడు అన్నవ్యాక్య అలానే ఉండకూడదని, తెలియని వారికి తప్పుడు అర్ధాలు ఇస్తుందనీ……..

భవదీయుడు
బొల్లోజు బాబా

Monday, July 22, 2013

దృశ్యం
ముక్కలు ముక్కలు గా
వెదజల్లబడింది

ఎవరి శకలం
వారిదే

Thursday, July 18, 2013

స్వప్నమునందు నిదురించువారు ధన్యులు…..


నాకూ నా అంతరాత్మకు
ఈ మధ్య అస్సలు పడటం లేదు
నే చేసే పనులపట్ల
వాడు చాలా కోపంగా ఉంటున్నాడు
అరిచి గోల చేస్తున్నాడు
నేనో హరిత పంజరంలో చిక్కుకొన్న
పక్షినని ఎంత చెప్పినా వినడు
“నాతో చెప్పద్దు, నీ ఇష్టం
వచ్చినట్లు చేసుకో” అంటో
చీదరించుకొంటాడు

ఆమె బేల చూపుల్ని విదిలించుకొని
వచ్చేసిన రోజయితే
వాడు తన బలమైన చేతులతో
నన్ను కుదిపేస్తూ
ఉక్కిరిబిక్కిరి చేసేసాడు

గడియారం టిక్కు టిక్కు మంటో
దగ్గుతున్నట్లుగా...
తెల్లని కంటిపాపపై
వెంట్రుకలు మొలిచినట్లుగా...
ప్రాణపాము తన బట్టల్ని విడిచి
ఎటో వెళిపోయినట్లుగా  .........  జీవితం

ఇలాగయితే సుఖం లేదని
ఓ రోజు గోదారి ఒడ్డుకు వెళ్ళి
వాడితో మాట్లాడటం మొదలుపెట్టాను
కాసేపటికి నా కళ్ళమ్మట నీళ్ళు
ఇద్దరం భోరు భోరున ఏడ్చుకొన్నాం
చాలాసేపు మౌనం తరువాత
“నువ్వు మాత్రం ఏం చేస్తావులే”
అని వాడు గొణుక్కోవటం వినిపించింది


బొల్లోజు బాబా

Wednesday, April 24, 2013


ఊడుపు

పట్టె తోలిన వరిచేను
ఏది మబ్బు? ఏది కొంగ?

ఒంగున్న స్త్రీలు
వరిమొలకల్ని
అనంత నీలిమలో
గుచ్చుతున్నారు
ఏది మన్ను? ఏది మిన్ను?

బొల్లోజు బాబా

Tuesday, January 29, 2013

About my book......

సాక్షి, ఫన్ డే 27-1-2013

శ్రీ రవూఫ్ గారికి ధన్యవాదములతో

భవదీయుడు
బొల్లోజు బాబా