Sunday, January 3, 2010

నా కవితాసంకలనంపై శ్రీ పి.ఆర్.ఎల్. స్వామి గారి స్పందన

శ్రీ పి.ఆర్. ఎల్. స్వామి గారు యానాం కు చెందిన ప్రముఖ కవి. పాండిచేరీ ప్రభుత్వం కళాకారులకు ఇచ్చే కలైమామణి" బిరుదాంకితులు.వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. వీరి కవిత్వం సరళంగా జీవితంలోని భిన్నపార్శ్వాలను తాకుతూ అలరింప చేస్తుంది . ఆధునిక, ప్రాచీన కవిత్వ ధారణ వీరి ప్రత్యేకత. ప్రముఖ కవుల కవితలను అనర్ఘళంగా గానం చేస్తూ అనేక ప్రదర్శనలను ఇచ్చారు. పలువురి ప్రశంసలు పొందారు.

నా కవితా సంకలనాన్ని చదివి మెచ్చుకొంటూ వారు వ్రాసి ఇచ్చిన కొన్ని వాక్యాలు ఇవి. వీటిలోని దాదాపు అన్ని పదాలు నా కవితా శీర్షికలైనప్పటికీ, దీనిని విడిగ చదివినా ఒక కవితలాగ అనిపించటం వీరి ప్రతిభకు నిదర్శనంగా, నా కవిత్వానికి లభించిన గౌరవంలా నేను భావిస్తున్నాను.

వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ......

భవదీయుడు
బొల్లోజు బాబా

తడి గీతం మీద పొడి సంతకం

మిత్రుడు......
సహృదయుడు....
బొల్లోజు బాబా వెన్నెల నావనెక్కి
ఆకుపచ్చని తడిగీతాన్ని శిల్పంలా చెక్కాడు
ఆ శబ్దానికి రాలిన పూలు
సుగంధాలను గానం చేస్తున్నాయి
కవికి అపరిచిత ప్రపంచంలో
బతకడం ఇష్టం ఉండదు.
అందుకే మట్టికనుల పల్లెతో
నిరంతరం కరచాలనం చేస్తూంటాడు.
ఇన్నాళ్లూ తనలో దాచుకున్న అనేకానేక
రహస్యాలతో పొగడ చెట్టుమీద
వెన్నెల పిట్టలా కాగితాలమీద వాలాడు.
అతని అక్షరాల సంగీతమేఘం
తేనెపాటాల్ని వర్షిస్తోంది.
అతని వాక్యాల వసంతపు మొగ్గలు
పువ్వులుగా బద్దలవుతున్నాయి.
ఖాళీ రాత్రులలోంచి ఉదయించే జ్ఞాపకాలన్నీ
హాయగా సలపడం కోసం
బాబా జీవితాన్ని పుటలు పుటలు గా పరిచాడు
అతడికి ఒకే ఒక ఆశ
పుస్తకంలోకి నడవటం
ప్రతివేకువ జామున ముళ్లగాయాలను
స్పర్శిస్తూంటాడు.
కాంక్షాతీరా వెతుకులాటలో అతడి నిరీక్షణ
ఆకాశంలోకి తెరుచుకుంటుంది.
అతని గుండెలో
సుళ్లు తిరిగే కన్నీళ్లని, ఆశల్ని, ఆవేశాల్ని
కలల తెరపై చిత్రించుకుంటాడు.
కవి "సాహితీయానాన్ని"
గాలి, చెట్టు,పిట్టా
నిత్యం శ్రుతి చేస్తూనే ఉంటాయి.
పోలవరం నిర్వాసితులకోసం
జీవనసౌందర్యాన్నే నిర్మించగల
ఈ కవి హృదయం
ఒక సూర్యుడు
ఒక నది.

కలైమామణి పి.ఆర్.ఎల్. స్వామి



7 comments:

  1. కలైమామణి గారి దస్తూరి చాలా అందంగా ఉంది!

    ReplyDelete
  2. అరుదైన ఈ గౌరవాన్ని దక్కించుకున్న మీరు సాహితీ భాగ్యవంతులు బాబాగారు. మాతో మీ ఆనందాన్ని పంచుకోవటం మాకూ సంబరం.

    ReplyDelete
  3. విన్నూత్నంగా వుంది స్వామి సమీక్షాభినందన ..!

    ReplyDelete
  4. baabaa garu!
    prl.swamy ichchina kavana pushpaguchcham andukunaa meeru chaala lucky fellow. prati akshram premaga palakarinchi gunde nindaa parimalinchayee. prl.swamy naaku manchi kavi-mitrudu. mee iddarikee abhinandanalu.

    ReplyDelete
  5. చక్కటి సంతకం... రాసిన వారికి, రాయించుకున్నవారి ఇద్దరి కవితా సౌరభాలను వెదజల్లుతూ.... చదివే మా మనసులను కూడా మంచి అనుభూతినిస్తూ..

    ReplyDelete
  6. స్పందించిన అందరకూ పేరు పేరునా ధన్యవాదములు.

    ReplyDelete
  7. మీకు నా హృదయపూర్వక అభినందనలు

    ReplyDelete