Sunday, January 24, 2010

ఫ్రాగ్మెంట్స్ 5

1.
నేల సంకెళ్లను
నిత్యం తడుముకుంటూనే
వెలుగును తరుముకుంటూ
నీలాకాశం లోకి చొచ్చుకొని
పోతూంటాయి తరువులు.

చెట్టుని మించిన
వ్యక్తిత్వ వికాస పుస్తకం ఏది?

2.
జీవితం అతని మోముపై
నర్తించి నర్తించి
అలసిపోయింది.
ఆ ముఖంపై ముడుతలన్నీ
దాని పాదముద్రలే.

3.
ఒక్క ప్రార్ధనతో
ఈ గాజుపెంకులు
తొలగిపోతాయంటే
ఆత్మను కొవ్వొత్తిలా
మండించటానికి
నెనెప్పుడూ తయారే!

కానీ బెల్లు నొక్కితే
ఈశ్వరుడు ప్రత్యక్షమౌతాడా?

4.

అందరూ ఏదో ఒకనాడు
సూదిబెజ్జంలోంచి సాగాల్సిందే
వెలుగులోకో, చీకట్లోకో!

ఆ దినాంతాన
ఇచ్చిన వాటిని
పంచావా అంటే
ఏం చెప్పాలీ?


5.
తేనెటీగ కుట్టిన బాధలో
నాకు గుర్తుకే రాలేదు
అది కాసేపట్లో
అది చచ్చిపోతుందని.


భవదీయుడు
బొల్లోజు బాబా

7 comments:

  1. మొదటి పాదం సిరివెన్నెల గారి "మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది" పాటని గుర్తుకి తెచ్చింది.

    కొన్ని నిర్మాణాలు బాగున్నాయి. కొన్ని వాక్యాలు మీరింకా బాగా వ్రాయగలరనిపించింది...

    బాగున్నవి - ఉదా:
    ఆ ముఖంపై ముడుతలన్నీ
    దాని పాదముద్రలే.

    కాస్త మార్పుగా వ్రాస్తేనో అనిపించినవి: ఉదా:

    కానీ బెల్లు నొక్కితే
    ఈశ్వరుడు ప్రత్యక్షమౌతాడా?

    అది కాసేపట్లో
    అది చచ్చిపోతుందని.
    ఎదిగినా ఒదగాలి

    ReplyDelete
  2. బాబా గారూ!

    మొదటిది చదవగానే నాకు సిరివెన్నెల పాట స్వర్ణ కమలం లో శివ పూజకు పాటలో "తన వేళ్ళే సంకేళ్లయి కదలలేని మొక్కలా" లైన్ గుర్తొచ్చింది.

    నాకు రెండు, అయిదు కొత్తగా అనిపించాయి. బావున్నాయి.

    మూడు , నాలుగు అర్థం కాలేదు.

    అయిదవ దాంట్లో ఒక "అది" ఎక్కువగా వాడారు టైపో నేమో.



    @ ఉష: " మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో " పాట చంద్ర బోస్ అండీ సిరివెన్నెల కాదు.

    ReplyDelete
  3. 3,4 అర్ధం చేసుకోవడానికి నా కవి హృదయం సరిపోలేదండీ. 2,5 చా బాగా నచ్చాయి. ఐదోదైతే నా చిన్న నాటి సంగతులను గుర్తుతెచ్చింది. నా చిన్ననాటి ఫ్రెండ్ ఒకతను ఇలాగే అనేవాడు.

    ReplyDelete
  4. మీ సూఫీ తత్వాన్ని కవిత్వంలో నిండుగా ఒలికించారు. 3, 4, వాటికి పరాకాష్ఠ. చివరి అంకంలో జవావు చెప్పగలిగే వారు కొద్దిమందే. తేనెటీగను కోరికకు ఉపమానంగా వాడారు కదా? రెండో 'అది' ఎందుకు సార్? ఏదో వుందనిపిస్తోంది....

    ReplyDelete
  5. ఆలస్యానికి మన్నించాలి.

    ఉష గారికి
    థాంక్సండీ.
    మీ సూచనకు ధన్యవాదాలండీ.

    మానస సంచర గారు
    అయిదవదాంట్లో ఒక అది ఎక్కువవటం టైపో అండి.

    మినర్వాగారూ వర్మగారి కామెంటు చూసారా.
    వర్మ గారూ థాంక్సండీ :-)

    బొల్లోజు బాబా

    ReplyDelete
  6. మన్నించాలి. 4 నాకర్ధమయ్యింది ఇది "అందరమూ ఏదో ఒకప్పుడు నశ్వరమవ్వాల్సిందే (శరీరాన్ని విడవాల్సిందే)... " ఇక 3 మాత్రం ఊహు... మొదటిపాదానికి రెండవపాదానికి సంబంధం అర్ధం కాకుండా వుంది.

    ReplyDelete
  7. మినర్వా గారికి
    నమస్తే
    మూడవ ఫ్రాగ్మెంటు లో నేనుద్దేసించింది ఇది
    ఈశ్వరుడు సర్వాంతర్యామి. ఆయనకు అన్నీ తెలుసు. మన మంచి చెడ్డలు, మన కష్టసుఖాలు ఆయన ప్రసాదాలే. అలాంటప్పుడు నాకీ పని చేయి ఆపని చేసిపెట్టు నీకు అది చేస్తాను ఇది చేస్తాను అని మనం ఆయనను కోరటం పై నాకున్న అభిప్రాయం ఈ ఫ్రాగ్మెంటు.

    ఒక్క ప్రార్ధనతో ఈ కష్టాలు తొలిగిపోతాయంటే నన్ను నేను దహించుకొవటానికైనా సిద్దమే. కానీ ఈశ్వరుడేమైనా మన క్రింద పనిచేసే సేవకుడా, అలా బెల్లు (ప్రార్ధనో లేక ఆత్మ దహనమో) కొట్టగానే ప్రత్యక్ష్యమవటానికి?
    hope you got me.

    మీ కామెంటుకు ధన్యవాదములు

    బొల్లోజు బాబా

    ReplyDelete