సూర్యుడు, నదీ
కొండల పంజరంలో
చిక్కుకొన్న గానుగెద్దులు..
ఒకటే దారి, ఒకటే గమ్యం.
దేహాలతో వచ్చిన చిక్కే ఇది.
అదే హృదయాన్ని చూడు.
ఎంత విశృంఖల విహారియో.
అన్నిదారులూ తనవే
అన్ని గమ్యాలూ తనకే.
హృదయం ఆలోచనలను
కాలంలోకి ప్రవహింపచేస్తూంటుంది.
స్వప్నాలను బలంగా
వెలుగులోకి తోసే రాత్రిలా.
చేయాల్సిందల్లా
హృదయాన్నినిత్యం కొలిమిలో
జ్వలింపచేసుకోవటమే.
లేదూ
తూనీగై మబ్బుల్ని ముద్దిడిన ఉదయంలా
రాలిపోనూవచ్చు లేదా
పండులా ఫలించిన సాయింత్రమై
పగిలిపోనూ వచ్చు.
రాలిపోయే ఆకుల సవ్వడిని
నిశ్శబ్దం కూడా గుర్తించదు.
బొల్లోజు బాబా
రాలిపోయే ఆకుల సవ్వడిని
ReplyDeleteనిశ్శబ్దం కూడా గుర్తించదు...
Your trademark line...wonderful!
బాబా గారు మీకు కవిత్వం పూనిందా ఏవిటి. ఆ పూనికకి మీరే మంత్రం చదివేరో ఆ మంత్రం మాక్కూడా చెప్పొచ్చుకదా! ఇట్లా అదరగొట్టేస్తున్నారు. చాలా బాగుంది సార్ ఈ కవిత.
ReplyDeleteకానీ బాబా గారు రాలి పొయ్యి, పగిలిపోవటంలోనే కదా హృదయం జ్వలిస్తుంది.
రవికిరణ్ తిమ్మిరెడ్డి.
వ్యాఖ్యానించనగ నాకు మాటలు కరువైపోయాయి. కానీ అలా మండే గుండె వుంటేనే కదండి జ్వాలలై జ్ఞాపకాలు తగలబడేది, చల్లారిన హృదయం మళ్ళీ రాజుకునేవరకు రాజిల్లేదీను.. జ్వలనం చలనం తనవే..
ReplyDeleteఏంటో బాబాగారు, ఇప్పుడు మీరు వ్రాసిన ఏ కవిత్వం చదువుతున్నా అనువాద కవిత్వం చదువుతున్నట్లుంది. అనువాదాలు చేసీ చేసీ మీ శైలి మారినట్లు అనిపిస్తున్నది. మంచి భావాలు ఉన్నా కూడా, మొదటి ఖండిక తప్పించి మిగిలినవన్నీ వాక్యాలుగా వ్రాసేసారు. కామెంటు నచ్చకపోతే డిలీట్ చేసేయండి.
ReplyDeleteగిరీష్ గారూ
ReplyDeleteఅంతే నంటారా. థాంక్యూ
రవికిరణ్ గారూ
ఆ మంత్రమేమిటో కవితలో చెప్పాసాననే అనుకొంటున్నాను. :-))
కానీ బాబా గారు రాలి పొయ్యి, పగిలిపోవటంలోనే కదా హృదయం జ్వలిస్తుంది
అవును విడిగా తీసుకొంటే అంతే. కానీ కవితలోని కంటిన్యూటీ ని గమనిస్తే, అంతోటి సూర్యుడే గానుగెద్దయినపుడు, ఉదయాస్తమయాలు ఆ ఎద్దుకు తలా తోక కాక మరేం కాగలవూ? పుట్టటం చావటాలనేవి ఉదయాస్తమయాలంత భౌతికాలే, కానీ హృదయం ఉత్పత్తి చేసే ఆలోచనలు అలా సాగుతూనే ఉంటాయి కాలంలాగ. ఒక సోక్రటీస్ వో, ఒక కాళిదాసువో. మట్టిలోంచి వచ్చిన దేహాలు మాత్రం మట్టిలో కలసిపోతూంటాయి, ఎగసి కింద పడిన సూర్యబింబంలా.
ఉషగారూ
థాంక్యూ
సాయికిరణ్ గారూ
కామెంటు నచ్చకపోవటమేమిటండీ. దివ్యంగా ఉంటే. నన్నేమీ తిట్టలేదు కదా. హేపీనే.
ఇక మీరన్న అభియోగం,
కావొచ్చు. కాదనటం లేదు. ఆ మాత్రం ప్రభావం ఉంటాది లెండి.
ఇక కవితకు సంబందించినంత వరకూ పై వివరణ చూసారు కదూ!
మీబోటి వారు చెపితే తెలుస్తుంది. థాంక్యూ.
బొల్లోజు బాబా