Saturday, August 22, 2009

సూఫీ కవిత్వం -- చివరి పార్టు

ఇతర సూఫీ కవులు

సాదాలుద్దిన్ మహ్మద్ షాబిస్తరి (1250-1320) ప్రముఖ సూఫీ కవి.

నీ హృదయమందిరాన్ని శుబ్రం చేయి.
నీ ప్రియవిభుని నివాసానికై దానిని సిద్దంచేయి.
నీవు దానినుండి బయటకు వస్తే ఆయన లోపలకొస్తారు.
నిన్ను నీవు ఖాళీ చేసుకో. ఆయన తన సౌందర్యాన్ని చూపిస్తారు.



రబియా అల్ అదావియ్యా 717-801) ప్రముఖ సూఫీ కవయిత్రి. తలితండ్రులు చిన్నతనంలోనే చనిపోవటంతో, రబియా బానిసత్వంలోకి నెట్టబడింది.

చాలాకాలంపాటు తన యజమానికి ఊడిగం చేసిన తరువాత రబియా, తన ఆలోచనలను, చర్యలను ఈశ్వరునివైపుకు మళ్లించుకొని గొప్ప సూఫీ కవయిత్రిగా నిలిచి, అనేక రచనలు చేసారు

తన నిబద్దత, విశ్వాసాలకు చలించి, రబియాను బానిసత్వం నుంచి విముక్తురాలిని చేసాట్ట యజమాని.


1.
నేను నిన్ను రెండు విధాలలో ప్రేమిస్తూంటాను.
ఒకటి స్వార్ధ ప్రేమ. మరొకటి ఎంతో విలువైనది.
స్వార్ధ ప్రేమలో నేను నిన్నే స్మరిస్తూంటాను.
రెండవదానిలో
నీవు తెర తొలగిస్తావు. నీ సుందర మోమును
కన్నుల పండుగగా నేనలా చూస్తూ ఉండిపోతాను.
---- రబియా

2.
ప్రభూ!
నిను నా హృదయ వల్లభునిగా చేసికొన్నాను.
కానీ నా దేహం మాత్రం తనను కోరుకొనే వారికి అందుబాటులో ఉండి
తన అతిధితో స్నేహిస్తూంటుంది.
నా హృదయవల్లభుడే నా ఆత్మకు అతిధి.
--- రబియా

నూరుద్దీన్ దిన్ అబ్దర్ రహ్మాన్ జామీ (జామీ) 1414-1492)

ఓ సాకి
ఒక మధుపాత్రిక నిచ్చి నాపై దయచూపు.
నాలోకే నేను పూర్తిగా కూరుకుపోయాను
ఒక్కసారి నానుంచి నన్ను విడుదల చేయవూ!
నేనెవరి కంటా పడకూడదనుకొంటాను
ప్రేమ తాలూకు పొగమంచు కమ్ముకొన్న ఆ అద్బుత క్షణం లో నాకు నేనే కనిపించకూడదనుకొంటాను.
ప్రభూ
నీకూ నాకూ మధ్య నేను తప్ప మరే తెరా లేదు
దయతో ఈ తెర తీయగ రావా.
జీవి జీవాన్ని ఎక్కడైతే పొందుతుందో
అట్టి శూన్యత్వాన్ని దర్శింపచేసే మహిమను
తెలియచేయవా, మిత్రమా
జామీ,
ప్రేమ నీ అన్ని అనవాళ్లనూ చెరిపేసేవరకూ
నీలో ఉండే నిన్నుని పూర్తిగా కడిగివేసేవరకూ
ఆద్యంతరహితమైన జీవితం నీకు సుదూరమే.
ప్రేమ విస్తరించుకొని ఉండేది స్థల, ప్రాంతాలలో కాదు.
ఈ ప్రదేశాలు, దేశాల నుండి బయటకు
పడే దారిని అన్వేషించు.

---- జామీ (ఈ కవితను అనువదించటంలో సూచనలు ఇచ్చి, సందేహాలు తీర్చిన శ్రీ భైరవభట్ల గారికి కృతజ్ఞతలు తెలియ చేసుకొంటున్నాను)

షిరాజ్ 1215-1292) పర్షియాకు చెందిన గొప్ప సూఫీ కవి. రోజ్ గార్డెన్, ఆర్చార్డ్ వంటి ప్రముఖ రచనలు చేసారు.

ఉదయవిహంగమా!
చిమ్మెటను చూసి ప్రేమించటం నేర్చుకో.
అది దహించుకుపోయింది. జీవితాన్ని కోల్పోయింది.
నిశ్శబ్దమైపోయింది.
ఈ వేషగాళ్లు ఆయనను అన్వేషిస్తున్నారు, అజ్ఞానులు.
జ్ఞానాన్ని పొందినవారెవరూ తిరిగి రాలేదు మరి.
---- షిరాజ్

*******************

సూఫీ కవిత్వం పేరుతో నే చేసిన ఆయా కవుల అనువాదాలను చదివి, తమ అమూల్య అభిప్రాయాలు తెలియచేసి, ప్రోత్సహించిన వారందరకూ ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

భవదీయుడు

బొల్లోజు బాబా

2 comments:

  1. బాగున్నాయండి. మనసులోకి ఇట్టే చొచ్చుకొచ్చినవివి...
    "నీవు దానినుండి బయటకు వస్తే ఆయన లోపలకొస్తారు."
    "నా హృదయవల్లభుడే నా ఆత్మకు అతిధి.":
    "ప్రేమ నీ అన్ని అనవాళ్లనూ చెరిపేసేవరకూ
    నీలో ఉండే నిన్నుని పూర్తిగా కడిగివేసేవరకూ
    ఆద్యంతరహితమైన జీవితం నీకు సుదూరమే."

    మరిక సంకలంగా తెస్తారా?

    ReplyDelete
  2. మీరు వాడిన భాష హృద్యంగా ఉంది మాస్టారు ... ఆయన పట్ల మీ ప్రేమ పదాల్లో కొట్టొచ్చినట్టు కనపడింది నాకు... చాల విషయాలు తెలుసుకున్నాను ఈస్మయిల్ గారి గురించి...
    హృదయ పూర్వక నమస్కారాలతో
    నరసింహ మూర్తి
    murthy.mse@gmail.com

    ReplyDelete