Wednesday, August 5, 2009

వేడుక (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)


ఓహ్ ఈ చిట్టి పరికిణీకి రంగులంటించింది ఎవరోయీ?
ఓ బుజ్జాయీ! నీ చిన్నారి చేతులకు ఎరుపు రంగు అంటుకున్నదేమీ?

ఈ తోటకు ఉదయాన్నే ఆడుకోవటానికి
చెంగు చెంగున పరుగులిడుతూ వచ్చినావు. ఇంతలోనే
ఈ పరికిణీకి రంగులంటించింది ఎవరోయీ? నా చిట్టి తల్లీ.

నా చిన్నారి మొగ్గా! నీకు నవ్వెందుకు వస్తున్నదోయీ?
గడపవద్ద నుంచుని అమ్మ నిను చూసి నవ్వుతున్నది.

చిన్నారి గొర్రెల కాపరిలా ఓ కర్ర చేతబూని నీవు చేసే నాట్యానికి
అమ్మ చప్పట్లు కొడుతూంటే, ఆమె చేతి గాజులు గలగల మంటున్నాయి.

నా చిన్నారి మొగ్గా ఎందుకు నవ్వుతున్నావోయీ?

అమ్మ మెడకు రెండు చేతులతో వేళ్ళాడుతూ
ఏమి యాచిస్తున్నావోయీ? ఓ చిట్టి యాచకా!

ఈ ప్రపంచాన్ని, ఆకాశం నుంచి కోసిన ఒక ఫలంగా చేసి
నీ చిట్టి గులాబి దోసెట్లో ఉంచితే, నీ తనివి తీరేనా?

ఏమి యాచిస్తున్నావోయీ? ఓ చిట్టి యాచకా?

నీ కాలి మువ్వల గలగలలను గాలి ఆనందంగా మోసుకు పోతోంది.

నువు దుస్తులు మార్చుకోవటం సూర్యుడు నవ్వుకుంటూ చూస్తున్నాడు.
నీవు నీ తల్లి ఒడిలో నిదురించే వేళ అంబరం పైనుంచి గమనిస్తోంది.
ఉదయం నిశ్శబ్ధంగా నీ మంచం వద్దకు చేరి నీ కళ్ళను ముద్దిడి సాగుత్దోంది.

నీ కాలి మువ్వల గలగలలను గాలి ఆనందంగా మోసుకు పోతోంది.

వెన్నెలాకాశంనుండి స్వప్నమోహిని ఎగురుకుంటూ, నిను చేర వస్తున్నది.
నీ తల్లి హృదయంలో నీ పక్కనే లోక మాత ఆశీనురాలయింది.

తారాలోక గాయకుడు నీ కిటికీ వద్ద, చేతవేణువు ధరించి నిలుచున్నాడు.

వెన్నెలాకాశం నుండి స్వప్న మోహిని ఎగురుకుంటూ నిను చేరవస్తున్నది.


బొల్లోజు బాబా

మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని THE UNHEEDED PAGEANT గీతం

2 comments:

  1. బాగున్నదండి.

    ReplyDelete
  2. "ఈ ప్రపంచాన్ని, ఆకాశం నుంచి కోసిన ఒక ఫలంగా చేసి
    నీ చిట్టి గులాబి దోసెట్లో ఉంచితే, నీ తనివి తీరేనా?"
    బుజ్జాయి కు ఏమో కాని అమ్మకు మాత్రం తనివి తీరదు..
    చిన్నారి మొగ్గ తువ్వాయల్లే చెంగున గంతులు వేస్తుంటే ప్రకృతే తల్లై, తల్లి ప్రకృతిలో లీనమై తన తల్లితనానికి తనే మురిసే ఆ అధ్బుత క్షణాలను మా కోసం మా కంటి ముందుకు తెచ్చిన మీకు నా హృదయపూర్వక అభినందనలు.

    ReplyDelete