Monday, May 18, 2009

శిశువు రీతి - (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

శిశువు తలచుకొంటే
క్షణమే స్వర్గానికి ఎగురుకుంటూ పోగలడు
.
మనలను విడువకపోవటం మరెందుకోకాదు.
తల్లి చనవులపై తలాన్చి పరుండటం తనకెంతో ఇష్టం కనుక.
ఆమె వియోగాన్ని భరించలేడు కనుక.

శిశువుకు ఎన్నెన్ని గొప్పమాటలు తెలుసో!
కానీ వాటికి భాష్యం చెప్పగలిగేది కొద్దిమందే
.
తను మాట్లాడాలనుకోకపోవటం మరెందుకో కాదు.
మాతృభాషను ఆమె పెదాలనుండే నేర్చుకోవాలని.
అందుకే అతడు ఏమీ ఎరుగని వానివలే అగుపిస్తాడు.

శిశువు పసిడి ముత్యాలకధిపతియైనప్పటికీ
లోకంలోకి ఒక యాచకుని వలే అరుదెంచాడు.
అట్టి మారు వేషం మరెందుకో కాదు.
చిన్నారి దిశమొల యాచకుడై నిస్సహాయత నటిస్తూ,
తల్లి ప్రేమ నిధిని పొందటానికే
.

చిరునెలవంక లోకంలో శిశువు విశృంఖల విహారియే!
తన స్వేచ్ఛను త్యజించింది మరెందుకో కాదు.
తల్లి హృదయాంతరాళంలో అనంతమైన ఆనందమున్నదనీ
ఆమె బాహువులలో ఒదిగి అదుముకోబడటం
స్వేచ్ఛకన్నా మధురమనీ తెలుసుకనుక.

బ్రహ్మానందలోకంలో ఉండేపుడు శిశువుకు ఏడవటమే తెలియదు
కానీ ఇపుడు కన్నీరు చిందించటం మరెందుకో కాదు.
శిశువు తన రోదనలతో దయ, ప్రేమ బంధాలను అల్లుకుంటూ
తనబోసినవ్వులతో అమ్మ కరుణాహృదయాన్ని తనవైపుకు ఆకర్షించటానికే.

మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని
BABY'S WAY
అనే గీతం

2 comments:

  1. అట్టి శిశువుని కన్న అమ్మ కన్నా భాగ్యవంతులెవరిక? ఆ అమ్మ లోని నిధులు వెదుక్కోవటానికి, అమెలో దాగున్న సాగరాల మధనం చేయటానికే కదా ఆ జననము, ఆ ఆగమనమూను. ఎంతడి అద్భుతమీచిత్రీకరణ, శిశుపరంగా మాతృమూర్తిని వున్నతంగా అన్యాపదేశంగా వర్ణించటం.

    ReplyDelete
  2. ఇక్కడ చూడండి!
    బొద్దు bold

    ReplyDelete