Sunday, October 26, 2008

పల్లె కన్నీరు వినిపించిన శ్రీ గోరటి వెంకన్నకు వందనాలు


పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల....... అన్న పాటను శ్రీగోరటి వెంకన్న బహుళ జాతి కంపనీలు ఏవిధంగా పల్లెపల్లెలకు విస్తరించి అక్కడి జీవన విధానాన్ని, వృత్తుల్ని ఎలా ఛిద్రం చేసాయో చాలా ఆర్ధ్రంగా, వింటున్నప్పుడు భావోద్వేగానికి లోనై కన్నీరు జాల్వారే విధంగా వ్రాసారు.
ఈ పాట నిండా ఆయన తీసుకొన్న ప్రతీకలు,సామ్యాలు, వాడిన పదాలు పాటలోని వస్తువుకు గొప్ప బలాన్ని, స్ఫష్టతను చేకూర్చి చెప్పే విషయం శ్రోతకు చాలా సూటిగా చేరేలా చేస్తాయి.

మానవతా విలువలకు, స్వావలంబనకు ఆలవాలంగా ఉండే పల్లెలు నేడు సామ్రాజ్యవాద విస్తరణ ఫలితంగా తన స్వతంత్రతను, స్వచ్చతను కోల్పోయి, ఎవరిపై ఆధారపడకుండా ఇంతవరకూ బ్రతికిన తనబిడ్డలు వృత్తులు కోల్పోవటంతో పరాయి పంచన బతుకుతుండటాన్ని చూస్తూ ఈ విశాల భారత దేశంలోని ఒక పల్లె కన్నీరు పెడుతుంది, అంటూ గొప్ప ఎత్తుగడతో ఈ పాట మొదలౌతుంది. బహుళ జాతి కంపనీల విస్తరణను, సామ్రాజ్యవాదాన్ని ఈ కవి ఇక్కడ కనిపించని కుట్రలు గా వర్ణిస్తాడు. చేతి వృత్తుల చేతులిరిగిపోవటం వల్ల గ్రామ స్వరాజ్యం గంగలోన కలిసి పోయిందని బాధపడతాడు.

కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను
కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను
పెద్దబాడిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగులిరిగినవి.

లోహ పాత్రల ఇంద్రజాలంతో కుండల వాడకం మాయమైపోయింది . కుమ్మరి వాళ్ళు మట్టి పిసుక్కునే వామిలో తుమ్మలు మొలిచాయి అని అనటం ద్వారా వారు పని లేక చాలా కాలంగా ఉంటున్నారన్న విషయాన్ని కవి చాలా కరుణ ఉట్టిపడేలా చెపుతాడు.
నాగళ్ళ ఆరులు, కొడవల్ల కక్కులు, బండి వరలు, చేసే కమ్మరికి పనిలేక కొలిమిలో దుమ్ముపేరుకొంది పెద్ద బాడిస మొద్దుబారింది అనటంలో ఆకులం ప్రస్తుతం అనుభవిస్తున్న దైన్యం కళ్ల ముందు నిలుస్తుంది.
సాలెల మగ్గం కీళ్ళు విరిగి మూలకూర్చున్నదట. ఉపాధి మూలకూర్చున్నప్పుడు ఆత్మాభిమానం కల కుటుంబపెద్దకు ఆత్మహత్య మినహా మరో మార్గం కనిపించకపోవటం అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి.

మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరైనవి
వాగులు వంకలు ఎండిపోయినవి
చాకలి పొయ్యిలు కూలిపోయినవి
పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది
మరి పేద రైతు బావులెందుకెండే నా పల్లెల్లోనా

పల్లెలకు ప్రధాన ఆధారం వ్యవసాయం. అటువంటి వ్యవసాయంలో పెద్ద చిన్న రైతుల మధ్య తేడా ఈ పాదంలో చూడవచ్చును. బలిసిన దొరల పెద్దబోరు పొద్దంతా నీటిని భూమిలోతుల్లోంచి తోడుతున్నప్పుడు, చిన్నరైతు సేద్యానికుపయోగపడే బావులు, వాగులు వంకలు, మడుగులు తమ కళను కోల్పోయాయట. వీటిపైనే ఆధారపడే చాకలివానికి కూడా గడ్డుకాలమొచ్చింది అని కవి చెపుతున్నాడు. ఆ వాక్యంలో కూలిపోయినవి అన్న ఒక్క పదంద్వారా ఎంతటి విషాదాన్ని కవి పలికించాడో గమనించవచ్చు.

చల్లని బీరు విస్కిలెవడు పంపె నాపల్లెల్లోకి
బుస్సున పొంగె పెప్సికోల వచ్చె నాపల్లెల్లోకి

పల్లెల్లో ఆటవిడుపుకోసం సేవించే కల్లుల స్థానంలో కల్తీకల్లు, బీర్లు, విస్కీలు, పెప్సీలు వచ్చిచేరాయి అనటంలో స్థానిక వనరుల విస్మరణ, కంపెనీల విస్తరణ, బలిసిన దొరలకే ధనం చేరుకోవటం వంటి విషయాల పట్ల కవి ఆవేదన చెందుతున్నాడు.

పరకచేపలకు గాలం వేసే తురకల పోరలు యాడికి పోయిరి
లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా
ఆ సాయిబు పోరలకు ఆ బేకరి కేఫ్ లలో ఆకలితీరిందా?

ఈ పాదంలో కవి సాయిబు పోరలని వర్ణించినా ఆ పోలికలన్నీ గ్రామాల్లో కాలువలలో, చెరువులలో, చేపలు, రొయ్యలు పట్టుకొని జీవనాన్ని సాగించే పల్లీయులకు కూడా వర్తిస్తుంది. రొయ్యల, చేపల పెంపకం, పెద్ద పెద్ద మరబోట్ల తో ఫిషింగ్ రంగాల్లోకి బడా స్వాములు కాలూనటంతో, ఈ పల్లీయులు కూడా చాలా చోట్ల ఉపాధి కోల్పోయి చెల్లా చెదురైనారు. తల్లికీ, ఊరికీ దూరంగా ఉన్న ఆ పోరలు తమ ఆకలి రొట్టెముక్కలతో తీర్చుకొన్నారా అయ్యో! వాటితో వారాకలి తీరిందా అని ప్రశ్నించడం, మూలాలు మరువని కవి, తడిని కోల్పోని మనిషి మాత్రమే చేయగలడు.

అరకల పనికి ఆకలిదీరక గాసమెల్లక
ఫర్నీచరు పనులెదుక్కుంటూ పట్నంపోయర విశ్వ కర్మలూ
ఆసామూలంతా కూసూనేటి, ఆ వడ్రంగుల వాకిలి
నేడు పొక్కిలి లేసి దు:ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా

పల్లెల్లో వ్యవసాయాధారిత మరో కులం వడ్రంగి కులం. వీరు నాగళ్లు, బళ్లు చేస్తూ జీవిస్తూంటారు. పల్లే బావురుమంటున్నప్పుడు వీరికి పల్లెల్లో పని లేక ఫర్నీచరు పనులు, తాపీ పనులను వెతుక్కుంటూ పట్నాలకు వలసపోయారన్న విషయాన్ని కవి చెపుతున్నాడు.
ఆ సామూలంతా కూసూనేటి అన్న వాక్యం లో పోతులూరి వీరబ్రహ్మం పోలిక తీసుకు రావటం కవికి వారిపై కల అభిమానంగా అనుకోవచ్చు. వాకిలి పొక్కిలి లేసిందనటంలో గొప్ప పదచిత్రాన్ని గమనించవచ్చును.

కుట్టుడు రెక్కల బనీన్లుపోయినవి , సోడె లాగులు జాడకు లేవు
రెడిమెడు ఫాషను దుస్తులొచ్చెనంటా నాపల్లె పొలిమెరకు
ఆకుట్టుమిషన్ల చప్పుడాగినాదా నాపల్లెల్లోనా.

పల్లెల్లో టైలర్ పాత్ర ఒకనాడు ఎలా ఉండేదో, పదిమందికి తలలో నాలుకలా ఎలా ఉండేవాడో వంశీ లేడిస్ టైలర్ సినిమాలో చూడవచ్చు (కామెడీ కోణాన్ని పక్కనపెట్టి). అలాంటి టైలర్ ఈ రోజు రెడిమెడు దుస్తులు పల్లెల్లోకి కూడా చొచ్చుకు పోవటం వలన వాని పాత్ర కుచించుకుపోయింది. రెక్కల బనీన్లు, సోడెలాగులు (పిక్క లాగులు) ఇప్పుడు వాడేవారేరి? ఆ నేపధ్యంలో కుట్టుమిషన్ల చప్పుళ్ళు ఆగిపోయాయని కవి చెపుతున్నాడు.

కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి
చెన్నై బాంబె కంపని నగలొచ్చి మనస్వర్ణ కారుల,
అరె చెర్నకోలలై తరుముతున్నయీరా మనపల్లెలనుంచీ.

ఈ మద్య కాలంలో బయలు దేరిన ఒక విచిత్ర పరిణామమిది. చెన్నై బాంబేల నుంచి కంపనీ నగలను సేల్స్ వ్యక్తులు తీసుకువచ్చి, అమ్మి పెట్టమని స్థానిక వ్యాపారస్తుల కప్పగించి, వాయిదాల పద్దతులలో డబ్బు వసూలు చేసుకుంటూంటారు. వాటిలో బంగారమెంతుంటుందో దేముడికే తెలియాలి. ఈ సేల్స్ వ్యక్తులు కూడా స్థానికంగా పాతుకుపోయిన డబ్బున్న వ్యాపారులనే తప్ప సామాన్య జీవనం గడిపే స్వర్ణ కారులను నమ్మరు. మరి అలాంటి నగలు చెర్నాకోలలై స్వర్ణకారులను తరుముతున్నప్పుడు, వీరు పల్లెల్ని విడిచి పట్నాలలో కూలిపనులు చేసుకొంటున్నారు. కొంతమంది పల్లెల్ని వీడలేక, కూలిపనులు చేయలేక వారు వృత్తి పరంగా ఉపయోగించే ద్రావకం లేదా సైనేడ్ లను తాగి ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.
ఇక పట్నాలలో అయితే మరొక పద్దతి. Exchange Offer లతో పెద్ద పెద్ద షాపులు, "మీరీరోజు ఎంత బంగారమైతే కొంటారో, దాన్నిచ్చేసి అంతే బరువున్న మరొక వస్తువుని మీరెప్పుడైనా వచ్చి పట్టుకు వెళ్ళొచ్చు" అంటూ కొనుగోలుదారుడిని ఆకర్షిస్తూంటాయి.
ఇలాంటి పరిస్థితులలో, బంగారం తీసుకొని వారం తరువాత వస్తువిస్తాననే పేద కంసాలినెవరు నమ్ముతారు?
కూలిపోయిన స్వర్ణకారుల వృత్తిని కవి ఇక్కడ చాలా ఆర్ధ్రంగా ఆవిష్కరించాడు.

మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది
తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంప పదునారిపోయినది.

కవి స్వయంగా మాదిగ కులానికి చెందినవాడవటం వలన (తప్పయితే కరక్ట్ చేయండి) ఆకులం ఎలాచితికి పోయిందో గొప్ప ప్రతీకలతో కళ్లముందు నిలుపుతున్నాడు. నోరుతెరవటం చావుకు చిహ్నం,భంగపడటం అవమానానికి, నిండమునగటం మరలా చావు/ఓటమికి చిహ్నం, పదునారిపోవటం పూర్వవైభవాన్ని కోల్పోవటం. బాటాలు, లోటో ల దాడిలో ఆ వృత్తికి చెందిన వివిధ పరికరాలు పనుల్లేక ఏవిధంగా తల్లడిల్లుతున్నాయో అద్బుతమైన పదచిత్రాలతో కవి ఎంతో ఆర్ధ్రంగా చెప్పాడు.

పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు
నా మేదరి డప్పును పాతరేసె కదరా? నాపల్లెల్లోనా.

తోలు డప్పు స్థానంలో ప్లాస్టిక్కు డప్పు వచ్చి దాన్ని పాతరేసిందని చెప్పటం. పాతరేకు, పాతరేసి అన్న మాటలలో ధ్వని సౌందర్యం కంటే హింసాత్మక ముట్టడే ఎక్కువ వినిపిస్తుంది.

పూసలోల్ల తాలాము కప్పలు, కాశిలో కలసి ఖతమౌతున్నవి.
అంటూ పూసలోళ్ల జీవనోపాధి ఏవిధంగా ఆవిరయ్యిందో కవి ఆవేదనచెందుతాడు.


ఇల్లు కట్టుకొనె ఇటుకల రాయితో, సెలకల చల్లె ఎరువుకుళ్లుతో
ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది
టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని
నా ఎద్దు బండి గిల్లెగిరిపడ్డదో నా పల్లెల్లోనా.

పల్లెటూర్లలో ఎద్దుబండి ఉన్నదంటే పాటలో చెప్పినట్ట్లు ఏడాదంతా పని దొరిదేది. అన్ని కాలాలలోనూ పనులుండేవి. ఇటుక, దాయ, పెంట తోలటం (ఇంటివద్ద పోగుపడిన పెంట అమ్ముకోవటం), అరకదున్నటం, ధాన్యం తోలటం, కుప్పనూర్పుళ్లు వంటివి. ఏ కాలానికి తగ్గ పనులు ఆ కాలంలో చేసుకుంటూ ఆ యజమాని తన కుటుంబాన్ని గౌరవంగా నడుపుకొనేవాడు. కానీ టాటా ట్రాక్టరు వచ్చి దీన్ని గుద్దితే ఈ బండి ఎగిరిపడ్డదట. ఆ పడ్డంలో ఒక కుటుంబం దాని క్రిందపడి చితికి పోయిందన్న విషయాన్ని కవి మనముందుంచుతాడు.

వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ అన్న ప్రశ్నకు పంటపొలాల మందుల చెత్తర వాసన అని చెపుతూనే అప్పు రైతు మెడమీద కత్తై కూర్చుంది అంటు రెంటికీ ఒక అవినాభావ సంబంధాన్ని చాలా అద్బుతంగా ఆవిష్కరిస్తారు. ఈ నేలపై ఆర్ధికంగా బలహీనమైన వారు బ్రతికే నెలవును కోల్పోతున్నారన్న సత్యాన్ని అద్భుతమైన ఉపమానంతో కవి ముడిపెడతాడు.

హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది
యక్షగానము నేర్పేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు.
యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిలచి
ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమపొట్టకూటికై

బతుకమ్మా, కోలాటపాటలు, భజన కీర్తనలు బైరాగుల
కిన్నెర తత్వమ్ములు, కనుమరుగాయెర నాపల్లెల్లో

పల్లెల్లో పల్లవించే జానపద కళలు ఎలా అంతరించిపోయినయో కవి కన్నీరొలికించేలా ఇక్కడ వర్ణిస్తాడు. హార్మోనియం చెదలు పట్టిందట, యక్షగాన పంతులు ఉప్పరి పని చేసుకొంటున్నాడు, తమ కళకు పోషణ లభించక. బుడగ జంగాలు పాతబట్టలమ్ముకుంటున్నారట. ఎందుకంటే పల్లె మొత్తం దారిద్ర్యంలో ఉన్నప్పుడు ఈ కళలకు ఆదరణ ఎక్కడ చూపించగలదు? పాత బట్టల మూటలమ్ముకొంటున్నారు అని చెప్పటం ద్వారా పల్లె దరిద్రాన్ని కూడా అన్యాపదేశంగా చెపుతున్నాడిక్కడ కవి.


పిండిలా వెన్నెల కురిసే వేళ రచ్చబండపై ఊరు ఊసులు చెప్పుకొనే ఆ పాతరోజులు తలచుకొని, ప్రస్తుతం భోజనం చేసాకా ఒక్కడు కూడా బయట తిరగటం లేదేమిటబ్బా ఇదేమి చిత్రమో అంటూ ప్రశ్నించి, స్టార్ టీవీ సకిలిస్తాఉంది , సామ్రాజ్య వాద విషమెక్కుతున్నదమ్మా నాపల్లెల్లోకు అని సమాధానాన్ని ఇస్తారు. (బహుసా కొన్ని నక్సలైట్ ప్రభావిత ప్రాంతలలో పరిస్థితులను కూడా చెప్పుతూ ఉండవచ్చు)

వృత్తులు కూలె ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకను పోయె
కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు.
బహుళ జాతి కంపని మాయల్లోనా నా అన్నల్లారా
భారత పల్లెలు నలిగి పోయి కుమిలె నా అయ్యల్లారా.

బహుళ జాతి మాయలు, కుటీర పరిశ్రమలు పెట్టక పోవటం అంటూ కనిపించని కుట్రలను పాట చివరి పాదంలో కవి స్పష్టం చేస్తాడు. ఈ పరిస్థితులకు సూచ్య ప్రాయంగా పరిష్కారాన్ని కూడా సూచిస్తాడు కవి.

ఈ పాటలోని శభ్దసౌందర్యం ఈ పాటకు గొప్ప అందాన్నిస్తుంది. చిన్నచిన్న అచ్చ తెలుగు పదాలు పాటనిండా పరచుకొంటాయి. వింటున్నప్పుడు వీనులకు ఒక వింతైన అనుభూతిని మిగులుస్తాయి. కానీ ఈ పాటలోని పదాల వెనుకున్న వాస్తవం, దైన్యం, నిస్సహాయత అంతకు నూరురెట్లు ప్రకాశవంతంగా ఒక కరుణార్ధ్ర దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి.
ఈ పాట వందేమాతరం శ్రీనివాస్ గొంతునుండి వింటున్నప్పుడు కొన్ని చోట్ల ఆ గాన గంభీరతకు ఒళ్ళు జలదరిస్తుంది. (ఉదా: యాచకులు నా బుడగా జంగాలు అన్న చోట).

ఏ కాలంలోని కవైనా ఆయా కాలాల రాజకీయ ఆర్ధిక పరిస్థితులను, తన రాతల్లో ప్రతిబింబింప చేస్తాడు. ఆ వచ్చే మార్పులు మంచి వైపుకైతే సంబరపడిపోతాడు. అవి సగటు మానవజీవనానికి విఘాతం కలిగించేవైతే ఆవేదన వ్యక్తం చేస్తాడు. వాటికి పరిష్కారాలు తనపరిధిలో ప్రతిపాదిస్తాడు. ఈ పాటలో శ్రీ గోరటి వెంకన్న గారు సరిగ్గా అదే చేసారు. మారుతున్న పరిస్థితులలో కూలిపోతున్న ఉపాధులు, నలిగిపోతున్న బ్రతుకుల గురించి వారి పరిశీలనలను ఎంతో ఆర్ధ్రంగా ఆవిష్కరించారు. వారికి ఈ బ్లాగ్ముఖంగా వందనాలు తెలియచేసుకొంటున్నాను.

22 comments:

  1. బాబా గారు ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. గోరేటి వెంకన్నగారు పాట రస్తే వందేమాతరం శ్రీనివాస్ గారు తన గళంతో ఈ పాటను రంగులద్దారు. నిజంగా అద్బుతమయిన పాటను గుర్తు చేసారు. మీకు ధన్యవాదాలు ...

    ReplyDelete
  2. ఈ పాట పలికించినంత విషాదాన్ని చాలా అరుదుగా చూస్తాం. మన చుట్టూరా, మనం చూస్తూ ఉండగానే కూలిపోతున్న నాగరికతను మాటల్లో ఒడిసిపట్టుకున్నాడు కవి.. 'నానా.. మన పల్లెలు ఒకప్పుడెలా ఉండేవంటే..' అంటూ మన పిల్లలకు చెప్పుకోడానికి ఈ పాటను రిఫరెన్సుగా తీసుకుని వెనక్కు నడుచుకుంటూ వెళ్తే సరిపోతుంది.

    "ఆసామూలంతా కూసూనేటి, వడ్రంగుల వాకిలి
    నేడు పొక్కిలి లేసి దు:ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా" - పాటలోని ప్రతీ చరణమూ విషాద వాస్తవాన్ని పలికించినా, ఈ రెండు పాదాలు మాత్రం మరీను. యాచకులు, బుడగ జంగాల చరణంలో "దేవా..." అంటూ తీసే ఆ రాగం ఈ విషాదాన్ని తారాస్థాయికి చేరుస్తుంది.

    ఇక వందేమాతరం శ్రీనివాస్ గొంతు.. ఈ పాట చిందేసి ఆడేందుకు చక్కటి రంగస్థలంగా అమరింది. ఆయన గొంతులోని ఆ జీర లాంటిదేదో ఈ పాట భావాన్ని చిక్కబరచింది.

    ఒక గొప్ప పాటపై చక్కటి విశ్లేషణ చదవడం నాకు సంతోషం కలిగించింది. (ముందసలు సాహితీయానంలో వచనమే రిఫ్రెషింగుగా, బావుంది లెండి. :) )

    కొన్ని చోట్ల టైపాట్లు పడినట్టు అనిపిస్తోంది."ఆరె రం(కె)పె" లాటివి. ఒకటిలెండి.. పాటలో కొన్ని పదాలను గభాలున గ్రహించలేం -వందేమాతరం పాడిన స్పీడుకు గామోసు. నేను మొదట విన్నపుడు కుట్రల ను వేరేలా అని అనుకున్నాను. ఐదారు సార్లు విన్నాకగానీ.. తెలీలా! :)

    ReplyDelete
  3. పైని నా వ్యాఖ్యలో మొదటి వాక్యం కాస్త తేడాగా పడింది. ఇలా ఉండాలది:
    "ఈ పాట పలికించినంత విషాదాన్ని పాటల్లో చాలా అరుదుగా చూస్తాం"

    ReplyDelete
  4. బాబా గారు ఈ టపా అంటే నాకు చాలా ఇష్టం.చాలా బాగుంది.మీకు బ్లాగ్లోకం తరపున "దీపావళి" శుభాకాంక్షలు....

    శ్రీసత్య...

    ReplyDelete
  5. You stole my thunder .. boo hoo hoo
    I was going to introduce him!

    ReplyDelete
  6. ఈ పాట వెంకన్నే పాడగా విన్నాను. శ్రీనివాస్ బాగానే పాడారు గానీ, గొంతులో జీర పాటలోని విషాదంలో కరగడం అంటే వెంకన్న గొంతులో వినాల్సిందే. ఇటువంటి "మ్యూజిక్ ప్రొడక్షన్"లలో నాకు మహా చిర్రెత్తించే అంశం, సర్వంతర్యామిలా వ్యాపించే కీబోర్డు శబ్దాలు. అస్సలు నప్పవు!

    ReplyDelete
  7. అద్భుతంగా వివరించారు. పల్లెల్లో జీవితాల వెతలు, వారి జీవన విధానంలో‌ సాధక బాధకాలు కళ్ళకు కట్టినట్లుంది ఈ పాటలో. మనసు ద్రవిస్తుంది.

    మంచి టపా.

    ReplyDelete
  8. అద్భుత మైన, భావ యుక్తమైన పాటను అంతే అద్భుతం గా విశ్లేషించారు..గుడ్..

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. చాలా మందికిష్టమైన పాటపై ఇలా టపారాయటం రాయటం సాహసం అయినా, మీ స్పందనలబట్టి, నా టపా అనుచితంగా లేదన్న విషయం ఆనందం కలిగిస్తున్నది. స్పందించిన అందరకూ ధన్యవాదములు.

    వర్మ గారికి మీకెంతో ఇష్టమైన పాట పై మీస్పందనకు ధన్యవాదములండీ.

    చదువరి గారు
    ఎంత గొప్పగా వర్ణించారండీ.
    వందేమాతరం శ్రీనివాస్ గొంతు.. ఈ పాట చిందేసి ఆడేందుకు చక్కటి రంగస్థలంగా అమరింది.
    చాలా అద్బుతమైన వర్ణన.
    స్పందించినందుకు నెనర్లండి.
    టైపాట్లని మీరన్నా తరువాత ఒక సారి ప్రింటు తీసుకొని చూస్తే చాలా ముద్రారాక్షసాలున్నాయి సారు. నా జ్ఞానం మేరకు సవరించాను. థాంక్సండీ

    శ్రీ సత్యా గారు
    థాంక్సండీ

    కొత్త పాళీ గారు
    అవునా సారు, అయితే :-))

    వెంకన్న గారి గొంతు బాగుంటుందండీ. నేనిచ్చిన లింకుల్లో కొన్ని పాటలు, వారిగొంతులో బాగున్నాయి. ఈ పాటను మాత్రం వారిగొంతులో వినలేదు.

    ప్రవీణ్ గారు
    నచ్చినందుకు థాంక్సండీ.

    భగవాన్ గారూ
    థాంక్సండీ

    బొల్లోజు బాబా

    ReplyDelete
  11. అద్భుతం. ఇంతకు ముందు ఈ పాటని విన్నాను.కాని ఇంత ఫీల్ రాలేదు. బహుసా ఇది మీ వ్యాఖ్యల ప్రభావం. Yes really you elegized it more with your comments.
    వెంకన్న గారి ఆవేదనకి, శ్రీనివాస్ గొంతులోని ఆర్ద్రతకి అక్షరరూపం మీ వ్యాఖ్యలు.
    ఈ రకంగా (ప్రభుత్వ విధానాలకి) బలయిపోతున్న పల్లెలు, గిరిజన వాడలు మీద ఉత్తరంధ్రాకవితల పోటీలలో పచురణార్హత పొంది,'తూరుపు' కళింగాంధ్ర కవిత్వం అనే కవితాసంకలనం లో కవితని నా బ్లాగులో చూడగలరు.

    ReplyDelete
  12. really its very nice............
    We hope some more reviews from you like this....

    ReplyDelete
  13. baaba gaaru mee rachana chaala bagundi. kaani ee ANONYMOUS ee varandi.eevaro kaani chala rachanalaku alane comment pettaru.idi vaalaaku manchidi kaadu.endukante rachayitalu samajaani tama rachanala dwara melukolupu tunte ilanti peru leani vaallu vaarini nirutshaaha pariche la comments pedutunnaru.idi manchi paddati kaadu.neenu srisatya gaari kavitalo kuuda ilanti comment chusanu.baba gaaru "పల్లె కన్నీరు వినిపించిన శ్రీ గోరటి వెంకన్నకు వందనాలు " naa manasuku haatuukundi.

    vivek

    ReplyDelete
  14. సాయిసాహితి గారు, సురేష్ గారు, వివేక్ గారు మీరు చెప్పే అభినందనలన్నీ ఆ పాట కే చెందుతాయి. అందుకు కృతజ్ఞతలు.

    అనానిమస్ గారు :-|

    డా. దార్ల వెంకటేశ్వర రావు గారు మన బ్లాగ్లోకంలో తన http://vrdarla.blogspot.com ద్వారా అందరికీ సుపరిచితులే.

    వారికీ నాకు ఈ పోస్టుగురించి జరిగిన చిన్న మెయిలాయిణం, మన మిత్రులందరితో పంచుకోవాలని ఆ వివరాలను ఇక్కడ ఇస్తున్నాను. అంతే కాక ఇలా జరిగిన చర్చను ఇలా పోస్టు చేయటం వలన, కొన్ని భావాలు పదిమందికీ చేరతాయన్న ఉద్దేశ్యంతో కూడా.



    గౌరవనీయులు దార్ల గారికి

    నమస్కారములు
    నా బ్లాగులో శ్రీ గోరటి వెంకన్న గారి పల్లెకన్నీరు పెడుతుంది పాటపై ఒక వ్యాసం ఉంచాను. మీకు వీలు చిక్కినప్పుడు చూడవలసినదిగా కోరుచున్నాను.


    భవదీయుడు

    బొల్లోజు బాబా
    **********************

    బాబా గారూ!
    నేనీ మధ్య బ్లాగు చూడలేదు...పనుల ఒత్తిడి!
    ఈ రోజే చదివాను మీ లింక్!
    చాలా బాగా విశ్లేషించారు.ఈ పద్దతిని శిల్ప పద్దతి లో అనుశీలించడం అంటారు. మీరు బాగానే పట్టుకోగలిగారు.
    మీరే అంగీకరించినట్లు గోరేటి వెంకన్న గారు మాదిగ కులానికి చెందిన వారు కాదు. ఆయన కులాన్ని చెప్పుకోవడం ఇక్క డ అంత అవసరం కూడా కాదు.
    మనం ఆలోచించ వలసిన విషయం ఒకటి ఉంది.
    కుల వృత్తుల్ని కోల్పోతున్నందుకు బాధ పడుతున్నామా? చేతి వృత్తుల్ని కోల్పోతున్నందుకు చింతిస్తున్నామా?
    కుల వృత్తులు బలవంతంగా ఆరోపించినవి. కొన్ని వృత్తులకు గౌరవం, విలువ ఉన్నాయి. ఆర్ధికంగానూ బలపడేందుకు ఉపయోగ పడతాయి. కొన్ని అలా లేవు.
    మరో విషయమం ప్రపంచీకరణ అంటే మీ దృష్టిలో ఏమిటి?
    దీన్ని సరిగ్గా గుర్తించక పోతే అభివృద్దిని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల్ని మనం సరిగా అవగాహన చేసుకున్న వాళ్ళమవుతామా?
    మీరు నాకు ప్రేమతో , గౌరవంతో మెయిల్ ఇచ్చి చూడమన్నారు. అందువల్ల మెయిల్ లోనే వీటిని రాస్తున్నాను.
    బ్లాగులో పెట్తినా నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మనం కుల వృత్తినీ, చేతి వృత్తినీ ఒకే గాటన కట్టేయ కూడాదు.
    ముందు మీరు ప్రంచీకరణను ఎలా అన్వయించారో, అదంటే ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగు తోంది. ఇది మీ అవగాహనను అవమాన పరచడం కాదు... నేనూ మీలాగే అవగాహన చేసుకున్నానా లేదా? అని తెలుసుకోవడానికి!
    కొత్త పాళీ గారన్నట్లు వెంకన్న గారి గొంతులో ఒక సారి వినండి. ఆ పాట ఇంకా బాగుంటుంది.

    దార్ల
    ******************************



    గౌరవనీయులైన దార్ల గారికి
    నమస్కారములు,
    మీ జాబు నాకు చాలా ఆనందాన్ని కలిగించింది సార్.

    కుల వృత్తుల్ని కోల్పోతున్నందుకు బాధ పడుతున్నామా? చేతి
    వృత్తుల్ని కోల్పోతున్నందుకు చింతిస్తున్నామా?
    అన్న మీ ప్రశ్న
    మనం కుల వృత్తినీ, చేతి వృత్తినీ ఒకే గాటన కట్టేయ కూడాదు.
    అన్న మీ వాదన లోని లోతైన భావం అర్ధం అయ్యింది.

    నా అభిప్రాయాలు

    కుల వృత్తి అన్నప్పుడు అర్చకత్వం, పౌరోహిత్యం, పరిపాలించటం,వ్యాపారం వంటివి కూడా వస్తాయి కదా!. కాని చేతి వృత్తులన్నప్పుడు ప్రస్తుతం మనం ప్రస్తావించుకొంటున్నటువంటివి మాత్రమే పరిగణలోకి తీసుకొంటాము. వాటిలో కూడా కొన్ని సామాజికంగా ఎక్కువ మరికొన్ని తక్కువ వివక్షలకు గురయినవి అన్నది ఒక వాస్తవం.

    కులవృత్తులను, చేతి వృత్తులను పర్యాయపదాలుగా వాడటం ఆక్షేపణీయం. ఎందుకంటే కులవృత్తుల్ని కోల్పోతున్నందుకు బాధపడటం అంటే, ఒకరకంగా ఫ్యూడల్ వ్యవస్థను సమర్ధించటమే. అది ఒక కులాన్ని ఒక వృత్తికి ముడి పెట్టి అదే శాశ్వతమనే భావనలను పెంచిపోషించటం క్రిందే వస్తుంది.

    కనుక కులవృత్తిని చేతి వృత్తులనూ ఒకే గాటను కట్టివేయటం
    సమంజసం కాదన్న మీతో నేను ఏకీభవిస్తున్నాను.

    ఈ అభిప్రాయం నాకు మునుపు రేఖామాత్రంగా ఉండేది. కానీ మీతో ఇలా
    చర్చించుకోవటం ద్వారా స్పష్టత వచ్చింది. అందుకు మీకు కృతజ్ఞతలు.

    చేతి వృత్తులన్నప్పుడు కుల ప్రస్తావన అప్రస్తుతమైనప్పటికీ, చాలా
    మట్టుకు చేతివృత్తులను ఆయా కులాలకు ఆపాదించి ప్రస్తావించటం ఇంకా కొంత కాలం వరకూ తప్పదేమో. అంటే నా ఉద్దేశ్యం అంతరించిపోతున్న ఆయా చేతి వృత్తుల కార్మికులు వేరే వేరే రంగాలలో సెటిల్ అయ్యే వరకైనా.

    ప్రపంచీకరణ అనేది ఒక ఇనెవిటబుల్ డెమన్ అని నా అభిప్రాయం. ఈ ప్రపంచీకరణను ఆహ్వానించకపోయినట్లయితే, ఒక మయన్ నాగరికత లా అంతరించిపోయే ప్రమాదం కూడా ఉండవచ్చు.

    ఈ వ్యాసం ఆఖరు పారాగ్రాఫులో నేను వ్రాసి, తొలగించిన ఈ క్రింది
    వాక్యాలను మీరొక సారి గమనించండి.

    " .............. ఎంతో ఆర్ధ్రంగా ఆవిష్కరించారు.

    కొంతమందికి అనిపించవచ్చు మార్పు అనేది సహజం, దానికి తగ్గట్టుగా జనాలు కూడా మారాలి అని. ఇలాంటి సోషల్ డార్వినిజం వాదనలు వింటానికి బాగుంటాయి కానీ, ఆచరణలో అంత వేగంగా జీర్ణమవ్వవు. అంతవరకూ నేతన్నల, రైతన్నల, స్వర్ణ కారుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి.

    అలాగని అభివృద్దిని ఆపుచెయ్యమని కాదు. కాల చక్రాన్ని వెనక్కు తిప్పమనీ కాదు. కానీ నలిగిపోతున్న మన వారిపట్ల మనమందరమూ కంపాసనేట్ గాఉందాం. వారు మరో ఉపాధిలో కాలునిలుపుకొనే ప్రక్రియలో మనకు చేతనైన సహాయంచేద్దాం. కనీసం ఒక్క క్షణమైనా ఆ దిశలో ఆలోచిద్దాం. ఆ ఆలోచనాశక్తి, వారి మనోబలాన్ని పెంచవచ్చు. అప్పుడే ఈ పాట కు సార్ధకత చేకూరినట్లవుతుంది."

    పై వాక్యాలను తొలగించి, పాటను పాటలానే పరిచయం చేసాను.

    మీవంటి విజ్ఞులతో నా భావాలు ఈ విధంగా పంచుకొనే అవకాసం కల్పించినందుకు ధన్యవాదములతో

    భవదీయుడు
    బొల్లోజు బాబా



    బాబా గార్కి
    నమస్తే!
    మీ మెయిల్ హృదయానికి హత్తుకొనేలా ఉంది. మీ మెయిల్ లోని అన్ని అంశాలతోనూ 100 శాతం ఏకీభవిస్తున్నాను.
    మొన్న మాడిపార్ట్ మెంట్ ప్రపంచీకరణ ప్రభావం పై సెమినార్ నిర్వహించించింది. నేను ఒక్కడినే ప్రపంచీకరణ దళితులకు చేసే మేలు కూడా వివరించిన వాడిని. అలాగని పూర్తిగా అన్నీ మేల్లే చేశాయని అనలేం. దీన్ని నా ప్రసంగంlలోమీరు నెట్ లో వినవచ్చు. త్వరలోనే పెడతాను.


    మీ
    దార్ల
    ************************************




    బొల్లోజు బాబా

    ReplyDelete
  15. గుండె రగిల్చే పాట.. అంతే చక్కని వ్యాఖ్యానం. ఎన్నిసార్లు టీవీలో చూస్తూ చేస్తున్న పని ఆపేసి నిలబడిపోయానో.. బ్లాగ్వీక్షణం పుణ్యమాని ఎప్పుడో తప్పిన మీ టపా చదవగలిగాను.. వందేమాతరం దేవా అని రాగం తీసేది అచ్చం బుడగ జంగాలు అన్నట్లే అన్నాడని ఎవరో అంటుండగా విన్నాను. నెనర్లు

    అరిపిరాల

    ReplyDelete
  16. బాబా గారూ,

    నాకు ఎంతో ఇష్టమైన ఈ పాట చాలా మంది మిత్రులకు కూడా నచ్చిందని మీ పోస్టు మూలంగా తెలిసింది. చక్కని పరిచయం చేసినందుకు అభినందనలు.

    కొణతం దిలీప్

    ReplyDelete
  17. బాబా గారూ,


    Please change "పంటపొలాల మందుల చెత్తర" to "పంటపొలాల మందుల గత్తర"

    Dileep

    ReplyDelete
  18. ప్రసాద్ గారు,
    దిలీప్ గారు
    థాంక్సండీ.
    దిలీప్ గారు గమనించానండీ సూచించినందుకు ధన్యవాదములు.
    బొల్లోజు బాబా

    ReplyDelete
  19. మంచి పాటని పరిచయం చేసారు. 15, 20 సంవత్సరాల క్రితం వరకు పల్లె ఎలా ఉండేదో గుర్తు చేసారు. చాలా Thanks బాబా గారు. మన జీవీన విధానంలో ఎంత మార్పు వచ్చిందో కదా?

    ReplyDelete
  20. బాబాగారు
    పల్లెకన్నీరు పెడుతోందో పాట నాకు చాలా ఇష్టం. మంచి విశ్లేషణ అందించారు. మీకు దార్లగారికి జరిగిన చర్చ చాలా అర్ధవంతంగా జరిగింది. ఆ అభిప్రాయాలతో నూరుశాతం ఏకీభవిస్తున్నాను.

    ReplyDelete
  21. sir, mee post chaala abhinandaneeyam. Naaku kannillu teppinche paata bahusa idenemo. Chaala manchi paata. Nenu professional ga IT field lo unna, moolalu gramallo undatam cheta ee paataki baaga anvayinchukune vadini. Anyways.. Thanks a lot for your bold attempt. Appreciated.

    ReplyDelete