Tuesday, July 15, 2008

పుస్తకంలోకి నడవటం అంటే.......

ఎప్పుడో, ఎక్కడో, ఎవరో
ఒకడు
దోసెడు అక్షరాల్ని
కాలానికి అర్ఘ్యమిస్తాడు.
పిడికెడు ఆలోచనల్ని ఒడిసిపట్టుకొని
పుస్తకపుటలపై చల్లుతాడు.

ఎప్పుడో, ఎక్కడో, ఎవరో
ఒకడు
పుస్తకాన్ని తెరుస్తాడు.

ఒక జీవనది వాని గుండెల్లోకి
ప్రవహించటం మొదలౌతుంది.

ఒక సంగీతమేఘం
తేనె పాటల్ని వర్షిస్తూంటుంది.

రాగ స్పర్శకు వాని మనోయవనికపై
అపరిచిత అరణ్యం మొలకెత్తుతుంది.
వేన వేల స్వప్నాల పిట్టలు
రివ్వుమంటో ఎగిరి వచ్చి
మనో వనాన వాల్తాయి.
వసంతపు మొగ్గలు
పువ్వులుగా బద్దలవుతాయి.
పరిమళపు భ్రమరాలు ఝుమ్మంటో
వాడిని చుట్టుముడతాయి.

దివా సంధ్యలు, గెలుపోటములు,
సుఖ, దు:ఖాలు, రాగ ద్వేషాలు
అనుభూతి తరువులపై వాలిన
జంట పిచ్చుకలౌతాయి.

కెలడియోస్కోపులో ని
రంగురంగు గాజుముక్కలల్లే
అవే అక్షరాలు అసంఖ్యాక చిత్రాల్ని
ఆవిష్కరిస్తూంటాయి.

ఒక నన్నయ, ఒక వేమన, ఒక గురజాడ
లిప్తపాటు మెరిసి మాయమవుతారు.

నవరసాలూ వాటి దేహాల్ని లాక్కొచ్చి
కనుల వాకిట నిలిపి
రసావిష్కరణ జరిపిస్తాయి.

శత సహస్త్ర శిరఛ్ఛేద
ఖడ్గ పరిహాసం తళుక్కుమంటుంది.

తరాల్ని కలిపే రుధిరామృతం
కాల రేఖ పై లీలగా జారుతుంది.
*************

ఏదైనా పుస్తకంలోకి నడవటమంటే
పరిచిత పాత్రలలోకి
మనల్ని మనం ఒంపు కోవటమే కదా!

బొల్లోజు బాబా

13 comments:

  1. "పుస్తకాలెందుకు చదువుతాము?" అని పుంఖాలు పుంఖాలు వ్యాసాలు రాసినా, ఇన్ని విషయాలు వాటిల్లొ కుదించలేము. అదే కవితలోని అందం.

    ఒక్క పదచిత్రణతో బ్రహ్మాండాన్నీ ఆవిష్కరించగలదు, మనిషి మర్మాన్నీ ముంగిట నిలపగలదు.

    ఇక పుస్తకాలెందుకు చదవాలి అనే వ్యాసం ఎవరైనా రాయాలంటే మాత్రం, నిద్రలు పాడుచేసుకోవల్సిందే!

    ReplyDelete
  2. పుస్తకం ఉపయోగాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు..

    ReplyDelete
  3. అద్భుతం బాబా గారూ! మొదటి ఖండిక చాలా బావుంది.. అలానే పద చిత్రాలు కూడా!

    ReplyDelete
  4. అవును అద్భుతం! ఈ ప్రయోగం "వసంతపు మొగ్గలు
    పువ్వులుగా బద్దలవుతాయి." కొత్తగా ఉంది...

    ReplyDelete
  5. చాలా చాలా బాగుంది

    ReplyDelete
  6. Beautiful!
    కొన్ని ప్రయోగాలు అద్భుతంగా ఉన్నాయి.
    పరిమళపు భ్రమరాలు అన్న వాడుక కొంచెం విచిత్రంగా ఉంది.
    సహస్ర శిరఛ్ఛేద ఖడ్గ "పరిహాసం" ఎందుకైంది?

    జనాలకి ఒక విన్నపం. ఖండిక, లేదా ఖండ కావ్యం అంటే చిన్న కావ్యం అని అర్ధం. ఆంగ్ల stanza కి పర్యాయ పదంగా మనం "చరణం" అనొచ్చు.

    ReplyDelete
  7. అద్భుతంగా ఉంది.

    ReplyDelete
  8. "ఏదైనా ఓ పుస్తకంలోకి నడవటమంటే పరిచిత పాత్రలలోకి మనల్ని మనం ఒంపు కోవటమే కదా!" - Excellent Expression! Nice poem.

    ReplyDelete
  9. ఆహా, సూపరు..
    ఎంత బాగా చెప్పగలిగారు. పుస్తకం ఎందుకు చదవాలి? దాని ఆవశ్యకత ఏంటి? అని ఒక చిన్న కవిత ద్వారా చాలా ఎమోషనల్ గా రాసారు. పద ప్రయోగాలు ఆకట్టుకొన్నాయి.

    ReplyDelete
  10. మీ కవిత చాలా బాగా వచ్చింది.ఈ కవితకు శీర్షికగా "బ్లాగుల్లోకి నడవడం" అనేది కూడా బాగా సరిపోతుందనుకుంటున్నాను.

    ReplyDelete
  11. మహేష్ గారు
    థాంక్యూ వెరీమచ్. పుస్తకాలెందుకు చదవాలి అన్నా పాయింటు మీద కూడా ఒక చరణం పెట్టాలని ప్రయత్నించి సరిగ్గా కుదరక విరమించుకొన్నాను. భలేగా కనిపెట్టారు.

    మేధ గారు ధన్యవాదములు.

    నిషిగంధ గారు, కవిత మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.

    దిలీప్ గారు, కొత్తగా ఉంది కదూ? ఎదో ఒకటి చెయ్యాలిగా, లేకపోతే మీలాంటి వారు వచ్చి చూస్తారా?

    శ్రీవిద్య గారూ, థాంక్యూ, థాంక్యూ

    కొత్తపాళీ గారికి
    చాలా చాలా ఆనందంగా ఉంది.
    పరిమళపు బ్రమరాలు I just mean it. Thats all. No special meaning behind.
    శతసహస్ర శిరచ్చేద ............ అనే ఇమేజ్ ద్వారా దేవుని లీల ను చెప్పాలని వ్రాసినది సార్.
    ఇక పరిహాసం అనే మాటకు అర్ధం : MOCKERY అనే అర్ధంలో కాక, క్రీడ, వినోదం, LAST LAUGH అనే ఉద్దేశ్యంతో వాడాను. (తనికెళ్ల భరణి - ఆటకదరా శివా..... లా )
    నా ఉద్దేశ్యాలు తప్పయితే దయచేసి తెలుపగలరు.

    ఈ కవితను లలితంగా మొదలుపెట్టి ఒక తారా స్థాయికి తీసుకువెళ్లి వదిలేయాలనే స్కెచ్ తో వ్రాయటం జరిగింది. ఆ పక్రియలో కొంచెం బరువుగా ఉండాలని వాడిన పదాలు అవి. (ఖడ్గం, రక్తం, పరిహాసం, శిరచ్చేదనం, తళుక్కుమనటం మొదలైనవి).
    మీలాంటి విజ్ఞులను తప్పించుకోలేను కదా.

    రాధిక గారు
    నెనరులు (ఈ పదాన్ని అందరూ వాడుతున్నారు. నేనిదే మొదటి సారి వాడటం. నాకైతే నిజంగా అర్ధం తెలియదు. భావం మాత్రం థాంక్సని అర్ధమవుతుంది)

    సోమ శంకర్ గారు,
    కవితలో నాకు బాగా నచ్చిన, గొప్పగా వచ్చింది అనుకుంటున్న పాదం కూడా అదే సార్.

    నరసింహ గారికి
    మీరన్నదీ కరక్టే అనిపిస్తుంది.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  12. బాబాగారు కవిత చాలా బాగుందండీ చివరి పేరా "ఏదైనా..." అద్భుతం...

    ReplyDelete
  13. ఇక మీ కవితలకు కామెంట్లు రాయడం నాకు చేతకాదని అర్ధం అయిపోయింది... మీరు నా "ఉదయం" చూశారంటే ముడుచుకుపోతున్నాను... చిన్న పిల్లలు మొదటిరోజు బడిలో అ ఆ ఇ ఈ లు దిద్దినట్టుందేమో!...

    ReplyDelete