Tuesday, February 16, 2016

రక్తం మరకలు...


వాడు
మైకు ముందు
ఏవేవో ప్రణాళికల 
చిట్టా విప్పాడు
జయజయధ్వానాలు
మిన్నంటాయి
ఎవరో నా చేతిలో
పూల రేకలు పెట్టారు
వాడు వేసే
అడుగు అడుక్కీ
పూల రేకలు చల్లాను
ఇంటికొచ్చి చూసుకొంటే
నా చేతుల నిండా రక్తం
ఎంత కడిగినా పోని
రక్తం మరకలు
రేపు నా పిల్లలకు
ఈ చేతుల్నెలా
చూపించేదీ?

బొల్లోజు బాబా

Saturday, February 13, 2016

విస్పష్ట అత్యాధునిక కవిత్వం – మెర్సి మార్గరెట్ “మాటల మడుగు”


(ఈ వ్యాసం ప్రస్థానం ఫ్రిబ్రవరి, 2016 సంచికలో ప్రచురింపబడింది, ఎడిటర్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను)

పోస్ట్ మోడర్న్ కవిత్వం అస్పష్టంగా ఉంటుందనే అపప్రథ పోగొట్టుకొని నేటికి స్ఫుటితమైంది. దీనికి ఉదాహరణగా మెర్సీ మార్గరెట్ గారి “మాటల మడుగు” కవితా సంపుటిలోని కవిత్వం నిలుస్తుంది.
ఈ కవిత్వం లో- చక్కని పదచిత్రాల భాష, “ఆలోచనలు నిలువునా చినిగే దాకా” చేసుకొన్న అంతర్వీక్షణం, ఒక మనిషిగా, ఒక స్త్రీగా, ఎండ్లూరి సుధాకర్ గారన్నట్లు ఒక కిరస్తానీ కోకిలగా సాగే భిన్న అస్థిత్వాల స్వీయాత్మ ప్రకటన, నాలుగు గోడలై అంతవరకూ బంధించిన చరిత్రను నిరాకరించటమూ వంటివి వివిధ కవితలలో చక్కగా ప్రతిబింబించాయి.

కొత్త అభివ్యక్తి, కొత్త పదచిత్రాల్ని పట్టుకొన్న ఈ కవయిత్రి, ప్రస్తుత తరానికి ప్రతినిధి. అందుకనే ముందుమాటలో శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు “కవిత్వంలో ఉన్న విశేషం ఏమిటంటే ప్రతితరంలోనూ అది మళ్లా కొత్తగా మోసులెత్తుతుంది.// అలా పలకడంలో మానవానుభవానికొక కొత్తపార్శ్వం సమకూరుతుంది” అంటారు. ఆ రకంగా “మాటల మడుగు” కవిత్వం విస్పష్ట పోస్ట్ మోడర్న్ కవిత్వంగా, తెలుగు సాహిత్యంలో కొన్ని వాదాల, ఇజాల తీవ్రత తగ్గాక వీచిన కొత్త గాలి లా అనిపించక మానదు.

“మాటల మడుగు” పేరుకు తగ్గట్టుగా కవిత్వం నిండా మాటలు. హృదయాన్ని ఊచే మాటలు. అనుభూతి కలిగించిన ఆలోచనల్ని నింపుకున్న మాటలు. చాలా చోట్ల ఆ మాటలు తమ స్వంత అర్ధాల్ని వీడి వేరే రమణీయార్ధాన్ని వ్యక్తీకరిస్తుంటాయి. అదే కదా ఉత్తమ కవిత్వ లక్షణం.


కవులు అప్పుడప్పుడూ తమ కవిత్వ తత్వాన్ని ఏదో ఓ కవితలో నిర్వచించుకొంటారు (Metapoetry). వాళ్ళేం వ్రాస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఇదొక స్వీయ పరిశీలన లేదా ఎరుక. మార్గరెట్ “కొట్టివేత” అనే కవితలో…
పాత పాళీకి కొత్త మాటలు

అభ్యాసం చేయించి
తడిమే ప్రతిచూపులో
వినే ప్రతిమాటలో నూత్న వెలుగుతో
నన్ను నేను కాల్చుకోవాలి
“కొట్టివేతల నుంచి కొత్తగా పుట్టుకు రావాలి” …. (కొట్టివేత)… అంటుంది. అత్యాధునిక కవిత్వానికి చరిత్ర నిరాకరణ ఆయువుపట్టు. దీనికి అవసరమైన వ్యూహం కొత్త భాషను సృష్టించుకోవటం. దీన్నే ఈ కవయిత్రి పాతపాళీకి కొత్తమాటలు అని, కొట్టివేతలనుండి కొత్తగా పుట్టుకురావటం అనీ వ్యక్తీకరించింది. మరో కవితలో ఆ కొత్త భాష ఎలా ఉండాలో చెపుతుంది.

వ్యాకరణ వాసనలేని
ఆధిపత్య అధీనత లేని
అణచివేత ధిక్కరణలకు తావులేని
ప్రవహిస్తున్న ఒక రహస్య నదిని కనుగొనడానికి
సమసమాజ స్థాపన చేసే సంస్కృతిలా ఉరకలేసే
నదిలాంటి భాషను కనుగొనటానికి …. (మాట్లాడ నివ్వండి) అంటూ ఆ కొత్తభాష స్వరూపాన్ని, దానికై జరిపే తన అన్వేషణను తెలియచేస్తుంది.


“పదచిత్రాలతో ఆలోచించటమే కవిత్వం” అని అంటారు కవి విమర్శకుడు శ్రీ సీతారాం. “మాటల మడుగు” లో అనేక కవితలు అద్భుతమైన పదచిత్రాలతో అలరాలుతుంటాయి. ఆయా పదచిత్రాలు కూడా చక్కని సందర్భశుద్ధి, పొందికతో అమరి అపూర్వమైన పఠనానుభూతిని కలిగిస్తాయి.

చుట్టూ చీకటి
అడుగుతీసి అడుగేస్తే
ఇసుకలా తగిలే చీకటి … (చీకటి దీపం)… చీకటి ఇసుకలా తగలటం అనేది ఒక నూతన అభివ్యక్తి.


ఏ యుగాలనాటి మౌనధ్యానంలో

పునీతులై జ్వలిస్తారో కవులు
కాగితంపై అడుగేసి
కవిత్వమై వెలుగుతారు … (కవులు-కాగితం)… ఇక్కడ జ్వలించటం, వెలగటం అనే రెండు పదాల ద్వారా సృష్టించిన ఈ పదచిత్రం ‘కవిత్వమనేది కవుల మనోకాంతి అని అది లోకాల్ని వెలిగిస్తుందనీ’ సూచిస్తుంది.

చీకటి దండెం మీద

ఎవరో
జ్ఞాపకాలు ఆరేసుకున్నారు …. (చీకటి దండెం)… అనటంలో ఒక నిద్రరాని రాత్రివేళ పదే పదే గుర్తుకు వచ్చే కొన్ని అనుభూతులు వ్యక్తమౌతాయి.


ఒక పరిచయం ముగుస్తూనే

పగలునుండి రాత్రిని
వేరుచేసే కవ్వమేదో
మనసుని చిలికి
జ్ఞాపకాల వెన్నని చేతిలో
చంద్రుని ముద్దగా చేసి వెళుతుంది….(పరిచయం ముగుస్తూనే)…. ఒక పరిచిత వ్యక్తి జ్ఞాపకాలను వెన్నగా, ఆ వెన్నని మరలా చంద్రుని ముద్దగా వర్ణించటం ఒక అద్భుతమైన కల్పన.


ఈ సంపుటిలో అనేక సామాజికాంశాలపై స్పందించి వ్రాసిన వివిధ కవితలు కనిపిస్తాయి. “అమానత్ స్వరం” (నిర్భయ ఉదంతం) అనే కవితలో, “తల్లి దండ్రులారా వీలైతే మీ కొడుకులకు స్త్రీలను గౌరవించటం నేర్పండి” అంటుంది. లక్షింపేట ఉదంతంపై వ్రాసిన ఓ కవితలో “ఇక్కడ ఒక్కో శ్వాస విస్ఫోటనం చెందే అణుబాంబు అవుతుంది” అని హెచ్చరిస్తుంది. రియానేహ్ పై వ్రాసిన ఓ కవితలో “నీ ఉత్తరం చదివాక నేను మౌనంగా ఉండలేకపోతున్నాను” అంటూ సహానుభూతిని ప్రకటిస్తుంది. సామాజిక వివక్ష, రాజ్యహింస ల పట్ల మార్గరెట్ స్పందించిన తీరులో తనదైన గొంతుక, బలమైన వ్యక్తీకరణ కనిపిస్తాయి. అటువంటి కవితలు నిరలంకారంగా కనిపించవచ్చు కానీ వాటిలో కవిదృక్పధం ఉంటుంది. అలాంటి కవితలే ఈమె ఎవరివైపు నిలబడి కవిత్వం చెపుతున్నదో అర్ధమయ్యేలా చేస్తాయి.


మార్గరెట్ కవిత్వం గూఢంగా ఉంటూ ఒక్కోసారి చదువరిని లోనికి రానీయనంత ఇరుకుగా కూడా అనిపిస్తుంది. కొన్ని చోట్లయితే పైకి ఒక మామూలు అర్ధానిస్తూ, నిధిని కనుక్కోమని సవాలు విసురుతూ ఉంటుంది. ఇలా పైకి కనిపించే అర్ధం ఒకటి, అంతర్లీనంగా మరొక అర్ధాన్ని కలిగిఉండటం పోస్ట్ మోడర్న్ కవిత్వం యొక్క మరొక లక్షణం. “మిగిలిపోయిన దారం” అనే కవిత - పూలు వాడిపోయాయి, దారం మాత్రం ఆ పూల జ్ఞాపకాలలో ఒంటరిగా మిగులుంది అంటూ సాగుతుంది. ఈ కవితలో ఒకచోట ఆ దారం “ప్రశ్నలకొక్కాలకు మనల్ని వేలాడదీస్తుంది” అనటం ద్వారా ఇది మామూలు వాచ్యంగా చెప్పిన వస్తుకవిత కాదని అర్ధమౌతుంది. కానీ కవయిత్రి ఎక్కడా బయటపడదు. భిన్న అన్వయాలను చదువరులకే విడిచిపెడుతుంది.


మార్గరెట్ కవిత్వానికి శక్తి, పుష్టి, ఆయుషుని ఇచ్చేది ఆమె కవితలలో విస్తారంగా దర్శనమిచ్చే మెటానిమీ. కవిత్వంలో మెటనిమీ అంటే ఒక పదానికి బదులుగా ఆ పదంతో దగ్గర సంబంధమున్న మరొక పదాన్ని ఆస్థానంలో వాడటం. పోస్ట్ మోడ్రన్ కవిత్వానికి మెటానిమీ వెన్నెముక వంటిది. కానీ మెటానిమీ వాడటం కత్తిమీద సాము. కవి ఉద్దేశించిన భావాల్ని చదువరి అందుకోలేక పోతే ఆ కవిత అస్ఫష్టలోయలోకి జారినట్లే. పోస్ట్ మోడర్న్ కవిత్వం అర్ధం కావటం లేదన్న విమర్శలు మొదట్లో ఎదుర్కోవల్సివచ్చింది ఇందుకే. “మాటల మడుగు” కవిత్వంలో కనిపించే మెటానిమీ తేటగా, నూతనంగా ఉంటూ కవితలోని అంతరార్ధాన్ని తెలుసుకోమని కవ్విస్తూంటుంది. ముడివిప్పుకొన్న చదువరికి మంచి పఠనానుభవాన్ని కలిగిస్తుంది.


కథనాత్మక పద్దతిలో నడిచే “దోసిలిలో నది” అనే కవితలో మెటానిమీ ఉత్తమ స్థాయిలో ప్రకాశిస్తూ గొప్ప కవితానుభూతి ఇస్తుంది. “బయటకి ప్రవహించేందుకు దారివెతుకుతూ నాలుగుగోడల మధ్య ఒకనది” అంటూ మొదలౌతుంది కవిత. ఒక వలసపక్షి గోడపై వదిలిన విత్తనం వల్ల గోడ బలహీనమై ఒక పక్కకు ఒరగగా, నదికి రెక్కలొచ్చి, సహాయానికి, సహనానికి నిలువెత్తు సాక్ష్యమై స్వేచ్ఛగా ప్రవహించిందట. ఆ నదిని తీసుకొన్న ప్రతిఒక్కరి దోసిలిలో పక్షిలా మారుతూనే ఉందట. మార్మికంగా సాగే కవిత ఇది. ఇక్కడ నదికి బదులుగా ఆ స్థానంలో మతవిశ్వాసాలు/ఒక జాతి అస్థిత్వం/ స్వేచ్ఛ అనే పదాలతో భిన్న విధాలుగా అన్వయం చెప్పుకోగలిగేలా కవిత ఉండటం కవయిత్రి ఊహా పటిమకు, నిర్మాణకౌశలతకు అద్దంపడుతుంది.


కొందరు వ్రాసే కవిత్వంలో మతప్రస్తావన చాలా సార్లు అన్యమతం పట్ల ధూషణ లేదా విధ్వంశక స్థాయిలలోనో కనిపిస్తుంది. కానీ “మాటలమడుగు” కవిత్వంలో అలా ఉండదు. ఈ సంపుటిలోని రెండు, మూడు కవితల్లో కవయిత్రి తాను విశ్వసించే మతం తాలూకు పరిభాష దొర్లుతుంది. అది ఆ మతం లోని ఉదాత్తమైన భావనల్ని కవిత్వీకరించటం గమనార్హం. ఉదాహరణకు - “పొరలు రాలిన క్షణం” అనే కవితలో “అయినా పర్లేదు/‘దమస్కు మార్గానికి’/ ఇప్పుడు చేరానన్న ఆనందం” అంటుంది కవయిత్రి. ఇక్కడ “దమస్కు మార్గం” అనే వాక్య ఔదాత్యం అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. సౌలు అనే వ్యక్తి డమస్కస్ దారిలో ఏసుక్రీస్తు దర్శనాన్ని పొందుతాడు. అంతవరకూ ఏసు పట్ల అవిశ్వాసి అయిన సౌలు విశ్వాసిఅయి, సెయింట్ పాల్ గా మారి ప్రభువు దివ్యత్వాన్ని గానం చేసి ధన్యతనొందినట్లు బైబిలు ద్వారా తెలిసే ఒక మహిమాన్విత ఉదంతం. ఆంగ్లభాషలో Road to Damascus ను ఒక వ్యక్తి జీవితంలో కలిగిన ఏదేని ఒక గొప్ప దైవీకమైన మార్పును వర్ణించే ఇడియమ్ లా వాడతారు. తెలుగు కవిత్వాన్ని పరిపుష్టం చేసే ఇలాంటి ప్రయోగాలు ఆహ్వానించదగినవి.


ప్రశ్నలగది, వెన్నెల స్నేహితా, సముద్రాంబర, జోలాలి వంటి కవితలు శిల్పపరంగా గొప్పగా ఉన్నాయి. ఈ పుస్తకానికి ఆత్మీయ మాటలు వ్రాసిన కవి, విమర్శకుడు అఫ్సర్ అన్నట్లు “మెర్సీ యెన్ని కవిత్వదూరాలు వెళ్ళిందో అక్కడల్లా తన footprints లాంటి వాక్యాల్ని ముద్రించి సాగిపోయింది.

మంచి కవిత్వాన్ని ఇష్టపడే వారికి మెర్సి మార్గరెట్ “మాటల మడుగు” తప్పక నచ్చుతుంది.

కాపీల కొరకు

Mercy Margaret

1-4-61/12, Ranga Nagar
Musheerabad, Hyderabad, 500080
040/64643525
mercydachiever@gmail.com

Tuesday, February 9, 2016

చుంబనాలు, రతికేళి, పాతపుస్తకాలు గురించి --- by Ro Hith

చుంబనాలు, రతికేళి, పాతపుస్తకాలు గురించి --- by Ro Hith
1.
రత్యనంతరం నేనన్నానూ
“నీ దేహమొక టైమ్ మెషినై నన్ను
అనాది నేలకు తీసుకెళుతుంది
అక్కడ
ఓ ఆదిమానవుడు
రెండు రాళ్లను ఆడిస్తూ
నిప్పును రాజేస్తాడు” అని
2.
శృంగారం మరలా తిరగబెట్టేలోపు
ఓ పాత పుస్తకాల షాపుకి వెళ్ళాం
ఏదో సాకు కల్పించుకొని
నా దేహం యావత్తూ చుంబిస్తూ
నువ్వన్నావూ
“ఈ ప్రదేశం నీ నోటి వాసన వేస్తోంది” అని
3.
ముద్దు మద్యలో ఊపిరితీసుకొంటూ నువ్వన్నావు
“నీ శ్వాస వాసన వేస్తోంది
ఆ పాత పుస్తకాల షాపు వాసన లాంటిదే
కానీ
విధ్వంశం తరువాత నాశనమైన నగరంలా ఉండే
నీ మొఖం ఈ గెడ్డం అంటే నాకెంతో ఇష్టం” అని
నేను నిట్టూర్చాను
కడలి గర్భంలోకి కూలిపోయిన
నగరాల గురించి ఆలోచిస్తూ
ఖాళీ అయిన ఊర్లని ముంచెత్తిన
అకాల వరదల్ని తలచుకొంటూ
మూలం:about kisses, sex and second-hand books by Sri. RO HITH -- తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

Friday, January 29, 2016

కవిత్వయోధుడు – శ్రీ అద్దేపల్లి రామమోహనరావు (1936-2016)

“శయనిస్తున్న అతనెలా ఉన్నాడు? యోధునిలాగా లేక కవిలాగ? హ్మ్...... కవిత్వ యోధునిలా” --- జె.డి. రోబ్
ఓ మాస్టారికి ఒక కిళ్ళీ కొట్టు వద్ద ఖాతా ఉండేది. అయిదేళ్ళు గడిచాకా, ఓ మిత్రుడు ఆ కొట్టు యజమానికి ‘ఈ మాస్టారే ప్రముఖ కవి అద్దేపల్లి రామమోహనరావు” అని పరిచయం చేసాడు. ఆ కొట్టు యజమాని ఓ బైండు చేసిన పుస్తకాన్ని తీసి చూపిస్తూ మనస్సు బాగోనప్పుడల్లా ఈ పుస్తకాన్ని చదువుతుంటానని చెప్పాట్ట. ఆ పుస్తకం పేరు “అంతర్జ్వాల”. అది శ్రీ అద్దేపల్లి రచన. ఒక కవికి ఇంతకు మించిన పురస్కారం ఏ అకాడమీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వాలు ఇవ్వగలవు?
యాభై ఏళ్ల సాహితీప్రస్థానంలో సుమారు 30 పుస్తకాల్ని వెలువరించి, ఆరు వందలకు పైగా ముందుమాటలు వ్రాసి, వివిధ సభల్లో రెండువేలకు పైగా అద్యక్షోపన్యాసాలు ఇచ్చి, ఎన్నో వందల పుస్తకాలను సమీక్షించి, కొన్ని వందల తెలుగు గజల్స్ ను వ్రాసి, గానం చేసి- తెలుగు సాహితీలోకంలో ఒక కవిత్వయోధునిలా జీవించిన శ్రీ అద్దేపల్లి రామమోహనరావు జీవిత చరమాంకంలో కూడా ఒక యోధునిలానే నిష్క్రమించారు.
గత మూడునెలలుగా ఆయన అస్వస్థతకు గురయ్యారని కాకినాడ సాహితీమిత్రుల మధ్య గుసగుసలుగానే ఉండింది. కానీ ఇంత త్వరగా విడిచిపోతారాని ఎవరూ అనుకోలేదు.
తన అనారోగ్యం గురించి ఎవరికి తెలియనివ్వలేదు శ్రీ అద్దేపల్లి. ఎవరినీ ఎక్కువగా కలిసే వారు కాదు. గతమూడునెలలుగా ఎవరైనా ఆయనను కలిసినా అస్వస్థత ప్రస్తావన లేకుండానే మాట్లాడేవారు. ఇవతలి వ్యక్తికి తెలిసినా, ఆయన ధోరణిని బట్టి, తెలియనట్టుగానే మాట్లాడాల్సివచ్చేది. అలాగని నిర్వేదంలో పడిపోయారా అంటే అదీకాదు, మరణానికి వారంరోజుల ముందు వరకూ కూడా స్వయంగా ఆటో ఎక్కి రేడియేషన్ చేయించుకొని వచ్చిన వ్యక్తి. ఒక సాహితీ మిత్రునికి ఫోన్ చేసి, ఈ సంవత్సరం ఎలాగైనా “సాహితీ స్రవంతి” పత్రికను ప్రారంభించాలి అని దిశానిర్ధేశం చేసిన వ్యక్తి శ్రీ అద్దేపల్లి. “మీరు రేడియేషన్ చేయించుకొన్నారు కదా జాగ్రత్తగా ఉండాలి” అని కుటుంబసభ్యులొకరు అన్నప్పుడు, “అన్ని సిట్టింగులు అయిపోయాయి, రేడియేషన్ అన్న మాట ముగిసిపోయిన అధ్యాయం, ఇకదాని గురించి మాట్లాడకండి” అని వారికే తిరిగి ధైర్యం చెప్పిన వ్యక్తిత్వం శ్రీ అద్దేపల్లిది. మరణాన్ని కూడా ప్రశాంతంగా స్వీకరించాలంటే గొప్ప రుషిత్వం ఉండాలి.
కవిగా, విమర్శకునిగా, వక్తగా, వ్యక్తిగా ఆయన పోషించిన వివిధ పాత్రలను తెలుసుకోవటం ద్వారా శ్రీ అద్దేపల్లి చేసిన సాహిత్యకృషిని అర్ధం చేసుకొనవచ్చును.
శ్రీ అద్దేపల్లి కి ప్రాచీన సాహిత్యంపై గొప్ప పట్టు ఉండేది . మొదట్లో చందోబద్దమైన కొన్ని వందల పద్యాల్ని రచించారు. 1960 లో తొలికవిత కృష్ణాపత్రికలో అచ్చయింది. కాలక్రమేణా తాను విశ్వసించే హేతువాద దృక్ఫధం, అభ్యుదయత, ప్రగతిశీల భావాలకు వచనకవిత్వమే సరైనదని అనుకొని వచన కవితామార్గాన్ని ఎంచుకొన్నారు. ప్రపంచీకరణ ప్రభావం వలన చిధ్రమౌతున్న మానవజీవనంపై కవిత్వం వ్రాసిన తొలి తెలుగుకవి శ్రీ అద్దేపల్లి. వీరి కవిత్వ సంపుటాలలో అంతర్జ్వాల (1970), రక్త సంధ్య (1978), గోదావరి నా ప్రతిబింబం (1992), పొగచూరిన ఆకాశం, సంఘం శరణం గచ్చామి, మెరుపు పువ్వు, గీటురాయి వంటివి ప్రముఖమైనవి. మినీ కవితల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి గొప్ప ప్రాచుర్యాన్ని కలిగించారు శ్రీ అద్దేపల్లి. తెలుగులో అనేక వందల గజల్ లను రచించి వాటిని గొప్ప రాగయుక్తంగా ఆలపించి అనేక సభలను రంజింపచేసేవారు. వీరి అనేక కవితలు వివిధ భాషలలోకి అనువదింపబడ్డాయి. కవిగా శ్రీ అద్దేపల్లి తెలుగు సాహితీలోకంలో ఎప్పటికీ చిరస్మరణీయుడే.
విమర్శకునిగా శ్రీ అద్దేపల్లి పాత్ర గణనీయమైనది. శ్రీశ్రీ మహాప్రస్థానంపై వీరి మొదటి విమర్శనా గ్రంధం వచ్చి పలువురి ప్రసంశలు పొందింది. ఈ వార్తవిన్న శ్రీశ్రీ యే స్వయంగా “సరోజినీ ఈ విషయం విన్నావా, నా పుస్తకం మీద సమీక్షా గ్రంధం వస్తోంది” అని చెప్పటం ఒక మధురమైన ఘట్టం. కుందుర్తి వచన కవితా వైభవం, స్త్రీవాద కవిత్వం-ఒక పరిశీలన, మహాకవి జాషువా కవితా సమీక్ష, తెలుగు కవిత్వంపై ఆధునికత, అభ్యుదయ విప్లవ కవిత్వాలు- సిద్దాంతాలు, శిల్పరీతులు వంటివి శ్రీ అద్దేపల్లి వెలువరించిన వివిధ విమర్శనా గ్రంధాలు. మంచిని విస్తారంగా చర్చించి, చెడును సూచనప్రాయంగా ఎత్తిచూపటం శ్రీ అద్దేపల్లి విమర్శనా శైలి.
వక్తగా శ్రీ అద్దేపల్లి సమకాలీన సాహితీవేత్తలెవరూ అందుకోలేనంత ఎత్తులో ఉంటారు. సభలకు ఎవరైనా పిలిస్తే దూరభారాలకు వెరవకుండా, తప్పనిసరిగా హాజరయ్యి, ఆ సంస్థలకు, అక్కడి యువకవులకు ఎంతో స్పూర్తిని, ఉత్తేజాన్ని నింపే గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేవారు. రిజర్వేషన్ దొరకకపోతే జనరల్ భోగీలో ప్రయాణించైనా సరే, వస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకొనేవారు శ్రీ అద్దేపల్లి. ఈ లక్షణాన్ని గుర్తించిన తెలుగు సాహితీలోకం శ్రీ అద్దేపల్లికి “సాహితీ సంచార యోధుడు” అన్న బిరుదును ఇచ్చి సత్కరించింది. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపై లోతైన అవగాహనతో వీరు చేసే అనర్ఘళమైన ఉపన్యాసాలు, చక్కని ఉటంకింపులతో, చలోక్తులతో సాగి సభికులను రంజింపచేసేవి. వీరు గత ముప్పై ఏళ్ళుగా ఇచ్చిన ఉపన్యాసాలు రెండువేలకు పైమాటే.
వ్యక్తిగా శ్రీ అద్దేపల్లి స్నేహశీలి, నిరాడంబరుడు, భోళాశంకరుడు, నిరంతర సాహితీకృషీవలుడు. సమయపాలన విషయంలో శ్రీ అద్దేపల్లి నిక్కచ్చిగా ఉండేవారు. వీరు అద్యక్ష్యత వహించిన సభలలో కాలం తూకం వేసినట్టు నడిచేది. తనకన్నా చిన్నవారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని వారి కవిత్వంలోని గుణగణాలను విప్పిచెప్పి ప్రోత్సహించేవారు. ఎవరైనా మంచి వాక్యం వ్రాస్తే భలే ఉంది అంటూ వెన్నుతట్టి మెచ్చుకొనేవారు. శ్రీ అద్దేపల్లి అద్యక్షత వహించిన ఒక సభలో నేను నా కవిత వినిపించి వెళిపోతుంటే, నన్ను ఆపి --- బొల్లోజు బాబా కవిత్వం వాచ్యంగా ఉండదు ధ్వని ప్రధానంగా ఉంటుంది, ఇప్పుడు చదివిన కవితా పంక్తులలోని సొబగులు ఇవి అంటూ విశ్లేషించి, అభినందించటం--- నేను ఎన్నటికీ మరచిపోని ఒక తీపి జ్ఞాపకం.
తెలుగు కవిత్వయోధుడు శ్రీ అద్దేపల్లి రామమోహనరావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ.......
భవదీయుడు
బొల్లోజు బాబా
14/01/2016
(ఈ వ్యాసం ముందుగా సారంగ పత్రికలో ప్రచురింపబడింది)

Sunday, January 10, 2016

అధికారం


వెయ్యి ప్రమాణాలు
భంగమయ్యాక కానీ
అర్ధం కాదు నీకైనా నాకైనా
జయాపజయాలకు
అతీతంగా
యుద్దం చేయాల్సిన
చెస్సు పిక్కలమని

ఇంతోటి వైభోగానికే
రాజు-బంటు తేడాలొకటీ

బొల్లోజు బాబా

Friday, January 1, 2016

అపుత్రస్య.......


నీకు సమ్మతమే కదా?
“సమ్మతమే”
గర్భసంచి గోడలపై
రూపుదిద్దుకొంటున్న
వాక్యం అసంపూర్ణంగా
తెగిపోయింది.
నీకు సమ్మతమే కదా?
తలదించుకొందామె.
కుడ్యచిత్రం పూర్తికాకుండానే
వాననీటికి రంగులు రంగులుగా
కరిగిపోయింది మట్టిలోకి.
ఆమెనెందుకు తీసుకురాలేదూ?
“ప్లీజ్”
రక్తనాళాల్లోకి దొంగలా ప్రవేశించిన
అబార్షన్ పిల్
గోడపై విచ్చుకొంటున్న
చామంతి మొగ్గను
చిదిమేసింది.
******
“వంశక్షయం కాకుండా
పండంటి మగబిడ్డను పొంది
స్వర్గార్హతను సాధించిన
నువ్వెంతటి అదృష్టవంతుడవయ్యా”
అని అందరూ అంటూంటే
హత్యచేయబడ్డ మూడు అసంపూర్ణ భ్రూణాలు
తలలు అడ్డంగా ఊపాయి.
బొల్లోజు బాబా
(inspired by a quote--“Born to such rich parents, this boy has some life,” exclaimed the neighbours…....Somewhere in heaven, three unborn sisters cried.)

Saturday, December 19, 2015

'ఫ్రీ వైఫై' కాంపస్


చెట్టునీడలో కూర్చొన్న
విద్యార్దుల గుంపు
వెలుతురు తెరలో దూకి
వైఫై సముద్రంలో తేలింది.
దారాన్ని స్రవించుకొని
కాళ్లతో పేనుకొంటూ తనచుట్టూ తానే
గూడు నిర్మించుకొనే పురుగులా
ప్రతీ విద్యార్ధీ తనచుట్టూ
ఓ మౌన పంజరాన్ని దిగేసుకొన్నాడు.
వైఫై లింక్ తెగింది
ఓహ్! షిట్.....
గూడులోంచి సీతాకోక చిలుక
మెత్త మెత్తగా బయటపడినట్లుగా
ఒక్కో విద్యార్ధీ మాటల ప్రపంచంలోకి
మెల మెల్లగా మేల్కొన్నాడు.
కాసేపటికి కాంపస్ అంతా
రంగు రంగుల మాటల చిలుకలు
రెక్కల్లల్లార్చుకొంటూ ఎగురుతో!

బొల్లోజు బాబా

Thursday, December 17, 2015

దాహం



భూమిలోంచి పైకి లేచిన కుళాయి గొట్టం
ఒంపు తిరిగి పిట్టగోడను అనుసరిస్తూ సాగి
మరో రెండు మలుపులు తీస్కొని
ఇత్తడి టాప్ నేత్రమై
ఏ మేఘసందేశాన్నో నీళ్ళ భాషలో అందిస్తుంది
బహు జాగ్రత్తగా!

పుస్తకమూ అంతే
ఎన్నో మలుపులు తీసుకొని చేతిలోకి చేరి
ఒకనాటి  మనో ఆకాశపు వానచినుకుల్ని
అక్షరాలుగా  వర్షింపచేస్తుంది
మట్టి నయనాలపై
బహు వేడుకగా!


బొల్లోజు బాబా

Tuesday, December 8, 2015

మార్పు


ఆట్టే గొప్ప అందమనీ చెప్పలేనూ
చామనఛాయ, కోటేరు ముక్కు
పెద్దకళ్ళు, వయసు చెక్కిన దేహమూ అంతే

మా అందరి కోరికపై ఆమె
కాలేజి గార్డెన్ బెంచీపై బాచీమఠం వేసుకొని,
తలపైకెత్తి కనులు మూసుకొని గొంతునరాలు ఉబ్బిస్తో
ఎన్నిపాటలు వొంపిందో ఆ సాయింత్రపు చెవుల్లోకి.
ఆనాటి ఆ సాయింత్రం ఇప్పటికీ
మట్టిని మోసుకెళ్ళే కందిరీగలా నా దేహంలో
అదే పనిగా ఎగురుతూంటుంది గుర్తొచ్చినప్పుడల్లా.

శ్రావణశుక్రవారం పూట
చేతికి తోరం చుట్టుకొని, పట్టుపరికిణీ కట్టుకొని
సాంబ్రాణి వాసన చిమ్మే కురులతో, మెరిసే కాటుక కళ్ళతో
ఆమె నడచివచ్చిన అలనాటి ఆ దృశ్యం నేటికీ
జ్ఞాపకాల పేజీలమధ్య దాచుకొన్న
నెమలీక లాంటి చందమామ శకలం.

“బాయ్స్ అందరూ ఆ అమ్మాయికి క్షమాపణ
చెప్పేదాకా మేం క్లాసులకు వెళ్ళం సార్”
అని ప్రిన్సిపాల్ కి తెగేసి చెప్పిన ఆమె తెగువ
కుర్రవాళ్లమైన మా అందరిగుండెల్లో స్త్రీల పట్ల
గౌరవ ద్వారాన్ని తెరచిన ఒకానొక సందర్భం.

ఫేర్ వెల్ రోజున ఆమె పాడిన
“జగమేలే పరమాత్మా ఎవరితో..... పదాల్లో పలికిన
మార్దవం కోసం పాతికేళ్ళుగా వెతుకుతూనే ఉన్నాను.
*****
పూర్వ విద్యార్ధుల సమ్మేళనం అని పిలిస్తే
నే చదివిన కాలేజీకి వెళ్ళాను
చాలా కాలం తరువాత.

ఆమె కూడా వచ్చింది

మేం కలుసుకోకుండా ఉంటే ఎంత బాగుణ్ణు
అనిపిస్తోంది ఈమధ్య పదే పదే.


బొల్లోజు బాబా

Thursday, December 3, 2015

"ఫ్రెంచిపాలనలో యానాం" - కినిగె లో ఉచితంగా

ఇది నా మూడేళ్ళ శ్రమ ఫలితం. బొల్లోజు బాబా నువ్వేంచేసావు అని ఎవరైనా అడిగితే, నేనీ పుస్తకం వ్రాసాను అని గర్వంగా చెప్పుకొంటాను ఎప్పటికీ.
2012 లో ప్రింట్ బుక్ గా వచ్చినపుడు UNFORTUNATELY NOBODY NOTICED IT. కానీ పి.డి.ఎఫ్ రూపంలో పదిరోజుల్లో 2500 మంది పైగా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది. అందరూ సీరియస్ పాఠకులు కాకపోవచ్చని నాకు తెలుసు అయినప్పటికీ it just excited me.
"ఫ్రెంచి పాలనలో యానాం" పుస్తకాన్ని ఇక్కడ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకొనవచ్చు.


బొల్లోజు బాబా