Wednesday, March 22, 2023

తమసోమా ……..


కొండపైన ఒక పెద్ద మర్రి చెట్టు
దానినీడలో నాలుగురాతి స్తంభాల నడుమ
చిన్న శిథిలాలయం
ప్రాంగణంలో గంట, నందీ.
నీలాకాశంలో కదిలే కొంగల వెనుక
కదలని మెత్తని మేఘాలు
అన్నిటి మధ్యా శ్రావ్యమైన అన్యోన్యత
దూరంగా పశ్చిమంలోకి
ఒంటరిగా జారిపోయే సూరీడు

ఏటవాలు కిరణాలు పడిన
ప్రతీదీ ఆ ఒంటరితనంలోకి కూలుతుంది.

ఇక ఒంటరి కొండ
ఒంటరి మర్రిచెట్టు
ఒంటరి శిథిలాలయం
కొంగల గుంపు
మేఘాలు మిగులుతాయి.

సూర్యుడు మరలా ఉదయించేవరకూ
ఈ ప్రపంచం ఏకాకితనాన్ని తొడుక్కొని
రాత్రికలుగులో దాక్కొని తమస్సునుంచి వెలుగువైపు
నడిపించమని తపస్సు చేస్తుంది.
శిథిలాలయపు శివుడు కూడా
తన అర్ధభాగంలో దేహాన్ని దాచుకొంటాడు
.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment