Wednesday, March 22, 2023

తెలుగు పదానికి పట్టం కట్టిన నీటు పాట


Tango, Swing, Flamenco లాంటి పాశ్చాత్య నృత్యరీతులు మీకేమైనా తెలుసా అని హీరో ధ్వయాన్ని ఒక బ్రిటిష్ అధికారి ఎద్దేవా చేసినప్పుడు మా ఆట పాట దేశివాళీ నాటు టైపు అని చెప్పటం ఈ పాట సందర్భం.
ఇది సంప్రదాయ నృత్యంరూపకం కాదు. భరతనాట్యమో, కూచిపూడో బాక్ గ్రౌండ్ గా ఉండటానికి. ఫక్తు గ్రామీణ నేపథ్యంతో సాగే నాటు వ్యక్తీకరణ. దర్శకుని ఊహలో ఈ సందర్భంలో నృత్యం ఇలా ఉండాలని ఒక ఊహ ఉండే ఉంటుంది. దానికి తగ్గట్టుగా సంగీత దర్శకుని వద్ద పాట బాణీ కట్టించుకొని ఉంటాడు. తదనుగుణంగా గీతరచన సాగింది.
నేడు ఈ గీతరచనకు ఆస్కార్ రావటం అనేది తెలుగుభాషకు దక్కిన అత్యంత అరుదైన గొప్ప గౌరవం. ఈ నేపథ్యంలో గీతరచయిత శ్రీ చంద్రబోస్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు.
***
పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు
పోట్లగిత్త, పోతరాజు, కర్రసాము కుర్రగుంపు, మిరప తొక్కు ఇవన్నీ ఒక అనియతమైన శక్తికి, ఆవేశానికి, ఉద్రేకానికి ప్రతీకలు. అక్కడ హీరో ధ్వయం కూడా అలాంటి అపరిమితమైన కట్టుబడని బలిమికి, సామర్ధ్యానికి సంకేతమని చెబుతున్నాడు కవి. పోట్లగిత్త, పోతరాజు, కిర్రుసెప్పులు, పోలేరమ్మ జాతర, కర్రసాము, జొన్నరొట్టె, మిరపతొక్కు తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నాలు. వీటి ద్వారా స్థానికత యొక్క ప్రాధాన్యాన్ని, చాటుతున్నాడు కవి.
పచ్చి మిరప లాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు
విచ్చు కత్తి లాగ వెర్రి నాటు
గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలా కీసు పిట్ట కూసినట్టు
ఏలు సిటికెలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా దుమారం రేగినట్టు
ఒల్లు సెమటపట్టేలా వీరంగం సేసినట్టు
హీరో ధ్వయం పాడే పాట ఆడే ఆట-పచ్చిమిరపలా ఘాటైనదని, విచ్చుకత్తిలా పదునైనదని, భీకరంగా డండనకర అంటూ కదంతొక్కుతుందని, చెవులు మోతెక్కించే కూత అని, చిటికలేయించే యవ్వారమని, చిందులేయించే దుమారమని, చమటపట్టించే వీరంగమని వివిధ ఉపమానాలతో వాటి బాహ్య అంతఃస్వరూపాలను కళ్ళకు కట్టిస్తాడు కవి.
యవ్వారం, వీరంగం, పచ్చిమిరప, కాలుసిందు లాంటివి స్వచ్ఛమైన తెలుగు పల్లె పదాలు. వీటిని అంతర్జాతీయ వేదికపైకి ఎక్కించటం గొప్ప గౌరవపాత్రమైన విషయం.
భూమి దద్దరిల్లేలా వొంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా
దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా
దుముకు దుముకులాడేలా దూకేయరో సరాసరి
ఇవి చివరి పంక్తులు. పాటలోని ఉద్వేగాన్ని పతాకస్థాయికి తీసుకెళ్ళే వాక్యాలు. భూమి దద్దరిల్లాలట. రక్తమంతా రంకెలెయ్యాలట. దుమ్ముదులిపేలా దూకేయ్యాలట. నిజానికి ఆ పాట చిత్రీకరణ ఈ మూడు మాటల ఇరుసుపై ఆధారపడి నడవటం గమనించవచ్చు.
ఇది చిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు ముందుగానే సిద్ధంచేసిన గీత ఆత్మస్వరూపం కావొచ్చు.
నీకు నాట్యమేం తెలుసు అని సవాలు విసిరిన బ్రిటిష్ అధికారికి- మా ఆటపాట సాల్టు పెప్పరు చల్లుకొనే చప్పిడి కూడు కాదు - మా ఆట పాట వీరంగం ఆడే పోట్లగిత్త, విసిరిన విచ్చుకత్తి, రంకెలేసే రక్తం, మిరపతొక్కులా ఊరనాటు అంటూ సమాధానం ఇవ్వటం - అత్యంత ప్రతిభావంతంగా చిత్ర కథ ఆత్మలో గీతాన్ని మిశ్రితము చేయటమే. ఇది గీతరచయిత ప్రతిభ.
నేడు ఏ అంశానికైనా పరస్పరవిరుద్ధమైన వాదనలు రావటం సహజంగా మారిపోయింది. ఈ పాట ఆస్కార్ అందుకోవటం పట్ల కూడా - లాబీయింగ్ పనిచేసిందని, సినీ గీతంలో సాహిత్యం ఏముంటుందని, తెలుగులో ఇంతకన్న ఎన్నో గొప్పపాటలున్నాయని వివిధ సన్నాయి నొక్కులు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా చరిత్ర "గమ్యాలను" మాత్రమే రికార్దు చేస్తుంది.
తెలుగు సినీ సాహిత్యానికి అంతిమ గమ్యమైన ఆస్కార్ అవార్డును దక్కింపచేసిన శ్రీ చంద్రబోస్ చరితార్ధుడు.
ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు
బొల్లోజు బాబా

3 comments:

  1. >> నేడు ఈ గీతరచనకు ఆస్కార్ రావటం అనేది తెలుగుభాషకు దక్కిన అత్యంత అరుదైన గొప్ప గౌరవం.

    అవును కదండీ.
    వేల సంవత్సరాల తెలుగుభాష చరిత్రలో, ఎన్నో ఎన్నెన్నో అందమైన ఘనమైన కళారీతులూ సంప్రదాయాలూ సృజించిల వేనవేల పాటల్లో ఈ నాటునాటు పాటవంటి పాటను మించి మరొకటి లేనే లేదని నిర్ణయించి ఆస్కారు అవార్డు ఇచ్చారని ఎంతో సంతోషించాలి. చంద్రబోసు గారికి తొలితెలుగుకవి అని బిరుదును ఇచ్చి తెలుగుభాష తనని తాను గౌరవించుకోవాలీ అని తీర్మానం చేదామంటారా?

    ReplyDelete
  2. అలా కాదులెండి, శ్యామలరావు గారూ.
    ఇప్పటి వరకు వచ్చిన తెలుగు పాటలన్నిటికన్నా గొప్పదని ఈ “నాటు నాటు” పాటకు అవార్డ్ ఇవ్వలేదు. గత సంవత్సర కాలంలో వచ్చిన వాటిలో ఉత్తమమైనదని నిర్ణయించి (ఎలా నిర్ణయిస్తారు అని అడక్కండి, నాకూ తెలియదు) దానికి అవార్జు ప్రకటిస్తారు - పాటయినా, నటనయినా, దర్శకత్వం అయినా, సినిమా రంగానికి సంబంధించిన మరొకటయినా, మరొకటయినా - పోయిన సంవత్సరం కాలం పరిమితి వరకు. అలనాటి నుంచీ వచ్చిన అన్నిటితోనూ పోల్చి చూడరు, చూడలేరు కదా, మీకు తెలియనిదేముంది.

    ఈ పాట అన్నిటి కన్నా మిన్నా అన్నదాని గురించి కానీ, ఆ అవార్డ్ ల గురించి కానీ చర్చించే ఉద్దేశం నాకు లేదు గానీ సాటి తెలుగువాడికి దక్కిన గౌరవం అనుకుని సంతోషిద్దాం అని మాత్రం అంటాను.

    ReplyDelete
    Replies
    1. నరసింహారావు గారు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను అండి. థాంక్యూ

      Delete