Sunday, March 19, 2023

అశోకుడు – ఏకపాత్రాభినయం, రచన శ్రీ అద్దంకి కేశవరావు, పుస్తక పరిచయం



ఈ రోజు కొత్తపేటలో కళాసాహితి వారి ఆధ్వర్యంలో ఉగాది సాహిత్య సభజరిగింది. ఈ సభలో కీ.శే. శ్రీ అద్దంకి కేశవరావు గారు రచించిన అశోకుడు ఏకపాత్రాభినయ పుస్తకపరిచయం చేసాను. తదనంతరం జరిగిన కవిసమ్మేళనంలో కవితచదివాను. ఈ కార్యక్రమాన్ని శ్రీ గిడ్డి సుబ్బారావుగారు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, ప్రసంగ పాఠము.
.
అశోకుడు – ఏకపాత్రాభినయం, రచన శ్రీ అద్దంకి కేశవరావు, పుస్తక పరిచయం
.
భారతదేశ ప్రాచీనచరిత్ర స్పష్టంగా లభించదు. ప్రజలందరూ సమాన హక్కులతో, కలిసిమెలసి, భిన్నవిశ్వాసాలను పరస్పరం గౌరవించుకొంటూ అహింసామార్గంలో జీవించాలని చెప్పిన బౌద్ధాన్ని హిందూ, ముస్లిమ్ మతాలు సంపూర్ణంగా విస్మరించాయి. పంతొమ్మిదో శతాబ్దపు ప్రారంభంలో James Prinsep, Vincent Smith, Alexander Cunningham లాంటి బ్రిటిష్ చరిత్రకారులు బౌద్ధ మత అవశేషాలను తవ్వి వెలికితీసే వరకూ అశోకుడు ఎవరు, ఎలాంటి వ్యక్తి, ఏంబోధించాడు లాంటి సమాచారం ఉండేది కాదు .
ఇరవయ్యోశతాబ్దప్రారంభం నుంచీ బౌద్ధం గురించి, అశోకుడి గురించి రచనలు రావటం మొదలైంది. అలా తెలుగులో బౌద్ధంపై రచనలు చేసిన తొలితరం రచయితలలో శ్రీ అద్దంకి కేశవరావు గారు ముఖ్యులు. నిజానికి కోనసీమలో అశోకుని పాలనలోనే బౌద్ధమతం వెల్లివిరిసింది. దీనికి అశోకుని కుమార్తె సంఘమిత్రచే నిర్మించినదిగా చెప్పబడే ఆదుర్రు స్తూపం ప్రముఖ సాక్ష్యంగా నిలుస్తుంది.
.
1. ఇతివృత్తం
.
ఒకే నటుడు ఒకే పాత్రను రంగస్థలంపై అభినయించే ప్రక్రియను ఏకపాత్రాభినయం అంటారు. అశోక చక్రవర్తి కళింగయుద్ధ సమయంలో జరిగిన ఘోర రక్తపాత దృశ్యాలను చూసి హృదయం ద్రవించి బౌద్ధమతాన్ని స్వీకరించటాన్ని ఇతివృత్తంగా తీసుకొని శ్రీ అద్దంకి కేశవరావు అశోకుడు ఏకపాత్ర రచించారు.
ఒక చక్రవర్తి యుద్ధం వల్ల కలిగే భీభత్సాన్ని గుర్తించి అహింసవైపు నడవటం అనేది మానవజాతి చరిత్రలో అత్యంత గొప్ప మానవీయ విలువలు కలిగిన ఉదంతం.
ఈ మొత్తం ఘట్టం BCE 260 లో వేయించబడిన అశోకుని 13 వ రాతి శాసనంలో విపులంగా ఉంది. ఇవి శాసనవాక్యాలు
.
"కళింగ యుద్ధంలో లక్షమంది చంపబడ్డారు. లక్షన్నరమంది బందీలుగా తరలించబడ్డారు. ఇంకా ఎంతో మంది చనిపోయారు. రాజ్యాన్ని జయించే క్రమంలో లక్షలమంది ప్రజలు బలవంతంగా చంపబడటం, తరలించబడటం, చనిపోవటం దేవానాం ప్రియుని బాధించాయి.
తమకు అత్యంతప్రియులగు స్నేహితులు, పరిచితులు, సహచరులు, బంధువులకు కలిగే బాధ తమకును బాధయే అగునట్లు దేవానాం ప్రియుడు కూడా మిక్కిలి శోకించుచున్నాడు. ఇతరులకు బాధకలిగించకూడదని, వారిని చంపకూడదని దేవానాంప్రియుడు కోరుకొనుచున్నాడు. ఇంతకుముందు కలిగిన జయముచాలును. క్రొత్తదేశములను జయింపనక్కరలేదు. ఈ సంగతి నా పుత్రులు, పౌత్రులు పాటిస్తారని ఈ శాసనమును లిఖింపచేయుచున్నాను"
కళింగయుద్ధం వలన విరాగియై అశోకచక్రవర్తి బౌద్ధదమ్మాన్ని స్వీకరించాడనటానికి పై శిలాశాసనం గొప్ప చారిత్రిక ఆధారం.
.
భారతదేశ చరిత్రను మలుపుతిప్పిన ఘటనకు కళారూపమే శ్రీ అద్దంకి కేశవరావు రచించిన అశోకుడు-ఏకపాత్ర.
.
2. సంవిధానం
ఈ ఏక పాత్రను మూడు అంకాలుగా విభజించుకొనవచ్చును. (క్షతగాత్రుడు, ఉపగుప్తుడు పాత్రలు తెరవెనుకనుంచి వాయిస్ ఓవర్ గా వచ్చే పాత్రలు)
మొదటి అంకంలో కళింగయుద్ధానంతరం ఆ యుద్ధంలో గాయపడిన ఒక కళింగవీరుడు అశోకుని వద్దకు వచ్చి-అశోకభూపతీ నీ రణపిపాస ఫలితంగా ఏర్పడిన పీనుగుల పెంటలను చూసుకొని ఆనందించు ... ఆనందించు…. అని నిందిస్తూ నిష్క్రమిస్తుంది. ఈ పాత్ర అశోకుని మనస్సులో అంతర్మధనాన్ని కలిగిస్తుంది.
రెండవ అంకంలో - యుద్ధభీభత్సం పట్ల అశోకునికి కలిగిన అశాంతి, నిర్వేదం అద్భుతంగా పలికిస్తారు రచయిత శ్రీ అద్దంకి కేశవరావు. ఉదాహరణకు ఈ వాక్యాలు చూడండి....
//ఎచ్చటచూచినను నెత్తుటిమడుగులు, తెగిపడిన హస్తములు! పాదములు! ముంజేతులు! మొండెములు! తొళ్ళెములు! శీర్షంబులు!....ఎంతభీకరముగనున్నదీ రణరంగము!
పై దృశ్యాలనుచూసాకా అశోకునిలో అపరాధనాభావన పెల్లుబికి ఈ యుద్ధం ద్వారా తానెంత ఘోరకార్యానికి ఒడికట్టాడో అర్ధమౌతుంది. ఆ సందర్భంలో రచయిత పలికించిన మాటలు మొత్తం ఏకపాత్రకే ఆయువుపట్టుగా ఉంటాయి. చక్కని అభినయం, గంభీరమైన వాచకం ఉన్న నటుడి చేతిలో ఈ వచనం పడితే అద్భుతంగా రాణిస్తుంది.
// నాయొక్క కీర్తి కొరకు.... నాయొక్కని వంశ ప్రతిష్టకొరకు.... నాయొక్కని జాత్యున్నతి కొరకు...ఎందరినెన్ని విధముల హింసించితినో..... వీరోత్తంసులు, ధీరోదాత్తులు స్వాజాత్యభిమానులు, స్వదేశభక్తులు, స్వారాజ్య స్వతంత్ర రక్షణ దీక్షా పరతంత్రులు నైన కళింగులను తుదముట్టించితిని కదా.... ఎందుకు ఈ పీనుగుల పెంటనేలుటకా... ఈ శ్మశాన రాజ్యపట్టాభిషిక్తుండనై కులుకుటకా!
- ఇంతటి విచక్షణా రహితంగా ఇన్ని లక్షల ప్రాణాలను పొట్టన పెట్టుకొన్న నీకు ప్రాయశ్చిత్తం లేదు, నీకు సద్గతులు లేవు, నీవు నశింపవలసినదే .... నశింపవలసినదే అంటూ తనలో తాను తర్కించుకొంటూ అశోకచక్రవర్తి తూలి స్పృహతప్పి పడిపోతాడు.
ఇక మూడవ అంకంలో అప్పటికే ప్రసిద్ధుడయిన బౌద్ధావలంబి ఉపగుప్తుని ఆశ్రమంలో కళ్ళుతెరిచి ఆ బుద్ధభగవానుని శరణుజొచ్చెద అంటూ బౌద్ధాన్ని స్వీకరించటంతో ఏకపాత్ర ముగుస్తుంది.
ఈ రచన ఆద్యంతం గంభీరమైన వచనంతో, ప్రౌఢమైన భాషా పటిమతో, ఒడలు జలదరించే సన్నివేశ చిత్రణలతో ఎంతో ఆర్థ్రంగా సాగుతుంది.
***
భారతదేశ చరిత్రలో అశోకుని పాత్ర చాలా గొప్పది. చారిత్రికంగా అశోకునితోనే భారతదేశంలో వ్రాత యుగం మొదలైంది. (అంతకు మునుపు సింధులోయనాగరికతలో ఒక లిపి ఉన్నప్పటికీ దానిని ఇప్పటికీ ఎలా చదవాలో తెలియదు.) అశోకుడు దేశం నలుచెరగులా సుమారు ఎనభైవేల వివిధ శాసనాలను ప్రాకృత బ్రహ్మి లిపి లో వేయించాడు.
బ్రహ్మి లిపిని James Prinsep డీకోడ్ చేసాకా ఒక గొప్ప ప్రాచీన ప్రపంచం మనముందు ఆవిష్కృతమైంది. బౌద్ధ, జైన వాజ్ఞ్మయాలు ద్వారా భారతదేశ నిజమైన ప్రాచీనచరిత్ర తెలిసింది. అశోకుడు వేయించిన శాసనాలు భారతదేశపు- తూర్పున నేటి బంగ్లాదేష్, పశ్ఛిమాన నేటి ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరాన కాశ్మీరు దక్షిణాన ఆంధ్రప్రదేష్, కర్ణాటకల వరకూ విస్తరించి ఉన్నాయి. అశోకుని శాసనాలు దొరికినంతమేరా ఒకప్పడు బౌద్ధం పరిఢవిల్లిన నేలగా గుర్తించవచ్చు. ఆ విధంగా అశోకునికి భారతదేశ చరిత్రలో ఉన్న స్థానం చెరపలేనిది.
నేడు భారతదేశంలో బౌద్ధమతం పునరుత్తేజం పొందుతున్నది. మేధావులు బుద్ధుని బోధనలోని అంతఃస్సారాన్ని గ్రహించారు. అసంఖ్యాకమైన దళితబహుజనులు తమ మూలాలు బుద్ధిజంలో ఉన్నాయని గ్రహిస్తున్నారు.
ఈ రచన 50 ఏళ్ల క్రితం రచించబడినదని రచయిత కుమారుడు శ్రీ అద్దంకి బుద్ధ చంద్రదేవ్ ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో అన్నారు.
అప్పటికి తెలుగులో బుద్ధిజంపట్ల నేడు ఉన్నంత విస్తృతమైన అవగాహన లేదు. ఆ రోజుల్లోనే- బౌద్ధం యొక్క విశిష్టతను గుర్తించి, ప్రచారంచేసిన కేశవరావు చరితార్ధులు. చిరస్మరణీయులు.
ఈ నేపథ్యంలో కేశవరావు రచించిన ఈ పుస్తకాన్ని పునర్ముద్రించటం ఎంతైనా ముదావహం. అభినందనీయం.
.
పుస్తకం లభించు చోటు
శ్రీ అద్దంకి బుద్ధ చంద్రదేవ్, ఫోన్: 9989244202
.
బొల్లోజు బాబా
18/3/2023







No comments:

Post a Comment