Friday, September 10, 2021

ప్రాకృత గాథలు –గౌడవహో, వాక్పతిరాజు పార్ట్ 2

 ప్రాకృత గాథలు –గౌడవహో, వాక్పతిరాజు పార్ట్ 2

***
యశోవర్మ పట్టాభిషేకం తరువాత దిగ్విజయ యాత్రకు బయలుదేరినపుడు రాజు గొప్పతనాన్ని అనేక గాథలలో వర్ణించాడు కవి. ఖడ్గ పరాక్రమం చేత శతృసంహారం జరిగి రాజ్యలక్ష్మి దక్కుతుంది కనుక కత్తిని లక్ష్మిదేవితో పోల్చుతూ అనేక గాథలు కలవు. 219 గాథలో ఖడ్గం లక్ష్మిదేవి నివసించే తామర తూడు లా ఉన్నదట. 252 గాథలో కవి ఊహాశాలిత అద్భుతమనిపిస్తుంది. దివి నుంచి భువికి హడావిడిగా వచ్చిన లక్ష్మిదేవి ఆ కంగారులో భర్త దేహవర్ణాన్ని తొడుక్కొని వచ్చేసిందట కనుక ఖడ్గం మెరుపులు నీలంరంగులో ఉన్నాయట. 256 లో రాజు ఈ భూమికి పతి అనే భావనను చాలా దూరం తీసుకెళ్తాడు కవి. కొన్ని అందమైన గాథలు.
.
ముత్యాలకొరకు ఏనుగు కుంభస్థలాలను
చీల్చిన ఆ ఖడ్గం
లక్ష్మిదేవి నివాసమైన మృణాలము వలె ఉన్నది (219)
.
శత్రువుల కవచాలను ఆ ఖడ్గం ఛేదిస్తున్నప్పుడు
నీలిరంగు మెరుపులు వస్తున్నాయి
దివి నుండి భువికి వచ్చే తొందరలో లక్ష్మిదేవి
తన భర్త నీలమేఘశ్యాముని దేహవర్ణాన్ని
పొరపాటున ధరించి ఉంటుంది (252)
.
భూమిపై నాటుకొన్న రాజాశ్వపు గిట్టల ముద్రలు
భూపతి తన ప్రియురాలికి చేసిన
నఖక్షతాల వలె ఉన్నాయి (256)
.
కొండగాలికి పగుళ్ళుతీసిన అడవి తాటిచెట్లు
నుండి కారిన కల్లు చేతులకు అంటుకోగా
వాటిని పదే పదే నాక్కుంటున్నాయి కోతులు పిచ్చిపట్టినట్లు (633)
ఈ అందమైన వేసవి సాయింత్రపు పూట
పొడవాటి నీడలు పడి పచ్చికలు
నగరం నుండి తిరిగొచ్చే గొల్లకాంతలు పాడే పాటలతో
అడవి అంచున సాగే బాటా చల్లబడుతున్నాయి (644)
.
దివాకరుని కిరణాలతో అల్లి
రెండుకొండల నడుమ వేలాడదీసిన
ఊయలపై ఊగుతూ ఆనందిస్తోంది
దివసలక్ష్మి (1081)
***
యశోవర్మ తన జైత్రయాత్రలో వింధ్యను దాటే క్రమంలో వింధ్యవాసినిని పూజించి ముందుకు సాగుతాడు. ఆ సందర్భంలో వింధ్యవాసిని గురించి కొన్ని గాథలు ఇలా…
.
అర్ధనారీశ్వరుని దేహంలో నీవుండేది
సగ భాగమే కావొచ్చు కానీ
హృదయంలో మాత్రం నీవే పూర్తిగా నిండి ఉన్నావు (292)
.
ఇక్కడే కొలువున్న కార్తికేయుని వాహనమైన
మయూరంపై ఆరాధనా భావంతో
అడవి నెమలులు ఈ ఆలయప్రాంగణాన్ని
విడిచి వెళ్ళటం లేదు. (299)
.
భక్తుడెవరో నీకు రక్తమోడే ఖండిత శిరస్సును
గుప్పెడు బియ్యం గింజలను సమర్పించినట్లుగా
రాత్రిదేవత నీకు అస్తమించే సూర్యబింబాన్ని
మిణుకుమనే నక్షత్రాలను సమర్పించుకొంటోంది. (307)
.
గ్రామాల్లో జాతరల సందడి మరుపురానిది
పిల్లలు కొత్తబట్టలు ధరిస్తారు
స్త్రీలు రంగురంగు చీరల్లో ముస్తాబౌతారు
పేదరైతులు మాత్రం ఉత్సాహం చూపలేరు (598)
***
.
యశోవర్మ దిగ్విజయ యాత్రలో ధ్వంసం చేయబడిన ఇళ్ళు, నగరాలు, వీధులు ఎలా ఉన్నాయో 659-688 గాథలలో వర్ణించా వాక్పతిరాజు.
.
ఓడిపోయిన నగరాలు రంగులుకోల్పోయిన ఇంద్రధనస్సు లాగ ఉన్నాయి;
ఉద్యానవనాలు దట్టమైన కీకారణ్యాలుగా మారిపోయాయి;
చెట్లకు కట్టిన ఊయలలు తాళ్ళు తెగి కొమ్మలకు వేలాడుతున్నాయి; స్త్రీల అలంకరణ పూలకొరకు మొగ్గలుగానే చిదమబడిన పూలలతలు నేడు పువ్వులు, కాయలు, పండ్లు విరగకాస్తున్నాయి;
పైకప్పు లేని ఒకనాటి భవనాలు ఎత్తైన మొండిగోడలతో నీరు లేని నూతులవలె అగుపిస్తున్నాయి;
రత్నాలను రాశులుగా పోసి అమ్మిన విఫణివీధులలో నేడు గతవైభవాన్ని గుర్తుచేస్తూ మణులుధరించిన నాగుపాములు సంచరిస్తున్నాయి;
ఊరివెలుపల పాతరాజుల విజయచిహ్నాలు కూలిపోయి, పొడిగారాలుతున్న వాటి ఎర్రని ఇటుకల మధ్య తొండలు తిరుగుతున్నాయి;
ఎత్తైన స్తంభాలకు వేలాడే గంటలు చేతికి అందవుకనుక చెక్కుచెదరలేదు;
వీధులలో పేర్చిన రాళ్ళు ఇంకా దృఢంగా, ఏ అరుగుదలా లేకుండా, గత వైభవపు పొడవు వెడల్పులను చాటిచెబుతున్నాయి;
కొలనులు, దేవాలయాలు మట్టితో కప్పబడి నేల ఎగుడు దిగుళ్లుగా మిగిలిపోయాయి;
నీటిని తోడే జలయంత్రపు ఇనుప కమ్ములు లేవు, కొయ్యలు శిథిలమయ్యాయి;
పై వర్ణనలలో పన్నెండువందలేళ్లక్రితం నగరాలు ఏవిధంగా ఉండేవో ఒక రాజు ఓడిపోతే అవి ఎలా శిధిలమౌతాయో కళ్లకుకట్టినట్ట్లు వర్ణించాడు వాక్పతిరాజు.
అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా
Source: Gaudavaho by Vakpatiraja, Edited by Prof NG Suru

No comments:

Post a Comment