Friday, September 3, 2021

ప్రాకృత గాథలు –గౌడవహో, వాక్పతిరాజు - 1

 ప్రాకృత గాథలు –గౌడవహో,  వాక్పతిరాజు

.

గౌడవహో (గౌడవధ) ప్రాకృత కావ్యాన్ని వాక్పతిరాజు అనే కవి రచించాడు. వాక్పతిరాజు  కన్యాకుబ్జ రాజైన  యశోవర్మ ఆస్థాన కవి. యశోవర్మ గౌడరాజును జయించి అతని  శిరస్సును ఖండించటం  గౌడవహో (గౌడవధ)  ఇతివృత్తం.   ఇది మహరాష్ట్రీ ప్రాకృతంలో రచింపబడిన 1209 గాథల కావ్యం.  ప్రతీగాథా  స్వతంత్రమైనది.  దేనికదే రసాస్వాదన కలిగిస్తుంది. 

గౌడవహో,   ప్రవరసేనుడు రచించిన రావణవహో (సేతుబంధ) కావ్యాలు ప్రాకృత కావ్యాలలో  ఆణిముత్యాలుగా పేరు తెచ్చుకొన్నాయి. కాళిదాసు ఉపమకు ఎలాగైతే ప్రఖ్యాతో  వాక్పతిరాజు ఉత్ప్రేక్షకు ప్రసిద్ధి అంటారు. 

*** 

ఏడవ శతాబ్దంలో హర్షుడు కన్యాకుబ్జాన్ని కేంద్రంగా చేసుకొని మధ్య ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాడు. చైనా యాత్రికుడు హుయాన్సాంత్ ఈ పట్టణాన్ని వర్ణిస్తూ “ఇక్కడ హిందు, బౌద్ధమతాలు సమానాదరణ పొందుతూన్నాయి.  రెండువందల దేవాలయాలు ఉన్నాయి.  పట్టణ పొలిమెరలు పటిష్టమైన ప్రాకారాలతో ఉన్నాయి.  ప్రజలు శాంతస్వభావులు. అన్ని కులాలు సంపదలతో తులతూగుతున్నాయి” అన్నాడు.  CE 647 లో హర్షుడు మరణించాక ఈ ప్రాంతంలో ఆధిపత్యపోరు తలెత్తింది.  అనేకమంది చిన్న చిన్న సామంతులు స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసుకొంటూ రాజకీయ అస్థిరతకు కారణమయ్యారు.  

ఆ తరువాత  యశోవర్మ  అనే రాజు (CE 725-752)   కన్యాకుబ్జాన్ని కేంద్రంగా చేసుకొని కొంతకాలం ఉత్తరభారతదేశాన్ని పాలించాడు. 

***

గౌడవహో కావ్యవృత్తాంతం

యశోవర్మ చేసిన జైత్రయాత్రలు, అతని పరాక్రమం గురించిన వర్ణనలతో కూడిన ప్రశస్థి కావ్యం గౌడవహో.   యశోవర్మ  తన  సామ్రాజ్య విస్తరణ కొరకు చేసిన విజయయాత్రలో మొదటగా  వింధ్యపర్వతంపై కొలువున్న శక్తిస్వరూపిణి అయిన శాంకరీదేవిని అర్చించి మగధదేశాన్ని చేరుకొని మగధ రాజుని జయించాడు.  తరువాత గౌడరాజుపై యుద్ధం చేసి అతడిని వధించాడు.  ఆ పిమ్మట  దక్షిణదిశగా పయనించి కొంకణ, వంగ రాజులని సామంతులుగా చేసుకొని, మార్వార్, హిమాచల రాజ్యాలను కైవసంచేసుకొన్నాడు. అయోధ్య లో  ఒక్కరోజులో గొప్ప దేవాలయాన్ని నిర్మించి ప్రజల మన్ననలు పొందాడు.   

గౌదావహాలో వర్ణించిన యశోవర్మ, అతని దిగ్విజయాలు కాల్పనికమైనవనే వాదన ఉన్నప్పటికీ - నలందలో దొరికిన ఒక శాసనము, యశోవర్మ  నాణాలు, అయోధ్యలో  నిర్మించిన ఆలయము, ఇతర ఇతర జైన రచనల ద్వారా యశోవర్మ చారిత్రిక వ్యక్తి అని చరిత్రకారులు నిర్ధారించారు. 

వాక్పతి రాజు

వాక్పతిరాజు యశోవర్మ ఆస్థాన కవి. ఇతనికి కవిరాజు అనే బిరుదు కలదు. వాక్పతి రాజు గురించి జైన సాహిత్యంలో ఆసక్తికరమైన కథనమొకటి  ఇలా ఉంది.

వాక్పతిరాజు పరమర రాజ కటుంబానికి చెందిన కవి. ఇతను  ధర్మ అనే మరోరాజుకు సన్నిహితంగా ఉండేవాడు.  కొన్నాళ్ళకు యశోవర్మ ఈ ధర్మ రాజును జయించి అతని రాజ్యాన్ని కైవశం చేసుకొన్నప్పుడు, ఈ వాక్పతిరాజును కారాగారంలో వేయించాడు. బంధిఖానాలో ఉన్న వాక్పతిరాజు యశోవర్మ దిగ్విజయగాథను గౌడావహో కావ్యంగా రచించి అతనికి కానుకగా ఇచ్చాడు. ఆ కావ్యం యొక్క గొప్పతనాన్ని గ్రహించిన  యశోవర్మ వాక్పతిరాజును కారాగారం నుంచి విడుదల చేసి తన ఆస్థానకవిగా నియమించుకొన్నాడు. అలా బంధవిముక్తుడైన వాక్పతిరాజు సన్యాసిగా మారి మధుర లోని వరాహస్వామి ఆలయంలో ఆథ్యాత్మిక జీవనం  సాగించసాగాడు.  జీవిత చరమాంకంలో వాక్పతిరాజు తన మిత్రుడైన బప్పభట్టి ప్రోద్భలంతో శ్వేతాంబర జైనాన్ని స్వీకరించి జినశ్రీగా మారి, అనాశన (నిరాహార) ప్రక్రియద్వారా మోక్షం పొందినట్లు బప్పభట్టి సూరి చరిత అనే జైన గ్రంధం ద్వారా తెలుస్తున్నది. 

గౌడావహో కావ్యం CE 727-731 మధ్య వ్రాయబడి ఉండొచ్చునని ప్రముఖ చరిత్రకారుడు ఎమ్. ఎమ్. మిరాశి అభిప్రాయపడ్డాడు. 

గౌడావహో చారిత్రిక కావ్యం. దీనిలో సాహిత్యసంగతులతో పాటు ఆనాటి విలువైన చారిత్రిక అంశాలు కూడా అనేకం కనిపిస్తాయి.

***

గౌడవహో లో కొన్ని గాథలు

గౌడావహో కాలానికి ప్రధానంగా బౌద్ధం, జైనం, హిందూమతం ఉనికిలో ఉన్నాయి.  ఈ మూడు మత విశ్వాసాలను ఆచరించే ప్రజలు సహిష్ణుతతో సామరస్యంతో,  ఏ రకమైన వైషమన్యాలు లేక సహజీవనం సాగించేవారు. హిందువులు శైవ, వైష్ణవ, సూర్య ఆరాధనలు, బౌద్ధ, జైన మతావలంబకులు వారి వారి థీర్థంకరులను కొలిచేవారు.  

.

యజ్ఞగుండం నుంచి పైకి లేచిన

లతలవంటి మెలికలు తిరిగిన నల్లని పొగ

స్వర్గలోకంలోని ఇంద్రుని ఐరావతం చెక్కిళ్ళనుండి 

క్రిందికి స్రవించే నల్లని మద జల చారిక వలె ఉన్నది. (1093)

పై గాథ ద్వారా వైదిక సాంప్రదాయం ప్రకారం ఇంద్రుడు, వరుణుడు వంటి దేవతలను ప్రసన్నం చేసుకొనేందుకు యజ్ఞయాగాదుల వంటి జరిగేవని అర్ధం చేసుకొనవచ్చును. భూమిపైన పైకి లేచిన పొగను,  పైనుంచి క్రిందకి కారే స్వర్గలోకపు మత్తగజపు నల్లని మదనజలచారిక లా ఉంది అనటం చక్కని ఊహ. 

పై మూడువిశ్వాసాలకు చెందినవారే కాక వింధ్యపర్వతాలలో శక్తి ఆరాధకులు ఉండేవారు.  వీరు వింధ్యవాసిని ఆలయంలో పర్వదినాలలో జరిగే మహా పశు బలి ని (మానవ బలి) చూడటానికి శక్తిని ఆరాధించే యువతులు ఒకరిభుజాలపై పై ఒకరు ఎక్కి ఉత్సాహపడుతున్నారు” అనే వర్ణన 319 వ గాథలో ఉన్నది. 

***

ఇష్టదైవాన్ని, పూర్వకవులను స్తుతించటం కావ్యలక్షణాలు.  మొదటి అరవై గాథలలో ఇష్టదేవతా స్తుతి ఉంటుంది.  (సారూప్యం కలిగిన గాథలను కులక అంటారు).   ఆ తరువాత ముప్పై ఆరు గాథలలో కవులగురించి, వారి సాధకబాధకాల గురించి ప్రాకృతభాషను పండితులు ఏ విధంగా చులకనగా చూసేవారో  చెప్పాడు వాక్పతిరాజు.  

కవి సంపూర్ణ ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలని లేనట్లయితే నవ్వులపాలు కావల్సి వస్తుందని ఒక చక్కని పోలికతో  హెచ్చరించటం 68 లో కనిపిస్తుంది. 93, 95 గాథలలో  సంస్కృత పండితుల అలక్ష్యాన్ని ఎత్తిచూపుతూనే ప్రాకృతభాష లోని సొబగులను గొప్ప ఆత్మవిశ్వాసంతో ప్రకటించటం గమనించవచ్చు. 

.

లక్ష్మి కటాక్షం లవలేశమంత  చాలు 

గౌరవానందాలు పొంద టానికి

సరస్వతీ కటాక్షంలో కించిత్ లోటున్నా

నవ్వుల పాలు కావల్సిందే (68)

.

ప్రాకృతభాషలోని అద్భుతసౌందర్యాన్ని  తృణీకరించే వారి పట్ల 

మేము జాలిపడతాం, నవ్వుకొంటాం  తప్ప బాధపడం;  

గొప్పకవిత్వాన్ని  విస్మరిస్తున్నందుకు 

మేమెందుకు దుఃఖపడాలి? (95)

.

పూర్వకవులు  అన్నీ రాసేసారు, ఇంక

ఆధునిక కవికి వస్తువు ఎక్కడుందీ- అంటారు కానీ

పాత కొత్తల సరిహద్దులు చెరిపేసి, ఊహాశాలితను పెంచుకొంటే 

ప్రతి వస్తువూ కొత్తగా కనిపించదూ! (85)


అన్ని భాషలూ 

ప్రాకృతంలోకలిసి దానిలోంచే ఉదయిస్తాయి

నీరు సముద్రంలో కలిసి 

మరలా దానినుంచే  బయటకు ప్రవహించినట్లు (93)

***

అనువాదం, వ్యాఖ్యానం

బొల్లోజు బాబా

Source: Gaudavaho by Vakpatiraja, Edited by Prof NG Suru



No comments:

Post a Comment