Sunday, September 26, 2021

బక్కచిక్కిన ప్రశ్న వొకటి....

 బక్కచిక్కిన ప్రశ్న వొకటి....

మొదటి ప్రశ్నను నరుకుతోన్నపుడు
మనం పెద్దగా పట్టించుకోలేదు
పట్టించుకొన్నామేమో!
అది సరిపోలేదు
ఇపుడు
ప్రశ్నలన్నింటిమీదా
రంపం కోత చారలు
ప్రశ్నలన్నీ అంతరించాకా
పాంపే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ దేహాల్లా
ఒకేరంగు దుస్తులు ధరించి
విజృంభిస్తోన్న కుంటి జవాబులు
ఫాక్టరీల్లో తయారుచేసి
హెలికాప్టర్లలో ఊర్లపై వెదజల్లే
అభిప్రాయాల్లాంటి జవాబులు
ఎక్కడ చూసినా
ఎర్రటి ఎండలో
బక్కచిక్కిన ప్రశ్నొకటి తన నీడలో తనే
కుక్కలా ముడుచుకు
పడుకొంది.....
పిల్లల చిన్నప్పటి ఆల్బమ్ ని
తడుముతో చూసుకొనే
వృద్ధ తల్లిలా
దాని చెంపకు నా చెంపను ఆనించి
దాని దుఖఃం వింటున్నాను
బొల్లోజు బాబా

Brain in a Jar

 Brain in a Jar

నిన్న లేదు, రేపూ లేదు
ఈ క్షణం అంతకన్నా లేదు
నిద్రలేస్తే అదృశ్యమయ్యే స్వప్నం లాంటి
ఆలోచన మాత్రమే ఇదంతా
ఇంకా చెప్పాలంటే
ఆలోచన ఉందన్న స్పృహే
ఈ ప్రపంచం.
పూలు, కన్నీరు,
నాలికపై కరిగే చక్కెర గుళికా
నొప్పి తెప్పించే సిరెంజి సూది
ఈ మతం, ఈ కులం, ప్రజాస్వామ్యం
ప్రతీదీ ఒక ఆలోచన
మనిషిదో, శవానిదో, కాలానిదో!
నువ్వింతవరకూ చూడని
నా చిన్ననాటి నీలం చొక్కా నీకు లేనట్టే
నేనింతవరకూ చూడని
ఈఫిల్ టవర్ నాకూ లేనట్టే
డైనోసార్లని, పలాయనించే గజాన్ని, నీలం చొక్కాల్ని
కాలాతీతంగా ఒకే రంగస్థలంపై నాట్యం చేయించే
స్పృహ మాత్రమే అంతిమ సత్యం
మిగిలినదంతా ఒట్టి హంబగ్.
ఆలోచనల్ని స్రవించే
నువ్వూ నేనూ
గాజు సీసాలోని ఉత్త మెదళ్ళం.
బొల్లోజు బాబా

Alone but Together....

 Alone but Together....

The Two of Us Together and
Each of Us Alone - from a rental contract
అనే Yehuda వాక్యం వల్ల నిద్రపట్టక దొర్లుతుంటే
సడన్ గా ఫోన్ మోగింది
"మావయ్య పోయాడురా" అన్నాడు కుమార్ బావ
"ఎలాగా" అనబోయి అర్ధరహితమనిపించి
"అలాగా, రేపు బయలుదేరి వస్తాను" అన్నాను
ఒక్కసారిగా
అమ్మ గుర్తుకొచ్చింది
"నీకిష్టమని మజ్జిగ పులుసు చేసానురా తమ్ముడూ"
అంటూ కొసరి కొసరి వడ్డించేది మామయ్యకు
"ఉండు బస్టాండు దాకా వస్తాను" అంటూ చొక్కావేసుకొనే
నాన్న గుర్తొచ్చాడు
"వాడొట్టి వెర్రిబాగులోడు ఎలా బతుకుతాడో ఎంటో"
అంటూండే అమ్మమ్మ గుర్తుకొచ్చింది
"ఇంటికి పెద్దోడివి నువ్వే డీలా పడిపోతే ఎలా" అంటూ
నాన్న లేనప్పుడు ధైర్యం చెప్పిన అత్తయ్య గుర్తుకొచ్చింది
"మీ అత్తయ్య పోయినప్పటినుండీ
బతకాలనిపించటం లేదురా" అని వలవలా ఏడ్చిన
మామయ్య గుర్తుకొచ్చాడు
ఒక చావు వంద చావుల్ని బతికిస్తుంది
జీవించటం అంటే
ప్రేమించిన ఒక్కొక్కరినీ కోల్పోవటం కాదూ!
బొల్లోజు బాబా

Sunday, September 12, 2021

ప్రయాణించు

 ప్రయాణించు

.
ఈ లోకంలో ప్రయాణించటానికి ప్రయత్నించు
లేకపోతే
నువ్వో జాత్యహంకారివి అయ్యే ప్రమాదం ఉంది
నీ చర్మం రంగు మాత్రమే సరైనదని
నీ మాతృభాషే లెస్స అయినదని
నువ్వే అన్నింటిలో ప్రధముడవని
నమ్మే స్థాయికి దిగజారవచ్చు
ప్రయాణించు
నువ్వు ప్రయాణించకపోతే
నీ ఆలోచనలు భావాలతో నిండి బలపడవు
నీ కలలు దుర్బల పాదాలతో జనిస్తాయి
నువ్వు టివీ షోలను
నీ పీడకలలకు సరిపడా శత్రువులను తయారుచేసి
నువ్వు భీతిల్లుతూ జీవించేలా చేసిన వారిని
నమ్మటం మొదలుపెడతావు
ప్రయాణించు
ప్రయాణించటం
మనం ఏ సూర్యుడినుంచి వచ్చినప్పటికీ
ఎదురుపడిన వానికి శుభోదయం చెప్పటం నేర్పుతుంది
ప్రయాణించటం
మనలోపల ఎన్ని చీకట్లను మోసుకుతిరుగుతున్నప్పటికీ
అందరికీ శుభరాత్రి చెప్పటం నేర్పుతుంది
ప్రయాణించటం
ఒద్దు అనిచెప్పటాన్ని
స్వతంత్రంగా ఉండటాన్ని నేర్పుతుంది.
వారేమిటో అనిమాత్రమే కాక
వారు ఎన్నటికీ ఏమికారో అనేదాన్ని బట్టి కూడా
ఇతరులని అంగీకరించటం నేర్పుతుంది.
మన సంస్కృతి సంప్రదాయాలకు అతీతంగా
మన సామర్థ్యాలను మనకు అర్ధం చేయిస్తుంది
ప్రయాణించు
లేకపోతే
ఒక విశాల దృశ్యంలో నువ్వూ ఒక భాగమని
నీలోనే ఇంకా అన్వేషించాల్సిన
అనేక అద్భుత సౌందర్యాలు ఉన్నాయని
నిన్ను నువ్వే మభ్యపెట్టుకొంటావు
Source: Gio Evan, poet and songwriter.
Translated from Italian.
అనువాదం: బొల్లోజు బాబా

Friday, September 10, 2021

ప్రాకృత గాథలు –గౌడవహో, వాక్పతిరాజు పార్ట్ 2

 ప్రాకృత గాథలు –గౌడవహో, వాక్పతిరాజు పార్ట్ 2

***
యశోవర్మ పట్టాభిషేకం తరువాత దిగ్విజయ యాత్రకు బయలుదేరినపుడు రాజు గొప్పతనాన్ని అనేక గాథలలో వర్ణించాడు కవి. ఖడ్గ పరాక్రమం చేత శతృసంహారం జరిగి రాజ్యలక్ష్మి దక్కుతుంది కనుక కత్తిని లక్ష్మిదేవితో పోల్చుతూ అనేక గాథలు కలవు. 219 గాథలో ఖడ్గం లక్ష్మిదేవి నివసించే తామర తూడు లా ఉన్నదట. 252 గాథలో కవి ఊహాశాలిత అద్భుతమనిపిస్తుంది. దివి నుంచి భువికి హడావిడిగా వచ్చిన లక్ష్మిదేవి ఆ కంగారులో భర్త దేహవర్ణాన్ని తొడుక్కొని వచ్చేసిందట కనుక ఖడ్గం మెరుపులు నీలంరంగులో ఉన్నాయట. 256 లో రాజు ఈ భూమికి పతి అనే భావనను చాలా దూరం తీసుకెళ్తాడు కవి. కొన్ని అందమైన గాథలు.
.
ముత్యాలకొరకు ఏనుగు కుంభస్థలాలను
చీల్చిన ఆ ఖడ్గం
లక్ష్మిదేవి నివాసమైన మృణాలము వలె ఉన్నది (219)
.
శత్రువుల కవచాలను ఆ ఖడ్గం ఛేదిస్తున్నప్పుడు
నీలిరంగు మెరుపులు వస్తున్నాయి
దివి నుండి భువికి వచ్చే తొందరలో లక్ష్మిదేవి
తన భర్త నీలమేఘశ్యాముని దేహవర్ణాన్ని
పొరపాటున ధరించి ఉంటుంది (252)
.
భూమిపై నాటుకొన్న రాజాశ్వపు గిట్టల ముద్రలు
భూపతి తన ప్రియురాలికి చేసిన
నఖక్షతాల వలె ఉన్నాయి (256)
.
కొండగాలికి పగుళ్ళుతీసిన అడవి తాటిచెట్లు
నుండి కారిన కల్లు చేతులకు అంటుకోగా
వాటిని పదే పదే నాక్కుంటున్నాయి కోతులు పిచ్చిపట్టినట్లు (633)
ఈ అందమైన వేసవి సాయింత్రపు పూట
పొడవాటి నీడలు పడి పచ్చికలు
నగరం నుండి తిరిగొచ్చే గొల్లకాంతలు పాడే పాటలతో
అడవి అంచున సాగే బాటా చల్లబడుతున్నాయి (644)
.
దివాకరుని కిరణాలతో అల్లి
రెండుకొండల నడుమ వేలాడదీసిన
ఊయలపై ఊగుతూ ఆనందిస్తోంది
దివసలక్ష్మి (1081)
***
యశోవర్మ తన జైత్రయాత్రలో వింధ్యను దాటే క్రమంలో వింధ్యవాసినిని పూజించి ముందుకు సాగుతాడు. ఆ సందర్భంలో వింధ్యవాసిని గురించి కొన్ని గాథలు ఇలా…
.
అర్ధనారీశ్వరుని దేహంలో నీవుండేది
సగ భాగమే కావొచ్చు కానీ
హృదయంలో మాత్రం నీవే పూర్తిగా నిండి ఉన్నావు (292)
.
ఇక్కడే కొలువున్న కార్తికేయుని వాహనమైన
మయూరంపై ఆరాధనా భావంతో
అడవి నెమలులు ఈ ఆలయప్రాంగణాన్ని
విడిచి వెళ్ళటం లేదు. (299)
.
భక్తుడెవరో నీకు రక్తమోడే ఖండిత శిరస్సును
గుప్పెడు బియ్యం గింజలను సమర్పించినట్లుగా
రాత్రిదేవత నీకు అస్తమించే సూర్యబింబాన్ని
మిణుకుమనే నక్షత్రాలను సమర్పించుకొంటోంది. (307)
.
గ్రామాల్లో జాతరల సందడి మరుపురానిది
పిల్లలు కొత్తబట్టలు ధరిస్తారు
స్త్రీలు రంగురంగు చీరల్లో ముస్తాబౌతారు
పేదరైతులు మాత్రం ఉత్సాహం చూపలేరు (598)
***
.
యశోవర్మ దిగ్విజయ యాత్రలో ధ్వంసం చేయబడిన ఇళ్ళు, నగరాలు, వీధులు ఎలా ఉన్నాయో 659-688 గాథలలో వర్ణించా వాక్పతిరాజు.
.
ఓడిపోయిన నగరాలు రంగులుకోల్పోయిన ఇంద్రధనస్సు లాగ ఉన్నాయి;
ఉద్యానవనాలు దట్టమైన కీకారణ్యాలుగా మారిపోయాయి;
చెట్లకు కట్టిన ఊయలలు తాళ్ళు తెగి కొమ్మలకు వేలాడుతున్నాయి; స్త్రీల అలంకరణ పూలకొరకు మొగ్గలుగానే చిదమబడిన పూలలతలు నేడు పువ్వులు, కాయలు, పండ్లు విరగకాస్తున్నాయి;
పైకప్పు లేని ఒకనాటి భవనాలు ఎత్తైన మొండిగోడలతో నీరు లేని నూతులవలె అగుపిస్తున్నాయి;
రత్నాలను రాశులుగా పోసి అమ్మిన విఫణివీధులలో నేడు గతవైభవాన్ని గుర్తుచేస్తూ మణులుధరించిన నాగుపాములు సంచరిస్తున్నాయి;
ఊరివెలుపల పాతరాజుల విజయచిహ్నాలు కూలిపోయి, పొడిగారాలుతున్న వాటి ఎర్రని ఇటుకల మధ్య తొండలు తిరుగుతున్నాయి;
ఎత్తైన స్తంభాలకు వేలాడే గంటలు చేతికి అందవుకనుక చెక్కుచెదరలేదు;
వీధులలో పేర్చిన రాళ్ళు ఇంకా దృఢంగా, ఏ అరుగుదలా లేకుండా, గత వైభవపు పొడవు వెడల్పులను చాటిచెబుతున్నాయి;
కొలనులు, దేవాలయాలు మట్టితో కప్పబడి నేల ఎగుడు దిగుళ్లుగా మిగిలిపోయాయి;
నీటిని తోడే జలయంత్రపు ఇనుప కమ్ములు లేవు, కొయ్యలు శిథిలమయ్యాయి;
పై వర్ణనలలో పన్నెండువందలేళ్లక్రితం నగరాలు ఏవిధంగా ఉండేవో ఒక రాజు ఓడిపోతే అవి ఎలా శిధిలమౌతాయో కళ్లకుకట్టినట్ట్లు వర్ణించాడు వాక్పతిరాజు.
అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా
Source: Gaudavaho by Vakpatiraja, Edited by Prof NG Suru

కువలయమాల Part 1

 కువలయమాల Part 1

కువలయమాల ఉద్యోతన సూరి అనే జైనాచార్యుడు CE 779 లో ప్రాకృతభాషలో వ్రాసిన కావ్యం పేరు. కువలయమాల అంటే “నీలి కలువల మాల” అని అర్ధం. కువలయమాల చంపూ లక్షణాలు కలిగిన కావ్యం. చంపూ లక్షణం అంటే పద్యము గద్యము కలగలిసి ఉండటం. ఈ తరహా శైలికి ఇదే ప్రధమమని ఆ తరువాత ఇదే బాణీలో అనేక కావ్యాలు వెలువడ్డాయి అంటారు.
చంద్రపాలుడనే యువరాజు, కువలయమాల అనే కధానాయికని పెండ్లాడటం కావ్య ఇతివృత్తం. కథాగమనంలో క్రోధం, గర్వం, వంచన, లోభం, మోహం లాంటి మానవ లౌల్యాలను వరుసగా చంద్రసోము, మానభట్టు, మాయాదిత్యుడు, లోభదేవుడు, మోహదత్తుడు అనే ప్రతీకాత్మక (allegorical) పాత్రలుగా చేసి వారితోనే వారి జీవిత అనుభవాలను చెప్పించి తద్వారా జైనమత ధర్మాలను బోధింపచేసాడు ఉద్యోతనసూరి.
కువలయమాలలో సాహిత్య అంశాలకన్న ఒకనాటి సామాజిక, రాజకీయ అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. వీటిలో కొన్ని ఆంధ్రదేశానికి చెందినవై ఉండటం మరింత ఆసక్తిదాయకం.
.
ఉద్యోదనసూరి
ఉద్యోతన సూరి క్షత్రియ వర్ణానికి చెందిన వ్యక్తి. ఇతనికి దాక్షిణ్యసింహ అనే మరోపేరు కూడా కలదు. ఇతను ఈ కువలయమాల కావ్యాన్ని నేటి జోధ్ పూర్ పట్టణానికి 75 మైళ్ళ దూరంలో ఉన్న సుక్రి నది ఒడ్డున కల జాబాలిపుర అనే ఊరిలో నివసిస్తూ రాసినట్లు, రాజహస్తిన్ వత్సరాజు తన ప్రభువు గాను చెప్పుకొన్నాడు. రానహస్తిన్ వత్సరాజుకి చెందిన 9 నాణాలు కానౌజ్ వద్ద లభించాయి. ఉద్యోదనసూరి గురువు జినాచార్య హరిగుప్తుడు.
***
కువలయమాల కథానాయకుడు కథానాయికిని వెతుక్కొంటూ విజయపురి అనే పట్టణాన్ని చేరుకొంటాడు. ఈ విజయపురి కృష్ణా నది ఒడ్డున, సముద్రయానానికి అనువైన నౌకాశ్రయానికి కొద్దిమైళ్ళ దూరంలో ఉండి అయోధ్యనుంచి ఒక నెల మూడురోజుల వ్యవధిలో చేరుకోగలిగే నగరంగా వర్ణించబడింది. కువలయమాల రచనా కాలానికి ఆంధ్రప్రాంతంలో ఇక్ష్వాకుల పాలన, నాగార్జున కొండ వైభవం చారిత్రికంగా కనిపించే విశేషాంశాలు. అప్పట్లో ఈ ప్రాంతం వ్యాపారరంగంలో, విద్యాపరంగా ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానంలో ఉండేది. కథానాయకుడు విజయపురి నగరసంచారం చేసి అనేక విషయాలను గమనించినట్లు చెప్తూ ఆనాటి అనేక సమకాలీన అంశాలను తన రచనలో పొందుపరిచాడు ఉద్యోతనసూరి.
విజయపురిలో ఉన్న ఒక ఆశ్రమపాఠశాలలో కర్ణాటక, లాట, మాళవ, కన్యాకుబ్జ, నాసిక్, మహరాష్ట్ర, సౌరాష్ట్ర, డక్క, సింధు లాంటి దేశాలనుంచి వచ్చిన విద్యార్ధులు వ్యాకరణం, బౌద్ధం, సాంఖ్యం, జైన, చార్వాక దర్శనాలు, 72 కళలు, 64 విజ్ఞానాలు (నిమిత్త, మంత్ర, యోగ, Ajñana (ప్రాచీన నాస్తికవాదం), బ్లాక్ మాజిక్, ధాతువాదం, యక్షిణిసిద్ధి, యుద్ధవిద్య, యోగమాల, యంత్రమాల, జ్యోతిష్య, రసాయిన, చందస్సు, వృత్తినిరుక్త, పాత్రచ్ఛేధ లాంటి విద్యలు) నేర్చు కొంటున్నారట. (150-151 verse).
ఈ సందర్భంగా వేదాధ్యయనం చేస్తున్న కొద్దిమంది విద్యార్ధులను ఎద్దేవాచేస్తూ ఉద్యోతన సూరి కొన్ని వ్యాఖ్యలు చేసాడు.
““““““““వీరు వేదాలను భట్టీయం వేస్తున్నారు; బలమైన కండలు తిరిగిన దేహంతో నిత్యం వ్యాయామం చేస్తూ లెక్కలేనితనంతో హింసాత్మక ధోరణితో జీవిస్తున్నారు; వీళ్ళంతా నైతికవిలువలు లేని మూర్ఖుల సమూహం””””””””.
.
హిందూమతం ఇంకా పూర్తిగా స్థిరీకరింపబడని కాలంలో వేదాలను అధ్యయనం చేస్తున్న హిందు విద్యార్ధుల పట్ల జైనుడైన ఉద్యోదనసూరి చేసిన ఈ వ్యాఖ్యలు చారిత్రికంగా విలువైనవి.
పైన చెప్పిన ఆశ్రమపాఠశాల ఆంద్రదేశంలో అప్పటికే ప్రసిద్ధిచెందిన ఆచార్యనాగార్జునిని విశ్వవిద్యాలయం కావొచ్చును. ఆచార్యనాగార్జునుడు (150-250 CE) ఆధ్వరంలో నెలకొల్పిన బౌద్ధవిద్యాలయం 5 అంతస్థులతో 1500 గదులు కలిగి ఉన్నదని చైనా యాత్రికుడు ఫాహియాన్ (ఐదో శతాబ్దం) పేర్కొన్నాడు.
***
విజయపురి విఫణివీధులలో వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారస్తులను కథానాయకుడు పరిశీలించి వారు 18 రకాల భాషలు మాట్లాడుతున్నట్లు గుర్తిస్తాడు. వీరిలో ఆంధ్రుల గురించి ఇలా ఉన్నది…....... ఆంధ్రులు రసికులు, యుద్ధప్రియులు, అందగాళ్లు, భోజనప్రియులు. వారు అతి పుతి రతిమ్ అని మాట్లాడుకొంటున్నారు (They utter ati puti ratim). ఇంతే కాక ఈ విఫణివీధి ఘట్టంలో – మధ్యదేశస్థులు మాటకారులని; మగథవారు అందవికారులని; సైంధవులు సున్నితులని; గుర్జరులు దైవభక్తులని; మాళవులు ఉద్రేకస్వభావులని; కర్ణాటకులు గర్విష్టులని; మహరాష్ట్రీయులు కలహప్రియులని అంటూ చేసిన పరిశీలనల ద్వారా ప్రాంతాన్ని బట్టి అక్కడి వ్యక్తుల ప్రవర్తనను కల్పన చేయటం విశ్వసనీయంగా అనిపించకపోయినా, ఒకనాటి ఆంధ్రదేశంలో కృష్ణానది ఒడ్డున ఉండిన విజయపురి అనేక జాతులు నివసించిన కాస్మొపొలిటన్ నగరమని మాత్రం అవగతమౌతుంది.
ఇంకాఉంది
References
Kuvalayamala by A.N. Upadhye
Language of snakes by Andrew Ollett

కువలయమాల Part 2

 కువలయమాల Part 2

.
కువలయమాల లో పూర్వకవుల ప్రశస్థిని చెప్పే అంకంలో ఉద్యోతనసూరి తాను ఇష్టపడే కవులపట్ల వినయాన్ని ఇలా ప్రకటించుకొన్నాడు.
.
పాలితుడు, శాతవాహనుడు, చప్పన్నయ రచనలు
సింహగర్జనల వలె ఉంటాయి
నేనో జింకపిల్లను
ఒక్క అడుగు ముందుకు ఎలా పడుతుంది?
.
పైన ప్రస్తావించిన ముగ్గురు ప్రాకృత కవులలో పాలితుడు తరంగవతి పేరుతో గొప్ప ప్రాకృత కావ్యాన్ని రచించిన జైన కవి. ఒకటో శతాబ్దానికి చెందినవాడు. ఈ రచన నేడు అలభ్యం. ఇతను గాథాసప్తశతి సంకలనకర్త అయిన హాల చక్రవర్తి ఆస్థాన కవి.
శాతవాహనుడు అంటే హాలచక్రవర్తి. శాతవాహనుల కాలంలో చప్పన్నయల పేరుతో కొంతమంది కవులు ఉండేవారని; వీరి గురించిన ప్రస్తావనలు దండి, అభినవగుప్తుని రచనలలో కనిపిస్తాయని; వీరు మొత్తం 56 మంది అని పండితుల అభిప్రాయం. Chappaṇṇayagāhāo అనేది వీరి గాథల సంకలనం. ఇవి కూడా సప్తశతి గాథలవలె ఉంటాయి. ఈ రచన నేడు అలభ్యం.
***
కువలయమాల ఒక చారిత్రిక సంధికాలంలో వ్రాసిన కావ్యం. అంతవరకూ ప్రజల భాషగా, కావ్యభాషగా చలామణీ అయిన ప్రాకృత భాషను సంస్కృతభాష క్రమేపీ తొలగించుకొంటూ వస్తున్నకాలమది. ప్రాకృతభాష జైన బౌద్ధాల మతభాష. సంస్కృతం హిందూమతభాష. సామాజికంగా సనాతనధర్మం/వైదికమతం హిందూమతంగా స్థిరీకరింపబడుతున్న కాలం కూడా అది.
ప్రాకృతభాషను ప్రేమించి, దానిలో గొప్ప సాహిత్యాన్ని సృజించిన ఉద్యోతనసూరి, వాక్పతిరాజు లాంటి కవులకు ప్రాకృతభాష అలా అప్రాధాన్యమవటం బాధకలిగించి ఉండవచ్చు. గౌడవహోలో వాక్పతిరాజు తన ఆవేదనను ఆత్మగౌరవ ప్రకటనారూపంగా ఒక గాథలో ఇలా నిక్షిప్తం చేసాడు.
.
ప్రాకృతభాషలోని అద్భుతసౌందర్యాన్ని
తృణీకరించే వారిని చూసి
మేము జాలిపడతాం, నవ్వుకొంటాం తప్ప బాధపడం;
గొప్పకవిత్వాన్ని విస్మరిస్తున్నందుకు
మేమెందుకు దుఃఖపడాలి? (95)
.
పై గాథను బట్టి ప్రాకృత రచనలను విస్మరించటం ఏడవశతాబ్దం నాటికే మొదలైందని అర్ధం చేసుకొనవచ్చును. దూసుకొస్తున్న సంస్కృతం ధాటికి ప్రాకృతంలో ఉండిన గొప్పసాహిత్యం కనుమరుగు అవ్వొచ్చు అనే ఊహ ప్రాకృతకవులను బాధించింది. అయినప్పటికీ ప్రాకృతసాహిత్యాన్ని తృణీకరించటం వల్ల సమాజమే నష్టపోతోంది మాకేం బాధ అనటం ఒక చారిత్రిక సందర్భాన్ని ఘనీభూతం చేయటమే.
***
ఉద్యోతనసూరి కూడా ఒకనాటి సంస్కృత, ప్రాకృత భాషల మధ్య నడిచిన రాజకీయాలను ఒక ఘట్టం ద్వారా కువలయమాలలో నిక్షిప్తం చేసాడు.
ధనదేవుడు అనే వ్యాపారి నౌకాభంగం వల్ల ఒడ్డుకు కొట్టుకొని వచ్చి ఒక అడవి చేరతాడు. అక్కడ అతను నరమాంసభక్షకులను భీకరమైన గంఢభేరుండ పక్షులను తప్పించుకొని ఒక చెట్టుక్రిందకు చేరి విశ్రమించగా కొద్దిసేపటికి అతనికి వింతైన భాషలో సంభాషణలు వినిపిస్తాయి. ఆ సంభాషణలు ఏ భాషకు చెందినవో అర్ధం కాక పరిపరివిధాలుగా ఇలా తర్కించుకొంటాడు.
“““““““““నేను వింటున్నది ఏ భాష? సంస్కృతం కాదు. ఎందుకంటే సంస్కృతం దుష్టుని హృదయంలా కఠినంగా ఉంటుంది; పదాలకు నానార్ధాలతో, వాక్యనిర్మాణానికి వందల మెలికలతో; అర్ధం చేసుకోవటానికి కష్టంగా ఉంటుంది. ఇది అలా లేదు.
ఇది ప్రాకృతమా? కాదు. ఎందుకంటే ప్రాకృతం మంచివారి పలుకుల్లా ఆనందాన్నిస్తుంది; గొప్ప వ్యక్తులు జీవితసాగరాన్ని మధిస్తూంటే, ఎగసిపడే జ్ఞాన కెరటాలతో, పైకి ఉబికే అమృతంతో ప్రాకృతభాష నిండి ఉంటుంది. పదాల శబ్దార్ధాలు పరస్పరం పరిపూర్ణతనొంది ఉంటాయి. వింటున్న ఈ భాష అలా లేదు.
కాకపోతే ఇది అపభ్రంశమా? అదీ కాకపోవచ్చు. ఎందుకంటే అపభ్రంశ భాష సెలయేటి గలగలల సౌకుమార్యాన్ని, వరద ప్రవాహపు భీకరత్వాన్ని కలగలుపుకొని ఉంటుంది. సంస్కృత, ప్రాకృత పదాలను ఇముడ్చుకొని ఉండే ప్రియుని కల్లాపంలా ఏకకాలంలో కఠినంగాను, సున్నితంగానూ ఉండగలదు. ఇది అలా లేదు””””””””””
ఉద్యోతనసూరి పై సంఘటన ద్వారా సంస్కృతం, ప్రాకృతం, అపభ్రంశ (సంస్కృత, ప్రాకృతాల మిశ్రమ భాష) భాషలపై తనకున్న అభిప్రాయాలను చెప్పాడు. జాగ్రత్తగా గమనిస్తే సంస్కృతం పట్ల ఉద్యోతనసూరి అసహనం, ప్రాకృతం పట్ల అవ్యాజప్రేమను సులభంగానే పోల్చుకోవచ్చు. ఇక సంస్కృత భాష అనేది దుష్టుల భాషగా ప్రాకృతం మంచివారి భాషగా చెప్పటం కూడా గమనార్హమే.
Rogue Stories (Dhūrtākhyāna) అనే పేరుతో హిందు పురాణగాథలలోని తర్కరాహిత్యాన్ని, అసంబద్దతలను విమర్శిస్తూ వివాదాస్పద వ్యంగ్య రచన చేసిన జైన హరిభద్రసూరి శిష్యుడైన ఉద్యోతనసూరి అభిప్రాయాలు అంతకు భిన్నంగా ఎలా ఉండగలవు?
***
ధ్వన్యాలోక, కావ్యప్రకాశ, కావ్యాలంకార, అలంకార రత్నాకర, రసగంగాథర లాంటి అలంకారగ్రంథాలలో; కాళిదాసు, దండి, భవభూతి లాంటి ప్రముఖ సంస్కృత కవుల రచనలలో వేలాది ప్రాకృత గాథలను నేడు గుర్తించగలుగుతున్నారు. (Ref: Prakrit verses in Sanskrit works on Poetics by V.M. Kulkarni). ప్రాకృతంలోని అందమైన సాహిత్యాన్ని కొందరు రసజ్ఞులు రాజకీయాలు పక్కనపెట్టి సంస్కృతంలోకి తెచ్చి ఉంటారు బహుసా.
.
బొల్లోజు బాబా

Friday, September 3, 2021

ప్రాకృత గాథలు –గౌడవహో, వాక్పతిరాజు - 1

 ప్రాకృత గాథలు –గౌడవహో,  వాక్పతిరాజు

.

గౌడవహో (గౌడవధ) ప్రాకృత కావ్యాన్ని వాక్పతిరాజు అనే కవి రచించాడు. వాక్పతిరాజు  కన్యాకుబ్జ రాజైన  యశోవర్మ ఆస్థాన కవి. యశోవర్మ గౌడరాజును జయించి అతని  శిరస్సును ఖండించటం  గౌడవహో (గౌడవధ)  ఇతివృత్తం.   ఇది మహరాష్ట్రీ ప్రాకృతంలో రచింపబడిన 1209 గాథల కావ్యం.  ప్రతీగాథా  స్వతంత్రమైనది.  దేనికదే రసాస్వాదన కలిగిస్తుంది. 

గౌడవహో,   ప్రవరసేనుడు రచించిన రావణవహో (సేతుబంధ) కావ్యాలు ప్రాకృత కావ్యాలలో  ఆణిముత్యాలుగా పేరు తెచ్చుకొన్నాయి. కాళిదాసు ఉపమకు ఎలాగైతే ప్రఖ్యాతో  వాక్పతిరాజు ఉత్ప్రేక్షకు ప్రసిద్ధి అంటారు. 

*** 

ఏడవ శతాబ్దంలో హర్షుడు కన్యాకుబ్జాన్ని కేంద్రంగా చేసుకొని మధ్య ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాడు. చైనా యాత్రికుడు హుయాన్సాంత్ ఈ పట్టణాన్ని వర్ణిస్తూ “ఇక్కడ హిందు, బౌద్ధమతాలు సమానాదరణ పొందుతూన్నాయి.  రెండువందల దేవాలయాలు ఉన్నాయి.  పట్టణ పొలిమెరలు పటిష్టమైన ప్రాకారాలతో ఉన్నాయి.  ప్రజలు శాంతస్వభావులు. అన్ని కులాలు సంపదలతో తులతూగుతున్నాయి” అన్నాడు.  CE 647 లో హర్షుడు మరణించాక ఈ ప్రాంతంలో ఆధిపత్యపోరు తలెత్తింది.  అనేకమంది చిన్న చిన్న సామంతులు స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసుకొంటూ రాజకీయ అస్థిరతకు కారణమయ్యారు.  

ఆ తరువాత  యశోవర్మ  అనే రాజు (CE 725-752)   కన్యాకుబ్జాన్ని కేంద్రంగా చేసుకొని కొంతకాలం ఉత్తరభారతదేశాన్ని పాలించాడు. 

***

గౌడవహో కావ్యవృత్తాంతం

యశోవర్మ చేసిన జైత్రయాత్రలు, అతని పరాక్రమం గురించిన వర్ణనలతో కూడిన ప్రశస్థి కావ్యం గౌడవహో.   యశోవర్మ  తన  సామ్రాజ్య విస్తరణ కొరకు చేసిన విజయయాత్రలో మొదటగా  వింధ్యపర్వతంపై కొలువున్న శక్తిస్వరూపిణి అయిన శాంకరీదేవిని అర్చించి మగధదేశాన్ని చేరుకొని మగధ రాజుని జయించాడు.  తరువాత గౌడరాజుపై యుద్ధం చేసి అతడిని వధించాడు.  ఆ పిమ్మట  దక్షిణదిశగా పయనించి కొంకణ, వంగ రాజులని సామంతులుగా చేసుకొని, మార్వార్, హిమాచల రాజ్యాలను కైవసంచేసుకొన్నాడు. అయోధ్య లో  ఒక్కరోజులో గొప్ప దేవాలయాన్ని నిర్మించి ప్రజల మన్ననలు పొందాడు.   

గౌదావహాలో వర్ణించిన యశోవర్మ, అతని దిగ్విజయాలు కాల్పనికమైనవనే వాదన ఉన్నప్పటికీ - నలందలో దొరికిన ఒక శాసనము, యశోవర్మ  నాణాలు, అయోధ్యలో  నిర్మించిన ఆలయము, ఇతర ఇతర జైన రచనల ద్వారా యశోవర్మ చారిత్రిక వ్యక్తి అని చరిత్రకారులు నిర్ధారించారు. 

వాక్పతి రాజు

వాక్పతిరాజు యశోవర్మ ఆస్థాన కవి. ఇతనికి కవిరాజు అనే బిరుదు కలదు. వాక్పతి రాజు గురించి జైన సాహిత్యంలో ఆసక్తికరమైన కథనమొకటి  ఇలా ఉంది.

వాక్పతిరాజు పరమర రాజ కటుంబానికి చెందిన కవి. ఇతను  ధర్మ అనే మరోరాజుకు సన్నిహితంగా ఉండేవాడు.  కొన్నాళ్ళకు యశోవర్మ ఈ ధర్మ రాజును జయించి అతని రాజ్యాన్ని కైవశం చేసుకొన్నప్పుడు, ఈ వాక్పతిరాజును కారాగారంలో వేయించాడు. బంధిఖానాలో ఉన్న వాక్పతిరాజు యశోవర్మ దిగ్విజయగాథను గౌడావహో కావ్యంగా రచించి అతనికి కానుకగా ఇచ్చాడు. ఆ కావ్యం యొక్క గొప్పతనాన్ని గ్రహించిన  యశోవర్మ వాక్పతిరాజును కారాగారం నుంచి విడుదల చేసి తన ఆస్థానకవిగా నియమించుకొన్నాడు. అలా బంధవిముక్తుడైన వాక్పతిరాజు సన్యాసిగా మారి మధుర లోని వరాహస్వామి ఆలయంలో ఆథ్యాత్మిక జీవనం  సాగించసాగాడు.  జీవిత చరమాంకంలో వాక్పతిరాజు తన మిత్రుడైన బప్పభట్టి ప్రోద్భలంతో శ్వేతాంబర జైనాన్ని స్వీకరించి జినశ్రీగా మారి, అనాశన (నిరాహార) ప్రక్రియద్వారా మోక్షం పొందినట్లు బప్పభట్టి సూరి చరిత అనే జైన గ్రంధం ద్వారా తెలుస్తున్నది. 

గౌడావహో కావ్యం CE 727-731 మధ్య వ్రాయబడి ఉండొచ్చునని ప్రముఖ చరిత్రకారుడు ఎమ్. ఎమ్. మిరాశి అభిప్రాయపడ్డాడు. 

గౌడావహో చారిత్రిక కావ్యం. దీనిలో సాహిత్యసంగతులతో పాటు ఆనాటి విలువైన చారిత్రిక అంశాలు కూడా అనేకం కనిపిస్తాయి.

***

గౌడవహో లో కొన్ని గాథలు

గౌడావహో కాలానికి ప్రధానంగా బౌద్ధం, జైనం, హిందూమతం ఉనికిలో ఉన్నాయి.  ఈ మూడు మత విశ్వాసాలను ఆచరించే ప్రజలు సహిష్ణుతతో సామరస్యంతో,  ఏ రకమైన వైషమన్యాలు లేక సహజీవనం సాగించేవారు. హిందువులు శైవ, వైష్ణవ, సూర్య ఆరాధనలు, బౌద్ధ, జైన మతావలంబకులు వారి వారి థీర్థంకరులను కొలిచేవారు.  

.

యజ్ఞగుండం నుంచి పైకి లేచిన

లతలవంటి మెలికలు తిరిగిన నల్లని పొగ

స్వర్గలోకంలోని ఇంద్రుని ఐరావతం చెక్కిళ్ళనుండి 

క్రిందికి స్రవించే నల్లని మద జల చారిక వలె ఉన్నది. (1093)

పై గాథ ద్వారా వైదిక సాంప్రదాయం ప్రకారం ఇంద్రుడు, వరుణుడు వంటి దేవతలను ప్రసన్నం చేసుకొనేందుకు యజ్ఞయాగాదుల వంటి జరిగేవని అర్ధం చేసుకొనవచ్చును. భూమిపైన పైకి లేచిన పొగను,  పైనుంచి క్రిందకి కారే స్వర్గలోకపు మత్తగజపు నల్లని మదనజలచారిక లా ఉంది అనటం చక్కని ఊహ. 

పై మూడువిశ్వాసాలకు చెందినవారే కాక వింధ్యపర్వతాలలో శక్తి ఆరాధకులు ఉండేవారు.  వీరు వింధ్యవాసిని ఆలయంలో పర్వదినాలలో జరిగే మహా పశు బలి ని (మానవ బలి) చూడటానికి శక్తిని ఆరాధించే యువతులు ఒకరిభుజాలపై పై ఒకరు ఎక్కి ఉత్సాహపడుతున్నారు” అనే వర్ణన 319 వ గాథలో ఉన్నది. 

***

ఇష్టదైవాన్ని, పూర్వకవులను స్తుతించటం కావ్యలక్షణాలు.  మొదటి అరవై గాథలలో ఇష్టదేవతా స్తుతి ఉంటుంది.  (సారూప్యం కలిగిన గాథలను కులక అంటారు).   ఆ తరువాత ముప్పై ఆరు గాథలలో కవులగురించి, వారి సాధకబాధకాల గురించి ప్రాకృతభాషను పండితులు ఏ విధంగా చులకనగా చూసేవారో  చెప్పాడు వాక్పతిరాజు.  

కవి సంపూర్ణ ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలని లేనట్లయితే నవ్వులపాలు కావల్సి వస్తుందని ఒక చక్కని పోలికతో  హెచ్చరించటం 68 లో కనిపిస్తుంది. 93, 95 గాథలలో  సంస్కృత పండితుల అలక్ష్యాన్ని ఎత్తిచూపుతూనే ప్రాకృతభాష లోని సొబగులను గొప్ప ఆత్మవిశ్వాసంతో ప్రకటించటం గమనించవచ్చు. 

.

లక్ష్మి కటాక్షం లవలేశమంత  చాలు 

గౌరవానందాలు పొంద టానికి

సరస్వతీ కటాక్షంలో కించిత్ లోటున్నా

నవ్వుల పాలు కావల్సిందే (68)

.

ప్రాకృతభాషలోని అద్భుతసౌందర్యాన్ని  తృణీకరించే వారి పట్ల 

మేము జాలిపడతాం, నవ్వుకొంటాం  తప్ప బాధపడం;  

గొప్పకవిత్వాన్ని  విస్మరిస్తున్నందుకు 

మేమెందుకు దుఃఖపడాలి? (95)

.

పూర్వకవులు  అన్నీ రాసేసారు, ఇంక

ఆధునిక కవికి వస్తువు ఎక్కడుందీ- అంటారు కానీ

పాత కొత్తల సరిహద్దులు చెరిపేసి, ఊహాశాలితను పెంచుకొంటే 

ప్రతి వస్తువూ కొత్తగా కనిపించదూ! (85)


అన్ని భాషలూ 

ప్రాకృతంలోకలిసి దానిలోంచే ఉదయిస్తాయి

నీరు సముద్రంలో కలిసి 

మరలా దానినుంచే  బయటకు ప్రవహించినట్లు (93)

***

అనువాదం, వ్యాఖ్యానం

బొల్లోజు బాబా

Source: Gaudavaho by Vakpatiraja, Edited by Prof NG Suru