Friday, July 16, 2021

అమరు శతకం - 1

 అమరు శతకం - 1

.
అమరు శతకం సంస్కృత వాజ్ఞ్మయంలో ప్రముఖమైనది. దీనిని ఆదిశంకరాచార్యుడు రచించాడని ప్రతీతి.
పదమూడవ శతాబ్దంలో రుద్రమదేవకుమారుడు అమరుశతకానికి టీక వ్రాసాడు. ఇతను కాకతి ప్రతాపరుద్రుడు అని ఒక అభిప్రాయం కలదు.
పద్నాలుగవ శతాబ్దంలో పెదకోమటి వేమారెడ్డి అమరుశతకంపై శృంగార దీపిక పేరుతో చేసిన వ్యాఖ్యానం నేటికీ ప్రామాణికమే.
ఈ పద్యాలు సప్తశతి గాథలవలె రమ్యమైన చిన్న చిన్న సంఘటనలు, సంభాషణలు. ఆనాటి మానవ స్వభావాన్ని, సామాజిక స్వరూపాన్ని, ఒక మంత్రముగ్ధ లోకాన్ని ఇవి ఇముడ్చుకొన్న విధానం అబ్బురపరుస్తుంది.
అమరుశతకం CE 750 నాటిది అని సమకాలీన రచనల ఆధారంగా పండితులు నిర్ధారించారు. ఆనందవర్ధనుని కాలం నుంచీ అమరుశతకకారుడు అమరు, అమరుక, అమరక వంటి పేర్లతో ఒక్కడుగానే చెప్పారు. అమరశతకం గాథాసప్తశతి లాగే భిన్న కవులు రచించిన పద్యాల సంకలనం అని D.D. Kosambi అభిప్రాయపడ్డారు.
ఈ పద్యాలలో వియోగం, అసూయ, వంచన, భోగలాలస, అమలిన ప్రేమ వంటి భావనలు ప్రధాన ఇతివృత్తాలుగా ఉన్నాయి.
ప్రతిపద్యం ఒక పదచిత్రమో, ఒక ఉద్వేగమో, ఒక సంఘటనో కావొచ్చు.
ఆనంద వర్ధనుడు ధ్వన్యాలోకంలో “వేల కావ్యాలెందుకు, అమరు ని ఒక్క వాక్యం చాలు … ప్రేమ రుచి తెలియటానికి” అంటూ చేసిన ప్రసంశ ద్వారా అమరశతకానికి మన ప్రాచీనులు ఎంతటి స్థానం ఇచ్చారో అర్ధంచేసుకొనవచ్చును.
(అమరుశతకంలో నచ్చిన కొన్ని పద్యాలకు నే చేసిన అనువాదాలు ఇవి)
1.
లేతపెదవుల్ని మునిపంటితో నొక్కిపెట్టి
ద్రాక్షలతల్లాంటి కనుబొమల్ని ముడివేసి
“ ఏయ్ దగ్గరకొచ్చావో జాగ్రత్త” అంటూ
తర్జని ఆడిస్తూ కీచుగొంతుకతో హెచ్చరించే
కోడెవయసు చిన్నదాని నుండి
దొంగిలించిన ముద్దే అమృతం
సాగరాన్ని మధించిన దేవతలు ఉత్త వెర్రివాళ్ళు (04)
.
2.
రాత్రివేళ ఆలుమగలు
మాట్లాడుకొన్న మాటల్ని విన్న రామచిలుక
ఉదయాన్నే అందరిఎదుటా వాటిని వల్లెవేస్తుంటే
సిగ్గుతో బెదిరిపోయిన కొత్తకోడలు
చిలుకనోరు మూయించటానికి
చెవిపోగులోని కెంపును తొలగించి
"దానిమ్మగింజ ఇదిగో తిను" అని అందిస్తోంది
ఏంచేయాలో తెలీక. (12)
.
3.
ఒక గంటలో తిరిగి వస్తారా
మధ్యాహ్నానికి
పోనీ ఆ తరువాతా
ఈ రోజే ఏదో ఓ సమయానికి … లాంటి మాటలతో
నీరునిండిన కళ్ళతో ఆ కొత్తపెళ్ళికూతురు
భర్త చేయాల్సిన వందరోజుల దూరదేశ ప్రయాణాన్ని
కొద్దిసేపు ఆపగలిగింది. (13)
.
4.
తన ఇద్దరు ప్రియురాళ్ళు ఒకే చోట కూర్చోవటం గమనించిన టక్కరి చెలికాడు, మెల్లగా వారి వెనుక చేరి, ఒకరి కనులను చేతులతో మూసి, మరొకరి చెక్కిలిని చుంబించాడు. తీవ్రమైన మోహతరంగమేదో రహస్యదరహాసంలా ఆమె చెక్కిలిని తాకింది (18)
.
బొల్లోజు బాబా
Source: Erotic Love Poems from India (2019) - Andrew Schelling

No comments:

Post a Comment