అమరు శతకం – 2
.
అమరు శతకం సంస్కృత వాజ్ఞ్మయంలో ప్రముఖమైనది. ఇది CE 750 నాటి రచన. ఈ పద్యాలు సప్తశతి గాథలవలె రమ్యమైన చిన్న చిన్న సంఘటనలు, సంభాషణలు.
ఇవి ఆనాటి మానవ స్వభావాన్ని, సామాజిక స్వరూపాన్ని, ఒక మంత్రముగ్ధ లోకాన్ని ఇముడ్చుకొన్న విధానం అబ్బురపరుస్తుంది.
ఆనంద వర్ధనుడు ధ్వన్యాలోకంలో “వేల కావ్యాలెందుకు, అమరు ని ఒక్క వాక్యం చాలు … ప్రేమ రుచి తెలియటానికి” అంటూ చేసిన ప్రసంశ ద్వారా అమరశతకానికి మన ప్రాచీనులు ఎంతటి స్థానం ఇచ్చారో అర్ధంచేసుకొనవచ్చును.
(అమరుశతకంలో నచ్చిన కొన్ని పద్యాలకు నే చేసిన అనువాదాలు ఇవి)
@@@
.
మంచానికి చెరోవైపుకు
తిరిగి పడుకొన్నారు
విరహపు వేదనని
నిశ్శబ్దంగా ఓర్చుకొంటున్నారు
లోలోపల రాజీచేసుకోవాలనే ఉంది ఇద్దరికీ కానీ
ఎక్కడ చులకనౌతామేమోనని సంకోచిస్తున్నారు
కడకంటి దొంగచూపులు కలుసుకొన్నాయి
అప్రయత్నంగా పెదాలపై నవ్వు మొలచింది
ఒఖ్క గాఢాలింగనంతో
కలహం ముగిసిపోయింది. (21)
***
.
నా ఆభరణాలు నన్ను విడిచిపోయాయి
ప్రియమైన స్నేహితులు ఒక్కొక్కరూ తరలిపోయారు
కన్నీళ్ళు శాశ్వతంగా దూరమైనాయి
తొట్టతొలిగా వెళిపోయింది నా ధైర్యం
ఆ వెనుకే నా హృదయం…
నా ప్రియుడు నన్ను విడిచి వెళిపోతాడన్న వార్త తెలియగానే
ఇవన్నీ నన్ను వదిలి వెళ్ళి పోయాయి.
ఓ నా ప్రాణమా! నీవెందుకు ఆలస్యం చేస్తున్నావు?
నువ్వూ వెళ్ళవచ్చు ఇక! ( 31)
***
.
భర్త దూరదేశాలకు వెళుతుంటే
అతన్ని ప్రయాణం నుంచి విరమింపచేయాలని
తృప్తిచెందని స్త్రీలు ఏడుస్తారు,
కాళ్లపై పడతారు,
మూర్చనలు పోతారు కూడా
చెలికాడా!
నేనలా కాదు. ధైర్యవంతురాలను
నీకు శుభాభినందనలు
అంతా మంగళప్రదమౌగాక.
మన ప్రేమకు ఏది అర్హమో దాన్నే చేస్తాను ఇకపై
నువ్వు వింటావు లే త్వరలో (52)
***
.
నాపై కోపం వస్తే ఇక కోపాన్నే ప్రేమించుకో నన్ను కాదు
కానీ
నేనిచ్చిన ముద్దులన్నీ తిరిగి ఇచ్చేయి
నా కౌగిలింతల్ని
వడ్డితో సహా లెక్కగట్టి చెల్లించు
***
.
సాయం సంధ్యవేళ చీకట్లు ముసుకొంటున్నప్పుడు
ఒక ప్రోషిత పతిక కనుచూపుమేర పరచుకొన్న
ఖాళీ వీధిని చివరిసారిగా చూసి నిట్టూర్చి
ఇంటి లోపలకు భారంగా అడుగిడింది.
ఏమో ఈ క్షణమే అతను రావచ్చును కదా అనుకొని
వెనుతిరిగి మరలా ఖాళీ వీధివైపు చూసింది.
అనువాదం
బొల్లోజు బాబా
Source: Erotic Love Poems from India (2019) - Andrew Schelling
No comments:
Post a Comment